headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. గోరేటి వెంకన్న పాటలు: నీటి ఊటల స్పర్శ

డా. తాడూరి రవీందర్

ప్రిన్సిపాల్,
ప్రభుత్వ బీసీ గురుకుల కళాశాల,
సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ.
సెల్: +91 9949946607, Email: ravinder.thaduri@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలంగాణయే కాక, ఉత్తరాంధ్ర మొదలుకొని, రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో తన పాటకు, అశేషమైన అభిమానుల్ని ప్రోది చేసుకొన్న ప్రజా వాగ్గేయ కారుడు, ప్రజా గీతికల తాత్త్వికుడు గోరటి వెంకన్న. ఆయనకవిత్వం స్పృశించని అంశం అంటూ ఏదీ లేదు. పల్లె జీవన మాధుర్యం నుండి మొదలుకొని ప్రపంచీకరణ వ్యతిరేకత దాకా ఆయన కైగట్టని కవితావస్తువు లేదు. వారి పాటల సంకలనాలన్నీ పరిశీలించినపుడు నీటి జాడ అడుగడుగునా మన హృదయాన్ని తడిచేస్తూనే ఉంటుంది. నీరు మానవ మనుగడకు జీవనాధారం అనే స్పృహ గోరటికిప్రధాన కవితా వస్తువైంది. ఈ విధంగా గోరటి వెంకన్న జీవితాన్ని పరిచయం చేస్తూ,ఆయన పాటల్లో నీటి ప్రాముఖ్యత, నదులు వాటి పై ఆనకట్ట ల ఆవశ్యకత ,నీటి వనరుల అదృశ్యం- కరువు చిత్రణ, గ్రామీణ జీవనంలో చెరువుల పాత్ర, ఎలా చిత్రించబడిందో విశ్లేషించడం, తద్వారా కవి నేటి తరానికి జలస్పృహను ఎలా కలిగిస్తున్నాడో తెలియజేయడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.గోరేటి వెంకన్న రాసిన అయిదు పాటల సంకలనాలను సామాజిక విశ్లేషణ పద్దతిలో విశ్లేషించాను.తన కవిత్వం లో ఎక్కువగా స్పృశించిన నీరు మరియు దాని ఆవశ్యకత ను తెలుసుకోవడం ద్వారా భావి కవులు సామాజిక స్పృహను కలిగి ప్రకృతి పరిరక్షణ బాధ్యతనుస్వీకరిస్తారు.కవిగా,గాయకుడిగా వెంకన్న చేసిన సాహిత్య కృషిని గౌరవిస్తారు. గోరేటి వెంకన్న పై కాకతీయ,ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుండి పరిశోధనలు వెలువడినాయి. ఈ వ్యాసం లో గోరేటి వెంకన్న రాసిన అన్ని పాటల పై కాకుండా నీటిప్రాధాన్యత గల పాటలను పరిశోధనకు ఎంచుకున్నాను .ఇందు కొఱకు వారి పాటల సంకలనాలే కాకుండా, ఇంటర్వ్యూలు, పలు సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు, ఇచ్చిన ప్రదర్శనలు కూడా విశేషంగా ఉపయోగపడ్డాయి.

Keywords: ప్రజావాగ్గేయకారుడు, జలచక్రం, సెరువు, వాన, కరువు, నది, ఏరు, వాన, ప్రగతి.

1. ఉపోద్ఘాతం:

తెలుగు సాహిత్యంలో వాగ్గేయకారులు చెరగని ముద్ర వేశారు. పామరుల నుండి పండితుల వరకు ఆబాలగోపాలాన్ని అలరించి, సంస్కరించి, ఆనంద డోలికల్లో ఓలలాడించిన ఘనత వాగ్గేయకారుల సొంతం. 

వాగ్గేయ కారుడంటే ఎవరు? ఇందుకు సమాధానం సంస్కృత లాక్షణికుడు శార్ఞ్గదేవుడిచ్చిన నిర్వచనం "వాచం గేయంచ కురుతే య: స వాగ్గేయకార:" అంటే వాగ్గేయకారుని రచన ధాతుమాతువుల సంయోగం కలదన్న మాట. ఇంతకు ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే స్వయంగా పాటను రచించి, స్వరాలు కూర్చి, గానం చేస్తారో వారు వాగ్గేయకారులు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, భక్త రామదాసు, సారంగపాణి మొదలగు వారు అగ్రగణ్యులు. అన్నమయ్య పద కవితా పితామహుడిగా పేర్గాంచాడు. అన్నమయ్యని 'తొలి వాగ్గేయ కారుడు' అంటారు. అంటే గేయాలను రాసిన వారు అని అర్థం. ఆ కాలానికి పదం అంటే పాట లేదా గేయం. 

