headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-02 | February 2023 | ISSN: 2583-4797

1. దక్షిణాంధ్రయుగంలో దేవాలయ ఉద్ధరణ - దేవతాభక్తి

వై. శివకుమార్

పరిశోధక విద్యార్థి, తెలుగుశాఖ,
హైద్రాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, తెలంగాణా రాష్ట్రం.
సెల్: +91 99632405219. Email: shivayamma9963@gmail.com

Download PDF


Keywords: దక్షిణాంధ్రయుగం, నాయకరాజులు, దేవాలయాలు, శిల్పకళ, పునరుద్ధరణ, భక్తి, శివకుమార్

1. ఉపోద్ఘాతం:

శ్రీకృష్ణదేవరాయల యుగం, తెలుగు సాహిత్యానికి ‘స్వర్ణయుగం’గా ప్రసిద్ధికెక్కింది. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు దక్షిణదేశ పరిపాలన కోసం, తెలుగు నాయక రాజులను మధుర, తంజావూరులలో తమ సామంతులుగా నియమించుకొన్నారు. నాయకరాజుల ఆదరణ కోసం తెలుగు సైనికులు, కవి పండితులు తెలుగు ప్రాంతం నుండి దక్షిణ దేశానికి తరలివెళ్ళారు. క్రీ.శ.1565 లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం మహ్మదీయుల వశమైంది. అందువల్ల తెలుగు ప్రాంతంలోని కవులకు, గాయకులకు, శిల్పులకు రాజాదరణ తగ్గిపోయింది. కాబట్టి, తెలుగుప్రాంతంలోని కవులు, పండితులు, శిల్పులు మొదలైనవారు మధుర, తంజావూరుల్లోని రాజులను ఆశ్రయించారు.

సాహిత్యపోషణలో, రాజ నిర్వహణలో నాయక రాజులు విజయనగర రాజులను ఆదర్శంగా తీసుకొని, తెలుగు కవి పండితులను, తెలుగు భాషా సాహిత్యాలను పోషించారు. కాబట్టి, 17, 18 శతాబ్దాలలో తెలుగు సాహిత్యం తెలుగుదేశం సరిహద్దులను దాటి దక్షిణ దేశం, ముఖ్యంగా తంజావూరు, మధుర, చెంజి, పుదుక్కోట, మైసూరు మొదలైన కేంద్రాలలో విలసిల్లింది. తెలుగు సాహిత్య చరిత్రకారులు ‘దక్షిణాంధ్ర యుగం’ అని ప్రత్యేకించి, ఆంధ్ర వాఙ్మయ పరిణామంలో ఆ కాలపు ప్రాధాన్యతను గుర్తించారు. ఆ కాలం ప్రక్రియ వైవిధ్యంలోనూ, రచనా స్వరూపంలోనూ, భాష, శైలులలోనూ, సాహిత్య ప్రయోగాలలోనూ ఎంతో ప్రత్యేకతను ప్రదర్శించింది. ఇలా ఎన్నో విశిష్టలతో వెలువడిన ఈ యుగంలో నాయక రాజుల దేవాలయ ఉద్ధరణ - దేవతా భక్తి ప్రశస్తిని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

2. చారిత్రక నేపథ్యం:

