headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

11. గురజాడ రచనలు: వ్యవహారభాష

డా. పి. నీరజ

సహాయ ఆచార్యులు,
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్,
సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, తెలంగాణ.
సెల్: +91 9849258500, Email: neerajaram2012@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

క్రొత్తపాతల మేలైన కలయికతో రచనలు చేసిన భావ విప్లవకారుడు గురజాడ అప్పారావు. రచనలు కేవలం కొన్నివర్గాలు వారికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఉండడంలో వ్యవహారిక భాష ఆవశ్యకతను ఈ పరిశోధనా వ్యాసం తెలియజేస్తుంది. ఈ పరిశోధన కోరకు ‘గురజాడ జీవిత గమనం - భాషా విప్లవం’, ‘భాషా పరిశోధకుడుగా గురజాడ’, ‘నా అనుభవాలు - జ్ఞాపకాలు’ వంటి పూర్వపరిశోధనలను పరిశీలించడం జరిగింది. అలాగే గురజాడ రచించిన ముత్యాల సరాలను, కన్యాశుల్కం నాటకాన్ని విషయవస్తువుగా స్వీకరించడం జరిగింది. గురజాడ తన రచనలలో వ్యవహారిక భాషను ఉపయోగించి తెలుగు భాషావికాసానికి, సామాజిక ప్రయోజనానికి ఏ విధముగా తోడ్పడెనో కొన్ని రచనలను ఉదాహరిస్తూ ఈ పరిశోధనావ్యాసంలో తెలియజేయడం జరుగుతుంది.

Keywords: భాష, గురజాడ, వ్యవహారిక భాష, ముత్యాల సరాలు, కన్యాశుల్కం.

1. భాషా స్పృహ: 

భాష ఒక సామాజికసృష్టి. భాషావికాసం ఒక నిరంతరప్రక్రియ. సమాజపరిస్థితులు, మారుతున్న అలవాట్లను బట్టి భాషాపరిణామం వేగాన్ని పొందుతుంది. నాగరికతలలో భాష అనేది ఒక ముఖ్యమైన అంశం. సమాజపు నాగరికత, సంస్కృతిని పెంపొందించి వాటిని తరతరాలకు వ్యాప్తి చేయడంలో భాష ప్రముఖ పాత్ర వహిస్తుంది.

జీవపరిణామక్రమంలో మానవుడు పరిణతి చెందిన జీవి. సమస్తజీవరాశి నుండి మానవుణ్ణి వేరుచేసి చెప్పగలిగే లక్షణాలలో అతని మేధాసంపత్తి, ఆలోచనాధోరణి, వీటిని వ్యక్తీకరించడానికి ఉపయోగించే భాష ప్రధానాలు”. (తెలుగు బోధన పద్ధతులు, డి. సాంబమూర్తి, 2009, పుట.1)

సమాజంలో వ్యక్తుల మధ్య పరస్పరభావవినిమయానికి భాష ఆధారం. వ్యక్తుల ఉమ్మడి ఆశయాలకు, ఆకాంక్షలకు భాష ప్రతిబింబం. భాష సమాజంలో భాగమై ఆ సమాజ సంప్రదాయాలను ప్రతిబించిస్తుంది.

2. వ్యవహారిక భాష:

ప్రజల నిత్య వ్యవహారంలోని భాషారూపాన్ని వ్యవహారిక భాష అంటారు. దీన్ని వాడుక భాష , ప్రజల భాష, జీవభాష అని కూడా అంటారు. సాహిత్య భాష ఆవిర్భావం కన్నా ముందే ప్రజల నోళ్ళలోనూ, శాసనాలలోనూన ఉన్న భాషారూపమిది.ఆస్థానాల్లో, గురుకులాల్లో తప్ప మిగిలిన చోటంతా వాడుక భాషే వ్యవహారంలో ఉండేది. ఈ వ్యవహారిక భాషారూపాన్ని అభివృద్ధి చేసి పాఠశాలల్లో బోధించే భాషగా, మాధ్యమ భాషగా, సాహిత్య భాషగా అభివృద్ధి చేయాలని ఈ భాషా రూపానికి పట్టం కట్టిన గిడుగు, గురజాడలు ఎప్పటికీ స్మరణియులు.

