headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

10. కాకతీయుల కాలం నాటి నోములు, వ్రతాలు: చారిత్రకవిశ్లేషణ

డా. బొల్లేపల్లి సుదక్షణ

సహ-ఆచార్యులు, చరిత్రశాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వ.ప్ర.),
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9849520572, Email: sudhakshanabollepally@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

పండుగలు, నోములు, వ్రతాలు, హైందవ సంస్కృతి సంప్రదాయాలు. ఇవి ఏ కాలం నుండి ఆచరింపబడుతున్నాయన్న విషయానికి సంబంధించిన వివరాలపై సమాచారం లేదు. అనాదిగా ఆచరింపబడుతున్న ఈ పండుగలు, నోములు, వ్రతాలు సమాజంలో ఏకత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగపడ్డాయి. అంతేగాక సమాజంలో ఉన్న ఆచారాలు, పద్ధతులను తెలియజేస్తాయి. ఈ వ్యాసంలో కాకతీయులకాలం నాడు సమాజంలో ఆచరింపబడిన వివిధ నోములు, వ్రతాలు వాటిని ఆచరించుటకు గల కారణాలు, ఆచరణ పద్ధతులు, విధివిధానాలు వివరించబడ్డాయి. వీరి కాలంలో ఆచరించబడి కాలక్రమంలో మరుగున పడిన వ్రతాలు కొన్ని ఈనాటికీ ఆచరింపబడుతున్నాయి. అట్టి నోములు, వ్రతాలు వాటి విశిష్టతను వెలుగులోకి తెచ్చి నేటి సమాజానికి పరిచయం చేయడమే ఈ వ్యాసరచన ముఖ్య ఉద్దేశం. చారిత్రక పద్ధతిని ఉపయోగించి కాకతీయులకాలం నాటి చారిత్రక గ్రంథాలను మరియు శాసనాలను ప్రాథమిక ఆధారంగా పరిశీలించి వివరాలు సంగ్రహించడమైనది. ద్వితీయ ఆధారాలుగా రచయితలు రాసిన వివిధ గ్రంథాలను పరిశీలించడమైనది.

Keywords: నోము, వ్రతము, ఉపవాసము, నక్తము, భరితభోజనం, ఉద్యాపన.

1. ఉపోద్ఘాతం:

దక్షిణ భారతదేశ చరిత్రలో కాకతీయులకాలం ఒక ఉజ్వల ఘట్టం. శాతవాహనుల అనంతరం తెలుగువారిని ఏకం చేసి పాలించిన ఘనత వారిదే. దక్షిణాన విస్తృతమైన రాజ్యంతో పాటు అద్భుతమైన పరిపాలనను ఏర్పాటు చేశారు. సాంఘికంగా, ఆర్థికంగా ప్రజల అభివృద్ధికి కృషి చేశారు. కళాభిమానులుగా, కళాపోషకులుగా వీరి సేవలు అజరామరం. వాస్తు కళలో అద్భుతాలను సృష్టించారు. రామప్ప గుడి, త్రికూటేశ్వరాలయం, ఓరుగల్లు కోట వీరి అద్భుతమైన వాస్తు, శిల్ప కళలకు నిదర్శనాలు. ఈ వంశంలోని పాలకులందరూ ప్రజోపయోగమే పరమావధిగా పాలించారు.
మానవుడు సంఘజీవి. అతని అస్తిత్వం, అభివృద్ధి సమాజంలోనే సాధ్యం. ఉన్నతమైన, సుఖవంతమైన జీవనం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాడు. జీవనం ఆనందంగా, ఉత్సాహంగా గడపడానికి ఎన్నో అన్వేషణలు చేశాడు. అందులోని భాగాలే పండుగలు, నోములు, వ్రతాలు. వ్యక్తిగతంగా, సమూహంగా జరుపుకునే ఈ పండుగలు, నోములు, వ్రతాలు వారి దైనందిన జీవితంలో ఆనందాన్ని తేవడమేగాక ఐకమత్యానికి కృషి చేశాయి. సాంప్రదాయ బద్దంగా జరుపబడిన ఈ వ్రతాలు, నోములు శైవ, వైష్ణవ మత సిద్ధాంతాలకు ప్రాతిపదికలుగా నిలిచాయి. ఆనాడు ఆచరించిన వ్రతాలు, నోములు కొన్ని కాలగర్భంలో కనుమరుగైనా కొన్ని కాలానుగుణంగా మార్పులకులోనైనా ఈనాటికీ ఆచరింపబడుతున్నాయి.

