AUCHITHYAM | Volume-04 | Issue-02 | February 2023 | ISSN: 2583-4797
6. లబాన్ (మథుర) బంజారాలు: జీవనవిధానాలు
ఆచార్య కరిమిండ్ల లావణ్య
అధ్యక్షులు, తెలుగు అధ్యయనశాఖ
ప్రిన్సిపాల్, తెలంగాణ విశ్వవిద్యాలయం (సౌత్ క్యాంపస్)
నిజామాబాద్–503 322, తెలంగాణ
సెల్: +91 98484 10244. Email: lavanyakarimindla@gmail.com
Download PDF
Keywords: లబాన్, పురతన సంస్కృతి, పురోభివృద్ధి, పారిశ్రామిక సంస్కృతి, పన్నులు, పశుపోషణ, నిర్భాగ్య జీవితాలు, మానసిక క్షోభ, ఆచార వ్యవహారాలు, ప్రభుత్వ పథకాలు, సాహితీ వస్తువులు, ఆహార్యం, గుడిసెలు, పండుగలు, వేషధారణ.
ఉపోద్ఘాతం:
ఉత్తర భారతదేశానికి చెందిన ఒక ప్రత్యేక గిరిజన తెగ. తెలంగాణ ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు. ప్రత్యేక జీవన విధానాన్ని కలిగి ఉంటారు. అందుకుగాను క్షేత్ర పర్యటన ద్వారా వారి జీవన విధానాన్ని ప్రణాళిక యుక్తంగా వ్యాసాన్ని రచించటం.
జాతిపరంగా, సంస్కృతి పరంగా, భాషా పరంగా ప్రపంచమంతా ఒకే లక్ష్యాన్ని, ఏకత్వాన్ని సాధించడానికి కృషి జరుగుతున్నది. ప్రపంచమంతా ఏకత్వం వైపు ప్రయాణిస్తున్నది. ఈ ప్రయాణానికి కోణాలు చాలా ఉన్నాయి. వాటిలో అవరోధాలు, కష్టాలు, కన్నీళ్ళున్నాయి. పురాతన సంస్కృతులు నశించిపోతున్నాయి. ఆ పురాతన సంస్కృతుల్లో ఆదిమ, గిరిజన తెగలు ప్రధానమైనవి. ఈ తెగలవారు యంత్రపూర్వయుగ ఆర్థికవ్యవస్థలోనే ఇప్పటికీ నివసిస్తున్నారు. నాగరికతకు దూరంగా ఉండి సామాజిక ఆచారాలను అనుసరిస్తున్నారు. వారి భాషకు లిపిలేదు.భాష కూడా అంతగా అభివృద్ధి చెందిందికాదు.
ఆదిమతెగల ఆర్థిక జీవనాన్ని ప్రాతిపదికగా చేసుకొని వర్గీకరణ చేసిన ఆడమ్‌స్మిత్ శాస్త్రీయవర్గీకరణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గిరిజనుల్లో ‘‘పశుపాలక సంబంధిత తెగలు’’న్నాయి. ఈ తెగకు చెందినవారే లబాన్ (మథుర) బంజారాలు. వీరు అడవులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న తెలంగాణలోని జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో మథుర (లబాన్) బంజారాలు నివసిస్తున్నారు. లబాన్ (మథుర) బంజారాలు స్థానిక బంజారాలతో కలిసే జీవనం గడుపుతున్నారు. జీవనవిధానంలో, వేషధారణలో, ఆహార పద్ధతుల్లో బంజారాలకు భిన్నంగా ఉంది. అందుకే ఒక ప్రత్యేకమైన తెగగా లబాన్ (మథుర) బంజారాలను చెప్పుకోవచ్చు.
