AUCHITHYAM
AUCHITHYAM  |  Volume-7  |  Issue-11  |  October 2026  |  Peer-Reviewed  |  ISSN: 2583-4797
ఔచిత్యమ్ పరిశోధన మాసపత్రిక ఆరవ వార్షికోత్సవ సంచిక

4. పి. శ్రీదేవి కథాసాహిత్యం: సమాజం

Author photo
మ్యాదరి మనీషా
తెలుగు పరిశోధకురాలు, తెలంగాణ విశ్వవిద్యాలయం,
తెలుగు లెక్చరర్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల,
కరీంనగర్, తెలంగాణ.
Cell: 9550406691  |  Email: manishamyadari47@gmail.com
Received: 10 Sep 2026  |  Accepted: 25 Sep 2026  |  Published: 01 Oct 2026
Article: https://auchithyam.com/2026/oct_2026/full_papers/october26_04.phpPDF
Abstract
తెలుగు నవలా సాహిత్యంలో 'కాలాతీత వ్యక్తులు' వంటి అద్భుత సృష్టితో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న రచయిత్రి డాక్టర్ పి.శ్రీదేవి. ఆమె కేవలం నవలలకే పరిమితం కాకుండా, ఆధునిక తెలుగు కథా జగత్తులోనూ తనదైన ముద్ర వేశారు. వృత్తిరీత్యా వైద్యురాలు కావడంతో మానవ మనస్తత్వాలను, సమాజంలోని విభిన్న ప్రవృత్తులను ఆమె చాలా లోతుగా పరిశీలించారు. ఆ పరిశీలనా దృక్పథమే ఆమె కథలకు ప్రాణం పోసింది. ఒక వైద్యురాలి దార్శనికతతో, కథాశిల్పి నైపుణ్యంతో ఆమె మలచిన కథలు చదువరుల మనసులను తాకుతాయి. శ్రీదేవి గారి కథా ప్రపంచాన్ని, అందులోని వైవిధ్యాన్ని ,ఆ రచనల విశిష్టతను పరిచయం చేయడమే ఈ వ్యాస ముఖ్య శీర్షిక ఉద్దేశం.1950ల నాటి సామాజిక, సాహిత్య సంధికాలంలో మధ్యతరగతి ఆర్థిక సంక్షోభాలు, పితృస్వామ్య సమాజంలో స్త్రీల అస్తిత్వ పోరాటాలు, మరియు మనిషి అంతరంగపు సంక్లిష్టతలను ఆమె కథలు ఆవిష్కరించిన తీరును సమగ్రంగా అధ్యయనం చేయడమే దీని ఆవశ్యకత. ఈ అధ్యయనం కోసం ప్రథమ ఆకరాలుగా 'వాళ్ళు పాడిన భూపాలరాగం' పేరుతో వచ్చిన పి.శ్రీదేవి గారు రచించిన కథలను, అలాగే ద్వితీయ ఆకరాలుగా 'తెలుగు స్వతంత్ర' (1958-59) పత్రికా సంచికలను వచ్చిన కొన్ని కథలను స్వీకరించి విషయసేకరణ గావించడమైనది. ఓరుగంటి పార్వతీదేవి గారి సిద్ధాంత వ్యాసం ('డాక్టర్ పి.శ్రీదేవి కల్పనా సాహిత్య సమీక్ష'), శీలా సుభద్రాదేవి గారి 'భారతీయ సాహిత్య నిర్మాతలు: పి. శ్రీదేవి' గ్రంథం, మరియు సంపాదకులు గోరాశాస్త్రి గారి విమర్శనాత్మక వ్యాసాలు ఈ విశ్లేషణకు పూర్వపరిశోధనా ఆధారాలుగా నిలిచాయి. పూర్తిగా విశ్లేషణాత్మక పరిశోధనా పద్ధతిలో సాగిన ఈ వ్యాసాన్ని కుటుంబ-వైవాహిక సంబంధాలు, సామాజిక-ఆర్థిక వాస్తవికత, స్త్రీ చైతన్యం–మనోవైజ్ఞానిక వాస్తవికత, తాత్విక-అస్తిత్వ ఆరాటం అనే నాలుగు ప్రధాన ఉపశీర్షికలుగా విభజించి వ్యాసరచన ప్రణాళికను ప్రకారం విశ్లేషించడం జరిగింది. ఈ విశ్లేషణ శ్రీదేవి గారి 19 కథల్లోని సామాజిక, మనోవైజ్ఞానిక దృక్పథాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ, ఒక వైద్యురాలిగా ఆమె పొందిన అనుభవాలు సమాజంలోని రుగ్మతలను, మానసిక సంఘర్షణలను ప్రథమ పురుష 'స్వగత' శైలిలో అత్యంత హేతుబద్ధంగా ఆవిష్కరించాయని ఫలితాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాల క్రితం నాటి పాత పత్రికల సేకరణలో కొన్ని సాధకబాధకాలు ఎదురైనప్పటికీ, డాక్టర్ పి.శ్రీదేవి కథా సాహిత్యంలోని శిల్ప నైపుణ్యం, భాషా గాంభీర్యం, మరియు సైద్ధాంతిక స్పష్టతపై భవిష్యత్తులో మరింత లోతైన అధ్యయనాలకు ఈ వ్యాసం ఒక ఆలోచనాత్మక మార్గదర్శకంగా నిలుస్తుంది.
Keywords: పి. శ్రీదేవి, కథలు, కుటుంబం, స్త్రీ చైతన్యం, సామాజిక వాస్తవికత

