AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. ఉమ్మడి నల్లగొండజిల్లా రెడ్డికులశాఖలు: గోత్రాలు, సంస్కృతి
![](/2023/author_pics/n_lavendar_reddy.jpg)
నర్రా లవేందర్ రెడ్డి
సహాయాచార్యులు,
నాగార్జున ప్రభుత్వ కళాశాల,
నల్లగొండ, తెలంగాణ.
సెల్: +91 9849723772, Email: narralavendarreddy@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
రెడ్డి కులానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, వారి గోత్రాలకు సంబంధించి, జరిగిన పరిశోధనలు తక్కువనే చెప్పాలి. రాయలసీమలోని కమలాపురం తాలూకా ‘రెడ్ల కుల గాధలు ఇంటిపేర్లు గోత్రాలు – భాషా సామాజిక పరిశీలన’ అనే అంశంతో డాక్టర్ మూలె విజయలక్ష్మి గారు పరిశోధన చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెడ్డి కుల సంప్రదాయాల గురించి కానీ, సామాజిక అంశాల మీద కానీ ఇప్పటివరకు పరిశోధనలు వచ్చినట్లుగా లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థిరపడిన రెడ్ల శాఖల సాంస్కృతిక నేపథ్యాన్ని, గోత్రాలను వారి ఇంటి పేర్లను చర్చించాలనే ఉద్దేశంతో ప్రశ్నావళి పత్రాన్ని తయారు చేసి, ఇంటర్వ్యూ ద్వారా సమాచారాన్ని సేకరించి, విశ్లేషణాత్మకంగా ఈ వ్యాసం రాయడమైనది.
Keywords: కులం, గోత్రం, సంప్రదాయం, ఆచారాలు, సంస్కృతి, శాఖలు, ఇంటిపేర్లు.
1.ఉపోద్ఘాతం:.
విభిన్నమైన బౌగోళిక, సాంస్కృతిక, ఉద్యమ, చారిత్రక నేపథ్యం కలిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దుగా ఉన్న ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నివాస పరంగా అనేక కులాల, మతాలకు చెందిన వారున్నారు. వృత్తిపరంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య ఈ జిల్లా లో అధికం. వ్యవసాయమే కులవృత్తి ని ఆధారంగా చేసుకుని జీవించే వారిలో రెడ్డి కులం ఒకటి. ప్రాచీన కాలము నుండి వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని జీవించే ఈ కులం లో మోటాటి, గుడాటి, పాకనాటి, పెడకంటి అనే శాఖలు ఈ జిల్లా లో ఉన్నాయి. ఈ శాఖలు ఏర్పడడానికి స్థానికంగా చెప్పే గాధలు కొన్ని ఉన్నాయి. సామాజికంగా వీరంతా ఒకే వర్గానికి చెందినప్పటికీ పూర్వం రోజుల్లో ఒకరికొకరు వివాహసంబంధాలు ఇచ్చిపుచ్చుకునే వారు కాదు.ఎవరి శాఖకు చెందిన వారితో వారే వివాహ సంబంధాలు కలుపుకునే వారు. నల్లగొండ జిల్లాకు సంబంధించిన రెడ్డి కుల సంప్రదాయ,సంస్కృతులు,ఆచారాలు ప్రస్తుతం మారుతున్న కాలం తో పాటుగా మార్పులకు లోనవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఒకరికొకరు వివాహ సంబంధాలు కలుపుకోవడం వంటి పరిణామక్రమాలు వృద్ధి చెందాయి.
2. విషయ వివరణ:
(అ) రెడ్డి పదం పుట్టుక:
‘రెడ్డి’ పదం పదోత్పత్తి క్రీస్తు శకం ఆరో శతాబ్దం నుండి రకరకాల పేర్లు మార్చుకుంటూ వస్తుంది. క్రీస్తు శకం ఆరో శతాబ్దం లో రట్టులు గా,ఏడో శతాబ్దంలో గుంటూరు జిల్లా మాచర్ల శాసనంలో ‘రట్టగుల్లు’గా, ఎనిమిదవ శతాబ్దంలో కడప జిల్లా శాసనాలలో ‘రట్టొడ్లు’’ రట్టులు’ఉన్నారని,. క్రీస్తు శకం 973 నాటికి తెలంగాణలోని వరంగల్ జిల్లా కొండపర్తి శాసనంలో’ పొలిమేరటోడు’ గా రెడ్లు పేర్కొనబడ్డారు.1
‘పొలిమేరట్టొడు’ అనేది గ్రామ పెద్ద అధికారై ఉండవచ్చు. ఈ శాసనం కౌలుకు సంబంధించిన ఒప్పందం గురించి తెలియజేస్తుంది. ‘రట్టడికం’ వ్యవస్థను నిర్వహించిన వారిని రెడ్లు అని పిలిచేవారు.‘రట్టడికం’ అనే పదానికి అర్థం ‘రట్టడి’అనగా రాజ్యమని,‘ ఇకం’అనగా వ్యవసాయానికి గ్రామ రక్షణకు భూమిని పొందిన వారిని చారిత్రకల అభిప్రాయం. రట్టరికం అంటే గ్రామ సీమల్లో పన్నులు వసూళ్లు, ప్రభుత్వానికి చెల్లింపులు, న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవటం మొదలైన గ్రామ పాలన నిర్ణయాలు బాధ్యతలు నిర్వహించే వ్యవస్థ. రట్టడికం నిర్వహించే పెద్దను “రట్టాడి”అనేవారు. రాట్టడికం ‘రట్టగుడి’గా తరువాత రెట్టఉడి, రట్టాడి, రట్టజకము, రద్రికము, రట్టిగ మారుతూ చివరకు “రెడ్డి” పదంగా స్థిరపడిందని చరిత్రకారులు భావించారు. క్రమంగా ‘రెడ్డి’ గ్రామ పాలన రక్షణ బాధ్యతలు నిర్వహించే అధికారి అయ్యాడు.