3. వ్యవహారిక భాషోద్యమం:

పందొమ్మిదో శతాబ్దం ఉత్తరభాగం నుండి విద్యాసంస్థల ఏర్పాటు వలన ఆంగ్లవిద్యాబోధన ప్రారంభమైంది. ఈ కారణం వలన ఆంగ్లసాహిత్యంతో పాశ్చాత్యచరిత్రతో, నాగరికతతో, సంస్కృతితో పరిచయం ఏర్పడింది. దీని ఫలితంగా తెలుగు సాహిత్యం కొత్త రూపాన్ని సంతరించుకుంది. గిడుగు, గురజాడ వ్యవహారిక భాషోద్యమానికి పెద్దపీట వేశారు. వస్తుపరమైన, ప్రక్రియాపరమైన, భావ పరమైన సంప్రదాయాలనుండి విడివడి సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భాషలో రాయాలనే ప్రయత్నంతో రచనలు చేశారు.

కావ్యభాష ప్రస్థానాన్ని సామాజికదృష్టితో శాస్త్రీయంగా పరిశీలించారు గురజాడ. సంకుచితమైన సామాజిక, రాజకీయ, సాహిత్య ఆదర్శాలది పై చేయిగా వున్న సామాజిక పరిస్థితులు కావ్యభాష ఉత్పన్నం కావడానికి దారితీశాయని తన పరిశోధన ద్వారా తెలిపారు. భాష – సమాజం- సాహిత్యం- సంప్రదాయాల మధ్య గల సంబంధాలు, అవి ఒకదానిపై మరొకటి చూపిన ప్రభావాల్ని నిగూఢమైన అంశాలను సులవైన రీతిలో సమగ్రంగా పరిశీలించారు. సాహిత్యభాషకు ప్రజాదరణ ఉన్నదని గ్రాంథిక భాషా వాదులు చేసే మొండివాదనను తోసిపుచ్చారు. ప్రజల భాషకే పట్టం కట్టి రచనలు చేశారు.

క్రొత్తపాతల మేలైన కలయికతో రచనలు చేసిన భావ విప్లవకారుడు గురజాడ అప్పారావు. మొదట సంప్రదాయ రీతిలో పద్యాలు, ఖండకావ్యాలు రచించారు. మాటల మబ్బులు, మెరుపులు, సుభద్ర, ఋతుశతకం, పుష్పలావికలు అటువంటి రచనలు. కానీ గురజాడను ఆంగ్లసాహిత్యాధ్యయనం, గిడుగు భాషోద్యమం ఆకర్షించాయి. రచనలు కేవలం కొన్ని వర్గాలు వారికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలని తలంచి వ్యవహారికభాషలో రచనలు చేయడం మొదలుపెట్టారు."సాధారణ జన వ్యవహారమందున్న భాష వ్యవహారికభాష. గ్రామ్య భాషారూపమే వ్యవహారిక భాషారూపంగా పరిణితి చెందింది”. (తెలుగు బోధన పద్ధతులు, డి. సాంబమూర్తి, 2009, పుట.11)

గిడుగు రామూర్తి పంతులుగారితో కలసి వాడుక భాషావ్యాప్తికి ఉద్యమించారు. వ్యాసాలు, గేయాలు, నాటికలు, నాటకాలు, ప్రహసనాలు వంటి వన్నింటినీ వాడుకభాషలో రచించారు. కొత్త ఛందస్సులో, కథావస్తువులు, సాంఘిక అంశాలు క్రొత్తవి తీసుకుని ఎటువంటి కృత్రిమత లేకుండా భాషకు ప్రాముఖ్యం ఇస్తూ, తేటైన మాటలతో, సహజ వర్ణనలతో వ్రాయబడిన కవితల, ఖండకావ్యాల సంపుటి ‘ముత్యాలసరాలు’. కన్యక, లవణరాజు కల, పూర్ణమ్మ, లంగరెత్తుము, దేశభక్తి గేయం, నీలగిరిపాటలు వంటివన్నీ ఈవిధంగా అందరికి అర్థమయ్యే భాషలో వ్రాయబడినవే.

