headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

6. సలీం సాహిత్యం: మనోవిశ్లేషణ కథలు

వి. పద్మ

స్కూల్ అసిస్టెంట్ (తెలుగు),
జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల,
వినుకొండ, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9866623380, Email: vodithepadma@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

20వ శతాబ్దపు ప్రారంభంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతాలు వైద్యశాస్త్రాన్నే కాకుండా ప్రపంచ సాహిత్యాన్ని కూడా ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే 1946లో త్రిపురనేని గోపీచంద్ రచించిన "అసమర్ధుని జీవయాత్ర" నవల తెలుగు సాహిత్యంలో మొదటి మనోవిశ్లేషణ నవలగా గుర్తింపు పొందింది. ఈ కోవలోనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సయ్యద్ సలీం రచించిన 300 కథలను పరిశీలిస్తే అందులో 16 కథల్లో మనోవిశ్లేషణ సిద్ధాంతాలు కనిపిస్తాయి. ఈ 16 కథల్లో నాలుగు కథలను ఎంచుకొని అందులోని పాత్రల మనస్తత్వాలలోని ఈడిపస్ కంప్లెక్స్, డెల్యూషనల్ డిజార్డర్, ఇన్ఫిరియారిటీ కంప్లెక్స్, నెగెటివ్ థింకింగ్ వంటి మనోవిశ్లేషణ సిద్ధాంతాలను చర్చించడం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.

Keywords: కథలు, మనోవిశ్లేషణ, ఈడిపస్ కాంప్లెక్స్, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్, డెల్యూషనల్ డిజార్డర్

1. ఉపోద్ఘాతం:

"మానవుడి ప్రవర్తనను మనం ముందుగా పసికట్టలేం. అజ్ఞాత ప్రేరణలతో అది అటు ఇటు ఊగిసలాడుతుంది. దాని నడత అర్ధంలేని పురుగు పరిభ్రమణం వంటిది. అటువంటి అర్థరహితమైన, అసంగతమైన ప్రవర్తనకు అర్ధం పట్టుకొచ్చినవాడు సిగ్మండ్ ఫ్రాయిడ్.”1

మనిషికి శరీరం ఎటువంటిదో,  మనసు కూడా అటువంటిదే. వివిధ కారణాల ద్వారా బాహ్య శరీరం ఎలా వ్యాధుల బారిన పడుతుందో, ఎన్నో కారణాల వల్ల మనసూ  వ్యాధుల బారిన పడుతుంది. వ్యాధులు బారిన పడిన శరీరానికి చికిత్స ఎంత అవసరమో, మానసిక సమస్యలకు చికిత్స అంతే అవసరం. శారీరక వ్యాధులను, మానసిక వ్యాధులను విడివిడిగా సిద్ధాంతీకరించి, మనిషి అంతర్గత ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయన ఎన్నో గొప్ప మనోవిశ్లేషణ సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాలు వైద్య శాస్త్రంలో ఎంత సంచలనం సృష్టించాయో, ప్రపంచం సాహిత్యాన్ని కూడా అంతే  ప్రభావితం చేశాయి. 20వ శతాబ్దపు ప్రధమార్ధంలో సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం ప్రజల జీవన విధానం పైనే కాకుండా మానసిక ప్రవర్తన పైనా తీవ్ర ప్రభావం చూపింది. ఆనాటి కాలంలో సామాజిక చైతన్యంతో కూడిన రచనల్లో మనిషి బాహ్య ప్రవర్తనకు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చారో అంతరంగిక ప్రవర్తనకూ అంతే ప్రాధాన్యతనిచ్చారు.

మనిషి అంతర్గత సంఘర్షణను, అతని చంచలమైన మానసిక ప్రవర్తనను అధ్యయనం చేయడంలో ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు ఉపయోగపడ్డాయి. మనిషి లోపలి సంఘర్షణలను నాటి రచయితలు కథల ద్వారా నవలల ద్వారా పాఠకుల ముందుకు తీసుకువచ్చారు. తెలుగు సాహిత్యంలోనూ మనో విశ్లేషణ సిద్ధాంతాల ప్రభావం మొదటిగా నవలలో ప్రవేశించి తరవాత కథల బాట పట్టింది. మనోవిశ్లేషణ ప్రభావంతో తెలుగు సాహిత్యంలో వెలువడిన నవల "అసమర్థుని జీవయాత్ర". ఈ నవల ఆధునిక తెలుగు సాహిత్యంలో మొదటి మనో విశ్లేషణ నవలగా సాహిత్యకారులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతనే తెలుగు సాహిత్యంలో మనో విశ్లేషణ నవలలు, కథలు రాయటం ప్రారంభమైందని చెప్పవచ్చు. బుచ్చిబాబు రాసిన "చివరకు మిగిలేది" నవల మనోవైజ్ఞానిక నవలగా సాహిత్యకారుల విమర్శలు పొందింది. బుచ్చిబాబు సుమారు 70 కి పైగా మనస్తత్వపరమైన కథలను రచించారు. 

"1946లో శ్రీశ్రీ రాసిన కోనేటి దినం, కోనేటి రాత్రి, కోనేటి జన్మ అన్న కథలతో ఆధునిక మనోవిశేషాత్మక కథలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు."2 

కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, అంపశయ్య నవీన్, పిఎస్ శాస్త్రి, ఆడేపు లక్ష్మీపతి, ఆర్ఎస్ సుదర్శనం, కొలిపాక రమామణి వంటి రచయితలు మనోవైజ్ఞానిక కథలు, నవలలు రచించారు. ఇదే కోవలోనే సలీం సుమారు 16 మనో విశ్లేషణ కథలు రచించారు.