అన్నమయ్య 32,000 పైగా సంకీర్తనలు రాశారు. వాటిలో పరోపకారం . భూతదయ, పరనింద వ్యతిరేకత, పరపీడన నిరసన, సత్యనిరతి, ధర్మ తత్పరత, వేంకటేశ్వర భక్తి మొదలైనవి పేర్కొ నదగినవి. అన్నమయ్య తర్వాత అంతటి ఘనకీర్తి పొందిన మరో వాగ్గేయకారుడు భక్త రామదాసు. శ్రీ రామ చంద్రున్ని అతని సుగుణాలను, ధర్మ వాక్య పరిపాలనను, త్యాగ నిరతిని - తన కీర్తనల ద్వారా జన సామాన్యంలోకి చొచ్చుకొని పోవడమే కాక, నేటికీ తెలుగు నాట అజరామరంగా ప్రతిధ్వనించేలా ముద్ర వేశారు. ఈ క్రమంలో కఠిన కారగార వాసాన్ని అనుభవించారు. త్యాగయ్య కృతులు, క్షేత్రయ్య పదాలు ఇప్పటికీ తెలుగు లోగిళ్ళలో కమనీయమై, రమణీయమై అలరారుతూనేఉన్నాయి. వాగ్గేయకారులు ఏ దైవమును ప్రధానంగా కీర్తించినా, వారి ప్రధాన లక్ష్యం సమాజాన్ని సంస్కరించడమే.

మనది వ్యక్తి కేంద్రీకృత సమాజం. వ్యక్తి సంస్కారవంతుడైతే కుటుంబం, సమాజం వికాసశీల దశలో నడుస్తుంది. వ్యక్తిలో పేరుకొన్న వికృతులను దూరం చేయాలి. సాంస్కృతిక మాన వుణ్ణి నిర్మించాలి.అప్పుడు సమాజం సంస్కృతీ సంపన్నం అవుతుంది1 అనే దృష్టితో ప్రాచీన వాగ్గేయ కారులు సామాజిక చైతన్యం కోసం నడుం బిగించారు.

“పరుల హింస సేయకున్న - పరమ ధర్మమంతే చాలు
పరుల రక్షింతునని - పలుక నేటికే మనసా?” అన్న రామదాసు కీర్తనలో గాని,

“ బ్రహ్మ మొకటే - పర బ్రహ్మ మొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి
ఒకటే చెండాలుండేటి తరి భూమి యొకటే“ (తెలుగు వాగ్గేయకారులు- అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం,పుట xiii)

అనే అన్నమయ్య సంకీర్తనలో గాని సామాజిక సంస్కరణ, వ్యక్తి సముద్ధరణ ప్రధాన లక్ష్యాలుగా గోచరిస్తాయి. ఆధునిక వాగ్గేయకారులలో తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ కవులకి, వాగ్గేయకారులకి ఒక మహత్తర పోరాట వారసత్వముంది. అది నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం కావచ్చులేదా గత నాలుగు దశాబ్ధాలుగా తెలంగాణలో జరుగుతున్న భూపోరాటాలు కావచ్చు. బహుశా భారతదేశంలో ఏ ప్రాంతానికీ లేని ఒక అద్భుతమైన వనరు ఇది. ఈ వనరుని చాలా జాగ్రత్తగా వాడుకున్న కవులు చాలామంది ఉన్నారు. వాగ్గేయకారులు ఉన్నారు. ఆధునిక యుగకర్త, ఒక పౌరాణిక వ్యక్తిత్వ స్థాయి అందుకున్న గద్గర్, గూడ అంజయ్య, ఉత్తరాంధ్రలో వంగపండు ప్రసాదరావు మరెందరో ఉన్నారు.

పైన పేర్కోనబడిన వాగ్గేయకారుల వారసత్వం గోరేటి వెంకన్నది. ఈయన తనకి ముందున్న గొప్ప జానపద వాగ్గేయకారుల నుంచి ప్రాణపదమయిన బాధ్యతను స్వీకరించాడు. అందుకే కె. శివారెడ్డి "నాకు ఎరిక వున్న కవుల్లో, యింత గొప్ప భావుకత యింత సృజనాత్మకత వున్న కవులు చాలా అరుదు. ఈ విషయంలో ఒక పాబ్లో నెరుడా కనబడుతాడు, ఒక బాబ్ డిలాన్ కనపడతాడు"2 అంటారు.

2. గోరటి వెంకన్న - జీవన రేఖలు :

మహబుబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూర్ జిల్లా గౌరారం లో నర్సింహ, ఈరమ్మ దంపతులకు వెంకన్న జన్మించాడు. తండ్రి నర్సింహ మంచి యక్షగాన కళాకారుడు. తల్లి కూడా చక్కని పాటలు పాడేది. చిన్న తనం నుండే బడిలో పాటలు పాడే వెంకన్న 1984లో "నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయెరో" అనే రైతు సమస్యలపై రాసిన పాటతో ఒక్కసారిగా వెలుగులోనికి వచ్చాడు. 1994లో ఏకునాదం మోత, 2002లో రేలపూతలు, 2010లో అలసెంద్రవంక, 2016లో పూసిన పున్నమి, 2013లో వల్లంకి తాళం అనే పాటల సంకలనాలను వెంకన్న రాసి, ప్రచురించారు. రవినీడ, సోయగం, పాతకథే నా కథ, పల్గాడి అనునవి వారి కలం నుండి జాలువారిన ఇతర రచనలు.

