headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

13. చరిత్ర నిర్మాణంలో 'భాష' పాత్ర: పరిశీలన

డా . శ్రీనివాసులు అంకే

తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ కళాశాల (స్వ), అనంతపురము,
అనంతపురము, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9652471652, Email: ankesreenivas@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

భాష, సాహిత్య పరిణామాలను విస్తృతంగా అధ్యయనం చేయడం వల్ల ఆయా సమాజాల చరిత్ర అవగాహన కలుగుతుంది. భాషా చరిత్ర అంటే పరోక్షంగా సమాజ చరిత్రనే. సామాజికఅస్థిరత, పరిణామాలు భాష, అనువాదాల ద్వారా అవగాహనకొస్తాయి. కొత్త భాషల ఆవిర్భావం లోనిచారిత్రక సందర్భాలను ఆ భాషా చరిత్రలే వివరిస్తాయి. భాష అంటే ఒక సమాజం యొక్క సాంస్కృతిక వ్యక్తీకరణ. శాసనాలు, నాణాలు, కైఫీయత్తులు, జీవిత చరిత్రలు, ఆత్మకథలే కాకుండా భాష కూడా చరిత్రను స్పష్టంగా తెలియచేస్తుంది. భాష ఆధారంగా మానవనాగరికతలోని అనేకమైన సంఘటనలను, సామాజిక చలన సూత్రాలను భాష అభివ్యక్తం చేస్తుందని సంగ్రహంగా ఈ వ్యాసం నిరూపిస్తుంది.

Keywords: గ్రామనామాలు, రాయరాణువ సీమ, తిట్టుపదాలు, యూరోపియన్ భాషా పదాలు, మత పునరుజ్జీవనం, గోత్రనామాలు, గ్రామ దేవతలు, మాండలికం, Acronyms

1. ఉపోద్ఘాతం:

చరిత్ర అనుభవాల సంపుటి. అనుభవశకలాలతో చరిత్ర నిర్మాణమవుతుంది. చరిత్ర రాయడానికి శాసనాలు, చట్టాలు ప్రధాన ఆధారాలు. వీటితో పాటుగా నాణేలు, కావ్యావతారికలు, కావ్యాలు, జీవితచరిత్రలు, ఆత్మకథలు, బూర్జపత్రాలు, కైఫీయత్తులు వంటివి చరిత్ర రచనకు ఉపయోగపడతాయి. ఈ ఆధారాలతో పాటు చరిత్ర రాయడానికి భాష కూడా సహేతుకమైన ఆధారాలను అందిస్తుంది. చారిత్రక పరిణామాలను, సామాజిక సంఘర్షణలను, సామాజిక చలన సూత్రాలను విశ్లేషించాలంటే పై ఆధారాలతోపాటు భాష కూడా సమర్థవంతమైన ఆధారాలను మన ముందుంచుతుంది.

భాష అంటే సాంస్కృతిక అభివ్యక్తి. ఒక సమాజం యొక్క భావోద్వేగాలను, ఆకాంక్షలను, అభిరుచులను భాష చారిత్రకంగా వెల్లడిస్తుంది. ఒక ప్రత్యేక సమాజం యొక్క అస్తిత్వాన్ని భాష నిరూపిస్తుంది. అన్ని చారిత్రక ఆధారాలూ భాషలో భాగమే అయినప్పటికీ, జనవ్యవహారిక భాష అనేక చారిత్రక సందర్భాలకు సాక్ష్యంగా నిలుస్తుంది.

2. చరిత్రలో గ్రామనామాలు:

దక్షిణ భారత దేశాన్ని వైదిక, జైన, బౌద్ధ, వీరశైవ, విశిష్టాద్వైత మతదర్శనాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. గ్రామనామ ప్రథమ ద్వితీయావయాలలో 'బయటి దేవర, శ్రవణ, బసది, పాడు' వంటివిశేషాలు ఆనాటి జైనమత అస్తిత్వాన్ని వివరిస్తాయి. 'ఘంటసాల, అమరావతి, నాగార్జునకొండ' లాంటి పేర్లు బౌద్ధమత ప్రభావాన్ని తెలియజేస్తాయి. నంద్యాల, మహానంది వంటి నామాలు వీరశైవ చైతన్యాన్ని చెబుతాయి. 'రామానుజునివల్లె, అమ్మాజిపల్లి, అయ్యగార్లపల్లి' వంటివి విశిష్టాద్వైత ప్రభావాన్ని నిర్దిష్టంగా అంచనావేస్తాయి. విశిష్టాద్వైత, వీరశైవ మత ప్రభావాలు తిరుమల, శ్రీశైల, శ్రీకాళహస్తి క్షేత్ర రచనలలో విశేషంగా దర్శనమిస్తాయి.

మత పరిస్థితులే గాక నిర్దిష్టమైన చారిత్రక సంఘటనలను కూడా గ్రామనామాలు వివరిస్తాయి సాతానికోట, సాతనూరు, సత్తెనపల్లి పేర్లు ఆంధ్రదేశంలో శాతవాహనుల ఉనికిని తెలియజేస్తాయి1. బుక్కరాయల ఆస్థానంలో నాచనసోమన ఉండేవాడు. ఆయనకు పెంచికలదిన్నె గ్రామాన్ని ప్రదానం చేశాడు. అయితే ప్రస్తుతం ఈ గ్రామాన్ని ప్రదాత పేరు మీదుగా బుక్కపట్నం (కడప జిల్లా) గా వ్యవహరిస్తున్నారు2. అనంతపురము జిల్లాలోని బుక్కరాయసముద్రం, బుక్కపట్నం చెరువుల్ని బుక్కరాయలు తవ్వించాడు. ఆయన పేరు మీదగానే ఈ గ్రామాలు వ్యవహారంలో ఉన్నాయి3.

3. సామాజిక చైతన్యాలను, అస్తిరతను అభివ్యక్తం చేసే భాష:

మధ్యయుగంలో ఐరోపా సమాజం మీద చర్చి ఆధిపత్యం తీవ్రంగా ఉండేది. ఎంత తీవ్రమైన నేరాలు చేసినా పాప పరిహారపు పత్రాలను కొంటే చేసిన పాపాలు, నేరాల నుండీ దేవుడు క్షమించడమే గాకుండా, దేవుని చేత ప్రత్యేక ఆశీర్వచనాలు కూడా అందుకుంటారని చర్చి ప్రచారం చేసింది. శతాబ్దాల పాటు ఈ విధానం కొనసాగింది. క్షమార్హమైన పశ్చాత్తాపానికి Confession (అంగీకారం) Beatification (అర్హత) వంటి పదాలు.ఆనాటి సామజిక పరిస్థితులను చెబుతున్నాయి . ఆ పదాలకు నిజమైన అనువాద పదాలు భారతీయ భాషల్లో లేవు. కారణం ఆ పరిస్థితులు మనదేశంలో లేవు. ఇవి ఐరోపా మధ్యయుగ సామాజిక చరిత్రకు నేటికీ సాక్ష్యాలే.

అదేవిధంగా ఆంగ్లభాషలో Second Person (తెలుగులో మధ్యపురుష)లో ఏక, బహు వచనాలకు You అనే ఒకే పదాన్ని ఉపయోగిస్తారు. కానీ తెలుగులో నీవు, మీరు అని స్పష్టంగా ఏక,బహువచన కర్త పదాలు ఉన్నాయి. అయితే దాదాపు వందేళ్ళకు ముందు 'You' పదాన్ని కేవలం మధ్యమ పురుష బహువచనంగా మాత్రమే ఉపయోగించారు. ఏకవచనంగా 'Thou' అనే పదాన్ని వాడేవారు4. ఆఫ్రికా, ఆసియా దేశాల నుండీ బానిసలుగా వచ్చిన శ్వేత జాతియేతరులు జాతి వివక్ష మీద అస్తిత్వ ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల ఫలితంగా సామాజికంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గౌరవ బహువచనంగా "You' మాత్రమే నిలబడి 'Thou' కాల ప్రవాహంలో కొట్టుకుపోయింది.

