headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. వరవరరావు కవిత్వం: స్త్రీవాదధోరణి

పంతంగి భాస్కర్

UGC NET-JRF పరిశోధక విద్యార్థి, తెలుగు విభాగం,
డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్. తెలంగాణ.
డిప్యూటీ తహశీల్దార్, ఘనపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
సెల్: +91 9492114479, Email: panthangibhaskar@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

వరవరరావు ఆరు దశాబ్దాలగా కవిత్వం రాస్తున్నారు. విస్తృత మైన సామాజిక స్పృహ కలిగిన రచయిత. ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక విషయాలపై పట్టున్న కవి. స్త్రీ, పురుషసమానత్వాన్ని కాంక్షించే వ్యక్తి. సమసమాజస్వాప్నికుడు, పీడితులకోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ద్వేషించవలసిన ప్రతిదీ ద్వేషించే,ప్రేమించవలసిన ప్రపంచాన్నంతా మనకందించే కవిత్వం కావాలని కోరుకున్న కవితాతాత్వికుడు, నిత్యచైతన్యశీలి, విశ్వమానవయాత్రికుడు వరవరరావు. స్త్రీవాదకోణంలో 1962 నుండి కవిత్వం రాస్తున్నప్పటికి, వరవరరావు కవిత్వాన్ని స్త్రీవాదకోణంలో ఇంతకు ముందు చెప్పుకోతగ్గ పరిశోధనలు జరగలేదు. వరవరరావు కవిత్వంలోని స్త్రీవాద ధోరణిని పరిశీలనాత్మక పద్ధతిని అనుసరించి చేస్తున్న పరిశోధన ఇది. వరవరరావు విస్తృత సామాజిక స్పృహతో తన కవిత్వంలో వెలిబుచ్చిన స్త్రీవాద అంశాల ద్వారా పాఠకులలో మార్పుని సాధించి స్త్రీలను గౌరవించేలా చేయాలని, వారి లక్ష్యాలను పాఠకలోకానికి తెలియజేయాలన్నది ఈ వ్యాస ఉద్దేశం. వారి కవిత్వం లోని స్త్రీవాదధోరణిని విశ్లేషించడం ఈ వ్యాసపరిధి. ఈ పరిశోధనకు సహకరించే విమర్శ పరిశోధన గ్రంథాలను సేకరించే క్రమంలో ప్రసిద్ధమైన గ్రంథాలయాలను సందర్శించాను. ప్రధానమైన రచనలను రచయితవద్ద నుండి సేకరించాను. అలాగే సాహితీవేత్తల ఇంటి గ్రంథాలయాలను (Home Libraries) కూడా సందర్శించి పరిశోధన వ్యాసరచనకు సహకరించే గ్రంథాలను సేకరించాను. సేకరించిన సమాచారం (ఆచార్య వెలుదండ నిత్యానందరావు విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన అనే గ్రంథం ఆధారంగా) మేరకు, రచయిత చెప్పిన విషయం ప్రకారం ఇప్పటివరకూ వరవరరావుకవిత్వం మీద విశ్వవిద్యాలయాలలో గానీ, మరే ఇతర సంస్థలలో గానీ ఎటువంటి పరిశోధన జరగలేదు. “వరవరరావు కవిత్వం - సామాజిక స్పృహ”లో భాగంగా ఉన్న “వరవరరావు కవిత్వం - స్త్రీ వాద ధోరణి” నే మొదటి పరిశోధన.

Keywords: పితృస్వామ్యం , లైంగిక హింస , స్త్రీ వాదం, కుటుంబ హింస, పురుషాధిపత్యం.

1. ఉపోద్ఘాతం:

పితృస్వామ్య వ్యవస్థ పునాదులతో ప్రపంచం మొత్తం పురుషాధిపత్య భావజాలం ప్రస్తరించింది. అది వివిధ పార్శ్వాలలో  స్త్రీజాతి అస్తిత్వాన్ని అణిచి వేసింది. ఈ దుస్థితి నుంచి స్త్రీలు విముక్తులు కావడం కోసం స్త్రీలు, పురుషులు కలసి పురుషాధిపత్య భావ జాలం మీద ప్రపంచ వ్యాప్తంగా తమ ధిక్కార స్వరాన్ని విన్పించారు. దీనికి సంబంధించిన సమస్త ఆలోచనలే స్త్రీవాద సిద్ధాంతం.

