headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-02 | February 2023 | ISSN: 2583-4797

3. ‘శ్రీశ్రీ, పఠాభి’ల కవిత్వం: ఆధునిక ధోరణులు

డా. మల్లిపూడి రవిచంద్ర

తెలుగు విషయనిపుణులు,
బ్రిడ్జ్ ఇంటెర్నేషనల్ అకాడమీస్ (అమెరికా), హైదరాబాదు - 500081, తెలంగాణా.
సెల్: +91 9573449282. Email: ravi.hcu32@gmail.com

Download PDF


Keywords: శ్రీశ్రీ, పఠాభి, కవితాధోరణులు, ఆధునికకవిత్వం, అభ్యుదయం, రవిచంద్ర

1. ఉపోద్ఘాతం:

తెలుగు సాహిత్యాన్ని ఎక్కువ ప్రభావితం చేసిన పాశ్చాత్య కవితాధోరణులను శ్రీశ్రీ, పఠాభిల రచనల ఆధారంగా పరిచయం చెయ్యడానికి ఈ పత్రం పరిమితమవుతున్నది.

1.1. పరిచయం:

      సంప్రదాయ మార్గంలో పయనిస్తున్న తెలుగుకవిత్వంపై ఒక్కసారిగా తిరుగుబాటు చేసి, నూతన పదప్రయోగాలతో  సాహిత్యరంగాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన  కవులు నలుగురు. వారు శిష్ట్లా ఉమామహేశ్వరరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీరంగం నారాయణబాబు, పఠాభి. వీరి నలుగురివీ నాలుగు మార్గాలు. పాశ్చాత్య కవితాధోరణుల వల్ల ప్రభావితులై అప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయ తెలుగు సాహిత్యంపై విప్లవశంఖాన్ని పూరించిన కంఠాలు ఈ నలుగురివి. వీరిలో బలమైన వాదాన్ని వినిపించిన వారు శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు), పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి). వీరి కవిత్వంలో పాశ్చాత్య కవితాధోరణులు ఏ విధంగా ప్రతఫలిస్తున్నాయో వివరించే ముందు వాటి నేపథ్యాన్ని గురించిన స్థూల పరిచయాన్ని చూద్దాం.

2. పాశ్చాత్య కవితాధోరణులు- నేపథ్యం:

      20వ శతాబ్దిలో తెలుగుసాహిత్యాన్ని ప్రభావితం చేసిన పాశ్చాత్య కవితాధోరణులు అనేకం ఉన్నాయి. అవే తెలుగుసాహిత్యంలో ప్రవేశించిన ఆధునికధోరణులు. వాటిల్లో కాల్పనికవాదం (Romanticism), వాస్తవికవాదం (Realism), హేతువాదం (Rationalism), అభ్యుదయవాదం (Progressivism), అధివాస్తవికవాదం (Sur-realism), అస్తిత్వవాదం (Existentialism), రూపవాదం (Formalism), అనుభూతివాదం, ప్రతీకవాదం (Symbolism), భవిష్యద్వాదం (Futu-rism), విధ్వంసవాదం (Dadaism), భావచిత్రవాదం (Imagism), క్యూబిజం (Cubism), ఇంప్రెషనిజం (Impre-ssionism) మొదలైనవి ముఖ్యమైనవి.  ఇవన్నీ పాశ్చాత్యదేశాల్లో 17-20 శతాబ్దాల మధ్యకాలంలో వచ్చిన వాదాలు. ఒక్కోవాదం పుట్టుకకు ఒక్కోదేశంలో ఒక్కో నిర్దిష్టకారణం ఉంది. ఇవి భారతీయ సాహిత్యంలోనికి ముఖ్యంగా తెలుగు సాహిత్యం లోనికి 20వ శతాబ్ది తరువాతనే ప్రవేశించాయి. వీటి ప్రవేశానికి ఒక క్రమపద్ధతిగానీ, బలమైన కారణాలుగానీ లేవు. ఈ వాదాలన్నింటి సిద్ధాంతం పాశ్చాత్యదేశాల్లో బలమైనదయినప్పటికీ, తెలుగులోనికి మాత్రం భావజాలంలో, వస్తువులో, భాషలో, రచనావిధానంలో నూతనత్వం పాటించడం అనే దృష్టితో మాత్రమే ప్రవేశించాయి.

