AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-6 | June 2022

1. జానపద సాహిత్య అధ్యయనములో నైవేద్యసంస్కృతి

డా. జొన్నలగడ్డ మార్కండేయులు

పేరవరం - 533235
A Block, Harihara residence, Moosapet, Anjaneya Nagar,
Hyderabad – 500018. Telangana, India.
Cell: 9440219338, E-Mail: hydjmlu@gmail.com


ఉపోద్ఘాతము:

విశ్వవ్యాప్తమతములన్నీ భూతదయను ప్రవచిస్తాయి. అంటే అహింస. కాని ఆహారపుటలవాటుగ కోడి, మేక వంటి పెంపుడు ప్రాణులుని చంపి మాంసం తినడం హింసకాదు.. భూతదయ మానసికపూజా కుసుమాలులో ఒకటని. ఆంధ్రవాచస్పత్వము ఇచ్చిన అర్థం. మనసుపడిన మాంసాహారాన్ని పూజాకుసుమంగా జీవహింసకు బలిపీఠం ఎక్కించడం నిరసించిన బౌద్ధ, జైనమతాలు మాంసాహారమును నిషేధించలేదు అని చరిత్ర చెబుతుంది. శాకాహారముతోబాటు జానపదనైవేద్య సంస్కృతికి పశుపక్షి వధ మనకు మాంసాహారముగను బలిపూజావారసత్వముగాను ఐఛ్చికముగా అందింది.

ఉద్దేశము:

శిష్టజనసమ్మతము, సామాన్యజన సమ్మతము, చివరకు శిష్ట, సామాన్య, సర్వజనామోదముగ నాగరికత ఎప్పుడూ వేదకాలమునుంచీ మారుతూనే ఉంది. జానపద అధ్యయనముగ అంతర్జాల కాలములోను కుతూహలము రేపుతుంది. భక్తి, వేదాంత, కర్మమార్గ పరంపరాగత జానపద జీవితంలో నైవేద్య విధాన సమాచార సంస్కృతి ప్రయాణ ప్రయోజన పరిశీలన ఈ వ్యాసము లక్ష్యం.

మతములో ప్రధానాంశములు:

1. శుభకర్మలను ఆచరించుచూ సుఖసంపదలను కోరుకొనువారు,
2. శారీరిక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు,
3. ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానము కోరికగలవారు ,
4. పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అనువారు చతుర్విధ భక్తులుగ భక్తి పరిధిలోనివారు.

గేయ, వచన, దృశ్య వాజ్మయము జానపదవిజ్ఞానముగ పరిశీలించవలసిన అవసరముంది. అయితే
1. అంకిత భావము, 2. విశ్వానముతో భగవంతుని దర్శించిన అనుభూతి. 3. ఆపరమాత్మసన్నిధి తాదాత్మ్యం, 4. భావవ్యక్తీకరణ భక్తి చతుర్విధ భక్తిగ అర్చన అవసరం.

ఈ అర్చనకు నైవేద్యముతోకూడిన పూజ అని జనసామాన్య అర్ధం. అనాదిగా వస్తున్న ఈసంస్కృతిని భక్తి యోగముగ భగవద్గీత భక్తిని నిర్వచించింది. భగవద్గీతను భాస్కరుడను కవి ఈ జానపద రూఢార్ధముగ స్త్రీ జన గానోపయుక్తముగ తెలుగు వారికి అందిచాడుకూడ. ప్రజాపాలకులు ఎప్పుడూ రాజకీయ, సాంఘిక, ఆర్ధిక, నైతిక సమస్యలన్నియును మనదేశమున మతమునకు లోబడి పాలించి తదనుగుణముగ రూపు దిద్దుకొనుచు వచ్చారు (289వ పేజి మత సంబంధ గేయములు - తెలుగు జానపద సాహిత్యము, బిరుదురాజు రామరాజు).

జైన, బౌద్ధ, శైవ,వైష్ణవములులో శైవ, వైష్ణవములులో సా మాన్యులు జైనబౌద్ధములు ఆదరించారు. కాని వైదిక అనుయాయు లైన రాజులు పోషణకారణముగ చివరకు శిష్ట్, సామాన్యజనులతోసహా సర్వజనామోదమైన భక్తి సంస్కృతికి నిలదొక్కుకుందన్నది నిజము. సాతవాహనులు పరిపాలన చేతిలో దక్కించుకుందుకు పలురకాల మతాలను అనుసరించారు. పాడిపంటలు పెంపుదలకోసం బౌద్ధమతాన్ని, ప్రభుత్వాధిఖ్య్తకోసం యజ్ఞసంస్కృతిని పాటించేవారు.” (65వ పేజి సమగ్ర ఆంధ్ర సాహిత్యము, మొదటి సంపుటము).

