AUCHITHYAM | Volume-04 | Issue-01 | January 2023 | ISSN: 2583-4797
1. శ్రీ చింతా దీక్షితులు తెలుగులో బాలసాహిత్యానికి చేసిన సేవ
బులుసు సీతారామమూర్తి
బీ. ఎస్సీ. (భౌతిక శాస్త్రం)., ఎం. ఏ (ప్రభుత్వ పాలనా శాస్త్రం)., ఎం. ఏ (తెలుగు).,
బి. జీ. ఎల్ (న్యాయశాస్త్రం)., డిప్లొమా ఇన్ జర్నలిజమ్., డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్., సర్టిఫికెట్
ఇన్ ట్రాన్స్ లేషన్
విశ్రాంత జీవితబీమా సంస్థ అధికారి,
A-604, శ్రీనికేతన్ Apts, ధరమ్ కరణ్ రోడ్డు,
అమీర్ పేట, హైదరాబాదు-500016.
సెల్: +91 9849144294. Email: sitarambulusu@gmail.com
Download PDF
Keywords: ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, నీతి కథలు, పురాణ కథలు, శతకాలు, వ్యక్తిత్వ వికాసం, బాల సాహిత్యం, బాల వాఙ్మయబ్రహ్మ, బాల సాహిత్య పితామహుడు, కథక చక్రవర్తి, చింతా దీక్షితులు, లక్క పిడతలు, వ్యావహారిక భాష, సాంకేతిక ప్రగతి, సాంఘిక ప్రసారమాధ్యమాలు
ఉపోద్ఘాతం:
మన దేశంలోనూ రాష్ట్రం లోనూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్థానంలో వ్యక్తిగత కుటుంబాల్లో - తాతలు, అవ్వలు, అమ్మమ్మలు లేనందున బాల బాలికలకు నీతి కథలు, పురాణ కథలు, శతకాలు, మంచి బుద్ధులు, వ్యక్తిత్వ వికాసం నేర్పేవారు కరువయ్యారు. రెండు ఏళ్ల నుండి 16 ఏళ్ళ బాలబాలికలకు సద్గుణాలు నేర్చుకునే కీలక దశలో పైన చెప్పిన మౌఖిక బోధనలతో బాటు - బాల గేయాలు, కథలు, బొమ్మల కథలు, పాటలు, నాటికలు అందించడం చాలా అవసరం అని మానసిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాల సాహిత్యం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది.
పాఠశాలల్లో గ్రాంథిక భాష స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టాలనే ఉద్యమం సాగుతున్న కాలంలో శ్రీ చింతా దీక్షితులు గారు రాసిన “లక్క పిడతలు” గేయాలు బహుళ ప్రజాదరణ పొందాయి. దీక్షితులు గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు గనుక వీరి బాల గేయాలు చిన్న తరగతుల పాఠ్య పుస్తకాలలోనికి ప్రవేశించి అందరి మెప్పులు పొందాయి. వీరు పిల్లల కథలు, నవలలు, లీలా వాచకం (1-5 తరగతులకు), ఏకాదశి కథలు, హాస్య కథలు, దాసరి పాట కథలు, మిసెస్ వటీరావు కథలు రచించారు. అన్నిటినీ సంగ్రహంగా వివరించడానికి ప్రయత్నిస్తాను.
విద్యాభ్యాసం, ఉద్యోగం:
శ్రీ చింతా దీక్షితులు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా లోని దంగేరు గ్రామంలో 1891 లో జన్మించారు. రాజమహేంద్రవరంలో 1913 లో బి. ఏ., తదుపరి మద్రాసు (చెన్నై) లో ఎల్. టి (ప్రస్తుత బీ. ఈడీ) అధ్యయనం చేసి ఉపాధ్యాయుడుగా రాజమహేంద్రవరం లోనూ, నెల్లూరు జిల్లా కనిగిరి లోనూ పనిచేశారు. కొంతకాలం ‘డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్’ గా పనిచేశారు. కడపట కనిగిరిలో ఉన్న ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలో (నేటి D.I.E.T- District Institute for Education and Training) ప్రధానోపాధ్యాయుడు గా పనిచేశారు.