ఇన్ని రకాల ధోరణులు పాశ్చాత్యదేశాలలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినా అవన్నీ తెలుగు సాహిత్యంలో నిలదొక్కుకోలేకపోయాయి. కాల్పనికవాదం (భావకవిత్వం), అభ్యుదయవాదం మాత్రమే అధిక ప్రభావాన్ని చూపగలిగాయి. మిగిలిన వాటిలో అధివాస్తవికవాదం, ప్రతీకవాదం లాంటివి తెలుగుకవిత్వంలో అడపాదడపా కనిపించినా వాటి ప్రభావం అంతంత మాత్రమే.! కానీ అస్తిత్వవాదం మాత్రం నేడు తెలుగుసాహిత్యంలో ఆధునికానంతరవాదంగా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది.

3. శ్రీశ్రీ కవిత్వం – అభ్యుదయవాదం (Progressivism):

తెలుగుకవిత్వంలో అభ్యుదయవాదం బలంగా, అధివాస్తవికవాదం ఒక మోస్తరుగా నిలబడడానికి కారణం మహాకవి శ్రీశ్రీ. అభ్యుదయవాదం ప్రధానంగా మార్క్సిస్టు దృక్పథంతో ఆర్థిక, సామాజిక సమస్యల పునాదిపై నిర్మితమైన ఒక వాదం. అందుకే ఆర్థిక, సామాజికాంశాలతో ముడిపడి ఉన్న ప్రతి దేశంలోనూ తన ప్రభావాన్ని చూపగలిగింది. దానికి ఏ మాత్రం అతీతం కాని భారతదేశాన్ని, అందులో తెలుగు ప్రాంతాన్ని కూడా గాఢంగా కుదిపివేసింది.

ఒక దశలో ఆత్మాశ్రయధోరణి (Subjectivity)కి పెద్దపీట వేసి, ఏకోన్ముఖంగా తన భావాలను వ్యక్తీకరించి దేదీప్య-మానంగా వెలుగొందిన భావకవిత్వం తరువాత దశలో క్షీణించడం మొదలు పెట్టింది. శబ్దవ్యక్తీకరణే తప్ప, అర్థగాంభీర్యం రానురాను అడుగంటింది. దానికి తోడు సామాజిక సమస్యల గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పాఠకుల్లో, కవుల్లో నైరాశ్యం చోటుచేసుకొంది. మొదటి ప్రపంచయుద్ధం ఫలితంగా ఏర్పడిన వర్గపోరాటం, ఆకలి, దారిద్ర్యం, ఆర్థిక అసమానతలు... మొదలైనవాటిని కేంద్రబిందువుగా చేసుకొని భావకవిత్వంపై తిరుగుబాటు చేసింది అభ్యుదయకవిత్వం.

తెలుగులో భావకవిత్వంపై తిరుగుబాటు, శ్రామికవర్గ చైతన్యం ఊపిరిగా ఏర్పడిన కవితాధోరణి అభ్యుదయవాదం. దానికి నాయకత్వం వహించినవాడు శ్రీశ్రీ. ఆయన రచనల్లో అభ్యుదయవాదానికి నిదర్శనమైన కావ్యం మహాప్రస్థానం. అది వెలువడిన తరువాతనే అభ్యుదయం అనే మాటకు ‘ప్రగతి’, ‘మార్పు’ అనే అర్థాలు రూఢమయ్యాయి. మహాప్రస్థానంలోని ప్రతిఖండికలో ఈ అర్థం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

మొదటి ఖండిక ‘మహాప్రస్థానం’లో సమాజాన్ని అభ్యదయం వైపు పరుగులు తీయించే ప్రయత్నం చేశాడు శ్రీశ్రీ. ‘ఎముకలు క్రుళ్ళి, వయస్సుమళ్ళి’న సంప్రదాయ సాహిత్యంపై తిరుగుబాటును ప్రకటించి, అందుకు భిన్నంగా ఒక కొత్తమార్గంలో పయనింపజేయడానికి పూనుకొన్నాడు. ‘ఉద్రేకం’, ‘ఉల్లాసం’, ‘అనురాగం’, ‘ఆర్భాటం’ వంటి వాటిని అభ్యుదయ సంకేతాలుగా ఎన్నుకొని, తన కవిత్వమంతటా ఆ సంకేతాలను విస్తరించి, లోకానికి అందించాడు శ్రీశ్రీ. దానితో భావకవులవల్ల వ్యష్టి ప్రయోజనానికి మాత్రమే పరిమితమైన తెలుగుకవిత్వం సమష్టి ప్రయోజనం వైపు మొగ్గు చూపింది.