తెలుగు భాషలో కూడా ఇటువంటి పరిణామ సూచిత పదాలున్నాయి. స్త్రీవాద అస్తిత్వ ఉద్యమ ఫలితంగానే 'మానభంగం' అని అనడానికి వీల్లేదు. 'అత్యాచారమ'నే అనాలి. ఒకప్పుడు కులసూచితంగా తిట్టుపదాలుగా ఉన్న 'చండాల' వంటి పదాలు దళిత అస్తిత్వ ఉద్యమ నేపథ్యంలో క్రమంగా అదృశ్యమయ్యాయి. సామాజిక పరిణామాల ఫలితాలను ఆవిష్కరించేది, వ్యక్తికరించేది భాషయేనని ఈ పదాలు నిరూపిస్తాయి.

విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత రాయలసీమ దాదాపు 200 సంవత్సరాల పాటు పాలెగాండ్ల పాలనలో ఉంది. సామ్రాజ్య కాలంలో పాలెగాండ్లు అమరనాయంకరులుగా ఉండేవారు. చక్రవర్తికి విశేషమైన సంపదను, సైన్యాన్ని అందించేవారు. రాయలసీమలో ఉన్న అమరనాయాంకరులను 'రాణువ' గా వ్యవహరంలోఉండేవి . అందుకే రాయలసీమను విజయ నగర సామ్రాజ్య కాలంలో 'రాయరాణువసీమ'గా పిలిచేవారు5.

సామ్రాజ్య పతనం తర్వాత అమరనాయాకంరులంతా పాలెగాండ్లుగా అవతారమెత్తి రాయలసీమను రావణకాష్టంగా మార్చేశారు. నిరంతరం తమలో తాము యుద్ధాలు చేసుకుంటూ భయోద్విగ్నస్థితిని కలిగించారు ఈ అశాంత పరిస్థితిని రాయలసీమ మాండలికం వ్యక్తీకరిస్తోంది. మిగిలిన తెలుగు ప్రాంతాల్లో లేని విలక్షణమైన తిట్లు ఈ మాండలికంలో ఉన్నాయి. ఆ తిట్లు యథాతథంగా కైఫీయత్తుల్లో కూడా ఉన్నాయి.6 ఉదా: పాలలో పాపరకాయ పిండే శుద్ధులు, తలకొట్టివేయడం, కొంపలుదున్ని ఆముదాలు విత్తడం, ఆకు చించడం మొ॥

4. మానవ అవసరాలు, సంస్కృతుల సంలీనం:

ఆసియా, ఐరోపా ఖండాల మధ్య అనాదికాలం నుండీ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత తుర్కిలోని కానిస్టాంటినోపుల్ (ఇస్తాంబుల్) ను అరబ్బులు ఆక్రమించుకోవడంతో ఆసియా ఐరోపాల మధ్య దారులు మూసుకుపోయాయి. కొందరు సాహన యాత్రికులు సముద్రంలో జలమార్గాలను కనుగొన్నారు. మసాల దినుసుల కోసం భారతదేశానికి జలమార్గాల ద్వారానే వచ్చారు. భారతదేశానికి రావడం, వ్యాపారం చేయడం, యుద్ధాలు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా భారత దేశ చరిత్రలో ఐరోపావారు విప్లవాత్మకమైన పాత్ర పోషించారు. సహజంగానే వారి భాషల్లోని అనేక పదాలు తెలుగులోకి వచ్చిచేరాయి. మిరప, బొప్పాయి (పరంకాయ), పొగాకు వంటి కొత్తతోటలు, పంటలు మనకు పరిచయం అయ్యాయి7.

పోర్చుగీసు ఇంజనీర్లు చెరువులు నిర్మించడమే గాక మన చెరువుల్లోకి బాతులను (బుడ కోళ్ళు) వదిలారు. బాతుపదమే గాక ఆ పక్షి కూడా మనకు పరిచయమయ్యింది. పైన చెప్పుకున్న మిరప, బొప్పాయి, పొగాకు పదాలు పోర్చుగీసు భాష నుండీ వచ్చి చక్కగా తెలుగుదనాన్ని సంతరించుకున్నాయి. మిర్చీ పంట కాస్తా స్థానిక 'మిరియం' తో కలసి మిరప అయ్యింది. Tobacco పొగను ఇచ్చే ఆకుగా పొగాకయ్యింది. బొప్పాయిని దక్షిణ అమెరికా సమీపంలోని పపాయిదీవుల నుండీ పోర్చుగీసులు పరిచయం చేశారు. Papaya బొప్పాయిగా నిలబడింది. పోర్చుగీసులను ఆంధ్రదేశంలో బుడతకీచులుగా పిలిచేవారు, కానీ రాయలసీమలో పరంగీలుగా వ్యవహరించారు. అందుకే పరంగీలు తెచ్చిన బొప్పాయిని రాయలసీమలో 'పరంకాయ'గా పిలుస్తున్నాయి. 'బాతు' పదాన్ని నీటిలో బుడుంగున మునుగుతున్నందున 'బుడకోళ్ళు'గా వ్యవహరిస్తారు. గోమాంతక ప్రాంతం 'గోవా' గా మారిపోయింది. కన్నడ తీరం కోరమండల తీరంగా ప్రచారంలోకి వచ్చింది. అల్మారా, అనాస, బాల్చీ, చొక్కా కమీజు, ఇస్త్రీ, మేస్త్రీ, కోస్తా వంటి అనేక పోర్చుగీసు పదాలు ప్రదానంగా వచ్చిచేరాయి.ఇవి తెలుగు సంస్కృతితో పోర్చుగీసులకున్న సాన్నిహిత్యాన్ని చారిత్రకంగా నిరూపిస్తున్నాయి. ఇలాగే డచ్చి, ఫ్రెంచి పదాలు తెలుగుభాషలో కలసిపోయాయి9." మ్యాంగో (Mango), రాయలు (Royal) రావు (Rao), పందికొక్కు (Bandicoot) వంటి పదాలు దక్షిణ భారతదేశం నుండి వెళ్ళి ఐరోపా భాషల్లో కలిశాయి. 10

తెలుగు ప్రాంతానికి ఇరుగు పొరుగు భాషలైన తమిళం, కన్నడం, మరాఠీ, ఒరియా వంటి భాషల పదాలు సాంస్కృతిక సంచీనత వల్లనే కలిశాయి. సాంస్కృతిక సమ్మేళనం వలన ద్రావిడ సంస్కృత భాషలు పరస్పర ప్రభావాన్ని కల్గివున్నాయి11.స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ దేశానికి నాయకత్వ పాత్రని పోషించింది. సహజంగానే కిరణ్మయి, ఉపాధ్యాయ వంటి పేర్లు తెలుగు వారివిగా మారిపోయాయి. ప్రముఖ బెంగాలీ నాయకుల పేర్లు సరేసరి.

