AUCHITHYAM
AUCHITHYAM  |  Volume-7  |  Issue-11  |  October 2026  |  Peer-Reviewed  |  ISSN: 2583-4797
ఔచిత్యమ్ పరిశోధన మాసపత్రిక ఆరవ వార్షికోత్సవ సంచిక

8. బాల, ప్రౌఢ వ్యాకరణాలు: సంజ్ఞాపరిచ్ఛేద సమన్వయం

Author photo
చక్రహరి రమణ
తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), సిద్ధిపేట,
సిద్ధిపేట జిల్లా, తెలంగాణ.
Cell: 9247226292  |  Email: ramana.chakrahari@gmail.com
Received: 14 Sep 2026  |  Accepted: 26 Sep 2026  |  Published: 01 Oct 2026
Article: https://auchithyam.com/2026/oct_2026/full_papers/october26_08.phpPDF
Abstract
తెలుగు భాషలోని మాధుర్యం, నుడికారము తెలుసుకోవాలంటే తెలుగు భాషపై పటుత్వం పరిపూర్ణంగా ఉండాలి. అలాంటి తెలుగు భాషకు ప్రాచీనులు అనేక లక్షణ గ్రంథాలు రచించారు. విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి తొమ్మిదో ఉల్లాసంలో సంధి, సమాస, తద్దితాలలో, చిత్రకవి పెద్దన రచించిన లక్షణసారసంగ్రహం తృతీయ ఆశ్వాసంలో, ముద్దురాజురామన రచించిన కవిజనసంజీవని ప్రథమ, ద్వితీయాశ్వాసాలలో, కాకునూరిఅప్పకవి రచించిన అప్పకవీయం ప్రథమ ద్వితీయాశ్వాసాలలో, గన్నవరపువేంకటకవి రచించిన సర్వలక్షలశిరోమణి ఐదవ ఉల్లాసంలో, కూచుమంచితిమ్మన రచించిన లక్షణసారసంగ్రహం మూడశ్వాసాలలో సంబంధించిన, వ్యాకరణాంశాలు ఉన్నాయి. ఇవే కాకుండా తెలుగు వ్యాకరణాలల్లో పరవస్తుచిన్నయసూరి రచించిన బాలవ్యాకరణం, మరియు బహుజనపల్లి సీతారామాచార్యులు రచించిన ప్రౌఢవ్యాకరణాలు మిక్కిలి ప్రసిద్ధి పొందిన గ్రంథాలు. బాలవ్యాకరణంలోని సూత్రాలను కొన్నింటిని విమర్శిస్తూ మరియు అనేక అంశాలు సంగ్రహముగా నిరూపించి, ఇతర లక్షణ గ్రంథాలతో పరిశీలనచేసి, తులనాత్మకతతో, కొత్త ప్రయోగాలతో రచించిన గ్రంథం ప్రౌఢవ్యాకరణం. బాల ప్రౌఢ వ్యాకరణం సంజ్ఞ పరిచ్చేదంలోని సూత్రాలను పరిశీలనాత్మకంగా సమన్వయంచేసి, వాటి ప్రాధాన్యత ఈ వ్యాసంలో వివరించబడింది.
Keywords: వ్యాకరణం, సంజ్ఞ, దంత్యం, తాలవ్యం, ఆదేశం, ఆగమం.

1. ప్రవేశిక

“అల్పాక్షర మసందిగ్ధం సారవద్విశ్వతోముఖం సమ్యక్సంసూచితార్థం యత్ తత్ సూత్రమితి కథ్యతే” (కావ్యాలంకార సూత్రాణి, కామధేను వ్యాఖ్య, పు. 2).