ప్రాచీన కాలంలో తంజావూరుకు “చోళదేశమని” పేరు. దీనిని చోళులు పరిపాలించారు. ఆ తర్వాత కాలంలో విజయ నగర రాజుల ఆధీనంలోకి వెళ్ళింది.  క్రీ.శ 1530వ సంవత్సరంలో తంజావూరు ప్రాంతంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.  తంజావూరు విజయనగరానికి దూర ప్రాంతమవ్వడం వలన అక్కడ ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించి, శాంతిని నెలకొల్పడానికి సమర్ధుడు, విశ్వసపాత్రుడైన వ్యక్తి అవసరం అయ్యింది. అచ్యుత రాయలు తన భార్యలలో ఒకరైన తిరుమలాంబ చెల్లెలైన మూర్తెమ్మను చెవ్వప్ప నాయకుడనే సామన్య దండనాయకుడికిచ్చి వివాహం చేశాడు. తన చెల్లెలి భర్తయిన చెవ్వప్ప నాయకునికి ఏదైనా గొప్ప పదవి ఇప్పించాలని, భర్త అచ్యుత రాయలకు చెప్పి, చెవ్వప్ప నాయకుడిని (క్రీ.శ 1550-80) తంజావూరు రాజ్యానికి ప్రభువుగా పంపించింది. ఈ సంఘటననే తంజావురు రాజ్య స్థాపనకు కారణమయ్యింది. ఇతని తర్వాత అచ్యుతప్ప నాయకుడు (క్రీ.శ 1580-1600), రఘునాథనాయకుడు (1600-31), విజయరాఘవుడు (క్రీ.శ1633-73) వరకు పాలించారు.  క్రీ. శ 1673వ సంవత్సరంలో మధురను పాలించే చొక్కనాథ నాయకుడు తంజావూరు రాజ్యంపై దండయాత్ర చేసి విజయరాఘవ నాయకుడిని, ఇతని కుమారుడిని సంహరించాడు.  క్రీ.శ 1675వ సంవత్సరంలో విజయరాఘవ నాయకుని మనుమడైన చెంగమలదాసు కొంతకాలం  రాజుగా  అధికారం చేపట్టాడు. కానీ మహారాష్ట్ర ప్రభువైన ఏకోజి ఇతనిపై దాడి చేసి తంజావూరును తన రాజ్యంలో కలుపుకున్నాడు.  ఇంతటితో తంజావూరులో నాయక రాజుల పాలన అంతమై, మహారాష్ట్ర రాజులు ఆధీనంలోకి వెళ్ళింది.

శహాజీ (క్రీ. శ 1684-1712),  తుక్కోజి (క్రీ.శ1728-1736), రెండవ ఏకోజీ (క్రీ .శ 1736-37), ప్రతాపసింహుడు (క్రీ.శ 1739-63), అమరసింహుడు ( క్రీ. శ1787-98), శివాజీ (క్రీ. శ.1833-55) వరకు పరిపాలించారు. తుక్కోజీ కుమారుడు ప్రతాపసింహుడు. ఇతని ఆస్థానంలోనే ముద్దుపళని అనే కవయిత్రి ఉండేది. ఈమె రాధికసాంత్వనమనే  నాలుగు ఆశ్వాసాల శృంగార ప్రబంధాన్ని  రాసింది.

ప్రాచీన కాలంలో మధుర రాజ్యానికి “పాండ్యదేశమని” పేరు. దీనిని పాండ్య రాజులు పరిపాలించారు. ఆ తర్వాత కాలంలో విజయనగర రాజుల ఆధీనంలోకి వచ్చింది. విశ్వనాథ నాయకుని కుమారుడు కృష్ణప్ప నాయకుడు మధుర రాజ్య స్థాపకుడు. మధురని పాలించిన నాయక రాజులందురు తెలుగువారే కావడం విశేషం. వీరిలో తిరుమల నాయకుడు( క్రీ. శ 1623-29), చొక్కనాథుడు (క్రీ. శ 1659-82), ముద్దళగిరి (క్రీ. శ1675-78), విజయరంగ చొక్కనాథుడు  (క్రీ.శ 1704-32) వరకు పరిపాలన చేశారు.

     చెంజి లేదా జింజి రాజ్యం. దీనికే “తుండీర మండలం” అని పేరు. దీనిని పాలించినది కూడా తెలుగు నాయక రాజులే. వరదప్ప నాయకుని (క్రీ. శ 1645- 49) కాలంలో తెలుగు సాహిత్య పోషణ జరిగింది.