"తన ఇష్టంవచ్చినట్టు ఊహాలోకాలలో విహరించడానికి మానవుడికి స్వేచ్ఛలేదు. 'అహం' (Ego) కు స్వాతంత్య్రం లేదు. దైనందిన జీవితంలో, దానికి తెలియకుండానే అచేతన సహజాతాలు (Unconscious instincts) దానిపై అజమాయిషీ చేస్తుంటాయి" అన్నాడు ఫ్రాయిడ్.

ఇలాంటి అచేతన సహజాతాలు (Unconscious instincts), అర్థంలేని పురుగు పరిభ్రమణం వంటి మానవ మానసిక ప్రవర్తనను, మనిషి లోపలి ఎవరికీ తెలియని మరో మనిషిని సలీం తన కథల ద్వారా చూపించాడు. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన కొన్ని మనోవిశ్లేషణ సిద్ధాంతాలు సలీం కథల్లో మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి. చిన్న వయసులో మనసుపై ముద్రించబడిన అనుభవాలు పెరిగి పెద్ద వాడైన తరవాత వ్యక్తి బాహ్య, మానసిక ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయో సలీం కథల్లో చూడవచ్చు. మనిషిలో అంతరంగికంగా జరిగే సంఘర్షణ సలీం కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

2. సలీం రచించిన మనోవిశ్లేషణ కథలు : 

తెలుగు సాహిత్య రంగంలో పరిచయం అవసరం లేని పేరు సయ్యద్ సలీం. ఒంగోలు జిల్లా త్రోవగుంటలో జన్మించిన సయ్యద్ సలీం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూనే తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సయ్యద్ సలీం 300 కథలు, 30 నవలలు రచించారు. సలీం రచించిన కథలను పరిశీలించినప్పుడు మానవీయ కథలు, మానవ సంబంధ కథల తరవాత మనోవిశ్లేషణాత్మక కథలు ఎక్కువగా కనిపిస్తాయి. సలీం కథలను వర్గీకరణ చేసినప్పుడు అందులో 16 కథలను మనోవిశ్లేషణ కథలుగా పేర్కొనవచ్చు. అవి.

 1. నవ్వు (1987లో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురితం)
 2. కిటికీ (1988లో స్వాతి సపరివార పత్రికలో ప్రచురితం)
 3. ఆ రాత్రి (1989 ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురితం)
 4. నీడ (1993లో మయూరీ విక్లీలో ప్రచురితం)
 5. జారుడు మెట్లు (1993లో ఆంధ్రభూమి మాస పత్రికలో ప్రచురితం)
 6. కథ చెప్పరూ (1996లో మయూరి వీక్లీలో ప్రచురితం)
 7. మచ్చ (1996లో మయూరిలో ప్రచురితం)
 8. అమ్మ (1998లో విశ్వరచనలో ప్రచురితం)
 9. అద్దం (1998లో ఆంధ్రప్రభలో ప్రచురితం )
 10. ఇరుకు (1998లో ఆంధ్రప్రభలో ప్రచురితం)
 11. యద్భావం ( 2005లో ఆదివారం వార్తలో ప్రచురితం)
 12. ఖులా (2006లో ప్రస్థానం ప్రత్యేక సంచికలో ప్రచురితం)
 13. తలుపు (2008 విపుల మాస పత్రికలో ప్రచురితం)
 14. కళ్ళు (2010లో సురభి మాస పత్రికలో ప్రచురితం)
 15. బతుకొక పండుగ (2017లో ఆంధ్రభూమి ఆదివారంలో ప్రచురితం)
 16. సలుపుతున్న గాయం (2018 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

3. సలీం కథల్లో మనోవిశ్లేషణ సిద్ధాంతాలు

3.1. ఈడిపస్ కాంప్లెక్ - అమ్మ :

సిగ్మండ్ ఫ్రాయిడ్ 1899లో ప్రతిపాదించిన మానసిక విశ్లేషణ సిద్ధాంతాల్లో " ఈడిపస్ కాంప్లెక్స్ “ ముఖ్యమైనది. చిన్నతనం నుండి అబ్బాయిలు తల్లులపైన ప్రేమ, అనురాగం పొంది ఉంటారు. ఈ అనురాగం తీవ్రంగా మారితే 'ఈడిపస్ కాంప్లెక్స్' అనవచ్చు. ఈ భావం పిల్లవాడు ఎదుగుతున్న కొద్దీ స్థిరంగా నిలబడితే 'మదర్ ఫిక్సేషన్' ఏర్పడుతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ తరహా ఫిక్సేషన్ వలన జీవితంలో ఉన్నతదశకు చేరుకోగలిగినా అంతర్గతంగా మాత్రం తీవ్ర మానసిక వేదనకు గురవుతాడు."

