headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-02 | February 2023 | ISSN: 2583-4797

4. తెలంగాణ సాహిత్యపీఠికలు: ప్రాంతీయదృక్పథం

ఐనాల భరత్

రీసెర్చ్ స్కాలర్ (యూ.జి.సి సీనియర్ రీసెర్చ్ ఫెలో,
స్కూల్ అఫ్ హ్యుమానిటీస్ తెలుగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం.
హైదరాబాదు, తెలంగాణా
సెల్: +91 9640266152. Email: inalabharathkumar@gmail.com

Download PDF


Keywords: ప్రాంతీయకవిత్వస్పృహ, విరసంపాత్ర, పీఠికలు, ప్రాంతీయత, ఐనాల భరత్

1. ఉపోద్ఘాతం:

1.1 ప్రాంతీయత-పరిచయం:

ప్రాంతీయ స్పృహతో ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను, అసమానతలను, ఆన్యాయాలను నిరసిస్తూ లేదా ఖండిస్తూ వచ్చిన సాహిత్యం, ప్రాంతీయ సాహిత్యం. ఈ సాహిత్యంలో ఈ ప్రాంతానికే పరిమితంగా ఉన్నటువంటి సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు అన్ని ఇందులో మిళితం అవుతాయి. ఈ ప్రాంతీయత అనే అంశాన్ని  భౌగోళికంగా చూసినప్పుడు ఒక నిర్దేశిత సరిహద్దులు,  చారిత్రకంగా శతాబ్దల కాలంగా ఒకే రాజకీయ పాలనలో ఉండడం ఆర్థికంగా ఒక ఉత్పత్తి విధానం కలిగిన జీవనం ఇవన్ని ప్రాంత అస్తిత్వాన్ని వ్యక్తపరిచే అంశాలు. “ఒక ప్రాంతం ప్రత్యేక ప్రతిపత్తిని కోరుకోవడం, ప్రత్యేక ప్రాంతంగా దేశంగా, రాష్ట్రంగా జన సమూహంగా విడిపోవాలనుకోవడం సామాజిక ఆకాంక్ష అవుతుంది. ఇటువంటి సామాజిక ఆకాంక్షే ప్రాంతీయవాదం అంటారు” (రవికుమార్ దార్ల. తెలుగు కథలలో ప్రాంతీయ చైతన్యం, 2005, పుట:7.) ప్రాంతీయ కవిత్వం పెల్లుబికి రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి తెలంగాణ ప్రాంత బాగోగులు పట్టించుకోకపోవడం, నీళ్ళు, నిధులు, నియామకాలు వంటి విషయలలో తెలంగాణ ప్రాంతానికి ప్రతిసారి మొండిచేయి చూపడంతో అడుగడుగున అన్యాయాలకు, అవమానాలకు గురి చేయడంతో సహించలేని తరుణంలో తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం అయితే తప్పా ఇవన్ని ఆగిపోవు అని బలంగా నమ్మి ప్రత్యేకతెలంగాణ సాధన కోసం ఉద్యమాలు కొనసాగినాయి.

ప్రాంతంలో అభివృద్ధి జరగడంలేదని బ్రతుకులు మారడం లేదని ఉన్న ఊరును కన్నవారిని వదిలి ఇక్కడ చదువుకొని అవకాశాలు వాడుకొని విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడి ఈ ప్రాంత అసమానతలను పట్టించుకోని నాగరికులు ఓ వైపు సమాజంలో ఉన్నారు. మరోవైపు  సమాజంలో చుట్టు ఉన్న మనుషులను కులమతాలకు అతీతంగా ప్రాంతీయ భాషాభేదాలు చర్చకూడా అవసరం లేకుండా, ధనవంతుడు, పేదవాడ్ని, అధికారంలో వున్నవాళ్ళు, ప్రజలను, ఏ విధంగా దోపిడీకి పీడన(పీడించడం)కి  గురి చేస్తారో, దాని వలన వారివారి జీవితాలలో ఎన్ని హింసలు, ఇబ్బందులు ఎదుర్కున్నారో తెలియజేస్తూ దానికి సాహిత్య రూపం ఇవ్వడమే తెలంగాణ కవిత్వంలో మూలసూత్రం.