ప్రాచీన ఆంధ్ర కావ్యాలలో రెడ్డి పదం రట్టడి,రడ్డి , రెడ్డి అనే రూపాలను దాల్చింది. మల్లికార్జునపండితారాధ్యుడి“శివతత్వసారం”లో ‘రట్టళ్ళు’ అని, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో ’రడ్డు’ అని, తెనాలి రామకృష్ణ కవి పాండురంగ మహాత్మ్యం లో ‘రడ్డులు’ అని, మల్లారెడ్డి శివ ధర్మోత్తరం లో ‘రడ్డి’అని, తంజావూర్ రఘునాధరాయల రామాయణంలో ‘రెడ్డి’అని, చేమకూర వెంకట కవి సారంగధర చరిత్రం లో’ రడ్డి’అనే పదాలు కనిపిస్తాయని సాహితీ విశ్లేషకులు వెల్లడించారు.2
శాసనాలలో’ ‘రట్టడం’అంటే ఒక విధమైన ఆశాసనాలలో ‘రట్టడికం’ ‘గురించి చెప్పబడింది. అనేక ర్థిక సంస్థలు, ఇవి భూభాగాలై వీటిని అధికారులు గుత్తగా అనుభవిస్తుంటారు. అష్ట భోగస్వామ్యములు కలిగి అనుభవించు చుండిరని ఈశ్వర దత్తు గారి రెడ్డి సంచిక వ్యాసంలో చెప్పబడింది.
దాని ప్రకారం అష్టభోగాలంటే నిధి ,నిక్షేపం, జలం, పాషాణాలు, అక్షిణి, ఆగామి, సిద్ధం, సాధ్యం అని కూడా తెలుపబడింది. నిఘంటువులలో’ రట్ట’ (reign Kingdom,empire country,) అని, గుట్టు, గుట్టిక (guardian,town watchman,chief constable) అని, guttu=lease or leases అని, తెలుస్తుంది.3
అన్నింటినీ క్రోడీకరించిన చరిత్రకారులు కందుకూరి ఈశ్వరదత్తు ఈ చరిత్ర చర్చినంతయు ఈ విధంగా ముగించారు.
“ఏడెనిమిది శతాబ్దాల లో ఆంధ్ర దేశంలో ‘రట్టగుడ్లు’’ రట్టగుట్లు’ అనే తెగ వారు ఉండిరి. వీరే రాట్టడులైరి. వీరు రట్టకములను చిన్న భూభాగముల కధికారులై వాటిని గుత్తగా అనుభవించుచుండిరి. ఈ ఆర్థిక సంస్థల ద్వారా వీరు అష్టభోగస్వామ్యములు కలిగి అనుభవించుచుండిరి. వీరి ముఖ్య వృత్తి వ్యవసాయం. రట్టకముల కదికారులు రట్టడులు, రడ్డులు తదనంతరం కాలంలో రెడ్లుగా మారిరి అని వివరించారు”.4
(ఆ) రెడ్లు శాఖలుగా చీలుట:
రెడ్ల ఆశ్రిత కులం అయిన బిక్క్షుక కుంట్ల/పిచ్చుక కుంట్ల వారు చెప్పే కథనం ప్రకారం రెడ్లు దేవగిరి పట్టణంలో ఉన్నప్పుడు అంతా ఒకటిగానే ఒకే రెడ్డి జాతిగా ఉండేవారు. ఎప్పుడైతే ఢిల్లీ నవాబు పాశ్చావ్ కు తమ పట్టణంలో భోజనం పెట్టి ఊరేగింపుగా పంపిస్తారో అప్పుడు రెడ్డి వారి ఆడబిడ్డలైన తిమ్మోజమ్మ, అమ్మోజమ్మలను చూసి పాశ్చావ్ ఇష్టపడతాడు. పెళ్లి చేయమని అడిగిన పాశ్చావ్ ను మూడు నెలల తర్వాత రమ్మని చెప్పి రెడ్లంతా తమ ఆడబిడ్డలను దుష్ట నవాబుకు ఇవ్వడం ఇష్టం లేక దేవగిరి పట్నం నుంచి దక్షిణం వైపు బయలుదేరుతారు. మొత్తం 24 వేల బండ్లు కట్టుకొని తమ సామాగ్రినంత తీసుకుని బయలుదేరిన రెడ్లను మధ్యలో’ కాసేటి’ నది అడ్డగిస్తుంది. కాసేటి నదికి రెడ్లు నరాగతినిచ్చి ఒక్కో గుంపుగా కొంతమందికలిసి ఒకేసారి కొన్ని బండ్లను ఆ గుంపుకు సంబంధించినవిగా బయలుదేరుతూ ఉంటారు. అలా బయలుదేరేటప్పుడు రెడ్లకు పద్యాలు, కులగోత్రాలు చెప్పే కుంటి మల్లారెడ్డికి చెప్పి బయలుదేరుతారు. ఒక్కో గుంపుకు కుంటి మల్లారెడ్డి ఆ సమయంలో పేర్లు పెడుతుంటాడు.
