AUCHITHYAM | Volume-04 | Issue-01 | January 2023 | ISSN: 2583-4797
4. ఆదిమ చెంచుల జానపద గేయ సాహిత్యం - కళలు
డా. కప్పెర కృష్ణగోపాల్
M.A., B.Ed., Ph.D.,
అతిథి అధ్యాపకులు, శ్రీ ఉమామహేశ్వరీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కొండనాగుల, బాలమూర్ (మం), నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణా రాష్ట్రం
సెల్: +91 9490899811. Email: kapperakrishnagopal@gmail.com
Download PDF
Keywords: జానపదం, ఆదిమ చెంచు, గేయసాహిత్యం, కళలు, నృత్యం, పాట, కృష్ణగోపాల్
ఉపోద్ఘాతం:
ఆంధ్ర, తెలంగాణలలో చెంచుల జనాభా చాలా తక్కువగా వుంది. అంతరించిపోతున్న జాతిగా పేర్కొనవచ్చు. వారి ఆచార వ్యవహారాలపై, సంస్కృతి సంప్రదాయాలపై నాకు చిన్నప్పటి నుండి ఒక అవగాహన వుంది. ఎందుకంటే నేను కూడా ఏజెన్సీ (అడవి) ప్రాంతమైన నల్లమల మన్ననూర్ ఫారెస్ట్‌లో పుట్టి పెరిగాను. కావున, చెంచుల వారితో నాకు సావాసం ఉంది. అయినప్పపటికీ విషయ సేకరణలో సరికొత్త అంశాలను తెలుసుకోగలిగాను. కాబట్టి పరిశోధనకు నా మనసు ఉవ్విళ్ళూరింది. కష్టమైన, నష్టమైనా, ముందుకు నడవాలని నా మనసు నా కర్తవ్యానికి అంగీకరించింది.
క్షేత్ర పర్యటనలో నేను ఆసక్తికరమైన విషయాలను గమనించాను. నేను చెంచు జాతికి సంబంధించిన గేయాలను, వారి యొక్క కళలను, కథలను సేకరిస్తున్నప్పుడు వారు పూర్తిగా గేయాల్తో కథల్లో లీనమై, పురాణ పురుషుల స్త్రీల కష్టనష్టాలకు స్పందిస్తూ కన్నీరు కార్చడం ఎంతో ఆశ్యర్యాన్ని కలిగించింది. వారి కష్టాలను బాధల్ని తమవిగా ఊహించుకుంటూ చెంచులవారు బాధపడటం వెనుక వారి వారి సున్నితమైన మనస్తత్వం నాకు బోధపడింది.
చెంచులక్ష్మి, చౌరమ్మ (పార్వతీ దేవి), రాముడు, హనుమంతుడు, లక్ష్మీనరసింహస్వామి మొదలైన దేవతలు, వీరి గేయ సాహిత్యాల్లో ఎక్కువగా కనిపిస్తారు. వీరి భక్తి అనన్య సామాన్యమైనది. దేవతల కష్టాలకు వీరు బాధపడటం వీరి గొప్ప భక్తికి తార్కాణం.
గిరిజన జాతిలోని ఒక తెగ అయిన చెంచుల సాహిత్యం గురించి ఎవరూ పరిశోధన చేయలేదు. కనుక వీరితో మమేకమై వారి అంతరంగిక ఆదిమ చెంచుల గేయ సాహిత్యంపై పరిశోధన చేశాను. వీరి ద్వారా మౌఖికంగా విషయసేకరణ చేసి వ్రాసిన పరిశోధన వ్యాసం ఇది.
చెంచుల వినోదాలలో ముఖ్యమైన శ్రవణానందాన్ని కలుగచేసేది, వారిని మార్గదర్శకులుగా ముందుకు నడిపేది, విశేషణకారి, విషయసూచి, విజ్ఞాన నిధి, చెంచుల అభివృద్ధికారి రేడియో, టేపురికార్డ్‌ర్ మరియు, సెల్‌ఫోన్‌లు వీరి వినోద పరికరాలుగా వాడుతున్నారు. వీరు మద్యాన్ని స్వీకరించిన సమయాలలో పై వినోద పరికరాలను ఎక్కువగా వాడతారు.