4. కన్యక:

‘కన్యక’లో కులం కన్నా గుణం మిన్న అని అధికారం కన్ను కాననివ్వదని తెలిపారు. సమాజంలో స్త్రీ దుస్ధితిని, వ్యవస్థలో ఉన్న లోపాన్ని గురజాడ దీనిలో చక్కగా వర్ణించారు. దేవాలయానికి వెళ్తున్న 'కన్యక' ను రాజు చూసి చలించి ఆమెను పొందాలనుకుంటాడు. పెళ్ళిచేసుకోమని అడిగితే రాజుననే గర్వంతో కుదరదంటాడు . అప్పుడు ఆమే దేవాలయానికి వెళ్ళివస్తానని చెప్పి ఆ గుడిలో ఉన్న అగ్నిగుండంలో దూకి ఆత్మాభిమానంతో ఆత్మత్యాగం చేసుకుంటుంది. ఆత్మత్యాగం చేసుకునేముందు ఆమె ప్రబోధించిన నీతిని గురజాడ స్పష్టమైన వాడుక భాషలో ఎంతో పాత్రోచితంగా చెప్పాడు.

“కాసువీసం కలిగివుంటే చాలనుకొని
వీర్య మెరుగక, విద్య నేర్చక
బుద్ధిమాలినచో
కలుగవా యిక్కట్లు?“

అని వీరత్వంఅంటే ఏమిటో తెలుసుకొని, బద్ధిబలం కలిగి ఉండాలంటుంది. లేదంటే ఇబ్బందులు ఎవరికైనా తప్ప వంటుంది.
అలాగే రాజును-

“కండకావరమెక్కి నీ వీ
దుండగము తలపెట్టినందుకు
వుండడా ఒక దైవమంటూ
వుండి వూర్కోనునా?“ (పుట. 99) అని నిలదీసి అడుగుతుంది.) 

ఈ కవితా ఖండికలలో ఉన్న భాషను చదివిన వారెవరికైనా భావం అర్థం అవడం కష్టం కాదు. కేవలం పండితులే అర్థం చేసుకొని ఇతరులకు వివరించవలసిన అవసరం లేదు. సామాజిక సమస్యల పట్ల అందరికీ అవగాహన కలిగి దాని పరిష్కారానికి మార్గాన్నివెతకవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఆనాటి సమాజంలోని స్త్రీల దుస్థితిని అద్భుతంగా సరళమైన భాషలో వర్ణించారు.

5. లవణరాజు కల:

‘లవణరాజు కల' లో గురజాడవారు సమకాలీనమైన వర్ణనలను, భావాలను పొందు పరచారు.

“యెల్ల లోకము వొక్కయిల్లై,
వర్ణ భేదములెల్ల కల్లై
వెల నెరుగని ప్రేమబంధము
వేడుకలు కురియ"

అని విశ్వమానవ ప్రేమను, సర్వమానవ సమానత్వాన్ని ఆకాంక్షించారు.

“మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును" (పుట. 81)

సమాజంలో ఉన్న కులమత బేధాలను చెప్తూ త్వరలో ఆ బేధాలన్నీ తొలగిపోతాయని భవిష్యత్తును ఊహించారు.

6. పూర్ణమ్మ:

పుత్తడి బొమ్మలాంటి ' పూర్ణమ్మ' ను ఆమె తల్లిదండ్రులు డబ్బుకి ఆశపడి ముసలివాడి కిచ్చి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. అది నచ్చని పూర్ణమ్మ ఆత్మత్యాగం ద్వారా దుర్గలో లీనమైంది.

