headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. భారతీయ రైతుల పంట ఆదాయం: పరిరక్షణ మార్గాలు

సాయిప్రభాకర్ బాలాంత్రపు

అసిస్టెంట్ ప్రొఫెసర్ - ఆర్ధిక శాస్త్రం, మానవీయ & సామాజికశాస్త్ర విభాగం,
శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (SSSIHL),
ప్రశాంతినిలయం, శ్రీసత్యసాయిజిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515134.
సెల్: +91 7306287536, Email: saiprabhakarbalantrapu@sssihl.edu.inడా. జి. రాఘవేందర్ రాజు

అసోసియేట్ ప్రొఫెసర్ - ఆర్ధిక శాస్త్రం, మానవీయ & సామాజికశాస్త్ర విభాగం,
శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (SSSIHL),
ప్రశాంతినిలయం, శ్రీసత్యసాయిజిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515134.
సెల్: +91 9440555329, Email: graghavenderraju@sssihl.edu.in

శ్రీసత్యసాయి, ముదిగొండ

అడ్జన్క్ట్ ప్రొఫెసర్ - ఏక్చురియల్ సైన్స్,
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏక్చురియల్ డేటా సైన్స్,
శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (SSSIHL),
ప్రశాంతినిలయం, శ్రీసత్యసాయిజిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515134.
సెల్: +91 9603573032, Email: satyasaibabamudigonda@sssihl.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

భారతీయ రైతుల పంట ఆదాయాన్ని కాపాడటానికి, సరైన పంట ఆదాయ రక్షణ వ్యూహాలను అమలు చేయడం అత్యవసరం. రైతులు అనేక ప్రమాదాలను ఎదుర్కొంటూ, అనిశ్చిత వాతావరణం, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు, వ్యయాలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పంట ఆదాయ రక్షణ వ్యవస్థ ఈ ప్రమాదాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా పంట దిగుబడుల అస్థిరత, ధరల పతనం వంటి సమస్యలను సకాలంలో గుర్తించి, బీమా, ఆర్థిక మద్దతు పథకాల ద్వారా రైతులను ఆదుకోవాలి. భారతీయ రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళను పూర్వపు పరిశోధకులు నొక్కి వక్కాణించారు. ఈ పరిశోధన కోసం, మేము భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుండి డేటాను సేకరించి, వ్యవసాయ రంగంలోని పోకడలను విశ్లేషించాము. అగ్రి-టెక్ సంస్థలు, శాస్త్రీయ సాంకేతికతలను ఉపయోగించి పంట ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక అక్షరాస్యత కల్పించడం వంటి వ్యూహాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయి. ప్రభుత్వం, వ్యవసాయ రంగంలో అవసరమైన పెట్టుబడులను పెంచడం ద్వారా పంట ఆదాయాన్ని బలోపేతం చేయవచ్చు. పంట ఆదాయ రక్షణ వ్యవస్థ రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించి, వారి ఆర్థిక భద్రతకు, వృత్తి స్వేచ్ఛకు దోహదపడుతుంది.

Keywords: రైతుల పంట ఆదాయం, పంట ఆదాయ రక్షణ, స్థూలదేశీయోత్పత్తి (GDP), జోడించబడిన స్థూల విలువ (GVA), స్థూల మూలధన నిర్మాణం (GCF), ఆహార భద్రత, ఆర్థిక అక్షరాస్యత, ప్రమాద నిర్వహణ, భద్రతా వలయం, కనీస మద్దతు ధర, బీమా, పంటల తీవ్రత

1. భారతీయ రైతుల యొక్క పంట ఆదాయాన్ని కాపాడటం:

నేడు, సరుకులను అవసరమైనవిగా భావిస్తున్నారు, కానీ మనిషికి సరుకుల కున్నపాటి విలువను ఇవ్వడం లేదు. మనిషికి, అతని విలువ అతనికి ఇచ్చినట్లయితే, అతడ్ని శరీరచట్రంలో ఉన్న ఒక దివ్యమైన నిప్పురవ్వగా పరిగణిస్తే, అతడు నూతనమైన అత్యున్నత అభ్యుదయ శిఖరాలకు ఎదిగి, జీవితానికి అవసరమైన అన్ని వస్తువులను సమృద్ధిగా ఉత్పత్తి చేస్తాడు.”1 - భగవాన్ శ్రీ సత్య సాయిబాబా.  

ఈ "మనిషి"ని వ్యవసాయ క్షేత్రంలో కష్టపడి పనిచేసే రైతుతో పోల్చవచ్చు.

జీవనానికి "అగ్రికల్చర్"; జీవితానికి "మైండ్-కల్చర్"2– అని అంటారు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. ఈ చక్కటి సూక్తిని పరిశీలిస్తే, మానవ ఉనికి యొక్క రెండు ప్రాథమిక అంశాల మధ్య వ్యత్యాసం అర్ధమవుతుంది. వ్యవసాయం (అగ్రికల్చర్) అన్నది, భౌతిక పోషణకూ, జీవనోపాధులకు సహాయ పడుతుంది. మరి, మనోసంస్కరణ (మైండ్-కల్చర్), కేవలం మనుగడకే పరిమితం కాక, సుసంపన్నమైన జీవితానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 

అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా రైతులే ఐశ్వర్య కారకులు. ప్రస్తుతం కావాల్సినది వారి ఆదాయాలను కాపాడటమే! ఇది వ్యవసాయ పంటల ఆదాయాల వల్ల వస్తుంది. దేశ ఆహార భద్రతకూ, భవిష్యత్ తరాల పెరుగుతున్న అవసరాలకూ హామీ ఇచ్చే సమగ్ర లక్ష్యాల మార్గాన్ని ఇది సుగమం చేస్తుంది.