'రేలపూతలు' కు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ గేయ సంపుటి పురస్కారం, 'అలసెంద్ర వంక' కు హంస అవార్డు, గండ్ర హన్మంత రావు స్మారక సాహితీ పురస్కారం లభించింది. తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ సాహితీకారునికి ఇచ్చే ' కాళోజీ నారాయణ రావు పురస్కారం’, గీతం యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్, ఇరవైకి పైగా దేశ, విదేశాలలోని సంస్థల ద్వారా పురస్కారాలు అందుకున్నాడు. 2021 లో 'వల్లంకి తాళం' పాటల సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో సభ్యుని గా ఉన్నారు.

వెంకన్న రాసిన 'పల్లె కన్నీరు పెడుతుందో' పాటు ఆంగ్లంలోకి అనువదించబడి, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణలతో స్థానం పొందింది. ఉస్మానియా, ఇఫ్లూ, ఉర్ధూ విశ్వ విద్యాలయాలలో ఈయన రచనలపై పరిశోధనలు జరిగాయి. వెంకన్న ఎన్ కౌంటర్, కుబుసం, శ్రీ రాములయ్య లాంటి ఎన్నో ప్రజాదరణ పొందిన చిత్రాలకు పాటలు రాశారు.1994 లో వచ్చిన 'ఏకునాదం మోత' దగ్గర నుంచిఅనేక కోణాల్నుంచి, అనేక వస్తువుల్ని ముట్టుకున్నాడు. పాటలు రాశాడు, పాడాడు. ఆడాడు. గోరటి వెంకన్న పాటల్లో ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినవి, వామపక్ష భావజాలం నుంచి వచ్చినవి, స్త్రీ వాద నేపథ్యం నుండి వచ్చినవి, దళిత నేపథ్యం నుండి, ప్రపంచీకరణ నేపథ్యంలోని ఛిద్రమవుతున్న కులవృత్తులూ, జనజీవితాల నుండి వచ్చినవి, ప్రాకృతిక సౌందర్యం, పల్లె అందాల నుండి వచ్చిన పాటలు కోకొల్లలు.

ఉద్యమాలు సృష్టించిన పాటలు కొన్ని, పాటలే సృష్టంచిన ఉద్యమాలు కొన్ని ఉంటాయి. ప్రజల హృదయాలలోని తానే నిండిపోయి. ఒక వరదలా మనసును ముంచెత్తిన వరదగూడు గోరటి. అతడి పాటలే మనముందున్న ఉద్యమమిప్పుడు. ఐదారేళ్ళ పిల్లల్ల దగ్గర్నుంచి, వార్థక్యదశ చేరుకున్న వాళ్ళ వరకూ పరవశించని వాళ్లుండరు. నిజానికి గోరటి వెంకన్న పాటలు కొలిచే తూనికరాళ్లు నా దగ్గర లేవు. నాకంత శక్తి కూడా లేదు. ఇదిగో ఇంతవరకూ అని నిర్ణయించే అధికారాన్ని, ఇలాగే వుంటాయి అనే నిర్ణయాన్ని అతడి పాటలు ఎవరికీ ఇవ్వవు. అతని పాటలు ప్రజల్లో ఆలోచనను, ఆచరణను, ఐక్యతను, పోరాట పటిమను, మానవత్వాన్ని, పడిలేచే తత్వాన్ని, గెలుపు మనదేనన్న ధైర్యాన్ని ఇస్తాయి. బతుకు మీద భరోసానిస్తాయి3

3. గోరటి పాటలు - నీటి ప్రాముఖ్యత:

పంచ భూతములలో నీరు అత్యంత ముఖ్యమైనది. జీవకోటి మనుగడకు నీరు ప్రాణాధారం. నీరు లేనిదే వృక్షజాలం, జంతు జాలం ఉనికిలో ఉండవు. ప్రపంచ మానవ పరిణామా క్రమం లో, నాగరికతా పురోగమనంలో, చారిత్రక గమనంలో, ఆర్థిక. సామాజిక అభివృద్ధిలో, సాహిత్య సృష్టి, సాంస్కృతిక పుష్టిలో నీరు పోషించిన పాత్ర ఉత్కృష్టమైనది. గొప్ప గొప్ప నాగరికతలు. నది తీరాల వెంబడి పురుడు పోసుకోని విలసిల్లినవి. నోర్లు తెరిచిన నేల సాల్లలో, తన స్పర్శతో బంగారు పంటలు పండించి, ఈ దేశాన్ని అన్నపూర్ణగా ప్రపంచం ముందు నిలబెట్టిన ఎన్నో గొప్ప గొప్ప నదులు, పేరెన్నిక గన్న తటాకాలు, జలాశయాలకు ఆలవాలం భారత భూమి. అయితే చాలా ప్రాంతాల్లో సరైన నీటి వసతులు లేక, ఉన్నా వానలు పడక, పడినా సరైన నీటి సంరక్షణ నిర్మాణాలు లేక కరువు తాండవ మాడిన క్షామ ఛాయలు కనిపిస్తుంటాయి. అలాంటి కరువు సీమల్లో గోరటి వెంకన్నకు జన్మనిచ్చిన పాలమూరు జిల్లా ఒకటి. పాలుమూరే కాదు, తన తెలంగాణ, రాయలసీమ, దేశంలోని అనేక ప్రాంతాల కరువును, వలసలను తన కళ్ళారా చూసి బాధపడుతున్న తరుణంలో వెంకన్న కలం కదిపాడు, గళం విప్పాడు.