     పుదుక్కోట సంస్థానాధిపతులు కూడా తెలుగు నాయక రాజులే. వారిలో తిరుమల రాయలు, విజయ రఘునాథ తొండమన్ (క్రీ. శ1730-69), రాయరఘునాథ తొండమాన్ (క్రీ.శ 1769-89), ఆరవ రాయరఘునాథ తొండమాన్ (క్రీ.శ 1825-39) వరకు పరిపాలన చేశారు.

3. దేవాలయ ఉద్ధరణ - దేవతాభక్తి:

నాయకరాజుల కాలంలో దేవాలయాలు, క్షేత్ర స్థలాలు ఉన్నత స్థితిలో ఉండేవి. విజయనగర రాజుల లాగానే తంజావూరు నాయకరాజులు, దేవాలయాలకు శాశ్వతంగా తమ జీవిత చరమదశ వరకు సేవలు చేశారు.

నాయకరాజులలో ఆద్యుడైన చిన్న చెన్నప్ప నాయకుడు శ్రీశైలంలో ప్రాకార సోపానావళిని నిర్మించాడు. వృద్ధాచలంలో ప్రసాదమండపాలను నిర్మించాడు. గోపర్వతానికి పూజావిశేషాధి ప్రాముఖ్యతను కల్పించాడు. చెన్నప్ప కుమారుడు అచ్యుతప్ప నాయకుడు శ్రీరంగపతికి సింహాసన ప్రణవమయంబగు పసిడి సజ్జ దేవాలయానికి కష్టమ ప్రాకారం- గోపురం నిర్మించాడు. అంతేకాకుండా రత్నాంగధ కిరీటాన్ని, అభయ హస్తాన్ని సమర్పించాడు. అచ్యుతప్ప నాయకుని గురించి చేమకూర వెంకట కవి ఈ విధంగా పేర్కొన్నాడు.

“శ్రీరంగేశుడు వచ్చి, యచ్యుతథరిత్రీ భర్తయై, భాగ్యరే

ఖారూఢిన్విఅసిల్లి తాన తనకుం గైంకార్యముల్ చేసెగా

కే రాజైనను జేయగా గలిగెనే యిట్లే విమానం బహో

 భూ స్నిగ్ధముగా మహామణి మాయయిల్గా గిరిటదులున్

అచ్యుతప్ప నాయకుడు శ్రీరంగనాధుని కొలిచేవాడు. తన కుమారుడైన రఘునాథనాయకునికి రాజ్యం అప్పగించి చరమదశలో శ్రీరంగక్షేత్రమందే గడిపాడని సాహిత్యరత్నాకరాది గ్రంథాల వలన తెలుస్తుంది.

రఘునాథ నాయకుడు కృతాయుగంలోని రఘునాథుని అవతారంగా కీర్తి పొందాడు. తనకు ఇష్టదైవమైన రామచంద్రుని రమణీయ వాగ్రచన పుష్పలతో పూజించాడు. రామాయణాన్నే కాక, రామాయణ కర్తయిన వాల్మీకిచరిత్రను కూడా రచించి, శ్రీరామచంద్రుడికే అంకితం ఇచ్చాడు. తనకు కలిగిన సాహితీసౌష్టవం, రచనాశక్తి, శ్రీరాముని కటాక్షం వల్లనే లభించిందని ఈ విధంగా పేర్కొన్నాడు.

“ఇది శ్రీరామచంద్ర సాంద్రకరణ కాటాక్షాలబ్దసిద్ద సారస్వత

విశేష నిరర్గళ వాగైభావాశేష సరస సాహిత్య కళాభోజ

ఇతడు తన చనలన్నింటిని శ్రీరామచంద్రునికే అంకితమిచ్చాడు. వీటితో పాటు శ్రీరామ విగ్రహన్ని, రామసేతు, శ్రీరంగ, విజయ రాఘవ పురి, కుంభకోణాది స్థలాలను ప్రతిష్టించినట్లు అతని  గద్య రచనల  వల్ల  తెలుస్తుంది