సూచించబడే అర్ధాన్ని అల్పాక్షరాలల్లో విస్తృతంగా సూచించేది సూత్రం. ఈ సూత్రాల ఆధారంగానే వ్యాకరణాంశాలు భాషలో చోటు చేసుకుంటాయి. మానవుడు తన మనసులోని భావాలను బహిర్గతం చేయడానికి సాధనంగా వాహికగా ఉపయోగపడేది భాష. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడువేలకు పైగా భాషలు వ్యవహారంలో ఉంటే అందులో ముప్పైఏడు వందలకు పైగా లిపి కలిగిన భాషలు ఉన్నాయి. భారతదేశంలో ద్రావిడ భాషా కుటుంబాలున్నాయనడం సర్వవిదితం. అందులో మధ్య ద్రావిడ భాషకు చెందిన ఏకైక సాహిత్య భాష తెలుగు భాష. అలాంటి తెలుగు భాషకు సాహిత్యం, వ్యాకరణం రెండు నేత్రాల వంటివి. సుమారు పదకొండవ శతాబ్దము నుండి నేటి వరకు, నన్నయ్య కాలం నుండి ఆధునిక కాలం వరకు సాహిత్యం వెల్లివిరుస్తూనే ఉంది. అదేవిధంగా వ్యాకరణం కూడా ఆంధ్ర శబ్ద చింతామణి నుండి నేటి వరకు విభిన్న రకాల వ్యాకరణ గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు భాష పైన పట్టు సాధించాలన్నా, తెలుగు భాష ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నా భాషలో ఉపయోగించవలసినవి వ్యాకరణ అంశాలు. నన్నయ యుగం నుండి మొదలు సంస్కృతంలో అనేక వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయి. తెలుగులో ముఖ్యంగా బాల వ్యాకరణం, ప్రౌఢవ్యాకరణం, ఆంధ్ర కౌముది, కావ్యాలంకార చూడామణి మొదలైన వ్యాకరణ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అందులో బాల, ప్రౌఢ వ్యాకరణాలు ప్రసిద్ధి పొందిన గ్రంథాలు. అందులోని సంజ్ఞ పరిచ్చేదంలోని సూత్రాల సమన్వయ ప్రస్తావన తీసుకున్నట్లయితే తెలుగు వ్యాకరణ ప్రాముఖ్యం ఎలాంటిదో తెలుస్తుంది.

వ్యాకరణం ఒక భాషను శుద్ధంగా, సరిగ్గా మాట్లాడటానికి, చదవడానికి, వ్రాయడానికి ఉపయోగపడే నియమాలను తెలిపే శాస్త్రం. భాషలోని పదాలను కూర్చడం, వాక్యాలను నిర్మించడం ఈ వ్యాకరణం నేర్పిస్తుంది. అసంపూర్ణ, అపశబ్దాలను వేరు చేసి, పరిపూర్ణమైన పదాలను వ్యాకరణం అందిస్తూ, భావాలను ఎదుటి వారికి పొరపాట్లు లేకుండా స్పష్టంగా చేరవేయడానికి వ్యాకరణం తోడ్పడుతుంది.

2. దంత్య తాలవ్య చజలు

అ, ఆ, ఉ, ఊ, ఒ, ఓ లతో కూడిన చ, జ లు దంత్యాలని, ఇ, ఈ, ఎ, ఏ లతో కూడిన చ, జ లు తాలవ్యాలని అంటారు. బాల వ్యాకరణంలో దంత్య, తాలవ్య చజలు సవర్ణములని నిర్వచించాడు పరవస్తు చిన్నయసూరి. చ, జ ల పుట్టుక స్థానము అభ్యంతర ప్రయత్నంల భేదములు (స్పృష్టము). కనుక దీనిని బట్టి సవర్ణములని తెలిసినప్పటికీ, దంత్య చ, జ లు, తాలవ్య చ, జ లు అని మరొక రెండు సూత్రంలలో వివరించాడు. ఇందులో దంత్య చజలనేవి తెలుగు పదాలకే కానీ సంస్కృత పదాలకు కాదు. వీటితోపాటు మరొక్క సూత్రంలో సంస్కృత సమాలైన ఇకారాంత శబ్దాల ఉపదా చజలకు బహువచనం పరమైనప్పుడు తాలవ్య చ, జ లు దంత్య చజలు అవుతాయని సూత్రీకరించాడు. ఉదాహరణకు రాజి, రోచి ఇవి బహువచనాలుగా మారితే రాజులు, రోచులు అవుతాయి. ఉకార చ, జ లు దంత్యములు అనే సూత్ర ప్రకారం ఇక్కడ దంత్యాలవుతాయి. ప్రౌఢ వ్యాకరణంలో:

“ఒకానొకచో జకారంబుభయంబు నగు” (ప్రౌఢవ్యాకరణం, సంజ్ఞ పరిచ్ఛేదం, సూత్రం 4)

సంస్కృత సమాలైన ఇకారాంత శబ్దాల ఉపదా చజలకు బహువచనం పరమైనప్పుడు తాలవ్య చ, జ లు దంత్య చజలు అవుతాయి అనే సూత్ర ప్రకారం ఉభయంబులు. కానీ బహుజనపల్లి సీతారామాచార్యులు చ, జ లు అని అనకుండా కేవలం ‘జ’ మాత్రమే దంత్య తాలవ్యం అదీ ఒక్కోసారి అనడంలోని ఆంతర్యాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ రెండు సూత్రాల తారతమ్యంలో భాగంగా సంస్కృత సమాలకు బహువచనం పరమైనప్పుడు దంత్యమవుతుంది. జ కారం ఉభయంబు అంటే అది శ్లేషార్థంలో వివరిస్తుంది.

ఉదాహరణకు ‘పాండురాజు యశమెన్న వైతి’ ఇందులో 'జ' కారం భారతం ప్రకారం పాండురాజు యశస్సు అన్నప్పుడు దంత్యం అవుతుంది. రామాయణం ప్రకారం పాండుర+అజయశము అన్నప్పుడు తాలవ్యం అవుతుంది. చిన్నయసూరి తెలిపినట్లు సంస్కృత సమములు దంత్యములు కావు అనే సూత్ర ప్రకారంగా అజయశము అనునది తత్సమపదం. అదేవిధంగా పంచదార అంటే చెక్కర, ద్రౌపది అనే శ్లేషర్థాలున్నాయి. బాల వ్యాకరణ సూత్రప్రకారము తాలవ్యముగానే సూత్రీకరించినాడు. అంటే 'జ' కారం తో పాటు 'చ' కారం కూడా దంత్యంగా చెప్పబడుతుంది. ఇక్కడ ఒకానొకచో అంటే శ్లేషార్థం అని రూడి అవుతుంది. ఈ సూత్రప్రకారం దంత్య తాలవ్యాల ప్రస్తావన బాలవ్యాకరణాన్ని దాటి పోలేదని చెప్పవచ్చు.

“రాజు వైకృతంబని కొందరందురు” (ప్రౌఢవ్యాకరణం, సంజ్ఞ పరిచ్ఛేదం, సూత్రం 5)

సంస్కృత పదాల యందు దంత్యములు ఉండవని బాల వ్యాకరణంలో సూత్రం. రాజు శబ్దము తత్సమం కాదని తద్భవమని కొందరంటారని ప్రౌఢ వ్యాకర్త నిర్ణయం. ఇక్కడ వైకృతం అంటే తద్భవమని అర్థం. అచ్చ తెలుగు గ్రంథం పొన్నగంటి తెలగన యయాతి చరిత్రలో రాజు అనే శబ్దాన్నిపయోగించాడు.