రచనా వ్యాసంగం:
శ్రీ చింతా దీక్షితులు ఉపాధ్యాయుడుగా పనిచేసిన సమయంలో బాలబాలికల్లో దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం కలిగించడానికి అనేక కథలు, గేయాలు, నవలలు రచించారు. ఒకటి నుండి ఐదవ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకోసం వ్రాసిన “లీలా వాచకం” తెలుగు వారి పాఠశాలల్లో గొప్ప ప్రాముఖ్యత సంపాదించింది. వీరు “రచయితగా, ఉపాధ్యాయుడుగా తన అనుభవాన్ని మేళవించి వ్రాయడం వల్లనూ, జానపద గేయాలు, వాడుక పదాలలో వ్రాయడం వల్లనూ ఈ వాచకాలకు విశేష ఆదరణ లభించింది.” 1931 నుండి “బాలానందం” పేరుతో ‘భారతి’ సాహిత్య మాస పత్రికలో చాలా పిల్లల కథలు వ్రాసారు. శ్రీ మినూ మసాని గారు ఆంగ్లంలో రచించిన “మై ఇండియా” ను పిల్లలకు అర్థమయే విధంగా ఆంధ్రీకరించారు.
శ్రీ చింతా దీక్షితులు గారు – “బాల వాఙ్మయం” వ్యాసంలో వ్రాసిన మాటలు - చేదు నిజాలు:
“మన తెలుగు గ్రంధ కర్తల దృష్టిలో బాలురే లేరు. వారి దృష్టిలో ఉన్నది ఆత్మ పాండిత్య ప్రకర్ష ఒక్కటే.” వీరు భారతి, అనసూయ, ఆంధ్ర పత్రిక, ప్రతిభ పత్రికల్లో ప్రచురింపబడిన బాలల గేయాలను సేకరించి “లక్క పిడతలు” అన్న బాల గేయ సంపుటిగా 1947 లో ప్రచురించారు. భారత ప్రభుత్వం బాల సాహిత్య విభాగంలో దానికి ప్రథమ బహుమతి రూ.500 ఇవ్వడమే కాకుండా, 2000 ప్రతులు కొనుగోలు చేసి రాష్ట్రంలోని పాఠశాలలకు పంపిణీ చేశారు.
లక్క పిడతలు – బాలల గేయ సంకలనం:
ఆ కాలంలో ప్రభుత్వోద్యోగుల జీతాలు, అందునా అయ్యవార్ల జీతాలు అంతంత మాత్రమే. “లక్క పిడతలు” సంకలనానికి ప్రభుత్వ బహుమతి రావడం వల్లే ఆ పుస్తకం ప్రచురణకు, బహుళ ప్రచారానికి నోచుకుంది అని సాహితీ వేత్తలు చెప్పుకున్నారు. ఈ బాల గేయ సంకలనం 1976 లోగా ఏడు సార్లు పునర్ముద్రణ అవడం ప్రశంసనీయం.
ఈ సంకలనం లో దాదాపు 25 గేయాలున్నాయి. వాటిలో కొన్ని మాత్రం ఇక్కడ ఉదాహరిస్తున్నాను. ఇంకా ‘హనుమంతుడి తోక’ పెద్ద గేయం, ‘రమణ మహర్షి’ పై గేయం (నివేదన) మొదలైనవి ఉన్నాయి. బాల సాహిత్యంలో శ్రీ చింతా దీక్షితులు గారి కృషికి, చేసిన సేవలకు - ‘బాల వాఙ్మయ బ్రహ్మ’, ‘బాల సాహిత్య పితామహుడు’, ‘కథక చక్రవర్తి’ అన్న బిరుదులు సార్ధకమయాయి.
ఈ క్రింద ఉదాహరించిన శ్రావ్యమైన గేయం – “బాజాలు” చూడండి. ఆ కాలం లో బాల బాలికలు బాజాలు చూసి, విని ఎంత సంబరపడిపోయే వారో – కళ్ళకు కట్టినట్లు వర్ణించారు దీక్షితులు గారు.