మొదట బయలుదేరిన గుంపుకు మొటాటి అంటే ‘మొదలు వంశం మోటాడు, దేశానికి తల్లి వంశంబు మోటాటివంశంబు’ అని పేరు పెడతాడు. ఆ తర్వాత వచ్చిన గుంపు మొటాటి ఎంటవచ్చినది కాబట్టి ఎలనాడు. పంట పండించేవారు పాకనాడు. ఆ తర్వాత ఎద్దులను బట్టి బండ్లకు కట్టిన వాటిని బట్టి ముక్కు సత్తుకాపు, మున్జాతి కాపు, అరవకాపు, కోయ కాపు అనే రకరకాలుగా పేర్లు పెట్టినాడు. ఆ తర్వాత కొంత కాలంతరువాత దక్షిణాననుండి వేరే ప్రాంతాలకు వీరు వలస వెళ్లిపోయారు. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో శాఖ విస్తరించింది. అలా స్థిరనివాసం ఏర్పరుచుకున్న వారే తర్వాత కాలంలో ఆ శాఖ సంబంధీకులుగా మిగిలిపోయారు. కుంటి మల్లారెడ్డి స్వయాన పెట్టిన పేర్లే కాకుండా మల్లారెడ్డి చెప్పకుండా కొందరు వెళ్లి వెలనాటి రెడ్లుగా, అందరూ వెళ్లేలా ఒకేలా వెళ్లకుండా విరిగిన ఇరుసు స్థానంలో హస్తమును ఇరుసు గా చేసుకుని పెడగా ఒడ్డు చేరిన గుంపు వారు’పెడకంటి’వారుగాస్థిరపడిపోయారు.
(ఇ) రెడ్ల శాఖలు - వివరణ:
‘వడ్ల’ లో ఎన్ని రకాలు ఉన్నాయో’రెడ్ల’ లో అన్ని రకాల శాఖలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. మొత్తం 36 శాఖలు ఉన్నాయి. నివసించే ప్రాంతాన్ని బట్టి, కట్టుబాట్లను బట్టి నడవడికను బట్టి రెడ్డి శాఖలు ఏర్పడ్డాయి.1.మోటాటి 2. వెలనాటి 3.మొరస, నేరేటి,5. అయోధ్య, 6. పంట 7. పొంగలి నాటి 8. పాకనాటి 9. భూమంచి 10. కురిచేటి 11. మున్నూటి 12. దేసట్టి 13. ఓరుగంటి 14. గండికోట 15. కమ్మపురి 16. గోన 17. చిట్టెపు 18. కుంచెడుగా 19. గాజుల 20. కొణిద 21. పెడకంటి 22. గుడాటి 23. గోనుగంటి 24. దేసూరి 25. నానుగండ 26. నెరవాటు 27. పల్లె 28. బలిజ 29. భూస 30. తొగర్చేడు 31. ఎడమ/ఎడ్లను 32. రేనాటి 33. లాలిగుండ34. సజ్జన 35. సాదర 36. అరిటాకు. (రెడ్ల ఇంటి పేర్లు-గోత్రాలు, పుటలు-11,12)
పైన చెప్పిన 36శాఖలు భక్త మల్లారెడ్డి చరిత్రలో పేర్కొనబడ్డాయి. మిగతా శాఖలు కాలక్రమంలో ఒక శాఖ నుండి విడివడి అంత: శాఖలుగా ఏర్పడ్డాయి. అవి పోకనాటి, గూరేడి, మోకిరెడ్డి, కోడితి, కోడిదల, ఎలమ, రాయలను, ఎర్రలను, నల్లెలమ, నామదర్లు, వడ్డే రెడ్లు, లక్కమారి, మున్నూరు, రెడ్డి గాండ్ల, చౌదరి, చీరగట్ల మొదలైనవి చెప్పవచ్చు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో 12 శాఖల రెడ్డి వారు మాత్రమే జీవనం సాగిస్తున్నారు. వారిలో మోటాటి, ఎడ్ల, చౌదరి, చిట్టెపు, పాకనాటి, పెడకంటి, గుడాటి, ఓరుగంటి, నేరేటి, పంట, గోన, కొణిడే, వంటి శాఖల వారు నివసిస్తున్నారు. (మల్గిరెడ్డి భీమార్జున్ రెడ్డి నాగిరెడ్డి గూడెం, వయస్సు 57, పాకనాటి)
(ఈ) నల్లగొండ జిల్లాలో నివసిస్తున్న రెడ్ల శాఖలు:
మోటాటి, గుడాటి, పాకనాటి, పెడకంటి శాఖలు గా కలిగిన రెడ్డి కులస్తులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నివసిస్తున్నారు. ఈ శాఖలకు ఆ పేర్లు ఏ రకంగా ఏర్పడ్డాయో కుంటి మల్లారెడ్డి కథలో చెప్పబడింది.