“సీ॥  పూవింటివాఁడు నేర్పున సోయగంబున
         వినువాఁక బిడ్డండు వింటికడిమిఁ
        దామర చెలిచూలి తగునీగి నానచే
      రాముండు ప్రతిన బీరంబు నందుఁ
     పుడమి తాల్పరియె నిల్కడఁ బల్కు నేర్పున
    రాజు సొంపున నిబ్బరంపుఁ దెలివి 
    నేను మోముల మేటి హెచ్చగు బలిమిచే
    రారాజు సొమ్ముల రవణమునను
తే ll నెట్టి వజీర్లు నెన్నంగ నీడుగారు
      కొమరు మీఱు హుమామియా కొమరుఁ డగుచుఁ
     బొలుపుఁగనిన బడేమియా పుడమినేని కహహ !
     ముజ్జగముల యందు నరసి చూడ” (యయాతి చరిత్ర, ఆశ్వాసం 1-19)

యయాతి అచ్చ తెలుగు గ్రంథంలో రాజు అనే శబ్దం చోటు చేసుకుందంటే ఆపదం అచ్చతెలుగు పదం. అందుకే ప్రౌఢవ్యాకర్త కొందరందురు అన్నాడు. బాల వ్యాకర్త రాజి అనే తత్సమ శబ్దానికి బహువచనం పరమైతే రాజులులోని 'జ' కారం దంత్యముగా వస్తుందన్నాడు. ప్రౌఢవ్యాకరణములో రాజు వైకృతం అంటే రాజులులోని 'జ'కారం దంత్యం అని అర్థం. బాల వ్యాకరణంలో దంత్యమయింది. అలాగే ప్రౌఢవ్యాకర్త దంత్యం అన్నాడు. కానీ ఇక్కడ రాజు వైకృతమని కొందరన్నారని అన్నాడే కానీ మరి తన అభిప్రాయం ఆకొందరితో ఏకీభవించాడా లేదా అనే ఆలోచన రావచ్చు. ముందు సూత్రంలో జకారం ఉభయంబులని రాజులోని జ కారం వైకృతమని దగ్గరికి పోలికతో వివరించాడు.

3. నకారంబు ద్రుతము

బాల వ్యాకరణంలో ‘నకారంబు ద్రుతము’ (బాల సం 11), ప్రౌఢ వ్యాకరణంలో ‘నకారంబసాధారణంబ ద్రుతము’ (ప్రౌఢ సం 7) అని పేర్కొన్నారు. ఇందులో నకారం ద్రుతము అంటే పదాదిలో, పదమధ్యమున, పదాంతమున ఉన్న నకారాలన్నీ ద్రుతములే అవుతాయా అని సందేహం కలుగవచ్చు. అందుకే వెంటనే చిన్నయసూరి దృతాంతములైన పదములు ద్రుత ప్రకృతికాలు అన్నాడు. తెలుగు భాషలోని పదాలు నకారాంతాలు, అజంతాలు అని రెండు రకాలు. ఈ నకారాంతాలను ద్రుత ప్రకృతికాలు అంటారు. బాల వ్యాకర్త దృతమునకు మూలం నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణిలో ‘దృతాక్యోనః’ అనేది. అలాగే సంధి పరిచ్ఛేదములో ద్వితీయాది విభక్తులలో ఉన్న ‘ను’ పొల్లు ‘న్’ లను ద్రుతములని ప్రస్తావించాడు. అంటే దృత స్వరలోపముచే వ్యంజనకారము వస్తుంది. వీటన్నింటి దృష్ట్యా ‘ను’ ఆగమంగా ఉన్నట్లయితే అది ద్రుతము అని తెలుస్తుంది.