బాజాలు :
బాజాలు రా నాన్న బాజాలు / బాజాలు వచ్చాయి బాజాలు / అమ్మనీ పిలవరా బాజాలు / అక్కనీ పిలవరా బాజాలు
అందరినీ పిలవరా బాజాలు / అవిగోను చూడరా బాజాలు / బాజాలు అక్కడా బాజాలు / బాజాలు ఇక్కడా బాజాలు
కాగడాల్తో వచ్చె బాజాలు / ఖంగునా మోగాయి బాజాలు / బాజాలతో వచ్చె పల్లకీ అదిగో / పల్లకీలో ఉంది పార్వతీదేవి
పార్వతీ దేవికి జేజేలు పెట్టు / బాజాలు రా నాన్న బాజాలు / బాజాలు వచ్చాయి బాజాలు. (చిం. దీ. బా. సా. పుటలు 34,35)
‘లక్కపిడతలు’ బాల గేయాల్లో బాల కృష్ణుడి లీలలే అధికంగా ఉన్నాయి. ఆంధ్రుల బాల వాఙ్మయయనికి ‘అధిష్టాన దేవత’ బాలకృష్ణుడే కదా !
కృష్ణమ్మ :
చంకలో పిల్లవాడు / చల్లనైన పిల్లవాడు / నల్లటి ఆ పిల్లవాడు / నవ్వులొలికే పిల్లవాడు
వాడెవడె వా డెవడె / వా డెవడె గోపమ్మా!
చంకలో పిల్లవాడు / చల్లనైన పిల్లవాడు / నల్లటి ఆ పిల్లవాడు / నవ్వులొలికే పిల్లవాడు (చిం. దీ. బా. సా. పుటలు 38 ,39)
గోపమ్మలు పాడిన ఈ గేయం ‘కృష్ణమ్మ’ ఎంత సహజ సుందరంగా ఉన్నదో చెప్పవలసిన
అవసరం లేదు.
చిన్ని కృష్ణుడు :
చిన్ని కృష్ణుడు పుట్టాడు / చిటపట పువ్వులు కురిశాయి / చిన్ని కృష్ణుడు నవ్వాడు / తళతళ మెరుపులు మెరిశాయి
చిన్ని కృష్ణుడు నడిచాడు / తప్పట్లు కొట్టింది భూదేవి / చిన్ని కృష్ణుడు ఆడాడు / అప్పుడు ఆటలు పుట్టాయి
చిన్ని కృష్ణుడు పాడాడు / అప్పుడు పాటలు పుట్టాయి. (చిం. దీ. బా. సా. పుట 41)
బాలకృష్ణుడు పుట్టగానే, నవ్వులు, నడకలు, ఆటలు, పాటల పుట్టాయి అని రచయిత కృష్ణుడి బాల్యాన్ని రమ్యంగా వర్ణించారు.
కృష్ణమ్మ కొడుకు :
“కృష్ణమ్మ కో కొడుకు పుట్టాడే / ఆ కొడుకు నెత్తుకుందాము రారమ్మ
కొడుకంటె కొడుకటే గారాల కూచి / ముత్యాలహారమే ముద్దుల్లమూటే
రకరకము విద్దెల్లు చూపుతున్నాడే / వికవికా వికవికా నవ్వుతున్నాడే
చిన్ని చేతులు తట్టి ఆడుతున్నాడే / బోసినవ్వులు వెళ్ళబోయుచున్నాడే
చల్లన్ని చూపుల్లు చల్లుతున్నాడే / ఇల్లంత వెన్నెల్లు కాయుచున్నాడే ...” (చిం. దీ. బా. సా. పుటలు 47, 48)
బాలకృష్ణుడు పుట్టగానే చుట్టుపక్కల ఉన్న గోపమ్మలు కుతూహలంతో ఆ పిల్లవాడిని తప్పక చూడడానికి ఎన్నెన్ని కారణాలు చెప్పారో గమనించండి.