“కుంటి మల్లారెడ్డి పెద్ద తండ్రి అయిన ఉత్తమా రెడ్డి యు ఆ సీమ కాపులు బండ్లపై దక్షిణాదికి వలసపోవుచుండరి. దారిలో కాపులెక్కన బండి ఇరుసు విరిగి కూలండెను. అంతనొక రెడ్డి పెడ ఇరుసున చేయిబట్టి ‘పొబండి’ అనెనట. ఆనాటి నుండి ఆ వంశం వారు పెడకంటి కాపులైరి. బండి నోగలున కూర్చుండిన కాపు మొటాటి కాపయ్యను. బండి విరగగా, వెంటనే దిగి పక్కన నడిచిన కాపు వంశము వారు పాకనాటి కాపులైరి. దారిలో చతుర సంభాషనోక్తులు చెప్పిన కాపు వంశము వారు నెరవాటి కాపులైరి. ఉత్తమా రెడ్డికి వచ్చిన కష్టమును నిర్లక్ష్యం చేసి వారితో కలయక వాలుగొండలో తలదాచుకునిన వాని సంతతి వారు వాలగు ఒండ కాపులైరి”
అని డా. రావి ప్రేమలత తెలుగు ‘జానపదగేయగాథలు’ అనే గ్రంథం నుండి సేకరించి ’తెలుగు జానపద సాహిత్యం- పురాగాలు’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఇందులో పేర్కొన్న వాటిలో గుడాటి తప్ప మిగతా శాకలైన పెడకంటి, మోటాటి, పాకనాటి, రెడ్ల శాఖలు ఉమ్మడి నల్లగొండజిల్లా ప్రాంతంలో కనిపిస్తున్నాయి.
(ఉ) నల్లగొండ జిల్లాలో రెడ్డి శాఖలు విస్తరింపబడిఉన్న ప్రాంతాలు:
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొటాటి రెడ్డి శాఖ వారు అన్ని (12) శాసనసభ నియోజకవర్గాల్లో పూర్వం నుండి నివసిస్తూ ఉన్నారు. హుజూర్నగర్, కోదాడ శాసనసభ నియోజకవర్గాల్లో తక్కువ మొత్తంలో నివసిస్తున్నారు. ఆ తర్వాత గుడాటి రెడ్డి శాఖ వారు నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మునుగోడు శాసనసభ నియోజకవర్గాల్లో నివసిస్తున్నారు. హుజూర్నగర్, కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ నియోజకవర్గ పరిధిలో తక్కువ మొత్తంలో నివసిస్తున్నారు. వీరి తర్వాతి స్థానం పెడకంటి రెడ్డి శాఖకు చెందుతుంది. వీరు ఎక్కువగా మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ శాసనసభ నియోజకవర్గ ప్రాంతాల్లోఎక్కువగా నివసిస్తున్నారు. ఆ తర్వాత స్థానం లోపాకనాటి రెడ్డి శాఖకు చెందినవారు ఉన్నారు. వీరు మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్, కోదాడ శాసనసభ నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రవహించే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పెడకంటి, పాకనాటి రెడ్డి శాఖల వారు ఎక్కువగా నివసిస్తూ ఉంటే మూసిప్రాంతంలో మొటాటి ,గుటాటి రెడ్డి శాఖల వారు ఎక్కువగా నివసిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. అయితే మారుతున్న కాలాన్ని బట్టి అన్ని శాఖల వారు అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ,వ్యవసాయ, వాణిజ్య, విద్య అవసరాలను బట్టి స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు.
(ఊ) మొటాటి రెడ్లు:
తెలంగాణ ప్రాంతంతో పాటు కర్నూలు, కృష్ణప్రాంతం గుంటూరు జిల్లా, నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి మొటాటి రెడ్లు ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయంలో స్పష్టత లేదు. బావుల నుండి ‘మోట’ కొట్టే రెడ్లను మోటాటి రెడ్లని పిలిచారు. అయితే కవిరెడ్డి మల్లారెడ్డి రాసిన పద్యంలో తాను మటవాడ వంశానికి చెందిన వ్యక్తిగా చెప్పుకున్నాడు. అంతేకాకుండా తన తాత గ్రామ చౌదరిగా పనిచేసినట్లు పేర్కొన్నాడు.
“అట్టిగంగకు తోబుట్టువగు చతుర్ధ
జాతి యందు నితాంత విఖ్యాత ధనురుచున్న
మటవాడ కులము నొప్పు మీరే
చాలా విద్యులు ధార భోపాల మౌలి
తిమ్మ భూపాలుడు”
సుమారు 300 సంవత్సరాల క్రితం అలంపూర్ ను పాలించిన రెండవ తిమ్మ భూపాలుడు తాను మట్టవాడకు సంబంధించిన వ్యక్తిగా పద్యంలో రాసుకున్నాడు. దీన్ని బట్టి మట్టెవాడనే’ మటాటి’ అని ఇది ఒక ప్రాంతానికి చెందిన పేరుగాతెలుస్తుంది.అయితే ‘మట్టెవాడ’ పేరుకు తగ్గట్టు దగ్గరగా పోల్చి చూస్తే వరంగల్ పట్టణంలో ‘మట్టెవాడ’అనే ఒక ప్రధానమైన వీధి ఉంది. రెడ్లు ‘మట్టెవాడ’ ప్రాంతం నుండి వచ్చి ఉంటారని సురవరం ప్రతాపరెడ్డి గారు అభిప్రాయపడ్డారు. అయితే మట్టేవాడ ను పోల్చిన ప్రాంతం పేరు మొట్టివాడ నాడు. ఇది ఒకప్పటి పల్నాటి సీమలో భాగంగా ఉన్న మార్కాపురం ప్రాంతంగా చెబుతారు. దీన్ని బట్టి మోటాటీ వారు పల్నాటి ప్రాంతం నుంచి వచ్చి ఉంటారనే పదానికి కొంత బలం చేకూరుతుంది.అయితే పల్నాడులో ఎక్కువగా జరిగే యుద్ధాల వల్ల మటాటి రెడ్లు కొందరు తెలంగాణ ప్రాంతానికి తరలిపోయినట్లు చరిత్ర లో ఉంది.