“నేడే, ఈనాడే, ఈనాడే-/ జగమంతా బలివితర్ది!

నరజాతికి పరివర్తన! నవజీవన శుభసమయం!

అభ్యుదయం” (మహా. పు.:54) అంటూ అభ్యుదయానికి స్వాగతం పలికాడు శ్రీశ్రీ.

“పొలాలనన్నీ/ హలాలుదున్నీ,

ఇలాతలంలో హేమం పిండగ- / జగానికంతా సౌఖ్యం నిండగ-

విరామమెరుగక పరిశ్రమించే,/ బలం ధరిత్రికి బలికావించే,

కర్షకవీరుల కాయం నిండా/ కాలువకట్టే ఘర్మజలానికి,

ఘర్మజలానికి, / ధర్మజలానికి

ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!” (మహా. పు.:60) అంటూ శ్రామిక వర్గానికి అండగా నిలవడంతోపాటు, వారిని నిరంతరం చైతన్యపరచి, ‘కార్మిక లోకపు కల్యాణా’న్ని సాధించడమే అభ్యుదయంగా భావించాడు శ్రీశ్రీ. అదే మనకు ఆయనలో, ఆయన రచనలో కనిపించే అభ్యుదయ ధోరణి.

‘మహాప్రస్థానం’లో అభ్యుదయం అవయవి కాగా అవయవాలుగా ప్రతీకవాదం, ఇంప్రెషనిజం, క్యూబిజం వంటి వాదాలు కూడా కనిపిస్తాయి. విషయ వివరణం కాకుండా వాతావరణ కల్పనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే ప్రతీకవాదం. చెప్పదలచుకొన్న విషయాన్ని ఒక ప్రతీక (సింబల్) ద్వారా చూపించడం ఇందులో కనిపిస్తుంది. ‘ఆశాదూతలు’ అనే ఖండికలో

      “స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించి,

      రగిలించి రక్తాలు, రాజ్యాలు కదిపి-/ ఒకడు తూరుపు దిక్కునకు!

      పాపాలు పండించి, భావాలు మండించి,

      కొలిమి నిప్పులు రువ్వి, విలయలయ నవ్వి- / ఒకడు దక్షిణ దిక్కు!

      ప్రాకారములు దాటి, ఆకాశములు తాకి,

      లోకాలు ఘూకాల బాకాలతోనించి,/ ఒకడుదీచికి!

      సిందూర భస్మాలు, మందార హారాలు,

సాంద్ర చందన చర్చ సవరించి/ ఒకడు పడమటికి!” (మహా. పు.:34) అంటూ నాలుగు దిక్కులకు నలుగురిని సామ్రాజ్య దూతలకు ప్రతీకలుగా వర్ణించాడు. ఇక్కడ ఆ నలుగురూ ఎవరన్న విషయాన్ని పక్కన పెడితే ప్రతీకద్వారా తాను చెప్పదలచుకొన్న విషయాన్ని నివేదించాడు.

“పెక్కు విశేషణాలతో ఒక వస్తువును వర్ణించడమూ, సంపూర్ణ వివరాలనివ్వడమూ విరమించి మనోముద్రితమైన ఒక స్పందనను, అనుభూతిని సూచించడం ద్వారా పాఠకుడిని ప్రభావితుడిని చేడయమే ఇప్రెషనిజం” (రామకృష్ణ, మిరియాల. 1980:312). అంటే భావాన్ని పాఠకుడి బుద్ధికంటే కూడా కళ్ళకు కనిపించేటట్లు చిత్రించి, ప్రత్యక్షానుభవాన్ని కలిగించడం. ‘మహాప్రస్థానం’ ఖండికలో ‘మరోప్రపంచపు జలపాతం’, ‘నదీనదాలు’, ‘అడవులు’, ‘కొండలు’, ‘కణకణ మండే త్రేతాగ్ని’, ‘అగ్ని కిరీటపు ధగధగలు’, ‘ఎర్రబావుటా నిగనిగలు’, ‘హోమజ్వాలల భుగభుగలు’... మొదలైనవి మరో ప్రపంచాన్ని చూపించడానికి ముందు శ్రీశ్రీ పాఠకుడికి చూపించిన చిత్రాలు. వాటన్నిటినీ చూపిస్తేనే గాని మరో ప్రపంచాన్ని పూర్తిగా చూపించినట్టు కాదు అనేది ఇంప్రెషనిష్టుగా ఇక్కడ శ్రీశ్రీ భావం.