కమలాలు :
చిట్టి చిట్టి కమలాలు / చెరువులోని కమలాలు / నవ్వేటి కమలాలు / నాకు తెచ్చిపెట్టే / అమ్మ తెచ్చిపెట్టే / ఆడుకొంటాను
తెల్ల చీరె కట్టుకొనీ / మెల్లగాను నవ్వుతున్న / నీటి మీద పండుకున్న / చిట్టి చిట్టి కమలాలు / అమ్మ తెచ్చిపెట్టే / ఆడుకొంటాను.
బువ్వ తినను బజ్జోను / నవ్వమంటే నవ్వను / నీకు ముద్దు పెట్టను / చిట్టి చిట్టి కమలాలు / తెచ్చి పెట్టితే గాని!
అమ్మ తెచ్చిపెట్టే / ఆడుకుంటాను. (చిం. దీ. బా. సా. పుటలు 33, 34)
“కమలాలు” గేయంలో పిల్లల అమాయకపు మాటలు, మారాములు, కోరింది ఇవ్వకుంటే – “బువ్వ తినను బజ్జోను నవ్వను ముద్దుపెట్టను” అని మంకుపట్టు పట్టడం సహజం.
తువ్వాయి :
తువ్వాయి తువ్వాయి ఏమి తువ్వాయి? / తువ్వాయి తువ్వాయి మంచి తువ్వాయి
తువ్వాయి మెళ్ళోను ఏమి ఉన్నాయి? / తువ్వాయి మెళ్ళోను మువ్వలున్నాయి
తువ్వాయి కాళ్ళలో ఏమి ఉన్నాయి? / తువ్వాయి కాళ్ళలో పరుగులున్నాయి
తువ్వాయి నోట్లోను ఏమి ఉన్నాయి? / నోట్లోను తెలిపాల నురుగులున్నాయి
తువ్వాయి తువ్వాయి ఎవరి తువ్వాయి? / ఆవుగారి తువ్వాయి – అసలు మా తువ్వాయి ! (చిం. దీ. బా. సా. పుటలు 42, 43)
‘తువ్వాయి’ పదహారణాల అచ్చ తెలుగు పదం – పల్లెల్లో ప్రజలు చెప్పుకుని ఆనందించే తెలుగు నుడికారం. తువ్వాయిని చిన్న పిల్లల మాటల్లో ఎంత బాగా, సహజంగా వర్ణించి చెప్పారో చూడండి. ఆధునిక కంప్యూటర్ యుగంలో ఇటువంటి తియ్యటి పదాలెన్నో మరుగున పడిపోతున్నాయని బాధగా ఉన్నది.
తిన్నారు:
చిన్నా పెద్దా తిన్నారు / పప్పూ బెల్లం తిన్నారు / చేగోణీలు తిన్నారు / అమ్మా దగ్గర కెళ్ళారు / ఇంకా కావాలన్నారు.
అన్నారూ అన్నారు. / మంకూపట్టూ పట్టారు / పట్టారూ పట్టారు / అమ్మక్కోపం వచ్చింది / వచ్చిందీ వచ్చింది
అప్పుడు తన్నులు తిన్నారు / తిన్నారోయ్ తిన్నారు. (చిం. దీ. బా. సా. పుట 45)
చిన్నపిల్లల బాల్య చేష్టల్ని, కొరికల్ని, తల్లులను విసిగించడాన్ని, తర్వాత అమ్మ చేతులో తన్నులు తినడాన్ని ఎంతో సహజంగా కళ్ళకి కట్టినట్లు రాసారు శ్రీ చింతా దీక్షితులు గారు.
కథానికలు:
‘కథక చక్రవర్తి’ శ్రీ చింతా దీక్షితులు గారు మొట్ట మొదట ‘చిత్ర రేఖ’ అన్న అపరాధ పరిశోధక నవల రచించారు. తర్వాత ‘గోపీ మోహిని’ అద్భుత రస పిల్లల నవల, ‘శంపాలత’ అద్భుత బాలల నవలిక రచించారు. ‘భారతి’ సాహిత్య మాసపత్రికలో ‘బాలానందం’ శీర్షికలో ‘సూరీ-సీతీ-వెంకీ’ కథలు ప్రచురింప బడ్డాయి. ‘ఏకాదశి’ కథలు – అంటే పదకొండు కథలు. వీనిలో ‘పాఠము’, ‘ఎన్నో చేస్తాను’ పిల్లల కథలే.
