headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-02 | February 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. మొల్లరామాయణంలో హనుమత్సీతాభాషణం: “సాంఖ్యదర్శన” సందర్శనం

డా. రొట్ట గణపతిరావు,

సహాయాచార్య, తెలుగు శాఖ,
ఆర్.జి.యు.కె.టి. (ఐఐఐటి) శ్రీకాకుళం,
ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9494586342, Email: dr.rgr@rguktsklm.ac.in
Download PDF


Keywords: మొల్ల, రామాయణం, హనుమతుండు, సీత, సాంఖ్యం, దర్శనం, సంభాషణ, దార్శనికత

కవయిత్రి పరిచయం

సువర్ణభారతదేశ సంస్కృతి అనే సాహిత్య నందనవనంలో తొలుత పుష్పించి ఫలించిన రసాలము మన రామాయణం. రామాయణ మహాభారత ఇతిహాసాలకు గొప్ప గౌరవముంది. ఈ ఇతిహాసాల్లో సదాచారం, నీతినియమాలు, ధర్మ నిరతి, భక్తి జ్ఞానవైరాగ్యాలు అన్నిచోట్ల కనిపిస్తాయి.  కార్యసాధనలో వ్యక్తిగత సుఖాలను పరిత్యజించి, సత్య ధర్మ న్యాయ సదాచారాలకు ప్రాధాన్యమివ్వటం ముఖ్యమనే విషయాన్ని రామాయణం ప్రబోధిస్తుంది. విశ్వకళ్యాణ భావన, సద్గుణవృద్ధి, సత్యపాలన, సన్మార్గగమనం, దానగుణం, ఆత్మవిశ్వాసం, సక్రమధనార్జన, క్రోధనాశనం, సోదరప్రేమ, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు  మొదలగు విషయాలకు ఉనికిపట్టు రామాయణం.

పోతనలాగ ఈమె కూడా పలికించెడివాడు రామభద్రుడే అని చెప్పి, తన రామాయాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేసింది.  అవతారికతో కలిపి యుద్ధకాండ వరకూ మొత్తం 869 గద్య పద్యాలు ఈ రామాయణంలో ఉన్నాయి.  మొల్ల రామాయణం రాశిలో చిన్నదైనా వాసిలో మిన్న అయినది.  ఈ కవయిత్రి పూర్తి పేరు ఆతుకూరి మొల్ల.  ఈమె క్రీ.శ. 16 వ శతాబ్దాలికి చెందినది. ఈమె తండ్రి ఆతుకూరి కేసన.  మొల్ల గోపవరపు శ్రీకంఠ మల్లేశు వరముచే కవిత్వం చెప్పడం నేర్చుకుంది.

తెలుగులోని గల రామాయణాలన్నిటిలో సర్వజనామోదమును పొందిన రామాయణం మొల్లరామాయణం.  మొల్లరామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలను 6 కాండములున్నవి.  అందులోని సుందరకాండ ఈ కావ్యానికి ఆయువుపట్టు.

రామాయణంలో అంతామధురమే.  శబ్దగతమాధుర్యం, అర్థగతమాధుర్యం, రసమాధుర్యం అనే మూడురకాల మాధుర్యాలకు నిలయం రామాయణం.

మొల్ల రామాయణం సంగ్రహ రచన.  ఇందులో కథ చాలావరకు టూకీగా చెప్పి, మానవసంబంధాల సన్నివేశాలున్నచోట మొల్ల తన కవితా పతిభను ప్రదర్శించడం పాఠకులు గమనించవచ్చు.  స్త్రీకి గల సహజమైన ఆర్థ్రతతోపాటు, సంఘర్షణ, స్త్రీలోని  అరుదైన వీరత్వం ఆమె భావాల్లో కనిపిస్తుంది. 

ఈమె రచనా శైలి మృదు మధురంగా ఉంటుందని చెప్పడానికి గాను అవతారికలో ఆమె చెప్పిన ఈక్రింది పద్యం ద్వారా పాఠకులు గమనించ వచ్చు.

                                           తేనె సోక నోరు తియ్యన యగురీతి

                                           తోడనర్థమెల్ల తోచకుండ

                                           గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము

                                           మూగ చెవిటివారి ముచ్చటగును 

మొల్ల తేట తెలుగు మాటలతో కూర్చిన రామాయణం ఇది.  సున్నితమైన మాటలలోనే రాజసమొప్పే వ్యక్తీకరణ కూడా దాగి ఉంది.  ఇటువంటి చక్కని భావాలు ఉన్నందున లెక్కకు మిక్కిలిగా ఉన్నతెలుగు రామాయణాలన్నిటిలోకి  మొల్లరామాయణం బహుళ జనాదరణ పొందింది.