క్రీ.పూ. మూడవ శతాబ్దంలో భారతదేశంలోకి గ్రీకులు ప్రవేశించారు. భారతీయ శిల్పం గ్రీకుల ప్రభావానికి తీవ్రంగా గురయ్యింది. భారతీయ గ్రీకు శిల్పరీతుల సమ్మేళనంతో 'గాంధార శిల్పం' అనే కొత్త శిల్పశైలి తయారయ్యింది. ఇదే సందర్భంలో ప్రాచీన భారతీయ నాటకం కూడా గ్రీకు నాటక ప్రభావానికి లోనయ్యింది. మన నాటకాలలోకి 'తెరవేయడం', 'తెరతీయడం' అనే పద్ధతి వచ్చింది. దీనిని 'యవనిక' అంటారు12. యవనులంటే గ్రీకులు. గ్రీకులు భారతదేశ ఆగమనాన్ని ఈపదం సూచిస్తుంది. అదేవిధంగా గ్రీకుసోఫిస్టు తత్వశాస్త్రం కూడా భారతీయ తత్వశాస్త్ర ప్రభావానికి లోనయ్యింది.

12వ శతాబ్దంలో ఉత్తరభారతాన్ని తురుష్కులు ఆక్రమించుకొన్నారు. క్రమంగా వారి దాడులు దక్షిణానికి విస్తరించాయి. తురుష్కులతో దక్షిణాది వారికి సమ్మేళనాలూ, సంఘర్షణలు జరిగాయి. అనేక మంది దక్షిణాది పాలకుల మంత్రులు అనివార్యంగా అరబ్బీ, పారశీకం, టర్కీ భాషల్ని నేర్చుకోవాల్సి వచ్చింది. శ్రీనాథునితో సన్నిహితంగా ఉన్న మామిడి సింగన, బెండపూడి అన్నయలు ఈ భాషల్లో ప్రవీణులు, 17వ శతాబ్దం చివరి నాటి తెలుగు కావ్యభాషలోకి కనీసం తొమ్మిది వందల పదాలు వచ్చిచేరాయి13.

ఇవి మధ్యయుగంలో తెలుగు ప్రాంతంమీద మహమ్మదీయుల ప్రభావాన్ని తెలియజేస్తాయి. హిందూముస్లిం సాంస్కృతిక సమ్మేళనంలోని భిన్నత్వంలోని ఏకత్వాన్ని చారిత్రకంగా అంచనా వేయడానికి వీలు కల్పిస్తున్నాయి.

5. సామాజిక సాంస్కృతిక విప్లవాలలో భాషలు – అనువాదాలు:

కొందరు ఐరోపా యాత్రికులు అనేక సామాజిక అవసరాల నిమిత్తం భూగోళమంతా యాత్రలు చేశారు. ఆయా పర్యటనల్లో అనేకభాషల్ని అధ్యయనం చేసి అక్కడి సంస్కృతులను కూడా అవగాహన చేసుకున్నారు. మార్కోపోలో యాత్రికుల కుటుంబానికి చెందినవాడు. సిల్క్ రూట్ మీదుగా చైనా భారతదేశాలను సందర్శించాడు. చెంఘిజ్ఫాన్ మనుమడు కుబ్లయ్భాన్ని కలిశాడు. భారతదేశంలోని రుద్రమ పాలనతో పాటు అనేకమంది పాలకుల పాలనను గమనించాడు. అనేక భాషల్ని నేర్చుకున్నాడు. మార్కోపోలో పర్యటనలవల్లనే ఐరోపా ప్రజలకు భారతదేశం గురించి ఒక అవగాహన కలిగింది. నికోలోకోంటీ వెనిస్ నుండీ బాగ్దాద్ వచ్చి క్రైస్తవాన్ని వదలివేసి పారశీకభాషను నేర్చుకున్నాడు. అరేబియా వచ్చి అరబ్బీ నేర్చుకున్నాడు. భారతదేశం వచ్చి తెలుగుభాషను నేర్చుకొని తన మాతృభాష ఇటాలియన్ పోల్చుకొన్నాడు. తిరిగి రోమ్ చేరుకున్నాక, వాటికన్సిటీ పోప్ ఏజెన్స్ IV ఆదేశం మేరకు తన పర్యటనానుభవాలను పుస్తకంగా రాశాడు. ఈ ఇరువురి పర్యాటకుల రచనలు ఐరపా సమాజం మీద గాఢమైన ప్రభావాన్ని చూపించాయి. చర్చి ఆధిపత్యం శాశ్వతంగా నశించి మత పురురుజ్జీవనం (Renaissance) రావడానికి ప్రధాన కారణాలలో ఈ రచనలు కూడా ఒక కారణం. కేవలం వంద సంవత్సరాలలో ప్రధానమైన భాషల్లోకి వీరి అనుభవాలు అనువాదమయ్యాయి14. ఫలితంగా సముద్ర మార్గాల అన్వేషణలు, పారిశ్రామిక విప్లవానికి పునాదులు పడ్డాయి.

మత పునరుజ్జీవనం తర్వాత అనేకమైన శాస్త్రీయమైన పరిశోధనలు, ఆవిష్కరణలు జరిగాయి. ఆవిష్కరణలకు అవసరమైన నూతన పదజాలోత్పత్తికి ఇటాలియన్ బాష చాలా ఉపయోగపడింది. అందుకే ఇటాలియనో భాషా చరిత్రను అధ్యయనం చేయడమంటే దక్షిణ ఐరోపా సామాజిక శాస్త్రీయ ఆవిష్కరణల చరిత్రను అధ్యయనం చేయడమేనని పరిశోధకుల అభిప్రాయం15.

ఆదిశంకరుడు వేల సంవత్సరాల పర్యటనలవల్ల ప్రాకృత, పాళీ భాషల బౌద్ధమతం మీద వైదికమతానికీ, సంస్కృతానికీ ఆధిపత్యం ఏర్పడింది. అలాగే తెలుగువాడైన వల్లభాచార్యుడికి పోతన భాగవతమంటే చాలా ఇష్టం. వల్లభుడు ఉత్తర భారత యాత్రలు హైందవానికి పునరుత్తేజం తీసుకురావడానికి విశేషంగా శ్రమించాడు. వల్లభాచార్యుని చేత ప్రభావితుడైన సూరదాసు హిందీలోని బ్రజ్ మాండలికంలో 'సూర్సాగర్' రాశాడు. పోతన స్ఫూర్తి వల్లభుడిలో, వల్లభుడి ప్రభావం సూరదాసు మీద ఉన్నాయి. ఇలాగే సూఫీలు, దర్వీషులు ఇస్లాం విస్తరణకు కృషిచేశారు. ఇంతటి మతచైతన్యాలకు ప్రధాన ఆధారం భాషలే! వల్లభుడు, చైతన్యుల్లాంటి వారి వల్ల దేశీయ భాషల సాహిత్యం అభివృద్ధి చెంది హైందవం పునరుత్తేజం పొందినట్లే, సూఫీలు దర్వీషుల వల్ల అరబ్బీ, తురుష్కీ, పారశీక భాషలు ప్రపంచంలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి ఇస్లాం విస్తరించింది.