పురుషాధిపత్యభావజాల స్వభావాన్నీ, జెండర్ వివక్షనూ, కుటుంబ పరమైన హింస, వరకట్నం,మరియు   ఇంటి చాకిరి, బిడ్డల పెంపకం వంటి స్త్రీలశ్రమకు విలువ కట్టక పోవడం వంటి అంశాలను ప్రశ్నించడం స్త్రీ వాద ప్రధాన లక్షణాలుగా గుర్తిచారు . వరవరరావు కవిత్వంలో ఈ ప్రధాన లక్షణా లన్నీ ఆవిష్కరించ బడ్డాయి. వీటితో పాటు ప్రపంచీ కరణ సంస్కృతి స్త్రీ జాతిపై చూపిన ప్రభావాన్నీ, కొన్ని ఇతర అంశాలను కూడా స్త్రీ వాద దృక్కోణం  లోంచి వరవరరావు  విశ్లేషించారు. వీటన్నింటిని  ఈ వ్యాసంలో ఒక క్రమ పద్దతిలో పరిశీలించడమైనది.

2. వరవరరావు - సాహిత్య ప్రస్థానం :

వరవరరావు సాహితీ ప్రస్థానం 1957 నవంబర్లో అచ్చయిన సోషలిస్టు చంద్రుడుతో ప్రారంభం అయింది. తర్వాత  చలినెగళ్లు (1968), జీవనాడి  (1971), ఊరేగింపు (1974). స్వేచ్చ (1978), సముద్రం  (1983), భవిష్యత్తు చిత్రపటం (1986), ముక్తకంఠం (1990), ఉన్నదేదో ఉన్నట్లు (1996), ఆరోజులు (1998), దగ్ధమవుతున్న బాగ్దాద్ (2003), మౌనం ఒక యుద్ధ నేరం (2003), అంతస్సూత్రం (2006), బీజభూమి (2014) మొదలగు  కవితా సంపుటాలు వెలువడ్డాయి.వీటితో పాటు  సాహిత్య విమర్శ పుస్తకాలు  (ప్రజల మనిషి – ఒక పరిచయం – 1978; పి ఎచ్ డి సిద్ధాంత పత్రం ‘తెలంగాణ విమోచనోద్యమం – తెలుగు నవల: సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ’ (1983), కల్లోల కాలానికి కవితా దర్పణం – శ్రీశ్రీ మరొప్రస్థానం టీకా టిప్పణి – 1990; భూమితో మాట్లాడు – కల్పనా సాహిత్య వస్తు విశ్లేషణ – 2005; తెలంగాణ మాండలిక భాష – కాళోజీ – 2007; శ్రీశ్రీ భూమ్యాకాశాలు – 2010; సాహిత్యంలో సమాజ చలనపు ప్రతిఫలనం – 2013;సమరకవి సమయం – 2019 రచించారు.

సాహిత్య విమర్శతోపాటు  సామాజిక, రాజకీయ, సాంస్కృతికవిశ్లేషణలో భాగంగా  విద్యావిధానం – ఒక పరిశీలన – 1977, సహచరులు – 1989; సృజన సంపాదకీయాలు – 1990; మొదట మనం మానవులం, పౌరులం, ఆ తర్వాతే ఉద్యోగులం – 1991; సెక్యులరిజం – ఒక పరిశీలన – 1990; జైలు రాతలు – 2006; తెలంగాణ వ్యాసాలు – 2007; యహ్ క్యా జగే హై దోస్తో : పరాధీనత – స్వావలంబన – 2013; పోస్ట్ మార్టం – పోస్ట్ ట్రుత్ : దాడిచేస్తే దాగని సత్యాలు – 2017` లాంటి పుస్తకాలు రచించారు. వీటితో పాటు కెన్యన్ నవలా రచయిత గూగీ వా థియోంగో రాసిన నవల “ది డెవిల్ ఆన్ ది క్రాస్” ను “మట్టికాళ్ల మహా రాక్షసి”గా(1992),” జైలు డైరీ డిటెయిండ్” ను “బందీ”(1996) గా అనువదించారు.