పల్లెను, ప్రకృతిని ప్రాణంగా ప్రేమిస్తున్న వెంకన్న నీటి అలలతో పల్లె అందాన్ని చూసి మురిసిపోతాడు - నీరు లేని గ్రామాలను చూసి తల్లడిల్లిపోతాడు . జల చక్రం విరిగి పోతే మనసు ముక్కలయ్యి నిలువెల్లా కరిగిపోతాడు. కాబట్టే తన పాటల సంకలనాల్లో ఎటు చూసినం నీటి జాడలనే నింపాడు.

రేలపూతలు, పూసిన పున్నమి, అలసెంద్ర వంక, వల్లంకి తాళం సంకలనాల్లో 120 పాటలు ఉంటే అందులో దాదాపు 30 వరకు నీరు, నీటి వనరులు,వాటి ప్రాముఖ్యతనే కనిపిస్తుంది. దీనినే బట్టే వెంకన్న పాటలల్లో నీటికి వేసిన పెద్దపేట అగుపిస్తుంది. అందుకే

“విశ్వ రమణీయాల వింత జలచక్రం
అవని సుట్టు అల్లుకున్న అందమైన చక్రం.
పవనమై నింగిలో పాడేనే ఈ చక్రం.
ప్రాణకోటి మనుగడకు మూలం జలచక్రం“ (అలసెంద్రవంక, పుట:37)

అంటూ సకల చరాచర సృష్టికి నీరెంత అవసరమో తెలుపుతూ వర్షం, సముద్రం, సూర్యుడు ఈ మూడింటి కలయిక, అవినాభావ సంబంధమే మన మనుగడకు ఆధారం అంటారు.

“అతనేమో మండే కొలిమి
సాగరంలోని చెలిమి
ఆ నింగి సాగరాల మధ్య బంధమే జలచక్రం“ (అలసెంద్రవంక,పుట38) అంటారు.

వెంకన్న పాటలను నిశితంగా పరిశీలిస్తే నీరు పుట్టుక ను ఎంతో శాస్త్రీయంగాఅవలోకన చేసుకొని, దాన్ని తన పాటల్లోకి ఎక్కించిన నేర్పరితనం సుస్పష్టంగా గోచరిస్తుంది. అలాగే వెంకన్న లోని కవి ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతినే ప్రాణంగా తను పాటుల్లి • పరవశించిపోతాడు, మనల్ని ఆ పరవశంలో ముంచేస్తాడు. ప్రకృతి అందాల్లో నీటిదే సింహభాగం. పచ్చదనానికీ నీరే ఆయువు. నీరు, అడవి కలయిక ఈ పుడమికే ఎనలేని శోభను చేకూరుస్తుంది. ఇదంతా వెంకన్న తన కవనంలో కలబోశాడు.

పారె వాగు వంకలు
“ఆ పచ్చనాకు రెమ్మలు
అంతులేని సంద్రం
ఆ సరస్సులెంతో అందం .
సిందాండె నీటి మువ్వలు,
సిన్నారి సినుకు గవ్వలు“ (అల సెంద్ర వంక, పుట 38)

అంటూ ఆ అందాలను వర్ణిస్తూనే, ఈ వాగులు, వంకలు కలిసి, నదులుగా మారి, నదులన్ని సముద్రంలో చేరి, చివరకు ఆ నీరు ఎండ వేడికిఆవిరయ్యి, ఆ తరువాత వర్షంగా మారే జలచక్రాన్ని అద్భుతంగా కవిత్వీకరించారు .రేలపూతలు సంకలనంలో 'పల్లె నవ్వితే', 'వెన్నెల గాపుకుందమా' ‘పూసిన పున్నమి’ 'పూల సింగిడీ' 'సీనుకు జింక' అలసెంద్ర వంక లోని 'పల్లె అందాలు' 'సెరువు', వల్లంకి తాళం లోని 'గునుగు కొమ్మ' 'పూల సందడి’ పాటల్లో గ్రామాల్లోని నీటి వనరులయిన చెరువు, వాగు, ఏరుల వలన ప్రకృతికి చేకూరే కను విందు కలిగించే రమణీయతను వర్ణించాడు వెంకన్న.

“దోసిళ్లతో వాగు నీళ్లు తాగిన తీయని యాది
మోసుకొచ్చినతెప్పల తడిసి తొలిగిన వేడి”
“అల నింగి సలువరేల
పయనించే పడవ లీల
దివి నుంచి నేల వైపు
తన నడకనేమొ మలుపు
మిల మిల సందమామ
మురిపిస్త ఉంది పల్లె “ (పూసిన పున్నమి, పుట. 47)

పైన ఉన్న పంక్తుల్లోనే కాకుండా చాల చోట్ల తన పాటల్లో పల్లెకు - ప్రకృతికి - నీటికి గల ఆకుపచ్చసంబంధాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా, కవిత్వీకరిస్తూనే ఉంటాడు.

