AUCHITHYAM | Volume-04 | Issue-01 | January 2023 | ISSN: 2583-4797
5. వ్యక్తిత్వ వికాసం: వాక్కు
డా. రాపోలు శ్రీనివాస్
తెలుగు సహాయాచార్యులు
తారా ప్రభుత్వ కళాశాల(స్వయం ప్రతిపత్తి),
సంగారెడ్డి, తెలంగాణా రాష్ట్రం
సెల్: +91 9848050694. Email: srinivas.rapolu42@gmail.com
Download PDF
Keywords: వ్యక్తిత్వవికాసం, వాక్కు, శబ్దం, నీతిశాస్త్రం, భారతం, రామాయణం, హనుమంతుడు, రాపోలు, శ్రీనివాస్
ఉపోద్ఘాతం:
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించడం, వ్యష్టి కుటుంబాలు ఏర్పడడం, డబ్బును సంపాదించే యంత్రంగా మనిషి మారిపోవడం, మానవసంబంధాలు అడుగంటిపోవడం, మనిషి స్వార్థం, సంకుచితత్వంతో ప్రవర్తించడంతో వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోవడం అవసరమైంది. ఇది ఆరోగ్యకరమైన పరిణామం. ప్రవర్తన, పనితీరు, మాటతీరు మెరుగుపర్చుకోవడం, సమయపాలనపైన అవగాహన మొదలగునవి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. వ్యక్తిత్వం అంటే వ్యక్తి సమూహం పట్ల ప్రతిస్పందించే తీరు. మన ఆలోచనా సరళిని, భావాలను, నడవడికను అభివ్యక్తం చేసేదే మన వ్యక్తిత్వం. వ్యక్తి యొక్క సమగ్ర స్వభావం లేదా నడవడిక. వ్యక్తిత్వానికి కొలమానాలు లేవు. కులం, మతం, ధనం, హోదాలు వ్యక్తిత్వ వికాసానికి అడ్డురావు. భిక్షగాడు కూడా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగివుండవచ్చు.
వ్యక్తిత్వ వికాసం - వాక్కు:
మాటల చేత దేవతలు మన్ననచేసి వరమ్ములీయరే
మాటల చేత భూపతులు మన్ననచేసి ధనమ్ములీయరే
మాటల చేత కామినులు మన్ననచేసి సుఖమ్ములీయరే
మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్
(చమత్కార పద్యం -6, సాహితీ నందనం, https://sahitinandanam.blogspot.com/2016/04/6.html)
వ్యక్తిత్వ వికాసానికి మంచి వాక్కు దోహదపడుతుంది. మాట మనిషిని జంతుకోటి నుండి వేరుచేస్తుంది. మనిషికి దేవుడిచ్చిన వరం మాట. పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాదులకు, మరేతర ప్రాణికి లేని వరం మాట. మన సారం మన మాటలేనని వేదం చెబుతుంది. కావున మాటలను బంగారంగా భావన చేయాలి.
వాగ్ఘి సర్వస్య కారణం:
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్ర బాంధవా:
జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి: జిహ్వాగ్రే మరణం ద్రువమ్ (నీతి. శా. ప్ర.భా. 55 శ్లో.)
నాలుక అనగా మాట అని అర్థం. మాట్లాడే విధానం తెలియకపోతే ఎదుటివాళ్ళను బాధించినవాళ్ళమే అవుతాము. జీవితంలో ఒక మనిషి ఉత్థానపతనాలకు మాటలే కీలకం అవుతాయి.
చురుకైన నాలుక పదునైన కత్తిలాంటిది. మాటలు గాల్లో కలిసిపోవు. ఎదుటివారి గుండెల్లో బాకులై, శూలాలై గుచ్చుకుంటాయి. స్నేహాలు సెలవంటూ వీడిపోతాయి. రక్త సంబంధాలు తేలిపోతాయి. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి. మూర్ఖుడు మాట్లాడి ఆలోచిస్తాడు. తెలివైనవాడు ఆలోచించి మాట్లాడతాడు. మాట్లాడి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు.