కాకతీయుల కాలంలో ఆచరింపబడిన వ్రతాలు, నోములు గురించి సమకాలీన గ్రంథాలలో శాసనాలలో చెప్పబడింది. విద్యానాధుడు సంస్కృతంలో రచించిన ప్రతాపరుద్రీయము లేదా ప్రతాపరుద్రయశోభూషణము సమకాలీనగ్రంథం. విద్యనాథుడు ప్రతాపరుద్రదేవుని ఆస్థానకవి. ఇది ఆ కాలంనాటి సామాజికపరిస్థితులను, స్థితిగతులను వివరిస్తుంది. ప్రముఖశైవకవి పాల్కురికి సోమనాథుడు రచించిన ‘పండితారాధ్య చరిత్ర’ ఇది తెలుగులో రాయబడిన ద్విపద. దీనిలో కాకతీయ సమాజంలో ఆచరింపబడిన శైవ పండుగలు, వ్రతాలు, వాటి పద్ధతులు వివరింపబడ్డాయి. ఇతని చేతనే రచింపబడిన మరొక గ్రంథం ‘బసవపురాణం’.

ఇది కూడా తెలుగులో రాయబడిన ద్విపద. ఇందులో కూడా ఆ కాలంనాటి వ్రతాలు, వాటి ఆచరణ విధానాలు, పూజలు, దీక్షపద్ధతుల వివరణ కనిపిస్తుంది. వినుకొండ వల్లభరాయుడు రచించిన ‘క్రీడాభిరామం’ కాకతీయుల కాలంనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతుంది. కొరవి గోపరాజు రచించిన ‘సింహాసన ద్వాత్రంశిక’ కూడా ఆ కాలంలో ప్రజలు ఆచరించిన అనేక వ్రతాలు, నోముల వివరణ ఇస్తుంది. శ్రీనాథుడు రచించిన ‘సుకుమార చరిత్ర’ కూడా శివరాత్రి పండుగ గురించి, కార్తీకమాసంలో ఆచరించే వ్రతాల గురించి వివరిస్తుంది. పై ప్రాథమిక ఆధారాలు కాక సురవరం ప్రతాపరెడ్డి రచించిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ కాకతీయుల కాలంనాటి సామాజిక పరిస్థితులు, పండుగల వివరణ ఇస్తుంది. గంగిశెట్టి లక్ష్మీనారాయణ రచించిన “పండుగలు పబ్బాలు” మొదలైన గ్రంథాలలో మధ్యయుగ కాలంనాటి పండుగలు, వ్రతాలు వివరణ కనిపిస్తుంది. ఈ గ్రంథాలను పరిశీలించే కాకతీయుల కాలంలో ఆచరింపబడిన వ్రతాల వివరాలను సంగ్రహించి ఈ వ్యాసాన్ని రచించడం జరిగింది. కాకతీయులకాలంలో జరిగిన వ్రతాలు, వాటి నిర్వహణకు గల కారణాలు, వాటి విధి విధానాలు తెలుసుకోవడమేగాక వాటిలో కనుమరుగైన వ్రతాలు, వాటి వివరాలను నేటి సమాజానికి పరిచయంచేసి హైందవ సంప్రదాయాన్ని, సంస్కృతిని ముందు తరాలకు అందించడమే ఈ వ్యాసరచన ముఖ్య ఉద్దేశ్యం.