‘కొణిదొన’అనగా కాటికదొన అనే 1150 సంవత్సరము నాటి శాసనములో త్రిభువన మల్ల దేవ, పోత్తపిచ్చోడ మహారాజులు కమ్మనాడు, గుండి కర్రు మరియు మోట్టివాడ ప్రాంతాలు జయించినట్లు పేర్కొంది.మోట్టివాడ నాడు గురించి కళ్యాణి చాళుక్యులు వేయించిన త్రిపురాంతక ఆలయ శాసనంలో చెప్పబడింది. ఈ శాసనం ప్రకారం మొట్టి వాడు నాడులో కొలవకుంట, రాచకొండ, ముత్తువాలు, కంభంపాడు, మ్రనేపల్లి, మేడరు, గుట్టలపల్లి, మరియంపాడు, మరియు దువ్వలపల్లి గ్రామాలు ఉండేవి. బాపట్ల శాసనంలో కూడా మోట్టి వాడ గురించి ప్రస్తావింపబడింది. బాపట్ల శాసనం ప్రకారం మొట్టివాడనాడు యొక్క త్రిపురాంతకం ఆలయానికి పుల్లలచెరువు అనే గ్రామాన్ని ఇచ్చినట్లు రాయబడింది. కమ్మనాడు కింద వేంపల్లి, మరకంబల్లి, మల్లమెట్టు, ఉప్పుగుండూరు పెద్దగంజాం, కందకలూరు, కురవద, పైందురు, చినగంజాం, కనపర్తి, పులిచెరువు, పోత్యదేన, అక్క రాజు చెరువు, నందియకుండి, బుల్లికురవ, జొన్నప్రోలురు, అమ్మలపూడి, యుద్ధనంపుడి, రాయగురువు, చిన్జేరువు, పోప్పరం, తోగరవుద్ర మొదలైన గ్రామాలు ఉన్నట్లు ఇతర ఆధారాలద్వారా తెలుస్తున్నది.
(ఎ) పెడకంటి రెడ్లు:
పెడకంటి రెడ్లకు ఆ పేరు ఎలా వచ్చింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ కథను బిక్షక/పిచ్చుక కుంట్ల వారు చెప్తారు. దేవగిరి పట్టణంలో వ్యవసాయం చేస్తూ సుఖసంతోషాలతో ఉన్నటువంటి రెడ్ల దగ్గరకు ఒకనాడు వేట నిమిత్తం ఈ ప్రాంతానికి ఢిల్లీ నవాబు పాశ్చా్వ్దాహంవేసి వస్తాడు. రెడ్లు నవాబు మరియు అతని సైన్యం దాహం తీర్చి భోజనం పెట్టించి పంపిస్తుండగా పాశ్చావ్ మీద నుండి చూస్తున్న అమ్మోజమ్మ,తిమ్మోజమ్మలను చూస్తాడు. వారి అందానికి ముగ్ధుడైన పాశ్చావ్ తనకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. కుంటి మల్లారెడ్డి సలహాతో రెడ్లంతా కలిసి మంచి ముహూర్తాన సంబంధం మాట్లాడాలి మూడు నెలల 15 రోజుల తర్వాత ముస్తాబై రండి పిల్లని ఇస్తామని చెప్పి పంపిస్తారు.వచ్చేవరకు పట్టణంలో ఎవరూ ఉండరాదని వారంతా 24 వేల బండ్ల ను సిద్ధం చేసుకుని సామాగ్రినంత వేసుకొని దక్షిణం వైపు బయలుదేరుతారు. అక్కడ కాసేటి నది అడ్డం వస్తుంది. కాసేటి గంగమ్మను దారి ఇవ్వవలసిందిగా కోరగా బండ్లు వెళ్లడానికి దారినిస్తుంది.
అలా బండ్లు గుంపుల వారిగా వెళ్లి వడ్డెక్కుతుంటాయి. ఇందులో నూరుట్ల కవుల రెడ్డి బండిలో పెద్దమ్మ ,అంకమ్మలు కూర్చుండగా తోలుకొని కాసేటీ నదిని దాటుతుండగా నడి ఏట్లోకివచ్చేసరికి బండి ఇరుసు విరిగి అక్కడే అగిపోతుంది. దానితో అక్కడ నావల్ల రెడ్లవంశానికి ఎక్కడ కళంకం వస్తదో, నవాబు వచ్చినా వెనుకబండ్లలో ఉన్న రెడ్డి వారిని చంపుతాడో ఏమో లేక ఏరు పొంగి రెడ్లవంశం అంతమైపోతున్డో అని భయపడి విరిగిన ఇరుసు తీసివేసి ఎడమ హస్తము ఇరుసుగా వేసి కుడిహస్తంతో ఎర్రజామలు ఎద్దులను తోలుతూ తన బలం, ఎద్దుల బలం చేత వడ్డు కి చేరుతాడు. ఒడ్డున ఉన్న మల్లారెడ్డి చూచి ఆశ్చర్యపడి ఇంత బలంతో ఈ బండి నడిపించావు అందరిలా కాకుండా పెడదారిన వచ్చావు ఎప్పుడు నీవు పెడగా ఉంటావు కాబట్టి పెడకంటి రెడ్డి అవుతావని దీవిస్తాడు. మరి కొంతమంది రెడ్లు అతని వెంట వెళ్లడం వలన ఆ విధంగా వెళ్లిన గుంపు అంతా పెడకంటి వారిగావారి సంతతి ‘పెడకంటి రెడ్లు’గా వివిధ ప్రాంతాలలో చేరి పిలవబడుతున్నారు.