క్రీ.శ. రెండవ దశాబ్దంలో బౌద్ధమత పరివ్రాజకులు హాన్ వంశస్థుల పాలనా కాలంలో చైనాలో అడుగుపెట్టారు. క్రీ.శ. నాలుగవ శతాబ్దంలో కుమారజీవుడు చైనాకు వెళ్ళి బౌద్ధమత ప్రచారం చేశాడు. బౌద్ధమత ప్రచారంలో భాగంగా సంస్కృత, ప్రాకృత భాషల్లోని బౌద్ధసాహిత్యాన్ని దీనీ భాషలోకి అనువాదం. చేశాడు. యువానాత్సాంగ్ బౌద్ధమతాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి తక్షకామకాన్ ఎడారి మీదుగా భారతదేశానికి వచ్చాడు. సంస్కృత ప్రాకృత పాళీలతో పాటు దేశీయభాషలను నేర్చుకున్నాడు. అనేక గ్రంథాలను తన భాషలోకి అనువాదం చేసుకున్నాడు. తిరిగి వెళ్తూ అనేకమైన గ్రంథాలను తనవెంట తీసుకువెళ్ళాడు. అప్పటివరకూ చైనాలో వున్న ప్రాచీన మత సాంప్రదాయాలు కూకటి వేళ్ళతో సహా కొట్టుకుపోయాయి. అనతికాలంలో మహాయానబౌద్ధం విస్తరించింది. ఈ పరివ్రాజకులు దేశీయభాషల్ని అధ్యయనం చేయడం, అనువాదం చేసుకోవడం వల్లనే చైనా సమాజంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భాషలు సాంస్కృతిక వ్యక్తీకరణలుగా మత అభివ్యక్తులుగా నిలబడ్డాయి. అనువాదం భిన్న సంస్కృతుల మధ్య వారధిగా మారింది. సామాజిక చలన సూత్రాలకు భాషలు, అనువాదాలే వాహికలు.
బౌద్ధం, జైనం, వీరశైవం జనసామాన్యానికి చేరువ కావడానికి కూడా భాషలు, అనువాదాలే ఆధారం. అదేవిధంగా క్రైస్తవ మత విస్తృతికీ ఇవే సూత్రాలు వర్తిస్తాయి.

6. గోత్రనామాలు, సాంప్రదాయాలలో చారిత్రక అవశేషాలు - విశేషాలు:

వేదరులైన గౌతమ, అగస్త్య, వశిష్ట, అంగీరస వంటి వారు వేదాలలో, ఇతిహాసాలలో చాలా ప్రముఖులు, నేటి బ్రాహ్మణ కులంలోని గోత్రనామాలు తమ వంశమూల పురుషులైన ఈ ఋషులతో సంబంధాన్ని కల్గివున్నాయి. అలాగే ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాలలో జాట్ కులం చాలా ప్రభావవంతమైన అగ్రవర్ణం. వీరిలో కొందరు మధ్యయుగంలో ఇస్లాం, సిక్కు మతాల్లోకి మారిపోయారు. నేటి పాకిస్తాన్లో కూడా లక్షల మంది వున్నారు, అయినప్పటికీ వారిలో చాలామంది గోత్రనామాలు మారలేదు. ముందర ముదర, ముద్ర, మద్ర లాంటి పదాలు గోత్రనామాలుగా కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆ పదాలకు మూలం వారు ఐతిహాసాలలోని మద్ర దేశీయులనికొందరిఅంచనా. 

(https://arorakhatri.com/gotra.php?gid=7853#:~:text=We%20spell%20this%20surname%20as,Madras%20are%20Kshatriya)

ఇటువంటివి సమీప చరిత్రలో అనేకం కనిపిస్తాయి. మరాఠాల చరిత్రలో 17,18 శతాబ్దాలు మహోజ్వలమైవని, గైక్వాడ్లు, ఫోన్లు, పీస్వాలు, హోల్కర్లు, సింధియాలు ఆ సమయంలో నిర్వహించిన పాత్ర చాలా గొప్పది. వారి వంశస్తులకు ఇవే గోత్రనామాలుగా ఉన్నాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో రాయలసీమలో బోయ కులస్తులు కీలకపదవులు అలంకరించారు. వారి ఉద్యోగాలే తర్వాతికాలంలో గోత్రాలుగా, వంశనామాలుగా ఉన్నాయి. దళవాయి, తలారి మొ.. (శాతవాహనుల కాలంలోనే 'తలవరి' ఉద్యోగం ఉన్నప్పటికీ కుల అస్తిత్వంగా కనిపించదు). అన్ని కులాలలో శైవ వైష్ణవ భేదాలు కనిపిస్తాయి.

కానీ కురుబ/గౌరవలు మాత్రం శైవ సాంప్రదాయంలోనే ఎక్కువగా కొనసాగారు, వీరశైవ ఉద్యమ కాలంలో ఈ కులానికి నిర్దిష్ట రూపం ఏర్పడటం వల్ల గోత్రవాచకాలలో, వంశనామాలలో శైవ సంబంధమైన పదాలు కనిపిస్తున్నాయి. రెడ్డి కులంలో పోకనాటి రెడ్లు అనే ఒక ప్రత్యేక పాయ కనిపిస్తారు. వీరు పాకనాడు (నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కొంతభాగం) ప్రాంతం నుండీ వలస రావడం వల్లనే వీరు పోకనాటి రెడ్లుగా ప్రచారంలోకి వచ్చారు. పాకనాటి బ్రాహ్మణులకూ ఇదే వర్తిస్తుంది. ఇటువంటి ఇతివృత్తాలు ఆయా కులాల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తాయి.

కొన్నాళ్ళక్రితం 'కాంతార' అనే కన్నడ సినిమా తెలుగులోకి వచ్చి మంచి ఆదరణ పొందింది . హిందీలోకి వెళ్ళి అసాధారణంగా వసూళ్ళు రాబట్టింది. అందులో గులిగ, పంజుర్లీ అనే దేవుళ్ళ గురించి ప్రస్తావన వస్తుంది. ఈ దేవుళ్ళు తుళునాడు (దక్షిణ కన్నడ జిల్లా కర్నాటక) లో పూజలందుకుంటారు. వీరిలో 'గులిగా' అనంతపురము జిల్లాలో 'గులగానప్ప' అనే పూజ సాంప్రదాయంలో కనిపిస్తున్నాడు. ఆ పేరును నేటికి అనేకమంది తమ పిల్లలకు కూడా పెట్టుకుంటారు. 15,16 శతాబ్ధాల్లో తుళునాడు నుండి అనేకమంది సైనికులు ఈ వైష్ణవ దేవున్ని అనంతపురానికి తీసుకొచ్చారు.

కళ్యాణదుర్గంలో “కొల్లాపురమ్మ' అనే గ్రామ దేవత వుంది. ఈ సాంప్రదాయం కూడా 15,16 శతాబ్దాలలో మహారాష్ట్ర ప్రాంతం నుండీ వచ్చిన సైనికులు 'కొల్హాపూరు దేవత' అనే గ్రామ దేవతను తీసుకొచ్చారు.

7. జాతుల అస్తిత్వంలో భాషలు:

ఒక దేశాన్నిగానీ, ఒక ప్రాంతాన్నీ గానీ, ఒక జాతినీ గానీ, భాష ద్వారానే వాటి అస్తిత్వం నిర్ణయమవుతుంది. తమిళం వల్ల తమిళనాడు, జపానీవల్ల జపాన్, చీనీ వల్ల చైనా అని ప్రాదేశిక అస్తిత్వాన్ని కలిగివున్నాయి. బహుభాషా కుటుంబమైన భారతదేశంలో ప్రాదేశిక, జాతి అస్తిత్వమంటే భాషా అస్తిత్వమే.

దక్షిణ అమెరికా ఖండాన్ని లాటిన్ అమెరికా అంటారు. లాటిన్ భాష నుండి ఆవిర్భవించిన. ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీసు భాషలు అక్కడ వ్యవహారంలో ఉండటమే! దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మూలద్రావిడం నుండీ జన్మించిన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, తుళు, కొడగు వంటి భాషలు ప్రజావ్యవహారంలో ఉన్నందున దక్షిణ భారతీయులను ద్రావిడులు అని పిలుస్తారు. ఉత్తర భారతంలోని భాషల్లో ఎక్కువ భాగం ఆర్య సంస్కృతం నుండీ జన్మించినందువల్ల ఆర్యులని పిలవడం తెలిసిందే.