చెంచుల నృత్యాలకు వాడే వాద్యాలు వీరు తయారు చేసుకొన్నవే ఉంటాయి. (1) చెంచుల తప్పెట, (2) చెంచుల డప్పు, (3) చెంచుల మద్దెల, (4) చెంచుల తబల, (5) చెంచుల గజ్జెలు, (6) చెంచుల నాగస్వరం (నాగబుర్ర), (7) చెంచుల ఢమరుకం మొదలైనవి. ఈ వాద్యాలు చెంచులు స్వయంగా తయారుచేసినవే. వీటి ద్వారా అనేక రకాలైన నృత్యాలను వీరు ఆడతారు.
చెంచుల నృత్యాలు:
నలమల్ల ప్రాంతంలోని చెంచులు తమ ఇష్టదైవమైన శివయ్యను సమస్కరించి నృత్యం ప్రారంభిస్తారు. నలమల్ల అడవి ప్రాంతములోని చెంచులు తమదైన శైలిలో నృత్యం చేస్తారు. నృత్యాలతో సంతోషంగా గడుపుతారు. నృత్యంలో జాతి అంతా పాల్గొంటుంది. ఆ భాగస్వామ్యం జాతి పటిష్టతకు ఎంతో ముఖ్యం. చెంచుల నృత్యంలో సారళ్యత ఉంటుంది. స్త్రీ, పురుషులిరువురు కలిసి నృత్యం చేస్తారు.
వీరి యొక్క నృత్యాలు, జననము, వివాహము వంటి వేడుకలు, పండుగ సమయాల్లో నృత్యం
ఉండి తీరాలి.
సామూహిక నృత్యాలు:
చెంచుల నృత్యాల్లో అత్యంత ప్రధానమైనది సామూహిక (సాముదాయిక) నృత్యాలు. అతి సాధారణంగా వేసే అడుగులు కూడా అందరు కలిసి చేసేటప్పుడు అందంగా ఉంటాయి. చెంచుల నృత్యాల్లో మనకు స్పష్టంగా తారసపడేవి వలయాకార, అర్ధవలయాకార, సరళరేఖలో ఉండే నృత్యాలు ‘ఎస్’ ఆకారంలో ఏర్పడే విధానం. సమాంత రేఖలు, ఒక మూల నుండి ఇంకో మూల దాకా వ్యాపించిన నృత్యాలు ‘యు’, ‘వి’ ఆకారాల్లో ఉన్న నృత్యాలు ఇవన్నీ కూడ వలయాకారంతో ప్రారంభమై ఇతర రూపాలు ఏర్పడతాయి. నృత్యం చేసేవారికి సహజసిద్ధమైన దృక్పదం, ఇష్టాన్ని బట్టి ఈ రూపాలు ఉంటాయి. విద్యార్థి దశలో ఉన్న చెంచులు సినిమా గేయాలకు గుంపులుగాను, మరియు ఒక్కరే నృత్యం చేస్తారు, మద్యం సేవించినప్పుడు గుంపులుగా విచ్చలవిడిగా కూడా సినిగేయాలకు తప్పెట, డప్పు శబ్దాలకు సహితం నృత్యంలో మునిగిపోతారు. అడవి జంతువుల వేషధారణలో అడవి జంతువు ప్రవర్తించిన విధంగా నటన చేస్తూ ఒకే వ్యక్తి లేదా ఇరువురు కలిసి కూడా నృత్యం చేస్తారు.
1) వలయాకారంలో అందరు వరుసగా నిల్చుంటారు. తప్పెట లేదా డప్పు శబ్దం ప్రారంభం కాగానే నృత్యం ప్రారంభం అవుతుంది. డప్పు శబ్డాన్ని అనుసరిస్తూ నృత్యభంగిమలు మారుస్తారు. ఈ నృత్యాలలో పాటలు ఏమి ఉండవు. కేవలం డప్పు శబ్దం మాత్రమే ఉంటుంది.
వలయాకారంలో డప్పు శబ్దానికి ఎడమకాలు ముందుకు వేసి ఎడమచేతిని ఎదకు తగిలిస్తూ వంకరగా వంగుతూ లేస్తూ నృత్యం చేస్తారు. అదే ప్రకారంగా కుడికాలు ముందుకు వేసి కుడిచేతిని ఎదకు తగిలిస్తూ వంకరగా వంగుతూ లేస్తూ నృత్యం చేస్తారు.