వ్రతాలు, నోములు తరాల నుండి వారసత్వంగా వస్తున్నవి.ఇవి సామూహికంగా, వ్యక్తిగతంగా ఆచరింపబడ్డాయి. సామూహికంగా ఎక్కువగా గుళ్ళలో, వ్యక్తిగతంగా ఇళ్లలో కుటుంబ సభ్యులతో, బంధువులతో ఆచరింపబడేవి. ఇవి ప్రజలు ఒకే చోట కలిసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఐకమత్యానికి, మతాచారాలకు ప్రాధాన్యతనిస్తాయి. ఈ వ్రతాలు ముఖ్యంగా శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, మాఘ మాసాలలో నిర్వహింపబడేవి. ఒక్కో వ్రతానికి ఒక్కో కారణం, వ్రతవిధానం, దీక్షలు వేరువేరుగా ఉంటాయి. గ్రంథాలలో ప్రతీవ్రతము అత్యున్నతమైనదిగా పేర్కొనబడింది. కాకతీయుల కాలంనాటి శాసనాలతోపాటు ప్రౌఢకవి మల్లన రచించిన ‘రుక్మాంగద చరిత్ర’లోనూ, భారవి కవి రచించిన ‘శ్రీరంగ మహాత్యం’లోనూ, మంచన రచించిన ‘కేయూరబాహు చరితం’లోనూ అనేక వ్రతాల వివరణ కనిపిస్తుంది. ఈ వ్రతాలు రాజవంశపు కుటుంబాల నుండి సామాన్యుల వరకు అందరూ ఆచరించేవారు. కాకతీయుల కాలంనాటి శాసనాలలో ఇట్టి వ్రతాల వివరణ ఉంది. ‘బూదారం శాసనం’లో అనసూయ శయన వ్రతం, అరుంధతి వ్రతం, జలాశయన వ్రతం, లక్ష్మీనారాయణ వ్రతం (సత్యనారాయణ వ్రతం), అనంత వ్రతం మొదలైన వ్రతాల వివరణ కనిపిస్తుంది. ప్రజలు ఆచరించిన శైవ, వైష్ణవ వ్రతాలను కూడా వివరిస్తుంది.

2. అనసూయ శయనవ్రతం:

సంతాన భాగ్యం లేని స్త్రీలు సంతానం కోసం చేసే వ్రతం ఇది. ఈ వ్రతంలో అత్రి మహాముని భార్య అయిన అనసూయ దేవిని పూజించేవారు. అనసూయ మహా పతివ్రత. ఆమె త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సంతానంగా పొందింది. కావున ఆమెను పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందనే విశ్వాసంతో మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించేవారు. ఈ వ్రతం చేసేవారు భక్తితో, ఉపవాస దీక్షతో ఉండి అనసూయ మాతను పూజించి నైవేద్యాలను, నూతన వస్త్రాలను సమర్పించేవారు. అనంతరం సంతానవంతులైన ముత్తయిదువులను పేరంటానికి పిలిచి పసుపు, కుంకుమలు, తాంబూలాలు, నూతన వస్త్రాలను వాయినంగా ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకునేవారు. పూజ అనంతరం ఉపవాస దీక్ష ముగించేవారు.

3. అరుంధతి వ్రతం:

వివాహితులు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించేవారు. అరుంధతి మహా పతివ్రత. ఆమె తన పాతివ్రత్యంతో భర్త అయిన వశిష్టుని పక్కన తారగా నిలిచిపోయిన ఏకైక మహిళ. నూతన వధువులు, వివాహితులు తాము దీర్ఘసుమంగళులై ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరించేవారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకునేవారు.

4. జలాశయన వ్రతం:

వటపత్రశాయి అయిన శ్రీకృష్ణుని పూజిస్తూ చేసే వ్రతమే జలాశయన వ్రతం. ఇది వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినది. సకల అరిష్టాలు తొలగి కుటుంబానికి సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు కలగాలనేకోరికతోస్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించేవారు.

5. లక్ష్మీనారాయణ వ్రతం:

ఈ వ్రతం ఆ కాలం నుండి ఈ కాలం వరకు చేయబడుతుంది. ఇది కార్తీక మాసపు 12వ రోజున నిర్వహిస్తారు. విష్ణువు ఆషాఢ మాసపు 11వ రోజున యోగ నిద్రలోకి వెళ్తాడు. ఆ రోజుతో చాతుర్మాస్యం మొదలవుతుంది. తిరిగి కార్తీకమాసపు 11వ రోజున యోగనిద్ర నుండి మేల్కొంటాడు. మరుసటి రోజు ఆయన పాలసముద్రంలో లక్ష్మీదేవిని చేరుతాడు. అందుచే కార్తీక మాసం 12వ రోజున లక్ష్మీనారాయణ వ్రతం చేస్తారు. ఈ వ్రతంలో పూజ పీఠాన్ని అలంకరించి అందులో లక్ష్మీనారాయణుల ప్రతిమలు గానీ, చిత్తరువులను గానీ ఉంచి ధూప, దీప, నైవేద్యాలతో పూజించి ప్రసాదాలను అతిథులతో, బంధువులతో కలిసి ఆరగిస్తారు. ఈ వ్రత ప్రత్యేకత ఏమిటంటే మిగతా వ్రతాలు కేవలం స్త్రీలే నోచుకున్నా ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి ఆచరిస్తారు.