ఆర్ధికంగా లాభసాటి అయిన ఏమతాన్నయినా వాణిజ్య వర్గాలు ప్రోత్స హిస్తాయన్నది చారిత్రిక సత్యము.. అందుచేత రాజు ఏమతమవలంబించినా అన్యమతసంప్రదాయ ప్రజల విశ్వాసాన్ని కాదనడు. జంతుబలి, ఆత్మహింసాత్మక చర్యలను అశోకుడు ధర్మలిపులలో (కర్నూలుజిల్లా ఎర్రగుడిబండల మీదున్న శిలాశాసనములు) నిషేధించాడు. అయినా ఆహారపుటలవాట్లకు, అన్యమతస్థుల ప్రీతికి జంతుబలి, ఆత్మహింసాత్మకచర్యలు బౌద్ధమతము అహింసా ధర్మమునకు సడలింపు నివ్వవలసివచ్చింది.

ఆహారం జీవితావసరం. మాంసాహారప్రియులకోసం అశోకుని ఈధర్మలిపులు ప్రకారం మహాసనములో వంటయింటిలో వేలాది జంతువుల వధ ఆహారముకొరకు జరిగేది అదుపులోకి వచ్చింది. మూడు జీవులు,ఒకజంతువు, రెండుపక్షులు మాంసాహారులకు అనుమతించబడ్డాయి. అందుచేత మాంసాహారపు అలవాటు బుద్ధుని కాలంనుంచీ వస్తూనే ఉంది. ఈ అలవాటు దైవారాధనలో జంతుబలి పాపమని తెలిసినా కొనసాగింది’. కొనసాగుతోంది కూడ శిష్టులు యాగాలలో జంతువధ చేసారు. ఆంధ్రులలో బ్రాహ్మణులు శాకాహారులుగ వైదికమతము యజ్ఞములలో ప్రాచుర్యము పొందారు. కాని ఋగ్వేద ఆర్యులు మాంసభక్షణ చేసారు. ఇప్పటి ప్రజాపాలనామోద ప్రభుత్వాధిక్యత కూడ వివిధమత విశ్వాసాలు జాతరలులేదా, పండుగుల సంస్కృతికి ప్రాధాన్యమిస్తుంది. ఈ సంస్కృతిలో శాకాహార, మాంసాహార నైవేద్య సంస్కృతిగ మన ఆచారములు, పండుగలు కలవని రైలుపట్టాలులా మతప్రాముఖ్యము జానపదాంశములు కలిగిఉంటున్నాయన్నది పరిశీలన.

భగవద్గీత చతుర్విధభక్తులకు ప్రాధాన్యమిచ్చింది. పురాణాలులో భక్తి ప్రసక్తి ఉంది. భాగవత పురాణము నవవిధభక్తి విధానం సూచిస్తుంది. బృహదారణ్యము 10 విధ భక్తి మార్గాలు చెప్పింది. నాయనార్లు, ఆల్వారులు,రామానుజులు, తులసీ దాసు, కబీర్, వల్లభాచార్యులు భక్తి, వైరాగ్య వేదాంత కర్మమార్గములు భక్తి ఆచరించి చూపారు. ఈ చెప్పిన సాహిత్యం జానపదులు సరళీకృతం చేసి జానపదరచనగ అధ్యయనకారులకు అందించారు.

అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, పురందరదాసు,ఎందరో పదకవులు ఆరాధన సంస్కృతికి మార్గముగ అర్చన భక్తి సంస్కృతిలో ఉంటారు. ఇతర సంస్కృతుల ప్రభావము. ఈ జానపదరచనలపై ఇతర నంస్కృతుల ప్రభావంకూడ పడింది. బ్రిటిష్ వారి పాలనలో హిందూ పదము ప్రాచుర్యములోనికి వచ్చింది. అంతకుమునుపు సనాతన ధర్మముగ జీవిస్తున్న ప్రజానీకానికి హిందుత్వ సిద్దాంతముగ హిందువులుగ హిందూ మతము పేరు స్థిరపడింది. న్యాయ, వైషేషిక, మీమాంస, యోగ, సాంఖ్య, వేదాంత సిద్దాంతాలు ప్రత్యేకంగా అధ్యయనముగ పేరుపొందాయి. ఆరవశతాబ్ది నాటికే జైన సిద్దాంతాలు, భారతదేశంలోనే పుట్టి ప్రపంచ వ్యాప్తమైన బౌద్ధమత సిద్ధాంతాలు ఉన్నాయి. పురాణ, ఇతిహాసాల కావ్యాలున్నాయి.