2) వలయాకారంలో అందరు వరుసగా నిల్చుంటారు. డప్పు లేదా తప్పెట శబ్దానికి స్త్రీలు లేదా పురుషులు కుడికాలు ముందుకు వేస్తు శరీరాన్ని కుడి నుండి ఎడమకు తిప్పుతూ రెండు చేతులను పైకి చేస్తూ నృత్యం చేస్తారు.
3) చెంచు స్త్రీలు అందరు ఒకే రకమైన చీరలను ధరించి వృత్తాకారంలో నిల్చుని డప్పు శబ్దానికి ఎడమకాలును ముందుకుచేసి నడుమును క్రిందికి వంపి ‘యు’ ఆకారం లేదా ‘వి’ ఆకారంగా కనిపించే విధంగా ఎడమ, కుడిచేతులతో చప్పట్లు చరుస్తూ అందరుపైకి లేస్తూ తిరిగి కుడికాలును ముందుకు వంచి వంగి చప్పట్లు చరుస్తూ లేస్తారు.
4) పండుగలప్పుడు స్త్రీలు పెద్ద వలయాకారంగా ఏర్పడుతారు. శరీరం లోపలివైపుకు తిప్పి ఉంటుంది. వాళ్ళ ఏతుల్లో తంగెేడి పూతకాని, గలగల శబ్దంచేసి గజ్జెలు కాని ఉంటాయి. ఒక్కసారిగా అందరు వంగి చేతిలో ఉన్న గజ్జెలను లేదా తంగేడుపూతను భూమి కేంద్ర స్థానానికి వేసి లేస్తారు. తిరిగి కొంత కుడి పక్కకు అందరు జరిగి వంగి భూమిపై వేసిన గజ్జెలను లేదా తంగేడు పూతను తమ కుడి, ఎడమచేతుల్లోకి తీసుకొని అదే ప్రకారంగా పునఃరాగమనం చేస్తూ వృత్తాకారంగా తిరుగుతూ నృత్యం చేస్తారు.
5) చెంచు మహిళలు ఎడమకాలు ఒక అడుగు ముందుకు వేస్తూ నడుమును ఒక వైపు వంపి ఎడమచేయిని తల నుదురుకు తగిలిస్తూ, కుడికాలును రెండు అడుగులు పక్కకు, కదిలిస్తూ వృత్తాకారంలో నృత్యం చేస్తూ వుంటే, వారి మధ్యలో అంటులు (బాణాలు), విల్లు పట్టుకున్న చెంచు వ్యక్తి పైకి రెండు చేతులు ఎత్తి ఏదో జంతువును వేటాడుతున్నట్లుగా నటన చేస్తూ ఒక మారు ఎడమకాలును ఒక మారు కుడికాలును పైకి ఎత్తుతూ నృత్యం చేస్తూ ఉంటే చూపరులకు వారి యొక్క నృత్యం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.
6) చెంచు మహిళలు సరళరేఖ ఆకారంలో నిలబడి ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకొని డప్పు శబ్దానికి ఎడమకాలు ముందుకు వేస్తూ కుడికాలు మడతపైకి ముడుస్తూ వంగిలేస్తూ కుడివైపుకు జరుగుతూ నృత్యం చేస్తారు.
7) చెంచు యువకులు పులివేషాలు వేసుకొని ఇతర జంతువుల మాదిరిగా వేషాలు వేసుకొని నటన చేస్తూ అడుగులో అడుగులు వేస్తూ తప్పెట దరువులో లేదా డప్పు శబ్దానికి నృత్యం చేస్తారు.
8) చెంచులు పండుగలప్పుడు మద్యం (సారాయి) సేవించి డప్పు శబ్దంలో ఆడ, మగ ఇరువురు శరీరము పటుత్వము కోల్పోయి, ఊగుతూ విచ్చలవిడిగా నృత్యం చేస్తారు. వీరు టేప్‌రికార్డర్, మరియు సెల్‌ఫోన్‌లలో సినిమా పాటలు పెట్టుకొని నృత్యం చేస్తారు. వీరి చేతిలో వినోద పరికరాలు నాలుగురోజుల ముచ్చటగా మిగులుతుంది.