“తేనె సోక నోరు తియ్యన యగురీతి” అని చెప్పడంలోనే మొల్ల గారు పూర్వకవులను అనుసరిస్తుందని తెలుస్తుంది. కాళిదాసు గారు రఘువంశంలో వాగర్థావివ సంప్రుక్తౌ ...... అనే పదప్రయోగాన్ని చూసి  “తేనె సోక నోరు తియ్యన యగురీతి”   అనే ప్రయోగం చేసిందని తెలుస్తుంది.  తేనె సహజసిద్ధమైనది  ...    ఈ మె పాండిత్యం కూడా సహజమైనదే. తేనె మరియు తియ్యదనం కలసి ఉంటుందని, ఒక్కతేనె చుక్క నోట్లో వెయ్యగానే తియ్యదనం నోరంతా ఎలా వ్యాపిస్తుందో అదేవిధంగా తన కవిత్వం చదవగానె అర్ధమౌతుందని చెప్పుకుంది.

సుందరకాండ:

సీతమ్మ లంకలో అశోకవనంలో శింశుపా వృక్షం క్రింద రాక్షసుల మధ్య ఉంది.  అక్కడకు రావణాసురుడు వచ్చి తన గొప్పతనాన్ని చెబుతు, తనకు లొంగిపొమ్మని సీతకు అనేక విధాలుగా  చెప్పుచున్నాడు. తనకు లొంగకపోయినచో నాలుక కోసేస్తానన్నాడు, చంద్రహాసాన్ని తీయబోయాడు. కొందరు ప్రియ సుందరులడ్డు పడగా,  రెండు నెలల లోగా తనకు లొంగకపోతే చంపి తినేయమన్నాడు.

ఈ విధంగా రావణుడు దుర్భాషలాడి, గడువిచ్చి తన అంతఃపురానికి వెళతాడు. అపుడు అశోక వనంలో రాక్షస మాయల నడుమ శింశుపా వృక్షం కింద సీతాదేవి రాముడినే  తలచుకుంటూ, రాముని గురించే భాధపడుతూ, నేను లేని రాముడు ఎలా ఉన్నాడో...  అసలు ఉన్నాడో, లేడో .... అని తన మనసులో  అనుకుంటున్న సందర్భంలో హనుమంతుడు  కపి కుమారుని రూపంలో శింశుపా వృక్షం మీద నుండి ఇలా ప్రారంభించాడు.

           *1.క.    ఉన్నాడు లెస్స రాఘవు

                      డున్నాడిదె కపులగూడి, యురుగతి రానై

                      యున్నాడు, నిన్నుగొని పో

                      యున్నాడిది నిజము నమ్ముముర్వీ తనయా!

హనుమంతుడు ఉత్తమ దూత: 

ఓ సీతా! నీ రాముడు క్షేమంగా ఉన్నాడు.  ఇదుగో వానరులతో కలిసి ఉన్నాడు. ఇక్కడకు వేగంగా రాబోతున్నాడు. నిన్ను తీసికొని వెళ్ళబోతున్నాడు.  నేను చెప్పేది నిజం. నా మాటలు నమ్ము. అని హనుమంతుడు సీతతో పలికెను.

ఈ పద్యాన్ని భాషా నైపుణ్యాలలోని వ్యక్తీకరణకు నిదర్శనంగా చెప్పవచ్చు.  మాటలాడేటప్పుడు ఎదుటివారి పరిస్థితిని బట్టి సముచితంగా మాట్లాడాలి.  మాటలలో నేర్పరి హనుమంతుడు.  సీతకు ముందుగా కావలిసింది రాముని క్షేమసమాచారం, కాబట్టి ముందుగా  ‘’ఉన్నాడు లెస్స రాఘవుడు’’ అని  హనుమంతుడు ప్రారంభించాడు.  ఈ వాక్యంలో  ‘’ఉన్నాడు ’’ అనే క్రియా పదంతో ప్రారంభించాడు. ఉన్నాడు అనే మాట వినేసరికి  సీత మనస్సు శాంతిస్తుంది.  తరువాత ఎవడు ఉన్నాడు అనే సందేహం సీతకు కలగవచ్చు.  దాని నివృత్తికై హనుమంతుడు వెంటనే ‘’ రాఘవుడున్నాడు’’ అని చెప్పెను.  ఎలా ఉన్నాడు అనే ప్రశ్నకి సమాదానంగా లెస్సగా ఉన్నాడని తెలుస్తుంది.   తర్వాత సీతను చెరనుండి విడిపించడం ఎలా అనే సందేహానికి సమాదానంగా కపులగూడి (సైన్యంతో కూడి) ఉన్నాడు.  తర్వాత ఎంత సమయం పడుతుందనే ప్రశ్నకు సమాదానంగా ఉరుగతి రానై యున్నాడు అని చెప్పడం జరిగింది,  అనగా అతిత్వరలోనే నీ శ్రీరామచంద్రుడు  కపిసైన్యంతో వచ్చి, నిన్ను ఈ చెరనుండి విడిపించి, అయోధ్యకు తీసుకువెళతాడు అనే మాట నిజం అనే నమ్మకాన్ని కలిగించే విధంగా హనుమంతుని మాటల్లో మొల్ల తన రచనా నైపుణ్యాన్ని ప్రదర్శించే పద్యమిది. 