“పాఠము” కథలో చింతా దీక్షితులు గారు మద్రాసులో తాను నేర్చుకున్న - మానసిక శాస్త్ర రీతిలో విద్యా బోధన పద్ధతులను తన కొడుకుపై ప్రయోగించారు.
కొడుకును బాసిపట్టు (పద్మాసనం) వేసుకుని కూర్చోమన్నాడు. కూర్చున్నా వాడి స్వేచ్ఛను అడ్డుకోలేదు. తర్వాత ‘గన్నేరు పువ్వు’ను చూబెట్టి కొడుకును ప్రశ్నించాడు – ఇదేమిటి అని. వాడు ‘పువ్వు’ అన్నాడు. ఏమి పువ్వో చెప్పలేకపోయాడు. ఆఖరుకు తండ్రే చెప్పాడు – ఇది గన్నేరు పువ్వు, దేవాలయం తోటలోంచి తెచ్చాను అన్నాడు. కొడుకు - నేనూ వెళ్ళి తీసుకురానా నాన్నా అంటే ‘వద్దు’ అన్నాడు. దాని రంగు చెప్ప మన్నాడు. చెప్పలేదు. అప్పుడు చాలా వస్తువుల పేర్లు – వాటి రంగుల గురించి వివరంగా చెప్పాడు. అంతా అయాక వారి అమ్మగారు – అబ్బాయీ నువ్వు వాడితో ఇలాగ ఆడుతూ వుంటే వాడికి చదువు ఎలాగ వస్తుంది? అని ప్రశ్నించింది, అమాయకంగా. ఆధునిక బోధనాపద్ధతులు పాత కాలం వాళ్ళకి అర్థం అవుతాయా? (చిం. దీ. సా-2 పుటలు 58-62)
“ఎన్నో చేస్తాను” కథలో కొడుకుని తండ్రి వీధి అరుగు మీద కూర్చో బెట్టి, పలకా బలపం ఇచ్చి ఓనమాలు దిద్దుతూ ఉండమన్నాడు. వీధుల వెంట తిరుగుతూ అల్లరి చేస్తే తంతాను అని కూడా భయపెట్టాడు. పిల్లవాడి ఆలోచనలు అన్నీ - పాఠకుల్ని తమ చిన్నప్పటి తియ్యటి బాల్య స్మృతుల్లోకి తీసుకుని వెళతాయి.
‘గడ్డి మేస్తూన్న మేకపిల్లని నిమ్మళంగా వెనకాలే వెళ్ళి పట్టుకుంటాను’, ‘చెవులు పట్టుకుని ఇంటికి లాక్కు వస్తాను’, ‘గుమ్మానికి కడతాను’, ‘దువ్వి దువ్వి దాని మెడమీద నేను నిదరోతాను - ఎంచక్కా!’ – నాన్నే చూడకుండా ఉంటేనా! నాన్న గదిలోకి వెడతాను. నాన్న రెండు కలాలూ పుచ్చుకుంటాను, రెండు కవర్లు తీసుకుంటాను. నాన్నకో ఉత్తరం, అమ్మకో ఉత్తరం, మేకపిల్లకో ఉత్తరం, కుక్కపిల్లకో ఉత్తరం రాస్తాను. నాన్నకి, అమ్మకి ఉత్తరాలు పోస్టు డబ్బాలో పడవేస్తాను. మధ్యాహ్నం పోస్టు జవాను అమ్మకీ నాన్నకీ ఉత్తరాలు ఇస్తాడు - నాన్నే చూడకుండా ఉంటేనా!