ప్రాచీన కాలంలో జాతులను కూడా భాషల ఆధారంగానే గుర్తించారు. సంస్కృత భాషేతరులను దస్యులని ఋగ్వేదం చెబుతోంది. పార్శీభాషవల్ల పారశీకులని పిలిచారు. తుగ్లక్కులు, ఖిల్జీలు, సయ్యదులు. మొగలుల మాతృభాష తుర్కీ! అందువల్లనే వారిని తురుష్కులుగా వ్యవహరించారు.
భారత ఇతిహాసంలో కృష్ణున్ని చంపిన వారు అభీరులు. వీరు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో ప్రస్తుతం అహీరులుగా పిలవబడుతున్నారు. వారి భాష అహీరానీ/అహీర! ఈ భాషవల్లనే ఐతిహాసంలోని వారి అస్తిత్వాన్ని ఆధునిక పరిశోధకులు గుర్తించారు16 .

8. సామ్రాజ్యాలు - ప్రాంతీయభాషలు:

మహాసామ్రాజ్యాల పాలన కింద అనేక చిన్నచిన్న ప్రాంతాలుంటాయి. ఆయా ప్రాంతాలు తమదైన ప్రాదేశిక అస్తిత్వాన్ని కలిగివుంటాయి. వాటిని తమ అధీనంలో వుంచుకోవడానికి చక్రవర్తులు స్థానిక భాషా సాంప్రదాయలను ఖచ్చితంగా పాటించేవారు. మధ్యభారతంలో లభించిన అశోకుని శాసనాలు మాగధీ ప్రాకృతంలో బ్రాహ్మీలిపిలో ఉన్నాయి. వాయువ్య భారతదేశంలో ఖరోష్టిలిపిలో ప్రాకృత భాషలో ఉన్నాయి. వాయువ్యంలోనే ఉన్న ఇండో బాక్ట్రియన్ ప్రాంతంలో గ్రీకుభాషలో, అకిమినీడ్ ప్రాంతంలో అరామిక్ భాషలో అశోకుడు శాసనాలు వేయించాడు. గాంధార ప్రాంతంలో అర్ధమాగధి భాషను శాసనభాషగా ఉపయోగించాడు. దక్షిణ భారతంలోని కర్ణాటకాంధ్ర ప్రాంతాల్లో బ్రాహ్మీలిపిలో ప్రాకృత భాషలో శాసనాలు ప్రకటించాడు. అశోకుడు వేయించిన ఈ శాసనాలు మొదటి లిఖితపూర్వకమైన శాసన ప్రకటనలు. ఇదే విధానాన్ని తర్వాత పాలకులందరూ పాటించారు. అశోకుడు ఇంతటి భాషావైవిధ్యాన్ని పాటించడానికి ప్రధాన కారణం ఆ ప్రాంతాలలో ఆయా భాషా వ్యవహర్తలు ఉండటమే! స్థానిక భాషల ప్రాధాన్యతను గుర్తించడమే! చాలా సందర్భాలలో మత, భౌగోళిక, సాంస్కృతిక ప్రభావం కన్నా భాషా ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. బహుభాషా ప్రాంతాలలో ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎనిమిది వందల సంవత్సరాలు పాలించిన ఢిల్లీ సుల్తానులు కూడా ఈ ప్రభావం నుండీ బయటకీ రాలేకపోయారు.

అనేక సందర్భాలలో ఒకే శాసనాన్ని ఒకేసారి రెండు మూడు భాషలలో కూడా వేయించిన సందర్భాలున్నాయి. నైలునదీ డెల్టాలో లభించిన రొసెట్టారాయి శాసనం ప్రాచీన ఈజిప్షియన్ హీరోగ్లాపిక్, డెమోటిక్, ప్రాచీన గ్రీకుభాషలో ఉంది. దీనిని టోలమిక్ వంశానికి చెందిన ఐదవ ఎపిఫెన్స్ వేయించాడు. ఇదేవిధంగా శ్రీలంకలోని గాలెలో లభించిన శాసనం తమిళం, చీనీ, పర్షియన్ భాషల్లో ఉంది. (https://en.wikipedia.org/wiki/Galle_Trilingual_Inscription) ఇలాంటి బహుభాషా శాసనాలు భారతదేశంలో అసంఖ్యాకంగా కనిపిస్తాయి. శాసనాలలో భిన్నభాషల ప్రయోగం వల్ల ఆయా జాతుల ఉనికి, ప్రాధాన్యత స్పష్టంగా అర్ధమవుతుంది. ఇలా భిన్నభాషలలో ఒకే శాసనాన్ని వేయించడానికి మరొక కారణం ఆయాభాషా వ్యవహర్తల మద్దతు పొందడానికి చేసిన కూడా! ఎంత శక్తివంతుడైన పాలకుడైనప్పటికీ అనివార్యంగా స్థానిక భాషల అస్తిత్వాన్ని వచ్చేది.

ఈ పద్ధతి శాసనాలలోనే కాదు నాణేలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. శాతవాహనులు తమ నాణేల మీద ప్రాకృతభాషతో పాటు తెలుగుభాషను కూడా ఉపయోగించారు.17 శాతవాహనుల కాలంలో ఆంధ్రుల ప్రాశస్త్యం, ప్రాధాన్యత దీనినిబట్టి అర్థమవుతుంది. బ్రిటీష్ వారి కరెన్సీ మీద తెలుగు, బెంగాళీ వంటి దేశీయభాషలు కూడే వుండేవి.

స్థానిక పాలకులు, సామంతులు స్థానిక భాషలలోనే శాసనాలు వేయించారు. ఈ ప్రాంతీయ భాషల్లోని శాసనభాష కూడా చారిత్రక ఆధారమే! ఇందులోనూ మూడు రకాల ఆధారాలు కనిపిస్తాయి.

అ) శాసనభాష పరిణామం పల్ల ఆభాషాచరిత్ర, ఆ సంస్కృతి యొక్క పరిణామ వికాసాలు తెలుస్తాయి. ఆ భాషా చరిత్ర అధ్యయనమంటే పరోక్షంగా ఆ సాంస్కృతిక అధ్యయనమే! ఉదా: రేనాటిచోళు ల శాసనాలలోని తెలుగు భాషకు విజయనగర చక్రవర్తుల పతనానంతర పాలేగాళ్ళ కైఫీయత్తుల్లోని తెలుగు భాషకు హస్తమశకాంతరమైన తేడా వుంది. దీనికి కారణం 13, 14వందల సంవత్సరాలలో తెలుగు సమాజంలో వచ్చిన అసాధారణ, అనూహ్యమైన పరిణామాలే కారణం.

ఆ) ప్రాదేశిక భాషల్లోని విషయాలవల్ల కూడా అనేకమైన చీకట్లు తొలగి చారిత్రకమైన వెలుగురేఖలు ప్రసరిస్తాయి. క్రీ.శ. 710నాటి రేనాటి చోళరాజు పుణ్యకుమారుని రామేశ్వర స్తంభ శాసనంలో 'వసన్తపోటి' అనే మాట వుంది. ఈమె పుణ్యకుమారుని భార్య, రేనాటిచోళుల అడపడుచులకు 'పోటీ' అనే విశేషణం లేదు. బాదామి చాళుక్యుడైన రెండవ పులకేసి కుమారుడు చంద్రాదిత్యునిభార్య విజయమహాదేవి పోటీ, తూర్పుచాళుక్య మంగిరాజు కూతురు పృథివీపోటి, అందువల్ల బాదమి చాళుక్యుల ప్రత్యర్థులైన పల్లవులతో చేసిన యుద్ధాలలో రేనాటిచోళుల పాత్రను నిర్దిష్టంగా అంచనా వేయడానికి తెలుగుపదమైన 'పోఱి' పల్ల అవకాశం ఏర్పడింది.18

ఇ) భాషల లిపి పరిణామం వల్ల కూడా చరిత్రను, అంచనా వేయవచ్చు. తెలుగు, కన్నడ లిపి వల్ల తెలుగు, కన్నడ సంస్కృతుల సాన్నిహిత్యం, వైవిధ్యం చరిత్ర అర్ధం అవుతాయి. తమిళ మలయాళ లిపి వల్ల కూడా ఆ సాంస్కృతిక విషయాలు అవగతమవుతాయి. ఆంగ్లభాషకు ఉపయోగించే రోమన్ లిపి వల్ల కూడా ఇదేవిధమైన అంశాలు తెలుస్తాయి.