‘’ఉన్నాడు’’  అనే క్రియా పదంతో ఈ పద్యాన్ని ప్రారంభించడంలోనే మొల్ల వాల్మీకిని కాళిదాసుని  చక్కగా అనుసరించిందని చెప్పవచ్చు.

రాఘవుడున్నాడని కూడా చెప్పవచ్చు . హనుమంతుడు వ్యాకరణ కుశలుడు.  కాబట్టి     ఉన్నాడు రాఘవుడు అని చెప్పాడు. ఉన్నాడు అన్నంతనే పూర్తి అర్ధం వస్తుంది. అది ఒక పదమున్న వాక్యము కూడా.

ఇలాగే మరొకచోట కూడా ప్రయోగించింది. అది ఏమనగా...  హనుమంతుడు రామునితో సీత సందేశాన్ని చెప్పినప్పుడు-  కంటిన్ జానకిన్  ...... అనే క్రియాపదాన్ని ఉపయోగించడం జరిగింది. తద్వారా మొల్ల పదప్రయోగం మనకు అవగతమౌతోంది.

వాల్మీకంలో...  

దృష్టా దేవీతి హనుమద్వవనామృతోపమమ్

ఆకర్ణ్య వచనం రామో హర్షమాప సలక్షణః

 

  1. సీ. ఆ మాట లాలించి భూమిజ తనలోన

                      వెఱగంది, శింశుపా వృక్ష మరసి

             చూడంగ, నప్పుడు సూక్ష్మరూపంబున

                      నొడికమౌ శాఖల నడుమ నున్న

              కపి కుమారుని రూప మపురూపముగజేసి

                      స్వాంతంబులోన హర్షంబు నొంది,

              దనుజ మాయలచేత దఱచు వేగుటజేసి

                      మాఱాడి నేరక యూర కున్న

                      భావ మూహించి, తన్ను నా దేవి యాత్మ

                      నమ్మకుండుట దెలిసి, యా కొమ్మమీది

                      నుండి క్రిందికి లంఘించి, నిండు భక్తి

                      మ్రొక్కి నిలుచుండి కరములు మోడ్చి పలికె

హనుమంతుని మాటలు వినిన సీతాదేవి తన మనస్సులో ఆశ్చర్యపడింది.  పైనున్న శింశుపా వృక్షాన్ని వెదకి చూసింది.  అపుడు ఆ చెట్టుకొమ్మలమధ్య అపురూమైన రూపంలో ఉన్న చిన్ని వానరకుమారుని చూచి తన మనస్సులో సంతోషించింది.  రాక్షసమాయలచేత తరచుగా బాధలుపడుతున్నందు వలన ఆమె ఏమి మాట్లాడకుండా ఊరుకున్నది. 

హనుమంతుడు సీతమ్మ అభిప్రాయాన్ని  తెలిసికొని తనను ఆ సీతమ్మ నమ్మడంలేదని తెలిసికొని ఆ చెట్టు కొమ్మ మీది నుంచి క్రిందికి దుమికాడు.  నిండైన భక్తితో చేతులు జోడించి సీతమ్మకు నమస్కరించి ఆమెతో ఈ విధంగా చెప్పెను.

మాట్లాడడంలో నేర్పరైన హనుమంతుడు ఎదుటివారి ముఖకవళికలను బట్టి వారిమనస్సులోని భావాన్ని అర్థం చేసుకోగల సమర్థుడు కాబట్టి సీతమ్మ తనను చూసి నమ్మలేదని సులువుగా గ్రహించాడు.  హనుమంతుడు మంచి దూత. అతనికి ఎదుటివారితో ఎక్కడ ఎలాగ మాట్లాడాలో తెలిసినవాడు కాబట్టి తనను తాను నమ్మించుకొనే  ప్రయత్నం  చేస్తున్నాడు.