నాన్న గదిలోకి పిల్లిలాగ చప్పుడు చేయకుండా వెడతాను, లోపల గడియ వేస్తాను, నాన్న పంచ కట్టుకుంటాను, పెద్ద కోటు వేసుకుంటాను, జరీ తలపాగా పెట్టుకుంటాను, వాచీని కోటు జేబులో పెట్టుకుంటాను, చేత్తో కర్ర పుచ్చుకుంటాను, వీధిలోకి షికారు వెడతాను, తిన్నగా బొమ్మల దుకాణం మీదకు వెళ్ళి – అక్కడున్న బొమ్మలన్నీ కొనేస్తాను - నాన్నే చూడకుండా ఉంటేనా! పెరట్లో జామిచెట్టు ఎక్కుతాను, జామికాయలు జేబు నిండా వేసుకొని వచ్చి - అన్నీ నేనే తినేస్తాను, అమ్మకీ నాన్నకీ ఒక్క కాయైనా పెట్టను - నాన్నే చూడకుండా ఉంటేనా! నాన్నే చూడకుండా ఉంటేనా! పలకా బలపం అవతల పారేసి ఇంకా ఎన్నో చేస్తాను ! రహస్యం - నా చిన్నప్పుడు నేనూ ఇలాగే చేయాలని అనుకున్నాను లెండి. (చిం. దీ. సా-2 పుటలు 63-65)
హాస్య కథలు:
15 ఉన్నాయి. ‘ఆంధ్ర దోమల సభ’లో - ఒక మిత్రుడు యోగాభ్యాసం చేసి పశు పక్ష్యాదుల భాష తెలుసుకుంటాడు. తర్వాత ఆంధ్ర దోమల సభలో దోమల ప్రసంగాలు అన్నీ వెంటాడు. ఈ కథలో - ఆ ప్రసంగాలను చదివిన వారు నవ్వులు ఆపుకోలేరు.
‘పాక శాస్త్ర పరీక్ష’లో ఒక మహిళ తన చంటి పిల్ల ఏడుస్తున్నా లెక్కజేయకుండా – పరీక్షకు చదువుకుంటూ ఉంటుంది. తండ్రి ఏ పరీక్షకి చదువుతున్నావు అని అడిగితే – ‘పాక శాస్త్ర పరీక్ష’ కి అని చెబుతుంది. పరీక్ష అయిపోయాక ‘పరీక్ష పత్రం’ నాన్నకి ఇస్తుంది కూడా. తండ్రీ కూతుళ్ల సంభాషణ చాలా హాస్యం, ఆనందం కలిగిస్తాయి చదువరులకు. (చిం. దీ. బా. సా-2 పుటలు 98-104)
‘తెలుగు శాస్త్రుల్లు గారు’ – శాస్త్రులు ఇంట్లోనూ, వీధి బడిలోనూ కూడా శుద్ధ గ్రాంథికమే మాట్లాడడం పాఠకులకి బోలెడంత హాస్య రసాన్ని అందిస్తుంది. (చిం. దీ. సా-2 పుటలు 141-154)
“దాసరి పాట” లో 10 కథలున్నాయి. ఈ కథలేవీ పిల్లల కథలు కావు గనుక నేనిక్కడ వివరించడం లేదు. “మిసెస్ వటీ రావు కథలు”లో 6 కథలున్నాయి. వీటిలో ఏవీ పిల్లల కథలు కావు గనుక నేనిక్కడ వివరించడం లేదు.
కథా శిల్పం:
శ్రీ చింతా దీక్షితులు గారు గోదావరి జిల్లా వాస్తవ్యుడు గనుక మధురమైన తేట తెనుగు పదాలూ, వివిధ మండలాల్లోని జాతీయ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ కథలను రాశాడు. వీరు స్వయంగా ఉపాధ్యాయుడు గనుక వీరు పిల్లల మనోభావాల లోతులను క్షుణ్ణంగా పరిశీలించి రచనలు చేశారు. శ్రీ చింతా దీక్షితులు గారి కథలు, గేయాలు, నవలలు చదువుతూ బాలబాలికలు ఊహాలోకాల్లో విహరించారు, అద్భుతాలు, సాహస కృత్యాలు చేశారు, చూశారు; ఎన్నో నీతులు, సామెతలు, పలుకుబడులు, విజ్ఞానదాయకమైన విషయాలు నేర్చుకున్నారు.