3. వరవరరావు కవిత్వం:

వరవరరావు గారు ఆరు దశాబ్దాలగా  కవిత్వం రాస్తున్నారు, విస్తృత మైన సామాజిక స్పృహ కలిగిన రచయిత, ప్రపంచ రాజకీయ, ఆర్దీక, సామాజిక, శాస్త్ర సాంకేతిక విషయాలపై పట్టున్న కవి.  తన కలం నుండి   1957 నవంబర్లో అచ్చయిన సోషలిస్టు చంద్రుడు నుండి మొదలుకొని చలినెగళ్లు (1968), జీవనాడి  (1971), ఊరేగింపు (1974). స్వేచ్చ (1978), సముద్రం  (1983), భవిష్యత్తు చిత్రపటం (1986), ముక్తకంఠం (1990), ఉన్నదేదో ఉన్నట్లు (1996), ఆరోజులు (1998), దగ్ధమవుతున్న బాగ్దాద్ (2003), మౌనం ఒక యుద్ధ నేరం (2003), అంతస్సూత్రం (2006), బీజభూమి (2014) మొదలగు  కవితా సంపుటాలు అయన కలం నుండి వెలువడ్డాయి

4. వరవరరావు కవిత్వం- స్త్రీవాదధోరణి:

చలినెగల్లు కవితా సంపుటిలో రాఖీ బంధన్(1962),అకవితా వస్తువు?(1963), ఆకలి? కవితలు.జీవనాడి కవితా సంపుటిలో 1965 లో రాసిన, తప్పిపోయిన శిశువు,అంగార శిశువు, భవిష్యత్తు చిత్రపటం కవితా సంపుటిలో  “అక్కయ్య కోసం”, ముక్తకంఠం లో   చునరీ,  గీత, సునీత కథ, భర్తృక డైరీ, చునరీ, అమ్మ,చౌరస్తాలో చార్మినార్ మొదలగు కవితలు ఉన్నాయి.బీజ భూమి కవితా సంపుటిలో “నర్సింగ్”, రేప్, అమ్మ జ్ఞాపకాలు, బదాయూఁ 1, 2, 3, మొదలగు కవితలలో స్త్రీ  వాద ధోరణి కనిపిస్తుంది.

సమాజంలోని అన్ని రంగాల్లో నిరాటకంగా కొనసాగుతున్న, చెలామణి అవుతున్న పురుషాధిక్యత స్వభావాన్ని ప్రశ్నిస్తూ, దాని మార్చే దిశగా ఆడవాళ్లనీ, మగవాళ్లనీ కూడా చైతన్యవంతులను చేసి ఒక మంచి మానవ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా నడవాలన్నదే స్రీవాద సాహిత్యం అంతిమ లక్ష్యం”¹.

వరవరరావు  కవిత్వంలో స్త్రీవాదధోరణికి సంబంధించిన విషయాలను కింది శీర్షికల కింద విశ్లేషించవచ్చు.

 1. పితృస్వామ్యం -  పురుషాధిక్యత
 2. కుటుంబహింస
 3. వివాహవ్యవస్థ, వరకట్నం
 4. లైంగికహింస
 5. వేశ్యావృత్తి 

4.1 పితృస్వామ్యం - పురుషాధిక్యత:

వ్యక్తిగతం గాను, కుటుంబ పరం గానూ, సామాజికంగాను  ఇతర అన్ని రంగాలలోనూ స్త్రీ కంటే పురుషుడు అధికుడని, స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలన్న భావనను స్థూలంగా పురుషాధిపత్య భావజాలం అనవచ్చు. ఈ పురుషాధిపత్య భావజాలం కేవలం పురుషులలోనే ఉండాలన్న నియమం లేదు. ఈ భావజాలంలో పెరగడం వల్ల స్త్రీ కూడా చాలా సందర్భాలలో ఆ భావజాలానికి తలవొగ్గే ఉంటుంది. అనగా పురుషాధిపత్యాన్ని ప్రశ్నించని స్త్రీలంతా పురుష భావజాలం కలిగిన వారు గానే పరిగణించ బడతారు.

పురుషాధిపత్య భావజాలానికి స్థిరమైన రూపం ఉండదు. అది వివిధ పార్శ్వాలలో  విస్తరించి ఉంటుంది. వివిధ మూలల్లో తన మూలాలను స్థిరపరచి ఉంటుంది.వరవరరావుకవిత్వంలో ఈ పార్శ్వాలను , ఈ మూలల్నీ, ఈ మూలాల్ని విశ్లే షిద్దాం.

వరవరరావు రచించిన జెండర్ చైతన్యానికి సంబంధించిన కవిత “చునరీ” ఇది, స్త్రీగా పుట్టడం వల్ల తనుబలహీనురాలని, తను ఏ నిర్ణయాలు తీసుకోలేదని, సున్నిత మనస్కురాలని, కొన్ని లక్షణాలను తన ప్రమేయం లేకుండానే  సమాజం స్త్రీకి ఆపాదించింది. స్త్రీకి ఆపాదించబడేటువంటి ఈ గుణాలను తను కూడా ఎటువంటి వ్యతిరేకత చెప్పకుండా ఆమోదిస్తుంది.

