AUCHITHYAM
AUCHITHYAM  |  Volume-7  |  Issue-11  |  October 2026  |  Peer-Reviewed  |  ISSN: 2583-4797
ఔచిత్యమ్ పరిశోధన మాసపత్రిక ఆరవ వార్షికోత్సవ సంచిక

5. దువ్వూరి రామిరెడ్డి విమర్శనాదృక్పథం: పరిశీలన

Author photo
డా. పోగుల విశ్వప్రసాదు
అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ,
ప్రభుత్వ ఆర్స్స్ & సైన్స్ కళాశాల (స్వం.), కామారెడ్డి,
కామారెడ్డి, తెలంగాణ.
Cell: 9866802692  |  Email: pogulavishwam72@gmail.com
Received: 15 Sep 2026  |  Accepted: 28 Sep 2026  |  Published: 01 Oct 2026
Article: https://auchithyam.com/2026/oct_2026/full_papers/october26_05.phpPDF
Abstract
తెలుగు సాహిత్య విమర్శనారంగంలో దువ్వూరి రామిరెడ్డి అందించిన ‘కవిత్వతత్త్వనిరూపణ’ వ్యాసాలలోని సౌందర్య, రస, శిల్ప వివేచనలను విశ్లేషించడం ఈ పరిశోధన ముఖ్యోద్దేశం. ఆధునిక తెలుగుసాహిత్య విమర్శపై పాశ్చాత్య కాల్పనికోద్యమ ప్రభావం ఉన్నప్పటికీ, దువ్వూరి ప్రాచ్య అలంకారికశాస్త్రలక్షణాలను సమన్వయం చేస్తూ విమర్శనా పద్ధతులను రూపొందించారు. కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వంటి విమర్శకుల బాటలో పయనిస్తూనే, దువ్వూరి తనదైన శైలిలో కావ్యవస్తువు, భాష, శిల్పం, నీతి, రసరామణీయకతలను విశ్లేషించారు. ఈ పరిశోధన కోసం ‘కవికోకిల గ్రంథావళి-2’లోని సారస్వత వ్యాసాలను ప్రాథమిక వనరుగా స్వీకరించి, విశ్లేషణాత్మక పద్ధతిలో అధ్యయనం చేయడం జరిగింది. కావ్యం కేవలం కళాత్మకతకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతను, ధర్మబోధను కలిగి ఉండాలని దువ్వూరి ప్రతిపాదించిన అంశాలను ఈ వ్యాసం చర్చిస్తుంది. పరిశోధనలో భాగంగా కావ్య శిల్పంలో ఔచిత్యం, కవి-సహృదయుల మధ్య ఉండాల్సిన సమన్వయం, సృజనలో సంయమనం వంటి అంశాలను పరిశీలించడమైంది. దువ్వూరి విమర్శలో కనిపించే బహుభాషా పాండిత్యం, పాశ్చాత్య విమర్శకులైన ఎడ్గార్ ఎలన్ పో సిద్ధాంతాల ప్రభావం, భారతీయరససిద్ధాంతాల మేళవింపు ఈ వ్యాసంలో స్పష్టంగా ఆవిష్కృతమయ్యాయి. ప్రస్తుత పరిశోధన దువ్వూరి విమర్శనా దృక్పథంలోని సమగ్రతను, ఆయన ప్రతిపాదించిన కావ్యప్రయోజనాలను విశ్లేషించడానికి పరిమితమైంది. భవిష్యత్తులో దువ్వూరి ఇతర సాహిత్య ప్రక్రియలపై చేసిన విమర్శలను, ఆయన అనువాదాలలోని శిల్ప విశేషాలను మరింత విస్తృతంగా అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఉంది.
Keywords: దువ్వూరి రామిరెడ్డి, సాహిత్య విమర్శ, కవిత్వ తత్త్వ నిరూపణ, రసరామణీయకత, కావ్య శిల్పం, ఔచిత్యం, కావ్య ప్రయోజనం, సౌందర్యవాదం