1. ప్రవేశిక

తెలుగు కథా సాహిత్యం కేవలం వినోదం నుండి సామాజిక వాస్తవికత వైపు, అభ్యుదయ భావాల నుండి మనోవైజ్ఞానిక విశ్లేషణవైపు మళ్లుతున్న చారిత్రక సంధికాలంలో డాక్టర్ పి.శ్రీదేవి ఒక విశిష్టమైన కథా రచయిత్రిగా ఉద్భవించారు. ఆధునిక సాహిత్యంలో నవలా రచయిత్రిగానే ఎక్కువ గుర్తింపు పొందినప్పటికీ, ఆమె రాసిన కథలు తెలుగు కథా గగనంలో ధృవతారల్లా మెరుస్తున్నాయి. వృత్తిరీత్యా వైద్యురాలిగా ఆమెకు లభించిన అపారమైన సామాజిక అనుభవం, మానవ శరీరాల వెనుక ఉన్న సున్నితమైన మనస్తత్వాలను దగ్గరగా చదివే అవకాశం ఆమె కథలకు ఒక సరికొత్త దార్శనికతను అందించాయి. ఆమె కథల్లో ఒక సమాజం ఉంటుంది, మధ్యతరగతి మనిషి అస్తిత్వ ఆరాటం ఉంటుంది, అన్నిటికీ మించి స్త్రీల అణచివేతపై ఒక హేతుబద్ధమైన తిరుగుబాటు ఉంటుంది. కేవలం సామాజిక సమస్యలను చూపించడమే కాకుండా, ఆ సమస్యల వెనుక ఉన్న మానసిక సంఘర్షణలను 'స్వగత' శైలిలో, ప్రథమ పురుషలో అత్యంత ప్రతిభావంతంగా పాఠకుల కళ్ళకు కట్టారు డాక్టర్ పి.శ్రీదేవి. వీటి ఆధారంగానే శ్రీదేవి కథల్లోని సౌరభాన్ని ఈ వ్యాసంలో ప్రధానంగా విశ్లేషించడం జరుగుతుంది.

2. డాక్టర్ పి.శ్రీదేవి కథల నేపథ్యం

తెలుగు కథా సాహిత్యంలో డాక్టర్ పి.శ్రీదేవి స్థానం ఒక ప్రత్యేకమైనది. ఆమె కథా నేపథ్యం కేవలం ఊహాజనితమైన కల్పనలకు పరిమితం కాలేదు, అది అత్యంత వాస్తవికమైన, సమకాలీనమైన సామాజిక జీవన స్రవంతి నుండి పుట్టుకొచ్చింది. ఒక రచయిత్రిగా ఆమె కథల వెనుక ఉన్న ప్రధాన నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఆమె వృత్తి, ఆమె సామాజిక పరిశీలనాత్మకత, మనిషి అంతరంగం పట్ల ఆమెకున్న అపారమైన అవగాహన స్పష్టంగా కనిపిస్తాయి. వీరి కథలకు ప్రధాన నేపథ్యంగా నిలిచింది ఆమె వృత్తి. స్వతహాగా ఆమె ఒక వైద్యురాలు కావడం వల్ల, సమాజంలోని విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను, వారి శారీరక రుగ్మతలను, ఆ రుగ్మతల వెనుక దాగిన మానసిక సంఘర్షణలను అతి దగ్గరగా పరిశీలించే అవకాశం ఆమెకు లభించింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే పేషెంట్ల ఆవేదన, వైద్య వృత్తిలో ఉండే నైతిక ధర్మం, స్వార్థానికి మధ్య జరిగే అంతర్గత యుద్ధం ఆమె కథల్లో ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. తన చుట్టూ ఉన్న సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న అభద్రత, అణచివేత, వారి అస్తిత్వ ఆరాటం శ్రీదేవి కథలకు ప్రధాన ప్రేరణగా నిలిచాయి. పితృస్వామ్య సమాజంలో స్త్రీ ఎలా లైంగికంగా, మానసికంగా వంచనకు గురవుతుందో, ఆమె తన కాళ్లపై తాను నిలబడాల్సిన అవసరం ఎంత ఉందో ఆమె తన కథల్లో స్పష్టంగా చూపించారు. తను చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడటంతో, జీవితపు అశాశ్వతత్వం, విధి వైపరీత్యం పట్ల ఆమెలో తలెత్తిన తాత్విక నేపథ్యం ఆమె కథల్లో జీవన నిర్వచనాల రూపంలో అడుగడుగునా కనిపిస్తుంది.

3. డాక్టర్ పి.శ్రీదేవి కథలు – వర్గీకరణ

తెలుగు సాహిత్య లోకంలో ముఖ్యంగా 1950ల కాలంలో, డాక్టర్ పి.శ్రీదేవి కథలు ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించాయి. ఆమె కథలు కేవలం కాలక్షేపం కోసం రాసినవి కావు, అవి మనిషి అంతరంగపు లోతులను, సమాజపు వాస్తవికతను, స్త్రీ చైతన్యాన్ని ప్రతిబింబించే మనోవైజ్ఞానిక విశ్లేషణలుగా మనకర్థమవుతుంది. వృత్తిరీత్యా ఆమె ఒక వైద్యురాలు కావడం వల్ల, ఆసుపత్రి వాతావరణం, రోగుల శారీరక బాధల వెనుక దాగి ఉన్న వారి మానసిక వ్యథలు, ప్రాణాపాయ స్థితులలో మనుషుల నిజస్వరూపాలు ఆమె కథలకు సజీవమైన ఇతివృత్తాలను అందించాయి. చాలా చిన్న వయసులోనే జీవితంలోని ఎన్నో ఒడిదుడుకులను చూసిన శ్రీదేవి, సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను, కనుమరుగవుతున్న మానవ సంబంధాలను అత్యంత నిశితంగా పరిశీలించారు. అవన్నీ ఆమె రాసిన కథలలో బాగా ప్రతిఫలించాయి. అందుకే వాటిలోని ప్రధాన ఇతివృత్తం, పాత్రల స్వభావం, కథా గమనంలోని అంతర్లీన సందేశాల ఆధారంగా నాలుగు విభాగాలుగా వర్గీకరించవచ్చు. ఈ వర్గీకరణ, ఒక కథా రచయిత్రిగా శ్రీదేవి బహుముఖ ప్రజ్ఞను, దార్శనికతను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.