ఈ విధంగా సాహిత్యం రావడం వల్ల మిగతా వారికి మార్గదర్శన౦ చేయడానికి చేసే ప్రయత్నమే విరసం సాహిత్య ప్రధాన ఉద్దేశ్యం. ఇలా సామాన్యుని పక్షం నిలబడి, వారి అస్తిత్వాన్ని కాపాడటమే విరసం ఆశయంగా చెప్పబడింది. 1969 నుండి 2009 దాకా తొలి మలి విడతలలో ఈ నలబై వసంతాలలో జరిగిన పోరాటాలను ఆ సందర్భాలలో ఎదుర్కున్న ఆటుపోట్లను, పడిలేచిన సన్నివేశాలను, తిరోగమన౦లో కొన్నాళ్ళు,  పురోగమనంలో కొన్నేళ్ళు గడిచిన కాలాన్ని రచయిత అక్షరబద్ధం చేశారు. స్వార్దపూరితమైన నాయకులవలన, స్వలాభాన్ని చూసుకొని  ఉద్యమాన్ని గాలికి వదిలివేయడంవలన ఉద్యమం పట్టు సడలింది.

ఇక్కడి నాయకులు పదవులకు, పైరవీలకు ప్రలోబపడి ఆశయాన్ని నట్టేట ముంచేయడంవల్ల తెలంగాణఆకాంక్ష నెరవేరలేదు. కాని పడ్డ చోటే వెతుక్కోవాలని పోరాట స్పూర్తితో రెట్టించిన ఉత్సాహంతో ‘పట్టుపట్టరాదు, పట్టివిడవరాదు, పట్టివిడుచుటకంటే పడిచచ్చుట మేలు” అన్నట్టు, అంకితభావంతో, అకుంఠితదీక్షతో, అలుపెరగని పోరాటస్పూర్తిని కొనసాగించారు. అమరవీరుల ఆకాంక్షలను, అశయాలను, భుజాన వేసుకొని ఆత్మసాక్షిగా, వారి అత్మబలిదానాలకు అర్థం ఇవ్వడం కోసం నిబద్ధతగా ఉద్యమంలో నిలిచారు. ఒకానొక సందర్భంలో గతంలోలాగానే, నాయకులు కాడి వదిలేసిన, విద్యార్దులు, ఉద్యోగులు, ప్రజాస్వామికవాదులు, సకలజనులుసైతం ముందుకువచ్చి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమం సాగించారు. తర్వాత నాయకులు సిగ్గు తెచ్చుకొని పరువుపోకుండా ఉండడం కోసం, చరిత్రహీనులుగా మిగలకుండా ఉండటానికి, చరిత్రలో తమకోసం ఒక పుట ఉండటంకోసం, దీక్షలుచేసి, పోరాటాలలో నిలిచి బుద్ది మార్చుకున్నారు. ప్రజలంతా ఏకత్రాటిపైకి వచ్చి, తెలంగాణ సాధించేదాకా పట్టు సడలనివ్వలేదు. వదలలేదు. 2009 ప్రకటన తర్వాత మహోద్యమం జరిగి మొక్కవోని ధైర్యాన్ని అందరిలో కల్గించి విజయాన్ని ముద్దాడింది.

2. తెలంగాణ ఉద్యమంలో ‘విరసం’ పాత్ర:

తెలంగాణ ఉద్యమంలో విరసం పాత్రను ప్రత్యేకించి చెప్పుకోవాలి. సమాజంలో అగ్రకుల పెత్తనాన్ని, దోపిడీ, దుర్మార్గాలను, బూర్జువ వర్గలలోని లాభపేక్షసిద్దాంతాలను, ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న నాయకుల/పార్టీల సిద్దాంతాలను విధానాలను ఎండగట్టడంలో విప్లవరచయితల సంఘం కృషి ప్రశ౦సనీయమైనది. సమాజంలో ఏమిజరిగిన పట్టనట్టు, స్తబ్దుగాఉండే మేధావుల మౌనాన్ని ప్రశ్నించారు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ఎంతోకొంత శ్రమిస్తూ, స్పూర్తినిస్తున్న, ప్రజాస్వామిక సంఘంగా ‘విరసం’ఎప్పటికి నిలచిఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో విరసం, సాహిత్య పరంగా క్రియాశీలకపాత్రపోషించి౦ది. సభలు , సమావేశాలు, చర్చలు, ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు కొనసాగించింది. ప్రజాస్వామిక భావజాలం కల్గిన వ్యక్తులచేత, మేధావి వర్గం చేత సాహిత్య సృజనచేసి పుస్తకాలు వెలువరించింది. ఆ రచనలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. భావజాలం ఏదైనా కావచ్చు ఎంతోకొంత పోరాటస్పూర్తి, మనసులో విప్లవస్పృహా లేనిది, ఎవరూ ఏమి చేయలేరు. విప్లవం అనగానే చదవకుండా నిషేధం విధించడం, వారు విద్రోహులు అన్నట్లుగా చూడడం సరికాదు, విప్లవం అంటే మార్పుగానే పరిగణించాలి.