ఆంగ్ల పాలనలో క్రైస్తవము, ముస్లిం పాలనలో ఇస్లాం, ఇంకా సిక్కు, జూడ, బహాయి, జోరోష్ట్రియనులు నేటికీ హిందూ ధార్మిక ప్రజారాజ్యంలో సహజీవనంలో ఉన్నారు. వీరుగాక గిరిజన జాతులవారున్నారు. మనభాషనే నానాపభృంశరూపాలతో మాట్లాడు గోండు, కోయ, చెంచు, సవర మున్నగువారి జీవన విధానములను మనము అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రలో చెప్పారు. ఆయన ఆశించినట్లు అధ్యయనాలు సాగాయి.

ఆయా అధ్యయనంలో జానపద సామాజిక జీవితానికి స్ఫూర్తి దాయకులను జానపద వాజ్ఞ్మయ పరిశోధనలో గుర్తించాలి. ధర్మార్ధకామమోక్ష సాధనపురుషార్ధ సరళీకరణగ విజ్ఞానావసరము మతము ఈశిష్ఠ విజ్ఞాన పరిశీలనలతో పోటీపడి సామాన్య జనమునకు అందుబాటులో ఉంచడానికి పుట్టిన సాహిత్యమే సంస్కృతి, ఆచారాలు జాగృతిగ జానపదము.

పరిశోధకులు తీసుకున్న అంశములు ఉదహరించి పేరుపేరునా పట్టిక తయారు చేయడం అవసరం. ఈవ్యాసంలో విషయ పరిధి కారణంగా సూచనప్రాయంగా కృషి చేసిన వారిని అభినందనకే పరిమితము చేసాను.

మిశ్రమసంస్కృతి: భారతదేశంలో బహుళసంస్కృతి కనిపించే ప్రదేశాలున్నాయి. పర్వతాలు, లోయలు, జలపాతాలుతో బాటు అక్కడి దర్శనీయ హిందూ దేవాలయాలు, ఇతరచారిత్రిక విశేషాలు, నదీనదాలు పురాతన అధ్యయనం జానపద పరిశోధకులు చేస్తున్నారు. పురాణ, ఇతిహాస ప్రాముఖ్యతను వెలికితీస్తున్నారు. గ్రామీణ, పట్టణ పండుగలు యోగులు,గురువులు, పూజార్హసంస్కృతీ పశుపక్షి జంతువుల కధనాలు గల జానపద విజ్ఞానముగ పరిశోధనలు వచ్చాయి. ఇవి పరిశీలిస్తే కనిపించిన భక్తి నమ్మక నంన్కృతి పరిధిలోని నైవేద్య సంస్కృతి ఈ వ్యాసము.

నైవేద్యపదముగ ఈ వ్యాసములో జానపదదృక్పథము:

జానపదులు మనపూర్వికులు. పుట్టినరోజు మొదలు అంత్యక్రియాచారము వరకు సాగుతున్న సంస్కృతికి జానపద విజ్ఞానమును అధ్యయనదర్పణముగ అందించారు. మనమంతా జానపదులమే అవుతామన్నది మరిచిపోలేనిది.

అయితే ఒకప్పుడు జానపదులకు పల్లెలు ప్రాతిపదికగా చర్చ. ఇప్పటి జానపదులకు నిర్దిష్ట వ్రదేశము కుదరదు. గ్రామీణ, పట్టణ జీవనసరళి ఒకేలా ఉంటోంది. జానపద ఆచార సంస్కృతి మూలము మారలేదు. దేశ,వి దేశ, పట్టణవాతావరణ సమ్మేళనముగల జానపదసంస్కృతిగానే అధ్యయనము జరగాల్సి ఉంది. కాని స్థలఫరిధి పెరిగింది. నాగరిక పల్లె పట్టు పరిశీలించి ఈనాటి పల్లెపట్టణ జనజీవనసంస్కృతి పదరూఢార్ధముగ జానపదవిజ్ఞానము పరిశీలనాంశములో ఆరాధనా సంస్కృతి. నేటి వల్లెపట్టణ సర్వజనామోద సంస్కృతిగ తులనాత్మకాధ్యయనములో ఆధునీకరణకు తెలియ చెప్పవలసినవి మనసు పెట్టి వెదకాలి అని చెప్పడం నా ఉద్దేశం.