1. ప్రవేశిక

ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు కట్టమంచి కవిత్వ తత్త్వవిచారం పాదులు తీసింది. దీనిలో కట్టమంచి కవిత్వంలోని ‘భావనాశక్తి’ గురించి చర్చించాడు. ఇది పాశ్చాత్య కాల్పనికోద్యమంలో వర్డ్స్ వర్త్ వ్యక్తీకరించిన ‘Imagination’ తో సరిపోతుంది. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ కావ్యంలోని కావ్యకళా సౌందర్య తత్త్వాన్ని అనుశీలింప చేసే ప్రయత్నం చేశారు. వీరు సారస్వతోపన్యాసాలు అనే తమ విమర్శ గ్రంథంలో ఈ చర్చ చేశారు. పాశ్చాత్య విమర్శకులైన కోలరిడ్జ్, జార్జ్ శాంతాయనల ప్రభావం వీరిపై కనిపిస్తుంది. దువ్వూరి ‘కవిత్వ తత్త్వ నిరూపణ’ ద్వారా కావ్యంలోని ‘రసరామణీయకత’ల గురించి చర్చించారు. వీరిపై స్థూలంగా అమెరికా కాల్పనికోద్యమంలో వచ్చిన విమర్శకుడు ఎడ్గార్ ఎలన్ పో ప్రభావం కనబడుతుంది. (ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం. పుట: 167-183)

కట్టమంచి కావ్యంలో చెప్పే విషయంకన్నా చెప్పే రీతి ప్రధానమన్నారు. అంగాంగ సాంగత్యమే రచనలో ప్రధానమని భావించారు. రాళ్లపల్లి వస్తు- భావ- భావనా శక్తులు ఉన్న రచన సౌందర్యంగా ఉంటుందంటూ, కావ్యం ద్వారా పొందే సాధారణీకరణమే రచనలో ముఖ్యమైనదిగా భావించారు. దువ్వూరి కవి నైసర్గిక ప్రతిభ రసరామణీయకతలను పెంచే విధంగా ఉండాలన్నారు. తొలుత కాల్పనికోద్యమంలో వచ్చిన పాశ్చాత్య సాహిత్య విమర్శ ప్రభావం తెలుగు సాహిత్య విమర్శపై కనిపించినా క్రమేపీ భారతీయ అలంకారిక విమర్శ లక్షణాలతో కావ్యాలను అనుశీలించే ప్రయత్నం చేసి ప్రాచ్య, పాశ్చాత్య విమర్శ రీతులను సమన్వయం చేసే దిశగా సర్దుబాటు చేసుకుంది.

1922-23లో ‘కళ’ పత్రికకు వ్యాసాలు రాసారు. వీరి సౌందర్య దృష్టికి `Poetry is the rhythmic creation of beauty’ అన్న ఎడ్గార్ ఎలన్ పో కవిత్వ నిర్వచనం ప్రమాణం. కళ, ఉదయిని, రెడ్డివాణి, భారతి లాంటి పత్రికలకు వ్యాసాలు, రేడియో ఉపన్యాసాలు, డైరీలు, లేఖలలో ప్రాచీన నవ్య సాహిత్యాలను విమర్శించారు. వీరి సాహిత్యాన్ని కవిత్వం, చారిత్రక నాటకాలు, అనువాదాల రూపంలో విమర్శను సారస్వత వ్యాసాలుగా ‘కవికోకిల గ్రంథావళి’ అనే పేరుతో ఏడు సంపుటాలుగా వచ్చాయి.