3.1 శ్రీశ్రీ కవిత్వం అధివాస్తవికవాదం (Sur-realism):

అధివాస్తవికవాదం తెలుగులో అంతో ఇంతో నిలదొక్కుకుంది అంటే అది శ్రీశ్రీ చలవే. అభ్యుదయవాదాన్ని ఉరకలెత్తించిన మహాకవి అధివాస్తవికవాదాన్ని కూడా స్పృశించడం ఆ వాదానికి మేలైంది. అధివాస్తవికవాదధోరణికి శ్రీశ్రీ తన ఖడ్గసృష్టిలో ప్రత్యేకస్థానాన్ని కల్పించాడు. అయితే, ఒక సిద్ధాంతం దృష్ట్యా రచనలు చేసిన శ్రీశ్రీ ఔన్నత్యం అభ్యుదయవాదంలో ఉన్నంత బలంగా అధివాస్తవికవాదంలో కనిపించదు.

‘ఛందోబందోబస్తుల్ని తెంచివేయడం, అర్థాన్ని అధ్వాన్నంగా విడిచిపెట్టడం, గద్యానికి, పద్యానికి పెళ్ళి చేయడం, అరుపులు, నత్తిమాటలకు కూడా ప్రాధ్యాన్యమివ్వడం వంటివి రచనల్లో ప్రతిఫలించవచ్చున’నేవి శ్రీశ్రీ ప్రతిపాదించిన అధివాస్తవికవాద మౌలికభావనలుగా చెప్పవచ్చు. ‘కొంటె కోణాలు’ అనే ఖండికలో

      “జీబ్రాకి Algebra చిహ్నాల

      లాంకోటూ, పాంకోళ్ళూ తొడిగి

      సాహిత్య పౌరోహిత్యం యిస్తే

      వెర్రి కాదు Sur – realism రా సోదరా!” (ఖడ్గ. పు.:60) అని ఛందోలక్షణ విధానంలో సూత్రీకరణ చేశాడు.

      “DE – COMPOSITIONS” అనే ఖండికలో -

              “కాకికేమి తెలుసు Psycho analysis?

               ఆటవెలది ద్విపదకత్తగారు:

               5, 3, 2 ఆముక్త మాల్యద

               విశ్వదాభిరామ వినురవేమ” (ఖడ్గ. పు.:56)

అంటూ చెప్పిన కవిత్వంలో పైకి అసంబద్ధత, అనర్థకత మాత్రమే గోచరిస్తాయి. కానీ ఆ మాటల్లోని బాహ్యస్వరూపాన్ని గమనిస్తే అదొక ఆటవెలది పద్యం. ‘Psycho analysis, 5, 3, 2’ లకు తెలుగు వర్ణ రూపాన్ని ఇస్తే ‘సైకో ఎనాలసిస్, అయిదు, మూడు, రెండు” అనే మాటలుగా ఇంద్ర, సూర్య గణాలై ఛందస్సులో ఒదిగిపోతాయి. యతి నాల్గవ గణం మొదటి అక్షరం. ప్రాసయతి చెల్లుతుంది. కాబట్టి మొదటి పాదంలో కాకిలో ‘కి’కి సైకోలో ‘కో’ కి ప్రాసయతి వేశాడు. రెండవ పాదంలో ఆటలో ‘ఆ’కి, అత్తలో ‘అ’కి, అలాగే మూడవ పాదంలో అయిదులో ‘అ’కి ఆముక్తలో ‘ఆ’కి యతి వేశాడు శ్రీశ్రీ.