నైవేద్యపదము - జానపదుల భావన:

నైవేద్యము అన్న వదము మనకు దైనందిన భగవతారాధనలో విరివిగా వాడుక కనిపిస్తుంది. నివేదనగ, సమర్పణగ ఈపదము దైవారాధనగ కైంకర్యము పేరుతో దేవాలయాలలో వాడుకపదము. వ్రతములు, నోములు, పండుగలు వంటివి ఉన్నపుడు పూజామందిరము పరిధిగ నైవేద్యవిధానము వినిపిస్తుంది. దైవారాధన విధిలో అర్చనలో ఒకతంతుగ మనోరధసిద్ధిగ నిత్య దేవతార్చనలో ఆహారము లేదా తినుబండారాలు సమర్పణ ఉంది. సర్వజనామోద అర్చనగ నైవేద్యము. దేవుడు ఇంటి పూజామందిరములోగాని, గుడి, దైవారాధన ప్రదేశాలు, తీర్థక్షేత్రాలులో నైవేద్య సమర్పణ స్వీకరించి అనుగ్రహిస్తాడని జానపద భావన. సాంఘిక జీవితంలో ఈ నైవేద్య విధానము కైంకర్యముగ సేవ. అంటే నివేదన. ఈ నివేదనలో ధనకనకవస్తు వాహనాలు అందరూ చేయలేరు. కాని ఆహారవస్తువులు సమర్పణగ నైవేద్యము పూజా విధానము జానపద సంస్కృతి. శాకాహారము, మాంసాహార సంబంధిత ఆహారాన్ని సమర్పించడం ఉంది.

నాయని కృష్ణ కుమారి జానపద గేయగాధలులో 186వపేజీలో ఈమాంస సంబంధిత నైవేద్యము ఆత్మారాధనగ కూడ పేర్కొన్నారు. అవైదిక జీవన జానపదము కూడ వైదిక మత సగుణారాధన, భగవద్రూప కల్పనలు నిరసించలేదు. మరణానంతరము శరీరములేని ఆత్మ ఆహారానికై పరితపిస్తుందని అందరినమ్మకము. మరణాంతరము ఆత్మ పదిరోజుల పాటు చెట్టు, పుట్ట ఆశ్రయించి తిరుగుతాయని జానపదులు విశ్వవ్యాప్తంగా నమ్మారు.

జాంబపురాణములోని ఈవిషయాన్ని పంబవారు పాడివినిపిస్తారు. ఈ ఆత్మలకు ఆత్మారాధనగ కోడి, మేక బలిచ్చి ఆహార పుష్టి సమకూరుస్తారు. (186పేజీ) గరుడ పురాణము దశమాధ్యాయము 139పేజీలో చనిపోయిన వారి ఆత్మలు దశావహము అంటే పదిరోజులు ప్రేత్వముతో పరిచితప్రదేశాలలో తిరుగుతూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది. దేవతలు నరబలిగా మానవమాంసము తినడానికి సందేహించలేదా? జరిగినా జరగక పోయినా నరబలిసాక్ష్యాల వైదిక ఆత్మబలిదానాలు పురాగాథలు నైవేద్య సంస్కృతి లో మాంసాహారం ఉనికిని దాచలేక చాటుకున్నాయి.

నేడు లడ్డుమిఠాయి మొదలైన తీపి వస్తువులు కూడ నైవేద్యము సమర్పణలో ఉంటుంది. మాంసాహారవిముఖులు శాకాహారము నివేదిస్తారు. అవైదిక జానపదులుగ వ్యానభారతములో లేని కులము సచ్ఛూద్రులు గురించి అరణ్యపర్వము (4.1-29) లో ప్రస్తావన ఉందని వీరు చతుర్ధ కులజులైన శూద్రుల కంటే సత్వాది గుణములు గలవారని ఆంధ్రుల సాంఘిక చరిత్రలో అభిప్రాయపడ్డారు. వీరు దైవారాధన విషయంలో బ్రాహ్మణేతరులలో మాంసాహార నివేదనలో విభేదిస్తారు.

సర్వజనామోద దైవారాధన:

శైవ వైష్ణవ శాక్తేయ, దేవ తామూర్తులతోబాటు అన్యమతసంస్కృతి లేదా ఇతరకారణములవల్ల వచ్చిన దేవతా మూర్తులు గ్రామీణ పట్టణ ప్రాంతములో కులాచారములతో పూజింప బడుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వముంది. అర్చనలు, పూజించు విధానములలో వేర్వేరు ఆరాధన హిందూ సంప్రదాయానుసారంగా మాంసాహార, శాకాహార వైవిధ్య నైవేద్యవిధముగ జానపద సంస్కృతి లోమాంసాహార ప్రీతిని దాచలేవు. వాస్తు పూజాదికాలలో గృహాధిదేవతకు బలిచ్చే ఆచారము బ్రాహ్మణేతరులలో ఉంది. శ్రీ రాముడు పర్ణకుటీర నిర్మాణ సమయాన జింకను బలిచ్చాడు (అభిలిషితార్ధ చింతామణిలో చెప్పబడిందని సురవరంవారన్నారు). స్థలపురాణాలు, పేరంటాల్ల కథలు, వ్రతకథలు మొదలైన సిద్ధాంత వ్యాసములుగ వచ్చాయి. అవి కొంత అవగాహన కలిగించిగలిగినా నైవేద్య ప్రక్రియ విధాన సిద్ధాంతాన్ని రూపొందించడానికి, మాంసనివేదన జంతుఆత్మబలి నిరోధానికి మరింతగా తప్పక ఉపకరిస్తుంది.