పరోశోధనకు గ్రహించిన ఈ విశేష అంశం, గణనీయమైన సామాజికప్రయోజనం కలిగి ఉన్నది. ఇది ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ అఫ్ హయ్యర్ లెర్నింగ్ లో (SSSIHL - వ్యవహారంలో శ్రీ సత్య సాయి విశ్వవిద్యాలయము) ప్రత్యేక అధ్యయన విషయంగా ఉంది. ఆర్ధికశాస్త్రం, ఏక్చురియల్ సైన్సెస్ అన్న భిన్నవిజ్ఞానశాస్త్ర నిపుణుల పరస్పర సహకారంతో, సామాజిక ప్రయోజనార్ధం ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తుండడంలో ఈ పరిశోధనా పత్రం ఒక చిరు ప్రయత్నమే అయినా, ప్రయోజనవంతమైన ప్రయత్నం.

2. రైతు అంటే ఎవరు?

వ్యవసాయ సాగు ద్వారా ఆహార పోషకునిగానూ, పర్యావరణ స్థిరత్వమూ, వనరుల నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉండే బాధ్యతాయుతమైన నమ్మదగిన మనిషిగానూ రైతును చూడవచ్చు. స్వీయ సౌకర్యాలను త్యాగం చేసి, ప్రతి రోజూ కష్టమైన పనిని చేయడం ద్వారా దేశాన్ని పోషించే వ్యక్తియే రైతు. సూర్యుడు, గాలి, వర్షం, నీరు, నేలా వంటి ప్రకృతిలో అత్యంత ముఖ్యమైన అంశాలపై ఆధారపడి జీవిస్తున్న ఈ వర్గాన్ని రక్షించడం ఎంతో ముఖ్యమైనది. వారి వ్యవసాయ ఆదాయాలను భద్రపరచడం ద్వారా, అనిశ్చితితో కూడిన జీవితాన్ని నడిపే ఈ ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉండటమే ఇందుకు కారణం.

పంట ఆదాయరక్షణవ్యవస్థను అమలుచేయడం ద్వారా రైతులను రక్షించడం సాధ్యమవుతుంది. ఇది తీవ్ర వాతావరణ సంక్షోభాలు, మార్కెట్ ధరల మార్పులు వంటి అనివార్య ప్రమాదాలను కొంత మేరకైనా తగ్గిస్తుంది. ఇవి కోలుకోలేని ఆర్థిక నష్టాలను కలిగించి, భారతదేశంలో కోట్లాది రైతుల జీవనోపాధిని ప్రభావితం చేస్తాయి. దీనికి సమర్థవంతమైనట్టి పంట ఆదాయ రక్షణ వ్యూహం ఎంతో అవసరం!3

౩. భారతీయ వ్యవసాయ రంగంలో ఇటీవలి పోకడలు:

భారత ఆర్థిక వ్యవస్థలో, వ్యవసాయ రంగం ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఈ రంగం, స్థూలదేశీయోత్పత్తి (GDP), ఆహార భద్రత (Food Security), గ్రామీణ జీవనోపాధి (Rural Employment) వంటి విభాగాలకు కీలకంగా తోడ్పడుతుంది. భారతదేశంలో, వ్యవసాయ వృత్తి ప్రధాన ఉపాధి వనరుగా ఉంటూ, జనాభాలో అధికశాతం ప్రజలకు జీవనోపాధిని అందిస్తున్నది. 

రేఖా చిత్రం 1: ప్రస్తుత ధరల ప్రకారం భారత కార్మిక శక్తిలో వ్యవసాయ కార్మిక శక్తి (Labour Force) యొక్క వాటా 4 (%)

రేఖా చిత్రం 1లో అందించిన డేటాను పరిశీలిస్తే, 2017-18 నుండి 2022-23 వరకు మొత్తం కార్మిక శక్తిలో వ్యవసాయ కార్మికుల శాతం ఎలా మారిందో సూచిస్తాయి. 2018-19 లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, తరువాతి సంవత్సరాలలో శాతం క్రమంగా పెరిగింది. 2020-21 నాటికి ఇది అత్యధికంగా 46.5% కు చేరింది, తర్వాత 2021-22 మరియు 2022-23 లో కూడా స్థిరంగా ఉంది.

భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం యొక్క వాటా సంవత్సరాల కొద్దీ తగ్గిపోతున్నప్పటికీ, ఇది ముఖ్యమైన భాగంగా ఉంది. వ్యవసాయంతో పాటు అనుబంధ కార్యకలాపాలు మొత్తం ఆర్థిక ఉత్పత్తిలో గణనీయమైన వాటాను కలిగి ఉంటాయి.