మాతృభాషాభిమానం, జాతీయత, దేశభక్తి, లోకజ్ఞానం, జిజ్ఞాస, చైతన్యం వారిలో విరబూసాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీ చింతా దీక్షితులు గారి కథల్లో హాస్యం, చమత్కారం, నుడికారాలు, మాండలిక భాషా పదాలు, వ్యావహారిక భాషా సౌలభ్యం తొణికిసలాడుతూ – వీరి ‘కథక చక్రవర్తి’ బిరుదును సార్థకం చేస్తున్నాయి.
ముఖ్యోద్దేశం, ముగింపు :
తెలుగు భాషామతల్లిని - సవతి తల్లిగా – పనికిరాని దానిగా – చూస్తున్న నేటి ఆధునిక సమాజంలో – బాల సాహిత్యం అన్ని ప్రక్రియల్లోనూ – గేయాలు, పాటలు, కథలు, బొమ్మల కథలు, చిన్న చిన్న పద్యాలు, ఏకాంకిక నాటికలు, నాటకాలు – విస్తృతంగా వ్రాసి ప్రచారం చేయవలసిన బాధ్యత రచయితలకు, కవులకు, కథకులకు ఎంతైనా ఉన్నది. అప్పుడే బాలబాలికల్లో తెలుగు భాష పట్ల ఆదరాభిమానాలు, క్రమశిక్షణ, సన్మార్గ జీవిత విధానాలు, మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించ వచ్చని నా ప్రగాఢ విశ్వాసం. ఉగ్గుపాలతో మాతృభాషను నేర్చుకున్న పిల్లలు ఏ ఇతర భాషానైనా సులభంగా, వేగంగా నేర్చుకోగలరని సాహితీవేత్తలు, మానసిక శాస్త్ర వేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. అయినా వీటిని విద్యాధికారులు, రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేయడం శోచనీయం.
విస్తృతమైన సాంకేతిక ప్రగతిని సాధించి, మన నిత్య జీవితాల్లో ఉపయోగిస్తున్న దూర దర్శన యంత్రాలు (టెలివిజన్), అంతర్జాల వేదికలు, చరవాణి (స్మార్ట్ ఫోన్), సాంఘక ప్రసార మాధ్యమాలు (సోషల్ మీడియా) – వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, పిన్ టరెస్ట్, స్నాప్ చాట్, లింక్ డిన్ మొదలైనవి – మంచి ఉపయోగకరమైన విషయాలతోబాటు – బూతు సాహిత్యం, లైంగిక విషయాలు ప్రచారం చేస్తూ బాలబాలికల్లో విపరీతంగా అవాంఛిత భావాలు రేకెత్తిస్తున్నాయి. ఇది ఏమాత్రం హర్షణీయం కాదు.
నేటి సామాజిక పరిస్థితులను చూస్తూ ఉంటే మన భారతీయ సంస్కృతి, అహింస, సత్యం, ధర్మం, మానవత్వం దారి తప్పుతున్నాయేమోనన్న అనుమానం వస్తోంది. ఈ విషయాన్ని బాధ్యులందరూ పరిశీలించి సక్రమ మార్గ నిర్దేశం చేయవలసిన అవసరం ఉన్నది.
తెలుగులో ఉన్న తరతరాల బాల సాహిత్యాన్ని పరిశీలించి, పరిశోధించి, తన ఆశయాలను సాధించి, తెలుగు సాహితీ సరస్వతిని మేలిమి బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు ‘బాల వాఙ్మయ బ్రహ్మ’ శ్రీ చింతా దీక్షితులు గారు. నేటి సమాజానికి శ్రీ దీక్షితులు వంటి దీక్షాపరులు చాలామంది కావాలి. శ్రీ చింతా దీక్షితులు గారు బాల సాహిత్యానికి చేసిన కృషి చిరస్మరణీయం. తెలుగు బాల వాఙ్మయయనికి వారు చేసిన సేవ అజరామరం.
ఉపయుక్త గ్రంథసూచి:
- మధుకర్, ఎన్. సంపాదకుడు (2014). చింతా దీక్షితులు బాల సాహిత్యం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు
- దీక్షితులు, చింతా. (2015). చింతా దీక్షితులు సాహిత్యం-2, నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.