మానసిక విశ్లేషణలోని ఈడిపస్ కంప్లెక్ ను గుర్తుచేసే కథ "అమ్మ". ఈ కథ చాలా చిన్న కథ. అయినప్పటికీ ఓ యువకుడి మానసిక విశ్లేషణ ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ కథలో ప్రధాన పాత్రలకు పేరు ఉండదు. కథలో అమ్మగా చెప్పబడే ప్రధాన పాత్ర ఓ వేశ్య. వయసు 25 సంవత్సరాలు ఉంటుంది. ఆమెది సాధారణమైన అందం. ఆమె చిన్నతనంలో అందరిలానే అల్లారుముద్దుగా పెరుగుతుంది. తండ్రి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతాడు. వారి కుటుంబం అప్పుల పాలై పోతుంది. మనోవేదనకు గురైన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో ఆమె ఒంటరిగా అయిపోతుంది. నా అనేవాళ్ళు ఎవరూ ఉండరు. ఈ పరిస్థితుల్లో ఆమెకు చలపతి అనే ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. అతను చాలా మంచి వాడు, అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వ్యభిచార వృత్తిలోకి దిగుతుంది. చలపతికి పదేళ్ల కుమారుడు ఉంటాడు. ఒక రోజు చలపతి కూడా దురదృష్ట వశాత్తూ మరణిస్తాడు. దీంతో చలపతి కుమారుడిని ఆమె తెచ్చుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. ఆ అబ్బాయికి 17 సంవత్సరాలు వస్తాయి. పెంపుడు తల్లి చేసే అసాంఘిక పనులను ఆ యువకుడు గమనిస్తాడు. ఇంటికి వచ్చి వెళ్లే విటుల మీద ఆ యువకుడికి ఎంతో కోపం, ఈర్ష, ద్వేషం కలుగుతుంది. అలాగే తన పెంపుడు తల్లి మీద ఆ యువకుడికి మొహం కలుగుతుంది. కథలో ఇక్కడే ఈడిపస్ కాంప్లెక్స్ భావనలు కనిపిస్తాయి. ఓ రోజు పెంపుడు తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యువకుడు వెళ్లి ముద్దు కావాలంటాడు. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ముద్దు అడగడంతో ఆమె నుదుటిపై ముద్దు పెడుతుంది. ఆ యువకుడు తన పెంపుడు తల్లి ఒడిలో పడుకుంటాడు. అప్పుడు ఆ యువకుడి మదిలో అనైతిక ఆలోచనలు వస్తాయి. పెంపుడు తల్లి తన కుమారుడి తల నిమురుతూ.. ఆమె అతన్ని తన గుండెలకు అదుముకుంది. 

అతని వీపు చుట్టూ చేతులు వేసి "నేనెప్పుడూ నీ దాన్నేరా కన్నా..!  నాకు నీవు దేవుడిచ్చిన బిడ్డవు. నేనెంత వేశ్యనైనా స్త్రీనే. తల్లి అయ్యే అదృష్టం ఓ ధనికుడు ప్రసాదించిన రోగం వల్ల పూర్తిగా నాశనమై పోయింది. నా ఒంటరి జీవితానికి తోడుగా భగవంతుడు నిన్ను పంపించి మాతృ హృదయం అనుభవించే తీయటి అనుభూతిని నాకు ప్రసాదించాడు." (నిశ్శబ్ద సంగీతం, పుట 67) అంటూ ఆమె చెబుతుంది. 

ఈ మాటలు ఆ యువకుడి హృదయాన్ని కడిగి వేస్తాయి. ఆ యువకుడిలో పశ్చాత్తాపం కలుగుతుంది. తల్లి కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో కాళ్లు కడుగుతాడు.

ఆమ్మ కథలో ఉన్న 17 ఏళ్ల యువకుడిలో ఈడిపస్ కాంప్లెక్స్ లక్షణాలు కనిపిస్తాయి. "ఫ్రాయిడ్ సిద్దాంతం ప్రకారం ఆడపిల్లలకు తొలి ప్రియుడు తండ్రి. మగపిల్లాడికి తొలి ప్రేయసి తల్లి. తల్లికి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోగానే అబ్బాయికి తండ్రి మీద కోపం వచ్చేస్తుంది. శత్రువులా కనిపిస్తాడు. అతనిని హత్య చేద్దామనే భావన కూడా కలుగుతుంది. ఈ విపరీతమైన భావనని ఫ్రాయిడ్ ఈడిపస్ కాంప్లెక్స్ అన్నాడు."5 

ఫ్రాయిడ్ చెప్పినట్లే కథలోని 17 ఏళ్ల యువకుడు మోహించింది తన తల్లినే. కానీ ఆమె సొంత తల్లి కాదు. పెంపుడు తల్లి. చివరికు ఆ యువకుడు తన తప్పు తెలుసుకుని తీవ్ర పశ్చాత్తాపానికి లోనై తన పెంపుడు తల్లి కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో కాళ్లు కడుగుతాడు.అమ్మ కథలో ఫ్రాయిడ్ చెప్పిన ఈడిపస్ కాంప్లెక్స్ సిద్ధాంత భావనలు అర్థం చేసుకోవచ్చు. తల్లి మీద ఉండే ప్రేమ, ఆప్యాయతలు ఈడిపస్ కాంప్లెక్స్ లో మొహంగా మారే అవకాశం ఉంటుంది. కథలో తన తల్లి దగ్గరకు వచ్చే విటులను చూసి ఈర్ష్య, ద్వేషంతో ఆ యువకుడి హృదయం రగిలిపోతుంది. ఇది కూడా ఈడిపస్ కాంప్లెక్స్ ముఖ్య లక్షణం. కథ చివరలో ఆ యువకుడిలో మార్పు కనిపించేలా సలీం కథను మలిచారు. అమ్మ కథ చిన్నదైనా ఇందులో మనో విశ్లేషణ సిద్ధాంతం కనిపిస్తుంది.

3.2.  డెల్యూషనల్ డిజార్డర్ (అనుమానం) - యద్భావం :

ప్రతి చిన్న విషయానికి భయపడడం,  ప్రతి చిన్న సంఘటనలనూ పెద్దగా అనుమానించడం కొందరి వ్యక్తుల ప్రవర్తనలో కనిపిస్తూ ఉంటుంది. భయపడడానికి కారణం ఉంటే పర్వాలేదు కానీ, కారణం లేకుండా అకారణమైన భయం మానసికరుగ్మతను సూచిస్తుంది. అకారణంగా అనుమానించడం కూడా ఓ పెద్ద మానసిక రుగ్మత. అనుమానం పెనుభూతం అంటారు. అంటే అకారణంగా అనుమానించడం మొదలు పెడితే  అది పెరిగిపోయి అతి పెద్ద భూతంగా మారి ఎవరైతే అనుమానంతో బాధపడుతున్నారో వారినే తిరిగి మింగి వేసే ప్రమాదం ఉంటుందని చెబుతారు. ఇలాంటి మానసిక పరిస్థితులను మనోవిజ్ఞానశాస్త్రంలో డెల్యూజనల్‌ డిజార్డర్‌ అంటారు.