విమర్శలో కొత్త పాతల మేలు కలయికగా, ప్రాచ్య, పాశ్చాత్య విమర్శ లక్షణాలను చర్చించి కొన్ని సందర్భాలను విభేదించాడు. ఆధునికులను అభిమానించిన కొన్నిచోట్ల వారి సంయమన రాహిత్యాన్ని విభేదించాడు. తన రచనలు కొన్నింటిని ‘వాయిస్ ఆఫ్ ది రీడ్’ గా ప్రకటించాడు. పాఠశాల తక్కువగా ఉన్న దువ్వూరి స్వయం కృషితో ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, జర్మనీ, బెంగాళీ, పర్షియన్, ఉర్దూ, తమిళం, సంస్కృతం నేర్చుకొని బహుభాషాకోవిదుడయ్యాడు. చిత్రలేఖనం, శిల్పం, ఫోటోగ్రఫీ రేడియో ఇంజనీరింగులలో ప్రావీణ్యం చాటుకున్నాడు. ‘విమర్శకుడు’ అనే పేరుతో 72 పాదాల పద్యకావ్యం రాసాడు. ఇంగ్లీష్‌లో అలెక్జాండర్ రాసిన ‘Essay on Criticism’తో పోల్చవచ్చని రెండింటిలో సమాన భావాలు ఉన్నాయని విమర్శకులు అన్నారు. )కవి కోకిల-దువ్వూరి రామిరెడ్డి జీవితమూ- సాహిత్యము. పుట: 352)

ఆస్కార్ వైల్డ్ తదితరులు సిద్ధాంతీకరించిన కళ కళకోసమే (Art for Art sake) అన్న వాదాన్ని ఖండిస్తూ కవిత్వంలో నీతి ప్రాధాన్యాన్ని బలపరిచారు. కవిత్వ తత్వ నిరూపణము గురించి రాజమన్నారు దువ్వూరికి రాసిన లేఖలో ఇలా కొనియాడారు:

“మీ యీకృతి ఆంధ్ర భాషకు వన్నె పెట్టగల పువ్వు. కేవలము ప్రత్యేక కవులపై విమర్శలు దక్క మన భాషయందు కావ్య స్వరూప నిర్ణయము గానీ, రసతత్త్వ విచారము గానీ లేనే లేవని చెప్పవచ్చును. అట్టి పనికి దగిన వారిలో మఱి యుండదగిన వారలగు మీరే పూనుకొని నిర్వర్తించినది ఆంధ్రభాష భాగ్యమనవలయును” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 600)

సారస్వత వ్యాసాలు (కవికోకిల గ్రంథావళి 2) ద్వారా దువ్వూరి ‘విమర్శ’పై వెలిబుచ్చిన అభిప్రాయాలను ఈ వ్యాసం చర్చిస్తుంది. ‘కవిత్వ తత్త్వ నిరూపణం’ అనే పేరుతో ఉన్న ఈ వ్యాసాల్లో సారస్వత వ్యాసాలు 14, తెలుగు కవిత- క్రొత్త తెన్నులు 8 వ్యాసాలున్నాయి. దువ్వూరి విమర్శలో కనిపించే రస- రామణీయకత-ప్రతిభ-శిల్ప వివేచనలాంటి అంశాలను చర్చించేందుకు పరిమితమైంది.

సహృదయునిలో అనుభవాల మోతాదులోంచి పుట్టి ఆనందాన్ని కలిగించే భావన రసం. వస్తు-భావ-రచనల ద్వారా కావ్యంలోని అనుభవ యోగ్యమైన సౌందర్యమే రమణీయకము. ఈ అనుభవ యోగమే రసాన్ని రమణీయకతను ఒకటి చేస్తుంది. దీనిని ఔచితీమంతంగా, కవి ప్రతిభచేత శిల్పయోగ్యంగా నిర్మించడమే కావ్య ప్రయోజనం. ఈ అవగాహనతో ‘దువ్వూరి-విమర్శ’ ను ఈ వ్యాసం పరామర్శిస్తుంది.