నైవేద్యవిధానము:

దేవతామూర్తికి ఆహారాన్ని స్వీకరించమని కోరడం నైవేద్యం. తరువాత నైవేద్యము ప్రసాదముగ పంచి భుజించడము. ఆరగింపు పూజావిధముగ సాగుతోంది. జాతర, కల్యాణము, కొలువు, తిరునాళ్ళు, ఉత్సవము పేరులతో అర్చామూర్తులకు ఆరగింపు వూజావిధానములు సాగుతున్నాయి. వీటిని పండుగలుగ కూడ నిఘంటువులు పేర్కొన్నాయి.

నైవేద్య సమర్పణకు ముందు మతపర అర్చన ఉంది. ఈ విధానాన్ని పరిశోధకులు అందించినవి ఉన్నాయి. దేవతామూర్తులకు గుడి కట్టబడింది. మహిమాన్వితమైన చెట్టు, పుట్ట, ఆరుబయటి రాయి రప్ప దేవతామూర్తులరూపములో ఆరాధింపబడుతున్నాయి. త్యాగరాజు, అన్నమయ్య, బాలయోగి మహాత్ములు, శంకరాచార్య వంటి మతబోధకుల జయంతులు ఆరాధన పేరిట ఉత్సవము లేదా జాతరగ జరుగుతున్నాయి. వీటిలో ముస్లిం, క్రైస్తవ మతసంబంధ ఉత్సవాలు మతసామరస్యరీతివి హిందువులు కూడ పాల్గొనేలా ఉన్నవి తప్పక పరిశీలించాలి. జాతరలు, ఉత్సవాలు, పండుగలు ఆరాధనోత్సవాలే. సమయం సందర్భంగా సామాజిక పలుకుబడిలో ఉత్సవమూర్తి ప్రాధాన్యత వల్ల రూఢార్ధముగ పేర్లు స్థానికతనుబట్టి స్థిరమైన అర్ధము కలిగి ఉంటుంది.

జాతర అన్న పదము శక్తి ఉత్సవము, జాతరపద సంబంధముగ గ్రామదేవతారాధనకు ప్రసిద్ధము. “జాతరసేయవలయు నర్వజనంబులు అంబురాశికిన్” అని జాతర పదము భారతములో మౌసలపర్వములో తిక్కన, శక్తి ఉత్సవము, జాతరచాటించె అన్నపాండురంగ మహాత్య వ్రబంధ కవిపద ప్రయోగము ఉత్సవ అర్ధమును ధ్వనిస్తున్నాయి. అయినా జాతర పదమునకు అమ్మవారి ఉత్సవ అర్ధము రూఢార్ధము కాదు. ప్రకృతిలో పంచభూతాల ఆరాధనఉత్సవముగ కూడ జాతర సాగుతోంది. జాతర ఉత్సవముగ మౌసలపర్వములో యాదవులు సముద్ర తీరములో జరుపుకున్నారు. భాగవతములో గోవర్ధనగిరి పూజను కృష్ణుడు జరిపించాడు. ఆసమయములో అదృశ్య రూపములో యాదవులచ్చిన నైవేద్యభక్షణ చేసాడు.

పుష్కరాలు - సాగరసంగమం:

12 సంపత్సరాలకొకసారి సూర్యుడు బృహస్పతి సింహరాశి ప్రవేశము కలుగతుందో ఆనదికి పుష్కరాలు వచ్చాయంటారు. పూజాదికాలు, పుణ్య స్నానాలు, పితృదేవతలకు తర్పణాలు కోనసీమలో ఏడుపాయల గోదావరి తీరవాసులు పుప్కరాల సమయ నైవేద్య సంస్కృతి ఉంది. అంతర్వేది వద్ద సాగరసంగమ ప్రదేశం దర్శించడము ఉంది.పృథ్వి, జల, ఆకాశ ,అగ్ని పంచభూతాలు ఆరాధనకు అన్నది సాక్ష్యము. అందుచేతనే పంట పొలాలమధ్య, చెరువుగట్టు, వేపచెట్టు మొదలైన ప్రదేశాలలో గ్రామదేవతాది ఆరాధనా మూర్తులకు వేదికలయ్యాయి. పంచభూతాలు, ఆరాధనార్చనామూర్తులకు ఆహారము సమర్పించి ప్రసన్నము చేసుకునేందుకు నైవేద్యము పుట్టింది.