డెల్యూషన్‌ అంటే వాస్తవాన్ని చూడకుండా తమ మనసులోనే ఏవేవో అపనమ్మకాల్ని పెట్టుకుని, అవే నిజమనుకునే భ్రమలో ఉండటం. కొందరు వ్యక్తులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కానీ వారిలో ఏవో అనుమానాలు నిత్యం వెంటాడుతూ ఉంటాయి. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా తీవ్రమైన అనుమానంతో బాధపడుతూ ఉంటారు. అతి పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి సోకిందేమోనని భయపడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు తరచుగా వైద్యుల వద్దకు వెళ్తారు. వైద్యులు వారికి ఏ జబ్బు లేదని చెప్పినా వారికి నమ్మకం కుదరదు. ఖరీదైన పరీక్షలన్నీ చేయించి ఇందులో మీకు ఏ జబ్బు లేదని వైద్యులు చెప్పినా వారిలో అనుమానం తీరదు. తరచూ వైద్యులను మారుస్తూ ఉంటారు. ఇలాంటి మానసిక సమస్యతో బాధపడే ఓ మహిళ కథే "యద్భావం". ఈ కథలో విస్మిత అనే మహిళకు డెల్యూషనల్ డిజార్డర్ వుంటుంది.

విస్మిత 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అనారోగ్యంతో మంచం పడుతుంది. ఆమెకు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి ఉంటుంది. విస్మిత తల్లి నరకం అనుభవిస్తూ చనిపోవడాన్ని విస్మిత కల్లారా చూస్తుంది. చిన్నప్పుడు జరిగిన ఆ సంఘటన విస్మిత మనసులో బలంగా ముద్ర పడుతుంది. కొన్నేళ్ళకు విస్మిత పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆమెకు వచ్చే ప్రతి చిన్న అనారోగ్యాన్ని తీవ్రమైనదిగా ఊహించుకుంటూ ఉంటుంది. ఈ విషయాన్ని భర్త గమనిస్తాడు. ఎంతో సానుకూలంగా అర్థం చేసుకొని ఆమెకు అర్థమయ్యేటట్లు చెబుతాడు. నువ్వు అనుమానిస్తున్నట్లు ఏమీ లేదని వివరిస్తూ ఉంటాడు. కానీ విస్మిత ఏమీ పట్టించుకోదు. ప్రతి చిన్న అనారోగ్య సమస్యనూ క్యాన్సర్ అని ఊహించుకొని భయపడుతూ ఉంటుంది.

"నీకో ఇంగ్లీష్ సూక్తి తెలుసు కదా.. క్రాస్ ది బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్... వంతెన వచ్చాకే దాన్ని దాటాలి. కొన్ని మైళ్ళ దూరంలో వంతెన ఉందో లేదో తెలీకుండానే దాన్నెలా దాటాలా అని మథనపడే మనస్తత్వం మానుకో. నీ భయాలేమైనా ఉంటే నాతో పంచుకో" (చదరపు ఏనుగు, పుట. 136) అంటూ భర్త, విస్మితకు చెబుతూ మానసిక ధైర్యాన్ని అందిస్తూ, సానుకూలంగా ఆమెలోని భయం పోగొట్టలని ప్రయత్నిస్తూ ఉంటాడు. 

కానీ విస్మిత వినదు. ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు వైద్యుల వద్దకు వెళుతుంటుంది. భర్త ఎంతో మంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి ఎన్నో రకాల ఖరీదైన వైద్య పరీక్షలు చేయించి ఎలాంటి జబ్బులేదని చెప్పినా కానీ ఆమెలో నమ్మకం కుదరదు. ఇలానే విస్మితకు నలభై ఏళ్ళ వయసు వస్తుంది. కానీ ఆమె నలభై ఏళ్లకే అరవై ఏళ్ళ వృద్ధురాలిగా కనిపిస్తూ ఉంటుంది. జుట్టు ఊడిపోతుంది, మొఖం మడతలు పడిపోతాయి, ఎప్పుడూ ఏదో దిగులు, ఆదుర్త, కంగారుతో ఉంటుంది. తన రొమ్ములో ఏవో గడ్డలు ఉన్నాయని అవి క్యాన్సర్ గడ్డలని అనుమానిస్తూ ఉంటుంది. ఇదే అనుమానంతో వైద్యుల దగ్గరకు వెళ్తారు. విస్మితకు అన్ని పరీక్షలు చేసిన వైద్యులు నిజంగానే క్యాన్సర్ అని నిర్ధారిస్తారు. విస్మిత ఇరవై ఏళ్ల వయసులో పడిన అనుమానం నలభై ఏళ్ల వయసులో నిజమవుతుంది. 

అప్పుడు "నేనెప్పటి నుంచో చెబుతున్నాను కదా డాక్టర్ ! మీరే నమ్మలేదు. ఇప్పటికైనా నమ్ముతారా నాది ఉత్త భయం కాదని.. నిజమని" (చదరపు ఏనుగు, పుట 143) అంటుంది విష్మిత. 