సీతమనసులో సంఘర్షణ:

అక్కడకి హనుమంతుడు వచ్చి, నేను రాముడు పంపగా వచ్చానని సీతతో చెప్పాడు.  అప్పటి నుంచి సీత మనస్సులో ఇతడు రాముడు పంపగా వచ్చాడా లేదా రాక్షసమయా అని సీత మనసులో సంఘర్షణ మొదలైంది.  అంతవరకు అతనిని సీతమ్మ చూడలేదు.  కొత్తగా మన ముందుకొచ్చినవాడు  ఎలాంటివాడో తెలుసుకోవాలంటే కొన్ని ఆనవాళ్లను అతనిలో  చూసిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.   

ఆ ఆనవాళ్లను గూర్చి  కపిలముని రచించిన  సర్వప్రాచీన దర్శనమైన సాంఖ్యదర్శనంలో చెప్పిన మూడు  ప్రమాణాలున్నాయి.  అవి “దృష్టమనుమానం ఆప్తవచనం  చ”.

  1. దృష్టం – ప్రత్యక్షం – జ్ఞానేంద్రియాలద్వారా ప్రత్యక్షంగా పొందిన ఆనుభూతి అనగా చూసేది, వినేది, తినేది, వాసన చూసేది, తాకేది.
  2. అనుమానం - ఆకాశమంతా మేఘాలు కమ్మితే వర్షం వస్తుందనే విషయాన్ని తెలుసుకోవడం అనుమానం.
  3. ఆప్తవచనం – గురువుల ముఖతః చెప్పగా విని తెలుసుకొనేది.

పైన చెప్పిన ప్రమాణాలలో అనుమానానానికి తావులేదు. వచ్చిన హనుమంతుని గురించి ఇంతకు ముందు ఎవరూ చెప్పలేదు. కాబట్టి మూడవదైన ఆప్తవచనానికి కూడా తావులేదు. ఈ సందర్భంలో  సీతమ్మ ఎంచుకున్న ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే.

  1. దృష్టం – ప్రత్యక్షప్రమాణం – చూసేది, వినేది, తినేది, వాసన చూసేది, తాకేది.

ఆకారైరింగితైర్గత్యా చేష్టయా భాషణేన  I

నేత్రవక్త్ర వికారైశ్చ లక్ష్యతేs అంతర్గతం మనః II  హితోపదేశం

ఎదుటివారి ఆకారముచేతను, ప్రవర్తనచేతను, చేసిన పనులచేతను, మాటలచేతను, ముఖకవళికలచేతను వారి మనసులోని దాగి ఉన్న భావాలను తెలిసికొనవచ్చు.

పైన చెప్పిన విధంగా ఎదుటవారి మనసులో దాగున్న ఉద్దేశాన్ని తెలుసుకోడానికి సీతమ్మ హనుమంతునిచేత అనేకమైన మాటలాడించడానికి  అనేకమైన ప్రశ్నలను సంధించింది.  మాటలాడుతున్నపుడు హనుమంతునికి రాముని పట్ల ఉన్న గౌరవాన్ని, భక్తిభావాన్ని కూడా చూడవచ్చు.  కేవలం అప్పచెప్పినట్లు చెబుతున్నాడా! లేదా రామునియందు తన్మయత్వంతో చెబుతున్నాడా! మొదలగు  విషయాలను  హనుమంతుని మనస్సులో దాగివున్న ఉద్దేసాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించింది.   వాటిలో కొన్ని......

కొత్తగా వచ్చినవారిని నమ్మరాదు అనే సూక్తిని ఆధారంగా సీతమ్మ హనుమంతుణ్ణి నీవెవరని, నువ్వు ఇక్కడకు ఎందుకొచ్చావని ఇలాగ ప్రశ్నించింది.

        ఇచ్చినఁ జూచి, రామ ధరణీశ్వరు ముద్రికగా నెఱింగి తా

       నిచ్చను మెచ్చి మెచ్చి, తరుణీమణి యాత్మ గతంబునందు నీ

       వచ్చినదాని బావమును, వల్లభు చందము నేర్పడంగ, నేఁ

       జెచ్చెర నంతయుం దెలియఁ జెప్పుము నమ్మిక పుట్టునట్లుగన్

స్త్రీ రత్నమైన సీత, హనుమంతుడు ఉంగరాన్ని ఇవ్వగానే దానిని చూసి, అది శ్రీరామచంద్రుని ఉంగరమని గ్రహించి, తనలో తాను బాగా మెచ్చుకొని, నీవు వచ్చిన కారణాన్నీ, నీ ప్రభువయిన శ్రీరాముని పోలికనూ, స్పష్టంగా నేను వెంటనే దానిని అంతా తెలుసుకొనేటట్లుగా, నాకు నీవు చెప్పిన దానిపై  పూర్తిగా నమ్మకం కలిగేటట్లుగా చెప్పుమని హనుమంతుని సీతమ్మ ప్రశ్నించింది.  అంతటితో ఆగకుండ నిర్మొఖమాటంగా హనుమంతునితో మరల ఈ విధంగా సీత చెప్పింది.