4. గ్రామీణ ప్రగతి - చెరువుల ప్రస్తావన :

తెలంగాణ ప్రాంతంలని ఎక్కువగా మెట్టనేలలు ఉంటాయి. కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదులు ప్రవహిస్తున్నా సరైన ఆనకట్టలు, ఆ నీటిని ఒడిసిపట్టే వసతులు చాలా తక్కువ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడి ప్రజలు, గ్రామాలు పాడి పంటలతో విలసిల్లాలనే గొప్ప దార్శనికతతో పూర్వ కాలం నుండే ఇక్కడి రాజులు, చక్రవర్తులు చెరువుల నిర్మాణం చేపెట్టారు . అతి ప్రధానంగా కాకతీయు ల కాలంంలో నిర్మించిన గొలుసు కట్టు చెరువులు, అతి పెద్ద జలాశయాలు తెలంగాణ మాగాణిని సుబిక్షం చేస్తున్నాయి. దాదాపు యాభై శాతం గ్రామాలు చిన్నవో, పెద్దవో చెరువును కలిగి ఉండి, పచ్చని పైరులతో అలరారుతున్నాయి. ఆ వైభవాన్ని, చెరువుతో పెనవేసుకున్న పల్లె జీవనాన్ని గోరటి వెంకన్న చాలా పాటలల్లి ఎంతో అద్భుతంగా వర్ణించారు.

"సెరు వోయి మా ఊరిసెరువు
ఊరి బరువునంతా మోసె ఏకైక ఆదెరువు“ (అల సెంద్ర వంక, పుట. 39)

అనే పాట తెలంగాణ గ్రామీణ జల వైభవాన్ని కళ్ళకు గట్టినట్లు మన ముందు ఉంచుతుంది. చెరువులో పిల్లల ఈతలు, చెరువులో ఉండే తామరలు, గట్టున ఉండే తుమ్మ, తంగేడు, కానుగ వృక్ష సంపద, చెరువులో సేదదీరే గేదెలు, పశువులు, చెరువులో పెరిగే వివిధ రకాల మత్స్యసంపద, వాటి పై ఆధారపడే కొంగలు, ఇంకా అనేక రకాల పక్షులు, చెరువు పై ఆధార పడే బెస్తలు, తెనుగు కుల వృత్తుల వారు, చెరువు నిండిందనే సంబరంలో తమ బతుకులను భరోసాతో గడిపే ఇంతర కులవృత్తుల వారి గురించి పదహారు చరణాలతో 120 పంక్తులతో చాలా సహజంగా, అద్భుతంగా వర్ణించాడు వెంకన్న.

జంగాలు దాసర్లు బుడబుక్కల వాళ్ల
గంగిరెద్దులోల్లు గంట పకీరోల్లు
ఉరుముల తొలకరిల ఉసుల్ల తీరుగ
సెరువు నీళ్ళను జూసి తరలి ఊరొచ్చేది “ (అల సెంద్ర వంక,పుట 40)

అనే పంక్తులు కేవలం గ్రామస్తులు, రైతులు మాత్రమే కాదు, సంచార జాతులు, యాచక వృత్తుల వారు కూడా ఎలా చెరువుపై, ఆ జలసిరి పై ఆధారపడి బతుకెళ్ళదీస్తారో వివరిస్తున్నాయి. అలాగే ఒకనాడు కళకళలాడిన చెరువు, కరువుతో వెలవెలబోయిన దృశ్యాలను కూడా తలచుకుంటూ,బాధపడిన పంక్తులు చివరలో మనసును మెలిపెడతాయి.

“పక్షుల పాటల పరుగు అల దర్వుల
పల్లె నెల వంకల బాసిల్లె మా సెరువు
లాభాల లోభాల పాపి సూపుల కేమో
మునుపటి కళతప్పి మురికితుమ్మయ్యింది “ (పూసిన పున్నమి, పుట. 48)

అని చెప్పడం ద్వారా ప్రస్తుతం చెరువులు పూడికతో నిండి, సరైన నిర్వహణ లేక గంగాళం లంగా ఉన్న చెరువులుగరిటెడు నీళ్ళను ఆపే శక్తి కుండా లేని కుంటలు గా మారిన దుస్థితిని వర్ణించడం ద్వారా నేటి తరానికి చెరువుల పై బాధ్యత పెరిగేలా, జల సిరుల మాగాణం మెరిసేలా గోరటి వెంకన్న తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
మరోచోట 

"సెర్లు కుంటలెండిపోయి బురదనీళ్లు పైకి తేలె
అవితాగిన గొడ్లకేమో జలగ రోగమంటుకునే” (వల్లంకి తాళం, పుట. 71)

అంటూ చెరువులు కలుషితమయిన వైనాన్ని తెలపడం ద్వారా నేటి దుస్థతి మనకు అర్థనువుతుంది.పై విధంగా కొంగమ్మా, రాములోరి సీతమ్మ, వైభవ గీతిక, సినుకు జింక, సేతానమేడుందిరా, సెరువు, దేవదారు తుమ్మతియ్యలో, గునుగుకొమ్మ వంటి పాటలో చెరువు ప్రస్తావన చేస్తూ, చెరువు అవసరాన్ని, చెరువు ఇచ్చే ఆదరువును తెలియజేశాడు.