రేఖా చిత్రం 2: ప్రస్తుత ధరల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలోని జోడించబడిన స్థూల విలువ (Gross Value Added) యొక్క వాటా 5 (%) 

రేఖా చిత్రం 2లో అందించిన గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో వ్యవసాయ రంగం GVA మొత్తం ఆర్థిక వ్యవస్థలో స్థిరంగా 18% సమీపంలో ఉంది, కానీ 2020-21 లో ఇది గణనీయంగా పెరిగింది. తరువాతి సంవత్సరాలలో, ఈ శాతం క్రమంగా తగ్గి, 2022-23 లో 18.3% కు చేరింది. ఇది వ్యవసాయ రంగంలో నిరంతర మార్పులు మరియు విభిన్న ఆర్థిక పరిస్థితులను సూచిస్తుంది.

ఇటీవల సంవత్సరాలలో, ఈ రంగం నుండి వచ్చే స్థూల దేశీయోత్పత్తి (GDP) యొక్క భాగం తగ్గింది. ఇదే సమయంలో, వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికుల సంఖ్యలో పెద్ద మార్పులు లేవు, వారు స్థిరంగా ఉన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వ్యవసాయ రంగం నుండి వచ్చే ఆదాయం ఎందుకు తగ్గింది? దీనికి ఒక ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తగ్గడమే! పెట్టుబడులు తగ్గితే, కొత్త సాంకేతికతను ఉపయోగించడం, సౌకర్యాల మెరుగుదల, పంటల దిగుబడి పెరుగుదల వంటి విషయాలు సక్రమంగా జరుగవు.

రేఖా చిత్రం 3: ప్రస్తుత ధరల ప్రకారం మొత్తం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలోని స్థూల మూలధన నిర్మాణం (Gross Capital Formation) యొక్క వాటా (%)

రేఖా చిత్రం 3లో అందించిన డేటాను పరిశీలిస్తే, 2016-17 నుండి 2018-19 వరకు పెట్టుబడులు తగ్గాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలోని పెట్టుబడుల (స్థూల మూలధన నిర్మాణం - Gross Capital Formation) వాటా క్రమంగా మారుతూ వచ్చింది. 2020-21 లోని గణనీయమైన పెరుగుదల తరువాత, 2021-22 లో స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. మొత్తం మీద, ఈ గణాంకాలు వ్యవసాయ రంగంలో పెట్టుబడుల పరిమాణాలనూ, మార్పులనూ ప్రతిబింబిస్తాయి.

ఈ పరిణామాలు రైతులకు తక్కువ ఆదాయం, ఉత్పత్తి తగ్గుదలకి దారి తీస్తాయి. వ్యాపార పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు మెరుగవడంలో వెనుకబడడం, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందువల్ల, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచడం ద్వారా మాత్రమే, ఈ రంగంలో ఆదాయాన్ని, ఉత్పత్తినీ పెంచి, తద్వారా భారతదేశం యొక్క సమగ్ర ఆర్థిక వృద్ధిని పెంచవచ్చు.

4. వ్యవసాయ సాగుకి కలిగే నష్టాల6 (Risks) మూలాలు:

రేఖా చిత్రం 4: వ్యవసాయ నష్టాల మూలాలు

వివిధ సంకటములతో నిండిన వ్యవసాయ రంగం, పరిశ్రమ యొక్క గతిశీలతను రూపొందించడంలో విలక్షణమైన పాత్రను పోషిస్తుంది. ఉత్పాదక వేళలో వచ్చే నష్టం, విపరీతమైన వాతావరణ పరిస్థితుల వల్ల, ఆలస్యమైన ఋతుపవనాలు, అకాల వర్షపాతం వంటి ఊహించలేని సంఘటనల వల్ల జరుగుతుంది. ఇది ఎప్పుడూ ఉండే సవాలు. మార్కెట్ డిమాండ్, సరఫరా హెచ్చుతగ్గులు, ఉత్పత్తి ఖర్చుల ద్వారా ప్రభావితమైన ధర నష్టం, వ్యవసాయ రంగ అనిశ్చితులను మరింత అధికం చేస్తుంది. ప్రభుత్వ ప్రణాళికలలో, వాటి నిబంధనలలో మార్పుల ద్వారా ప్రేరేపించబడిన సంస్థాగత నష్టం, వాణిజ్య సంబంధాలకూ, మార్కెట్ అందుబాటులోకి రావటానికి అంతరాయం కలిగిస్తుంది. అనారోగ్యం, రైతు మరణాలు మరియు సామాజిక అశాంతి వంటి కారకాలతో కూడిన వ్యక్తిగత నష్టం, తీవ్ర సామాజిక-ఆర్థిక చిక్కులను కలిగి ఉంటుంది. దీనికి అధిక ఋణ భారం కారణంగా భారతదేశంలో రైతుల ఆత్మహత్యలను ఉదాహరణగా చెప్పవచ్చు. చివరగా, ఋణ లభ్యతతో పాటు, రైతుల ఋణాల చెల్లింపుపై ప్రభావం చూపే అనిశ్చిత వడ్డీ రేటు, ఆర్ధిక నష్టంతో ముడిపడి ఉంది. ఈ బహుముఖ సవాళ్లకు, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టి, పటిష్ఠం చేయడానికి దూరదృష్టిగల వ్యూహాలూ, విధానాలూ అవసరం.7