3.1 కుటుంబ-వైవాహిక సంబంధాలు

సంసార జీవితం అనేది కేవలం కాల్పనికమైన పూలపాన్పు కాదని, అందులో నిరంతరం ఎదురయ్యే చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, న్యూనతా భావాలు, నిరాధారమైన అనుమానాలు ఎంతటి దృఢమైన దాంపత్య బంధాన్ని అయినా నిలువునా దహించివేస్తాయని డాక్టర్ పి.శ్రీదేవి తమ కథల్లో అత్యంత వాస్తవికంగా చిత్రించారు. సమాజంలో ఆదర్శంగా కనిపించే భార్యాభర్తల బంధం వెనుక ఉండే స్వార్థాన్ని, మూడో వ్యక్తి ప్రవేశం వల్ల వచ్చే అనర్థాలను, స్వేచ్ఛను అపార్థం చేసుకునే కుంచిత బుద్ధిని ఆమె ఒక మనస్తత్వవేత్త కోణంలో శస్త్రచికిత్స చేశారు. ముఖ్యంగా 'ఉరుములూ మెరుపులూ' కథలో బాహ్య సౌందర్యానికి, అంతరంగిక ప్రేమకు మధ్య జరిగే మానసిక సంఘర్షణను వివరిస్తూ, అనుకోని శారీరక రుగ్మత దాంపత్యంలో ఎలాంటి అపోహలకు దారితీస్తుందో పరిశీలించారు.

“బావా! నీకు నేనానందాన్నివ్వగలనా! నన్ను చూసుకుంటే నాకే అసహ్యం వేస్తుంది. నావల్ల నీకు సుఖమెలా ఉంటుంది” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:121)

అందమైన సుధ, విధివశాత్తు మశూచి బారిన పడి, అందాన్ని కోల్పోయి కుమిలిపోవడం స్త్రీ మనస్తత్వంలోని అభద్రతా భావానికి ప్రతీక. భర్త ఆప్యాయంగా చేరదీసినా, తనలోని న్యూనత వల్ల దాంపత్యం ఎలా ఒక మౌన యుద్ధంగా మారిపోతుందో శ్రీదేవి నిర్మొహమాటంగా చెప్పారు. శారీరక లోపం కన్నా మానసిక అభద్రతే బంధాన్ని వేగంగా చంపుతుందని ఈ కథ రుజువు చేస్తుంది. అలాగే దాంపత్యంలో అనుమానం అనే విషబీజం ఎంతటి విధ్వంసానికి దారితీస్తుందో 'వర్షం వెలిసేసరికి' కథలో చూపించారు. ఒక దిక్కులేని గర్భవతి లక్ష్మికి ప్రాణాలకు తెగించి పురుడు పోసి, ఆ బిడ్డను చూసి ఉద్వేగంతో డాక్టరు అన్న మాటలను చాటుగా విన్న భార్య అరుంధతి పూర్తిగా అపార్థం చేసుకోవడం మనిషిలోని ఈర్ష్యా ద్వేషాలను బట్టబయలు చేస్తుంది.

“అవును నా బిడ్డే తప్పకుండా ఈ శిశువుకు మంచి భవిష్యత్తు కల్గిస్తాను” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:156)

భ్రమతో, అహంకారంతో ఆమె ఇల్లు వదిలి వెళ్లడం, దానికి ప్రతిగా డాక్టరు విర్రవీగడం ఇద్దరి మూర్ఖత్వానికి అద్దం పడుతుంది. ఇరవై ఏళ్ల తర్వాత నిజం తెలుసుకుని పశ్చాత్తాపం చెందే సందర్భంలో,

“స్త్రీయే మరొక స్త్రీని ద్వేషిస్తుంది...స్త్రీగా తన అహంభావానికి జీవితపు లక్ష్యాన్నే బలి చేస్తుంది” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:156)

అన్న శ్రీదేవి విశ్లేషణ స్త్రీల ఆలోచనా విధానంలోని లోపాలను ప్రశ్నిస్తుంది. ఒకవైపు అంతర్గత అపార్థాలే కాకుండా, బాహ్య వ్యక్తుల జోక్యం ఒక ఆదర్శవంతమైన బంధాన్ని ఎలా ఛిద్రం చేస్తుందో 'వీధి దీపాలు' కథలో, డాక్టరు మూర్తి ఇంట్లో ఆశ్రయం పొందిన స్నేహితురాలు సరోజ విషయంలో, విశ్వం అనే కుహనా మిత్రుడు మూర్తికి ఇలా అంటాడు:

“ఆ అమ్మాయిని నెలల తరబడి నీయింట్లో పెట్టుకుంటే మాలతి మనస్సెంత క్షోభిస్తుందో తెలుసా? అది నీకెంత సవ్యంగా తోచినా ఆడది, అందులో గృహణి, సహించలేదు” (స్వతంత్ర, మార్చి 1958, పుట:31)

ఈ అబద్ధం వల్ల ఆత్మాభిమానం దెబ్బతిన్న సరోజ ఇల్లు వదిలి వెళ్లిపోగా, తీవ్ర మానసిక క్షోభకు గురైన మూర్తి ఇలా మథనపడతాడు:

“విశ్వం చెప్పినంత మాత్రాన సరోజ నమ్మిందా! అతనిమాటలే తనకి నిజాలుకాని - ఇన్నాళ్ళయి ఈ యింట్లో తన అనుభవానికి విలువే లేదన్నమాట” (స్వతంత్ర, మార్చి 1958, పుట:32)

అని మథనపడటం ద్వారా ఒకరిపై ఒకరికి ఉండాల్సిన పారదర్శకమైన నమ్మకం, స్నేహం ఎంత సున్నితమైనవో రచయిత్రి లోతుగా ఆవిష్కరించారు. మరోవైపు, ఆధునిక దాంపత్యంలోని యాంత్రిక, స్వార్థపూరిత మనస్తత్వాన్ని అత్యంత కఠోరంగా విమర్శించిన కథ 'చక్రనేమి క్రమాన'. వ్యాధిగ్రస్తుడైన భర్త పట్ల భార్య అమృతవల్లి చూపిన అమానవీయమైన నిర్లక్ష్యాన్ని వర్ణిస్తూ, మరణశయ్యపై ఉన్న భర్త రంగనాథం ఇలా నిలదీస్తాడు:

“కొత్తగా కొన్న కారు చెడిపోతే అది బాగులేదని చీదరపడి దానినమ్మేసి మరొకటి కొనడం సహజమే కావచ్చును. కానీ, నీ సర్వస్వం అని నువ్వు నమ్మిన మనిషి కేవలం అతని దౌర్భాగ్యం వలన సర్వనాశనం అయిపోతోంటే, ఆ దౌర్భాగ్యుని చీదరించుకుని గాయపరచటం ఏం ధర్మం?... మనిషిని కూడా మరచక్రంలా వాడుకొని పనికిరాని సమయంలో పరాయి వస్తువుగా పారవేసుకునే నీ మనస్తత్వానికి కొంచెం ఔదార్యం తెచ్చి పెట్టుకోమని అర్థిస్తున్నాను” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:147)

ఈ క్రూరమైన స్వభావం కాలక్రమంలో కర్మ సిద్ధాంతానికి ఎలా బలవుతుందో, అదే అమృతవల్లికి క్యాన్సర్ సోకి, రెండవ భర్తచేత నిర్లక్ష్యం చేయబడినప్పుడు,

“ఎందుకు వస్తారు! ఇకమీద రారు” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:148)

అని తత్వాన్ని గ్రహించే ముగింపు ద్వారా శ్రీదేవి ఒక సామాజిక హెచ్చరిక చేశారు. ఈ విధంగా తమ కథల ద్వారా శ్రీదేవి దాంపత్యం అంటే కేవలం భౌతికమైన ఆకర్షణో, అవసరాల కలయికో కాదని, అది ఒక విడదీయరాని ఆత్మీయ అనుబంధమని, అందులో అహంకారాలకు, అభద్రతా భావాలకు, కుహనా మిత్రుల మాటలకు, స్వార్థ ప్రయోజనాలకు తావులేదని స్థిరంగా నిరూపిస్తూ, యాభై ఏళ్ల క్రితమే ఆధునిక సామాజిక, వైవాహిక రుగ్మతలకు అద్దం పడుతూ జీవన వేదాలను ఒకే బలమైన సైద్ధాంతిక స్రవంతిలో ఆవిష్కరించారు.

3.2 సామాజిక - ఆర్థిక వాస్తవికత

సాహిత్యం కేవలం ఊహాలోకాల్లో విహరించడమే కాకుండా, సమాజంలోని కఠోర వాస్తవాలను అక్షరబద్ధం చేసినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్న సత్యాన్ని శ్రీదేవి కథల్లో మనకు కనిపిస్తుంది. 1950ల నాటి స్వాతంత్ర్యానంతర మధ్యతరగతి సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాలు, విలాసాల కోసం పడే ఆరాటం ఆమె కథల్లో నిర్మొహమాటంగా చిత్రించబడ్డాయి. 'వాళ్ళు పాడిన భూపాలరాగం' నవలిక పట్నంలో బతుకుతున్న మధ్యతరగతి కుటుంబాల డొల్లతనాన్ని అద్భుతంగా విమర్శిస్తుంది. స్కూల్ ఫైనల్ పూర్తయి పట్నం వచ్చిన రామారావుకు, డెబ్భై రూపాయల జీతంతో బతుకుతూ కూడా,

“డబ్బు లేదని భోజనం మానేయగలడు... పిల్లలకి ఆ పూటకి ఒక పకోడీలపొట్లం కొనిచ్చి యిన్ని మంచినీళ్లు తాగిస్తారు. సినిమా మాత్రం విధిగా చూడాలిసిందే” (వాళ్ళు పాడిన భూపాలరాగం, పుట:184)

అన్న బంధువుల జీవనశైలి విస్మయం కలిగిస్తుంది. అప్పులు చేస్తూ లోపల కుళ్ళిపోయే ఈ బంధువుల కంటే, సమాజపు కట్టుబాట్లను ధిక్కరించి ఆస్తిపరురాలైన బాలవితంతువుతో సహజీవనం చేస్తున్న శ్రీనివాసులు బతుకే నిజమైనదని రామారావు భావించడం ఆర్థిక లేమి సృష్టించే నైతిక గందరగోళానికి అద్దం పడుతుంది. మధ్యతరగతి ఆర్థిక ఇబ్బందులకు, వ్యసనాలకు బలైపోయే కుటుంబాల దీనస్థితి 'కల తెచ్చిన రూపాయి' కథలో కనిపిస్తుంది. నిరుద్యోగి అయిన కొడుకు శేషాద్రి, తండ్రి ప్రావిడెంట్ ఫండ్, భార్య నగల డబ్బు తీసుకుని పట్నం వెళ్లి పేకాటలో పోగొట్టుకుంటాడు. వృద్ధ తండ్రి పరంధామయ్య ఈ బాధతో కుమిలిపోతూ, కలలో కొడుక్కి వెయ్యి రూపాయల ఉద్యోగం వచ్చినట్లు చూసి ఉలిక్కిపడతాడు. తీరా చూస్తే శేషాద్రి ఇంటికొచ్చి,