9. భిన్న సంస్కృతుల సంగమం కొత్తభాషల ఆవిర్భావం, విలక్షణ నుడికార, మాండలికాల నిర్మాణం:

13వ శతాబ్దం నిర్మాణం నుండీ భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పాలన ప్రారంభమయ్యింది. మమ్లుక్లు, ఖిల్జీలు, తుగ్లక్కులు, సయ్యదులు, లోడీలు, మొగలులు మధ్యాసియాలోని వివిధ ప్రాంతాలకు, దేశాలకు చెందిన వారు. వీరి మాతృభాష తురుష్కమే అయినప్పటికీ ఆ తురుష్కాభాషా వ్యవహరాలు చాలా వైవిధ్యమైనవి. వీరు ఉన్నతవర్గ ముస్లిములు తమదైనందిన వ్యవహారాలలో సాహిత్య రచనలలోపారశీక భాషను ఉపయోగించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అరబీ భాషను ఉచ్ఛరించేవారు. వారి సైనికులు తురుష్కభాషను వ్యవహరించారు. ఢిల్లీ సుల్తానులు స్థానికంగా ఉన్న భారతీయ యువకులను కూడా సైన్యంలో చేర్చుకున్నారు. భారతీయ సైనికులు బ్రజ్, ఖరీబోలి, హర్యాలీభాషలు మాట్లాడేవారు. ఇలా పార్సీ, అరబ్బీ, తుర్కీ, బ్రజ్, ఖరీబోలి వ్యవహర్తలంతా ఒకే గొడుగు కింద జీవించారు. ప్రారంభంలో వీరందరి మధ్య సైగల ద్వారా సంభాషణ జరిగేది. వారి పదాలు కొన్ని వీరికి వీరి పదాలు కొన్ని వారికి కష్టంగా అర్థమయి మాట్లాడుకొనేవారు. క్రమంగా సైనికులు, సైనికాధికారులు, వ్యాపారుల మధ్య 'ఉర్దూ' అనే కొత్త భాషకు అంకురార్పణ జరిగింది. అందుకే ఉర్దూభాష సైనిక గుడారాల భాషగా ప్రచారమయ్యింది. అనతికాలంలోనే జనబాహుళ్యంలో ప్రజాభాషగా గుర్తింపునందుకొంది.

కొన్ని సందర్భాలలో పాలకుల భాష ఒకటి పాలితుల భాష మరొకటయితే పాలితుల భాష విపరీతంగా ప్రభావితమవుతుంది. దక్కన్ పీఠభూమిని కుతుబ్ షాహీలు,అసఫ్ జాహీలు చాలాకాలం పాలించడం వల్ల తెలంగాణ లోని తెలుగుభాష విపరీతంగా మార్పుకి లోనయి ఒక ప్రత్యేక మాండలికంగా రూపొందింది.19

మధ్యయుగంలో ఇటలీ నగరాలు ప్రపంచ వర్తకానికి పేరెన్నిక గలవి. వర్తక వాణిజ్యాలన్నీ నగరాల కేంద్రంగా జరిగేవి. వెనిస్, సిసిలి, కార్సికా మొ॥. ఇటాలియనో భాషలో మాండలికాలు ఈ నగరాల ఆధారంగానే ఏర్పడ్డాయి. అందువల్ల ఈ మాండలికాలు పరస్పర ఇతర మాండలిక వ్యవహర్తలకు సులభంగా అర్ధంకావు. దీనికి ప్రధానకారణం చరిత్రలో ఈమాండలికాల మీద ఆయా ఐరోపాజాతుల భాషలు బలమైన ప్రభావాన్ని చూపడమే.

10. భాషల అస్తిత్వ ఉద్యమాలు:

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర భావన వల్ల తమిళనాడుతో విడిపోయి ఆంధ్రరాష్ట్రం విడిపోయింది. క్రమంగా భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశమేర్పడింది. దేశంలో సాంస్కృతిక వైవిధ్యమంటే భాషా వైవిధ్యమే అనేంతగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉన్నాయి. ఇంతటి భాషా వైవిధ్య రాష్ట్రాలున్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు.
పాకిస్తాన్ నుండీ బంగ్లాదేశ్ విడిపోవడానికి ప్రధానకారణం, బెంగాళీ అస్తిత్వ ఉద్యమం! పంజాబీ, ఉర్దూల భాషాధిక్యతను ఎదిరించి బంగ్లాదేశ్ ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశం తనదైన భాషను అధికార, జాతీయ భాషలుగా ప్రకటించు కోవడానికి కారణం భాష సాంస్కృతిక అభివ్యక్తి కావడమే! వలస పాలన నుండీ ప్రత్యేక దేశాలుగా ఆవిర్భవించిన అమెరికా, ఆస్ట్రేలియాలో ఆంగ్లమే అధికార భాషగా ఉన్నప్పటికీ ఉచ్ఛారణా వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. స్థానిక భాషలను నేరస్తభాషలని దారుణంగా కాలరాశారు. అయినప్పటికీ స్థానిక భాషలప్రభావం ఆ ప్రాంతంలోని ఆంగ్లం మీద తీవ్రంగా ఉంది. అలాగే ఈ స్థానిక సంస్కృతులు అర్థం కాకుంటే అక్కడి ఆంగ్లభాషాచరిత్ర స్పష్టంగా అర్ధంకాదు, విస్తృతంగా స్థానిక భాషల పదాలను ఆంగ్ల భాషలోకి ఆధానంగా స్వీకరించారు. అందుకే ఆస్ట్రేలియన్ ఇంగ్లీషు, అమెరికన్ ఇంగ్లీషు అనే మాండలికాలుగా, ప్రత్యేక నుడికారాలుగా ఏర్పడ్డాయి.

11. ప్రపంచీకరణ, సాంకేతికత - భాషల మార్పు:

ప్రపంచీకరణ అనేక ప్రాదేశిక సంస్కృతుల్ని భాషల్ని తీవ్ర సంఘర్షణలోకి నెట్టింది. భాషల స్వరూపాలను మార్చివేసింది. ప్రాంతీయ భాషల మీద ఆంగ్లభాష బలమైన ఆధిపత్యం చూపిస్తోంది. ప్రాంతీయ భాషలు ప్రమాదంలో పడ్డాయి. అదే సమయంలో ఆంగ్లభాష కూడా అనూహ్యమైన మార్పులకు లోనవుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలు ఆంగ్లాన్ని ఊహించనంత వేగంగా మార్చివేస్తున్నాయి. పదాల ఉచ్ఛారణ, రాత మారిపోతోంది. సమకాలీన చరిత్రకారులు, భాషాశాస్త్రవేత్తలు ఆంగ్లంలో జరుగుతున్న మార్పులకు ఆశ్చర్యపోతున్నారు. సంక్షిప్తత పేరుతో పదాలు, వాక్యాలు తమ రూపాన్ని మార్చుకుంటున్నాయి.

పదాలలో సంక్షిప్తత

Final (ఫైనల్ )         Finale (ఫినాలే )
Brother                  Bro
You                        U
Sorry                     Sory
Please                    Pls
OK                         K
Instagram              IG
Twitter                   TW


వాక్యాలు కూడా Short-form లోకి వచ్చాయి.