                     నిను విశ్వసింపజాలను,

                     వినుపింపుము నీ తెఱంగు, విభుని తెఱంగు

                     న్ననవుడుఁ బావని తెలియఁగ

                     వినయంబున విన్నవించె విస్ఫుట ఫణితిన్

నిన్ను నేను నమ్మలేకపోతున్నాను.  నీ గురించి, శ్రీరామచంద్రుని గిరించి నాకు చెప్పమని సీత అడిగింది.

పై పద్యం ద్వారా సీతాదేవి మొగమాటం లేకుండా హనుమంతునితో నేను నిన్ను నమ్మనని నిస్సంకోచంగా చెప్పింది.  ఎదుటివారి మాటలను ఖండించడం చాలా కష్టమైన విషయం.  వారు బాధపడతారేమోనని తనను తాను వంచించుకోకూడదు. తాను అనుకున్నది చెప్పితీరాలి. అందుకే సీతాదేవి ముక్కుసూటిగా హనుమంతునితో నేను నిన్ను నమ్మలేకపోతున్నానని చెప్పింది.  అయితే హనుమంతుని మాటల్లో సీత నమ్మగల నిజము కూడా కొంత శాతముంది.  కనుక శ్రీరామచంద్రుని గిరించి నాకు వినిపించుమని వినయంగా కోరింది. వెంటనే ఆంజనేయుడు ఈ విధంగా చెప్పాడు.

                     రాముని డాఁగురించి, నిను రావణుఁడెత్తుక వచ్చువేళ, నీ

                     హేమ విభూషణావళుల నేర్పడ ఋశ్య మహాద్రి వైచినన్

                     మే మవి తీసి దాఁచితిమి, మీ పతి యచ్చటి కేఁగుదేరఁగాఁ

                     దామరసాప్త నందనుండు తా నవి సూపినఁ జూచి మెచ్చుచున్

రాముని మోసగించి నిన్ను రావణుడు తీసుకొని వచ్చినపుడు నీ బంగారు ఆభరణాలను ఋష్యమూక పర్వతముపై వేసినపుడు మేము అవి తీసి దాచిపెట్టాము.  నీ భర్త అక్కడికి వచ్చినపుడు వాటిని సూర్యనందనుడైన సుగ్రీవుడు చూపించగా ఆయన వాటిని చూచి మెచ్చుకున్నాడు.

సుగ్రీవునికి అభయమిచ్చి, దుందుభి అనే రాక్షసుని శరీరాన్ని ఎగరగొట్టి, ఏడు తాటిచెట్లను ఒక్కసారిగా బాణంతో త్రుంచి , వాలిని అద్భుతంగా చంపి, సుగ్రీవునికి తారను ఇప్పించి, అంగదునికి యువరాజ్య పట్టం గట్టి, వానర సైన్యంతో కలిసి మాల్యవంత పర్వతంపై నుండి శ్రీరాముడు నిన్ను వెదకడానికి అందరిని అన్ని దిక్కులకు పంపించాడు.  దక్షిణ భాగానికి అంగదునితో కలసి కొందరం ఇటు వచ్చినాము.  సునాయాసంగా సముద్రాన్ని దాటి అంతటా చూచి ఈ వైపున రావణుడు నీతో తీవ్రంగామాట్లాడేటప్పుడు చెట్టుపై నుండి నిన్ను చూచాను.

ఈ విధంగా మాట్లాడుతున్నప్పటికి హనుమంతుని పూర్తిగా నమ్మకుండా సీత శ్రీరాముని గుణగణాలను వర్ణించమని అడిగింది. అప్పుడా మారుతి రఘునందనునికి నమస్కరించి భూమి పుత్రికతో ఇలా చెప్పాడు.