మతములలో ముఖ్యంగా హిందూ సంస్కృతికి నైవేద్య ప్రయోజనము ఆకలితో ఉన్న వాడిని భగవంతుని రూపముగ భావించి చేసే విశ్వాసము. అన్నదానము పితృదేవతలకు ఆరాధనగ పూర్వికులు అన్న నివేదనను చేస్తున్నారు. పితృదేవతలకు భుక్తిగా, జాతరలుగ నైవేద్యము ఉచిత అన్నదాత ప్రసాదము. దేవాలయ సంస్కృతిగ మారింది.

జాతర అర్థముగ - గ్రామదేవత:

గ్రామదేవత పేరులోనే గ్రామానికి సంబంధించిన దేవతగ అర్ధము స్ఫురిస్తుంది. దేవతగ ప్రకృతి అర్ధములో అమ్మవారు ఎంత దయామయురాలో “అమ్మోరు”గ వికృతి శబ్ద పలుకుబడిలో అంత ప్రళయ దేవత. ఉభయతెలుగు రాష్ట్రములలోను గ్రామదేవతలు కొలువై ఉన్నారు. అమ్మవారి సన్నిధిగ జాతరను “అమ్మవారి కొలువు” అని అన్నారు. కొడవటిగంటి కుటుంబరావు “ఆమ్మమ్మ” కథనములో ఆమ్మమ్మ అంటే అమ్మమ్మకు అమ్మగ వయోవృద్ధురాలుగ, వేంకటేశ్వరస్వామి ఆరాధన కన్న గ్రామదేవతారాధన నైవేద్యమునకు ప్రాధాన్యమిచ్చింది. గ్రామదేవతంటే మక్కువ ఎందుకు అనిప్రశ్నిస్తే ఊరుమ కనిపెట్టి ఉంటుంది కనుక అని సమాధానమిస్తుంది. జంతుబలి నిషేధము గప్చిప్ గ అమ్మవార్లకు అన్ని కులాలువి శాకాహార నైవేద్యవిధానము మాత్రము ఇలా ఉంటుంది.

ప్రతి ఇంట్లోను అది పూరిపాకైనాసరే తూర్పు లేక ఉత్తర గోడకు పూజామందిరము పక్కన పసుపుతో వలయాకారముగ అలుకుతారు. మూడు అడ్డగీతలు కుంకుమతో రాసి మధ్యలో బొట్టు పెడతారు. పిండి వంటలు ముఖ్యంగా గారెలతో పంచ భక్ష్యములుతో కూడిన విస్తరిగ పెట్టినది నైవేద్యము. జగన్మాతకు పెట్టిన భోజనముగ ఆనివేదనను అమ్మవారి గుడి పూజారి కిగాని ఆయన భార్యకు గాని ఇస్తారు. వైరాగ్యము, సత్ప్రవర్తన, అహింస మున్నగు జ్ఞాన బోధాత్మ్యత జానపద వేదాంతం పరిశీలించాలి. ఏగంటి, పోతులూరి, వేమనవంటివారు జనుల నాలుక పైనిలిచారు. జాతర జాతరసుమ్మీ.. జాతరతీతుడు వేమనసుమ్మీ.. వేదాతీతుడు వేమనసుమ్మీ, వేమన చెప్పిన వేదముసుమ్మీ..” జానపదుల మనస్తత్వము.

నవవిధభక్తులులో భక్తి యోగముగ ఆహార సమర్పణ:

శ్రీ రాముడు శబరి ఎంగిలి చేసి యిచ్చిన పండ్లు ఆరగించాడు. కుచేలుడు యిచ్చిన గుప్పెడు అటుకులు కృష్ణుడికి మహదానందమయ్యాయి. తిన్నడు దోరగ కాల్చి యిచ్చిన మాంసపు ముక్కలు ఆరగింపు శ్రీ కాశహస్తేశ్వరునిది. కుంచెడు పాలు నైవేద్యము గ ఆరగింపు పెట్టిన గొడగూచి కథ ప్రసిద్ధము. నిదర్శనములు గలవిగ నమ్మిన కథలుగ ఇవి జానపదంలో చొచ్చుకొని పోయాయి. భగవంతుడు పరమాత్మ. జీవులన్నిపరమాత్మ స్వరూపమే. అందుచేత పత్రం పుష్పం ఫలం తోయం స్వీకరించిన భగవాన్ ఉవాచగ ఆశీర్వదించిన భగవద్గీత నైవేద్యవిధానమే మన సంస్కృతి. అన్నము నివేదనగ పరబ్రహ్మ స్వరూప ప్రసాద వితరణగ నైవేద్యపదమునకు ప్రాచుర్యము, అంకిత భావము జానపద సంస్కృతిగ విశిష్టతను చాటే నివేదనగ అన్నవితరణ సంస్కృతి అంకితభావం నేటి నైవేద్యసంస్కృతి.