సమకాలీన గ్రంథమైన ‘పలనాటి వీర చరిత్ర’లో నోములు, వ్రతాల వివరణ కనిపిస్తుంది. సంతానాన్ని ఆశించే పడతులు నోములతోపాటు తమలపాకులతో వాయినాలు ఇవ్వడం, దక్షిణలు ఇవ్వడం, నూనె మిల్లులు దానాలీయడం, పేద బ్రాహ్మణ కన్యలకు వివాహాలు చేయించడం, దేవాలయాలకు, అన్నదాన సత్రాలకు వంట పాత్రలు, నీటి పాత్రలు, దీపాలు, దానాలీయడం, అంతేకాక శ్రీశైలం, శ్రీగిరి మొదలైన తీర్థయాత్రలకు వెళ్ళే యాత్రికులకు వెండి, బంగారు గుమ్మడికాయలు దానం ఇవ్వడం, శివాలయాలలో నందీశ్వరునికి పులగం నైవేద్యంగా సమర్పించడం, శ్రీశైలం, దాక్షారామం మొదలైన తీర్థయాత్రలకు వెళ్లే దారులలో యాత్రికులకు నీడ కోసం చెట్లు నాటడం, జంతువులకు వివాహాలు చేయడం మొదలైన పుణ్యకారాలు చేయడం వలన స్త్రీలు సంతాన భాగ్యాన్ని, సకల సౌభాగ్యాలను పొందేవారని పల్నాటి వీర చరిత్ర చెబుతుంది.1

అంతేగాక వివిధ వ్రతాల వివరణ ఇస్తుంది. విష్ణుకాంత నోము, సంధ్యవర్తి నోము, ఏక బాణము నోము, నందికేశ్వర నోము, పక్కవిల్తుని నోము, చీకటింటి నోము, కేదారేశ్వర నోము, స్వామి త్రయోదశి నోము, గజనిమ్మ నోము మొదలైన వ్రతాల ప్రస్తావన కనిపిస్తుంది. 

అందులో కొన్ని వ్రతాల వివరాలు కూడా కనిపిస్తాయి. వాటిలో…

6. గజనిమ్మ నోము:

వైష్ణవ సంప్రదాయం అనుసరించే వారు నోచే వ్రతం ఇది. ఈ వ్రతాన్ని సౌభాగ్యం కోసం స్త్రీలు పూర్తిగా ఒక సంవత్సర కాలం పాటు చేసేవారు. వ్రతంలో భాగంగా ప్రతిరోజు ఇంట్లో పూజలు చేసేవారు. చివరి రోజున దీపాలు వెలిగించగానే విష్ణువాలయానికి వెళ్లి స్వామిని పూజించి నైవేద్యాలను సమర్పించి దేవాలయపు తోట అయిన శ్రీరంగవనంలో గోమయంతో అలికి ముగ్గులు వేసి అందులో నిమ్మ గింజలు నాటి వనదేవతలను పూజిస్తారు. బ్రాహ్మణులకు దక్షిణలు సమర్పిస్తారు. అనంతరం జమ్మి చెట్టు వద్దకు చేరుకొని అక్కడ దీక్షను విరమిస్తారు.2