5. నదుల ప్రస్తావన - ఆనకట్టల ఆవశ్యకత:

గోరటి వెంకన్న ఒక్క తెలంగాణ మాత్రమే కాదు. తెలుగుప్రాంతాలు తెలంగాణ, రాయలసీమఉత్తరాంధ్ర లోని అన్ని రకాల నైసర్గిక స్వరూపాలపైన, నది పరివాహ ప్రాంతాలపైన సుస్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడు. అందుకే తన పాటలన్నీ, ఆయా ప్రాంతాలలోని నదులు, వాటిపై గల ఆనకట్టలుగాని అవి తెలుగు నేలకు ఎంత వరకు మేలు చేకూరుస్తున్నాయనేది విషయాన్ని అవసరమని తలచిన ప్రతీ చోట ఏదో ఒక పాటలో ప్రస్తావించాడు.
సిగమొగ్గ అనే పాటలో-

“నాగావళి వంశధార చంపావతి
గోస్తని తాండవ పంపశారద నదుల
పొంగేటి నవ్వుల గంగ మాయమ్మో
నింగి సాగర తీర అందమోయమ్మ”
రతనాల సీమ అనే పాటలో
“రానేరాదు పెన్న వానలు కరువయి
వచ్చిన ఊర్లను వరుసబెట్టి ముంచు
బైరవాని తెప్ప వరదొచ్చేనంటే" (వల్లంకి తాళం,పుట 50)

‘అంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ నదుల ప్రస్తావన కనబడుతున్నది. అయితే తెలంగాణ విషయానికొస్తే, వెంకన్న ఆవేదన, ఆవేశం కలగలిపి కవిత్వం రాసినట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే దశాబ్ధాలు తరబడి తెలంగాణ నీటిపారుదల విషయంలో చాలా నిరక్ష్యముకు గురైంది. అందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో "నీళ్లు" ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. అందుకనే దాదాపు సగానికి పైగా పాటల్లో తెలంగాణ నదులు ముఖ్యంగా కృష్ణా, గోదావరి, కిన్నెరసాని, మంజీర, మానేరు తారసపడుతూనే ఉంటాయి.

పూసిన పున్నమి, రాములోరి సీతమ్మా, వైభవ గీతిక, తల్లి తెలంగాణమా, జబ్బకు సంచి, దిగ దిగ మోతల అను పాటల్లో తెలంగాణలో ప్రవహించే గోదావరి, కృష్ణా, తుంగభద్ర మానేరు, మంజీర, కిన్నెరసాని, ఇంద్రావతి, ప్రాణహిత, వైన్ గంగ, పెన్ గంగ, మానేరు, మంజీర, శబరి, సీలేరు, దుందుబి నదులను గురించి ప్రస్తావిస్తూ, వాటి వైభవాన్ని, కళ్ళ ముందు ఉంచాడు.

అలాగే నీటి పారుదల ప్రాజెక్టులు, నీళ్ల మళ్లింపు, నీటి వాటాలు, కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల కాలయాపన వలన తెలంగాణ ప్రాంతం బీడు వారిన వైనాన్ని సూటిగా ప్రశ్నించాడు.

“పోచంపల్లేమో పొద్దెక్కనే లేదు
ఇచ్చంపల్లేమో ఇప్పుడు యాదికొచ్చె
మంజీర మలుపుల్ల మాయెవడు జేసిండు
నెట్టెంపాడేమోనక్కలెత్తుక పోయె” అని
“ఏటి ఆవల ఊరు ఏ తీరుగున్నది
ఏటి పక్కల నేల ఎందుకెండుతుంది
పారేది మా నేల పండేది ఏ నేల
మునిగింది ఏ ఊరు మురిసింది ఏ ఊరు” (పూసిన పున్నమి, పుట. 88)

అని ప్రశ్నించడం ద్వారా శ్రీరాం సాగర్, నెట్టెంపాడు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రాంతం ఎలా వివక్షకు గురయిందో సమాజం కనుల ముందుంచాడు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తరువాత ఇక్కడి నదులపై కట్టిన భారీ ప్రాజెక్టుల వలన ఇక్కడి నేలలు పంట సిరులతో కళ కళలాడిన తీరును అభివర్ణించాడు.