“నడుస్తున్న చరిత్రకు విరసం, విప్లవ రచయితలు కాపలా కాస్తున్నారు. ఒంటినిట్టాడు పూరిగుడిసెలోఒలికిన కన్నీటిని కవిత్వం చేస్తున్నారు. నెత్తురుతో తడిసిన ఆర్ట్స్ కాలేజ్ మెట్ల చైతన్యాన్ని గానం చేస్తున్నారు. కారల్ మార్క్స్(కాకతీయ యూనివర్సిటీ)గా చరిత్రలో నమోదైన స్థలంలో నడయాడిన పాదాలు ముఖ్యమంత్రిని పరిగెత్తించిన సందర్భానికి విరసం కవులు సాక్ష్యంగా నిలబడ్డారు. పొడుస్తున్న ‘మానుకోటల’ను నిర్మిస్తున్నారు. వెల్లరికి తెరిచిన వాకిలిగా మారిన చోట తుది పెనుగులాటను కలంలో నింపిన విరసం కవులు తెలుగు నేలంతా చల్లుకుంటూ తిరిగుతున్నారు. జారిపోయిన జెండాను తిరిగిసిగలో నాటుకున్న తెలంగాణను గో౦తెత్తిపిలుస్తున్నారు.” (సి.కాశీం, తెలంగాణ విరసం కవిత్వం:  పుట;01)       

తెలంగాణపై విరసం కవులు అనేక సంకలనాలనుప్రచురించారు. అన్ని౦టిలో ప్రధాన౦గా ప్రజల బాధల,గాధలను, దుఃఖాన్ని అన్నింటినీ తమ రచనలలో పొందుపరిచారు. “తెలంగాణ రాష్ట్రం ఏర్పాడవల్సిన అవసరాన్ని కవిత్వికరిస్తూనే, తెలంగాణ రాష్ట్రము రావడమ౦టే ఇతరేతర రాష్ట్రాలు ఏర్పడినట్టు కాదని విరసం గుర్తిస్తున్నది. ఈ మట్టి, ఈ పోరాటం మొత్తం దేశానికి, ఒక విధంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.  ఫాక్ష్యనిస్టు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో తెలుగు ప్రజలు చూశారు. ఆ వారసత్వాన్ని తెలంగాణలో విస్తరించాలనే వై.ఎస్. జగన్ చూస్తే మానుకోట వడిసేల రాళ్ల నింపింది.” (సి.కాశీం, తెలంగాణ విరసంకవిత్వం: పుట;03) ఇటువంటి ఎన్నో ఘట్టాలను కవిత్వం చేశారు. వాటిని కాశీం గారు తమ విరసం కవిత్వం అనే గ్రంధానికి రాసిన ముందుమాటలో వర్ణించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో, విశిష్టమైన, ఉదాత్తమైన పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీలలో విద్యార్ధులు అలుపెరుగని పోరాటాలుచేశారు. ఒక్కో యూనివర్సిటీ ఒక్క అగ్నిగుండంగా మండిపోయాయి.  విద్యార్దులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసారు.  మెస్ లను బంద్ పెట్టి, కరంట్ కట్ చేసి ఎన్నో కేసులు పెట్టిన వెనుతిరగని, వెనిక్కి తగ్గని వైనాన్ని, వారిచ్చిన చైతన్యాన్ని, ఊరురా వ్యాపించిన అగ్నిజ్వలనంగా  ఆవిష్కరించారు. ప్రతి ఊరు సంఘటిత౦అయింది. ప్రతి పల్లె పోరాట స్పూర్తిని రగిల్చింది. ఇవన్ని కవిత్వంలో దర్శనంఇచ్చాయి. ఇంత విశాల భావజాలం కల్గిన విరసం గురించి కొంత లోతుగా విశ్లేషణ చేయాల్సిఉంది. తెలంగాణ ప్రాంతంలో పోరాట చైతన్యాన్ని అందించింది ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే’ దాని ఫలితాలు ఎలావున్నా ఎంతోమంది నాయకులను, కవులను, కళాకారులను ఈ సమాజానికి అందించింది. ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టి సాగించిన పోరాటానికి కొన్నాళ్ళ తర్వాత స్తబ్దత ఏర్పడింది.