Buy one get one          BOGO
In my opinion             IMO
By the Way                 BTW
What about you          WBU
Does anyone know      DAE
I know right                IKR

ఆశ్చర్యార్థకాలూ చిన్నవైపోయాయి.

Oh my God                OMG
Oh Really                   Orly


పదాలు, వాక్యాలలోకి అంకెలు వచ్చిచేరడం

Explain like I am fine- ELIS Late-L8

Business to Consumer - B2C Before- B4

Great – GR8 

Hate -H8

Face to face- F2F

Tomorrow- 2mrow (https://sproutsocial.com/insights/social-media-acronyms/)

ఈ సోషల్ మీడియా Acronyms వాడకం 2000 తర్వాత మొదలయ్యింది. 2008 తర్వాత సోషియల్ మీడియా విస్తరించడంతో ఈ Social Media Slang క్రమంగా ప్రత్యేకతలను సంతరించుకుంది. ట్యునీషియా, ఈజిప్టు, లిబియా, యెమెన్, సిరియా, బహ్రెయిన్లలో 2010-11 లలో వచ్చిన Arab Springలో (అరబ్ విప్లవం) సోషల్ మీడియా కూడా కీలకపాత్ర పోషించింది. ఆదేశాలలో నిరంకుశ ప్రభుత్వాలు నేలకూలాయి. ఉద్యమాల్లో ఇటువంటి Short Messages ఉద్యమకారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేశాయి. కనీసం మూడు వందల పదాలు, వాక్యాలు ఇప్పటికే తమ రూపాన్ని మార్చుకున్నాయని అంచనా! ఈ పరిణామం చిన్న మార్పేమి కాదు.

మారుతున్న ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా ఆంగ్లభాషావేత్తలకన్నా చైనాభాషా వేత్తలు వేగంగా స్పందించారు. 1999-2000 సమయంలో చైనా భాషనుండి ఐదు అక్షరాలను తొలగించడమే గాక చైనా భాషను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు. ఈచర్య ఆంగ్ల భాషా వేత్తలను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టింది. ప్రపంచాన్ని శాసిస్తోన్న అమెరికా, ఇంగ్లాండ్ దేశాల ఆంగ్లభాషావేత్తలు చీనీ భాషా ఉధృతిని అడ్డుకోవడానికి సరికొత్త ప్రణాళికను తయారు చేశారు. అదే కమ్యునికేటివ్ ఇంగ్లీషు! దీనిని బహుళ జాతికంపెనీల ఒత్తిడి ద్వారా ఒకప్పటి తమ వలస దేశాల్లోని విద్యావిధానాల్లోకి చాలా సులభంగా ప్రవేశపెట్టారు. ఒకప్పుడు ఇంగ్లీషు నేర్చుకోవాలంటే ముందు వ్యాకరణాన్ని నేర్చుకొనేవారు. ఈ CEలక్ష్యం వ్యాకరణం కన్నా ఆంగ్లభాషా వినియోగాన్ని ప్రోత్సహించడం. నిన్నటితరం ఆంగ్లభాషను నేర్చుకోవడానికి వ్యాకరణం మీద ఆధారపడితే ప్రస్తుత తరం, CE మీద ఆధారపడుతోంది. వినియోగం వల్ల భాష వస్తుందని వారి అభిమతం, అది కొంతవరకు వాస్తవమని ఇప్పటికే ఋజువయ్యింది కూడా! మన తెలుగు పంతుళ్ళు ఇంకా పొక్కిళ్ళు, దీర్ఘాలు, కొమ్ములను పరీక్షల్లో విద్యార్థులు రాయలేకపోతే మార్కులు తగ్గించే స్థితిలోనే ఉన్నారు. అనేకరకాల గూF 12తయారీకి చైనా ప్రసిద్ధి. అదీ ఎంతగానంటే బౌద్ధ హిందూమతదేవుళ్ళ విగ్రహాలన్నీ చైనాలో తయారవుతున్నాయి. హైదరాబాదు రామానుజుని విగ్రహ తయారీలో కూడా చైనా పాత్ర ఉంది. 2003లో చైనా నుండీ సారా వ్యాధి (SARS Severe Acute Respiratory Syndrom) ప్రపంచానికి విస్తరించినప్పుడు ప్రపంచ ఆర్థిక మార్కెట్టులో చైనా వాటా నాలుగుశాతం వుండేది. 2019లో అదే చైనా నుండి Covid-19 వచ్చే సమయంలో చైనా వాటా అక్షరాలా పదహారు శాతం. అంటే ప్రపంచ మార్కెట్టు మీద చైనా ఎంత ప్రభావాన్ని చూపిస్తోందో అర్థమవుతోంది. ఆర్థిక ఆధిపత్యమంటే సాంస్కృతిక ఆధిపత్యమే! ఆఫ్రికా దేశాలలో చైనా భాషా సంస్కృతుల ప్రభావం తీవ్రంగా వుంది. ఆంగ్ల చైనా భాషలు సంఘర్షిస్తున్న సమయంలో మనం జీవిస్తున్నాం. ప్రపంచీకరణను ప్రవేశపెట్టిన దేశాలే చైనా ఉదృతికి ఒత్తిడిలో పడ్డాయి. ఆశ్చర్యమేమిటంటే చైనా ఆర్థికంగా శక్తివంతం కావడానికి అమెరికా చైనాలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టడమే! అయితే చైనా ఒత్తిడిని అమెరికా తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఏ భాషా సాంప్రదాయాలు భవిష్యత్తులో ఆధిక్యత ప్రదర్శిస్తాయన్నది రేపటి చరిత్ర నిరూపిస్తుంది. విజేతలే చరిత్రనిర్మాతలు.

పైపరిణామాలకు సమాంతరంగా, తూర్పు ఆసియా దేశాలలో మరొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. థాయ్లాండ్, ఇండోనేషియా వంటి దేశాల ఆర్థికవ్యవస్థ ప్రధానంగా పర్యాటకరంగం మీద ఆధారపడివుంది. అక్కడ అందమైన బీచ్లు, థాయ్లాండ్లోని చట్టబద్ధమైన వ్యభిచారం పర్యాటకులను బాగా ఆకర్షిస్తున్నాయి. థాయ్,ఆంగ్ల భాషల సమ్మేళనం వల్ల టింగ్లిష్ అనే ఒక సరికొత్త భాష సమీప భవిష్యత్తులో ఏర్పడబోతోందని భాషాశాస్త్ర వేత్తలు నిర్దిష్టంగా అంచనావేశారు. ఇప్పటికే దానికి బలమైన పునాదులు కూడా పడ్డాయి. ఒకవిధంగా మనదేశంలో ఉర్దూలాగా ఈ భాష తయారు కాబోతోంది. పరిస్థితులు వేరుగా ఉన్నాయి అంతే!