ప్రౌఢవ్యాకర్త అసాధారణమైన ‘న’కారము ద్రుతము అన్నాడు. అసాధారణం అంటే ప్రత్యయాత్మకం, ఆగమాత్మకం, అవ్యయాత్మకమై ఉత్వముతో ఉన్న నకారమని అర్థం. ప్రత్యయాత్మకం - తాను, నేను ‘ను’ కారం రెండు వ్యాకరణ సూత్రాల ప్రకారం ద్వితీయాదిలో ఉత్వముతో కూడిన ‘న’ కారం అన్నప్పుడు ఈ ‘ను’ కారం కేవలం తాను, నేనులకు మాత్రమే రాదు. ధనమును, వనమును మొదలైన వాటిలో కూడా వస్తుంది. అలాంటప్పుడు తాను, నేనులోని ‘న’ కారం అని అంటే విరుద్ధమే అవుతుంది. ఈ నేపథ్యంతోనే ప్రౌఢవ్యాకర్త అసాధారణమైనదని అనవచ్చు. ఆగమాత్మకం- నన్నును, నాచేతను, చదువుచును.... సంధి సూత్రం ‘ప్రథమేతర విభక్తి శత్రర్థ చువర్ణముల ఉకారానికి సంధి వైకల్పికం’ (బాలవ్యాకరణం, సంజ్ఞ పరిచ్ఛేదం, సూత్రం 2). శత్రర్థ చువర్ణమనుటలో అర్థం వర్తమానకాల అసమాపక క్రియ నన్నున్, నన్నును అనుటలో ఆగమంతో పాటు ప్రత్యయం కూడా అవుతుంది. అలాగే నాచేతను, చదువుచును మొదలైనవి. అవ్యయాత్మకం - అన్నయును, తమ్ముడుయును... నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణిలో ‘దృతాక్యోనః’ అంటే పొల్లు ‘న’ కారమునుద్దేశించి అని ఉండవచ్చు. ఇక్కడ బాల, ప్రౌఢ వ్యాకర్తలు వివరణాత్మకంగా భాషలో ఉండే విధానాలను అనుసరించి ద్రుత ప్రస్తావన తెచ్చి ఉండవచ్చు.

4. ఆర్య వ్యవహారంబు గ్రాహ్యం

ఆర్యులు అంటే పెద్దలు, శిష్టులు, శాస్త్రం తెలిసినవారు. నాటి నుండి నేటి వరకు పెద్దవాళ్లు, పండితులైన వారు పెద్దలు చెప్పిన వాటిని పాటించాలి, పెద్దలను అనుసరించాలి అనే మాటలను వింటూ ఉన్నాం. భాష విషయంలో కూడా నలుగురు నడిచిన బాటలో నడువు అనకుండా పెద్దలు వ్యవహరించే విధానాలను గ్రహించు, నేర్చుకో అంటారు. కావ్య భాష, గ్రాంథిక భాష, వ్యవహారిక భాష అని వ్యవహరిస్తూ ఉంటాం. కాలం మారుతున్న కొలది భాషలో మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. అందుకే భాషా విషయంలో కూడా ఆర్య వ్యవహారాన్ని గ్రహించు అనే సూత్రం స్థిరంగా నిలిచింది.

కఱకంఠుడు, ప్రాణగొడ్డము, కపిలకన్నులు.... ఆర్యులు వ్యవహరించారని చిన్నయసూరి ప్రస్తావించాడు. ప్రత్యేకంగా ఈ పదాలనే గ్రాహ్యము అన్నాడనుటలో అర్థం కఱకంఠుడు అనే పదం మిశ్రమ బహువ్రీహి సమాసం. ఈ పదాన్ని నన్నయ ‘కఱకంఠా క్షమింపుము’ అని ప్రయోగించాడు. ఇందులో ఉన్న ఱ తద్భవము. ఈ విషయం ప్రౌఢవ్యాకర్త ప్రస్తావించలేదు. కానీ:

“ప్రాణ గొడ్డమ గ్రామ్యంబు నాదగు” (ప్రౌఢవ్యాకరణం, సంజ్ఞ పరిచ్ఛేదం, సూత్రం 12)