“నలుగురు కూర్చుని నవ్వేవేళల
నా పేరొకతరి తలవండి
మీమీ కన్నబిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి “.  (పుట.107) 

పూర్ణిమలాంటి చిన్నపిల్లలను డబ్బు కాసపడో లేదా ఏదైనా ఇతర ప్రలోభాలకు లోబడి ముసలివానికిచ్చి పెళ్లి చేసే దుస్థితి సమాజంలో ఉందని గురజాడగుర్తు చేశారు. ఈ గేయం లో సరళమైన భాష అందరికీ అర్ధమై ‘పూర్ణమ్మ' దుస్థితికి హృదవం ద్రవించక మానదు. గురజాడ భావ సభ్యతకీ, రసపోషణా నైపుణ్యానికి, భాషా సరళతకీ నిలువుటద్దం ఈ ‘పూర్ణమ్మ’ ఖండిక.

7. దేశభక్తి:

‘దేశభక్తి' గేయంలో గురజాడ - 

“దేశమును ప్రేమించుమన్న
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టి పెట్టోయి
గట్టిమేల్ తలపెట్టవోయి"

అని వ్యవహారిక భాషంలో బుజ్జగిస్తూ,సుతిమెత్తగా మందలిస్తూ ప్రభోదించారు.

“చెట్టుపట్టాల్ పట్టుకొని
దేశస్తులంతా నడువవలె నోయి
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలనోయి”   (పుట.63)

అని మానవ సమైక్యతను చాటిచెప్పారు. దేశస్థులందరికీ దేశభక్తి అవసరమని సమైక్యతతో ఏ భేదభావాలు లేకుండా ఉండాలని చెప్పారు. గురజాడ భాషా సరళతకీ, అభ్యుదయభావానికి, జాతీయ దృక్పథానికి ఆదర్శం 'దేశభక్తి' గేయం.

8. కాసులు:

‘కాసులు’ అనే గేయంలో ప్రేమతత్వాన్ని వివరించారు.

"ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును". (పుట.67)

స్త్రీ పురుషులు స్నేహితుల వలె ఉండాలని , ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం లేకుండా ప్రేమనిస్తే ప్రేమ వస్తుందనే ఉన్నతమైన భావాన్ని వ్యక్తీకరించారు.

ఈ విధంగా ఆనాటి సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ తన కవితా ఖండికల ద్వారా వ్యవహారిక భాషలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సరళమైన భాషలో రచించి ప్రజలను మేల్కొల్పే ప్రయత్నం చేశారు గురజాడ.

9. కన్యాశుల్కం:

ప్రపంచప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటుకాన్ని పూర్తి వాడుకభాషలో రచించారు. ఆరోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. జీవమూజవమూ కలిగిన వాడుకభాష ఒకటే నాటకభాషగా యోగ్యత కలిగినదని గురజాడ గుర్తించారు. ఏ కళారూపానికైనా మరింత బలాన్నిచ్చి ప్రజల దగ్గరకు తీసుకు పోయేందుకు వాడుకభాష సహాయ పడినంతగా, వ్యవహరమైన శబ్దజాలంతో కూడిన గ్రాంధికభాషసహాయపడదని గుర్తించిన గురజాడ అందులలోనూ నాటకానికి వ్యవహారికభాషకు పోత్తు ఉందని గమనించి దానికోసం అతని సాంఘిక నాటకంలో విజయనగర ప్రాంతానికి సంబంధించిన వ్యవహార భాషని తీసుకున్నారు. అంతేకాకుండా ఆంగ్ల విద్యపై మోజు పెరుగుతున్న ఆ రోజుల్లో సంఘంలో ఆధిక్యం కోసం, ప్రజాస్వామ్యాన్ని భ్రమ పెట్టడం కోసం గిరీశం లాంటి వ్యక్తులు ఏవిధంగా ఆంగ్ల భాషను వాడుకుంటారో చూపెట్టడం జరిగింది. రామప్పపంతులు పాత్ర ద్వారా ఉర్దూ పదాల ప్రయోగం కూడా చేసారు.