‘బసవ పురాణం’ నందికేశ్వరుడు గురించిన వివరణ ఇస్తుంది.3 దీనిని శైవులు ఆచరించేవారు. బసవ శివ భక్తురాలు అయిన మాదాంబ కుమారుడు,వీరశైవాన్ని ప్రబోధించిన గురువు. మాదాంబకు చాలాకాలం వరకు సంతానం కలగకపోవడంతో సంతాన ప్రాప్తి కోసం ఎన్నో నోములను నోచింది. చివరకు నందికేశ్వర నోము ఆచరించడం వలన సంతాన ప్రాప్తి కలిగింది. అందువలన సంతాన ప్రాప్తి కోరే మహిళలు ఈ వ్రతం ఆచరించేవారు. ఈ వ్రతాన్ని సోమవారం నాడు ప్రారంభించి తొమ్మిది రోజులు చేస్తారు. ఉపవాస దీక్షలో ఉండి ప్రతిరోజు నందికేశ్వరునికి పసుపు, కుంకుమ, పుష్పాలు, నైవేద్యాలతో పూజిస్తారు. పదవరోజున నందికేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి, గంధం పూసి, నగలు, పుష్పాలతో అలంకరించి ధూప, దీప,నైవేద్యాలు సమర్పించి పంచభక్ష పరమాన్నాలను ముఖ్యంగా పులగాన్ని నైవేద్యంగా సమర్పించి సంతానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. ఈ వ్రతం ఆచరించిన రెండు మాసాల అనంతరం మాదాంబ కూడా నందికేశ్వరుని ఆశీర్వాదం వలన గర్భం దాల్చింది. అదే విధంగా సంతానం పొందగోరే మహిళలు నందికేశ్వర నోమును నోచేవారు.

రాణులు కూడా నోములు నోచినట్లు ఆకాలంనాటి సాహిత్యం ద్వారా తెలుస్తుంది. రుద్రమదేవి కుమార్తె యువరాణి ముమ్మిడమ్మ శివపార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి ‘దాసరెడ్ల నోము’ను నోచినట్లు తెలుస్తుంది. వ్రతం పూర్తయిన అనంతరం బంగారంతో చేసిన ఎడ్లను, వంద మాడలను బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చి వారి ఆశీర్వాదము తీసుకున్నట్టు, అనంతరం పేదలకు బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, నెయ్యి దానం చేసినట్టు నోడిపల్లి విఘ్నేశ్వరాలయానికి వంద తులాల బంగారు విగ్రహాన్ని, మొగిలిచర్లలోని ఏకవీర దేవాలయానికి ఎడ్లను బహుకరించినట్లు ‘సిద్దేశ్వర చరిత్ర’ తెలుపుతుంది.4

కాకతీయుల కాలంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న మరొక వ్రతం అక్కలు.5 ఈ వ్రతం ముఖ్యంగా వివాహ సమయాల్లో ఒనరించేవారు. దీనినే కామవల్లీ దేవి వ్రతం అని కూడా అనేవారు. ఈ వ్రత సమయంలో కామేశ్వరి దేవిని పూజిస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి కామేశ్వరి రూపంలో జన్మించిందని, ఈమె ఏడుగురు అక్కచెల్లెళ్లలో చివరిదని, క్రీడాభిరామం వీరిని మక్ష కన్యలని చెబుతుంది.6

వ్రత సమయంలో పూజానంతరం కామేశ్వరి దేవిని పొగుడుతూ గానాలాపన చేస్తారు. వ్రతానంతరం ఏడుగురు ముత్తయిదువులకు తాంబూలాన్ని వాయినంగా ఇస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన నవవధువు ఆయురారోగ్యాలతో, సౌభాగ్యంతోను వర్ధిల్లుతుందని విశ్వసించేవారు. క్రీడాభిరామం కొన్నిసార్లు ఈ వ్రతాన్ని నవ దంపతులు కూడా ఆచరించినట్లు చెబుతుంది. అంతేగాక ఓరుగల్లులో ఓ ఇంటి యజమాని సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరించినట్లు చెబుతుంది.7

‘పండితారాధ్య చరిత్ర’ కూడా శైవ సంప్రదాయ పరమైన వివిధ నోములు, వ్రతాలను వివరిస్తుంది. మహిళలు ముఖ్యంగా దీర్ఘసుమంగళులై ఉండాలని, కన్యలు మంచి భర్తలు రావాలని, వ్రతాలు ఆచరించినట్లు తెలుస్తుంది. అట్టి వాటిలో కన్నె తులసి నోము ఒకటి.8

7. కన్నెతులసి నోము:

ఈ నోములో తులసి మొక్కను లక్ష్మీస్వరూపంగా భావించి పూజించేవారు. ఈ నోము సాధారణంగా శివరాత్రి నాడు మొదలుపెట్టి ఐదు రోజులు చేసేవారు. ఈ ఐదు రోజులు తులసి చెట్టు చుట్టూ ఐదు తామర పువ్వుల ముగ్గులు వేసి, అందులో పసుపు, కుంకుమ మొదలైన పూజా ద్రవ్యాలు ఉంచి, ఐదు దీపాలను వెలిగించేవారు. ఈ విధంగా ఐదు రోజులు చేసి ఉద్యాపన రోజున తులసి పూజ చేసి, నైవేద్యాలు సమర్పించి, ముత్తైదువులకు తాంబూలాలు వాయనంగా ఇచ్చి, వారి ఆశీస్సులు తీసుకొని దీక్షను ముగించేవారు.

నూతన వధూవరులు ఆచరించే నోములలో చిట్టి బొట్టు నోము ఒకటి. ఈ నోము ఒక సంవత్సర కాలం పాటు చేసేవారు. ఈ సమయంలో నవవధువులు ఉదయాన్నే పూజాదికాలు ముగించుకొని ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గంధము సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకునేవారు. సంవత్సరాంతమున ఉద్యాపన చేసిన ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు కుంకుమ భరిణలు, వస్త్రాలను సమర్పించి వారి ఆశీర్వాదాలు తీసుకునేవారు. అదే విధంగా సౌభాగ్యం కోసం ఆచరించబడే మరొక నోము ఉదయ కుంకుమ నోము. ఈ నోము నోచే సమయంలో మౌన దీక్షను పాటించేవారు కనుక దీనికి ‘మూగనోము’ అని కూడా పిలిచేవారు.ఈ నోము మాసంలో ఒకరోజు చొప్పున మూడు సంవత్సరాల కాలంపాటు నోచేవారు. ఉద్యాపన కాలంలో ముత్తైదువులకు భోజనాలు పెట్టి వాయనాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకునేవారు.ఈ వ్రత కాలంలో స్త్రీలు పాటలు పాడేవారని నృత్యాలు ఆచరించే వారిని ‘రుక్మాంగద చరిత్ర’ చెప్తుంది.9

8. మోచేటి పద్మము నోము (మూగనోము):

ఈ కాలంలో ఆచరింపబడిన మరొక ప్రముఖ వ్రతం మో చేటి పద్మము నోము. ఈ వ్రత దీక్ష కాలంలో మౌనాన్ని పాటించేవారు గనుక దీనిని కూడా మూగనోము అనేవారు. ఈ నోమును దీపావళి నాడు మొదలుపెట్టి కార్తీక శుద్ధ పూర్ణిమనాడు విరమించేవారు. వ్రతకాలంలో నవ వధువులు చుక్కలు పొడవగానే దేవాలయానికి వెళ్లి గౌరీదేవిని పూజించి కనీసం ఐదిండ్లు తిరిగి పసుపు, కుంకుమ పంచేవారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం ఆకాశాన చుక్కలు లెక్కబెడుతూ ఇంటికి వచ్చేవారు. ఎన్ని చుక్కలు లెక్కబడితే వారి ఐదవతనం అన్నేళ్లు పదిలంగా ఉంటుందని భావించేవారు. ఇంటి నుంచి బయలుదేరింది మొదలు తిరిగి ఇంటికి వచ్చేవరకు మౌనదీక్షను పాటిస్తూ ఆకాశం వంక చూస్తూ ఉండేవారు.

మోచేటి పద్మమ్ము పట్టేటి వేళ
మోగల్లు తామర్లు ముడిగేటి వేళ
ఆవుల్లు లేగల్లు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెల్లు వేసేటి వేళ
సందేళ దీపమ్ము పెట్టేటి వేళ
చాకింటి మడుతల్లు తెచ్చేటి వేళ
బీరపు పువ్వులు విచ్చేటి వేళ
కోడల్లు పసుపుల్లు కొట్టేటి వేళ
కూతుళ్లు పండుగిన్నెల్ల కుడిచేటి వేళ
ముద్దుల్ల మొగము అద్దాన్ని బోలు
ముద్దురాలి మొగము మోచేటి పద్మము బోలు
పద్మము నోచిన పడతికి పదిలము ఐదవతనము10