ప్రాణ గొడ్డము, ప్రాణ కుట్టుక అనే శబ్దం నుండి పుట్టింది. కానీ బాల వ్యాకర్త లక్షణ విరుద్ధమైనది గ్రామ్యమని, ఆర్య వ్యవహారం గ్రాహ్యమని అన్నాడు. ప్రౌడ వ్యాకర్త ఆర్యులు గ్రామ్యపదాన్ని వాడలేదని, ప్రాణగొడ్డము అనే శబ్దం ప్రాణకుట్టుక అనే శబ్దం నుండి పుట్టింది కాబట్టి ఈ పదాన్ని ఉపయోగించాడని, అందుకే ప్రాణగొడ్డము అనే పదం అగ్రామ్యమన్నాడు. అంటే గ్రామ్యము కానిదని, అలాగే కపిల కన్నులను కూడా గ్రామ్యములైనప్పటికీ ఆర్యులు వ్యవహరించారని గ్రహించాలన్నాడు బాలవ్యాకర్త. కానీ ఈ శబ్దం గ్రామ్యం కాదని, కపిల శబ్దము నుండి పుట్టిందని, కవిల శబ్దముతో జరిగిన ఆచ్చిక సమాసములే కాబట్టి ఈ పదము అగ్రామ్యమన్నాడు బహుజనపల్లి సీతారమాచార్యులు.

ఉపసంహారం

మానవుని జీవనగమనంలో భాగంగా మాతృభాష ఎంతో ముఖ్యమైనది మాతృభాషతోనే ఇతర భాషలలో విజ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాడు. మాతృభాషలోనే లోపం ఉన్నట్లయితే ఆ వ్యక్తి సమాజంలో రాణించలేడు. తెలుగు మాతృభాషగా ఉన్న ప్రతి వ్యక్తి తెలుగు భాషకు సంబంధించిన వ్యాకరణ విషయాలను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థి దశ నుండి మొదలు పాండిత్య విలువలు ఉన్న పండితుల వరకు వ్యాకరణ అంశాలు భాషకు ప్రాణం పోసేదిగా వ్యాకరణ గ్రంథాలు దీటుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాల వ్యాకరణం అటు ప్రౌఢ్యాకరణంలోని సూత్రాలను విద్యార్థి దశ నుండే సమన్వయపరచుకోవడం ఎంతైనా అవసరముంది. భాష ఝరీ ప్రవాహంవంటిది. అలాంటి భాషలో నిత్యం నూతనత్వం అన్యదేశ్యాల కలయిక, ఆధానాలు, ప్రధానాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇప్పటివరకు వ్యాకరణానికి సంబంధించిన గ్రంథాలు ఎన్నో వెలుగులోకి వచ్చినప్పటికీ ఇంకా తెలుగు భాషకు వ్యాకరణసంబంధమైన అంశాలతో మారుతున్న కాలానికనుగుణంగా, భాషకకనుగుణంగా తెలుసు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

ఉపయుక్త గ్రంథసూచి

  1. కృష్ణకుమారి, దావులూరి. ఆంధ్రశబ్ద చింతామణి, తద్వ్యాఖ్యానాలు, నవభారతి ప్రచురణ, తిరుపతి, 2012.
  2. నరసింహాచార్య, వెంకట. శ్రీ భాష్యం తత్వబోదిని వ్యాఖ్య, విశాల ప్రింటర్స్, గుంటూరు, 1953.
  3. నరసింహారెడ్డి, పి. చిన్నయసూరి బాల వ్యాకరణం, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2007.
  4. భాస్కర్ రావు, టి. బాలప్రౌఢ వ్యాకరణసర్వస్వము, ప్రశాంతి పబ్లిషర్స్, కాకినాడ, 1992.
  5. సీతారామాచార్యులు, బహుజనపల్లి. ప్రౌఢ వ్యాకరణం ఘంటాపథం, విశాలాంధ్ర పబ్లికేషన్, హైదరాబాద్, 1999.
How to cite this article:
చక్రహరి రమణ (2026). బాల, ప్రౌఢ వ్యాకరణాలు: సంజ్ఞాపరిచ్ఛేద సమన్వయం. AUCHITHYAM, 7(11), 59–63.
© 2026 AUCHITHYAM. Published under a Creative Commons Attribution 4.0 International (CC BY 4.0) licence.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.