చెంచుల పాటలు:
మనస్సుకు, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపేదే పాట, ఈ పాట వారికి జరిగిన వివిధ సంఘటనల నుండి పాట పుట్టిందని చెబుతారు. చెంచులు పాటలను చాలా తక్కువమంది పాడతారు. వీరిలో అక్షరజ్ఞానం ఉన్నవారు పాడతారు. మరికొందరు జానపదబాణీలో పాటలు పాడతారు.
బతుకమ్మ పాటలు, కోలాటపాటలు, గుంపుగా పదిమంది కూడి డప్పుల దరువులో కేరింత కొడుతూ నృత్యం చేస్తూ పాటలు పాడతారు. వీరు పులివేషములో (మోనో నటన) మౌన నటన కళను కూడా ప్రదర్శిస్తారు.
వీరు పాటలను చాలా మక్కువగా వింటారు. వీరికి ప్రధాన వస్తువు, రేడియో, రేడియోలో వచ్చేటటువంటి పాటలను వింటారు. ఆ పాటలకు తగ్గట్టు నృత్యం చేస్తారు. సినిమా పాటలు వీరిని ఆకర్షిస్తాయి. వీరికి సినిమాపాటలు అంటే చాలా ఇష్టముగా వింటారు, నృత్యం చేస్తారు. వీరి నృత్యం చూసేటటువంటి వారిని అబ్బురపరుస్తుంది. ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇప్పపూల సారాయి తాగిన మైకంలో కూడా ఎచటనైనా ఉత్సవాలు, పెళ్ళిళ్ళ పాటలు వింటే నృత్యం చేస్తారు. పాటలు పాడతారు. పాటలలో, ఆటలలో స్త్రీ, పురుషులు ఇద్దరు పాల్గొంటారు.
పాట దేవుడు ఇచ్చిన వరం, కమ్మని గొంతులో నుంచి జాలువారే జలపాతం, కొందరికే సుసాధ్యం, అందరికీ ఆమోదం పాట, ఎండిన వృక్షం చిగురింపచేసేది, నిర్జీవమైన రాయిని సజీవం చేసేది, ప్రకృతిని పరవశింపజేసేది, మనిషి గమనానికి గమకం నేర్పేది, రాయలసీమలో జానపదం నేర్పింది, ఆంధ్రలో ఆంధ్రమ్ము నేర్పింది, తెలంగాణములో విప్లవగానమై మెరిసింది. ఒక్క పాట ఒక్కటే పాట పదనిసలతో ప్రపంచాన్నే ఏలుతున్నది.
జానపదగేయం:
జమ్ములో జమ్మల మడుగు జుమ్ములు
జాము రాతిరికాడ నీవు వస్తనంటివి జమ్ములు
జాజిపూలు నువ్వే తెమ్మంటివి జమ్ములు
జామురాతిరి గడిచిపాయే జాజిపూలు వాడిపోయే
నాకు దిగులు పుట్టిపోయే ॥ జమ్ములో జమ్మల ॥
చెఱుకు తోటకాడికి రమ్మంటివి జమ్ములు
చెండు మల్లెపూలు తెమ్మంటివి జమ్ములు
చెఱుకు తోట సర్రుమంటె వినీ వినీ చెవుడు పట్టి పోయెనే ॥ జమ్ములో జమ్మల ॥
మల్లెపూల పందిరిలో మంచమేయమంటివి
పట్టెమంచముపైన నాకు పడకనిస్తనంటివి
ఎదురుచూసి ఎదురుచూసి నేను ఎకలక్స్ మందు తాగినాను ॥ జమ్ములో జమ్మల ॥
నా వాళ్ళు నా బంధువులు మంచానికి సన్ను బిర్రుగ
కట్టి కాటిలోకి తీసుకెల్లి గోయివాళ్ళు తీసినారు
గోతిలోన వేసినారు, పూర్చి వాళ్ళు వెళ్ళినారు ॥ జమ్ములో జమ్మల ॥
గోతిలోనె ఉన్నగాని కోరిక నాకు పోలేదు
పిశాచినై నీ చుట్టు నేను తిరుగుతున్నాను
పీడిచ్చి పీడిచ్చి నిన్ను తీసుకెల్లుతాను ॥ జమ్ములో జమ్మల ॥
సందర్భం:
జమ్ములు అనే చెంచు తన మరదలికి అచ్చటికి, ఇచ్చటికి వస్తానని నమ్మపలికి మాట తప్పిన సందర్భంలోనిది ఈ గేయం.