అనుమానం అనే మానసిక రుగ్మతతో బాధపడే ఓ మహిళ మనోవిశ్లేషణలను యద్భావం కథ ద్వారా సలీం చెప్పారు. కథ చివరిలో రచయిత కొసమెరుపు అందించారు. అనుమానం పెరుగుతూ ఉంటే శరీరం దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ కొన్ని సంవత్సరాల తరువాత అదే అనుమానం నిజమయ్యే అవకాశం ఉంటుందనేది కొసమెరుపు. మనసు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. అందుకే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలనేది యద్భావం కథలోని సందేశం.

3.3. నెగిటివ్ థింకింగ్ ( ప్రతికూల ఆలోచనలు ) - జారుడు మెట్లు:

జారుడు మెట్లు కథలో రజినీ ప్రసాద్ ప్రతికుల ఆలోచనలు కలిగిన వ్యక్తి. ఈ కారణంగానే అతనిలో ఈర్ష్యా స్వభావం ఎక్కువగా ఉంటుంది. అతను ఏ విషయంలోనూ సంతృప్తిగా జీవించలేడు. కథానాయకుడు రజనీ ప్రసాద్  జీవితాన్ని ఆస్వాదించడం, అసలు జీవించడం అంటేనే తెలియదని చెప్పాలి. అతనిలో ఇటువంటి మానసిక ప్రవర్తన ఏర్పడడానికి కారణం రజినీ ప్రసాద్ చిన్ననాటి పరిస్థితులు. అతను పెరిగిన వాతావరణం అతని మనసుపై బలమైన ప్రతికూల ఆలోచనలు ఏర్పడటానికి కారణం అవుతాయి. రజనీ ప్రసాద్ ఓ ప్రభుత్వ బ్యాంకులో క్లర్క్ గా  ఉద్యోగం చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పుట్టి పెరిగిన రజినీ ప్రసాద్ ఎంతో కష్టపడి చదువుకుంటాడు. పదో తరగతిలో జిల్లాలో మొదటి స్థానంలో పాస్ అవుతాడు. పాఠశాలలో ఎప్పుడు ముందుండే రజినీ ప్రసాద్ ఎప్పుడైనా పొరపాటుగా రెండో స్థానంలో ఉన్నా ఎంతో బాధపడేవాడు. కారణం.. ఎప్పుడూ తనే ఫస్ట్ ఉండాలని కోరిక. అలాగే ఇంటర్, డిగ్రీ పూర్తి చేస్తాడు. పేదరికం, ఆర్థిక పరిస్థితుల కారణంగా అంతకు మించి చదువుకోలేని పరిస్థితి. దీంతో పదవ తరగతి మార్కులు ఆధారంగా పోస్టల్ శాఖలో వచ్చిన పోస్టుమెన్ ఉద్యోగంలో చేరిపోతాడు రజనీ ప్రసాద్. ఆ పోస్టు మెన్ ఉద్యోగం నచ్చక కొన్నాళ్లకు రాజీనామా చేసి ప్రభుత్వ బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం సంపాదిస్తాడు. అందమైన భార్య, ఆరు నెలల కొడుకు... ఆనందంగా సాగాల్సిన కుటుంబం వారిది. కానీ, రజనీ ప్రసాద్ మనసు ఎప్పుడూ అసంతృప్తితో, ప్రతికూల ఆలోచనలతో నిండి ఉంటుంది. చేస్తున్న పనిని ప్రేమించలేని మనస్తత్వం. 

తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఎప్పుడు నిరుత్సాహ భావన. దీంతో ఎప్పుడూ సమాజం మీద, ఇంట్లోనూ చికాకు పడుతూ ఉంటాడు. ఇలా ఉండగా, తను పనిచేసే బ్యాంకులో కొత్తగా ప్రొబెషనరీ ఆఫీసర్ వస్తాడు. అతను ఎవరో కాదు. రజినీ ప్రసాద్ చదువుకునే రోజుల్లో రజినీ ప్రసాద్ జూనియర్, అంతే కాదు, రజినీ ప్రసాద్ నడిపిన ట్యూషన్ లో అతని దగ్గిరే పాఠాలు విన్నవాడు. తన దగ్గర పాఠాలు చెప్పించుకున్న వాడు తనకే ఆఫీసర్ గా రావడం రజినీ ప్రసాద్ జీర్ణించుకోలేకపోతాడు. ఇంటికి వచ్చి కోపంతో ఎగిరెగిరి పడతాడు. తన బతుకేంటి ఇలాగే ఉండిపోయిందని నిరుత్సాపడతాడు. క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలు రాయాలనుకుంటాడు.

ఇదే విషయాన్ని భార్యతో.. "ఈ రోజు మా ఆఫీసులో కొత్తగా ప్రొఫెషనరీ ఆఫీసర్ ఒకతను జాయిన్ అయ్యాడు. అతను ఎవరో కాదు మాకు మూడేళ్ల జూనియర్. మా ఇంటి దగ్గరే ఉండేవాడు. నేను సాయంత్రాలు ట్యూషన్ చెప్పేవాడిని. పరమ మొద్దు.. బాగా తిట్టి మరి చెప్పేవాడిని... " (స్వాతి చినుకులు, పుట 25)

ఇలా తన పై అధికారి గురించి చాలా తక్కువ చేసి చెబుతాడు. భార్య నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా రజినీ ప్రసాద్ మాట వినడు. ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. నిరంతరం ఏదో రూపంలో తనకు ఎదురుపడే తన స్నేహితులు తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నారని తెలుసుకొని తట్టుకోలేకపోతాడు రజనీ ప్రసాద్.