2. కావ్యం – వస్తువు

లోకోత్తరమైన వర్ణన చేసేవారు కవి. సాధారణ విషయమైన కవిచేతిలో విశేషంగా రూపాంతరం చెందుతుంది. వస్తువులోని సౌందర్యాన్ని కవి లోకానికి పరిచయం చేస్తాడు. ప్రతిభావంతుడైన కవి దీనిని సమర్థవంతంగా చేసి, సహృదయుల మనసును రంజింప చేస్తాడు. దీనినే దువ్వూరి ఇలా అంటాడు:

“కవి భావమే వస్తువుపై ప్రసరించునో యది యెల్ల రూపాంతరం నొందును” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 354)

ఏ వస్తువైనా సామాజిక పరిధిని మించకుండానే ఉంటుంది. కావ్యానికి ఎంచుకున్న వస్తువుకు శాశ్వతత్త్వాన్ని కలిగించాలంటే ఆ కావ్యవస్తువుపై కవికి సంపూర్ణ అవగాహన, అభివ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. వ్యక్తిగత ప్రయోజనాలకంటే సార్వజనీన, కాలీన ప్రయోజనాలు ఆశించే వస్తువును కవి రచనకోసం ఎన్నుకోవలసి ఉంటుంది.

“కావ్యము చిరంజీవముగా నుండవలయునన్న అందలి వస్తువు గూడ సర్వజనీన స్వభావము, తదనుగుణమైన మనోవికారములను వెల్లడించుటకును అనుకూలమైనదిగా నుండవలయును” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 358)

సహృదయుని స్పందనలకు కారణాలైన రమణీయ వస్తువును నిపుణుడైన కవి చేతిలో మరింతగా శోభనిస్తాయంటాడు. దీనికి మనుచరిత్రను ఉదాహరణగా చూపి అందులో పాఠకుల్ని రంజింప చేయగల ప్రబంధానికి ఉండాల్సిన వస్తువు, గుణ, సామర్థ్యాది అంశాలన్నింటిని విశ్లేషించి చూపారు.

కావ్య వస్తువుపై సాధికారిత ఉన్నప్పుడు నిపుణుడైన కవి హృదయం ఉప్పొంగుతుంది. దువ్వూరి డైరీలో ఒకచోట నేను ఎల్లకాలం కవిత్వం రాయలేను. ప్రత్యేకమైన సమయాలే నాలో కవిని కదిలిస్తాయని అంటాడు. (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 519)

భావాల్ని నియంత్రించి కూర్చి రచనకు పూనుకున్నప్పుడు ప్రత్యేకంగా భాషకోసం ప్రయత్నించ వలసిన అవసరం రాదు.

3. కావ్యం – భాష

“కవి హృదయం భావ శబలమై, యుద్రిక్తమైనప్పుడు భావములు తమంత తాము ఉచితమైన భాష వెదుకుకొని లయాన్వితముగా ప్రవహించును” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 347)

అంటూ అలాంటి సమయంలో అల్పాక్షరములో అనల్పార్థ రచనకు కొన్ని సంకేతాలు, కవి సమయాలు శబ్ధయుక్తులు అవసరాన్ని బట్టి సహజంగా రచనలో చోటుచేసుకుంటాయి అంటాడు. దీంతోపాటు కవిత్వం కూడా లయాత్మకం ఉండాలంటూ రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించాలన్నపుడు కావ్య వస్తువు ప్రకృతితో తన్మయి భావం పొందాలంటాడు. కాబట్టే ‘ప్రకృతియందు బీజ రూపకముగా, అస్పష్టముగా, అసంపూర్ణముగా, సంకీర్ణముగా రామణీయత’ ఉంటుందని ఇది కావ్యాన్ని లయాన్వితం చేసి సర్వాంగ సుందరంగా చేస్తుందని దువ్వూరి భావన.