లబాన్ బంజారాలు అక్బర్ చక్రవర్తి పరిపాలనా కాలంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అధిక పన్నులు విధించడంతో, ఆయా ప్రాంతాలను వదిలివారి జీవనానికి అనువైన ప్రాంతాలను ఎంచుకొని నివాసాలు ఏర్పరచుకున్నారు. లబాన్ బంజారాలపై అక్బర్ అధిక పన్నులు విధించడానికి కారణముంది. సముద్ర తీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సాల్లో ఉన్న లబాన్ బంజారాలు నాటి నాగరిక సమాజానికి దగ్గరై, తీరప్రాంతాల్లో లభించే ఉప్పును అమ్ముతూ గ్రామాల్లో సంచరించేవారు. ఈ బంజారాలు అమ్మే ఉప్పుపై అక్బర్ అధిక పన్నులు విధించాడు. సహజ వనరులైన కుంకుడుకాయలు, బంక,తేనె, ఔషధ మూలికలపై కూడ ఎక్కువ పన్నులు వసూలు చేసేవారు. ఆ పన్నులను కట్టలేకగ్రామాల్లో ఉప్పును అమ్ముతూ, సంచరిస్తూ వారికి అనువైన ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ‘‘లవణ్’’ పదమే లబాన్‌గా మారి ఉంటుందని విశ్లేషకుల, పరిశోధకుల అభిప్రాయం.
బన్ అంటే ఉర్దూలో అడవి అని అర్థం. జారా అంటే జీనేవాలే అని అర్థం. జంగల్ మే జీనేవాలే అంటే అడవిలో బతికే వాళ్ళు కాబట్టి వీరికి ‘‘బంజారా’’ అని పేరు వచ్చిందని ఆంత్రోపాలజిస్టుల, భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో వందలాది ఆవులున్నాయి. బంజారాలు, లబాన్ బంజారాలు సమాన స్థాయిలో జీవనాన్ని గడుపుతున్నా మమ్మల్ని ఎందుకు గుర్తించడంలేదని నిజామాబాద్ జిల్లా గాంధారి మండలంలోని చద్మల్, గురుజాల్, నేరల్, బీర్మల్‌తాండా, గొల్లాడి తాండా, తిప్పారం తాండా, పేట్ సంగెం తాండ, నాగులూరు తాండ, నోసీరాంతాండ, దుబ్బ తాండ, బాన్స్‌వాడ మండలంలోని చింతల్‌పేట తాండ, వర్ని మండలంలోని సిద్దాపూర్ తాండ, గోకుల్‌దాస్ తాండ, బిచ్కుంద మండలంలోని సుమారు 15 తాండాలు, పిట్లంమండలంలోని 8 తాండాల లబాన్ బంజారా ప్రజలు మరియు ప్రక్క జిల్లాలయిన అదిలాబాద్, మెదక్‌లలో అక్కడక్కడ నివసిస్తున్న వీరు బంజారాలకు (ST) సరిసమానంగా ప్రభుత్వ తోడ్పాటుకు నోచుకోలేక ప్రభుత్వ పథకాలను అందుకోలేని నిర్భాగ్య జీవితాలను గడుపుతూ, నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
విషయ వివరణ:
‘‘సంస్కృతి’’ అనేది తరతరాల మానవుల యొక్క అనుభవసారం. ‘‘మానవుని సామాజిక జీవితంలో ముడిపడిన నమ్మకాలు, కట్టుబాట్లు, నీతినియమాలు, ఆచారవ్యవహారాలు, ప్రవర్తనా విధానం, ఆలోచనా సరళి తదితర విధి విధానాలను విశ్లేషించేదే, ఆచరించేదే సంస్కృతి’’. ‘‘జంతువుల్లోలేని, మానవుల్లో మాత్రమే కనిపించే ఆభరణం సంస్కృతి’’. ఈ సంస్కృతిలోని అంతర్భాగాలే సాహితీ వస్తువులు. ఈ సంస్కృతిలోని అంతర్భాగాల గురించి క్లాక్ విస్లర్ శాస్త్రవేత్త అభిప్రాయం ఇలా ఉంది. ‘‘భాష, ఆహారం, గృహం, రవాణా సదుపాయాలు, రక్షణ, వేషభాషలు, పరిశ్రమలు, మతం, కళలు, పుక్కిటి పురాణాలు, శాస్త్రీయ విజ్ఞానం, కర్మకాండ, మూఢనమ్మకాలు, కుటుంబ వ్యవహారాలు, వివాహం, సామాజిక నియంత్రణ, ఆస్తి విలువ, మారకం, ప్రభుత్వం, చట్టం, యుద్ధాలతో’’ సాంస్క ృతిక మానవ నిర్మాణం జరుగుతుందని క్లాక్ విస్లర్ అభిప్రాయం. మనిషి జీవనానికి ప్రతిబింబకాలుగా పై ఈ అంశాలన్నీ తోడ్పడుతాయి.