ఉద్యోగానికి రాజీనామా చేసి.. "బాధ వదిలిందోయ్.. ప్రతివాడూ బ్యాంకు ఉద్యోగమే. మొన్న రోడ్డు మీద శ్రీనివాస్ కనిపించాడు. వాడికి కాలేజీలో ఉన్నప్పుడే బట్టతల ఉండేది. పొట్ట కోసినా అక్షరం ముక్క రాని ఫూల్. స్కూల్లో చదువుకునే రోజుల్లో సుబ్బారావు మాస్టరు చావగొడుతూ ఉండేవాడు. పశువుల్ని మేపడానికి కూడా పనికిరావురా వెధవా అని తిట్టేవాడు. అలాంటివాడు బ్యాంకులో ఉద్యోగే. ఛా.. ఛా ..ఈ దేశం, ఈ వ్యవస్థ బాగుపడేది ఎప్పుడో అర్థం కావడం లేదు. ఓవైపు నిరుద్యోగ సమస్య అంటూనే మరోవైపు అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి.." (జారుడు మెట్లు, పుట. 27) అంటూ ఎప్పుడూ వ్యవస్థని తిట్టుకుంటూ, తనలో తాను గొణుక్కుంటూ ఉంటాడు.

కాళ్ళా, వేళ్ళ పడితే ఉద్యోగాలు వచ్చాయని, అడ్డదారుల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారని అభాండాలు వేస్తూ సమాజంపై విపరీతమైన ఈర్ష్యను పెంచుకుంటాడు. క్రమంగా రజనీ ప్రసాద్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆర్థికంగా కుటుంబం చితికి పోతుంది.

ఓ రోజు భార్యతో.. " అన్నపూర్ణా.. నాది చాలా నిరర్థకమైన  బ్రతుకు. ఈ అశాంతిని నేను భరించలేను. నాకు ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. ఈ మనుషులు ఎవరు కనిపించని చోటుకి.. నన్నెవరూ కించపరచని చోటుకి.. నా అసమర్ధత గురించి... వైఫల్యాల గురించి.. ఎవరూ ఎగతాళిగా నవ్వుకోని చోటికి.. ఎక్కడికైనా ఒంటరిగా.. ఈ భవబంధాలకు దూరంగా.. శాంతిని వెతుక్కుంటూ.. " (జారుడు మెట్లు, పుట. 31) అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు.

అప్పటికే అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. రజనీప్రసాద్ కు ఓరోజు గుండెపోటు వస్తుంది. హడావుడిగా ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ గుండె వైద్యుడు తన జూనియర్. రజిని ప్రసాద్ ఈర్ష్య మరింత పెరుగుతుంది అంతే గుండెపోటుతో మరణిస్తాడు. ఈ కథ కథానాయకుడి మానసిక ప్రవర్తనకు అద్దం పడుతుంది. ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తుల జీవితాలు ఎంత కష్టతరంగా మారుతాయో అర్థమవుతుంది.

"మంచి చెడు ఏమీలేదు కానీ ఆలోచన అలా చేస్తుంది" అంటారు విలియం షేక్స్పియర్. బాల్యం నుంచి పెరిగిన వాతావరణం, గత అనుభవాలు, పరిసరాల ప్రభావం, మానసిక ఒత్తిడి, ఆందోళన, అంతర్గతంగా ఉండే మానసిక సమస్యల కారణంగా కొందరు వ్యక్తులు నిత్యం ప్రతికూల ఆలోచనలు (నెగిటివ్ థింకింగ్) చేస్తూ ఉంటారు. వీరి ఆలోచనలో సానుకూల భావనకు చోటే ఉండదు. వారి జీవితంలో అన్ని సక్రమంగా ఉన్నా ఏదో  తీరని అసంతృప్తి ఉన్నట్లు వారి ఆలోచనా, ప్రవర్తన వుంటుంది. వారి ఆలోచనల ప్రభావం వారి జీవితాన్ని దిగజారుస్తుంది. వారి జీవితం పతనావస్థకు చేరుతుంది. ప్రతికూల ఆలోచనలు అనేవి ఓ ఊబి లాంటివని మానసిక వైద్యులు చెబుతుంటారు. అందులోకి దిగిన వ్యక్తులు బయటకు రావాలని ఎంత ప్రయత్నిస్తే అంత బలంగా తిరిగి ఊబిలోకే కూరుకుపోతుంటారు. ప్రతికూల ఆలోచనలు చేసే వ్యక్తులు ఆ పరిస్థితి నుంచి బయట పడాలంటే కొన్నిసార్లు మానసిక మార్గదర్శకుల (సైకాలజిస్ట్) అవసరం పడుతుంది. లేదంటే జారుడు మెట్లు కథలో కథానాయకుడు రజనీ ప్రసాద్ వలె జీవితం విషాదాంతం అవుతుంది.

3.4. ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్ (ఆత్మ నూన్యతా భావం)  - నీడ :

ప్రముఖ మానసికవైద్యుడు ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతాలలో ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ముఖ్యమైనది. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తులలో అభద్రతాభావం, భయం వంటి భావనలు కనిపిస్తాయి. వ్యక్తులు వారు పెరిగిన వాతావరణం,  పరిస్థితులు, ఇతర వ్యక్తుల పరిచయాలు, జీవితంలో ఎదురైన సంఘటనల వంటివి చిన్నతనంలోనే వారి మానసిక స్థితిపై ప్రభావం చూపి పెరిగి పెద్దయిన తర్వాత ఆత్మ నూన్యతా భావంగా మారే అవకాశం ఉంటుంది.