వివరణ:
బావ కోసం మరదలు పడే ఆవేదన ఈ గేయంలో కనిపిస్తుంది. తన బావ అయిన జమ్ములు జామురాతిరికాడ వస్తానని తలలో జాజిపూలు ధరించి చక్కగా ముస్తాబై ఉండమని చెప్పి వెళ్ళాడు. జాజిపూలు వాడిపోయాయి. నీవు రాక నాకు దిగులు పుట్టె, ఓ బావా ! చెఱుకు తోటకు రమ్మంటివి, చెండు మల్లెలు తెమ్మంటివి, చెఱుకు తోట సర్రుమని శబ్ధం వస్తే నీవే వచ్చావని భ్రమపడితిని. మల్లెపూల పందిరిలో మంచమేయమంటివి, పట్టెమంచం మీద నాకు పడకనిస్తానని రాకపోతివి, నేను కనులు కాయలు కాసేల ఎదురుచూసి, ఎదురుచూసి పంటచేలకు వేసే ఎకలక్స్ మందు త్రాగి మరణిస్తిని. నా బంధువులు, నా వాళ్ళు మంచానికి కట్టి స్మశానానికి తీసుకెల్లి గోయితీసి గోతిలో పూర్చారు. గోతిలో నేను ఉన్నగాని నా కోరిక తీరనందుకు, పిశాచినై నేను నీ చుట్టు తిరిగి నిన్ను పీడిచ్చి పీడిచ్చి స్మశానానికి నిన్ను కూడా తీసుకవెళ్తాను అని తన బావ జమ్ములు గురించి మరదలు తన మనోవేదనను వివరించింది.
మాట ఇచ్చి మోసం చేసిన తన బావను చివరకు చనిపోయి పిశాచమై పీడిచ్చి, పీడిచ్చి తన మీద పగతీర్చుకుంటుంది. కావునా ! ఇతరులు ఎవరి మరదళ్ళనైన మాట ఇచ్చి, మోసం చేయకూడదు అనే భావన మనకు కలుగుతుంది.
ఈ గేయం చెంచు స్త్రీలు పాడుకునే పాటలలో ఒకటిగా చెప్పవచ్చును.
రావే ఓ చందమామ:
చుక్కా పొద్దు లేచిపోదాం - 2
చక్కాని అడవిలో తిరిగివద్దాం - 2
రావే ఓ చందమామ - 2
రావే చందమామ - 2
కొండాకోన తిప్పుకొస్తా - 2
కొండ మామిడి పండుకొసి ఇస్తా - 2
రావే ఓ చందమామ - 2
రావే చందమామ - 2
కొండమామిడి పండు కోసి ఇస్తే
సంధ్యకాడ రమ్మన్న చోటికి వస్తను మామ
మామా ఓ చందమామ - 2
మామా ఓ చందమామ - 2
రావే ఓ చందమామ - 2
ఎక్కారాని ఆ చెట్టు ఎక్కి - 2
నివ్వు ఎంచుకున్న ఎలగపండు తెంపి ఇస్తా
రావే ఓ చందమామ - 2
ఎంచుకున్న ఎలగపండు తెంచి ఇస్తే
ఎక్కడికైనా నీ వెంట వస్తను మామ
మామ ఓ చందమామ
రావే ఓ చందమామ - 2
రావే ఓ చందమామ - 2
ఆ చెట్టు పుట్ట తిప్పుకొస్తా
ఆహ జుంటు తేనె నీకు తెచ్చి పెడతా
రావే ఓ చందమామ - 2
రావే ఓ చందమామ - 2
జుంటు తేనె నువ్వు నాకు తెచ్చిపెడితే - 2
నువు చెప్పినట్లు నేను వింటా మామ
రావే ఓ చందమామ - 2
మామా ఓ చందమామ - 2
తుమ్మల్ బైలు కాడ కొట్టం వేసి - 2
ఆ కొట్టంలో కాపురం చేద్దాం పిల్ల - 2
రావే ఓ చందమామ - 2
రావే నా చందమామ - 2
మామా ఓ చందమామ - 2
రావే ఓ చందమామ – 2
సందర్భం:
మామ కోడలైన ఇరువురు అడవి తల్లిని నమ్ముకొని వనరుల కోసం అడవికి వెళ్ళే సందర్భంలో సరసపు మాటల గేయం ఇది.