పెడ అంటే విపరీతం, పెద్ద, మొండి అనే అర్థాలు వస్తాయి. ఎవరికి భయపడని వారు అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టి తన వారిని కాపాడుకుంటారు .మొండిగా ప్రవర్తించిన రెడ్డి గారి సంతతి పెడకంటి రెడ్డి అని కథనం.
(ఏ) పాకనాటి రెడ్లు:
నెల్లూరు జిల్లాలో పెన్నా నది ముఖద్వారా ప్రాంతాన్ని దానికి దక్షిణం వైపు ప్రాంతాన్ని పాకనాడు అంటారు. పాక అనగా పూరిల్లు. ఊరు అని అర్థాలు ఉన్నాయి. అంతేగాక కోస్తాలో పూరిలు గుడిసెలు ఎక్కువగా ఉన్న గ్రామాలను పాకలనేవాళ్లు. ఉదా: ముడుంబాక (అలాగే తెలంగాణలోని కొలనుపాక కొండపాకలు కూడా) అనే ఊరు. ఇలా పైన చెప్పిన ప్రాంతంలో నివసించిన రెడ్లను పాకనాటి రెడ్లు అని పిలిచేవారు.
(ఐ) గుడాటి రెడ్లు:
‘కూడిన’ వారు అంటే కలిసేవారు లేదా కలుపుకుని పోయేవారు అని అర్థం. కూడాటి, గుడాటిఅయ్యింది. గడెంవేసి నీరు అందించిన వారిని ‘గుడాటి’ వారు అన్నారని అదే కాలక్రమేనా గుడాటి శాఖగా మారిందని చెబుతున్నారు. తెలంగాణలో ఈ శాఖ వారు అధిక మొత్తంలోకనిపిస్తారు.
(ఒ) రెడ్ల ఇంటి పేర్లు – గోత్రాలు:
“గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషికి రూపానికి జన్మనిచ్చేది స్త్రీ యే అయినా ఆ మనిషి తాలూకా విత్తనానికి జన్మనిచ్చేది పురుషుడే కాబట్టి గోత్రం మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది. ‘గో ‘అంటే గోవు, గురుడు, భూమి, వేదం అని అర్థం. ఆటవిక జీవితం గడిపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాత, ముత్తాతలను గుర్తించుటకు నల్లావుల వారు, కపిలగోవారు, తెల్లావుల వారు అని మూల పేర్లను తగిన విధంగా వాడుకునేవాడు.
“గోత్రాలు ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి. తొలుత గోత్రాలను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూలపురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబందాలు ఉండరాదని వేరే గోత్రీకుల మధ్య వివాహలు జరపడం మంచిదని గోత్రాలుఅందుకు ఉపకరిస్తాయని వాటి ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాల వారు గోత్రా లను ఏర్పరచుకున్నారు”5.
మూల పురుషుడు చేసిన పని, వాడిన పనిముట్లు కూడా గోత్రాల పేర్లుగా నిర్ణయింపబడ్డాయి. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేరు మీద ఏర్పడగా, మరికొన్ని గోత్రాలు వంశంలోనే ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి.
గోత్రము అనే పదము రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడినది. ’గౌ’ అంటే ఆవు. ద్రాహి అంటే కొట్టం. గోత్రము అంటే గోశాల అని అర్థం.గోత్రము అనే పదానికి వంశం గుంపు, సామూహం, పేరు, గొడుగు, బాట అనే అర్థాలు ఉన్నాయని శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు వివరిస్తుంది (పుట నెం 734).
గోత్రం అనే పదము వేదాలకు వ్యాఖ్యానాల వంటివయిన బ్రాహ్మణాలలో ఎక్కడా కానరాదు. అయితే పాలీ భాషలోని కొన్ని శాసనాలలో మనకు’ గొట్ట’ అనే మాట కనిపిస్తుంది.ఉదా. చెప్పాలంటే ‘భగవా గొతమో గొట్టిన కకుసందో కశ్యపోగొట్టన’ అన్న ఒక శాసనం ఉంది. బౌద్ధమతం సుస్థిరమైన కాలము నాటికి గోత్రము అనేది మన సమాజంలో స్థానం సంపాదించుకుంది. జైనులలో కూడా గోత్రం గురించిన ప్రసక్తి ఉంది. తమ తమ గోత్ర కర్మలను బట్టి తదుపరి జన్మలు ఉంటాయని వారు విశ్వసిస్తారని6 దాస్ గుప్తా వివరించారు.
పై అర్థాల ప్రకారం గోత్రాల మూలపురుషులను బట్టి వ్యాప్తి చెందాయి. అదేవిధంగా రెడ్డి కులంలో మొత్తం 36 శాఖలు ఉండగా వారికి 1,85,000 ఇంటిపేర్లు, గోత్రాలు ఉన్నట్లు చెబుతారు. అయితే చరిత్రకారుల ప్రకారం రెడ్డి కులంలో పదివేల ఇంటిపేర్లు, గోత్రాలు ఉన్నట్లు చెబుతున్నారు. రెడ్ల శాఖలలోమొటాటి శాఖలో 360 గోత్రాలు ఉన్నట్లు ,పాకనాటిలో 120 గోత్రాలు ఉన్నట్లు రెడ్ల వద్దకు వచ్చే పిచ్చుకకుంట్ల వారు చెపుతుంటారు.వారు కుంటి మల్లారెడ్డి, అనుముల బ్రహ్మ రెడ్డి కథ చెప్పుకుంటూ గోత్రాల పేర్లు కూడా చదువుతారు.
నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్ల శాఖల్లో ఉన్న ఇంటి పేర్లు, గోత్రాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన కొన్ని అంశాలు తెలియ వస్తున్నాయి. ఉదాహరణకు పోగునోళ్ల, ముదునోళ్ల, పగిడిపాల గోత్రాలను పరిశీలిస్తే ఒకే ఇంటి పేరు ఉన్నప్పటికీ పది రకాల గోత్రాలు కనబడుతున్నాయి. వేరే కులంలో ఒకే గోత్రం కింద పది, ఇరవై రకాల ఇంటిపేర్లు ఉండగా, రెడ్డి కులంలో ఒకే ఇంటి పేరు గల వారికి పది రకాల గోత్రాలు కనబడుతున్నాయి.
ఉదాహరణకు ‘అన్నపురెడ్డి’ ఇంటి పేరు గల వారికి కొమ్మల, రోమాళ్ళ, కుమరినోళ్ళ, చెమకోళ్ల ,చెట్నోళ్ల, తగునోళ్ల, పోగునోళ్ల మేరిల్ల, మేదిల్ల, మేడికోళ్ల వంటి గోత్రాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ‘ఆవుల ‘అనే ఇంటి పేరుకి ఊవిళ్ళ, ఎనోళ్ల, కోడి, కోళ్లు, గోవుల జనింకుల, నగూర్ల, నవ్వుల, నూగుల, పోగునేని, మేడిపూల ,పోగునోళ్ళ అనే గోత్రాలు కనబడుతున్నాయి.
ఈ రకంగా గోత్రాలు - ఇంటిపేర్లలో వైవిధ్యముంది. పూర్వం మొటాటి, పాకనాటి ,గుడాటి, పెడకంటి రెడ్లు కలిసి జీవనం సాగించినప్పటికీ సంబంధాలు కలుపుకునేటప్పుడు మాత్రం ఎవరి సమూహంలో వారే అంటే ఎవరి శాఖలో వారే వివాహ సంబంధాలు కలుపుకునేవారు .ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటుగా అన్ని శాఖల వారు ఒకరికొకరు సంబంధాలు కలుపుకుంటున్నారు. ఈ జిల్లాలోని రెడ్లు వైవాహిక సంబంధాలు కలుపుకునేటప్పుడు ఇంటి పేర్లు, గోత్రాలు వేరువేరుగా ఉండేటట్లు చూసుకుని వరుసలు కూడా చూసుకుంటున్నారు. కులంలో అనుభవజ్ఞులైన పెద్దమనుషులు లేదా రెడ్ల ఆశ్రితులైన పిచ్చుక కుంట్ల కళాకారులు చెప్పినట్లుగా గోత్రాలు తెలుసుకొని వివాహ సంబంధాలు కలుపుకుంటున్నారు. ఒకవేళ వారికి వారి వారి గోత్రం మీద సందేహం ఉంటే కళాకారుల దగ్గర నివృత్తి చేసుకుంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నివసించే పెడకంటి రెడ్డి వారి పెళ్లిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. పెళ్లిలో అమ్మాయికి పుస్తెకు (మంగళసూత్రం) బదులుగా 101 పోగు (పసుపు బొందు) వేస్తున్నారు. దీనికి కారణంగా రామాయణంలోని ఒక సంఘటన చేత తమ ప్రతిఘటనకు నిదర్శనమనిచెప్పుకుంటారు. పెళ్లి అయిన తర్వాత అమ్మాయికి పుస్తలేకపోతే సమాజం చేత అనుమానాలకు తావు ఉంటుందని ప్రస్తుతం అమ్మాయికి పెళ్లి పిమ్మట పుస్తే వేస్తున్నారు. ఈ రకంగా మారుతున్న కాలంతో పాటుగా తమ ఆచారాల్లో కూడా మార్పులు చేసుకుంటూ ఇక్కడ విస్తరించిన నాలుగు శాఖలో తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నారు.
3. ముగింపు:
సమాజంలో మనుగడ కోసం వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రెడ్లు వనరులను బట్టి ఆయా ప్రాంతాల అనుకూలతను బట్టి విస్తరించారనేది స్పష్టంగా కనిపిస్తున్నది. రెడ్ల పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి శాసనాలు ప్రాచీన కావ్యాల్లో ప్రస్తావించిన తీరును బట్టి వారి ప్రాచీనత పదో శతాబ్దం నాటికే తెలంగాణలో వారి యొక్క ఉనికి ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇట్లా నల్లగొండ జిల్లాలో విస్తరించి ఉన్న పాకనాటి, మోటాటి, పెడకంటి, గుడాటి రెడ్ల్ల నామౌచిత్యాన్ని వివరించి ఆయా శాఖల మౌఖిక కధలను పొందుపరచడమైనది. ఇలా ఆయా కథలను పొందుపరచడం చేత ముందు తరాలకు అందించినట్లైంది.అదేవిధంగా జిల్లాలోని రెడ్లు ఆచారంగా అనుసరిస్తున్న సంప్రదాయాలు, వ్యవసాయ సంబంధితమై ఉండటం చేత ఇట్లా వారి ప్రధాన వృత్తి వ్యవసాయమనేది స్పష్టంగా కనిపిస్తున్నది.అంతేగాక ఇక్కడి రెడ్లు కాలంతో పాటుగా తమ సంస్కృతిలోని ఆచారాలను మార్పు చేసుకుంటూ జీవించడమనేది, ఆయా శాఖల్లో సంస్కృతీ పరిణామ క్రమాన్ని సూచిస్తున్నది.