రచనలో భావం ప్రధానం. దీనివలన భాషకు గౌరవం పెరుగుతుంది. తిక్కన భారతాన్ని ఉదాహరణగా చూపిస్తూ భావం ఉదాత్తమైనపుడు సాధారణ పదాలు కూడా శిఖరస్థాయి అర్థాన్నిస్తాయని భాషవల్ల నింద్య భావమునకు ప్రశస్తి కలగదు అంటూ కావ్యములో భాష, భావాల మధ్య పొసగని వైరుధ్యాన్ని గురించి వివరించాడు. పాండిత్యం మేధకు, సృజన హృదయాని చెందింది. జిజ్ఞాసువులకు ప్రకృతి శాస్త్రం, విమర్శ, మానవ సంఘ నిర్మాణం లాంటి వాటిపై అవగాహన పెరిగేకొద్ది సృజనశక్తి బలహీనమైపోతుంది. అలాగనీ కవికి లోకజ్ఞానం అవసరం లేదని కాదు. వర్తమాన సమాజాన్ని కవి కచ్చితంగా అంచనా వేయగలగాలి. కవి హృదయ దర్పణం, సామాజిక దర్పణానికి ప్రతిబింబంగా ఉండాలి.

“లోకజ్ఞానము, జీవితమునందెంత అవసరమో, కావ్యమునందు కూడ ముఖ్యమే” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 460)

అనడంలో ఉద్దేశమిదే.

4. కావ్య సామగ్రి

కావ్యంలో జీవితం ఉన్నదంటే దానికి కవి ప్రతిభనే కారణం. ఇది కావ్యానికి ప్రాణం పోస్తుంది.

“సహజమైన ప్రతిభయే కవిత్వమునకు కారణం. ఇతరములు సంస్కారములు. అవి కవిత్వమునకు వన్నె తెచ్చును” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 25)

దీనికి తోడుగా కావ్య సామగ్రి బలీయంగా ఉంటే ఆ కావ్యం కళగా రూపుదిద్దుకుంటుంది. ఈ కవితా సామగ్రి కావ్యాన్ని జీవన్మూర్తిగా తీర్చిదిద్దుతుంది. దీనికి

“అంగాంగ సంయోగిత, అనురూపత, వస్తునందలి సర్వజనీన స్వభావము, కవి వ్యక్తిత్వము” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 28)

ఈ నాలిగింటిని కావ్య సామగ్రిగా భావించాలి. లోకజ్ఞానం ప్రతిభగల కవికి ఇవి ఆధీనంలోఉంటాయి.

5. కావ్యం-నీతి

వ్యవస్థల మధ్య సర్దుబాటు, సమతౌల్యత లోపించినపుడు సమాజంలో కుంగుబాటు తటస్తిస్తుంది. ఇది సంఘ శ్రేయస్సుకు విఘాతం. నీతి, ధర్మం మొదలైన గుణాత్మక విలువలు సంఘ ఒడంబడికను పటిష్ఠం చేస్తాయి. అదుపు తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సాహిత్యం హెచ్చరిక చేసి, నూతన వ్యవస్థకు మేలుకొలుపు గీతం పాడుతుంది. సమాజ శ్రేయస్సు ధర్మ సంబంధిగానే ఉంటుంది. కవిత్వం సౌందర్యవంతం కావడమంటే ధర్మబోధ కూడ ప్రభు, మిత్ర, కాంత సమ్మితాలు కావాలి. దీనినే దువ్వూరి నీతి స్పర్శ లేనిదే సౌందర్యం పరిపూర్ణం కాదన్నడు. సంఘ నిర్మాణాన్ని, మానవ జీవన శిక్షణలను మౌలికంగా కొన్ని నిర్దేశిస్తాయి, నిర్వహిస్తాయి. మతం, ధర్మం, లలిత కళలు అలాంటివి. ప్రాచ్య, పాశ్చాత్య జీవన విధానాలలో తారతమ్యం ఉండడం వల్ల ఇద్దరి జీవిత లక్ష్యాలు కూడ భిన్నంగా కనిపిస్తాయి.