"వ్యక్తుల మధ్య తేడాలను అల్ఫ్రెడ్ ఆడ్లర్ వివరించాడు. వ్యక్తికి, వ్యక్తికి మధ్య తేడాలు ఉండేదానికి గల కారణం బాల్యజీవితంలో, చిన్నతనంలో వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణంలో తేడాలు ఉండడమే. దీనినే వైయుక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం" అని ఆడ్లర్ పేర్కొన్నారు.6

వైయుక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం వ్యక్తికి వ్యక్తికి మధ్య వారి ప్రవర్తనలో ఎన్నో తేడాలు ఉంటాయి. కొందరు ప్రతి విషయానికి భయపడతారు. వారి భయం ఇతరులకు స్వల్ప విషయంగా అనిపించవచ్చు. అలాంటి అకారణ భయాలను మానసిక వైద్య నిపుణులు ఫోబియా అని చెప్పారు. మనిషిలో భయం ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కారణాలలో బాల్యంలో జరిగే సంఘటనల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఇలా బాల్యంలో జరిగిన సంఘటనల ప్రభావంతో పెరిగి పెద్దవాడైన తర్వాత ఓ వ్యక్తి ప్రవర్తనను ఎలా ప్రభావితం చేశాయో "నీడ" కథలో తెలుసుకోవచ్చు.

"నీడ" కథలోని కథానాయకుడి పాత్రకు పేరు లేదు. రచయితే కథ చెబుతున్నట్లుగా కథ సాగిపోతూ ఉంటుంది. పేరు లేని కథానాయకుడికి ముప్పై ఏళ్ల వయసు ఉంటుంది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఓ రోజు కార్యాలయం పని మీద బాపట్ల వెళ్లి రావలసిందిగా ఉన్నతాధికారులు అతన్ని ఆదేశిస్తారు. బాపట్ల వెళ్లి రావడం కుదరదని ఎంత మొత్తుకున్న ఉన్నతాధికారులు ఒప్పుకోరు. తప్పనిసరి పరిస్థితుల్లో కథానాయకుడు బాపట్ల వెళ్లడానికి బయలుదేరుతాడు. ముందుగానే ట్రైన్ రిజర్వేషన్ చేయించుకుంటాడు. సూట్ కేస్ పట్టుకొని బాపట్ల వెళ్లే రైలు కోసం అతను ఎదురుచూస్తూ ఉంటాడు. కథ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అతను బాపట్ల పేరు వింటేనే నిలువెల్లా వణికిపోతాడు. బాపట్ల పేరు ఎత్తితేనే భయపడిపోతాడు. ట్రైన్ వచ్చే సమయం అవుతుంది. అతనికి చిరు చెమటలు పడతాయి. రైల్వే ప్లాట్ఫారం పైన ఎవరిని చూసినా వారు బాపట్లకు చెందిన వాళ్ళుగా భ్రమ పడతాడు. ఎవరు తనను గుర్తించి నువ్వు వెంకట్రామయ్య కొడుకువి కదా అంటూ పలకరిస్తారేమోనని అతని భయం. దానికి కారణం అతని చిన్నతనంలో జరిగిన అతి ఘోరమైన సంఘటన.

కథానాయకుడి తండ్రి పేరు వెంకటరామయ్య. బాపట్లలో కుటుంబంతో కలిసి వెంకటరామయ్య నివాసం ఉంటాడు. హాయిగా సాఫీగా సాగిపోయే వారి కుటుంబ జీవితంలో అనుకొని సంఘటన ఆ కుటుంబాన్ని పతనం చేస్తుంది. వెంకట్రామయ్య భార్య వేరొక వ్యక్తితో కలిసి లేచిపోతుంది. ఈ అవమానం భరించలేక వెంకటరామయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. పదేళ్ల వయసున్న కధానాయకుడు బంధువుల ఇంటికి వెళ్లి చదువుకుని అక్కడే పెరిగి పెద్దవాడై హైదరాబాదులో ఉద్యోగం సంపాదిస్తాడు. చిన్నతనంలో తన కుటుంబంలో జరిగిన ఘోరమైన సంఘటన కథానాయకుడి మనసుపై బలమైన ముద్ర వేస్తుంది. అప్పటి నుంచి అతను భయంతో, ఆత్మ నూన్యతతో పెరిగి పెద్దవాడు అవుతాడు. ముఖ్యంగా బాపట్ల అన్నా, చిన్నపుడు తనకు తెలిసిన వారు ఎవరైనా కనిపించినా అతను తీవ్రమైన భయానికి ఆత్మ నూన్యతకు లోనవుతాడు. అతను రైలు ఎక్కినా ఎవరిని చూసినా భయపడతాడు. ముఖానికి కర్చీఫ్, పేపర్ అడ్డుపెట్టుకుని ఓ మూలన నక్కి కూర్చుంటాడు. ఇంతలో ఓ పెద్దావిడ నువ్వు వెంకట్రామయ్య కొడుకువి కదూ అంటూ ఆ వ్యక్తిని గుర్తుపడుతుంది. గుర్తు పట్టటమే కాదు.. అందరూ వినేట్టు పెద్దగా.. 

"తెలియకపోవడం ఏమిటే.. మనింటి దగ్గరే ఉండేవాళ్ళు పాపం.. ఎలాంటి కుటుంబం ఎలా చితికిపోయిందో.. సముద్ర తీరానికి ఏ షికారుకు వెళ్ళినప్పుడు గోచి మాత్రమే ఉన్న ఆ బెస్తవాన్ని చూచి మోహించిందో ఏం పాడో వీళ్ళమ్మ వాడితో లేచిపోయి ఆ గుడిసెల్లో కాపురం పెట్టింది. వీళ్ళ నాన్న అవమానం భరించలేక దూలానికి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఈ అబ్బాయి ఇల్లు వదిలి ఎక్కడికో పారిపోయాడు అని చెప్పుకునే వాళ్లు. నీవు మీ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకో బట్టే నీకు ఈ విషయాలు తెలియదు " (స్వాతి చినుకులు, పుట 63) అంటూ పెద్దగా చెబుతుంది.