దక్షిణాంద్ర యుగంలో తంజావూరును పాలించిన నాయక రాజుల కాలంలో సుప్రసిద్ద దేవాలయ ఉద్దరణలు బాగా జరిగాయి. కాని మధురను పాలించిన నాయక రాజుల కాలంలో దేవాలయ ఉద్దరణ జరిగినట్లు కనిపించదు, కాని ప్రసిద్దమైన దేవాలయాలను కేంద్రంగా చేసుకుని చాలా విరివిగా రచనలు వెలువడ్డాయి. పచ్చకప్పరపు తిరువేంగళ కవి రాసిన చొక్కనాథ చరిత్ర, చెంగళ్వ కాళకవి రాసిన రాజగోపాల విలాసం, విజయరంగ చొక్కనాథుడు రాసిన మాఘమహత్మ్యం, శ్రీరంగ మహత్మ్యం, రేవురి అనంతయ్య రచించిన వృద్ధచల మహత్మ్యం, బాలకవి అనంతయ్య రచించిన శ్రీముష్ణ మహత్మ్యం, వెలగపూడి కృష్ణయ మాత్యుడు రాసిన సేతు మహత్య్మం, తిరుమల కవి రాసిన చిత్రకూట మహత్య్మం, భద్రకవి రాసిన  గజారణ్య క్షేత్ర మహాత్య్మం, నంజరాజు రాసిన కాశీ మహమార్థ దర్పణం, కళువే నంజ రాజు రాసిన గరళపురి మహాత్మ్యం, హాలస్య మహాత్మ్యం, గౌతమి మహాత్మ్యం రాసిన అల్లమరాజు బాపయ్య, జగన్నాథ మహాత్మ్యం రాసిన రామయ్యగారి సూరయ్య, జాహ్నవి మహాత్మ్యం  రాసిన ఏనుగు లక్ష్మణకవి, కార్తీక మహాత్మ్యం రాసిన కుందుర్తి వేంకటచలం మొదలైన రచనలు. వరకు క్షేత్ర స్థలాలపైన రఘునాథ నాయకునికి మక్కువ ఎక్కువని అతడు రాసిన వాల్మీకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. వాల్మీకి చరిత్రలో సంస్కృత మూలంలో లేని క్షేత్ర వర్ణనలను తెలుగులో ప్రత్యేకంగా రాశాడు. సప్తరుషులు వైకుంఠంలో శ్రీనారాయణుని సేవించి, తిరిగి హిమవత్పర్వతప్రాంతానికి వెళ్ళినప్పుడు భరతవర్షంలో మొదట దక్షిణ ప్రాంతాన్ని దర్శించుకుని, ఉత్తర ప్రాంతాలకు వెళ్లారని రఘునాథ నాయకుడు రాశాడు. ఇందులో వారి దర్శించుకున్న స్థలాలు.

  1. గజతీర్థం- ఇది తామ్రపర్ణి నది సంగమ తీర్థానికి దగ్గరలో ఉంది. గజేంద్రునికి మోక్షం కలిగిన పుణ్యతీర్థంఇక్కడే.
  2. బాలకృష్ణ తీర్థం- ఇది గజ తీర్థం తర్వాత ఉంటుంది.
  3. రామసేతు- జగత్పసిద్ధమగు రామేశ్వరం. పవిత్ర స్థలాలు- చక్రతీర్థం- బేతాళ వారధి- పాపవినాశిని- సీతా సరస్సు- మంగళ తీర్థం- అమృత వాటిక- లక్ష్మణ తీర్థం- రామతీర్థం - శంకు చక్ర జటా తీర్థాలను గురించి రఘునాథ నాయకుడు పేర్కొన్నాడు.
  4. శ్రీరంగం- ఇది నాయకునికి ఇష్టమైన క్షేత్రం. ఈ క్షేత్ర ప్రశంస పది పద్యాలలో ఉంది.
  5. తంజావూరు- ఇది ఇతని రాజధాని. ఇక్కడ బృహదీశ్వరస్వామిని, నృసింహస్వామిని, యానందవల్లి సుందరేశ్వర స్వామిని గురించి పేర్కొన్నాడు.
  6. చిదంబరం - కనక సభ; తిల్ల గోవిందరాజులు; నటరాజ వర్ణన.
  7. అరుణాచలం - అరుణాచలేశ్వరుడు.
  8. కంచి - వరదరాజు, ఏకామ్రేశ్వరుడు.
  9. వెంకటాచలం - తిరుపతి క్షేత్రం. వెంకటేశ్వరుని వర్ణన 7 పద్యాల్లో ఉంది.
  10. అహోబిలం - నృసింహ స్వామి.
  11. శ్రీ కాశి క్షేత్రం - విశ్వనాథుని వర్ణన. మొదలైన అనేక దేవాలయాలను రఘునాథ నాయకుడు గురించి తన కావ్యంలో ప్రస్తావించాడు.