1970 ఫిబ్రవరి1న విశాకపట్టణ౦లో శ్రీశ్రీ షష్టిపూర్తి సభ జరిగింది. ఈ సభలో ‘రచయితలకు సవాల్’ అనే కరపత్రాన్ని చదివారు. ఈ కరపత్రాలతో సమాజాన్ని ముఖ్యంగా రచయితలను ప్రజల పక్షన నిలవాలి అనే భరోసాను కల్పించారు. “శ్రీశ్రీ  లాంటి పేరున్న కవులను ప్రజలవైపు నిలబెట్టి నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవ పోరాటాలను సమర్థిస్తూ రచయిత సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ముందస్తు ఆలోచన కలిగిన వాళ్ళలో తెలంగాణ కవులుప్రముఖ పాత్ర వహించారు. అట్లా 1970 జూలై 4 న విప్లవ రచయితల సంఘం(విరసం) ఏర్పడింది. ఇందులో తెలంగాణ నుంచి ‘రాత్రి’ సంకలన౦ తెచ్చిన కవులు, దిగంబర కవులు, తిరగబడు కవుల పాత్ర విస్మరించలేనిది.

చెరబండరాజు, వరవరరావు,జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ అగ్రభాగాన నిలబడి విరసం ఏర్పాటు చేసారు. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన చలసాని ప్రసాద్, కె.వి. రమణారెడ్డిలది విరసం ఏర్పాటులో విస్మరించలేని పాత్ర. కాని విరసం ఏర్పాటుకు ఐదేళ్ళ ముందు  నుంచే విప్లవ రాజకీయాలను సాయుధపోరాట పంథాను సమర్థిస్తూ కవిత్వం రాస్తున్నది మాత్రం తెలంగాణ కవులే. కనుక విరసం ఏ రాజకీయ-సైద్ధాంతిక పునాది మీద ఏర్పడిందో ఆ పునాదికి ప్రాతిపదికను తెలంగాణకవులే తయారు చేసారు.” (సి.కాశీం, తెలంగాణ సాహిత్యం: పుట;183-184)   దీన్నిబట్టి అనేక సంఘర్షణల అనంతరం విరసం ఏర్పడిందనేది అర్థం అవుతుంది. ఈ ఏర్పాటులో కూడా ఆనాటి తెలంగాణ కవులు పోషించిన పాత్ర అర్థంచేసుకోవచ్చు. విరసం సృష్టంచిన సాహిత్యం ప్రాంతీయ విభేదాలకు లొంగదు. ఎక్కడ దగాపడ్డ, మనిషి ఉన్నడో, అక్కడ ఆకవిత్వం చేయూత ఇవ్వడానికి ముందుకు సాగుతుంది. ఉత్తరాంధ్రలో జరిగిన గిరిజన ఉద్యమాలకు, తెలంగాణలో జరిగిన సాయుధపోరాటానికి అదే తెగువను అందించింది. పాఠకుల యొక్క మనోధైర్యం పెంచేదిగా సాహిత్యం ఉండాలి. ఈ ప్రాంత యాసను భాషను ఆర్తిని, దుఃఖాన్ని పట్టిఇచ్చే కవిత్వం రాయాలని విరసం భావించింది, అందుకే కవితా పాదాలు వాటియొక్క భావాన్ని దాటుకొని వచ్చి ఉద్యమ నినాదాలుగా గోడలమీద రాతలుగా వాసికెక్కాయి. ఎంతోమంది పాటలు, రూపకాలు, కవిత్వం రాసి విప్లవ కవిత్వాన్ని వెలుగులు విరజిమ్మే కాంతిపుంజంలా ఆవిస్కరించారు. అలాంటి వారిలో శివసాగర్, వరవరరావు, గద్దర్, గోరేటి వెంకన్న, అలిసెట్టి ప్రభాకర్, ఉదయమిత్ర, కాశీం, గూడ అంజయ్య, విమలక్క, నారాయణ స్వామి, లోచన్, అల్లం సోదరులు (అల్లం నారయణ, అల్లం, వీరయ్య) వేముల ఎల్లయ్య, రివేరా వంటి వాళ్ళును ప్రధానంగా చెప్పవచ్చు. ప్రక్రియ ఏదైనా సిద్దాంతాన్ని, వారి ఇజాన్ని, నమ్ముకున్న నిజాన్ని చెప్పడానికి వెనకాడలేదు.