5. పంట యొక్క ఆదాయరక్షణకు సంబంధించిన ఆర్ధిక అంశాలు:

రేఖా చిత్రం 5: పంట ఆదాయరక్షణకు సంబంధించిన ఆర్ధిక అంశాలు

5వ రేఖాచిత్రంలో - కుడి వైపున వివరించిన విధంగా, పంట ఆదాయం యొక్క కదలికను అర్థం చేసుకోవడానికి, రెండు ముఖ్యమైన విడి అంశాలు అయిన దిగుబడీ, మార్కెట్ ధరలూ, వ్యతిరేక దిశలో కదులుతాయి. అధిక దిగుబడులు, ధరల పతనానికి దారితీస్తాయి. ఇది రైతులు ఎన్నడూ ఆశించని విషయం. దీనికి వ్యతిరేకంగా, తక్కువ దిగుబడి, ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దీనివల్ల పండిన పంట లాభదాయకం కావటం జరుగుతుంది. పంట రాబడి యొక్క రక్షణ అన్నదానిలో ఇమిడిఉన్న గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ధరల నష్టం నుండి ఉత్పన్నమయ్యే తత్సంబంధిత నష్టాన్ని తగ్గించడం, తద్వారా రైతులను రక్షిండమే! ముఖ్యంగా, నిర్ణయించిన ప్రామాణిక ధర కన్నా, అమ్మకం ధర తగ్గినప్పుడు ఈ నష్టం సంభవిస్తుంది. ఈ రక్షణ అన్నదాన్ని, బీమా (Insurance) యంత్రాంగం ద్వారా కలిగించవచ్చు. 2016 లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన8 (PMFBY) అనే బృహత్ ప్రణాళిక కేవలం పంట నష్టం సంభవించినప్పుడు మాత్రమే రైతులను ఆదుకుంటుంది (కవరేజ్ చేస్తుంది). మరొక పక్క, పైన ప్రస్తావించిన పంట ఆదాయ రక్షణ, ఉత్పత్తి నష్టాన్నే కాకుండా, ధర క్షీణతను కూడా కాపాడే పటిష్ట రక్షణగా పనిచేస్తుంది. పంట ఆదాయ కదలికల చట్రంలో భాగంగా, రేఖా చిత్రం 5లో ఎడమ వైపు, వివిధ పంట ధరల స్థానాలు, ఆరోహణ క్రమములో వర్ణింపబడ్డాయి.

6. పంట ఆదాయ రక్షణలో ప్రమాద నిర్వహణ (Risk Management - నష్టములను ఎదుర్కొనుట) యొక్క ప్రయోజనాలు:

వ్యవసాయంలో ప్రమాదనిర్వహణ ప్రాముఖ్యత విస్తృతంగా గుర్తించబడింది. పంట ఆదాయ భూభాగాన్ని చుట్టుముట్టే ప్రమాదాలు, బహుముఖంగా ఉన్నాయి. ఇవి రైతులనూ, ప్రభుత్వాలనూ, బీమా కంపెనీలనూ, ఋణదాతలనూ ప్రభావితం చేస్తాయి. ఈ సవాళ్లు, సమగ్ర విధానాల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. నష్ట నివారణ పద్ధతులు, ఆర్థిక మద్దతు, విధాన సంస్కరణల వంటివి స్థిరమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థకు అత్యవసరమైనవి. ఈ ప్రమాద నిర్వహణ సంస్కరణలను పాఠిస్తే, ప్రమాదాలను తొలగించి, రైతు శ్రేయస్సునూ, పంట ఆదాయాన్నీ సురక్షితంగా నిలుపుతుంది.9

7. పంట ఆదాయ నష్టాన్ని తగ్గించడం ఎవరి పని?

పంట రాబడి నష్టాన్ని తగ్గించే విషయానికి వస్తే, రైతుకి కావాల్సిన ఆదాయాన్ని తేవటానికి, ఈ ఆహార ఉత్పత్తి ప్రక్రియలో పాలుపంచుకున్న వాటాదారులందరి సమిష్టి కృషి అవసరం. అత్యంత ప్రముఖ వాటాదారులు రైతులు, ప్రభుత్వం, బీమా కంపెనీలు, ఋణ సంస్థలు (NABARD, PACS, RRBల వంటివి), వ్యవసాయ కంపెనీలు, అగ్రి-టెక్ కంపెనీలు, రైతు-ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) అనేవి. రైతులకు సమయానికి తగ్గ పంట సమాచారాన్ని అందించడం, సకాలంలో వర్తమానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా పంట ఆదాయ నష్టాన్ని తగ్గించవచ్చు. కృత్రిమ మేధ10 (AI), ఇతర అధునాతన సాంకేతికతలు, ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.