       సీ.          నీల మేఘచ్ఛాయ బోలు దేహమువాఁడు

                                    ధవళాబ్జ పత్ర నేత్రములవాఁడు

                      కంబు సన్నిభమైన కంఠంబు గలఁవాఁడు

                                    చక్కని పీన వక్షంబువాఁడు

                      తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాఁడు

                                    ఘనమైన దుందుభి స్వనమువాఁడు

                      పద్మ రేఖలు గల్గు పద యుగంబులవాఁడు

                                    బాగైన యట్టి గుల్ఫములవాడు

        తే.          కపట మెఱుఁగని సత్య వాక్యములవాఁడ

                      రమణి! రాముండు శుభ లక్షణములవాఁడు

                      ఇన్ని గుణముల రూపింప నెసగువాడు

                      వరుస సౌమిత్రి బంగారు వన్నెవాఁడు.

ఓ సీతమ్మా!  రాముడు నల్లని మేఘం వంటి శరీరఛాయ కలవాడు, తెల్లతామరలు వంటి కళ్లు కలవాడు, శంఖం వంటి మెడ కలవాడు, విశాలమైన ఛాతి కలవాడు, పొడవైన చేతులు కలవాడు, ఢంకా శబ్దం లాంటి కంఠ ధ్వని కలవాడు, పాదాల్లో పద్మరేఖలు కలవాడు, సొగసైన చీలమండలు కలవాడు.  కపటమెరుగని సత్యవాక్కు పలికే శుభలక్షణాలు కలవాడు.  ఈ గుణాలన్నీ లక్ష్మణునిలో కూడా ఉన్నాయి, కాని ఆయన బంగారు రంగులో ఉంటాడు.

హనుమంతుని సాముద్రిక శాస్త్ర విషయాలు:

కళ్ళు, కనుబొమలు, ముక్కు, పెదవులు, లలాటం, చుబుకం, చెక్కిళ్ళు, చెవులు, మెడ, చేతులు, కాలు, వాటి రేఖలు ఇలా ఆపాద తల మస్తకం వర్ణించి చెప్పాలంటే రామునితో హనుమంతునికి ఎంతో సామీప్యత ఉంటేగాని చెప్పలేడు.

ఇది రాక్షస మాయ అనుకోవడానికి వీలులేదు.  రాక్షసుడైన రావణునికి గాని అతని గుఢచారులకు గాని రాముని గూర్చి అంత దగ్గర నుండి అంత చక్కగా పరిశీలించే అవకాశం లేదు .  అందువల్ల సీతకు హనుమంతునిపైన కొంచెం విశవాసం పెరిగింది. అయినప్పటికి వచ్చినవాని పూర్తి ఆచూకీ తెలుసుకోవడానికి సీత ప్రయత్నిస్తుంది.

నీవెవరని, నువ్వు ఇక్కడకు వచ్చిన పని ఏమని   అడిగిన ప్రశ్నకు సమాధానంగా  హనుమంతుడు చెప్పిన సమాధానం...

                      ఉరుతరాటవిలోన మహోగ్రతపము

                      వాయు దేవుని గుఱియించి వరసఁ జేసి

                      యంజనా దేవి గనియె నన్నర్థితోడ

                      నర్కజుని మంత్రి, హనుమంతుఁడనెడువాఁడ.

గొప్ప అడవిలో వాయుదేవుని ఉద్దేశించి తీవ్రమైన తపస్సు చేసి అంజనాదేవి కోరి నన్ను పుత్రునిగా పొందినది.  నేను సుగ్రీవుని మంత్రిని, హనుమంతుడనేవాడినని ఆయన చెప్పాడు.

ఇందులో ఆంజనేయుడు ఎవరో అతని తల్లిదండ్రులెవరో తెలియపరుస్తూ, అతని వృత్తిని కూడా చెప్పాడు. ఇలా చెప్పడం ద్వారా  ఒక వ్యక్తి ఇతరులతో మాట్లాడేటపుడు తనను తాను ఎలా పరిచయం చేసుకోవాలనే అభివ్యక్తి నైపుణ్యాలను పెంపొందింప జేస్తుంది మన రామాయణం.