అంతస్స్వరూపాన్ని పరిశీలించినపుడు చాలా లోతైన భావాలు గోచరిస్తాయి. ముందుగా ‘సైకో ఎనాలసిస్’ అనే మాట కనిపిస్తుంది. ఆ మాట ఫ్రాయిడ్ ‘సైకో ఎనాలసిన్ సిద్ధాంతా’నికి తార్కాణమైనది. ఆ సిద్ధాంతంలో చర్చించిన కామవాంఛ (Libido) అనే విభాగానికి ఆకర్షితులైన కవులు రాసిన కవిత్వమే అధివాస్తవిక కవిత్వమని విమర్శకులు నిర్ణయించారు (రంగనాథాచార్యులు, కె. కె. 2005:117). ఆ స్పృహతో రాయబడిన కవిత్వాన్ని అర్థం చేసుకోవడంలో వెనకబడ్డారు సంప్రదాయ కవులు. అసలు వారికి ఫ్రాయిడ్ ‘సైకో ఎనాలసిన్’ అంటే ఏంటో తెలిస్తే కదా! తన కవిత్వం అర్థమయ్యేదనీ, కేవలం ఆత్మానందం అనే స్వల్ప ప్రయోజనం కోసం కవిత్వం రాసే సంప్రదాయకవులకు బహుళప్రయోజనాల దృష్ట్యా రాయబడిన కవిత్వం ఎప్పటికీ అర్థం కాదనీ భావించాడు శ్రీశ్రీ. కాబట్టే “కాకికేమి తెలుసు Psycho analysis” అని అనగలిగాడు. ఇందులో “పిల్లకాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ” అన్న సామెతలోని సోయగం దాగి ఉండడం చేత ఎక్కువ మాటలను వాడకుండానే విషయాన్ని సూటిగా అందించి విజయం సాధించాడు. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కొన్ని ప్రత్యేక దినాల్లో చనిపోయినవారి కోసం భోజనం పెట్టి, కాకి చేత తినిపింపజేయడం తెలుగువారి సంప్రదాయం. అలా భోజనం పెట్టడానికిగల కారణం, దాని ‘సైకో ఎనాలసిస్’ మనిషి ఏర్పాటు చేసుకొన్నదే. అవన్నీ     ఆ భోజనం తినే కాకికి తెలియవు. అవసరం లేదు కూడా. అయినా సంప్రదాయవాదులు అలా పెట్టడం మానరని సంప్రదాయవాదులపై శ్రీశ్రీ తిరుగుబాటు చెయ్యడం కూడా ఇక్కడ కనిపిస్తుంది.

రెండవ పాదంలో “ఆటవెలది ద్విపదకత్తగారు” అనడంతో ద్విపదకు, ఆటవెలదికి ఉన్న గుణగణ సంబంధాన్నీ, రెండు దేశీయ ఛందస్సులోనే భాగమైనప్పటికీ అత్తాకోడళ్ళలాగా ద్విపద జాతి, ఆటవెలది ఉపజాతులుగా ఎప్పటికీ కలవవని తెలియజేశాడు. తద్ద్వారా రెండు పాదాల్లో చకచకా సాగే కోడలి లాంటి ద్విపదను అర్థం చేసుకోలేనివారు నాలుగు పాదాల్లో సాగే అత్తలాంటి ఆటవెలదిని ఏ విధంగా అర్థం చేసుకోగలరని? ఒక కోణంలోనూ, ఎంతసేపూ అత్తగారిలా పాతదైన ఛందోబందోబస్తుల్లో ఉండేవారు కోడలిలాంటి నవీన కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోగలరని? మరో కోణంలోనూ విమర్శించినట్లు స్పష్టమవుతుంది.

“5, 3, 2 ఆముక్తమాల్యద” అన్న మూడవ పాదంలో 5, 3, 2 అంకెలను ప్రయోగాలను చిహ్నంగా వాడడం వల్ల, ప్రయోగం కోసం ప్రౌఢప్రబంధంగా రాయబడిన ఆముక్తమాల్యద సాధించిన ప్రయోజనం చాలా తక్కువని నిరూపించినట్లు అవగతమవుతుంది. మొత్తానికి మూడు పాదాల్లోనూ సంప్రదాయ కవిత్వం నుండి బయటపడాల్సిన ఆవశ్యకతను మూడు చురకలు వేసి మరీ తెలియజేశాడు శ్రీశ్రీ.