వివరణ:
రావే ఓ కోడలా ! చందమామ రూపం కలదానా ! తెల్లవారు జాముననే చక్కని అడవిలో తిరిగి వత్తాము. కొండకోనల్లో ఉన్న కొండమామిడి పండ్లను నీకు కోసి ఇస్తాను. ఎక్కరాని చెట్టు ఎలాగైనా ఎక్కి నీకు వెలగపండు కోసి ఇస్తాను. వెలగపండుతోపాటుగా జుంటుతేనె తెచ్చిపెడతాను అని తన మామ పలుకగా, మామతో మరదలు కొండమామిడి పండు, నేను ఎంచుకున్న వెలగపండు నేను కోరుకున్న, జుంటు తేనే తెచ్చి ఇస్తే నీవెంట ఎక్కడికైన వస్తాను. నువ్వు చెప్పినట్లుగా వింటాను. మన పెంట తుమ్మెల్ జైలు కాడ గుడిసెవేసుకొని ఆ గుడిసెలో కాపురం పెడదాము అని సరదాగా, సవినయంగా మరదలు మామతో పలికింది. ఈ గేయం మామ కోడళ్ళ ప్రేమకు ప్రతిరూపం.
జానపద బాణీలో సాగే జానపదం ఈ పాట.
సెంచు సెల్లల్లార రారండోయ్:
సెంచు సెల్లల్లార రారండోయ్
పంట సేల్లు గోయ రారండోయ్
పంట సేల్లు గోసి కుప్పలూ బెట్టి
గొడ్లతో తొక్కిచ్చి మనము తిందమ్ము ॥ సెంచు సెల్లల్లార ॥
సెంచు సెల్లల్లార రారండోయ్
జొన్న సేల్లు గోయ రారండోయ్
జొన్న సేల్లు గోసి రొట్టెలూ చేసి
మనము తిందము రారండోయ్ ॥ సెంచు సెల్లల్లార ॥
సెంచు సెల్లల్లార రారండోయ్
తైద సేల్లు (రాగులు) గోయ రారండోయ్
తైదలూ గోసి అంబలీగాసి
కాసింతైన మనం జుర్రుదము ॥ సెంచు సెల్లల్లార ॥
సెంచు సెల్లల్లార రారండోయ్
వేరుసెనగ గోయ రారండోయ్
వేరుసెనగ గోసి గానుగలోవేసి
తైలమూతీసి మనము తిందము ॥ సెంచు సెల్లల్లార ॥
సెంచు సెల్లల్లార రారండోయ్
పంట సేల్లు గోయ రారండోయ్
కంది సేల్లు గోయ రారండోయ్
కంది సేల్లు గోసి కమ్మంగ మనము తిందము ॥ సెంచు సెల్లల్లార ॥
సెంచు సెల్లల్లార రారండోయ్
మక్కజొన్న గోయ రారండోయ్
మక్కజొన్న గోసి గోసిలో వేసి
కుప్పగా జేసి ఎండకూ వార్చి
రేటుకూ కూర్చి సల్లంగ మనము ఉందాము
సక్కంగ మనము బతుకుదాము ॥ సెంచు సెల్లల్లార ॥
సందర్భం:
చెంచులు తమ పొలాలలోని పంటను కోయడానికి ఇరుగు పొరుగు చెల్లెళ్ళను పిలిచే సందర్భంలో పాడిన గేయం ఇది.