అంతే అతను నిలువెల్లా వణికిపోతాడు. "అయ్యో కర్మ నేను వెంకట్రామయ్య వాళ్ళ అబ్బాయిని కాదంటే వినరేం. మా నాన్న గారి పేరు జానకిరామ్.. బ్రతికే ఉన్నాడు.." (స్వాతి చినుకులు, పుట 64) అంటూ ఏదో నోటికి వచ్చిన సమాధానం చెప్పి మరో స్టేషన్లో దిగి తన ఉద్యోగం పోయినా పర్లేదు బాపట్ల వెళ్లకూడదని తిరుగు ప్రయాణం అవుతాడు.

ఈ కథలో ఇతివృత్తం చాలా సాధారణమైనది. కథా సన్నివేశం రైలు ప్రయాణం మాత్రమే. అయినప్పటికీ ఆ వ్యక్తి తాలూకా భయం, ఫోబియా, ఆత్మ నూన్యతా భావాలు మనో విశ్లేషణ కోణంలో రచయిత చెప్పారు. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు వ్యక్తుల ప్రవర్తన మీద ఎలాంటి బలమైన ముద్రలు వేస్తాయో నీడ కథ ద్వారా అర్థమవుతుంది. సమాజంలోని కొందరు వ్యక్తులు ఎప్పుడూ ఇతరులను హేళన చేయాలని ప్రయత్నిస్తూనే వుంటారు. ఇతరుల పరిస్థితులను ఆసరాగా చేసుకొని మానసిక స్వారీ చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తులకు భయపడితే అకారణ భయాలు మనసులో నిలిచిపోతాయి. ఇతర వ్యక్తుల హేళనకు లొంగిపోతే జీవితంలో పైకి ఎదగడం కష్టంగా మారిపోతుంది. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు వ్యక్తిలోని భయాలు కూడా ఎగిరిపోతాయి. మనిషిలోని అంతర్గత సంఘర్షణకు, ఆలోచనలకు అద్దం పట్టే కథ నీడ.

4. ముగింపు:

"శరీరాని కంటే ఆత్మకే ఎక్కువ జబ్బులు" అంటారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. మానసిక ఆలోచనలను సక్రమమైన మార్గంలో  ఉంచడానికి సాహిత్యం ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో రచించబడిన మనోవిశ్లేషణ కథలు, నవలలు తెలుగు సాహిత్యంలో పాఠకులను ఆకట్టుకున్నాయి. మనోవిశ్లేషణ సిద్ధాంతాలను సాహిత్యంలో మిళితం చేయాలంటే రచయితకు లోతైన పరిజ్ఞానం అవసరం. అటువంటి లోతైన పరిజ్ఞానంతో సలీం తన కథల్లో మనోవైజ్ఞానిక సిద్ధాంతాలను మిలితం చేశారు. సలీం రచించిన మనోవిశ్లేషణ కథల్లో కథావస్తువు, ఇతివృత్తం, మనోవైజ్ఞానిక సిద్ధాంతాలను విడివిడిగా పరిశీలించినప్పుడు..

 1. అమ్మ కథలోని యువకుడిలో ఈడిపస్ కాంప్లెక్స్ లక్షణాలు గమనించవచ్చు. 
 2. యద్భావం అనే కథలో కథానాయకి విస్మితలో డెల్యూజనల్ డిజార్డర్ కనిపిస్తుంది. 
 3. జారుడుమెట్లు కథలో కథానాయకుడు రజనీప్రసాద్ కు ఉన్న నెగటివ్ థింకింగ్ వల్ల అతని జీవితం పతనమవుతుంది. 
 4. నీడ కథలోని కథానాయకుడిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనిపిస్తుంది. 

మనిషి మానసిక ప్రవర్తనను అర్థం చేసుకున్నప్పుడు వాటి పరిష్కార మార్గాల అన్వేషణ కూడా సులభతరం అవుతుంది. ఇందుకోసం సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.

5. పాదసూచికలు:

 1. సిగ్మండ్ ఫ్రాయిడ్, తెలుగు అకాడమి, పుట 2
 2. ఆధునిక తెలుగు కథ -  మనోవిశ్లేషణ, పుట 92 
 3. సిగ్మండ్ ఫ్రాయిడ్, తెలుగు అకాడమి, పుట 1
 4. ఆధునిక తెలుగు కథ - మనోవిశ్లేషణ, పుట 35
 5. ఆధునిక తెలుగు కథ - మనోవిశ్లేషణ,  పుట 34
 6. ఆధునిక తెలుగు కథ - మనోవిశ్లేషణ, పుట 47

6. ఉపయుక్తగ్రంథసూచి:

 1. విజయ్ కుమార్. బి., ఆధునిక తెలుగుకథ-మనోవిశ్లేషణ, పీహెచ్.డీ. సిద్ధాంత గ్రంథం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, 2011.
 2. వెంకటేశ్వరరెడ్డి అన్నపరెడ్డి. సిగ్మండ్ ఫ్రాయిడ్, తెలుగు అకాడమి ప్రచురణ, హైదరాబాదు, మొదటి ముద్రణ 1985
 3. సలీం, స్వాతి చినుకులు. కథల సంపుటి, శ్రీ విజయ పబ్లికేషన్స్ , విజయవాడ, 1996
 4. సలీం, చదరపు ఏనుగు. కథల సంపుటి, శ్రీ విజయ పబ్లికేషన్స్, విజయవాడ, 2006
 5. సలీం, నిశ్శబ్ద సంగీతం. కథల సంపుటి, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు,1999

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]