“ప్రాచ్యులకు జీవితము పరమార్థము సాధించుటకు ఏర్పడిన ఒక సాధనము. పాశ్చాత్యులకు జీవితమే ఒక పరమార్థము” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 374)

అని స్పష్టమైన తీర్పునిస్తూ ఏది విశ్వశ్రేయమును సంపాదించగలదో అది నీతి బాహ్యముగా ఉండలేదని దువ్వూరి భావించారు.

6. రసరామణీయకత

కావ్య వస్తు గుణాలను చర్చించిన దువ్వూరి కావ్యంలోని రసరామణీయకతలను, శిల్ప రీతుల గురించి కూడా తన వ్యాసాలలో విస్తారంగా ప్రస్తావించారు. ప్రాచీన భారతీయ ఆలంకారికులైన భరతుని రస నిర్వచనం, జగన్నాథ పండితరాయని ‘రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం” లాంటి నిర్వచనాలు ఎలన్ పో ‘Beauty’ నిర్వచనాల ఆధారంగా కావ్యములో రమణీయకత గురించి చర్చిస్తూ, రసం రామణీయకతపై కాకుండా, రమణీయతలోనే రసం ఉంటుందని భావించాడు. పైగా రమణీయతకు ఉత్తమత్త్వాన్ని ఆపాదిస్తూ కావ్యంలో చూడవలసింది రమణీయకమని అది ఏ కావ్యంలో పరిపూర్ణంగా ఉంటుందో అదే ఉత్తమ కావ్యమన్నాడు. ఈ రమణీయత ఒక వస్తువు కాదు. ఇది సమిష్టి భావం. సౌందర్యాన్ని సామాన్యుని దృష్టితోనే చూడాలి. ఇదే ప్రమాణం. సామాన్య వస్తువులో కూడా అనంత సౌందర్యాన్ని దర్శించడం రమణీయత. సచేతన, అచేతన వస్తువుల్లో కూడా రమణీయ భావాలు పుష్కలంగా ఉంటాయని, సుఖానుభవ యోగ్యమగు ప్రతి భావము, వస్తువు రసత్వాన్ని పొందుతుందని నిర్ధారించారు. ఈ రమణీయత కావ్యగత భాషా దోషాలను పరిణించదు. కానీ శిల్పగత దోషం కావ్యానికి సరైన గౌరవం తీసుకరాదన్నారు. సృజనకారుడు కేవలం అనుకరణమీదనే ఆధారపడకూడదని దువ్వూరి భావించారు.

7. కావ్యం – శిల్పం

కవులు నిరంకుశులైనప్పటికినీ కావ్యానికి నిరంకుశత్వం పనికిరాదు. కావ్యం సర్వజన శ్రేయస్సు కోరుకునేది. సకలార్థ ప్రదాయినిగా ఉండాలి. సార్వజనీన, కాలీన ఫలశ్రుతులు కావ్యగతం కావాలంటే కావ్యం కొన్ని నియమాలకు లొంగి ఉండాలి. రచనాశిల్పం క్రమబద్ధీకరణ చెందాలి.

“నియమబద్ద్దము గాని శిల్పమునందు ఔచిత్యముండదు. అరాచకత్వముండును. స్వాతంత్ర్యము కూడ నియమబద్దమే” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 407)