         *3. ఉ.         తమ్ముని గూడి పుణ్య గుణ ధాముడు, రాముడు వచ్చి మాల్యవం

                            తమ్మున సైన్య సంఘము ముదంబున గొల్వంగ నుండి, భూమిపై

                            మిమ్ములజూచి రండనుచు మేటి కపీంద్రుల బుచ్చి, యందు మొ

                            త్తమ్ముగ మమ్ము గొందఱను దక్షిణ భాగము చూడ బంపుచున్

పుణ్యగుణరాశియైన రాముడు తమ్మడైన లక్ష్మణునితో కలసి వచ్చి, మాల్యవత్పర్వతముపై సైనికుల సమూహము సంతోషముతో సేవిస్తుండగా అక్కడ ఉన్నాడు.  భూమండలంలో మిమ్మల్ని చూసి రమ్మని, గొప్ప వానర శ్రేష్ఠలను పంపాడు. అందులో గుంపుగా కొంతమంది మమ్మల్ని దక్షిణదిశ పైపు చూడడానికి పంపుతూ (రాముడు నాతో ఇలా అన్నాడు)

                   క. అంగనఁ బొడగన నీ వి

                      య్యంగను గడుఁజాలువాఁడ వంచును, నాచే

                      నుంగర మంపెను శ్రీ రఘు

                      పుంగవుఁడిదె కొమ్మటంచు భూమిజకిచ్చెన్

సీతాదేవి జాడ తెలుసుకోవడానికీ, ఉంగరాన్ని ఇవ్వడానికీ నీవు మిక్కిలి సమర్థుడవు అంటూ నా చేత శ్రీరాముడు ఉంగరాన్ని పంపాడు.  ఆ ఉంగరము, ఇదిగో స్వీకరింపుము అంటూ హనుమంతుడు సీతాదేవికి ఆ ఉంగరాన్ని ఇచ్చాడు.

ఈ విధంగా విషయం అర్థమయ్యేటట్లు విన్నవించి దేవీ!  నీ  శ్రీరాముడు నా చేతికిచ్చిన ఉంగరాన్ని నీకు ఇచ్చాను.  ఇక నేను ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడం దూతగా నాకు తగినది కాదు.  కాబట్టి నిన్ను నేను దర్శించినట్లు నా ప్రభువైన రామునికి  నమ్మకం కలిగే విధంగా నీ శిరోరత్నాన్ని నాకు ప్రసాదించవలసింది అని అతడు పలుకగా సీత ఇలా చెప్పింది.

సీతమ్మకు పైన జరిగిన సంభాషణ ద్వారా  హనుమంతునిపై 95 శాతం నమ్మకం కలిగింది,  కాని 100 శాతం నమ్మక కలిగిన తరువాతనే ఆమె తన వద్ద ఉన్న  అపురూపమైన ఆధారాన్ని హనుమంతునికి ఇవ్వాలి. ఇలాంటపుడు మనకు ఈ క్రింది శ్లోకం గుర్తుకు వస్తుంది. 

చక్షుపూతం న్యసేత్పాదం వస్త్ర పూతం జలం పిబేత్  /

సత్యపూతాం వదేద్వాణీం మనఃపూతం సమాచరేత్  //  చాణక్యనీతి

పై శ్లోకంలో చెప్పినట్లుగా మనకు 100 శాతం నమ్మకం కలగకుండా  ఎవరినీ నమ్మరాదు. ఎందుకంటే ఎవరైన అవసరంలో ఉన్నారని చెప్పి మానవతతో సహాయం చేయడానికి వచ్చేవారితో పాటుగా మోసగిద్దామని వచ్చేవారు కూడా ఉంటారు.  అందులోని సీతమ్మ రాక్షసుల నడుమ ఉన్నది. ఎవరైనా వచ్చి నన్ను రాముడే పంపించాడని నమ్మిక పుట్టునట్లుగా మాయమాటలు చెప్పి మోసగించవచ్చు.      

పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం /

వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయో ముఖం//  అన్నట్లుగా  

ఇటువంటి తీపి మాటలు విని ప్రస్తుత ప్రపంచంలో మోసపోయిన వనితలెందరో ఉన్నారని దినపత్రికలలోను, ప్రసార మాధ్యమాలలోను చూస్తున్నాము.  అందువలన    “సర్వదా ఆవిచారితం కర్మ న కర్తవ్యం.”   అనగా పూర్తిగా విచారింపని పని చేయరాదు అనే ఆర్యోక్తిననుసరించి సీతమ్మ సందేహ నివృత్తికై  ఈ విధంగా ప్రశ్నించి ఆధునిక స్త్రీలకు మరియు సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఆ పద్యమును క్రింది చూడవచ్చు.

                      నా నాథు క్షేమ మంతయు

                      ధీనిధి! నీచేత వింటిఁ దెలియఁగ, నైనన్

                      నీ నిజ రూపము చూడక

                      నే నా రత్నంబు నమ్మి నీ కీయఁ జుమీ!

నా భర్త క్షేమసమాచారాన్ని నీ ద్వారా విన్నాను.  అయినా నీ అసలు స్వరూపాన్ని చూడకుండా నిన్ను నమ్మి, నా రత్నాన్ని నీకు ఇవ్వలేను అని పలికింది. అప్పుడు ఆ ఆంజనేయుడు తన నిజరూపమును చూపించిన పద్యమును క్రింద చూడవచ్చు.