“కొండల దూకె వాగుల నాపె అనకట్టడాలు
ఎండిన బీడుల గొంతుల తడిపె ఎగిసే కాలువలు
ఆరుతడి ఆ మిట్ట ఫైరులకు పట్టెడు హారతులు
వేగిరమైన ఎత్తిపోతలతో నీరు కొండలెక్కు
పండిన ధాన్యరాసులకు తెలంగాణ తల్లి మొక్కు” (రేల పూతలు, పుట 54)

అని ఎండిన, నెర్రెలు బారిన రేగళ్ళు సకల పంటలకు ఆలవాలమైన విధానాన్ని వర్ణించాడు.

6. జలవనరుల అదృశ్యం- కరువు చిత్రణ :

తెలంగాణ ప్రాంతంతో పాటు దేశ వ్యాప్తంగా చిన్న, మధ్య తరహా నీటి వనరులయిన చెరువులు, కుంటలు, ఏరులు, వాగులు ఎండిపోయిన దైన్యాన్ని తన పాటల్లో కవిత్వీకరించాడు వెంకన్న. గ్రామసీమలు స్వయం పోషకంగా, సమృద్ధితో తులతూగడానికి గ్రామాలను అనుకొని పారే ఈ వనరులు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. అయితే వానలు పడకపోవడం, పూడిక పేరుకు పోవడం, చెక్ డ్యామ్ ల వంటి నీటి సంరక్షణా యంత్రాంగం కరువైపోవడం వలన అవి ఎండిపోయి, వాటిపై ఆధారపడే రైతాంగమే కాకుండా పశుపక్ష్యాదులు, వృక్ష జాతి కూడా సంకట స్థితిని ఎదుర్కొంటాయి. తద్వారా పల్లె సీమలు కరువు కోరల్లో చిక్కుకుంటాయి. ఈ మొత్తం దుస్థితిని తన పాటల్లో చాలా హృద్యంగా మలిచారు.

వెంకన్న. 'వాగు ఎండిపాయెరో' అనే పాట 'కరువు'కు నిలువెత్తు ప్రతీకగా కనబడుతుంది. కొన్ని గ్రామాలకు నీటిని అందిస్తూ, పాడి పంటలకు, వృక్షజాలానికి, పశు సంపదకు ప్రాణ ధారలా ఉన్న వాగు ,నీటి ఊట లేక ఎండిపోవడం వల్ల ఛిన్నాభిన్నమైన దృశ్యాన్ని సజీవం గావించాడు.

“ఎండ కాలం వానదేవుని కెదురు చూసేది
దిగులు మోముతో మడుగు నీరు యింకుతుంటె
మరిగిపోయె వాగు తనువు
వరుస కరువు కాటుకేమో వల్లకాడయి పోయినాది” (అల సెంద్ర వంక,పుట 56)

అంటూ ఆర్థంగా ఆ దుస్థితిని కవిత్వీకరించాడు. 'దిగులు గూడు' అనే పాటలోని వర్షాభావం వలన ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోయి, ఉత్పాదక శక్తి సన్నగిల్లి, అవశేష వనరులుగా కనిపిస్తున్న దుస్థితిని ఈ పాటలో వర్ణించాడు.

“వరుస బోరు బొరియలాయె ఎవుసమేమో జూదమాయె
ఉడుకు ధాటికి జడిసి నేల నీటి ఊటల బాట మలిపె
నీటికయి జూపిన దోసిట ఆశలాపై మొరంబోసె
మోట బావి కళ్ళ మెదలి ఏతమేసి ఎదును కుదిపె” ( వల్లంకి తాళం,పుట 70)

అంటూ తన పాటంతా కన్నీటి కష్టాన్ని, కరువుకు గల కారణాన్ని వివరిస్తూ, మానవ ప్రమేయం వలన సహజవనరులు తమ తమ ప్రాకృతిక ధర్మాలకు భిన్నంగా ప్రవర్తించడం మూలంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎంతో హృద్యంగా, ఆవేదనా భరితంగామలిచి పాటగా అందించాడు.

1990 లలో వెంకన్నకు దేశవ్యాప్తంగా ఎనలేని పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టిన 'పల్లే కన్నీరు పెడుతుందో" అనే పాట ఒక సంచలనం. ఎందరినో ఆలోచింప జేసింది. ప్రభుత్వాలను ప్రశ్నించింది, ప్రపంచీకరణను ఎండగట్టింది ఆ పాట లో కూడా-

“మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినని
వాగులు వంకలు ఎండిపోయినవి.
సాకలి పొయ్యిలు కూలి పోయినవి " (రేల పూతలు,పుట 53)

అను పంక్తులు ఆనాడుఆంధ్ర దేశం లోని కరువు పరిస్థితులకు అద్ధం పట్టాయి. వెంకన్న కరువును చిత్రించే క్రమంలో కరువు వర్ణన మాత్రమే కాకుండ, కరువుకు గల కారణాలు, పర్యవసానాలు, అందుచేత కుంటుపడే జీవితాలు, దానిని అరికట్టడానికి పాలకులు, సమాజం నిర్వహించాల్సిన బాధ్యతలను ఎప్పటికప్పుడు తన పాటలతో గుర్తుచేశాడు. తాను స్వయంగా కరువు నేల అయిన పాలమూరు వాసి కావున ఆ పరిస్థితు లను తన కవనం లోసహజాతి సహజంగా వెలిబుచ్చాడు.