తమ కాళ్ళ మూలంగా పక్షులు వలలో చిక్కుకుంటాయి. మాటల మూలంగా మనుషులు చిక్కుల్లో ఇరుక్కుంటారు. మాట మనిషికి బానిస. నోటి నుండి బయటకు వెలువడనంత వరకు 9. బయటకు వచ్చిన తరువాత మాటకు మనము బానిసగా ఉండాలి.
తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయముల వెడలునె యధిపా! (శ్రీమ.మ.భార.ఉద్యో.ప. ద్వి.ఆశ్వా.62 ప.)
మాటను వెనక్కి తీసుకోలేం. అందుకే భగవంతుడు నాలుకకు రెండు తాళాలు వేశాడు. పెదవులతో బంధించడం, పళ్ళతో కట్టివేయడం. అయినా అది వాటిని ఛేదించుకుని తన పని తాను చేసి మనుషుల్ని హీనులను, అల్పులనుగా చేస్తుంది.
మాట మంగళకరంగా ఉండాలి. మాటలో ఎక్కడా అశ్లీలంగానీ, అమంగళం కానీ దొర్లకూడదని పెద్దలంటారు. అప్రాచ్యపు మాట దొర్లితే మూడుసార్లు నోరు కడుక్కోవాలని బౌద్ధం చెబుతుంది. ఉదయం లేస్తూనే మనిషి దంతధావనంతో నోటిని శుభ్రం చేసుకుంటాడు. నోటి దుర్వాసన పోగొట్టుకోవడం కోసం. ఇది బాహ్య శుభ్రత. మరి అదే నోటితో అసహ్యకరంగా ఇతరులను నిందించి నానా దుర్భాషలాడితే ఏం ప్రయోజనం?
పెదవి దాటితే పృథివి దాటుతుంది. సాధారణంగా జిహ్వకు వృధాగా మాట్లాడే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఆ సందర్భంలోనే అబద్దం చెప్పే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యర్థ సంభాషణ చేయరాదని పెద్దలంటారు. హితంగా, మితంగా మాట్లాడుతూ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. త్రిదండాన్ని అలవర్చుకోవాలి. త్రిదండ మనగా 1. మృదు మధురంగా మాట్లాడడం, 2. వ్యర్థ సంభాషణల్ని త్యజించడం, 3. మన మాటలతో ఇతరుల్ని నొప్పించకపోవడం.
శబ్దశక్తి:
మాటలో భావనా బలమే కాకుండా శబ్దశక్తి ఉంటుంది. ఏ శబ్దాన్ని ఎలా కూర్చితే ఎటువంటి దివ్యశక్తి ఆవిర్భవిస్తుందో గమనించి, ఆ విధంగా అనేక మంత్రాలను ఏర్పరచారు మహర్షులు. అందుకే మాట ఆశీస్సుగాను, శాపంగాను కూడా పరిణమించగలదు. దేవతలను ఆహ్వానించే శక్తి మాటకే ఉంది.
రామాయణంలో వాల్మీకి రాముణ్ణి స్మితభాషి, ప్రియభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషిగా వర్ణించాడు. చిరునవ్వు చిందిస్తూ మాట్లాడేవాడు స్మితభాషి. ఎదుటివారికి ప్రీతిని కలిగిస్తూ మాట్లాడేవాడు ప్రియభాషి. ఎదుటివ్యక్తి కంటే తానే ముందుగా మాట కలిపేవాడు పూర్వభాషి. మాటకు ముందు, మాటతో చిరునవ్వు కలిగివుండేవాడు స్మితపూర్వభాషి. ఈ లక్షణాలవల్ల స్నేహసంపద వృద్ధి అవుతుంది.