                      చుక్కలు తల పూవులుగా

                      నక్కజముగ మేను పెంచి యంబర వీథిన్

                      వెక్కసమై చూపట్టిన

                      నక్కోమలి ముదము నొందె నాత్మస్థితికిన్

నక్షత్రాలు తలలో పువ్వులుగా కనిపించే విధంగా ఆశ్చర్యకరంగా అతడు ఆకాశంలోనికి శరీరాన్ని పెంచగా అది చూచి సీతమ్మ తన మనసులో చాలా సంతోషించింది.  రాముని వెంట ఉన్నవారు ఎలాంటి యోధులో హనుమంతుని (ఆప్తవచన ప్రమాణం) ద్వారా సీత తెలుసుకుంది.

ఆంజనేయుడు అష్టసిద్ధులు పొందినవాడని, మహాత్ముడని, మహనీయుడని సీతమ్మ ప్రత్యక్ష, ఆప్తవచన ప్రమాణాల  (1. ఆంజనేయుడు సీతాదేవికి చిన్నరూపంలో కనబడడం. 2. పిదప తన శరీరాన్ని పెద్ద ఎత్తుగా పెంచడం 3. తిరిగి మామూలు రూపం పొందడం, 4. సముద్రాన్ని సైతం అవలీలగా దాటడం, 5. బిక్షు రూపంలో రావడం ఇవన్నీ అణిమాది సిద్ధలను గూర్చి తెలియజేసే సంఘటనలు) ద్వారా తెలుసుకున్నది.  అప్పుడు సీతమ్మకు ఆంజనేయుని పట్ల 100 శాతం నమ్మకం కలిగింది. తన శిరోరత్నాన్ని ఆంజనేయునికి ఇచ్చింది. సూర్యవంశాని చంద్రుని వంటివాడైన ఆ రాముని క్షేమాన్ని చాలా విన్నాను.  రకరకాలైన నా బాధలను ఆ భూపతికి సరిగ్గా చెప్పగలవాడవైన నీకు నేను ఏవిధంగాను గొప్ప ఉపకారం తిరిగి చేయలేను.  ఈ లోకంలో నీవు బ్రహ్మకల్పం వరకు వర్ధిల్లమని ఆశీర్వదించింది.

ముగింపు:

  • కొత్తగా వచ్చినవారి పట్ల ప్రతి స్త్రీ ఇంత జాగ్రత్తగా ఉండాలని సీతమ్మ సమాజానికి ఒక గొప్ప సందేశాన్నిచ్చింది.  ఇలాంటి దార్శనికతా లోపం వల్ల ఈనాడు ఆనేకమంది స్త్రీలు మోసపోతున్నారు.
  • నేటి సమాజంలో “నిర్భయ”, “దిశ” చట్టాలు ఇలాంటి వాటినుద్దేశించి చేసిన చట్టాలే.  భవిష్యత్తులో ఏ ఒక్క స్త్రీ కూడా మోసపోకుండా ఉండాలంటే సీతమ్మతల్లిని ఆదర్శంగా తీసుకొని తీరాల్సిందే. 
  • సూర్యుడు కేంద్రంగా సాగింది రామాయణం. రామునిది – సూర్యవంశం, సుగ్రీవుడు – సూర్యనందనుడు. హనుమంతుడు – సూర్య శిష్యుడు. ఇలా ఈ ముగ్గురి కలయిక ద్వారా జరిగింది రామాయణం. ఆ యా వృత్తాంతాలను మొల్ల దార్శనికంగా చిత్రించి తెలుగు సాహిత్యంలో, రామయణ కవిపంక్తుల్లో శాశ్వతస్థానం సంపాదించుకుంది.

ఉపయుక్త గ్రంథసూచి:     

  1. ఈశ్వరకృష్ణ. సాంఖ్యకారికా. భారతీయవిద్యాప్రకాశన్. 2015.
  2. చాణక్యుడు. చాణక్యనీతి. హే హౌస్ ఇండియా. www.diamondbook.in
  3. నారాయణపండితుడు, హితోపదేశః రాజ్ పాల్ అండ్ సన్స్. 1912.
  4. మొల్ల, రామాయణం- సుందరకాండ. రామా అండ్ కో, ఏలూరు. 1911.
  5. విష్ణుశర్మ. పంచతంత్రం. మాపుల్ ప్రెస్. నొయిడా. 2020.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]