ఖడ్గసృష్టిలో ‘అధివాస్తవికులకు ప్రవేశం’ అంటూ తొమ్మిది పద్యాలు రాశాడు. అందులో కూడా అసంబద్ధతకే ప్రాధాన్యం ఇచ్చాడు. అది పైకి అలా కనిపించినా అంతర్లీనంగా సంప్రదాయ పద్యకవిత్వానికీ, అదే కోవలో కొనసాగుతూ ఉన్న కవులకీ అధిక్షేపమనే విషయాన్ని మనం గమనించాలి.

ఉదా.“వచ్చెడువాడు ఫల్గుణుడు వార్ది తరంగ మృదంగ ఘోషలో

      విచ్చెడు మచ్చుమందు పలవించెడు కించిదుషస్తుషారముల్

      పచ్చిక మచ్చికైనది ప్రపంచపునెత్తురు మంటపాటలన్

      మెచ్చనివాడ నీ మెడలమీదనివే ఉదయాద్రి రౌద్రముల్” (ఖడ్గ. పు.:76)

మహాప్రస్థానం లాంటి ప్రభావశీలమైన కవిత్వం రాసిన శ్రీశ్రీ ఇటువంటి చమత్కారాలు చేయడం చాలామందికి వెర్రితనంగానే అనిపించినా అందులో ఉన్న వ్యంగ్యధోరణి తెలిసినవారు మాత్రం శ్రీశ్రీని శ్రీశ్రీగానే గౌరవిస్తారు.

4. పఠాభికవిత్వం- విధ్వంసవాదం(Dadaism):

భావకవిత్వంపై పనిగట్టుకొని తిరుగుబాటు చేసినకవుల్లో పఠాభి. ఆయన 1939లో రచించిన ఫిడేలురాగాలడజన్ సంప్రదాయ, భావకవిత్వానికి పెద్ద గొడ్డలిపెట్టు. పాశ్చాత్యదేశాలలో చదువుకొని వచ్చిన పఠాభికి సంప్రదాయ, భావకవులు చేసిన రచనల్లో  వాస్తవం కనిపించలేదు. అందుకనే పాశ్చాత్య కవిత్వధోరణి అనే దండంతో తెలుగుసాహిత్యంపై దండయాత్ర చేశాడు.

పఠాభి రచించిన ఫిడేలురాగాలడజన్ కవితాధోరణులలో దేనికి చెందుతుంది అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోయినా, అది ప్రధానంగా సాంప్రదాయికమైన ఛందస్సుపై, వ్యాకరణంపై, భాషపై, భావజాలంపై చేసిన తిరుగుబాటును బట్టి చూస్తే విధ్వంసవాదం (డాడాయిజం)గా చెప్పవచ్చు. ‘పాశ్చాత్యదేశాలలో డాడాయిజం ఒక సిద్ధాంతమో, తాత్వికదృక్పథమో కాదు. నిరాశ, కసి నుండి పుట్టిన ఒక వాదం. నాగరకత నాశనమైపోతున్నదని బాధపడ్డ కవులు చేసిన అధిక్షేపం, అవహేళన, దూషణ’ (నారాయణరెడ్డి, సి.2001.:491). అదే కోణాన్ని పఠాభి కవిత్వంలో కూడా మనం గమనించవచ్చు. ఈ ధోరణిలో కవిత్వం రాయడం వల్ల భావకవిత్వాన్ని పరిహాసం చేయడం తప్ప, పఠాభి ప్రత్యేకంగా సాధించిన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి దీనిని దీనిని విధ్వంసవాదంగా పరిగణించవచ్చు.

పఠాభి ‘ఫిడేలురాగాలడజన్’ ద్వారా ఆధునికతకు పట్టం గట్టాడు. పట్టాభిరామిరెడ్డి అన్న తన పేరును పఠాభిగా మార్చుకోవడం, పుస్తకం మొదటి ముద్రణలో ముఖచిత్రంపై ఫిడేలు అన్న మాటకు బదులు ఫిడేలు బొమ్మను ఉంచడం, సెక్సుకు వస్తు ప్రాధాన్యాన్ని కల్పించడం, నూతన భావాన్నీ, శైలినీ అనుసరించడం, నూతన పరికల్పనలు చేయడం వంటివి అందుకు నిదర్శనాలు. పాశ్చాత్య వాద్యమైన ఫిడేలును నేడు కర్నాటక సంగీతజ్ఞులు కూడా వాడుతూ ఉన్నారు. కాబట్టి, పాశ్చత్యధోరణిని కూడా తెలుగువారు అవలంబించవచ్చుననే ఆధునిక దృక్పథాన్ని ఫిడేలు అన్న మాటలో పఠాభి పొందుపరిచాడని విమర్శకులు అభిప్రాయపడ్డారు.