విజయ రాఘవ నాయకుడు రాజగోపాల స్వామికి అత్యంత ప్రియ భక్తుడు. మన్నారు గుడిలోని రాజగోపాల స్వామికి రత్నంగి, రత్నకిరీటం, దివ్య రత్న భూషణాలను భక్తి వినయంతో సమర్పించాడు. అంతేకాకుండా ఆలయానికి గోపురాలను, ప్రాకారాలను నిర్మించాడు. రాజగోపాల స్వామికి ప్రతి సంవత్సరం జరిగే పాల్గునోత్సవ తిరునాళ్లకు, తానే స్వయంగా కైంకార్యం చేయడంతో పాటు ఆ ఉత్సవ సందర్భంగా రగడల తోనూ, చౌ పదాలతో వర్ణించేవాడు. రాజగోపాలును గురించి దండకాలు, వేడుకోలు, విన్నపాలు, దరువులు రచించి, తాను మన్నారుదాస భక్తుడినని ప్రజా లోకానికి తెలియజేయడానికి తన విగ్రహన్ని రాజగోపాల స్వామికి ఎదురుగా నిర్మించుకున్నాడు.

నాయకరాజుల తర్వాత పాలించిన మహారాష్ట్ర రాజులలో శహాజీ మహారాజు కూడా త్యాగేశ భక్తుడు. ఈ త్యాగేశుడు తిరువాయురు క్షేత్రంలో వెలిసిన శివమూర్తి. శహాజి కృతులన్నీ ఈ దేవుడికే అంకితమిచ్చాడు. అంతేకాక ఈ దేవుని ఉత్సవాలకు సంబంధించినశంకర పల్లకి సేవ ప్రబంధం అనే గేయ నాటకాన్ని రచించి, ఇది శాశ్వతంగా ఆ దేవుని ఎదుట ప్రదర్శించడానికి, పది పుట్ల భూమిని దానం చేశాడు.

తంజావూరును మహారాష్ట్ర రాజులు పరిపాలిస్తున్న కాలంలో ముద్దు తంజనాయకి కూడా ఎన్నో దానధర్మాలు చేసింది. తన పేరు మీద “రామాపురమనే” అగ్రహారాన్ని కట్టించి, అందులో శివలింగాన్ని ప్రతిష్టించింది.  మంచినీటి సరస్సులను నిర్మించి, చుట్టు పూల మొక్కల నాటించింది. ప్రతి రోజు కోట సమీపంలో నిత్య అన్నదానాన్ని చేయడమే కాకుండా, పార్వతీపరమేశ్వరుల నిత్య ఉత్సవాలను జరిపించేదని ముద్దుపళని రాసిన రాధికా సాంత్వన రచన ద్వారా తెలుస్తుంది. “రామ కట్టించి యిడె నగ్రహారంబు” (రాధికా సాంత్వనం 1-25)