భగవవంతునికి ఆహారముగ భగవంతుడు భిక్షమడిగేది భక్తి. బదులుగా ఇచ్చేది ముక్తిగ నమ్ముతారు. శివుడు కపాలము చేతిలో పట్టుకుని జోలె ధరించి భిక్ష గాడిగ వచ్చి భిక్ష నందుకుని ముక్తి నిస్తాడని వశ్వాసము. అతిథి సాక్షాత్తు విష్ణువే! అన్నార్తులకు ఆకలి తీర్చడము సమాజసేవకులకు జీవిత పరమార్థం వెదికేవారికి వరము అడిగి ఆకలి తీర్చడము గొప్ప విషయము.జంగందేవర సాక్షాత్తు మహేశ్వరుడేనని భావించే వారున్నారు. అంకిత భావముతో నిస్వార్ధనిరతాన్నదాతలు ఆకలిని మాత్రమే చూసారు. అటువంటి వారిలో నిరతాన్నదాతగ పేరుపడిన డొక్కా సీతమ్మ అన్న నివేదన పదమునకు కొత్త ఆర్ధము చూపారు. ఆమెకు నేటికీ నిరతాన్నదాతగ చిరస్మరణీయఖ్యాతి ఉంది.

డొక్కా సీతమ్మ వంటి అన్నదాన అంకిత భావములే నైవేద్య నంస్కృతికి బీజం వేసాయి. నిరతాన్నదానం దేవాలయసంస్కృతి ప్రాణము పోసిందని చెప్పవచ్చు. లక్ష పైబడి ఆదాయాన్ని కలిగిన దేవాదాయ దేవాలయములు నిత్యాన్నదాన సదుపాయముగ జానపద జీవనసంస్కృతిలో నైవేద్య విధానంగ అన్నదాతలకు కలిగించే స్ఫూర్తిని కాదనలేము.

శాతవాహన రాజులందరూ హిందూ మతాభిమానులు. వీరిలో అనేకులు అశ్వమేథయాగం చేసారు. కాని సామాన్యులు ఇష్టంపడిన బౌద్ధానికి ప్రోత్సాహమిచ్చారు. పరమతసహనంతో బౌద్ధులకు దానాలు చేసారు. గౌత మీపుత్రశాతకర్ణి తల్లి, ఇతర రాణులువంటి స్త్రీలు, ధనికులైన వర్తకరైతులు బౌద్ధ భిక్షువులకు దానాలు చేసారు. నాగార్జునునికాలంలో అమరావతి ఖ్యాతికెక్కింది. ఒక మహాచైత్యం యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించాడు. ఈ స్తూప విధ్వంసనానికి, శైవారాధనగ అమరావతి ఆలయ మార్పుకు కారణాలు హిందూ బ్రాహ్మణాధిపత్యం బలపడడం వలనని హ్యూన్ సాంగ్ రాశాడని ఏటుకూరి తనగ్రంథం బౌద్ధసంస్కృతి విధ్వసం ఆరవ అధ్యాయములో వివరిస్తారు. ఆరాధనాస్థలములులో, పండుగలు, జాతరలుగ సాగుతున్నవిమనకు కొత్తవిషయాలు చెబుతాయి. తెలుగు రాష్ట్రాలు. కొండవాగులు, సెలయేరులు, ఊటలు, జలలు... అనేకం కలిసి నదీప్రవాహమైనట్లే వేర్వేరు తెగలు, గణాలు, ప్రజలు కలిసిన ప్రాచీనజాతిగ ఆంధ్రజాతి అభివృద్ధి చెందింది అన్నారు ఏటుకూరు బలరామ మూర్తి ఆంధ్రులసంక్షిప్తచరిత్ర ఒకటవ అధ్యాయంలో. ఈ ఆంధ్రుల మహాప్రస్థానంలో నాగ, యక్ష, ద్రావిడగణా లసమ్మేళనం క్షత్రియ, బ్రాహ్మణులలోనె కాక బౌద్ధ సంస్కృతీ వికసనము సోదరభావంకలిగించింది (2వ అధ్యాయము - వివిధ తెగల సమ్మేళనము). బౌద్దమతానికి మూలసూత్రము సమానత్వము, కులమతాతీతము. కాని బౌద్ధమతంలో వజ్రయానంశాఖ మధు మాంస మైధునాది పంచమకార్యాలకు ప్రాధాన్యతిచ్చి పతనమైంది. హిందూ మతము పునరుజ్జీవింపజేయడానికి కారణమైంది. “బౌద్ధమతము తమ యభీష్టములు నిర్వహింప దేవతారాధనంలో మార్పులు ఆరంభించారని తెలియుచున్నది.(72వ పేజి సంస్కృత వాఙ్మయచరిత్ర - మల్లాది సూర్యనారాయణశాస్త్రి).