ఒక స్త్రీ పుట్టుక నుంచి పుడకలదాకా ఏ రకంగా తన ప్రమేయం లేకుండా తన జీవితంలో ప్రముఖమైన ఘట్టాలని గడిచిపోతాయో స్త్రీ ఎలా వాటిని భరిస్తూ ముందుకు వెళ్తుందో  కవి “చునరీ” కవితలో వివరించారు.

స్త్రీకి తన ప్రమేయం లేకుండానే వివాహ బంధంలోకి వెళ్లడం జరుగుతుంది ఇది తొలి మెట్టు, వివాహ తంతు ముగిసిన తర్వాత అప్పగింతల నాటి రాత్రి నుంచి ప్రారంభమయ్యేది దాంపత్య  జీవితం, బలవంతంగా స్త్రీని సంసార సాగరంలోకి నెట్టేయడం , చివరికి భర్త చనిపోతే భర్తతో పాటే భార్య కూడా చితిలో సహగమనం చెందడం, ఇందులో ఏ అంశము కూడా స్త్రీ స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదు. సమాజం కుటుంబం మొదలగు సామాజిక వ్యవస్థలు స్త్రీకి ఆపాదించిన నియమాల ఆధారంగా జీవిస్తూ తన హక్కుల్ని పూర్తిగా కోల్పోతుందని కవితను ముగించారు.

తొలిరాత్రి ఎదుర్కొంటున్న అనుభవాలను గురించి సమాజంలో ఉన్నటువంటి భావనల గురించి కవితలోనీ మూడవ పాదంలో వ్యక్తీకరించారు, సంసార జీవితం భార్యా భర్తల తొలినాటి రాత్రి శోభన కార్యంతో ఇది ఆరంభ మవుతుంది, పురుషాధిక్యత కారణంగా ఏక పక్షంగా సాగిపోయే ఈ శోభన కార్యంలోని దయనీయతను కూడా కవి  వర్ణించారు, దీనిని మౌనంగా భరించడమే ఇల్లాలి తనానికి నిదర్శనమని పురుష ప్రపంచం ఏకపక్షంగా నిర్ణయించింది . *మనసుల కలయికతో సంబంధం లేకుండా కేవలం అంగప్రవేశం జరగడమే శోభన శృంగారం అనికూడా పురుషాధి పత్యం భావించింది. ఈ భావజాలాన్ని ప్రశ్నించడమే స్త్రీవాదం ప్రధాన లక్ష్యం”³.

అగరుబత్తుల ధూపంతో హారతికర్పూరం వాసనతో
మసక మసకగా వున్న ఆ గదికి బెదిరి
గడప దగ్గర హఠం చేసింది
లోపలికి తోసి బయట గొళ్లెం పెట్టాం
పిలిచిందో అరచిందో తలుపులే బాదిందో
బయటికి మేం మాత్రం రానిస్తామా
పకపకలు పరాచకాలతో రాత్రంతా కాపలాకాశం
అంతేకాని అది బలవంతమవుతుందా

(“చునరీ” కవిత-ముక్తకంఠం-వరవరరావు కవిత్వం వాల్యూం-I, 1957-2017. పుటసంఖ్య 500)
భారత దేశంలో మధ్యయుగాల నుంచి ఉన్నటువంటి ఒక్క అమానవీయ దురాచారం గురించి కూడా కవి వివరించాడు భర్త చనిపోయినప్పుడు భార్యకు బతికి ఉండగానే భర్త చితిలో పేర్చి దహించి వేయడం  జరిగేది. దీనినే సతీ సహగమనం అనీ, సతీ అనీ వ్యవహరిస్తున్నాం. దీనికి ఈ దురాచారం రాసిన హిందూ గ్రంధాలలో ఎక్కడా పేర్కొనబడలేదని దీనికి శాస్త్ర సమ్మతం లేదని నిరూపించి దానిని రద్దు చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ తీవ్రమైన కృషి చేశారు స్త్రీ సతీసహగమనాన్ని కూడా మౌనంగా భరించింది అని, కవి స్త్రీకి తనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా పురుషాధిక్య భావజాలం చేసిందని ఈ కవిత ద్వారా తన భావాలను వెలిబుచ్చారు.