బెంగుళూరును నిర్మించిన పెద కెంపరాయుని కాలంలో కూడా చాలా విరివిగా దేవాలయాల నిర్మాణాలు జరిగాయి. ఇతడు గవిపురంలో గంగానాధీశ్వర ఆలయాన్ని కట్టించాడు. నేడు బసవగుడిగా పిలువబడుతున్న బసవేశ్వరుడి గుడిని కట్టించి, అందులో బసవేశ్వరుని ప్రతిష్టించినది ఇతడే. ఈ గుడి చుట్టూ దొడ్డ విఘ్నేశ్వరస్వామి, నందీశ్వరస్వామి, ఆంజనేయస్వామి, మల్లిఖార్జునస్వామి దేవాలయాలను ప్రతిష్టించాడు. ఇతడు నిర్మించిన దేవాలయాలలో ప్రసిద్దమైనది మాత్రం హల్సూరులోని సోమేశ్వరాలయం. ఈ దేవాలయానికి ఒక ప్రసిద్దమైన కథ ఉంది. స్వామి వారు కెంప రాయులకు కలలో కన్పించి, అక్కడ ఒక స్థలంలో తవ్వితే అధిక సంఖ్యలో ధనం దొరుకుందని, దానితో దేవాలయం కట్టించమని చెప్పి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు కెంపరాయలు అక్కడ త్రవ్వగా ధనంతో పాటు శివలింగం కూడా బయట పడిందంట. ఆ ధనంతోనే ఆ దేవాలయాని కట్టించి, స్వామివారిని అందులో ప్రతిష్టించినట్లు ఇతడు రాసిన గంగా గౌరి సంవాద రచన ద్వారా తెలుస్తుంది. ఇతని కుమారుడు ఇమ్మడి కెంపరాయుడు బెంగుళూరులోని బల్లాపరపు పేటలో ఉన్న రంగనాథ స్వామి దేవాలయం నిర్మించాడు.

బెంగుళూరును పాలించిన రాజుల కాలంలో గ్రామ దేవతల ప్రస్తావన చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు గౌడ వంశస్తులు. గిద్దగౌడ అనే రాజుకు పిల్లలు లేకపోవడంతో యిలవేల్పయిన “కెంపమ్మను” ఆరాధించడం వలన కుమారుడు జన్మించాడు. అతనికి  “కెంపనంజగౌడ” అని పేరు పెట్టాడు. అప్పటి నుండి వారి వంశం పేరు “కెంప” అనే పేరుతో ప్రసిద్ధి పొందింది.

బెంగుళూరును నిర్మించడానికి ముందు ఈ ప్రాంతానికి “శివ సముద్రమని” పేరుండేది. కెంపగౌడ తన రాజ్యాన్ని విస్తరింపచేయాలనే ఉద్ధేశంతో రాజధాని కోసం పర్యటిస్తున్నప్పుడు అతని కుక్కను అడ్డగిస్తూ కుందేలు ఎదురువచ్చింది. ఇదే రాజధానికి సరైన ప్రదేశమని కోటను నిర్మించాడు.  ఈ కోటకు నాలుగు బురుజులుండేవి. వాటి పైన కోట నిర్మాణం చేశారు. ఆ తర్వాత సింహద్వారాన్ని నిర్మించడం ప్రారంభించారు. కాని ఈ ద్వారం సాయంత్రం వరకు నిలిచి తెల్లవారేసరికి పడిపోయేది. ఇలా ఎన్ని సార్లు నిర్మించిన ఇలానే పడిపోతుండేది. ఒక రోజు రాజుకు కలలో మహనీయుడు కనిపించి, ఆ ప్రదేశంలో నరబలి ఇస్తే ఆ ద్వారం నిలబడుతుందని చెప్పి అదృశ్యమయ్యాడు. ఈ వృత్తంతాని రాజ్యంలో తెలియజేయగా, ఇతని కోడలు  బలికి సిద్ధమవుతుంది. కెంపగౌడ వద్దని ఎంత వారించి వినకుండా సింహ ద్వారం వద్దకు వెళ్ళి తన కంఠాన్ని కత్తరించుకుని, ఆ ద్వారాన్ని రక్తంతో  తడిపింది. మరుసటి రోజు నిర్మించిన  ద్వారం పడిపోకుండా అలానే నిలిచిపోయింది. కెంపరాయలు బెంగుళూరుకు కొంత దూరంలో “కోరమంగల” అనే ప్రదేశంలో గుడి కట్టించాడు. అప్పటి నుండి నేటి వరకు కూడా ఈమె గ్రామ దేవతగా పూజలందుకుంటుంది.