అని పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్‌’ను వచన కావ్యంగా చెలామణి కావడాన్ని, అది పద్య ప్రాచీన సాహిత్యాన్ని నిరసించడాన్ని తీవ్రంగా విమర్శించాడు. సృజనలో అరాచకత్వం పొసగదు. రమణీయ భావం ఎప్పుడూ సమతౌల్యం మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రభిభావంతుడైన కవి ఏకపక్షంగా మొగ్గుచూపరాదు. కావ్య సామగ్రి మొత్తం సమతూకంలో ఉండాలి. అందుకే శిల్పమునకు సంయమనం అవసరమని దువ్వూరి భావించారు. శిల్పం యొక్క ప్రయోజనం సద్యః పర నిర్వృతి. కావ్యంలోని అంగాల మధ్య సమన్వయం కావ్య నిరూపిత విలువలు, మూల్యాలు కేవలం ఒకే ఇంద్రియాన్ని తృప్తిపరచడంతో పాటు, వర్ణనలు, భావోద్వేగాలు మొదలైన వాటితో ఇవి ఎక్కువ ఇంద్రియాలకు స్పందన కలిగించేదిగా ఉంటే అది ఉత్తమ శిల్పమని దువ్వూరి అభిప్రాయం. కార్య కారణ సంబంధం కావ్యంలో నిరూపించడం ఉత్తమ కావ్య లక్షణం కాదు. సహృదయుని భావన శక్తి కావ్య నిరూపితార్థాన్ని అర్థం చేసుకొని ఆస్వాదించే విధంగా ఉండాలి. నాటకాలకు సంబంధించిన వ్యాసాలలో శిల్ప నిర్వాహణ, సౌందర్యం, పాత్రౌచిత్యాల గురించి చర్చించారు. రస నిర్వహణలో అనౌచిత్యం రసభంగ హేతువన్నారు. ఔచిత్యం కావ్యానికి, జీవితానికి చాలా ముఖ్యమని అన్నారు. కవులు ఏ కాలానికి సంబంధించిన వారైనా వారి మనస్థితి సమకాలీన భావలకు, నాగరికతకు లోబడి ఉంటుంది. కావున రచన సమయంలో కవి స్పృహలో ఉంటే ఔచిత్య భంగం వాటిల్లదు. కవితో పాటు సహృదయుడికి కూడ పరిశీలన శక్తి, స్వీకార శక్తి ఉండాలి. కవి, సహృదయుడు ఇద్దరూ ఒకే యానంలో ప్రయాణించాలి. లేకుంటే ఎలాంటి ఉత్తమ కావ్యమైనా గుర్తింపుకు నోచుకోదు.

“రసజ్ఞత కుశాగ్రమున నుండనిదే యుత్తమమైన కళాసృష్టిని మెచ్చుకొనుట సాధ్యం కాదు” (కవి కోకిల గ్రంథావళి-2 పుట: 387)

అని అంటాడు.

8. కవి-సామాజిక బాధ్యత

కవికి సామాజిక బాధ్యత పౌర సమాజంకన్నా ఎక్కువగా ఉంటుంది. మిత్ర సమ్మితంగా కావ్య రచన చేస్తున్నప్పుడు రసిక జనానందము అనే కావ్యములో కవి బాధ్యతలను వివరించారు:

“భావ రస ప్రసంగములు పాయగరాదు, సుధామయోక్తులం బోవిడ రాదు, మార్దవములో శృతి కంటకమైన పల్కు సం భావన సేయరాదు, మది భావము తోపగరాదు, శైలి సొం పే వగ జూడ నిక్షురసమీనెడు నట్లు రచింపు కావ్యమున్”

బాధ్యత కావ్యాన్ని అందంగా చెప్పడంలో సహృదయులకు కావ్య సౌందర్యంతో పాటు ప్రయోజనంను కూడ అనుభవించడంలో ఉంటుందన్నారు. అలాగే ‘విమర్శకుడు’లో విమర్శకునికి ఉండవలసిన లక్షణాలను కూడ వివరించారు:

“.... ఒక కావ్యము నందును ఒప్పుదప్పులం/గని రసములు గణిచి, యొసకమ్మగు భావములమ్ దలంచి శో/భను గమనించి శిల్పకళా పద్ధతిగాంచియు, నౌచితింగనుగొని, కవి చిత్త మారసియు, క్రోధము బాసి విశేష శాంత భావ నియతితో విమర్శనము వ్రాసిన నయ్యది మార్గ సూచియై తనరును”