వివరణ:
చెంచు చెల్లెల్లార రారండోయ్, పంట చేల్లు కోయడానికి రారండి, పంట చేలు కోసి గొడ్లతో తొక్కించి పంట శుద్ధిచేసి మనము తిందాము. జొన్న పండిరచి జొన్నలను మరపట్టి పిండిచేసి రొట్టెగా చేసుకొని భుజిద్దాము. అలాగే తైదలు (రాగులు) కోసి అంబలిగా కాసుకొని మనము త్రాగుదము, వేరుశనగ కోసి గానుగలో వేసి నూనెతీసి వాడుకుందాము. కంది చేల్లు కోసి కందిపప్పుచేసి కమ్మంగ మనము తిందాము. చెంచు చెల్లెల్లార రారండి పంట చేల్లు కోయ రారండి. మక్కజొన్న చేసి గోసి విత్తనాలు తీసి ఎండకు ఎండనిచ్చి ఎక్కువ ధరకు అమ్ముకొని చల్లగా మనము బ్రతుకుదాము, సక్కంగ మనము బ్రతుకుదాము.
చెట్టు గొట్టరా చెంచన్నా:
చెట్టు గొట్టరా చెంచన్నా
భూమి దున్నరా రైతన్నా
సాగుచేయరా సాయన్నా
సేద్యం చెయ్యరా చెంచన్నా ॥ చెట్టు గొట్టరా చెంచన్నా ॥
సెమట బొట్టు నీకు తప్పదురా
రైతే రాజుర రంగన్నా
పోడు భూములను పగల దీయిరా
చక్కని దున్నతో దున్ని సూడరా
పంట పొలాలే ఫలమవునురా ॥ చెట్టు గొట్టరా చెంచన్నా ॥
ఆది దేవుడు తోడు గుండురా
ఆది శంకరుడు నీ కులదైవమురా
బ్రమరాంబ నీ ఆడపడచురా
నరసింహ్మాస్వామి నీ చుట్టమురా
చెంచులక్ష్మి నీ ఇలవేల్పునురా
ఇందరు నీ తోడు ఉండగా
జంకు బయము ఇక ఉండవురా ॥ చెట్టు గొట్టరా చెంచన్నా ॥
కల్లాకపటము ఎరుగమురా
కల్లబొల్లి మాటలు తెలియవురా
మనసు, మమత స్వచ్ఛమురా
పంటలు బాగా పండునురా
ధైర్యమే నీ ఊపిరి రా
సేద్యము చేయర చెంచన్నా
ఫలాలు నీకు ఫలించునురా ॥ చెట్టు గొట్టరా చెంచన్నా ॥
సందర్భం:
చెంచులు పోడు వ్యవసాయం చేసే ముందు పొలములో చెట్లుకొట్టి సేద్యము చేసే క్రమములో ఈ గేయము పాడటం జరిగింది.
వివరణ:
చెంచన్నా భూమి దున్ని సాగుచేసి వ్యవసాయం చేయి, నీకు కష్టము తప్పదు. చెమటోడ్చ వలెను. రైతేరాజు రంగన్నా.. అది మరవకు, పోడు భూములను పగల దున్ను. చక్కని దున్నపోతుతో దున్ని చూడు. పంటపొలాలే పండి ఫలాలు లభించును. పంట పండటానికి ఆ ఆదిదేవుడు, ఆదిశంకరుడు నీకు అండగా ఉన్నాడు, భ్రమరాంబాదేవి నీ ఇంటి ఆడపడుచు, నరసింహ్మస్వామి నీ చుట్టము, చెంచులక్ష్మి నీ ఇలవేల్పు. ఇంతమంది నీకు అండగా ఉన్నారు. నీవు అధైర్యపడకు. చెట్టుకొట్టి భూమిదున్ని వ్యవసాయం చేయి. కల్లాకపటము లేనివారు కల్లబొల్లి మాటలు తెలియవు. నీ మనసు, మమత స్వచ్ఛము, ధైర్యము నీ ఊపిరి కావునా, నీకు పంటలు బాగా పండును, ఫలాలు నీకు అందును.
ముగింపు:
చెంచులవారి గేయ సాహిత్యం చాలా గొప్పది. తెలంగాణ ప్రాంతంలోని చెంచులవారికి గేయ సాహిత్యంలో అంతగా ప్రవేశం లేదు. రాయలసీమ, ఆంధ్రాప్రాంతాలలో నివసించే వారికి గేయ సాహిత్యంలో ప్రవేశం ఉంది. వీరు గేయ సాహిత్యంలో నిష్ణాతులు. జనపదులది జానపద సాహిత్యమైతే చెంచులది చరాచర సృష్టి మెచ్చుకునే విధముగా ఉండే పద సాహిత్యం. వీరి యొక్క సాహిత్యంలో ఎంతో నిగూఢ అర్థాన్ని కలిగించే జాలువారిన జలపాతం లాంటి పదాల అల్లిక కనిపిస్తుంది. వీరు పెద్దగా చదువుకోకపోవచ్చును, కాని జీవిత పాఠాలనే నెమరువేసుకున్న సాహితీమూర్తులు.