లబాన్ బంజారాల సామాజిక జీవన విధానం:
లబాన్ బంజారాలు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో, ఊరికి దూరంగా, కొండకోనల్లో జీవిస్తుంటారు. వీరి నివాసాలను ‘‘తాండా’’లు అని పిలుస్తారు. ‘‘తాండా’’ అంటే సరుకు నింపిన గోనె సంచుల సమూహమని నిఘంటువులు అర్థాన్నిస్తున్నాయి. దండి –దశకుమార చరిత్రలో‘‘తాండా’’ల ప్రస్తావన కన్పిస్తున్నది. తాండా ప్రజలు తాండా నాయకున్ని ఎన్నుకొని, ఆయన అదుపు ఆజ్ఞలో నివసిస్తారు. తమ ఆచార వ్యవహారాలను, సంస్కారాలను నియమంగా ఆచరిస్తారు, పాటిస్తారు. కష్టసుఖాల్లో కలిసి జీవిస్తారు. వేంకటేశ్వరున్ని దైవంగా నమ్మే లబాన్ బంజారాలు తమ నాయకున్ని సైతం దైవమంత గొప్పగా కొలుస్తారు. పారదర్శక విలువలకు ప్రాధాన్యాన్ని కల్పిస్తూ జీవనం సాగిస్తారు.
లబాన్ బంజారాల భాష- వ్యాప్తి:
ప్రపంచంలోని పది భాషా కుటుంబాల్లో పెద్దది ఇండో –ఆర్యన్ భాషా కుటుంబం.లబాన్ బంజారా భాష ఈ భాషా కుటుంబానికే చెందుతుందని భాషాశాస్త్రవేత్తలు నిర్ణయించారు. భాషా శాస్త్రవేత్తలు భౌగోళికంగా, వర్ణ, పద నిర్మాణాన్ని అనుసరించి ఇండో –ఆర్యన్ భాషా కుటుంబంలోకి చేర్చారు. భాషే భావ ప్రకటనకు ఉపయోగపడుతుంది. భాషా పద నిర్మాణంతోనే సాహిత్యం వెలువడుతుంది. లబాన్ బంజారాలకు బతుకునిచ్చిన పశుసంపద, వ్యవసాయ పదాలను, వస్త్రధారణకు చెందిన పదాలు పరిశీలిద్దాం.
నార్యా = ఎద్దు, బేస్య = బర్రె, జిగిలియో = అంగీ, పోల్క = జాకెట్, కరాడీ = గొడ్డలి, నాంగరా=నాగలి. తదితర పదాలతో నిర్మితమైన భాష లబాన్ బంజారాల జీవన సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుంది.
తెలంగాణలోని నిజామాబాదు జిల్లా, గాంధారి మండలంలోని గులామ్‌సింగ్ అందించిన వివరాల ప్రకారం రెండు బంజారా భాషల్లో మార్పు కనిపించింది.