“ఉద్యోగం కోసం పట్టుకొచ్చిన వెయ్యి రూపాయిలూ మీరన్నట్లు తెచ్చిన కొద్దిరోజులలోనే పేకాటలో పోగొట్టుకున్నాను...అప్పు చేసి ఆడటం మొదలుపెట్టాను... నా అదృష్టం పండి పోయిన డబ్బంతా తిరిగి వచ్చేసింది” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:57)

అని చెప్పి, తనకు నెలకు నూరు రూపాయల ఉద్యోగం వచ్చిందని చెప్పడం నిరుద్యోగం, వ్యసనాలు కుటుంబాలను ఎలా పట్టి పీడిస్తాయో ఆర్ద్రంగా వివరిస్తుంది. అలాగే, 'ఒక్క రూపాయి ఎక్కువ' కథలో కటకటలాడే రోజుల్లో విపరీతమైన పొదుపు పాటించే ఒక 'పిసినిగొట్టు తండ్రి', తన మాట కాదని వెళ్లిపోయి దగాపడి బతుకుతెరువు కోసం టైలరింగ్ చేసుకుంటున్న సొంత కూతురు విశాలాక్షిని గుర్తుపట్టి, ఎవరూ అడగకుండానే మూడు రూపాయలు ఇచ్చి,

“నా విశాల మళ్లీ పారిపోతుంది-ఎక్కడికో పారిపోతుంది...లాభంలేదు రెక్కలు రాకుండానే పక్షి ఎగిరిపోయింది. తిరిగి గూటిలో చేరటం అసంభవం” (స్వతంత్ర, మార్చి 1958, పుట:32)

అని కుమిలిపోవడం పేదరికం మధ్య తండ్రి ప్రేమ ఎంత నిగూఢంగా ఉంటుందో స్పష్టం చేస్తుంది. యువకుడిగా ఉన్నప్పుడు ఒక నిరుపేద రాములు తాగినందుకు మనస్సాక్షికి కట్టుబడి కఠినంగా సర్టిఫికెట్ ఇచ్చి అతని కుటుంబం నాశనమవడానికి కారణమైన డాక్టరు, ఏడేళ్ల తర్వాత అదే అవినీతికి అలవాటుపడి ధనిక స్నేహితుడిని రక్షించడం నైతిక పతనానికి పరాకాష్ట.

“సుఖమయ జీవితంకోసం లౌకిక ప్రపంచంలో అవసరమయిన అన్యాయపు అక్రమపు కృత్యాలు ఈనాడు నా దృష్టిలో సామాన్యమై పోయినవి” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:69)

అని డాక్టరు అంగీకరించడం వాస్తవికతకు అద్దం పడుతుందని, వ్యవస్థలోని అవినీతిని, ద్వంద్వ ప్రమాణాలను 'మెత్తని శిక్ష' కథలో సున్నితంగా, బలంగా ఎండగట్టారు. ఇక 'జ్ఞానోదయం' కథలో చదువు పట్ల గ్రామీణ ప్రజలకుండే అపోహలను సూర్యకాంతమ్మ పాత్ర ద్వారా చూపిస్తూ, ఆమె తన చిన్న కొడుకు మాధవరావు పుస్తకాలను విసిరేసి,

“చదువు గురించి నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బులుకూడా లాగేసుకున్నాను” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:54)

అని హింసించినా, వృద్ధాప్యంలో అదే కొడుకు ఆమెను అపురూపంగా చూసుకున్నప్పుడు,

“కన్న కొడుకునూ నా మూర్ఖత్వంతో హింసించాను” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:55)

అని పశ్చాత్తాపపడటం విద్య తెచ్చే సంస్కారాన్ని నిరూపిస్తుంది. శ్రీదేవి ఇలా ఈ కథల ద్వారా ఆర్థిక ఇబ్బందులు, నైతిక పతనం, కుహనా ఆదర్శాల మధ్య నలిగిపోయే మనిషి అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

3.3 స్త్రీ చైతన్యం – మనోవైజ్ఞానిక వాస్తవికత

1950ల కాలంలో తెలుగు కథా సాహిత్యంలో స్త్రీల పాత్రలు కేవలం కన్నీళ్లు పెట్టుకునే అబలలుగానో, ఇల్లు దిద్దుకునే ఇల్లాళ్లుగానో ఉండే మూస ధోరణిని డాక్టర్ పి.శ్రీదేవి కథలు బద్దలుకొట్టాయి. పితృస్వామ్య సమాజంలో స్త్రీ ఎదుర్కొనే అణచివేత, కుటుంబం ముసుగులో జరిగే ఆర్థిక, లైంగిక దోపిడీలను ఆమె తన కథల్లో మనోవైజ్ఞానికంగా చిత్రించారు. పేరుకు ఉద్యోగం చేస్తున్నా కుటుంబ వ్యవస్థలో స్త్రీ ఎలా ఓడిపోతుందో 'పరాజిత' కథలోని సుమతి పాత్ర స్పష్టం చేస్తుంది. తన తొలి జీతంతో చీర కొనుక్కుంటే తల్లి కసురుకుని,