4. ముగింపు:

దక్షిణాంధ్ర యుగంలోని16,17 శతాబ్ధాల మధ్య కాలంలో ఉన్నటువంటి సాంఘిక, ఆర్థిక, సామాజిక, సారస్వత అంశాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. సమాజంలోని ప్రజల జీవన విధానాన్ని గురించి శివకవుల తర్వాత, మళ్ళీ నాయకరాజుల కాలంలో వెలువడిన రచనలలోనే ఎక్కువ వివరాలు తెలుస్తున్నాయి. దక్షిణాంద్ర యుగంలోని సాంఘిక పరిస్థితుల పరిస్థితులను గురించి చేస్తున్న అధ్యయనంలోని కొన్ని ప్రధాన విషయాలను ఈ పత్రంలో చర్చించడం జరిగింది. ఇటువంటి అధ్యయనాలు ఇంక వివరణాత్మకంగా, విమర్శనాత్మకంగా జరపవలసిన అవసరాన్ని ఈ పత్రం ద్వారా సాహిత్య అధ్యయన శిలురకు, పరిశోధకులకు జ్ఞప్తికి తీసుకురావడం జరుగుతున్నది.

5. ఉపయుక్త గ్రంథసూచి:

  1. ఆరుద్ర. సమగ్రాంధ్ర సాహిత్యం (2వ సంపుటం). హైదరాబాదు: తెలుగు అకాడమి ప్రచురణ.
  2. ఆరుద్ర. ముద్దుపళని, రాధికా సాంత్వనం. హైదరాబాదు: ఎమెస్కో బుక్స్.
  3. కుసుమాబాయి, కె. నాయక రాజుల చరిత్ర- కళా సంస్కృతి. హైదరాబాదు: కావ్యశ్రీ గ్రాఫిక్స్.
  4. కృష్ణారావు, వై. తెలుగు సాహిత్య చరిత్ర. హైదరాబాదు: తెలుగు అకాడమి.
  5. జయ రాములు, బి. సాంత్వన కావ్యాలు – శృంగార నాయికలు. హైదరాబాదు: హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన ఎం.ఫిల్. పరిశోధన వ్యాసం.
  6. నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష. తిరుపతి: నవ్య పరిశోధక ప్రచురణ.
  7. తెలుగు అకాడమి. 2005. తెలుగు-తెలుగు నిఘంటువు. హైదరాబాదు: తెలుగు అకాడమి ప్రచురణ.
  8. ప్రతాపరెడ్డి, సురవరం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. విజయవాడ: పల్లవి పబ్లికేషన్స్
  9. రామారావు, ఎస్వి. తెలుగు సాహిత్య చరిత్ర. హైదరాబాదు: పసిడి ప్రచురణలు.
  10. వెంకటరావు, నిడదవోలు. దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం. మద్రాసు: మద్రాసు విశ్వ విద్యాలయం.
  11. వేంకటావధాని, దివాకర్ల. ఆంధ్ర వాజ్ఞయ చరిత్ర. హైదరాబాదు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు.
  12. వెంకటరమణయ్య, నేలటూరు. దాక్షిణాత్యాంధ్ర సాహిత్యం. మదరాసు: వేదము వేంకటరాయశాస్ర్తి అండ్ బ్రదర్స్.
  13. శ్రీరామమూర్తి, కొర్లపాటి. తెలుగు సాహిత్య చరిత్ర. విశాఖ పట్టణం: రమణ శ్రీ ప్రచురణ.
  14. సత్యనారాయణ, కంభంపాటి. 2008. ఆంధ్రుల సంస్కృతి- చరిత్ర2. హైదరాబాదు:  హైదరాబాదుబుక్ ట్రస్ట్.(అనుపమ ప్రింటర్స్)

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]