సంఖ్య తెలుగు లంబాడీ మథుర లంబాడీ
1 లేదు ఛేని, ఛేయి ఛేకో
2 ఎక్కడికి వెళ్ళుతావు? కెవడిగో? కూచో గో జారో
3 వడ్లు ధాన్ నాంజ్
లబాన్ బంజారాలు- ఆర్థిక వ్యవస్థాపన:
అటవీ సంపద దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానపాత్ర పోషిస్తుంది. అడవులు వాతావరణాన్ని, వర్షపాతాన్ని నియంత్రిస్తాయి. అడవుల్లో లభించే కలప, ఇతర ఉత్పత్తులు వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా ఉపయోగపడుతాయి. అనేక జీవ, జంతుజాలాలకు ఆవాసమయిన అడవులు పర్యావరణ సమతూకాన్ని కాపాడుతాయి. మందుల తయారీకి అవసరమయిన అనేక మూలికలు అడవుల నుంచే లభిస్తున్నాయి. లబాన్ బంజారాల ఆర్థిక వ్యవస్థాపనకు అనేక అటవీ ఉత్పత్తులు తోడ్పడుతున్నాయి.
చీపుళ్ళు, విస్తర్లు, ఆకులు, చింతపండు, బంక, తునికాకు, తేనె, కరక్కాయలు, కుంకుడు కాయలు, సీతాఫలాలు తదితర అనేక ఉత్పత్తులు అవి సరైన పక్వానికి వచ్చిన తరువాత దేవతలను ప్రార్థించి, పూజించి సేకరించి అమ్ముతారు. ఈ సహజవనరులను అమ్ముకోగా వచ్చిన ఆదాయంతో జీవనం గడుపుతారు. బంజారాలు పశుపోషకులు. కాబట్టి సంచార జీవనానికి స్వస్తి చెప్పిన తరువాత స్థిర నివాసాలు ఏర్పరచుకొని పశుపోషణ, వ్యవసాయం చేస్తున్నారు. పాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తూ, ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. వీరి సంస్కృతిలో భాగంగా వివాహ సమయంలో వరునికి ఆవులను కట్నంగా ఇస్తారు. పశుపోషణ ఆధారం చేసుకొని జీవనం గడపడానికి ఒక ఆధారాన్ని కల్పిస్తారు.వ్యవసాయంలో ప్రధాన పంటలు జొన్న, మొక్కజొన్న, చెరుకు, వేరుశనగ తదితరాలు. నిజామాబాదు జిల్లాలో ముఖ్య పంట చెరుకు. ఈ చెరుకు నాటే సమయంలో, పక్వానికి వచ్చిన తరువాత చెరుకు కొట్టే సమయంలో, లబాన్ బంజారాలు చెరుకు పండిరచే ప్రాంతాలకు వలస వెళతారు. చెరుకు తోటల పనికి పూర్తిగా లబాన్ బంజారాలే వెళుతారు. సంవత్సరంలో రెండు మూడు నెలలు చెరుకు ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటారు.
లబాన్ బంజారాలు- గృహ నిర్మాణం:
లబాన్ బంజారాల గృహ నిర్మాణం వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను ఆధారం చేసుకొని నిర్మించబడుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సూచిస్తూ గృహనిర్మాణం చేయబడుతుంది.వీరికి వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు తెలుసు. బాగా నమ్ముతారు కూడ. అర్థచంద్రాకారం, చతురస్రాకార గుడిసెల్లో నివసిస్తారు. ఈ గుడిసెలకు మట్టిగోడలు గాని మట్టి పూతతో చేసిన తడికెలు లేదా వెదురు గోడలుంటాయి. వాటిని ఎర్రమట్టితో సుందరంగా అలంకరిస్తారు. గుడిసె పైకప్పు గడ్డితో కప్పుతారు.ఎండాకాలంలో చల్లదనాన్ని పొందడానికి గడ్డి తోడ్పడుతుంది.
లబాన్ బంజారాలు- వివాహ పద్ధతులు:
పూర్వకాలపు కన్యాశుల్క ఆచారం నుంచి నేటి వరకట్నపు ఆచారం వరకు కట్నం తీసుకోవడంగాని, ఇవ్వడంగాని లబాన్ బంజారాల్లో లేదు. లబాన్ బంజారాల్లో బాల్య వివాహాలులేవు. వివాహాలను సంప్రదాయబద్ధంగా ఐదు రోజులు చేస్తారు. మేనరికపు వివాహాలుంటాయి. పెళ్ళికి ముందు వధువు తల్లిదండ్రులు వరున్ని తమ ఇంట్లోనే ఒక నెలరోజులు పెట్టుకొని అతని గుణ గణాలను పరీక్షిస్తారు.