“వయసులో వున్న పిల్లవి ఒళ్ళు కొంచెం దగ్గరుంచుకుంటే మంచిది... లక్షణంగా ఆ జీతమేదో తెచ్చి మీ నాన్నగారి చేతిలో పెడితే మంచిదని” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:70)

స్వేచ్ఛను హరించగా, భర్త చంద్రశేఖరం ఆమెను కేవలం సంపాదించే యంత్రంగా చూస్తూ,

“వచ్చే నెలనుంచి వంద బ్యాంకులో వేయాలనుకుంటున్నానే?...మళ్ళీ యీ దండగ దేనికి?” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:71)

అని అణచివేస్తాడు. అత్తగారింట్లో బానిసలా వదిలేసిన భర్తను, "అసలు పెళ్ళాం అంటే ఏమిటో మీకు తెలుసా? మీ అవసరాలు తీర్చే మనిషి అనే తెలుసేమో? మీ చెల్లెలు పెళ్లి కోసం, మీ భవిష్యత్ కోసం, నా సరదాల్ని, నా మనస్సుని తాకట్టు పెడుతున్నారన్న సంగతి తెలీదా?" అని ఎదిరించినా ఫలితం లేని ఒక ఉద్యోగిని మానసిక వేదన ఇందులో కనిపిస్తుంది. అలాగే, సమాజంలో అభద్రతకు గురైన స్త్రీ మానసిక క్షోభను 'కళ్యాణ కింకిణి' తెలియజేస్తుంది. దగాపడి గర్భవతి అయిన కళ్యాణి, పరువు కోసం కన్నకూతురు హేమను చెల్లెలుగా లోకానికి పరిచయం చేసి,

“హేమ వట్టి పసిపిల్ల - కడిగిన ముత్యంలా కల్మషం లేనిపిల్ల - ఒకప్పుడు... అప్పటికి నేనూ సరిగ్గా యిలానే ఉండేదాన్ని” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:73)

అని కుమిలిపోతుంది. చివరకు వాస్తవం భరించలేక,

“హేమ నా కూతురే-ఒకనాటి పాపఫలితం-దగాపడిన యౌవనపు చరిత్ర” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:81)

అని బద్దలైనప్పుడు, కూతురు ఆమెను అక్కున చేర్చుకుని,

“ఏమైనా నువ్వు నాకమ్మవే... నన్నాళ్ళూ నేనదృష్టవంతురాలనమ్మా!” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:82)

అని ఓదార్చడం పతితగా చూడబడే స్త్రీలోని గొప్ప మాతృమూర్తిని ఆవిష్కరిస్తుంది. సమాజం స్త్రీల పట్ల చూపే జాలిని అహంకారంగా భావించి తిరస్కరించే దృఢమైన స్త్రీల చిత్రణ శ్రీదేవి కథల్లో కనిపిస్తుంది. 'స్వరూపంలో రూపం' కథలో సమాజం చేత పతితగా ముద్రవేయబడిన రాధ, తనను ఉద్ధరిస్తానంటూ వచ్చిన మధుతో,

“పతితనైన నిన్ను స్వీకరిస్తాననడంలో నా ఆత్మగౌరవం దెబ్బతినదు... నేను నిన్ను స్వీకరించి పువ్వులలో పెట్టి పూజిస్తాను” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:99)

అన్న మాటలను స్వార్థంగా, సంస్కరణ మహాగర్వంగా భావించి తిరస్కరిస్తుంది. నిజమైన ప్రేమకు అర్థం చెబుతూ,

“వ్యక్తికీ వ్యక్తికి మధ్య అంతరాంతరాల్లోని సమైక్యతనే నేను 'ప్రేమ' అని నిర్వచిస్తాను” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:98)

అని స్పష్టం చేస్తుంది. మరోవైపు, 'రేవతి స్వయంవరం' కథలో స్త్రీ-పురుషుల మధ్య ఉండే నిర్మలమైన స్నేహాన్ని సమాజం ఎలా అపార్థం చేసుకుంటుందో విశ్లేషించారు. ముగ్గురు పురుషులతో స్నేహంగా మెలిగిన రేవతి, వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పినప్పుడు వారు దిగ్భ్రాంతి చెందుతారు. అప్పుడు రేవతి,

“ప్రేమ అనేది ఒక్కరి సొత్తుగా ఒక్కచోట నిల్చిపోయేది కాదనీ, ఎత్తునున్న నీరు పల్లానికి ప్రవహించటం ఎంత సహజమో ఇష్టం కలిగిన ప్రతి వ్యక్తి యందు ప్రేమ ప్రసరించటం అంతే సహజమని... అనువైన ప్రతి హృదయంలోకి ప్రవహించగల శక్తివంతమైన సజీవమైన ప్రవాహం” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:87-88)

అని నిర్వచించి పురుషాధిక్యపు అపోహలను బద్దలుకొడుతుంది. ఆధునిక స్త్రీలు ఎదుర్కొనే అంతరంగ మథనాలను కూడా ఆమె అద్భుతంగా పట్టుకున్నారు. 'ఎవరి స్వప్నం వారిదే' కథలో ఒక తల్లి ప్రేమ తన కూతురికి ఎలా సంకెళ్లుగా మారిందో రాజ్యలక్ష్మి పాత్ర ద్వారా చూపించారు. కూతురు రాసిన ఉత్తరంలో,

“మా అమ్మకి నేనంటే ప్రాణం కాని ఆవిడకి దూరంగా ఉంటే కాని నాకు స్వేచ్ఛ లేదు... ఆవిడ నన్నెప్పుడూ పోలీసులా కాపలా కాస్తుంది” (స్వతంత్ర, జనవరి 1959, పుట:37)