నెయ్యితో కాలుతూ వాసనలు వెదజల్లుతున్న
చందన శయ్యమీదికి
చేతిలో కలశంతో
శోభనపు గదిలోకి దుగ్ధపాత్రతో
వెళ్లినట్లు వెళ్లింది
నిజమే ఆమెనతడు పక్కమీదికి
లాక్కున్నంత హక్కుతో చితిమీదికి
లాక్కున్నాడు.
ఆమె ఎంత స్వేచ్ఛగా జీవించిందో
అంత స్వచ్ఛందంగా సతినాచరించింది.” (చునరీ కవిత, ముక్తకంఠం, పుట. 500)

4.2. కుటుంబ హింస:

పితృస్వామ్య భావజాలం ఫలితంగా స్త్రీ పుట్టినింట్లో, మెట్టినింట్లో కుటుంబ సభ్యుల కోసం తన శక్తినంతా ధారపోస్తుంది ఈ సామాజిక సత్యాన్ని కింది విధంగా కవిత్వీకరించారు.

“చల్లగా నాలుగు కాలాల పాటు బతుకు చెల్లెలూ
బతుకునంతా ఇలాగే ఇతరుల కొరకు
చమురులా ధారపోస్తూ
నాలుగు కాలాల పాటు బతుకు (చలినెగల్లు కవితాసంపుటి, రాఖీ బంధన్, పుట. 69 )

భర్తృక డైరీ (ముక్త కంఠం) కవితలో  స్త్రీ తన దాంపత్య జీవితంలో తను పడిన బాధలు చెబుతుంది, సాంప్రదాయాల పేరిట తన మీద రుద్దిన అనేక ఆంక్షలు గడప దాటని ఆడదానిగా కడుపులో దాచుకున్నానని, కట్టుబాట్ల పేరిట తనను ఉరేసిన హంతకుల్ని నేను ఉరి పెట్టుకొని మీ ముందు నిలబెట్టాను శవ పంచాయతీ తప్పదు నలుగురిలో జరగాల్సిందే అని అడుగుతుంది.

“అన్ని వేళలా హింసానుబంధమే సంస్కృతి అయినచోట
ఆత్మహత్యా హత్యా అన్నది శవపరీక్ష
విచికిత్సే తప్ప
మానవత్వం మేలుకున్న మీ అందరి
ఆత్మలకూ తెలుస్తూనే వున్నది
ఇది పెళ్లినాటి నుంచీ మీ కళ్ల ముందు
జరుగుతున్న హత్యేనని
గాయపడి భయంతో గదిలోంచి కొత్తలో
పరుగెత్తుకొచ్చినా
అలవాటుపడి బాధను మింగిన మూలుగు
విదారకంగా
ఆకాశంలో అర్ధరాత్రి వినిపించినా
పూల మనసు మీద సిగరెట్ నుసి రాలినా
కనిపించని దెబ్బలతో గుండె సెలయేరు
కదుములు గట్టినా
అది మందికి అక్కర్లేని మా స్వంత వ్యవహారం (భర్తృకడైరీ,  ముక్తకంఠం, పుట. 493)

4.3.వివాహ వ్యవస్థ:

సమాజంలో  స్త్రీ పురుషులు ఒకరినొకరు ఎన్నుకొని లైంగిక సాంగత్యానికి, సంతానోత్పత్తికి సాంఘిక అనుమతిని పొందడాన్ని వివాహమంటారు. వివాహం ఒక సాంఘిక సంస్థ (Social Institution). మానవుని ప్రకృతి సిద్ధమైన దైవిక, సాంఘిక ప్రవర్తనల సమన్వయాన్ని కలగచేసే బంధం - వివాహం' అని సామాజిక విమర్శకులు వివరించారు.

మారుతున్న జీవితాలకు అనుగుణంగా ఆలోచనల్లో వస్తున్న మార్పులు పతన మవుతున్న మానవ విలువలు, కుప్ప కూలుతున్న మానవ సంబంధాలు, డబ్బు, స్వార్థం వంటి అనేక అంశాలు సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దీని మూలంగా వివాహవ్యవస్థ కూడా అతలా కుతలమై పోయింది. ఈ నేపథ్యంలో వరవరరావు వివాహ బంధం స్వభావాన్ని కవి స్త్రీ వాద కోణంలో  “భర్తృక డైరీ” కవితలో విశ్లేషించారు.