9. ఉపవాస దీక్షలు:

నోములు, వ్రతాల కాలంలో శైవ, వైష్ణవులిరువురు ఉపవాస దీక్షలు ఆచరించేవారు. ఈ దీక్షలు వివిధ రకాలుగా ఉండేవి. అవి ఉపవాసం, నక్తము, ఛాయా నక్తము, భరిత భోజనం. ఉపవాసము అనగా ఆహారం తీసుకోకుండా పాలు పండ్లు భుజించడం. నక్తము అనగా రోజంతా ఆహారం తీసుకోకుండా రాత్రిపూట భోజనం చేయడం. శైవ సంప్రదాయం ఆచరించే స్త్రీలు కార్తీక మాసం అంతా నక్తాన్ని ఆచరించేవారు. వైష్ణవులు ఆషాఢ, భాద్రపద, కార్తీకమాసాలలో నక్తాన్ని ఆచరించేవారు. ఛాయానక్తమనగా రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట పాలు, పండ్లు తీసుకోవడం, భరిత భోజనం అనగా వండిన పదార్థాలను మొదట శివునికి సమర్పించిన అనంతరం తినడం. దీనిని ముఖ్యంగా వీరశైవులు, ఆరాధ్య శైవులు ఆచరించేవారు. ఈ పద్ధతి ఈనాటికీ కూడా పాటింపబడుతుంది.

10. ముగింపు:

తమ కోర్కెలు నెరవేరడం కోసమో, లేదా కోర్కెలు నెరవేరిన అనంతరం మొక్కులు తీర్చడం కోసం నోములు, వ్రతాలు చేసేవారు. వ్రతాలు - నోములు వర్ణ, కుల బేధం లేకుండా ఆచరించేవారు. అయితే వ్రతాలు ఎవరైనా ఆచరించేవారు. నోములు మాత్రం వారసత్వంగా ఆచరించేవారు. ఇవి సౌభాగ్యం కోసం, సంపదల కోసం, ఆయురారోగ్యాల కోసం, సంతానం కోసం ఆచరింపబడేవి. ఇవి ప్రజల జీవితంలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించాయి. వీటి ఆచరణ వలన కుటుంబాల మధ్య రాకపోకలు పెరిగి ఐకమత్యం పెరిగింది. ఇచ్చిపుచ్చుకోవడాలు పెరిగాయి. 

ప్రతివ్రతం వెనుక ఏదో ఒక కారణం ఉండేది. దేవతలతోపాటు ప్రకృతిని పూజించడం, పశువులను, పక్షులను, చెట్లను పూజించడం ఇవన్నీ ప్రజలను ప్రకృతికి చేరువ చేయడమే గాక వారికి ప్రకృతి పట్ల భక్తిని, గౌరవభావాన్ని పెంచాయి. 

నందికేశ్వర నోము, దాసరెడ్ల నోములు పశువులను పూజించాలని చెప్తుంది. ఈ నోములు చాళుక్యులు కూడా ఆచరింపబడినట్లు ఆధారాలు ఉన్నాయి. నంది శక్తికి, సామర్థ్యానికి, తేజానికి చిహ్నం. అటువంటి నందిని పూజించడం వలన పశువుల సంఖ్య అధికమై ఫలితంగా వ్యవసాయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి జరిగేది.

దాసరెడ్ల నోములో ఎడ్లను పూజించి వాటికి పౌష్టికాహారాన్ని అందించడం వలన వాటి శక్తి ఇనుమడించేది. ఫలితంగా ఆరోగ్యవంతమైన పశువుల ఉత్పత్తి జరిగేది. తద్వారా వ్యవసాయ అభివృద్ధి జరిగేది. ఇక గజనిమ్మ నోము, కన్నె తులసి నోము చెట్ల ప్రాధాన్యతను వివరిస్తాయి. చెట్లను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవడం జరిగేది. ఈ వ్రతాలన్నీ ప్రజలలో దైవభక్తిని పెంచి, వారిని సన్మార్గులను చేయడమేగాక హైందవ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించి ముందు తరాలకు అందించాయి.