(https://en.wikipedia.org/wiki/Tinglish#:~:text=Tinglish%20)

2024 ఏప్రిల్లో జరిగిన ఒక సంఘటన. లిసా లీ చైనాలో ఒక మహిళానికి, ఆమె సముద్రం ఒడ్డున చల్లని సాయంత్రాన్ని చూస్తూ తన బాయ్ ఫ్రెండ్ 'DAN' తో 'ఈ దృశ్యం ఎంత అందంగా ఉందో కదా' అని అడిగింది, అతని ప్రతిస్పందన వినదానికి ఇయర్ఫోన్స్ చెవిలో పెట్టుకుంటూ! "బేబ్ బాగా చెప్పావ్. దానికన్నా అందమైనది ఏమిటో తెలుసా! నువ్వు ఇక్కడే నా పక్కన ఉండటం" అని బదులు చెప్పాడు. అతను ఆమె రెండునెలలుగా 'డేట్'లో ఉన్నారు.
డాన్ భౌతికంగా మనిషికాదు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో రూపొందించిన వర్చువల్ బాయ్ ఫ్రెండ్. అవును, మీరు చదివింది నిజమే. DAN అంటే 'Do Anything Now'! ఇది చాట్ జివిట్ 'జైల్బ్రేక్' వర్షన్ అని BBC ఈ కథనాన్ని రిపోర్టు చేసింది. (https://youtu.be/Ms1s-S2ZpCc?si=FTZRQjNGR_HxwNK1) చైనాలో చాలా మంది ఈ AI Boy Friends ను ఇష్టపడుతున్నారు. నిజమైన భాగస్వామితో ఉండే ఇబ్బందులు వుండవని వారి అభిప్రాయం. (బిబిసిరిపోర్టు యూట్యూబ్) నిజానికి ఈ ఇతివృత్తంతో 2013లోనే 'HER' అనే హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. OTT Platforms లో ఉండి వుండవచ్చు.

ఇంతవరకూ మానవుని చర్యలకు భాష ఏవిధంగా ప్రభావితమయ్యిందో మనిషి చూశాడు. ఇకనుండి కృత్రిమ మేధ వల్ల జరిగే భాషా పరిణామాలను చూడబోతున్నాడు. రేపటి చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలు దానిని గురించి చర్చిస్తారు.

12. ముగింపు:

 • గ్రామనామాలు నిర్దిష్టమైన సంఘటనలను సామాజికసందర్భాలను చారిత్రకంగా అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.
 • చరిత్రలో జరిగిన చైతన్యాలను అశాంతిని భాషా పరిణామం వివరిస్తుంది. సంస్కృతుల సంగమాలా వల్ల భాష తీవ్రంగా ప్రభావితమవుతుంది. 
 • చారిత్రక విప్లవాలలో సమాజాన్ని చైతన్యవంతం చేసి సామాజిక చలన సూత్రాలకు భాషలు అనువాదాలు ఇతోధికంగా దోహదం చేస్తాయి. 
 • గోత్రనామాలు, వంశనామాలు చారిత్రకవిషయాలను స్పష్టంగా వివరిస్తాయి. ఒక జాతి అస్తిత్వం భాష ద్వారానే నిర్ణయమవుతుంది. 
 • చక్రవర్తులు ప్రాంతీయ భాషలలో శాసనాలను ప్రకటించడం వల్ల ప్రాంతీయ భాషా వ్యవహర్తల ప్రాధాన్యత అర్థం అవుతుంది. 
 • భిన్న సంస్కృతీ సంగమాల వల్ల కొత్త భాషల ఆవిర్భావం, ప్రాంతీయ భాషలలో పెనుమార్పులు సంభవిస్తాయి. భాషల అస్తిత్వ ఉద్యమాలు ఆ ప్రాంతాల అస్థిత్వాన్ని, చరిత్రను అంచనా వేస్తాయి. 
 • సాంకేతికత, ప్రపంచీకరణలు భాషలలో అనుహ్య పరిణామాలకు కారణమవడమే కాక విలక్షణ భాషల నిర్మాణం కూడా జరుగుతోంది.

13. పాదసూచికలు:

1) డా॥ బి.ఎస్.ఎల్. హనుమంతరావు, ఆంధ్రుల చరిత్ర, పేజీ 45.
2) B.Lowis Rice, Epigraphia Carnatica P. 135-136, 269-271.
3) గురజాడ - హండే అనంతపురము స్థానిక చరిత్ర, పేజి 1,
4) ఆర్వీయార్- అనువాదాలు- ఆవిష్కరణలు, అవస్థలు, పేజి 11.
5) డా॥ శ్రీనివాస్ అంకే, నాడు- నుడి, పేజీ 30-40.
6) గురజాడ - హండే అనంతపురము స్థానిక చరిత్ర, పేజి 32, 33, 40
7) డా॥ శ్రీనివాస్ అంకే, నాడు- నుడి, పేజి xvi, 111
8) డా॥ వెలమల సిమ్మన, తెలుగు భాషా చరిత్ర, పేజి 513.
9) డా॥ వెలమల సిమ్మన, తెలుగు భాషా చరిత్ర, పేజి 514.
10) డా॥ శ్రీనివాస్ అంకే, నాడు- నుడి, పేజీలు 30-40,
11) ప్రొఫెసర్ డి.ఎస్. సుబ్రహ్మణ్యం ద్రావిడ భాషలు పేజీలు 55-63.
12) డా॥ ముదిగంటి గోపాల్ రెడ్డి, ముదిగంటి సుజాత రెడ్డి సంస్కృత సాహిత్యచరిత్ర పేజి 306-307.
13) భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగుభాషా చరిత్ర, పే. 318,
14) డా॥ శ్రీనివాస్ అంకే, నాడు- నుడి, పేజీలు 3-11.
15) డా॥ శ్రీనివాస్ అంకే, నాడు- నుడి, పేజీలు 3-11.
16) ఇరావతీ కర్వే (బాలచంద్ర ఆప్టే) యుగాంతం, పేజి 251.
17) ఆరుద్ర - సమగ్ర ఆంధ్రసాహిత్యం, పేజి 23.
18) దా॥ శ్రీనివాస్ అంకే, నాడు-నుడి, పేజీలు 30-40,
19) భద్రిరాజు కృష్ణమూర్తి, తెలుగు భాషా చరిత్ర, పేజీలు 412-440.

14. ఉపయుక్తగ్రంథసూచి:

 1. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి 6 సంపుటాలు, 2003-2014.
 2. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్, దక్షిణ భారత సాహిత్యములు, 1979.
 3. కృష్ణమూర్తి భద్రిరాజు - తెలుగు భాషా చరిత్ర పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 2010.
 4. కోశాంబి డి.డి. (ఆర్. వెంకటేశ్వరరావు అనువాదం)- ప్రాచీన భారత దేశ సంస్కృతి, నాగరికత తెలుగు అకాడమీ 2001.
 5. మోర్లండ్ డబ్ల్యు,హెబ్, హిందూ దేశ చరిత్ర సంగ్రహము మదరాసు విశ్వవిద్యాలయము,
 6. 1952
 7. యువల్ నోఆ హరారీ –సేపియన్స్, మంజుల్ పబ్లిషింగ్ హౌస్, 2019
 8. యువల్ నోఆ హరారీ -హెూమో దెయూస్, మంజుల్ పబ్లిషింగ్ హౌస్, 2021,
 9. రామాంజనేయులు.కె, రాయవాచకం- భాషాసాహిత్య పరిశీలన, ఫణికృష్ణ పబ్లికేషన్స్, హైదరాబాద్, 1993,
 10. విశ్వనాథ రెడ్డి కేతు, కడప ఊర్లపేర్లు, నవ్యపరిశోధక ప్రచురణలు, తిరుపతి 1976,
 11. సతీస్ చంద్ర - మధ్యయుగాల భారతదేశం ప్రజాశక్తి బుక్ హౌస్, డిసెంబర్ 2011
 12. సత్యనారాయణ కంభంపాటి ఆంధ్రుల సంస్కృతి చరిత్ర, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1998
 13. సుబ్రహ్మణ్యం పి.ఎస్- ద్రావిడ భాషలు -పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
 14. 1999
 15. హనుమంతరావు బి.ఎస్.ఎల్. ఆంధ్రుల చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1997.
 16. Richard Hogg and David Danison - A History of the English Language - Cambridge University Press-2008.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]