వివాహం ఒక సాంఘిక శిక్షాస్మృతి
అది మొగనికి కొట్టే తిట్టే చావగొట్టే
హక్కునిస్తుంది
కుటుంబానికి ఇంటి పనిమనిషిని చేసి
కాల్చుకతిని తిండిపెట్టే
ఉపవాసం పండబెట్టే అధికారాన్నిస్తుంది” (భర్తృకడైరీ,  ముక్తకంఠం, పుట 493)

కుటుంబ వ్యవస్థనూ, వివాహ వ్యవస్థనూ విచ్ఛిన్నం చేయడం స్త్రీవాదం ఉద్దేశం కాదు. అయితే ఆ వ్యవస్థల్లోని లోపాలనూ, దురాచారాలనూ సవరించు కోవాలని స్త్రీవాదం చెప్తుంది.” ¹

4.3.1. వరకట్నం:

నేడు వివాహ బంధం ఏర్పడడానికి స్త్రీ పురుషునికి కొంత పైకాన్ని చెల్లించాల్సి వస్తుంది పైకాన్ని వరకట్నం అనే పేరుతో పిలుస్తారు, ఇస్తా ఇష్టాలతో సంబంధం లేదు. ఎంత కట్నం ఎక్కువయిస్తే వారితోనే వివాహ బంధం అనే ధోరణి సమాజంలో పెరిగిపోయింది దాన్ని కవి భర్తృక డైరీ (ముక్త కంఠం) కవితలో కవి వివాహంలో ఉన్న పురుషాధిక్య భావజాలాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.

వరకట్న సంబంధం రక్తసంబంధమై
సంతానంతో ముడి వీడని బంధమై
బిగుసుకుపోతుంది” 

(భర్తృక డైరీ (ముక్త కంఠం)వరవరరావు కవిత్వం వాల్యూం-I 1957-2017 పుటసంఖ్య 493)
అని, వివాహ బంధం వరకట్న బంధంగా మారిపోయిందని కవి వాపోయారు.

అదనపు కట్నం కోసం నవ వధువులను, కోడళ్లను వేధిస్తూ చంపేస్తున్న ఘటనలు నేడు నిత్య కృత్యమైపోయాయి. కవి వరకట్న చావుల గురించి బాధతో సామాజిక స్తితిని వర్ణిస్తూ, మనిషి భూ ప్రపంచంలో ఎక్కడ  లేని ఒక భిన్నమైన జంతువుగా మారిపోయాడని , అలా మారిపోయిన మనిషి ఒక ఆకలి తో బాధ పడుతున్నాడని  వరకట్నాల కోసం, వంశ ప్రతిష్టల కోసం,  లాంచనాల కోసం పెట్టు పోతల కోసం, సాంఘిక హోదాలకు, ప్లాట్ల కోసం ఫ్లాట్ల కోసం ఆస్తుల కోసం, కోడల్ని కాల్చుకు తింటున్నదని కవి వరకట్న దురాచారం గురించి “చౌరస్తాలో చార్మినార్” వర్ణించారు.

ఇదేం జంతువు
ఇదేం ఆకలి
అడవిలో పులి కూడ కాదు.
గాండ్రింపుకు భయపడి
లేళ్లు పారిపోవడానికీ లేదు
ఇది దయ్యం ఆకలి కూడ కాదు
దెబ్బకు దయ్యం అయినా దడుస్తుంది అనడానికి (చౌరస్తాలోచార్మినార్, ముక్తకంఠం, పుట. 437)

4.4.లైంగిక హింస:

స్త్రీలకు ఇష్టం లేకుండా పురుషులు నీచమైన ఉద్రేకంతో వాళ్ళతో చేసే బలవంతపు సంసర్గాన్ని అత్యాచారం అనవచ్చు,స్త్రీ జాతిని అణచి వేయడానికీ పితృ స్వామ్య వ్యవస్థ రూపొందించుకున్న ఒకానొక పదునైన ఆయుధం  అత్యాచారం. పగబట్టిన వేటగాడు పరుగెడుతున్న లేడిని ఒక మలుపులో తప్పించుకుంటే, మరో మలుపులోనైనా పట్టు కుంటాడు. ఒక పక్క అమ్మ పొట్టలో ఉండగానే ఆడ  శిశువులు హత్యకు గురౌతున్నారు . ఆ మలుపు లో ఏదో విధంగా తప్పించుకున్న ఆడ పిల్లలు ఎదిగీ ఎదగక ముందే మరో మలుపు దగ్గర పైశాచికంగా అత్యాచారాలకు గురవుతున్నారు.