3. తెలంగాణ కవిత్వపీఠిక-ప్రాంతీయ దృక్పథం:

విరసం తరవాత తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో భాగంగా అన్ని రంగాలకు చెందిన సామాన్యులు కవిత్వం రాశారు. అలాంటి కవిత్వం 1990ల తరువాత ప్రాంతీయ చైతన్య౦తో కూడిన కవిత్వం ఈ ప్రాంతంలో అధికంగా వచ్చింది. దీనికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రావడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతకవుల కవిత్వంలో ప్రాంతీయ చైతన్యంతోపాటు సామాజికస్పృహ కొట్టవచ్చినట్టు కన్పిస్తుంది. ముఖ్య౦గా  జూలూరు గౌరీశంకర్, కందుకూరి శ్రీరాములు, సుంకర రమేష్, స్కైబాబా, అన్నవరం దేవేందర్, వనపట్ల సుబ్బయ్య, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, చింతం ప్రవీణ్, అనిశెట్టి రజిత, జ్వలిత, కాసుల ప్రతాపరెడ్డి, నందిని సిధారెడ్డి, వంటి ఎంతోమంది కవుల కవిత్వం అంతటా ప్రాంతీయ చైతన్య స్పృహ, తెలంగాణ అస్తిత్వవాద ఆకాంక్ష దర్శనమిస్తుంది. 

సాధారణ౦గా పీఠికఒక పుస్తకాన్ని, ఆ పుస్తకం రాసిన రచయిత/కవి ప్రతిభా విశేషాల్ని కూడా పరిచయాత్మకంగా అందించడం జరుగుతుంది. ఈ పీఠికలలో పీఠికకర్త శైలిని బట్టి కొన్ని అతివిస్తృతంగా కొన్ని సంక్షిప్త౦గా రాశారు. అన్ని పీఠికలలో సాహిత్య, సామాజిక, చారిత్రక, రాజకియ అంశాలతో పాటు, ఆ రచనలో ఉన్న భాష, శిల్పం, వస్తువు, వంటి అంశాలను పీఠికలు ఎలా విశ్లేషిస్తాయో చెప్పగలగాలి. పీఠిక రచనఒక విమర్శ కళాగా భావించి, మూలగ్రంధాలతో పోల్చి మంచి, చెడుల వివేచనతో పీఠిక రాశారు. అలాంటి విలువలును పీఠికలు నిలిపిఉంచాయి. పీఠికరచన శైలిలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, విశ్వనాధ సత్యనారాయణగారు, వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, సురవరం ప్రతాపరెడ్డిగారు, కపిలవాయి లింగమూర్తి గారు, వంటి మహానుభావులు అందరూ వారి వారి విలక్షణమైన పద్ధతిలో శైలిలో పీఠికలను పరిచయం చేశారు.