ఒక సమూహం ఏదైనా సరే తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ నియమంగా ఆచరించినప్పుడే ఆ సంస్కృతీ ఔన్నత్యం ముందు తరాలకు ఆదర్శవంతంగా కనిపిస్తుంది. దానిని వారు అంతే నియమంగా ముందు తరాలు ఆచరించడానికి దోహదం చేస్తుంది. ఇది నల్గొండ జిల్లా పరిధిలో విస్తరించిన రెడ్లకు వర్తిస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజే యడమైనది.
4. పాదసూచికలు:
- పరబ్రహ్మ శాస్త్రి, వరంగల్ జిల్లా శాసనాలు.
- హనుమారెడ్డి, బి. రెడ్డి వైభవం, ప్రజ్ఞా గ్రాఫిక్స్, గుంటూరు.(2017) పుట-21.
- శ్రీనివాసరెడ్డి తోట, రెడ్ల ఇంటిపేర్లు, గోత్రాలు,రెడ్డిపరివార్,మాసపత్రిక-హైదరాబాద్( 2006 ) పుట-9.
- సోమశేఖరశర్మ, మల్లంపల్లి. రెడ్డి రాజుల చరిత్ర, త్రినేత్రపబ్లికేషన్స్ శ్రీశైలం.(1998). పుట-23
- సత్యవతి, తేళ్ల. తెలుగు వారి ఇంటి పేర్లు, జిఆర్ పబ్లికేషన్, గుంటూరు(1987). పుట-28
- Dass Gupta -History of Indian Philosophy Vol -1-1998. పుట -15
5. విషయ దాతలు:
- సూరమ్మ,మందడి. గ్రామము ఆర్జాల బావి, మండలం నల్లగొండ , జిల్లా నల్గొండ. వయస్సు 87 .
- కౌసల్య, నర్రా. గ్రామం వట్టిమర్తి, మండలం చిట్యాల, జిల్లా నల్లగొండ, వయసు 88.
- చిన్నపురెడ్డి, దొండపాటి. గ్రామం వేపల సింగారం, మండలం హుజూర్నగర్, జిల్లా సూర్యాపేట. వయసు 79.
- భీమార్జున్ రెడ్డి, మలిగిరెడ్డి, గ్రామం నాగిరెడ్డి గూడెం, మండలం నేరేడుచర్ల, జిల్లా సూర్యపేట., వయస్సు 57.
- పిచ్చిరెడ్డి, జీడిమళ్ళ. గ్రామంపుల్లాయిగూడెం, మండలం, మోత్కూరు, జిల్లా, యాదాద్రిభువనగిరి. వయస్సు 65.
(మందడి సూరమ్మతో (87) ఇంటర్వ్యూ, అర్జాలబావి గ్రామం నల్గొండ జిల్లా 05/05/2024.)
(దొండపాటి చిన్నపరెడ్డి(79) తో ఇంటర్వ్యూ, వేపల సింగారం, సూర్యాపేట జిల్లా,19/05/2024.)
6.ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పారావు, వడ్డాది. రెడ్డి సంచిక,ఆంధ్రేతిహాసన పరిశోధక మండలి, రాజమహేంద్రవరం. (1947)
- ఈశ్వరదత్తు, కందుకూరి. ప్రాచీన ఆంధ్ర చారిత్రక భూగోళం,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కళాభవన్, హైదరాబాద్. (1979)
- కృపానంద ,సాధు. బాబు ఎస్ ఆర్. రెడ్డి శబ్ద ఉత్పత్తి, రెడ్డి రాణి. (జూన్1937)
- బావయ్య చౌదరి, కొత్త. రెడ్డి వాచకులు ఎవరు,రెడ్డిరాణి. (జూన్ 1937).
- రమణ కవులు,శేషాద్రి.పెద్దమందడి, రెడ్డి కుల నిర్ణయ చంద్రిక.
- రామిరెడ్డి, నల్లమిడి.’ రెడ్లు’ రెడ్డి రాణి.(ఏప్రిల్ 1931, అక్టోబర్ 1932)
- విజయలక్ష్మి, మూలె.కమలాపురం తాలూకా రెడ్ల కుల గాధలు ఇంటిపేర్లు గోత్రాలు భాషా సామాజిక పరిశీలన, అనంతపురం.(1991)
- శ్రీరాములు పూతలపట్టి.రెడ్లు అంతర్ శాఖ వివాహములు,రెడ్డి రాణి. ( నవంబర్ 1926)
- సుజాత, మద్దూరి. చరిత్రలో రెడ్ల ఇంటిపేర్లు - గోత్రాలు, అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య, శ్రీశైలం. (2021)
- సోమశేఖర శర్మ, మల్లంపల్లి. రెడ్డి తెగ పుట్టుపూర్వోత్తరాలు, రెడ్డి రాణి. (నవంబర్, డిసెంబర్ 1923. జనవరి-జూలై 1924)
- హనుమారెడ్డి, బి. రెడ్డి వైభవం,రెడ్డి జనాభ్యుదయ సంఘం, ప్రకాశం జిల్లా.(2017)
- Dass Gupta, History of Indian Philosophy .aVol -1.(1998)
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF ![](/advanced/latest/img/new_animated.gif)
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.