‘ఆత్మకథ’ ఖండికలో-

      “నాకు విచిత్రంబగు భావాలు కలవు/ నా కన్నులందున టెలిస్కోపులు

   మయిక్రాస్కోపులున్నవి” (పఠాభి. పు.:64) అంటూ తనకుగల నూతనదృక్పథాన్ని చెప్పుకున్నాడు పఠాభి. అంతటితో ఆగకుండా -

      “నా వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో/ పద్యాల నడుముల్ విరగదంటాను;

      చిన్నయ్ సూరి బాలవ్యాకరణాన్ని/ చాల దండిస్తాను

      ఇంగ్లీషు భాషాభాండారంలోనుండి/ బందిపోటుంజేసి కావల్సిన

      మాటల్ను దోచేస్తాను./ నా యిష్టం వచ్చినట్లు జేస్తాను.

      అనుసరిస్తాను నవీన పంథా; కానీ భావకవిన్మాత్రము కాన్నే; నే

      నహంభావకవిని” (పఠాభి. పు.:64) అంటూ తాను చేయాల్సిన తిరుగుబాటుకు సిద్ధం చేసుకొన్న ఒక ప్రణాళికను, ఒక వ్యూహాన్ని బహిర్గతం చేశాడు. ఆ ప్రణాళికలో పలికిన ప్రతిమాటా సంప్రదాయ, భావకవిత్వాన్ని చీల్చే ఒక తూటా. ‘అహంభావకవిన్నేను’ అన్న మాట కూడా అలాంటిదే.

      “తలిగింపబడి యుఉనది జాబిల్లి/ చయినా బజారు గగనములోన; పయిన;

      అనవసరంగా అఘోరంగా” (పఠాభి. పు.:65) అంటూ చేసిన వర్ణనలో ఆధునిక సమాజంలో రూపాయికి, నాగరక కన్యల పౌడర్ పూయబడిన ముఖానికీ ఉన్న విలువ కూడా చుంద్రుడికి లేదనీ, 15 రోజులకుగానీ నిండు రూపాన్ని పొందలేని చంద్రుడు నిత్యం వెలిగే రంగురంగుల విద్యుద్దీపాల ముందు ఎందుకూ పనికి రానివాడనీ చిత్రించిన భావన కనిపిస్తుంది. ఇదే పఠాభి చేసిన నూతన పరికల్పన. ఇది ప్రాచీనకవులు చేసిన చంద్రుని వర్ణనకు వెక్కిరింపు. ఇలాంటి భావనే మనకు శ్రీశ్రీ ఖడ్గసృష్టిలోని ‘టాంటాం’ ఖండికలో కూడా కనిపిస్తుంది.

      “స్టయిలిషుగ డ్రస్సుంజేసుక/ గరల్స్ హాస్టల్ విజిటర్స్ రూంలోనన్

      హాజరయ్యాను;- ఫ్లోరింగదిరేలా/ బాటా హయిహీలు బూట్సులమీదన” (పఠాభి. పు.:81),

      “పిక్చర్ టయిరోస్ పవర్ ఆక్టు జేసిన సూయేజని/ గ్రహించాము వాల్పోస్టర్సుంజూచి” (పఠాభి. పు.:83) వంటి మాటలను గమనిస్తే ‘ఆత్మకథ’లో చెప్పిన ప్రణాళికను అమలు చేస్తున్నట్లు గ్రహించవచ్చు.