కవిత్వానికి, దాన్ని చదివే పాఠకులకు మధ్య ఒక సూత్రదారుడు ఉండాల్సిన అవసరం లేదు. తాను చెప్పదలచుకున్న అన్ని విషయాలను కవి పాఠకునికి వివరించవచ్చు. అలా అనుకునే స్వీయ పీఠికలు కూడా రాసుకున్నారు. కొంతమంది పేరుపొందిన కవులు ఐతే తమ రచనలకు ప్రత్యేకించి పీఠికలు రాయించడం జరగలేదు. అసలు విషయంలోకి కవితాలోకంలోకి నేరుగా తీసుకెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. ఉదాహరణకు ఎన్, గోపి గారి కవిత్వం, శివారెడ్డి గారి కవిత్వం, శివసాగర్ గారి కవిత్వం మలి ముద్రణ సందర్భంలో ప్రచురణకర్తలు,ఒకవేళ గ్రంధకర్తలు ఉండిఉంటే వారి అభిప్రాయాలను మాత్రమే ప్రచురించారు. “ముందుమాట రాయమనగానే కవికి ఆత్మస్థయిర్యం ఇచ్చే పద్దతిలో పొగడ్తలు పూలదండలతో ఉరితీయడం రివాజు అయింది. దీనికి నేను వ్యతిరేకిని. తెలుగు కవితారంగంలో విహరిస్తున్న కవికి ముందుమాట హెచ్చరిక మాత్రమే ఊబి కాకూడదు” (పెన్నా, శివరామకృష్ణ: నిశబ్దం నా మాతృక, పుట:04) అన్నారు. ఈ మాటలను బట్టి కవిత్వ౦ ఎలా ఉంది దాని సామర్ధ్యం, స్థాయిని నిర్ణాయి౦చ వలసింది అక్కున చేర్చుకోవాల్సింది పాఠకులే అనే విషయాన్ని శివారెడ్డిగారు స్పష్టపరిచారు.

తెలంగాణ అస్తిత్వవాదానికి మద్దతు కూడా గట్టే ప్రయత్నంలో విరివిగా సంకలనాలు, సంపుటాలు వచ్చాయి. కవి తన్నుతాను ఓ పోరాట యోధుడిగా భావిస్తాడు కాబట్టే, కష్టాలలో కన్నీళ్ళతో చలించి, చితికిపోయిన సామాన్యులకు  ఓ అగ్నికెరటంలా, ఓ పిడిబాకులా ఓ బందూక్ లా తయారుచేస్తాడు. లోకంలో ఎక్కడా చూసిన జాతుల మధ్య, మతాలమధ్య, సిద్దాంతాలమధ్య నాదిగొప్ప అంటేనాది గొప్ప అనే ఆధిపత్య౦ కోస౦ జరిగే ఈ జీవన సమరంలో ఏమి తెలియని అమాయకులు సమిధలై పోవడాన్ని కవి నిరసించిన సందర్భాలు సాహిత్య౦లో ఎన్నో చూడవచ్చు.

వీటన్నింటి లక్ష్యం ఒక్కటే, స్వరాష్ట్ర ఆకాంక్ష. ఉమ్మడి రాష్ట్రముగా ఉన్న తెలంగాణ ఎన్నిరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నది వివరించే ప్రయత్నం కవిత్వంలో కూడా జరిగింది. కాని ఈ అంశాలను క్షుణ్ణంగా చెప్పడంలో పాట ముందునిలిచింది. పాట తర్వతా స్థానంలో కవిత్వం వచ్చింది. ఈ ప్రాంతంలో జరిగిన సాంస్కృతిక విద్వంసాన్ని, సాహిత్య౦పట్ల ఉన్న నిర్లక్ష్యభావాన్ని రూపుమాపడానికి, వనరులుఉన్న వినియోగించా డానికి వీలు లేని దుర్బర పరిస్థితులు అన్నింటిని ఆవేదన రూపంగా కవిత్వీకరించారు. తెలంగాణలోని సమకాలిన పరిస్థితిని గతంలో గూడుకట్టుకున్న దుఃఖాన్ని కవిత్వంలోకి తెచ్చారు. అలా వచ్చిన వాటిలో మార్గదర్శినిలా నిలచింది.