ఇంతవరకు తెలుగు సాహిత్యంలో లబాన్ బంజారాల సాహిత్యం వెలువడలేదు. కాని, బంజారా సంస్కృతికి బాగా దగ్గరగా ఉన్న సంస్కృతే లబాన్ బంజారాలది కూడ.
లబాన్ బంజారాలు – కుటుంబ వ్యవస్థ:
లబాన్ బంజారాల్లో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ. తండ్రే ఇంటి పెద్ద. పితృస్వామ్య వ్యవస్థ. బహుభార్యత్వం లేదు. ఒకవేళ సంతానం కాకుంటే, యుక్తవయస్సులో భార్య మరణిస్తే మళ్ళీ వివాహం చేసుకునే సంప్రదాయం ఉంది. ఈ కుటుంబంలోని ఏ ఒక్కరికి ఆపద వచ్చినా అందరిదిగా పంచుకొని పరిష్కారం చేసుకుంటారు. వివాద రహిత కుటుంబాలు లబాన్ బంజారాలవి.
మొదట ఒక జాతి, ఒక ప్రాంతం. ఒక దేశ సంస్కృతి కుటుంబం నుంచే ప్రారంభమవుతుంది. ఆ సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు, పండుగలు, విశ్వాసాలు, నియమాలు, ఆయా కుటుంబ పద్ధతులను బట్టి నిర్ణయించబడుతాయి. ఈ ఆచార సంప్రదాయాలు, నియమాలు మనిషి స్వభావాన్ని నిర్ణయిస్తాయి.
లబాన్ బంజారాల కుటుంబ నేపథ్య కథను పరిశీలించినపుడు వారిలో ఉండే ఆప్యాయతలు, ప్రేమలు తెలుస్తాయి. ఒక కుటుంబంలో తాత, తండ్రి, మనుమడు ఉంటారు. వారంతా కలిసే ఉంటారు. లబాన్ బంజారాలు కష్టించే మనస్తత్వం కలవారు కాబట్టి తాత ముసలివాడైనా కూడ కట్టెలు కొట్టడానికి అడవికి వెళతాడు. సాయంత్రానికి తిరిగి రాని తాత గురించి తండ్రి, మనుమడు ఎంతో మనోవేదనను అనుభవిస్తారు. తాత చిరుతపులి బారి నుండి తనను తాను రక్షించుకోవడానికి చెట్టుపైకి ఎక్కుతాడు. చివరికి లాంతరు సహాయంతో అడవిలో వెతికి, వెతికి తాతను రక్షిస్తారు తాండా వాసులు. అయితే, కథ చిన్నదే. తెలిసిందే. కాని, తండ్రీ, మనుమలు తాతకోసం పడే వేదనను నిజామాబాద్ జిల్లాలోని ‘‘చద్మల్’’ తాండావాసియైన గులామ్ సింగ్ చెప్పే తీరు అద్భుతంగా ఉంది. తానే ఆ కష్టం నుంచి బయట పడినట్లుగా కథకుడు కథను వివరించాడు.
లబాన్ బంజారాలు – పండుగలు:
లబాన్ బంజారాలు కుటుంబానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారని చెప్పడానికి వారు జరుపుకునే పండుగలే ప్రధాన సాక్ష్యాలు. హోళీ, రాఖీ పండుగలు ప్రధానంగా జరుపుకుంటారు.అన్నాచెల్లెల అనుబంధం కొనసాగడానికి చిహ్నంగా ప్రతీయేటా రాఖీ సంబరాలు చేసుకుంటారు.ఆటతో, పాటతో ఈ సంబరాలు కొనసాగుతాయి. ‘‘జోలాయిడే సోనో రూసో/ హేరే హేరియో సోనో’’ అంటూ బంగారంతో అన్నా చెల్లెళ్ళు అనుబంధాన్ని ముడివేస్తూ పాటలు పాడుతారు.