కావ్యగత శిల్పానికి, సమాజానికి మధ్యగల పరస్పర సంబంధాన్ని సహజమైన బంధంగా భావిస్తూ జీవిత ప్రయోజనాన్ని అనుసరించి శిల్ప ప్రయోజన నిర్ణయించబడుతుందని భావించారు. ఇదే అసలైన కావ్య ప్రయోజనం. మానవ జీవిత ప్రయోజనాన్ని ఫలవంతం చేసేది కూడ ఇదేనని దువ్వూరి వ్యాఖ్యానించారు.

ఉపసంహారం

కవిలో సహజమైన ప్రతిభా శక్తి కావ్యాన్ని రమణీయంగా చేస్తుంది. ప్రకృతిలోని రమణీయతను కావ్యంలో ప్రవేశపెట్టండం ఉత్తమ కావ్య లక్షణం. ఇది ఔచితీమంతంగా జరగడం మరింత అవసరం. కావ్యంలో రసరమణీయతలకు భంగం కలిగించే భాషా విషయ దౌర్భాల్యాలను వదులుకోవాలి. కవి లోకజ్ఞానం కావ్యాన్ని మరింత జీవకళతో ఉండేటట్లు చేస్తుంది. దీనికి శిల్ప నైపుణ్యం, రచన వస్తువుతో సమ్మిళితం కావాలి. కావ్యం ఛందోబద్దంగా ఉండాలి. ఎక్కువ ఇంద్రియాల్ని సుఖింప చేసేది ఉత్తమ రచన.

కవి తన రచనలో జాతీయ జీవన స్థితులను కావ్య కళా ధర్మాల ద్వారా నిర్దేశించాలి. మానవ జీవితాల్లో నీతి ధర్మం ఎలా ఉంటాయో కావ్యాల్లో ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఇదే కావ్య ప్రయోజనం అంటూ దువ్వూరి కవిత్వ తత్త్వ నిరూపణ వ్యాసాల్లో విమర్శ గురించి చర్చించారు.

ఉపయుక్త గ్రంథసూచి

  1. చంద్రశేఖర్ రెడ్డి, దుర్గంపూడి. భారతీయ సాహిత్య నిర్మాతలు- దువ్వూరి రామిరెడ్డి, సాహిత్య అకాడమి, న్యూఢిల్లీ, 1999.
  2. ప్రభాకర్ రెడ్డి, కోడూరి. కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి కవిత్వం-వ్యక్తిత్వం, స్వీయ ప్రచురణ, హైదరాబాదు, 2001.
  3. రమణారెడ్డి, కె. వి. కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి (జీవితమూ – సాహిత్యము), కవి కోకిల గ్రంథమాల, నెల్లూరు, 1967.
  4. రమణారెడ్డి, కె. వి. కవి కోకిల గ్రంథావళి-2, దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి, నెల్లూరు, 1996.
  5. రమణారెడ్డి, కె. వి. కవి కోకిల గ్రంథావళి-7 (డైరీలు – ఉత్తరాలు), కవి కోకిల గ్రంథమాల, నెల్లూరు, 1961.
  6. రామారావు, ఎస్. వి. తెలుగులో సాహిత్య విమర్శ – అవతరణ వికాసములు, పసిడి ప్రచురణలు, హైదరాబాదు, 2017.
  7. సుబ్రహ్మణ్యం, జి. వి. ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం, యువభారతి, హైదరాబాదు, 1983.
How to cite this article:
డా. పోగుల విశ్వప్రసాదు (2026). దువ్వూరి రామిరెడ్డి విమర్శనాదృక్పథం: పరిశీలన. AUCHITHYAM, 7(11), 40–46.
© 2026 AUCHITHYAM. Published under a Creative Commons Attribution 4.0 International (CC BY 4.0) licence.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.