అన్న మాటలు చదివి కుంగిపోయినా, మాతృత్వపు ప్రేమ పంజరం కాకూడదని గ్రహించి తన బిడ్డకు స్వేచ్ఛనిస్తుంది. ఇక 'ఎదురు తిరిగిన ప్రకృతి' కథలో డాక్టరుగా ఎంతో ధైర్యంగా, స్వేచ్ఛగా బతికే రాజేశ్వరి మనసులోని ఒంటరితనాన్ని బట్టబయలు చేశారు. పైకి గంభీరంగా ఉన్నా, వయసు మీద పడుతున్న కొద్దీ,

“నిద్రరాని రాత్రు లెన్నిటినో ఆమె యిలాగే వేదనతో గడిపేస్తుంది. చివరికి శరీరం నిద్ర కావాలంటుంది” (స్వతంత్ర, ఏప్రిల్ 1958, పుట:33)

అని తోడు కోసం తపించే ఆమె అంతరంగాన్ని, ఒక ఆధునిక మహిళ స్వాతంత్ర్యానికి, సహజమైన ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణను అద్భుతంగా చిత్రించారు. కుహనా ఆదర్శాలు స్త్రీ జీవితాన్ని ఎలా పతనం చేస్తాయో 'తిరగేసి తొడుక్కున్న ఆదర్శం' నిర్మొహమాటంగా చెబుతుంది. దుర్వ్యసనాలకు బానిసైన భర్త దగ్గరికే గుడ్డిగా వెళ్లిపోయి భయంకరమైన రోగాల బారిన పడిన ఒక యువతి దుస్థితిని డాక్టరు వివరిస్తూ,

“భారీయైన విగ్రహమే కానీ అప్పుడే వడిలిపోయింది... పీక్కుపోయిన మొహమూ, లోతుకుపొయిన కళ్లూ, ఎనభై ఏళ్ళ శరీరానికి వచ్చే శిథిలత్వం అప్పుడే ఆమె శరీరాన్నీ ఆక్రమించిందని” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:106)

ఆవేదన చెందుతుంది. గుడ్డిగా భర్తను అనుసరించడమే ఆదర్శం కాదని స్పష్టం చేస్తూ,

“ఆదర్శాల తొడుగు తొడిగినంత మాత్రంచేత ఎవరూ ఎక్కడికీ ఎగరలేదు. ఆ తొడుగును భ్రాంతితో కాక వాస్తవికతతో పరిశీలించి తొడిగిననాడు ఆదర్శం ఫలిస్తుంది... భ్రాంతిలోపడి ఆదర్శపు తొడుగును తిరగేసి తొడిగింది. అది బెడిసికొట్టింది” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:118)

అని రచయిత్రి ఒక తీర్పునిస్తారు. స్త్రీ వాద ముద్ర కోసం కాకుండా, పక్కా మానవతావాదంతో, మానసిక విశ్లేషణా దృక్పథంతో మలచడం వల్లనే శ్రీదేవి ఈ కథలు, నేటి స్త్రీల ఆలోచనా విధానానికి, వారు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలకు ఆధునిక మనోవిజ్ఞాన పత్రాలుగా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

3.4 తాత్విక - అస్తిత్వ ఆరాటం

మనిషి అంతరంగంలో చెలరేగే నిశ్శబ్ద సముద్రాలను, మృత్యువు ముందు నిలబడినప్పుడు కలిగే అస్తిత్వ వేదనలను అక్షరబద్ధం చేసినప్పుడే సాహిత్యానికి సార్వజనీనత వస్తుందని శ్రీదేవి కథలు నిరూపిస్తాయి. ఒక వైద్యురాలిగా మనిషి చావు బతుకుల మధ్య సాగించే పోరాటాన్ని చూసిన అనుభవాలతో జీవిత పరమార్థాన్ని ఆమె తన కథల్లో తర్కించారు. 'అర్థం కానీ ఒక అనుభవం' కథలో ఒక లేడీ డాక్టరు, ఒక రావిచెట్టు కింద పద్మాసనం వేసుకుని కూర్చునే ఒక బైరాగి ప్రశాంతతను చూసి ఆకర్షితురాలవుతుంది.

“వద్దు తల్లీ! వీడు డబ్బు తాకడు. పిల్లలు లేరూ - వాళ్లు అరిటి పండ్లూ అవీ యిస్తారు. చాలు” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:40)

అని చిరునవ్వుతో చెప్పే ఆ బైరాగి, ఇద్దరు మోతుబరుల మధ్య ఎన్నికల పగలకు బలయి, కత్తిపోట్లతో శవమై కనిపించడం ఆమెను తీవ్రంగా కలచివేస్తుంది.

“ఈ విశాల విశ్వంలో ఏం జరిగినా భౌతికంగా కాక పారమార్ధికంగా ఆలోచిస్తే ప్రతిదానికి ఒక వ్యాఖ్యానం ఉంటుందంటారు...తుద్రమైన వ్యామోహాలతో కీచులాడుకుని ద్వేషించడమొక్కటే జీవిత పరమావధిగా బతికే మానవులకు ఈ బైరాగి సాధనంగా ఉపయోగపడడమేమిటి?” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:43)

అన్న ఆమె అస్తిత్వవేదన, జీవిత రహస్యాన్ని ఛేదించే గొప్ప తాత్విక అన్వేషణకు దారి తీస్తుంది. లెక్కల ప్రొఫెసర్, రచయిత అయిన కథానాయకుడు, తన మొదటి భార్య అనసూయ విలువెంటో ఆమె చనిపోయాక గుర్తిస్తాడు. తన విద్యార్థిని శైలజను పెళ్లి చేసుకున్నా ఆమెకు సరైన స్థానం ఇవ్వడు. దీన్ని భరించలేక శైలజ,