సామూహిక సామాజిక నేపథ్యంలో హోళీ పండుగ జరుపుకుంటారు. తాండాలోని అన్ని కుటుంబాల, అన్ని వయస్సుల వాళ్ళు ఈ సంబరాల్లో పాల్గొంటారు. ప్రతి తాండాలో బాలాజీ గుడి కట్టుకొని పూజలు నిర్వహిస్తారు. రోజుల తరబడి అలసిపోయిన కుటుంబం వారికి ఈ పండుగ ఆటవిడుపు. లబాన్ బంజారాల్లో వేదాంత ధోరణి కనిపిస్తుంది. కాబట్టి మళ్లీ పండుగ చేసుకునే వరకు ఉండేవారెవరో, పోయేవారెవరో అనే వేదాంత భావనతో ఆనందాన్ని ఒకరికొకరు పంచుకుంటారు.
లబాన్ బంజారాల కళలు – వృత్తులు:
పాటలు, అల్లికలు, కుట్లు, కేశాలంకరణ రకాలు, గృహాలంకరణ, వస్త్రాలంకరణ, జానపద బాణీతో ఆటలు, పాటలు, బ్యాండ్‌మేళాలు తదితర అనేక కళలు లబాన్ బంజారాల్లో ఉన్నాయి. గృహాలంకరణ, కేశాలంకరణ ఎంతో అందంగా తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తుంది. వారు ధరించే వస్త్రాలు విభిన్నంగా ఉన్నా, రంగు రంగుల దారాలతో కుట్టిన అద్దాలు వస్త్రానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి.
కమ్మరి, వడ్రంగి, కుమ్మరి, కంసాలీ, పురోహితులు వంటి వృత్తుల వాళ్ళు లబాన్ బంజారాల్లో ఉన్నారు. వీరిలో భగత్ అనే బ్రాహ్మణులతో సమానమైన కులం ఉంది. వీరు పౌరోహిత్యం చేస్తారు. పశుపోషణ, కులవృత్తులు వీరి జీవనానికి తోడ్పడుతాయి. మంజు, బస్సి, గజ్ను, తగిర్యా, పేడియా, లికిడ్యా, పఠాన్, పేడ్యా గోత్రనామాలను కలిగి ఉంటారు. వారి గోత్రనామాలను ఆధారం చేసుకొని వృత్తులను స్వీకరిస్తారు.
లబాన్ బంజారాలు – వేషధారణ:
లబాన్ బంజారాలను గుర్తించడానికి బీడ్, ఖేట్ల, ధర్ ముఖ్యమైన ఆధారాలు. ఇవి చెవికి ఆభరణాలుగా ధరిస్తారు. ఇవి చాలా బరువుగా ఉంటాయి. వెండితోగాని, బంగారంతోగాని చేయబడి ఉంటాయి. ‘‘చుండై’’ జుట్టుకు ధరించేది. జుట్టుపైన నడినెత్తిపై ప్రత్యేక అలంకరణ ఉంటుంది. కోన్ ఆకారంలో ఉండే ఈ అలంకరణ ప్రత్యేక లక్షణం లబాన్ బంజారా స్త్రీలది.కాళ్ళకు బరువైన కడియాలు ధరిస్తారు. మూడు రకాలుగా ఉంటాయి. మెడలో సంప్రదాయంగా వస్తున్న పూసల దండలు ధరిస్తారు. నాటి నుండి ఆచారంగా ధరిస్తారు లబాన్ బంజారా స్త్రీలు.వీరు వేషధారణపై అద్భుతమైన కథలు చెబుతారు. ఈ కథలు సుధీర్ఘంగా, చమత్కారంగా, హాస్యభరితంగా సాగుతాయి. మెడలో రూపాయి బిళ్ళలతో చేసిన దండను వేసుకుంటారు. ఈ రూపాయి బిళ్ళలు ఈనాటివి కావు. ఔరంగజేబు కాలంలో ముద్రించినవి.