2002వ సంవత్సరంలో వెలువడిన ‘పొక్కిలి’ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చింది, మేధావుల, విమర్శకుల ప్రశ౦సలు పొదింది. తర్వతా వచ్చే సంకలనాలకు పునాది వేసింది. తెలంగాణ ఆత్మను సాహితిలోకానికి పట్టి ఇచ్చింది. ‘మత్తడి’ ఈ సంకలనాన్ని, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్రరాజు సంయుక్త౦గా తెచ్చారు. ఇందులో కూడా తెలంగాణ ఆకాంక్షకు అద్దం పట్టిన కవితలు, చాలా ఉన్నాయి. ఈ రచనకు కూడా ఉద్యమకాలంలో ఆదరణ లభించింది. జూలూరు గౌరీ శంకర్ సంపాదకత్వంలో మరో గ్రంధం ‘సెగ’ అనే పేరుతో వచ్చింది. “ 'జిగర్' అనే పేరుతో ఓరుగల్లు నారిమణులు కలసి అనిశెట్టి రజిత సంపాదకత్వంలో మిగతా మిత్రబృదం కలసి ఈ రచనను ఆవిష్కరించారు. మిగతా ప్రాంతాలకు దక్కని తెలంగాణాకు మాత్రమే దక్కిన ఒక గొప్ప అంశం ఏమంటే, తెలంగాణ కవిత్వం అని తననుతాను ప్రమోట్ చేసుకునే స్థాయిలో  వచ్చింది. ఎందర్నో కవులను సాహిత్యలోకానికి అందించింది. తెలంగాణ విషయంలో తెరవెనుక ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుటిల వ్యూహలు పన్నినా, వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నా, ద్రోహాపాత్ర పోషించేవారిని ఒక కంట కనిపెడుతూనే కాల౦ తనకు సానుకూలంగా నిలవగలదన్న నమ్మకాన్ని గౌరీ  ప్రకటించడం ఆశ్చర్యంకాదు. ఎందుకంటే చరిత్ర గతిలో మార్పు అనివార్యమైన మార్క్సిస్టు సూత్రాల్ని అంతర్లీనంగా జీర్ణించుకున్న కవిగౌరీ. ఉద్యమాల వెల్లువను గమనిస్తూ, వాటిలో లీనమవుతూ ప్రయాణిస్తున్న మనిషికి ఉండాల్సిన ముందుచూపు గౌరీలో ఉంది.  ఇది అతనికి తెలియకుండానే అతని కవిత్వానికి పదునైన శక్తిని అందించింది.” (జయధీర్ తిరుమల రావు, పొంతకుండ ముందుమాట పుట.02) ఈ మాటలు ప్రస్తుత సందర్భ౦లో ఈ కవిని ఉద్దేశించి పీఠికాకర్త రాసిన తెలంగాణ కవులందరికీ దాదాపు ఇవే లక్షణాలు సరిపోతాయి. డిసెంబర్9 ప్రకటన తర్వతా పార్టీలు, సిద్దాంతాలు పక్కన బెట్టి దాదాపు 145 మంది ప్రకటన వెనక్కు తీసుకోవాలని రాజీనామా అస్త్రం ప్రయోగించారు. (అవి ఆమోదింపబడలేదు అది వేరే విషయం) అంటే తెలంగాణ ఏర్పాటు పట్ల ఆంధ్రప్రదేశ్  నాయకులకు ఎంత విముఖత ఉందొ అర్థం చేసుకోవచ్చును. ఇంకో విషయం ఏమంటే వాళ్ళ పదవులకంటే ఇక్కడ పొందే ప్రయోజనాలు, ఈ రాష్ట్ర రాజధానిలో పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడులు, అన్ని కోల్పోవలసివస్తుందనే భయంతోనే ఎన్నంటే అన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి ద్రోహం తలపెట్టారు. ఇవ్వన్నిటిని  కళ్లారా చూసి సామాజిక బాధ్యతగా సృజనకారులు అనేక ప్రక్రియలలో రచనలు చేశారు.

వ్యాసాలు రాశారు, దృశ్యరూపకాలు, పాటలు, మాటలు, లఘుచిత్రాలు, చలనచిత్రాలు వంటి అన్ని ప్రసార సాధనాల ద్వారా వారి బండారం బయట పెట్టారు. ఇదే స్ప్రహతో ముందుచూపుతో కవిత్వం రాశారు. తెలంగాణ కవిత్వంలో ప్రాంతీయ స్పృహను పరిచయం చేస్తూ వెలువడిన సంకలనం ‘నల్ల వలస’ ఈ రచనను శివకుమార్, రామనాధం సుంకిరెడ్డి నారాయణరెడ్డి సముక్తంగా వెలువరించారు ఇందులో తెలంగాణ అస్తిత్వం బలంగా చిత్రించే కవితలు వచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో ఎన్ని పాలక పక్షాలు మారిన సరైన పరిష్కారం చూపని సమస్యలు అనగా నల్గొండ ప్రాంతంలో ప్లోరైడ్ సమస్య, తెలంగాణ ప్రాంతం నుంచి పారుతున్న ఇక్కడ ఒక్క ఎకరం కూడా తడవకుండా ఆంధ్రకు జలప్రదాయిని ఐనట్టి  జీవనదుల గురించి, యాస, భాష, కట్టు,బొట్టు, ఆహరవిహారాల గురించి ప్రాంతీయ కవిత్వంలో ప్రస్తావించారు.