గురజాడ కన్యాశుల్కం నాటకం ద్వారా ఆశించిన లక్ష్యాలు రెండు. ఒకటి సాంఘిక ప్రయోజనం, మరొకటి వ్యవహారిక భాషకు సాహిత్యగౌరవాన్ని కల్గించడం. వ్యవహారికభాషోద్యమానికి గురజాడవారి కన్నాశుల్కం అంకురార్పణ చేసిందని చెప్పవచ్చు. కన్యాశుల్కానికి పూర్వం వ్యవహారిక భాషలో వచ్చిన వచన నాటకాలు లేవు.

1892లో ఈ నాటకం తొలి ప్రదర్శన జరిగింది. తొలి ప్రదర్శనలోనే ఈ నాటకానికి ఎంతో పేరు, గుర్తింపు లభించాయి. ఒక సామాజిక సమస్యను అందరికీ అర్థమయ్యే వ్యవహారిక భాషలో రచించడం ద్వారా ప్రజలందరికీ దగ్గరవ్వచ్చనే విషయం ఈ నాటకం నిరూపించింది.

సామాజిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుకభాష వాడవచ్చని అర్థమయింది. “అప్పారావుగారు వ్యవహారికభాషలో కన్యాశుల్కం వ్రాస్తే, గ్రాంధిక భాషా సముద్రము చుట్టూ ఆవరించి ఉండగా, ఆ సముద్ర మధ్యాన కన్యాశుల్కంతో అప్పారావుగారు ఒక దీవివలె, దివ్యెవలె వెలుగొందినారు.” (మహోదయం జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానం, కె.ని.ఆర్‌,1969; పుట.361). వాడుకభాషా ప్రయోగానికి వ్యతిరేకులైన కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి వంటి వారు కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడం దీనికి నిదర్శనం.

కన్యాశుల్కం తొలికూర్పులో వ్యవహారికభాషలో కొంత గ్రాంధిక వాసనలు కనిపిస్తాయి. కానీ మలి కూర్పులో పూర్తి వ్యవహారిక భాష కనిపిస్తుంది. ఉదాహరణకు-

తొలికూర్పు - మలికూర్పులలో వ్యవహారిక భాష

10. కళింగాంధ్ర మాండలికాలకు ఉదాహరణలు:

"గుంటవెధవ",
“వేగిరం రా",
"చెప్పాను కానా",
"నాను ఉంది",
“వగుస్తున్నారు",
“కొసాకి విను”

మొదలైన మాండలిక పదాలను ఈ పరిశోధనలో తెలుసుకోవడం జరిగింది.

గిరీశం పాత్ర ద్వారా ఇంగ్లీషు పదాలను ప్రయోగించారు. ఉదాహరణకి-

“నేనే దాని హెజ్బెండ్ నై ఉంటే నిలబడ్డ పాట్న నీ తండ్రిని రివాల్వర్తో షూట్ చేసి ఉందును."

"ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేoజ్ చేస్తుంటే గాని పొలిటీషియన్ కానేరడు". 

మాట్లాడే భాషకి చాలా దగ్గరగా ఉన్న పదాలని ప్రయోగించి సహజత్వానికి అద్దం పట్టాడు గురజాడ.

గురజాడవారి రచనల ద్వారా వ్యవహారిక భాషను ప్రోత్సహించడాన్ని ఆనాటి గ్రాంధికవాదులు చాలామంది వ్యతిరేకించారు. గురజాడను కుకవి అని కూడా నిందించారు.

'”వాగ్యవహారంలోని భాషకు నీచార్థం కల్పించి గ్రామ్యమని పేరెట్టి నెట్టివేస్తూ యావదాంధ్ర దేశానికి ఒకే విధమైనశిష్ట జనవ్యవహారికం లేదని ముందుగానే తీర్మానించుకొని దానికి గ్రంథ ప్రవేశయోగ్యతను నిరాకరించారు గ్రాంధికభాషావాదులు”. (మహోదయం జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానం, కె.ని.ఆర్‌,1969; పుట.197).