లబాన్ బంజారాలు –శాస్త్రీయ విజ్ఞానం:
అడవుల్లో ఉన్న చెట్లనుంచి లభించే ఔషధాలను జ్వరం, పసరికలకు వాడుతారు. పాముకాటుకు, తేలు కాటుకు, ఇతర రోగాలకు అనేక ఔషధాలను సహజ వనరుల నుంచి సేకరించి ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యతనిస్తారు. ఆవు మూత్రంతో ఇల్లు అలకడం వల్ల రోగాలు రాకుండా ఉంటాయని వీరి నమ్మకం.
ఈ అంశాలే కాకుండ లబాన్ బంజారాలు పుక్కిటి పురాణ గాథలను చలోక్తిగా, అర్థవంతంగా చెబుతారు. లబాన్ బంజారాల రక్షణ, సామాజిక నియంత్రణ, ఆహార పద్ధతులు, బంజారా –బంజారేతరుల పద్ధతుల్లో మార్పులు మతం, ఆస్తి విలువలు, బంధుత్వాలు, వివిధ వర్గాలు, కర్మకాండలు, స్వాతంత్య్రంకు పూర్వం లబాన్ బంజారాల జీవనం,స్వాతంత్య్రం తరువాత లబాన్ బంజారాల జీవన విధానం, ప్రభుత్వ సహకారం, చట్టం, తదితర అనేక అంశాలు పరిశీలనలోకి తీసుకొని పరిశోధించాలి.
ముగింపు:
భారతదేశంలో 1990 తర్వాతే వ్యక్తి ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణ రేటు వృద్ధిలోకి వచ్చింది. అలాగే లబాన్ బంజారాల్లో కూడ 1980–90 ల నుండే జీవన ప్రమాణ స్థాయిలో గణనీయమైన మార్పులొచ్చాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లబాన్ బంజారాల అభివృద్ధికి తోడ్పడడానికి అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చి ఆర్థిక ఫలాలను అందజేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి మార్గదర్శక సూత్రాలను అనుసరించి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే బంజారాల జీవనాభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిస్తూ, వారి జీవన ప్రమాణాన్ని పెంచే క్రమంలో ఆర్థికంగా పెద్దపీట వేశారు. మనమంతా 21వ శతాబ్దంలో ఆర్థిక అసమానతలను తొలగించుకొని పంచవర్ష ప్రణాళిక పద్ధతుల్లో నాగరిక సమాజాన్ని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకొని సహకరించుకుంటూ ముందుకు వెళ్ళినపుడు, సమాజంలో సమాన అవకాశాలు కల్పిస్తేనే లబాన్ బంజారాల –బంజారాల సమాజం అభివృద్ధి చెందుతాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో అటవీ సంపదనేమి కోల్పోం. సహజ వనరులతో, పచ్చని ప్రకృతితో, అటవీ సంపదతో దేశం అభివృద్ధి పథంలో నడవడానికి దోహదపడుతుంది.
ఆథార గ్రంథాలు:
- గోనానాయక్, యం. భారతదేశంలో బంజారాలు తెలుగు అకాడమి: హైదరాబాదు. 2005.
- గోనానాయక్, యం. సుగాలి సంస్కృతి భాషా సాహిత్యాలు. పద్మశ్రీ గ్రాఫిక్స్, 2002, ఫిబ్రవరి.
- శంకరయ్య, జనపాల. తెలుగు లంబాడీల గేయ సాహిత్యం జనపాల వారి ప్రచురణలు: ఆవునూరు, 2001, నవంబరు
- తిరుమలరావు, జయధీర్ ప్ర॥ సం॥, డా॥ జె. రాజారాం సం॥ బంజార మౌఖిక కథలు – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం : హైదరాబాదు, 2009
- నదీం హస్‌నైన్. భారతీయ గిరిజనులు. ఓరియంట్ లాఙ్మన్ 1995
- సూర్యాధనంజయ్, నల్లగొండ జిల్లా బంజారాసాహిత్యం. జీవనచిత్రణ, శీతల్ పబ్లికేషన్స్: హైదరాబాద్ 2009
- క్షేత్ర పర్యటన
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.