      కవితాపాదాలను భావంతో సంబంధం లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి విరగగొట్టడం “నా వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో/ పద్యాల నడుముల్ విరగదంటాను” అనే మాటను నిరూపించేందుకు చేసిన ప్రయోగంగానూ, ‘డ్రస్సుంజేసుక’, ‘రూంలోనన్’, ‘వాల్పోస్టర్సుంజూచి’, “ఫిడేలు రాగంబులు/ వినూతన పదప్ రేమికులు, అన్ యోన్ యమగు దం పతులు కూడా;- నన్ నుంజేపట్ టవద్ దని/ గద్ దించినా కూడ నీవు” అనే మాటల్లో ఉన్న పూర్ణబిందు ప్రయోగం, ద్రుతాంత ప్రయోగం, పదవిచ్ఛేదం కేవలం “చిన్నయ్ సూరి బాలవ్యాకరణాన్ని/ చాల దండిస్తాను;” అనే మాటకు కట్టుబడి చేసిన వ్యాకరణంపై తిరుగుబాటుగానూ, ఎలా బడితే అలా కర్త, కర్మ, క్రియలతో సంబంధం లేకుండా ఇంగ్లీషు, తెలుగు పదాలు వాడడం భాషపై చేసిన తిరుగుబాటుగానూ ధ్రువీకరించవచ్చు. అదే పఠాభి కవిత్వంలో ఉన్న విధ్వంసవాదం (డాడాయిజం).

    స్పష్టంగా ఇదే అని చెప్పడానికి వీలులేకపోయినా పఠాభి కవిత్వంలో అక్కడక్కడా ప్రతీకవాద ధోరణి (సింబాలిజం) కూడా కనిపిస్తుంది.

      “కామాక్షికి నన్నున్ ప్రజంటు చేసిన/హస్తాలే నన్ను లాగేశాయి

      కామాక్షినుండి, కామాక్షిని/ అనాచ్ఛాదిత చేస్తూ.

      ----------- నన్ లాగిన/ దీపంవత్తి గూడా ఆరిపోయింది.” (పఠాభి. పు.:98) అంటూ చేసిన వర్ణనలో అక్కడ జరుగుతున్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పకుండానే ఒక ప్రతీకద్వారా పాఠకుడికి విషయబోధ చేయడం కనిపిస్తుంది. ఇలాంటి ప్రతీకవాద వర్ణనలు అక్కడక్కడా ప్రతిఫలింప చేయడంలో విజయం సాధించాడు పఠాభి.

5. ముగింపు:

పాశ్చాత్య సిద్ధాంతాలను, ధోరణులను బాగా ఆకళింపు చేసుకొని ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక కొత్తవాదాన్ని లేవదీసిన, కొత్త మార్గాన్ని ఏర్పరచిన కవులు శ్రీశ్రీ, పఠాభి. వారిరువురూ తెలుగు కవిత్వానికి ‘ఎలక్ట్రిక్ షాక్’ ఇవ్వడంతోపాటు ఆరుద్రలాంటి కవులెందరినో ప్రభావితం చేయడం తెలుగుసాహిత్య చరిత్రలో ఒక మేలి మలుపు.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. నారాయణరావు, వెల్చేరు. 1978. తెలుగులో కవితావిప్లవాల స్వరూపం. విజయవాడ: విశాలాంధ్ర ప్రచురణాలయం.
  2. నారాయణరెడ్డి, సి. ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు- ప్రయోగములు. హైదరాబాదు: విశాలాంధ్ర ప్రబ్లిషింగ్‌హౌస్.
  3. పఠాభి. పాఠాభి పేల్ చిన ఫిరన్ గులు. హైదరాబాదు: విశాలాంధ్ర ప్రబ్లిషింగ్‌హౌస్.
  4. రంగనాథాచార్యులు, కె. కె. ఆధునిక తెలుగుసాహిత్యంలో విభిన్న ధోరణులు. హైదరాబాదు: ఆంధ్రసారస్వత పరిషత్తు.
  5. రామకృష్ణ, మిరియాల. శ్రీశ్రీ కవిత్వం: వస్తువు- సంవిధానం. కాకినాడ: ఎం. లక్ష్మీదేవి పబ్లిషర్స్.
  6. శ్రీశ్రీ. మహాప్రస్థానం. హైదరాబాదు: విశాలాంధ్ర ప్రబ్లిషింగ్‌హౌస్.
  7. శ్రీశ్రీ. 1986. ఖడ్గసృష్టి. హైదరాబాదు: విశాలాంధ్ర ప్రబ్లిషింగ్‌హౌస్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]