నైవేద్యవిజ్ఞానముగ. జానపద సంస్కృతి పల్లెపట్టణాలను దగ్గర చేసింది. అన్యమత ఆరాధనా స్థలాలకు గుర్తింపుగ వెలుగులోకి వచ్చిన దూబరాజుగుట్ట వంటివి భక్తిపరిశోధనకు ఆలోచనలవుతాయి. దూబరాజుగుట్ట - తూర్పుగోదావరిజిల్లా రాజోలుకు పది కి.మీ దూరంలో అదుర్రు గ్రామములో ఉంది. దూబరాజుగుట్ట తీర్థముగ రాజోలులో ఆదుర్రు గ్రామములో ఒకప్పుడు జరిగేది. దూబరాజు సంస్కృత వికృతరూపముగ స్తూపరాజము అని అర్థము. అశోకుని కాలములో సంఘమిత్ర అశోకుని కూతురుగ బౌద్ధ మతవ్యాప్తికి కృషి చేసిందన్నని చారిత్రిక సత్యమునేపథ్యముగ తూర్పుగోదావరి జిల్లాలో ఆదుర్రు అనే గ్రామంలో పురావస్తుశఖవారు దూబరాజు దిబ్బగా ఖ్యాతినొందిన స్థలములో నిర్మింపబడిన బౌద్ధస్తూపమును త్రవ్వి వెలుగులోకి తెచ్చారు.

ఆదిమ బౌద్ధ స్తూపమున్న ఊరు. ఆదిమవాసులు నివసించిన గ్రామముగాను అంటారు. కాని, బుద్ధుడికి ఆదిదేవుడనిపేరుంది. ఆదిదేవుడు శబ్దముగ ఆదిఊరు ఆదుర్రుగ వెలసిన స్తూపరాజ గ్రామముగ కూడ అంటారు. రథ చక్రాన్ని పోలి ఉన్న ఈస్తూపము మేడిచర్ల బాపన్నపొలంలో మట్టి దిబ్బగా ఉండేది. ప్రజలు దయ్యాలదిబ్బ అనిపిలిచి సంక్రాతి రోజులలో మాత్రమే వెళ్ళడానికి సాహసించి బలులిచ్చేవారు. ఆరాధనాలయములు ఎన్నో అన్యమతవిశేషాలు కలిగి ఉంటాయి. నేడు జాతరలు, పండుగలు పేరిటజరప బడుతూ మరుగునపడిపోయి ఉండవచ్చు అన్న విషయాన్ని ధ్వనిస్తోంది. అమరావతి, ద్రాక్షారామములకు బౌద్ధ ఆరాధనా స్థలముల ఆనవాళ్ళున్నవి. ప్రసిద్ధ పుణ్యక్షేత్ర శైవ, వైష్ణవ శాక్తేయ, దేవతామూర్తులతోబాటు అన్యమత సంస్కృతి అర్చనలు, పూజించు విధానములలో వేర్వేరు ఆరాధన హిందూ సంప్రదాయానుసారంగా పండుగులుగ తప్పనిసరి వైవిధ్య నైవేద్యవిధానము జానపద సంస్కృతి నుంచే వచ్చింది. ఇహములోని ఆరాధన పరలోకములో కూడ భుక్తిముక్తిని కలిస్తుందన్నది నైవేద్యవిధానము ఒకప్పటి జానపదసంస్కృతి అన్నదాన సంస్కృతిగ బలపడుతోందన్నది నా అభిప్రాయము.

వ్యాసరచనకు సహకరించినవి:

  1. సమగ్ర ఆంధ్రసాహిత్యము - మొదటి సంపుటము - ఆరుద్ర
  2. జానపదగేయవాజ్ఞ్మయము - బిరుదురాజు రామరాజు
  3. తెలుగుజానపదకథలు - నాయనికృష్ణకుమారి
  4. గరుడపురాణము
  5. పాండురంగమాహాత్మ్యము – తెనాలి రామకృష్ణుడు
  6. కొడవటిగంటి కుటుంబరావు గారి ఆమ్మమ్మకథ
  7. సంస్కృత వాజ్ఞ్మయ చరిత్ర - మల్లాది సూర్యనారాయణశాస్త్రి