8. పంట ఆదాయ ప్రమాద నిర్వహణ ద్వారా రైతుల ఆదాయంలో ఉన్న హెచ్చుతగ్గులను తగ్గించవచ్చు:

భారత ప్రభుత్వం 2016వ సంవత్సరంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంపై, అశోక్ దల్వాయ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆదాయ నష్ట నివారణ వ్యూహాలైనట్టి - పంటల తీవ్రత (సంవత్సర కాలంలో అధిక పంటలను పండించడం), సాగుచేయడం, పంటల వైవిధ్యం, లాభదాయకమైన ధరలను సాధించడం వంటి వాటిని ఈ కమిటీ గుర్తించింది. ఈ వ్యూహం యొక్క ప్రాథమిక సూత్రాలు మొత్తం వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, కనీసమద్దతుధర11 (MSP) విధానం ద్వారా లాభదాయకధరలకు హామీఇవ్వడం,  కొత్తకొత్త శాస్త్రీయ సాంకేతికతలను స్వీకరించడం. చిన్న రైతులకూ, సన్నకారు రైతులకూ సామాజిక భద్రత కల్పించే ఆదాయ మద్దతు పథకం అయిన పిఎం-కిసాన్12 (PM-Kisan) పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించడం చెప్పుకోదగ్గ విషయం.

9. పంట ఆదాయ ప్రమాద నిర్వహణ అన్నది స్థూలదేశీయోత్పత్తికి (GDP) దోహదం చేస్తుంది:

తాజా ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం భారత వ్యవసాయ రంగం భారతదేశ GDPలో 18% వాటాను కలిగి ఉండగా, ఈ రంగం FY21లో 3.3%తో పోలిస్తే FY22లో 3.0% వృద్ధి చెందింది, అయితే ఈ గత ఆరు సంవత్సరాల వార్షిక సగటు వృద్ధి రేటు స్థిరంగా 4.6% వద్ద ఉంది. పంట ఉత్పత్తిలో సమర్థవంతమైన ప్రమాద నిర్వహణ వ్యూహాలను అమలు చేయడం వల్ల రైతులకు ఆదాయ స్థిరత్వం కలుగుతుంది. ఇది మెరుగైన వ్యవసాయ పద్ధతులకూ, మెరుగైన ఉత్పాదకత సామర్థ్యానికీ దారి తీస్తుంది. ఇది వ్యవసాయ రంగంలోకి పెట్టుబడులను మరింతగా ప్రేరేపించి, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించి, ఎగుమతి మార్కెట్లకు ఆకర్షణీయంగా మారుస్తుంది. తద్వారా దేశ వాణిజ్య సమతుల్యతకు దోహదం చేస్తుంది. అందువల్ల బలమైన, స్థిరమైన వ్యవసాయ రంగం అన్నది భారతదేశం యొక్క స్థూలదేశీయోత్పత్తిపై (GDP) బలిష్ఠ ప్రభావాన్ని చూపుతుంది.

10. ప్రమాద నిర్వహణ: రైతుల వృత్తి భద్రతకూ, ఆర్థిక స్వేచ్ఛకూ ఒక జీవన విధాన రీతి:

దూరదృష్టిగల ప్రమాద నిర్వహణ వ్యూహాలు, వృత్తి భద్రత, ఆర్థిక స్వేచ్ఛ రూపంలో రైతుల దీర్ఘకాలిక శ్రేయస్సుపై చాలా ప్రభావం చూపుతాయి. ఇవి రైతుల స్థిరమైన ఆదాయంపైనా, ఋణాలకు మెరుగైన ప్రాప్యతపైనా, తక్కువ వనరులతో కూడిన వ్యవసాయంలో పాల్గొనడం వంటి వివిధ అంశాలపైనా ఆధారపడి ఉంటుంది. ఈ ప్రమాద నిర్వహణ వ్యూహాలు, వాతావరణ మార్పులకు రక్షణగా ఉంటూ, మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు, ఒక ఆదరవుగానూ, చేయూతగానూ పనిచేస్తుంది.

11. గ్రహించాల్సిన అంశాలు:

11.1 ఉత్పాదించడంతో పాటుగా దాని వ్యాపార విధానం కూడా తెలుసుకోవాలి - రైతులకు విద్య, శిక్షణ మరియు అక్షరాస్యతను ప్రోత్సహించడం వల్ల వారు సరైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి, నూతనమైన సాంకేతికతలను అవలంబించడానికి, నష్టాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.13 ఇది చివరికి స్థిరమైన ఆదాయ వృద్ధికీ, వారి ఆర్థిక భద్రతకూ దారి తీస్తుంది.

11.2 పంట ఉత్పత్తి యొక్క ప్రతి దశలో తనిఖీలను ఏర్పరచడం - సమర్థవంతమైన ప్రమాద నిర్వహణలో ఇది అత్యవసరం. ఇక్కడ ముఖ్యమైన వ్యవసాయ అవసరాలు అయినట్టి ధృవీకృత నాణ్యమైన విత్తనాలు, భూసార పరీక్షలు, పంట ఎంపిక, ఎరువుల వాడకం, నీటిపారుదల మరియు చీడపీడల నిర్వహణకి సంబంధించిన అవసరమైన తనిఖీలు చేయడం అన్నవాటివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

11.3 నగదుపై మీ ద్రుష్టి ఉంచండి - ఏ వ్యాపారంలోనైనా నగదుకు ఎప్పుడూ రాజా స్థానమే! ఈ సిద్ధాంతం, ఆర్ధిక కోణంలో, వ్యవసాయ వ్యాపారంలో ఉన్న రైతులకు సమానంగా వర్తిస్తుంది. ఏ సగటు భారతీయ రైతుకైనా అత్యంత ముఖ్యమైనది - తన అవసరాలకు పోను ఆదాయాన్ని కలిగించే పంటను (మార్కెటబుల్ మిగులు) పండించడమే! రైతులకు ఆర్థిక అక్షరాస్యతనూ, ఋణ సదుపాయాన్నీ కల్పించడం ద్వారా దీనిని మెరుగుపరచవచ్చు.14