కానీ ఆ విమర్శలన్నింటినీ ఎదుర్కొని గురజాడ వారు వారందరికీ సమాధానమిచ్చారు. తరువాతి కాలంలో ఇతని రచనలు ఇతర భాషలలోకి కూడా అనువదించడం జరిగింది. “కన్యాశుల్కంలోని భాషను పండితులు 'గ్రామ్య’ మని నీరసించారు, విమర్శించారు. అయితే ఆ విమర్శలను గురజాడ లక్ష్యపెట్టలేదు.” (కన్యాశుల్కం తొలి మలి కూర్పుల తులనాత్మక పరిశీలన, వీరయ్య నరాల, 1985, పుట.105).

11. ముగింపు:

ఈ విధంగా సమాజ సంస్కరణే లక్ష్యంగా సామాజిక సమస్యలను వస్తువులుగా తీసుకొని ప్రజలందరికీ అర్థమయ్యే సరళమైన వ్యవహారిక భాషలలో రచనలు చేసి శక్తివంతమైన సాంఘిక సంస్కరణ చైతన్యాన్ని కలిగించాడు. ఈ పరిశోధన ద్వారా.

 1. ప్రతి రచనకు ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి అని తెలుస్తుంది.
 2. సమాజ సంస్కరణకి వ్యవహారిక భాష ఎంత శక్తివంతమైన ఆయుధమో తెలుస్తుంది.
 3. భాషా వికాసానికి వ్యవహారిక భాష ఏ విధముగా తోడ్పడెనో తెలుస్తుంది.
 4. వ్యవహారిక భాషకున్న పటుత్వము, మాండలిక పదాలలోని సౌలభ్యం తెలుస్తుంది.
 5. ఒక పాత్ర ప్రయోగించే భాషలతో ఆ పాత్ర భావప్రపంచాన్ని సూచించడం, భాషకు అభినయానికి ఉన్న అవినాభావ సంబందాన్ని తెలియజేయడం జరిగింది.
 6. రచనా ప్రక్రియలలో నూతనత్వ ఆవశ్యకత తెలుస్తుంది.

12. ఉపయుక్తగ్రంథసూచి:

 1. అప్పారావు గురజాడ, “కన్యాశుల్కం”, కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్, 1961, రాజమండ్రి.
 2. అప్పారావు గురజాడ, “గురుజాడలు”, ఎమెస్కో ప్రచురణలు, 2015, విజయవాడ.
 3. అప్పారావు గురజాడ, “ముత్యాల సరాలు”, ఎం. శేషాచలం అండ్ కో, 1972, సికింద్రాబాద్.
 4. కె. వి. ఆర్, “మహోదయం జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానం”, శారదాంబ స్మారక కమిటీ, 1969, విజయవాడ.
 5. నారాయణరెడ్డి.సి., “ఆధునికాంధ్ర కవిత్వము”, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 2011, హైదరాబాద్.
 6. ప్రకాష్ రావు, పి.ఎస్, “గురజాడ మాట - ప్రగతికి బాట”, గిరిధర్ పబ్లికేషన్స్, 2009, హైదరబాద్.
 7. వీరయ్య నరాల, “కన్యాశుల్కం తొలి మలి కూర్పుల తులనాత్మక పరిశీలన”, సునందా పబ్లికేషన్స్, 1985, తిరుపతి.
 8. వేంకటావధాని దివాకర్ల, “ఆంధ్ర వాజ్మయ చరిత్రము”, ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురణ, 1981, హైదరాబాద్.
 9. శాస్త్రి, ద్వా.నా., “తెలుగు సాహిత్య చరిత్ర”, 1998 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 2018, హైదరాబాద్.
 10. సాంబమూర్తి. డి, “తెలుగు బోధన పద్ధతులు”; నీల్కమల్ పబ్లికేషన్స్, 2009, హైదరబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]