
శ్రీ మహావిష్ణువు దశావతారాలలో నృసింహ అవతారం నాలుగవది. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై లోకకళ్యాణార్థమై దశావతారాలు ఎత్తాడు. మహబూబ్నగర్ జిల్లాలో 40 వరకు నృసింహ ఆలయాలు ఉన్నాయి. వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్ మండలం సింగపట్టణం (సింగోటం) లో లక్ష్మీనరసింహాలయం ఉంది.
శివ కేశవులకు అభేదం లేకుండా స్వామివారు త్రిపుండ్రం, ఊర్వ పుండ్రాలు కలిగి స్వయంభుగా ఈ ప్రాంతంలో వెలిశారు. ఆలయ పాదానికి కుడివైపున శివాలయం ప్రతిష్టను, రత్నగిరి కొండ పైన రత్నలక్ష్మి అమ్మవారు ప్రతిష్టను చేశారు.
కొల్లాపూర్ మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో సింగోటం (సింగపట్టణం) గ్రామంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి లింగ రూపంలో వెలిశాడని విశేషంగా చెబుతారు. మకర సంక్రాంతి మొదలుకొని నెలరోజుల పాటు స్వామి వారి ఉత్సవాలు చూపరులకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకు మహబూబ్నగర్ జిల్లా ఏ కాక ఇరుగుపొరుగు జిల్లా వాసులతో పాటు కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకొని తరిస్తారు.
ప్రాచీనమైన ప్రసిద్ధి నొందిన దేవాలయాల్లో సింగాపట్టణం (సింగోటం) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి. రత్నగిరి కొండకు అభిముఖంగా స్వామివారు ఈ ప్రాంతంలో కొలువుదీరారని ఒక ఆసక్తికరమైన చారిత్రక గాధ ఉంది. ఒక యాదవుడు ప్రతి దినం తెల్లవారుజామున "గోర్కాలు" చూసుకుంటూ తన పొలంలో అరక దున్నుతున్నాడు. అప్పుడు లింగ రూపంలో ఉన్న ఒక నల్ల సరుపరాయి నాగలికి అడ్డు తగులుతూ అతని పనికి అంతరాయం కలిగించేదట. రైతు ఆ శిలను ఎన్నిసార్లు ప్రక్కకు చేర్చినా తిరిగి అదే స్థలానికి చేరుతుండడంతో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శిలా మహిమను అతను గుర్తించలేకపోయాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి.
ఆ యాదవుడు తాను పేదవాడినని, తన పనికి అంతరాయం కలగకుండా కరుణించమని ఆ శ్రీమన్నారాయణుడిని ప్రార్థించాడు. భక్తుడి మొర విన్న శిలా రూపంలోని స్వామి ఆ రాత్రి నేరుగా భూపాలుడైన సింగమ నాయకుని స్వప్న రూపంలో సాక్షాత్కరించాడు.
“తాను ఉత్తర దిశలో రెండు ఆమడల దూరంలో గల ఒక రైతు పొలంలో లింగ రూపంలో వెలిశానని, రోజు నాగలికి అడ్డుపడుతున్న రైతు తలను గుర్తించడం లేదని, ఇదే దినం తనను గుర్తించి వెంటనే ప్రతిష్టించి పూజలు జరుపమని శాసించడంతో సింగమ నాయుడు నిద్ర నుండి ఉలికిపడి లేచి తాను కలలో విన్నది, కన్నది ఎంతవరకు నిజమో! అనుకొని సైన్యంతో హుటాహుటిన బయలుదేరి ఆనవాళ్ళ ప్రకారం రైతు పొలాన్ని కాగడాలతో వెతికించగా లింగ రూపంలో ఉన్న ఒక శిలా కాంతివంతంగా వెలుగుతూ కనిపించింది.. కలలో స్వామి చెప్పిన పోలికలు లింగాకారాశిలలో కనిపించడంతో ఆశ్చర్య చిత్తుడైన రాజు ఆ స్వామిని ప్రజలు తోడు రాగా ప్రస్తుతం ఉన్న ఆలయం వెనక ఎత్తున బండ ప్రాంతానికి రాగానే స్వామి శిలను తలపై ఎత్తుకున్న వారికి అవహిస్తాడు. తాను శ్రీ లక్ష్మీనరసింహ ని అని చెప్పుకుంటాడు. ఈ ప్రాంతంలో మొదటగా దించారు కాబట్టి దీనిని పాదం గుడి అని పేర్కొంటారు.” (నల్గొండ జిల్లా జాతరలు- పరిశీలన 114-115)
నృసింహ స్వామి ప్రతిష్ట జరిపిన కాలంలోనే ఆంజనేయ ప్రతిష్ట జరిగింది. ఈ క్షేత్రంలో వెలిసిన స్వామి లింగాకారంలో గల నృసింహుడు. స్వామికి ఒక కన్ను కిందకు, ఒక కన్ను మీదకు ఉంటుంది. ఎడమ కన్ను క్రిందన గల భాగంలో కమలం ఉంది. కమలం లక్ష్మీ స్థానం కనుక స్వామిని లక్ష్మీ నృసింహుడు అయ్యాడు. స్వామి వెలిసిన రాతి కొండకు "శ్వేతాద్రి" అని పేరు.
శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయానికి అబిముఖంగా అర కిలోమీటర్ దూరంలో రత్నగిరి అనే పేరు గల ఎత్తైన కొండ ఉంది. ఆ కొండపై రత్నలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ట చేశారు. స్వామి హృదయం పై గల కమలం లక్ష్మీ స్థానం కనుక లక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు కనిపించడం లేదు. అందువల్ల రాణి రత్నమాంబ హయాంలో 148 సంవత్సరాల క్రితం మద్రాస్ నుండి క్రీ.శ. 1857 లో రత్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ట చేశారు. ఈ కొండపై ఆహ్లాదకరమైన వాతావరణంలో కొల్లాపూర్ రాజావారి పురాతనమైన విడిది భవనం ఉంది. చుట్టుపక్కల గ్రామాల వారికి, విద్యార్థులకు ఈ రత్నగిరి కొండ పిక్నిక్ స్పాట్ గా ఉపయోగపడుతుంది.
నృసింహ స్వామి ఆలయం పాదానికి కుడివైపున గల పవిత్రగుండంలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరించిన సర్వరోగాలు హరించి పోతాయని, మనసారా స్వామిని ధ్యానించి తలనీలాలు సమర్పించుకొని ఈ గుండంలో స్నానమాచరిస్తే సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ తడి బట్టలతోనే మొక్కులు చెల్లించుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం.
తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఈ ప్రాంతంలోని జలాశయాలు ఎండిపోయినా ఈ గుండంలో మాత్రం సర్వకాల సర్వ వ్యవస్థలో నీరు ఉండటం ప్రత్యేకత. భక్తులు మొక్కుగా బెల్లం గడ్డలు పుష్కరిణిలో వేస్తే తమ రోగాలు స్వామి హరింప చేస్తాడని ఈ ప్రాంతం జానపదుల విశ్వాసం.
మొదట నాపరాయితో అతి సామాన్యంగా నిర్మించిన ఈ దేవాలయం తర్వాతి కాలంలో అభివృద్ధికి నోచుకుంది. నిజాం కాలంలో మంత్రి అయిన చందూలాల్ బహదూర్ గారు ఈ దేవాలయాన్ని దర్శించి దీని అభివృద్ధి నిమిత్తం 240 ఎకరాల మెట్ట, 12 ఎకరాల మాగానిని అర్చకులైన లక్ష్మీ నరసింహయ్య శాస్త్రి (లచ్చేర్సు) గారి హయాంలో అర్చకత్వానికి రాసిచ్చారు. దీన్ని దేవుని మాన్యంగా వ్యవహరిస్తారు. క్రీ. శ. 1795 లో నిర్మించారు. గర్భగుడి 40 అంకణాల మంటపం అర్చకుడైన రాఘవ సోమయాజి కాలంలో నిర్మించారు. ఇక్కడ గల సత్రశాలను కర్నూలు నివాసి కటకం బుర్రయ్య శెట్టి కుమారుడు భారయశెట్టి శాలివాహన శకం 1819 హేవిళంబి మార్గశుద్ధ భానువారం క్రీ. శ. (1897) లో నిర్మించాడు. శాలివాహన శకం 1854 లో కొల్లాపూర్ రాణి వెంకటరత్నమాంబ గారు స్వామికి గాలిగోపురం కట్టించింది. 1881 లో భక్తులు తేరు రధమును చేయించగా దానికి ఎదిరే నరసింహారావు గారు రధశాలను కట్టించినారు. 1890 లో శ్రీమతి ఇందిరా దేవి గారి స్మారకంగా నృసింహ సాగరానికి కాలువను సురభి వంశస్థులు నిర్మించారు.
మకర రవి అన్నట్లుగా మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఉత్తరాన పుణ్యకాలం వస్తుంది. ఆ సందర్భంలో సంక్రాంతి మొదలుకొని దాదాపు నెల రోజులపాటు ఈ ప్రాంతంలో జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. 6 రోజులపాటు బ్రహ్మోత్సవాలు, 25 రోజులపాటు జాతర జరుగుతుంది. జనవరి 14 వ తేదీన స్వామివారికి పూజ, మధ్యాహ్నం వదులుకొని సాయంత్రం వరకు శకటోత్సవం జరుగుతుంది. ఈ రోజున శకటోత్సవం (పలారం బండ్లు) విశేషంగా జరుగుతుంది. పలారం బండ్ల రోజున సింగాపట్టణం చుట్టుపక్కల గ్రామాల వారు ఎద్దులను, బండ్లను అలంకరించి స్వామికి ఎదురుగా గల జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవడంతో ఉత్సవం వస్తుంది.

స్వామి అవతారం నృసింహుడు అయినప్పటికీ కోరిన కోరికలను నెరవేర్చే దైవంగా ఈ స్వామి ఖ్యాతినొందారు. సురభి వంశంలో 26 వ తరం రాజు అయిన శ్రీ వెంకట జగన్నాధ రావు కాలంలో కవి సార్వభౌమ బిరుదాంకితుడైన "హో సద్గురుం" కృష్ణమాచార్యులు సింగ పట్నం నృసింహస్వామికి అంకితంగా "లక్ష్మీ నృసింహ విలాసం" అను సంస్కృత చంపూను రచించాడు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఈ ప్రాంతం జనుల సంస్కృతికి దర్పణం పడుతుంది. కుల, మత వర్గాలకు అతీతంగా జానపదులను ఒకే త్రాటిపై నడుపుతుంది. వర్తమాన పరిస్థితుల ప్రభావాన్ని తన దరికి చేరనివ్వకుండా, భక్తుల పాలిట కోరిన కోరికలను కొంగుబంగారమై ఆదర్శంగా నిలుస్తుంది.
·విషయ సేకరణలో తోడ్పడిన వారు:
1. ఎల్ల పోగుల వెంకటస్వామి. (32 సం.లు) సింగోటం.
2. టి సత్యమ్మ (50 సం. లు) సింగోటం.
3. పడమటి సుశీల. (33 సం. లు)