చెంచులకు గేయం అంటే ఇష్టం. నృత్యం అంటే ప్రాణం. బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు అన్నీ వయసులవారు, దైవ ఉత్సవాలలోను, పండుగలలోను, అన్నీ సందర్భాలలో ముఖ్యంగా పోడు వ్యవసాయిక సంబంధమైన పనులను నిర్వర్తించే సమయాలలో చెంచులు పాడుకునే పాటలు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. మామా, కోడళ్ళ సరసపు మాటలు జానపదపాటలుగాను, ప్రకృతి అందము పరవసించే పాటలు, స్త్రీల పాటలు, పిల్లల పాటలు, దేశభక్తి, దైవభక్తి పాటలు వీరు చాలా చక్కగా పాడతారు. పురుషుల డప్పుల దరువుకు స్త్రీలు చేసే నృత్యం నాటికీ, నేటికీ ఎవరినైనా ఆకట్టుకోవలసిందే. వీరు ముఖ్యంగా వనదేవతలకు నైవేద్యం పెట్టే సందర్భంలో చాలా చక్కగా అద్భుతంగా నృత్యం చేస్తారు.
ఉపయుక్త గ్రంథాలు:
- అనంతజిల్లా గిరిజన సాహిత్యం (వ్యాసం), రచన:గోనానాయక్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
- ఆధునిక సమాజంలో గిరిజనభాష సంస్కృతులు (వ్యాస సంకలనం), సంపాదకులు, భూక్య తిరుపతి, ప్రథమ ముద్ర-2012.
- ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు, ప్రయోగములు, రచన:డా॥సి.నారాయణ రెడ్డి.
- ఆంధ్రప్రదేశ్‌లోని ఎరుకలవారి సాంఘికాచారాలు, రచన: డా॥కె.ప్రభాకర్, 2004.
- ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆర్వీయస్ సుందరం, 1983.
- ఆంధ్రప్రదేశ్ దళితులు, కలేకూరి ప్రసాద్
- ఉచిత ఉపాధ్యాయులు-ఆదివాసీలు, ప్రొ॥ కంచ ఐలయ్య.
- ఎరుకల ఏకలవ్య బుర్రకథ, రచన : సాతుపాటి గంగయ్య.
- ఎరుకలభాష వర్ణనాత్మక అధ్యయనం, వి.యం.సుబ్రహ్మణ్యశర్మ, 2007.
- ఎరుకలభాషా సాహిత్యాలు-తెలుగు ప్రభావం, డా॥ జి.హరిబాబు, 2011.
- ఎరుకలభాష సంస్కృతి సాహిత్యం, డా॥ జి.శ్రీరాములు, 2010.
- ఎరుకలవారి సామాజిక జానపద సంస్కృతి సమగ్ర పరిశీలన, డా॥కె.ప్రభాకర్, 2008.
- ఎరుకలవారి సోదె ఒక పరిశీలన (వ్యాసం), శ్రీమతి కోట భగవద్గీత శ్రీ (అక్టోబర్`డిసెంబర్ 2004).
- ఎల్లి నవల - అరుణ, మొదటి ముద్రణ, 2001.
- ఎల్లి నవల ఎరుకల కులజీవన చిత్రణ - ఎస్. ఎల్లయ్య.
- ఎఱుకల - పాలపర్తి వీరయ్య, మొదటి ముద్రణ, 2000.
- కురవంజి (ఎల్లోరా వ్యాసం) గొడవర్తి భాస్కరరావు, 2003.
- కుర్రుచరిత్ర - శ్రీరామమాలకొండయ్య.
- కొండకోనల్లో తెలుగు గిరిజనులు, డా॥ శివరామకృష్ణ, ప్రథమ ముద్రణ 2007.
- ఖమ్మం కొత్తగూడెం జానపదగేయాలు, సంపాదకులు, డా॥ యం.అండమ్మ, మొదటి ముద్రణ, 2013.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.