హనుమంతుడు వాక్య కోవిదుడు:
హనుమంతుడు వాక్య కోవిదుడు. అతని మాటలు విని శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోతాడు. లక్ష్మణునితో ఇలా అంటాడు. ‘‘ఈ మాటలను బట్టి ఈ వ్యక్తి వేదవేదాంగాలను క్షుణ్ణంగా చదివాడని, ఎన్నో విజ్ఞాన విజ్ఞాన విషయాలను గ్రహించాడని తెలుస్తుంది. ఇతని మాటల్లో ఎక్కడా అపశబ్దంగాని, నాన్చినాన్చి సాగదీయడంగాని లేదు. అలాగని అతిక్లుప్తత, అస్పష్టత లేదు. అనవసరాలు, అప్రస్తుతాలు లేవు. ఇలా మాట్లాడితే శత్రువైన లొంగిపోవాల్సిందే. ఇటువంటివానిని మంత్రిగా, దూతగా పొందిన పాలకుడు భాగ్యవంతుడు’’ అని కొనియాడాడు. అంటే మాటలు విజ్ఞానదాయకంగా, ఉచ్చారణ దోషం లేకుండా, సాగదీయకుండా, అనవసరాలు అప్రస్తుతాలు లేకుండా ఉండాలని భావం.
వాగ్భూషణం భూషణం. దేవుడు వరంగా ఇచ్చిన వాక్కును ‘నగ’లాగా ఉపయోగించాలే తప్ప, ఎదుటివారిలో ‘సెగ’ రేపే విధంగా ప్రయోగించకూడదు. యద్భావం తద్భవతి. మనం మనసులో ఏది కాంక్షిస్తామో అదే మాటల రూపంలో బహిర్గతమౌతుంది. ఎల్లప్పుడు శుభాన్నే కాంక్షిస్తే, మధురమైన వాక్కు మన నుంచి వెలువడుతుంది. దృష్టిని బట్టి సృష్టి.
కొన్ని దైవసంబంధమైన సుగుణాలను అలవర్చుకుంటే వాక్కు మధురంగా రూపాంతరం చెందుతుంది. క్షమను పాటించిన మనిషి స్థితప్రజ్ఞుడుగా మారగలడు. సాత్వికత వలన మనసునందు ఓర్పు, ప్రేమ ఉదయించి వాక్కు మధురమవుతుంది. దైవత్వం అలవర్చుకున్న మనిషి పలుకులు శక్తిమంతంగాను, మధురంగాను ఉండి చిరస్థాయిగా చిలచిపోతాయి. జీసస్, గౌతమబుద్ధ వంటి ప్రవక్తలెందరో దీనికి నిదర్శనం. సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం ద్వారా సద్భావాలు ఏర్పడతాయి. విశ్లేషణాశక్తిని పెంచుకోవడం, కోర్కెలకు కళ్లెం వేయడం ద్వారా మాటలపై నిగ్రహం అలవర్చుకోవచ్చు.
మౌనం అలంకారం:
కొన్ని సమయాల్లో మౌనాన్ని కలిగివుండడం కూడా అలంకారమే. మౌనమంటే మాట్లాడడానికి అవకాశం ఉన్నా మాట్లాడకుండా ఉండడం. దీనికి నిగ్రహం కావాలి. పలుకుది శబ్దభాష అయితే మౌనానిది నిశ్శబ్దభాష అవుతుంది. ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు వింటూ ఏమీ మాట్లాడడం లేదంటే, ఇక నీ మాటలు చాలించు అని భావం. ‘‘No Answer is also an Answer’’.
ఒక వ్యక్తి గురించిగాని, అతడు చేసే పనుల గురించిగాని లేదా వాటి గురించి ఇతరులేమనుకుంటున్నారోనన్న అభిప్రామాన్ని వెల్లడిరచడం మంచిది కాదని అరవింద మహర్షి అంటారు. మాటకు మూలం సంకల్పం. సంకల్పం సూక్ష్మ రూపం. మాట స్థూల రూపం. సంకల్ప స్థాయిలోనే మాటను నియంత్రించుకోవాలి. అందుకే మితంగా, హితంగా మాట్లాడండి. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకొండి.
ఉపయుక్త గ్రంథ సూచి:
- శ్రీమదాంధ్ర మహాభారతము, ప్రచురణ-తిరుమల తిరుపతి దేవస్థానములు, 2013.
- శ్రీమద్రామాయణమ్, ప్రచురణ-తిరుమల తిరుపతి దేవస్థానములు, 2009.
- నీతి శాస్త్రము, మంగు వేంకటరంగనాథరావు, శ్రీవేంకటేశ్వర విద్యాసాగర ముద్రాక్షరశాల, కాకినాడ. 1913.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.