11.4 రైతుల నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన పాఠాలు:15
రైతు, వ్యవసాయం చేయాలనే ఉద్దేశ్యంతో, ఆహార నిద్రలను విస్మరిస్తాడు. పంట పనిలో నిమగ్నుడై ఉంటాడు. అతని కుటుంబము యొక్క క్షేమము, తాను ఇంటికి తెచ్చే పంట పైన ఆధారపడి ఉందని, తన దృష్టిని పూర్తిగా వ్యవసాయంపైనే కేంద్రీకరిస్తాడు. ఆ రైతు, కష్టాలను సహించి, రాత్రింబగళ్లు శ్రమించి, పెరుగుతున్న పంటలను చూస్తూ, చేతికి చిక్కిన ధాన్యాన్ని సేకరిస్తాడు. పర్యవసానంగా, అతను, తన కుటుంబంతో, సుఖ సంతోషాలతో రాబోయే నెలలను తృప్తిగా గడపగలుగుతాడు.

విద్యార్థులు, ఆధ్యాత్మిక సాధకులు, ఈ పాఠాలను, రైతుల నుండి నేర్చుకోవాలి. యవ్వన దశ, మానసిక, మేధో సంస్కరణకు అనువైన కాలము. ఈ దశలో భక్తి శ్రద్ధలతో, తెలివిగా కృషి చేయాలి; ఒకసారి వృధా చేసినట్లయితే, వాటిని ఎప్పటికీ తిరిగి పొందలేము. కష్టాలు, అవరోధాలతో సంబంధం లేకుండా, వాటిని తమ పురోగతికి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకోవాలి. సహజంగానే, అడ్డంకులను అధిగమించాలి. ఇంద్రియాల ఘోష, నిశ్శబ్దం కావాలి; ఆకలి మరియు దాహం నియంత్రించబడాలి; నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవాలనే కోరికను అరికట్టాలి. లక్ష్య సాధనే సాధకులకు గురి కావాలి.

12. మానవ జీవితమంటే అన్నము (ఆహారము) నుంచి ఆనందానికి పయనించటమే:

బ్రహ్మము సర్వవ్యాపకం. బ్రహ్మము యొక్క సూత్రం నుండి, ఆకాశము ఉద్భవించింది. ఆకాశము నుండి గాలి, గాలి నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి వచ్చింది. భూమిపై పంటలు పండి, పంటల నుండి ఆహారం సిద్ధమయి, ఆహారం నుంచి మానవులు ఉద్భవించారు.  మానవ జీవితం అనేది అన్నము (ఆహారము) నుండి ఆనందము వైపు సాగే ప్రయాణం. మానవ జీవితం, ఆహారంతో ప్రారంభమయ్యి, ఆనందమనే అంతిమ లక్ష్యం పొందడమే. ఈ విధంగా, ఆహారానికి, బ్రహ్మమునకు, ఆనందానికి సన్నిహిత సంబంధం అన్నది భారతీయ వైదిక వివేచన. ఆహారమును బ్రహ్మముతో సమానంగా భావించడం ఉపనిషత్తుల భావధార. అందుచేత, భారత దేశంలో, రైతుల మీద, వ్యవసాయం మీద, ప్రత్యేక దృష్టి నిలిపి, వాటిని సురక్షితంగా ఉంచవలసిన బాధ్యత సమాజానికి ఉంది. ఇది లుప్తమవుతున్న ఈ యుగంలో, ఈ విధమైన పరిశీలన - పరిశోధన వివేచనలు చేసి, రైతుకి, అతని ఆదాయానికి, తద్వారా రక్షణ కలిగించాల్సిన ఈ సందర్భంలో, ఈ రకపు వివేచన ఎంతో కొంతైనా మార్గాన్ని వేయడానికి తోడ్పడుతుంది.

13. ముగింపు:

 • రైతుల జీవనోపాధి, పెరుగుతున్న మన జనాభా యొక్క దీర్ఘకాలిక ఆహారభద్రత అవసరాలు అన్న రెండింటినీ రక్షించడంలో, పంట ఆదాయరక్షణ కీలకపాత్ర పోషిస్తుంది.
 • భారతదేశంలోని కార్మికవర్గం ఎక్కువ శాతం వ్యయసాయాన్ని జీవనోపాధిగా చేసుకున్నందువల్ల, ప్రజలకు ఈ రక్షణ ఎంతో అవసరం.
 • అనూహ్య వాతావరణసంఘటనలనూ, మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల నుండి ఉత్పన్నమయ్యే నష్టాలనూ తగ్గించడం ద్వారా, రైతులకు పంట ఆదాయరక్షణా, వినాశకరమైన నష్టాలను నివారించవచ్చు.
 • ప్రభుత్వ పరంగా, వ్యవసాయ రంగంలో అవసరమైన పెట్టుబడులను పెంచడం ద్వారా పంట ఆదాయాన్ని బలోపేతం చేయవచ్చు.
 • కనీస మద్దతు ధర (MSP) విధానం, ధర తగ్గుదల సమయంలో కేవలం నిర్దిష్ట పంటలకూ, ప్రాంతాలకు మాత్రమే భద్రతావలయాన్ని అందిస్తోంది. కానీ ఒక ప్రభావశీల ప్రమాద నిర్వహణలో, రైతులు, ప్రభుత్వ సంస్థలు, ఋణ సంస్థలు, బీమా కంపెనీలు, వ్యవసాయ- వ్యాపారులు, మరియు అగ్రి-టెక్ సంస్థలతో సహా వివిధ వాటాదారుల మధ్య సహకార ప్రయత్నం కల్పిస్తుంది.
 • పంటల తీవ్రతను పెంచడం, వినూత్న సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, ఆర్థిక అక్షరాస్యత మరియు ఋణ సదుపాయాన్ని మెరుగుపరచడం వంటి వ్యూహాలను అమలు చేయడం ద్వారా, రైతుల ఆదాయాలను స్థిరీకరించనూవచ్చు, ఆర్థిక వృద్ధినీ కలిగించవచ్చు.
 • వ్యవసాయంలో నిమగ్నమైన వారికి ఉద్యోగ భద్రతనూ, ఆర్థిక స్వేచ్ఛను అందించవచ్చు. తద్వారా ఆహార ఉత్పత్తికి సుస్థిర భవిష్యత్తును భద్రపరచవచ్చు.

14. పాదసూచికలు:

 1. భగవాన్ శ్రీసత్యసాయిబాబా. (1975). వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసము, ముంబై. 
 2. భగవాన్ శ్రీసత్యసాయిబాబా. (1968). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రారంభోత్సవం సందర్బంగా ఇచ్చిన ఉపన్యాసము, అనంతపురం.
 3. తివారి, ఎస్., కోబుల్, కె. హెచ్., బార్నెట్, బి. జె., & హారి, ఎ. (2021). ఆదాయ రక్షణ బీమాలో అంతర్నిహితమైన ధర ప్రమాదాన్ని హెడ్జింగ్ చేయడం. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్, 53(4), 510-530.
 4. వార్షిక PLFS నివేదికలు, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. https://dge.gov.in/dge/reference-publication-reports-annual నుండి 2024 జూన్ 26న పొందినది.
 5. వ్యవసాయ గణాంకాలు - 2022, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
  https://desagri.gov.in/wp-content/uploads/2023/05/Agricultural-Statistics-at-a-Glance-2022.pdf నుండి 2024 జూన్ 26న పొందినది.
 6. కొమారెక్, ఆ. ఎం., డి పింటో, అ., & స్మిత్, వి. హెచ్. (2020). వ్యవసాయంలో ప్రమాదాల రకాలను సమీక్షించడం: ఏమి తెలుసుకున్నాము మరియు ఏమి తెలుసుకోవాలి? అగ్రికల్చరల్ సిస్టమ్స్, 178, 102738. 
 7. ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ (OECD). వ్యవసాయ విధాన సంస్కరణలు మరియు వ్యవసాయంలో సహనశక్తి. OECD వెబ్సైట్ https://www.oecd.org/agriculture/topics/risk-management-and-resilience/ నుండి 2024 జూన్ 2న పొందినది. 
 8. తివారీ, ఆర్., చాంద్, కె., & అంజుమ్, బి. (2020). భారతదేశంలో పంట బీమా: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సమీక్ష (PMFBY). FIIB వ్యాపార సమీక్ష.
 9. వూడార్డ్, జె. డి., షెరిక్, బి. జె., & ష్నిట్‌కీ, జి. డి. (2010). బహుళ పంటల వ్యవస్థలో పంట బీమా యొక్క ఆదాయ ప్రమాదం తగ్గింపు ప్రభావాలు. అప్లైడ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ అండ్ పాలసీ, 32(3), 467-485.
 10. స్పార్రో, రోబర్ట్, హోవర్డ్, మార్క్, & డీజెలింగ్, క్రిస్. (2021). వ్యవసాయంలో కృత్రిమ మేధస్సుకు యొక్క ప్రమాదాలను నిర్వహించడం.. NJAS: వ్యవసాయ మరియు జీవ శాస్త్రాలు లో ప్రభావం, 93(1), 172-196.
 11. రెడ్డి, ఎ. అమరేందర్. (2021, జూలై 3). భారతదేశంలో వ్యవసాయానికి కనిష్ట మద్దతు ధర యొక్క విధానపరమైన అంతరార్థములు. అకాడెమియా లెటర్స్, వ్యాసం 2406.
 12. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. (2021). పిఎం-కిసాన్. https://cprindia.org/wp-content/uploads/2021/12/PM-Kisan-2021-22-2.pdf  నుండి 2024 జూన్ 1న పొందినది.
 13. లీ, ఎక్స్., & యాంగ్, డి. (2024). గ్రీన్ ఛాంపియన్లను పెంపొందించడం: సస్టైనబుల్ అగ్రికల్చర్‌లో ఉన్నత ప్రమాణాల రైతు శిక్షణ యొక్క పాత్ర. జర్నల్ ఆఫ్ ది నాలెజ్ ఎకానమీ.
 14. దాస్, ఎస్., & మజి, ఎస్.కె. (2023). రైతుల ఆర్థిక సాక్షరత మరియు దాని నిర్ధారకాలు: దక్షిణాసియా నుండి సాక్ష్యాలు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సోషియో ఎకనామిక్స్, 50(9), 1341-1354.
 15. సాయి ప్రభాకర్, బాలాంత్రపు. (2024). వ్యవసాయము - ఆధ్యాత్మికక్షేత్రము. సనాతనసారథి. 67వ సంపుటం. శ్రీసత్యసాయి సాధన ట్రస్టు, పబ్లికేషన్స్ విభాగం, ప్రశాంతినిలయం.