మేం అభద్రతతో బతికే అర్ధశరీరాలం
తల్లులం, బిడ్డలం, అక్కా చెల్లెళ్లం కాని
వ్యక్తిత్వం ఉన్న మనుషులం కాదు
మా వ్యక్తిత్వమంతా బలత్కారానికి బలికావల్సిన స్వేచ్ఛయే
ఇది మొగవాని ఆకలి తీర్చుకోవడం కాదు
మా మీద వాడి అధికారాన్ని మళ్లీ మళ్లీ ప్రకటించడం” (బదాయూ1, బీజభూమి  పుట. 958)

అత్యాచారానికి గురైన స్త్రీలు తమపై జరిగిన ఈ శారీరక హింసను బహిరంగ పరిచే సందర్భాలు  కూడా ఈ సమాజంలో చాలా తక్కువ . ఒక వేళ ఏ స్త్రీ అయినా ధైర్యం చేసి తనపై జరిగిన అత్యాచారానికి న్యాయం చేయమని చట్టాన్ని ఆశ్రయించినా చాలా సందర్భాలలో స్త్రీలకు న్యాయం జరగడంలేదు. పైగా పోలీసుల నుండి, న్యాయస్థానంలోని న్యాయ వాదుల నుండి ప్రశ్నలు, వేధింపులు గోరుచుట్టుపై రోకలిపోటు లాగా వారిని మరింత క్రుంగదీస్తున్నాయి. ఇలాంటి విషయాలను “సునీత కథ” కవితలో వరవరరావు కింది విధంగా విశ్లేషించారు.

మతకలహాలు, వర్గ సంఘర్షణల వలె
'మానభంగాలు' శాంతి భద్రతలకు భంగం కావు గనుక
ఆస్తి మీద దాడి నేరం గానీ
ఆడదాని మీద దాడి నేరం కాదన్నది పోలీసు
గాయాలకు దైవ ప్రార్ధనకు మించిన మందు లేదన్నది మతం
బలాత్కారమే అయినా
పాపాన్ని భరించేది పాపిగద
పశ్చాత్తాపాన్ని ప్రభువు క్షమిస్తాడన్నది
పేదరికం ఆత్మగౌరవాన్ని అసహ్యించుకున్నది
పేదరికం తెగింపు ప్రయత్నాన్ని నిరసించింది.
పేదరికం వయస్సును నిందించింది
పేదరికం ఆడదయి పుట్టడాన్ని శపించింది” (సునీతకథ, ముక్తకంఠం,  పుట. 470)

పితృ స్వామ్య వ్యవస్థ స్త్రీజాతికి ఆపాదించిన మరో పవిత్ర భావన “ మానం'". ఇది కొత్తదేం కాదు. శీలానికి 'మానం' పర్యాయ పదం మాత్రమే, ప్రాణం పోయినా మానం  పోగూడ దన్నది " స్త్రీ జాతి కోసం మాత్రమే రూపొందించినన భావన.

మాన భంగం అనేది ఫ్యూడల్ వ్యవస్థ నాటి మాట. మానానికీ పనిత్రత ఆపాదించినప్పటి మాట, ఆధునికులు దీన్ని అంగీకరించడం లేదు. అందుకే ఈ మాటకు ప్రత్యామ్నాయంగా అత్యాచారం' అనే మాటను వ్యవహరిస్తున్నారు. మానభంగం ఒక భ్రమ. అత్యాచారం ఒక వాస్తవం ఈ విషయాలను “ఒక చెయ్యి మరొక చెయ్యి” కవితలో వరవరరావు కింది విధంగా విశ్లేషించారు.

ఏం చెప్పినా ఈ ప్రపంచం పవిత్రీకరించిన భావం
అది సెంటిమెంటు కాదు మానాభిమానాల చర్చ కాదు
అది శరీరంపై మనసుపై అత్యాచారం
హృదయంపై స్వేచ్ఛపై దురాక్రమణ
చెప్పుకుంటే గాలిలో చెదిరే పరాగంలా తేలికయ్యే రోదన
చెప్పకుంటే నిలువెల్లా విషమై దహించే వేదన” (“ఒక చెయ్యి మరొక చెయ్యి”, ముక్తకంఠం పుట. 454)

4.5. వేశ్యా వృత్తి:

సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల్లో వేశ్యా వృత్తి సమస్య ఒకటి. వివాహం కాకపోవడం, వైవాహిక జీవితంలో ఇమడ లేక పోవడం, పురుషుల దౌర్జన్యాన్ని,భరించ లేక పోవడం, ప్రేమ పేరుతో వంచించబడి తిరిగి ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లక పోవడం;ఇతర కారణాల వల్ల కూడా పురుషులతో మోసగించ బడటం, భరించ లేని పేదరికం వంటివి స్త్రీలు 'వేశ్యా వృత్తి స్వీకరించడానికి కారణాలు. కారణాలు ఏవైనప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ ఇతరుల లైంగికావసరాల కోసం స్త్రీలు " తమ శరీరాల్ని అద్దె కివ్వడం ద్వారా జీవనోపాధిని కల్పించు కోవడం వేశ్యావృత్తి.
వరవరరావు  సమాజంపై ఉన్న సునిశిత దృష్టిని “ ఆకలి” ఆవిష్కరింపజేసింది ఈ కవిత వేశ్యల జీవితంను గూర్చి తెలియజేస్తుంది. పేదరికం వాళ్ళను వేశ్యలుగా మార్చింది.ఆకలి వారిని హృదయం లేని శరీరంగా మార్చి వేసింది అని విశ్లేషించారు.

నా వెనుక ఆనుకొని నీవు వదిలిన శ్వాసల్లో
నీ ఆకలే గాని నీ యవ్వన స్పర్శ లేదు.
నా మెడ కింది నుంచి నన్ను చేరుకోవాలని నీవు చూసిన
చూపుల్లో
కనలే కడుపు కక్కుర్తి మాత్రమే కాని కామవాంఛ లేదు.” (ఆకలి?,  చలినెగల్లు, పుట. 86)

5. ముగింపు:

 • వరవరరావు కవిత్వంలో స్త్రీ వాదం లేవనెత్తిన ప్రధాన అంశాలను చర్చించడం జరిగింది. పితృ స్వామ్య భావ జాలం ఫలితంగా స్త్రీ లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, సామాజిక వివక్షతకు గురి అవుతున్నారని వరవరరావు కవిత్వంలో తన కవిత్వం ద్వారా వ్యక్తపరచారు.
 • వరవరరావు తన కవిత్వ లో పైన పేర్కొన్న విషయాలైన కాక, స్త్రీ, శిశుహత్యల మీద, వివాహ బంధంలోని లైంగికహింసమీద, స్త్రీ ఎదుర్కొంటున్న అనేక సామాజికసమస్యలను గూర్చి కవిత్వీకరించారు.
 • వరవరరావు తన కవిత్వంలో స్త్రీ తన విముక్తి కోసం తానే పాటుపడాలని, వ్యవస్థను కన్నీళ్ళతో కరిగించలేరని, హక్కుల్ని గర్జించి అడగాలని స్త్రీ ని భోగ వస్తువుగా చూసే వ్యవస్థ నుంచి వ్యక్తిగా మార్చే వ్యవస్థ వైపు కదం తొక్కాలని  స్త్రీని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశాడు. 
 • పురుషాధిక్యభావజాలంనుండి బైటపడకపోతే స్త్రీజాతికి మనుగడ లేదనీ, వారిని చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందనీ  ప్రతి అక్షరంలోనూ పరితపించి రాశారు.

6. పాదసూచికలు:

 1. వడ్డేపల్లి సంధ్య, స్త్రీవాదసాహిత్యం- ఒక పరిశీలన (సాహిత్యవ్యాసం)- 01/01/2022. విహంగ పత్రిక. ISSN 2278 – 478
 2. గోళ్ళ పార్వతి. ఎస్. వి. యూనివర్సిటీ- సిద్ధాంత గ్రంథం “కొండేపూడి నిర్మల సాహిత్యం- పరిశీలన”. పుట సంఖ్య -131
 3. పైదే. పుట సంఖ్య -158

7. ఉపయుక్తగ్రంథసూచి:

 1. నారాయణరెడ్డి, సి. (2012). ఆధునికాంధ్రకవిత్వం- సాంప్రదాయాలు, ప్రయోగాలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
 2. యాదగిరి, కె. (2020). తెలుగులో కవిత్వోద్యమాలు తెలుగు అకాడమీ ప్రచురణ, హైదరాబాద్
 3. రామారావు, ఎస్.వి. (1989). తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ, వికాసాలు. పసిడి ప్రచురణలు, సికింద్రాబాద్.
 4. వరవరరావు కవిత్వం (1957-2017) Vol I &II, స్వేచ్ఛా సాహితీ ,హైదరాబాద్- 2017
 5. విద్యావతి, నూతక్కి.  (వ్యాసం) (2023) ఔచిత్యం (మాసపత్రిక) vol -4, issue -8, జూలై -2023.
 6. సత్యనారాయణ ఎస్.వి. స్త్రీవాద వివాదాలు, నవచేతన పుబ్లిషింగ్ హౌస్  , హైదరాబాద్.
 7. స్త్రీవాదధోరణులు : సమకాలీన సాహిత్యం, యువ భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్, 1994

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]