స్థానికతను, జాతరలను, అధ్యాత్మిక వారసత్వాన్ని, ఆవిష్కరించారు. ప్రపంచీకరణకు నిరసన కూడా కవిత్వంతోనే తెలియజేసారు. ఈ దశాబ్ద౦లో వచ్చిన కవితసంకలనాలలో, సంపుటులలో ప్రాంతీయ దృక్పథాన్ని వినిపించని కవిత్వం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒక్క కవితపాదం అయినా ప్రాంతీయ స్పర్శను తడిమిందే,వుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ సమస్యలకు కొంత ఐన ఉపశమనం కల్గుతుంది అని నమ్మి కవితాగ్రహన్ని,  ధిక్కారాన్ని ప్రకటించారు.  ఆవేశం, ఉద్వేగ౦, తెగింపు, సాహసం వున్న కవి నుంచే ఈ కవితా పాదాలు వస్తాయి.  ఇవన్ని నిండుగా మెండుగా కల్గిన వ్యక్తి కాబట్టే అంతా నిర్మొహమాటంగా, నికార్సుగా తెలంగాణను ఉద్యమాలకే ’ప్రయోగశాల’గా అభివర్ణించారు.

4. ముగింపు:

కవి అప్సర్ కవిత్వం గురించి రాస్తూ.. ఒక సాహిత్య పాత్రికేయునిగా, సాహిత్య పేజీల నిర్వహకునిగా, సాహిత్య ప్రయాణంలో పార్శ్వాలను చూపుతూనే, అధ్యాపకునిగా కవిత్వం-సాహిత్య విమర్శ-అన్ని పెనవేసుకుని పోయాయి. ఇవన్ని తనలో ఉన్న సృజనకారుని దృష్టికి విశాలత్వాన్ని, వ్యక్తీకరణకి వైశాల్యాన్ని అందించాయి. అందుకే తెలంగాణ- ఆంధ్రలలో వైరుధ్యాలనే కాదు. అమెరికాలో తెల్ల నల్ల జాతుల వైరుధ్యాలని దగ్గరిగా చూశారు. వారి విషాదాలలో ఆనందాలలో భాగస్వామిగా ఉండడం కూడా కవితావస్తువులో, అభివ్యక్తిలో, విస్తృతికి తావిచ్చింది. డయోస్పోరాకి సంబంధించిన అంశాలే కాదు అంతర్జాతీయ దృష్టిని సంతరించుకున్న లక్షణాలు ఉన్నాయి. ప్రపంచ వాస్తవికత గమనిస్తూ, కల్లోల సందర్భాల్లోని ఉద్విగ్నతల్ని సృజనాత్మక౦గా వ్యక్తం చేయడంలో కవి ఉహశక్తిని ప్రస్పుటం చేసే కవితలనేకం ఉన్నాయి. (అప్సర్: ఊరిచివర: సంపాదకుడు. గుడిపాటి; పుట: xi) అని గుడిపాటి వ్యాఖ్యానించారు. ఈ విధంగా తెలంగాణా సాహిత్యపీఠికల్లో ప్రాంతీయదృక్పథం అడుగడుగునా కనిపిస్తుందని చెప్పవచ్చు.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అప్సర్, ఊరిచివర: సంపాదకుడు. గుడిపాటి; పాలపిట్ట బుక్స్ ,
  2. కాశీం, సి. తెలంగాణ సాహిత్యం; స్నేహ ప్రచురణలు,హైదరాబాద్, 2015.
  3. కాశీం, సి. తెలంగాణ విరసంకవిత్వం ; స్నేహ ప్రచురణలు, హైదరాబాద్, 2015.
  4. రవికుమార్, దార్ల, తెలుగు కథలలో ప్రాంతీయ చైతన్యం, అముద్రిత సిద్దా౦త వ్యాసం, 2005
  5. శివరామకృష్ణ, పెన్నా. నిశబ్దం నా మాతృక, (ప్ర.సం.లే)

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]