కాకతీయుల కాలంలో శైవమతం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నందువలన ఎక్కువగా శైవ సంప్రదాయ వ్రతాలు, నోములు ఆచరింపబడినా వైష్ణవ సంప్రదాయ వ్రతాలు కూడా ఆచరింపబడినట్టు సమకాలీన సాహిత్యం వలన తెలుస్తుంది. వ్రతకాలంలో ఇవ్వబడిన తాంబూలాలు, వాయినాలు, దక్షిణలు ఇవన్నీ ఎంతో విలువైనవి. ముఖ్యంగా పసుపు, కుంకుమలు, పండ్లు, పువ్వులు ఇవన్నీ ఔషధపరమైన విలువలు గలవి. వాటి వలన ఆరోగ్యం ఇనుమడుస్తుంది. 

అంతేగాక ఉద్యాపన కాలాలలో ఇవ్వబడే దానాలు, వస్త్రాలు, వంటసామగ్రి పేదలకు ఎంతో ఉపయోగపడేవి. బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణలు వారి జీవనానికి ఎంతో ఉపయోగపడేవి. ఒకరకంగా చెప్పాలంటే ఒకే చోట పోగుపడిన సంపదను ఇతరులతో పంచుకునే పద్ధతి అని చెప్పవచ్చు. ఈ విధంగా నోములు, వ్రతాలు కాకతీయుల కాలంనాటి సమాజంలో ముఖ్య భూమిక పోషించాయని చెప్పవచ్చు.

11. పాదసూచికలు:

 1. పల్నాటి వీర చరిత్ర - పుట: 55, 56
 2. పల్నాటి వీర చరిత్ర - పుట: 53
 3. బసవపురాణం - పుట: 13, 14
 4. సిద్దేశ్వర చరిత్ర - పుట: 419
 5. క్రీడాభిరామము - పుట:47
 6. క్రీడాభిరామము - పుట:49
 7. క్రీడాభిరామము - పుట:49
 8. పండితారాధ్య చరిత్ర - పుట:137
 9. రుక్మాంగద చరిత్ర - పుట: 131
 10. సింహాసన ద్వాత్రంశిక - పుట:141

12. ఉపయుక్తగ్రంథసూచి:

 1. ఉమాకాంతం. అక్కిరాజు, 1911. పల్నాటి వీర చరితం, శ్రీ మహాకవి శ్రీనాథ విరచితం, వాణి ముద్రణశాల, బెజవాడ.
 2. నాగయ్య. పసవుల, 1914. పండితారాధ్య చరిత్ర, శ్రీ విజయరామచంద్ర ముద్రాక్షరశాల, విశాఖపట్నం.
 3. పరబ్రహ్మ శాస్త్రి. పి.వి., 2012. కాకతీయులు, ఎమెస్కో బుక్స్ , హైదరాబాద్.
 4. ప్రతాపరెడ్డి. సురవరం, 2017. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, క్లాసిక్ బుక్స్, విజయవాడ.
 5. ఫ్రౌఢకవి మల్లనార్య ప్రణీతము, 1938. రుక్మాంగద చరితము, ఏకాదశి మహత్మ్యము, వావిళ్ళ రామశాస్త్రలు అండ్ సన్స్, చెన్నపురి.
 6. రామకృష్ణశర్మ. గడియారం, 1982. సింహాసన ద్వాత్రంశిక, కొరవి గోపరాజు ప్రణీతము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కళాభవన్, హైదరాబాద్.
 7. లక్ష్మీనారాయణ, గంగిశెట్టి. 1977. పండుగలు- పబ్బాలు. అంతర్జాతీయతెలుగు సంస్థ. హైదరాబాద్,
 8. లక్ష్మీరంజనం. ఖండవల్లి, 1960. సిద్ధేశ్వర చరితము, కాసె సర్వప్ప ప్రణీతము, ఆంధ్ర రచయితల సంఘము, హైదరాబాద్.
 9. లింగమూర్తి. పూడిపెద్ది, 1927. బసవ పురాణం,వచనకావ్యం, శ్రీ చింతామణి ముద్రా కళాశాల, రాజమహేంద్రవరం, .
 10. సింగరాచార్య.బి.వి., 2009. వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామము, ఎమెస్కో బుక్స్, హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]