15. ఉపయుక్తగ్రంథసూచి:

 1. OECD-FAO అగ్రికల్చరల్ ఔట్లుక్. (2022-2032). ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఇసిడి) మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO).
 2. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (IFPRI). (2022). 2022 గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్: క్లైమేట్ చేంజ్ అండ్ ఫుడ్ సిస్టమ్స్. వాషింగ్టన్, DC.
 3. ఆర్థిక సర్వే. (2022-23). ఆర్థికమంత్రిత్వశాఖ, భారతప్రభుత్వం. వెబ్ లింకు: https://www.indiabudget.gov.in/economicsurvey/. ఏక్సెస్ చేసిన తేదీ 06-06-2024.
 4. ఆహార మరియు వ్యవసాయ సంస్థ. (2021). వ్యవసాయం మరియు ఆహార భద్రతపై విపత్తులు మరియు సంక్షోభాల ప్రభావం: 2021. రోమ్.
 5. ఇండియా బడ్జెట్. (2023-24). ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. వెబ్ లింకు: https://www.indiabudget.gov.in/ ఏక్సెస్ చేసిన తేదీ 05-06-2024.
 6. ఐక్యరాజ్యసమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ. (2022). ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ గణాంక వార్షిక పుస్తకం.
 7. కోకోట్, జె., మార్కోవిక్, టి., ఇవనోవిక్, ఎస్., & మెసెల్డ్జిజా, ఎం. (2020). పంట ఉత్పత్తిలో ఆర్థిక స్థిరత్వానికి కారకంగా మొత్తం వ్యవసాయ ఆదాయ రక్షణ. సుస్థిరత.
 8. చాంద్, ఆర్., & సింగ్, జె. (2023). హరిత విప్లవం నుండి అమృత కాల్ వరకు - భారతీయ వ్యవసాయానికి పాఠాలు మరియు ముందుకు వెళ్లే మార్గం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారత ప్రభుత్వం.
 9. తివారీ, ఎస్., కోబుల్, కె. హెచ్., హ్యారీ, ఎ, & బార్నెట్, బి. జె. (2017). ఆప్షన్స్ మార్కెట్ ద్వారా పంట రాబడి బీమా యొక్క ధర ప్రమాదాన్ని తగ్గించడం. సదరన్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అసోసియేషన్ (SAEA) వార్షిక సమావేశం, అలబామా.
 10. దివాన్, ఎస్. (2023). అగ్రికల్చర్ 2.0: అగ్రికల్చర్ టెక్నాలజీని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF).
 11. ప్రపంచ ఆర్థిక ఔట్లుక్. (2023). చాప్టర్ 3: ఫ్రాగ్మెంటేషన్ అండ్ కమోడిటీ మార్కెట్లు - దుర్బలత్వాలు మరియు నష్టాలు. IMF.
 12. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ గణాంక వార్షిక పుస్తకం. (2022). యునైటెడ్ స్టేట్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్.
 13. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. (2023). రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం. భారత ప్రభుత్వం.  వెబ్ లింకు: https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1947877. ఏక్సెస్ చేసిన తేదీ 05-06-2024. 
 14. బిరామ్, హెచ్., కోబుల్, కె., హ్యారీ, ఎ., పార్క్, ఐ., & టాక్, జె. (2022). ధర మరియు దిగుబడి ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా రెవెన్యూ రక్షణ మరియు వ్యవసాయ ప్రమాద కవరేజీ. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్.
 15. రోమన్, హెచ్. (2019). వ్యవసాయ ప్రమాద బదిలీ: బీమా నుండి పునర్బీమా నుండి మూలధనానికి. జాన్ వైలే అండ్ సన్స్.
 16. లామ్, జె. (2014). ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్: ప్రోత్సాహకాల నుండి నియంత్రణ వరకు (రెండవ ఎడిషన్). జాన్ వైలే అండ్ సన్స్.
 17. వీరభద్రయ్య, ముదిగొండ. (1986). సామాజిక సాహిత్య వ్యాసాలు. స్వీయ ప్రచురణ. నిజామాబాద్. 
 18. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. వెబ్ లింకు: https://agriwelfare.gov.in/. ఏక్సెస్ చేసిన తేదీ 03-06-2024.
 19. సాయి ప్రభాకర్, బి. (2024). వ్యవసాయము - ఆధ్యాత్మిక క్షేత్రము. సనాతన సారథి, 67వ సంపుటం. శ్రీ సత్య సాయి సాధన ట్రస్టు, పబ్లికేషన్స్ విభాగం, ప్రశాంతినిలయం.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]