“పల్లె చూపులు నింగి దిక్కు
ఆరతులెత్తిన తీరని మొక్కు
జీవితమంత వాన సుట్టె
పొగిలి ఏడ్సే రాగం పుట్టె “ (పూసిన పున్నమి,పుట 83)

అంటూ 'వాన పలవరింత' అనే పాట లో వర్గాల రాక కోసం కరువు సీమలు కన్నీరు పెట్టే దృశ్యాలను మన కళ్ళముందుంచాడు. ఇలా ఎన్నో పాటల్లో కరువును చిత్రించారు వెంకన్న. కొంగమ్మా, పల్లె కన్నీరు, వాన పలవరింత, గోస, సేతాన మేడుందిరా, సెరువు, దేవదారు తుమ్ము తియ్యలో, వంటిపాటలన్నీ కరువు నేపథ్యంలోనే వెంకన్న కైగట్టారు.

7. ముగింపు:

 • వాగ్గేయకారుల వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వెంకన్న వారు ఎంచుకున్న బాధ్యతలను తలకెత్తుకున్నారు. ప్రకృతి, పల్లె, ఆధ్యాత్మికత, తెలంగాణ ఉద్యనుం, విప్లవోద్యమం, కమ్యూనిజం, ప్రపంచీకరణ వ్యతిరేకత, బాల్యం, బైరాగి తత్వాలు, సమసమాజ ఆకాంక్ష .... ఇలా వెంకన్న పాటలలో వస్తువు కాని అంశమేదీ లేదు. 
 • ప్రకృతి, పంచభూతాల ప్రస్తాననే వీరి పాటల్లో ఎక్కువగా కనిపించింది. ఆ నేపథ్యంలోనే నీరు, నీటి వనరులు, కరువు, జలచక్రం, వారి పాటల్లో ప్రముఖంగా కనిపిస్తాయి.
 • ఈ నీటి పాటల ద్వారా వెంకన్న రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా, కరువు రాకుండా ఉండే పచ్చని బతుకులు ఈ నేలపై కనిపించాలని పరితపించారు. తన పాటల ద్వారా మనిషి ప్రకృతి పై, నీటి వనరులపై గౌరవం, బాధ్యత పెంచుకోని, వాటిని పాదుపుగా వాడుతూ, సురక్షితంగా భవిష్యత్ తరాలకు అందించాలని ఆకాంక్షించారు. నీరు పుష్కలంగా ఉంటే పల్లెలు ఎంత అందంగా ఉంటాయో, పుడమి తల్లి ఎంత చల్లగా ఉంటుందో అనే దృశ్యాన్ని తన పాటల్లో, రమణీయంగా వర్ణించడం ద్వారా పర్యావరణం పట్ల మనకు ఆరాధనా భావం పెంచాడు. 
 • కరువును, వలసలను, ఎండిపోయిన వాగులు, ఏరులను హృద్యంగా వర్ణించడం ద్వారా మనం చేసే మానవ తప్పిదాలు, పకృతి పట్ల చూపే నిరక్ష్యం మరో మారు చేయకుండా, పొదుపు గా వాడుకుని, జాగ్రత్త పడేలా ఒక అనివార్యతను సూచించాడు. ఒక గొప్ప బాధ్యతను భుజాలకెత్తుకుని తనకు ప్రకృతి పట్లు గల ప్రేమను చాటుకున్నాడు.

8. పాదసూచికలు:

 1. తెలుగు వాగ్గేయ కారులు - అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం. : డా. సి. నారాయణ రెడ్డి (సం), ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్, 2006. పుట : 59.
 2. రేల పూతలు. :గోరటి వెంకన్న, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, 2019, పుట: 11
 3. అల సెంద్ర వంక : గోరటి వెంకన్న, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, 2019, పుట: 21

9. ఉపయుక్తగ్రంథసూచి:

 1. అందెశ్రీ.:నిప్పుల వాగు, వాక్కులమ్మ ప్రచురణ, సికింద్రాబాద్, 2022.
 2. గంగప్ప. ఎస్. :తెలుగు వాగేయకారులు, యువ భారతి, సికిందరాబాదు, 1983.
 3. నారాయణ రెడ్డి.సి (సం) : తెలుగు వాగ్గేయ కారులు -అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్, 2006 .
 4. మల్లారెడ్డి సారంపెల్లి. : తెలంగాణ సాగునీటి వనరులు - అవకాశాలు, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2015.
 5. వెంకన్న గోరటి.:అల సెంద్రవంక, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2019
 6. వెంకన్న గోరటి.: ఏకు నాదం మోత, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాండ్, 2014
 7. వెంకన్న గోరటి. :పూసిన పున్నమి, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2019
 8. వెంకన్న గోరటి : రేల పూతలు, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2019
 9. వెంకన్న గోరేటి  : వల్లంకి తాళం,నవతెలంగాణపబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్,2019
 10. హరి కృష్ణ మామిడి. : తెలంగాణ వాగ్గేయ వైభవం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాదు, 2018

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]