“తల్లి లేని పిల్లలకొక అనువైనదానిగా మాత్రమే నన్నాహ్వానించారు... నిరానందమయమైన జీవితంలో ఇరుక్కుని అలానే హరించి పోవటంలో అర్థంలేదు” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:171)

అని వెళ్లిపోతుంది. పిల్లల కోసం బతికితే, కొడుకు అమెరికా వెళ్లి స్థిరపడితే, కూతురు కట్టుబాట్లు ధిక్కరించి వెళ్లిపోతుంది. కీర్తి, హోదా సాధించినా చివరకు ఒంటరిగా మిగిలిపోయిన ఆ తండ్రి,

“సుఖమంటే ఏమిటి? దుఃఖమంటే ఏమిటి? అసలు జీవితపు విలువలనేవి ఎక్కడున్నాయి” (వాళ్ళు పాడిన భూపాల రాగం, పుట:174)

అని వేసే ప్రశ్న జీవితపు నిస్సారతను ప్రశ్నిస్తుంది. ఇలా మనిషి తన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, చివరకు మిగిలే శూన్యం, ఒంటరితనాన్ని 'శ్రావణ భాద్రపదాలు' కథలో ఒక వృద్ధుడి అన్వేషణ ద్వారా ఆవిష్కరించారు. పలాయనవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, జీవితాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పే కథ 'జ్వర పీడితులు'. ఉద్యోగం పోయి, అప్పులపాలై, ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక పారిపోతున్న రామారావుకు రైలు ప్రయాణంలో ఎదురైన కామేశ్వరి, తన భయంకరమైన విషాదగాథను ప్రశాంతంగా చెబుతుంది. పేదరికం వల్ల వృద్ధుడికి అమ్ముడుపోయి, ఆ తర్వాత భర్తను, అత్తమామలను, తల్లిదండ్రులను కోల్పోయి, ఉద్యోగం పోయినా చలించకుండా ఆమె చేసే జీవన బోధ కథకు ప్రాణం.

“లోకంలో ప్రతీ ఒక్కడూ జ్వరపీడితుడే. ఎవరి బాధ వారిది. అయినా అందరూ బతుకుతున్నారు. బతకాల్సిందే. ఎక్కడికో పారిపోయి ప్రయోజనం లేదు రామారావు గారూ!” (స్వతంత్ర, సెప్టెంబర్ 1958, పుట:40)

మరియు,

“బతకడం ఎందుకు అనే అర్థంలేని ప్రశ్నతో బాధపడకండి. బతకడం నేర్చుకోండి. బతికిచూడండి ఎక్కడికీ పారిపోకండి” (స్వతంత్ర, సెప్టెంబర్ 1958, పుట:40)

అని రామారావును జాగృతం చేయడం అద్భుతమైన తాత్విక ముగింపు. శ్రీదేవి ఈ కథల ద్వారా మనిషిలోని తాత్విక శూన్యతను దర్శించి, పాఠకులకు అద్భుతమైన మానసిక వైద్యం చేశారు.

ఉపసంహారం

  • డాక్టర్ పి.శ్రీదేవి కథా సాహిత్యం 1950ల నాటి తెలుగు సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తుంది.
  • ఆమె మనుషుల మనస్సుల్లోని అభద్రత, అహంకారం, అనుమానం వంటి రుగ్మతలను శస్త్రచికిత్స నిపుణురాలిలా నిశితంగా విశ్లేషించారు.
  • దాంపత్య బంధాల్లోని అపార్థాలను, మధ్యతరగతి జీవితాల్లోని సామాజిక-ఆర్థిక డొల్లతను ఆమె కథలు ఎండగట్టాయి.
  • పితృస్వామ్య కట్టుబాట్లను ధిక్కరించి ఆత్మాభిమానంతో నిలబడే స్త్రీల దృఢత్వాన్ని ఆమె హేతుబద్ధంగా ఆవిష్కరించారు.
  • మరణం, ఒంటరితనం, పలాయనవాదం వంటి అస్తిత్వ వేదనలను చర్చిస్తూ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలనే తాత్విక సందేశాన్ని అందించారు.
  • ఆమె కథలు కాల పరిమితిని దాటి మానవ నైజాన్ని నిరంతరం శోధించే క్రిటికల్ ఎక్స్-రేలా తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోతాయి.

ఉపయుక్త గ్రంథసూచి

  1. గోరాశాస్త్రి, సంపాదకులు. తెలుగు స్వతంత్ర, సెప్టెంబర్, 1958.
  2. గోరాశాస్త్రి, సంపాదకులు. తెలుగు స్వతంత్ర, జనవరి, 1959.
  3. పార్వతీదేవి, ఓరుగంటి. డాక్టర్ పి.శ్రీదేవి కల్పనా సాహిత్య సమీక్ష, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, 1981.
  4. శ్రీదేవి, పి. వాళ్లు పాడిన భూపాలరాగం–(పి.శ్రీదేవి కథలు- కవితలు- సమీక్షలు), అన్వీక్షికి పబ్లిషర్స్, హైదరాబాదు, 2022.
  5. సుభద్రాదేవి, శీ. భారతీయ సాహిత్య నిర్మాతలు: పి. శ్రీదేవి, సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ, 2015.
How to cite this article:
మ్యాదరి మనీషా (2026). పి. శ్రీదేవి కథాసాహిత్యం: సమాజం. AUCHITHYAM, 7(11), 31–39.
© 2026 AUCHITHYAM. Published under a Creative Commons Attribution 4.0 International (CC BY 4.0) licence.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.