headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. 'అనుమాండ్ల' వారి 'పారిజాతావతరణము' కావ్యం: 'సత్యభామ' పాత్రచిత్రణ

k_madhavi.jpg
కొమ్ము మాధవి,

తెలుగు పరిశోధకులు,
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి &
తెలుగు అధ్యాపకులు,
అన్నవరం సత్యవతీ దేవి ప్రభుత్వ మహిళా కళాశాల, (స్వయంప్రతిపత్తి),
కాకినాడ, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9441834661. Email: kmadhavitelugu@gmail.com

dr_y_subhashini.jpg
డా. యర్రదొడ్డి సుభాషిణి

సహాయాచార్యులు, తెలుగుశాఖ,
శ్రీపద్మావతి మహిళావిశ్వవిద్యాలయం
తిరుపతి - 2, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9000102394. Email: dr.subhashiniy@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు వారికి ‘పారిజాతాపహరణము’, ‘ఉత్తర హరివంశం’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘భామాకలాపం’ మొదలైన శ్రవ్య, దృశ్య కావ్యాల ద్వారా పరిచయమైన సత్యభామ సౌందర్యరాశిగా, సపత్నీ మాత్సర్యం గల వనితగా, శ్రీకృష్ణుని ప్రేమ తనకు మాత్రమే స్వంతమై ఉండాలనే స్వాతిశయం గల మహిళామణిగా, వీరశృంగారరసాధిదేవత అయిన నాయికగా కనిపిస్తుంది. అయితే, సత్యభామను మనకు తెలిసిన నారీమణి కంటే విభిన్నంగా, దయార్ద్ర హృదయ అయిన స్త్రీమూర్తిగా చిత్రించిన కావ్యం ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు రచించిన ‘పారిజాతావతరణము’ అనే కావ్యం. శ్రీకృష్ణుడు దేవలోకం నుండి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చి ప్రియభార్య అయిన సత్యభామ పెరటిలో నాటించిన గాథ లోక ప్రసిద్ధమైనది. సత్యభామ శ్రీకృష్ణుడిని పారిజాత వృక్షాన్ని తీసుకు రమ్మని కోరిన సందర్భంలో కవి మూల కథకు చేసిన మార్పులు, సత్యభామను పారిజాత పుష్పం కోసం అలక గృహానికి వెళ్ళి, శ్రీకృష్ణుని శిరస్సును కాలదన్నిన అహంభావి అయిన వ్యక్తిగా కాకుండా, దీనజనుల కష్టాలు చూసి భరించలేని భూమాత అయిన కరుణామూర్తిగా చిత్రింపబడిన వైనం చర్చించటం ఈ వ్యాస ఉద్దేశ్యం. అలాగే, ప్రాచీన ఇతిహాసములను నేటి కాలానికి తగినట్లుగా కవి ఆధునిక దృష్టితో పునర్మూల్యాంకనం చేయటం, పురాణ ప్రసిద్ధమైన ఈ కథ పట్ల కవి దృష్టికోణం ఎటువంటిదో చర్చించటం ఈ పరిశోధనా వ్యాస ముఖ్యోద్దేశ్యం.

Keywords: పారిజాతాపహరణము, నంది తిమ్మన, పారిజాతావతరణము, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆధునిక పునర్మూల్యాంకనం.

1. ఉపోద్ఘాతం:

పురాణేతిహాసములు వేదోపబృంహణములు. అనగా, వేదార్థములను అతిశయింపచేస్తూ, వేదములలో చెప్పబడిన అర్థములను బలపరచేందుకు, మరింత వివరంగా అర్థమయ్యేలా చెప్పేందుకు వర్ణనలు, కథల రూపంలో కూర్చబడిన గ్రంథములు. వాటిని వివిధ భాషలలో అనువదించుకొనేటప్పుడు వాటి యందలి మూలార్థమును మార్చకుండా తగు స్వాతంత్ర్యమును తీసుకొని చేసిన మార్పులు, చేర్పులతో కూర్చబడిన కావ్యములు కవి పండితుల ప్రశంసలు పొందటం మనకు తెలుసు. అవే కథలను ఆధునిక దృక్కోణంతో, సమకాలమునకు అన్వయించటం, ఆధునిక దృష్టితో పునర్మూల్యాంకనం చేయటం ద్వారా పరమార్థాన్ని సాధించటం వలన ప్రాచీన వృత్తాంతములు నిత్య నూతన చేతనంతో విరాజిల్లుతూ ఉంటాయి. ఈ పద్ధతిలో సంస్కృత భాషలోని పురాణేతిహాసములను గానీ, లేదా అందులోని ఏదైనా ప్రసిద్ధమైన ఒక చిన్న కథను గానీ వస్తువును తీసుకొని దానిని వర్ణనాలంకారాదులతో పెంచి, ప్రధాన కథకు, పాత్రల ఔచిత్యానికి భంగము కలుగకుండా, ఒకొక్కసారి ఇతివృత్తంలో మార్పులు చేస్తూ స్వతంత్ర కావ్యముగా తీర్చిదిద్దటం తెలుగు కవుల సంప్రదాయం. తెలుగు కవులు ఈ విధమైన స్వాతంత్ర్యమును తీసుకొని చేసిన మార్పులు, తీర్చిన తీర్పులు మూలమునకు మెరుగు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆదికవి అయిన నన్నయ మహాభారత రచనతో ప్రారంభమై కావ్యరాజములెన్నో ప్రాచీన తెలుగు సాహిత్యమును సుసంపన్నం చేశాయి. ఆధునిక సాహిత్యంలో కూడా కవిశ్రేష్ఠులు కొందరు నవ్య సంప్రదాయ ధోరణిలో పురాణేతిహాసములను కావ్యములుగా సంతరించి కవి పండితుల, సహృదయుల నీరాజనాలందుకొన్నారు. ఆధునిక దృష్టితో ప్రస్తుత కాలంలో ఇటువంటి రచనలు అరుదుగా వస్తూ ఉన్నాయి. ఇదే కోవలో కాకతీయ విశ్వవిద్యాలయంలో లెక్చరరుగా, రీడరుగా, ప్రొఫెసరుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ ఉపకులపతిగా పని చేసి పదవీ విరమణ పొందిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు పారిజాతాపహరణ వృత్తాంతం ఆధారంగా  ‘పారిజాతావతరణము’ అనే పద్యకావ్యాన్ని  రచించారు. 

2. కవి పరిచయం :

ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు కాకతీయ విశ్వవిద్యాలయంలో లెక్చరరుగా, రీడరుగా, ప్రొఫెసరుగా చేశారు. 2005 లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలరుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఇన్ ఛార్జ్ వైస్ ఛాన్సలరుగా సేవలందించారు. పద్యకవిగా, విమర్శకునిగా 45 గ్రంథాలు ప్రచురించారు. ‘వేయి నదుల వెలుగు’, ‘వెలుగు నగల హంస’, ‘జ్వలిత కౌసల్య’, ‘అష్టావక్రగీత’, ‘మకర హృదయం’, ‘భాగవత భక్త పాలన కళ’, ‘శివ సౌందర్య లహరి భావ మకరందము’ మొదలైన కావ్యాలు రచించారు. ‘లోచూపు’ మొదలైన సాహిత్య విమర్శ గ్రంథాలు రచించారు.  కొన్ని కావ్యాలకు సంపాదకత్వం వహించారు. ‘పారిజాతావతరణం’ అనే పద్యకావ్యం ద్వారా పారిజాతాపహరణం అనే పురాణ ప్రసిద్ధ కథను నూతనదృష్టితో,  అభ్యుదయ దృక్పథంతో పునర్నిర్వచించారు.

3. పారిజాత వృక్షం గురించి :

దేవదానవులు పాల సముద్రాన్ని మథిస్తున్నప్పుడు అందులోనుండి ఉద్భవించిన అనేక దివ్యమైన వస్తువులలో పారిజాత వృక్షం ఒకటి. దానిని దేవేంద్రుడు తన నందనోద్యానవనంలో ప్రతిష్ఠించుకొంటాడు. కోరిన కోరికలను ప్రసాదించే దేవలోక కల్పతరువులలో ఒకటి పారిజాతం.

“పంచైతే దేవతరవో మందార: పారిజాతక: 
సంతాన: కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనం”1        
మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచనందనం అనేవి ఐదు దేవతా వృక్షాలు. 

4. వివిధ భాషలలో పారిజాతాపహరణం వృత్తాంతం :

పారిజాతాపహరణం కథ ప్రసిద్ధమైనది. సంస్కృతంలో విష్ణు, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, పద్మ, భాగవత, హరివంశ మొదలైన పురాణాలలో ఉన్నది. సంస్కృతంలో ఉమాపతి మహోపాథ్యాయ, అస్సామీలో మహాకవి శంకర దేవుడు రచించిన పారిజాతాపహరణ కావ్యాలు, కన్నడంలో రుద్రభట్టు జగన్నాథ విజయం, జినసేనుని సంస్కృత హరివంశం మొదలైన కావ్యాలలో పారిజాతాపహరణ వృత్తాంతం ఉంది. అయితే, అన్నింటిలోనూ ఈ కథ ఒకే రీతిగా లేదు. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా ఉంది. వ్యాసకృతముగా భావింపబడుతున్న పురాణాలలో కూడా ఒకే కథ లేదు.

4.1. వ్యాసుడు రచించిన హరివంశ పురాణం :

హరివంశమును వేద వ్యాసుడు రచించాడని పరిశోధకుల అభిప్రాయం. హరివంశం మహాభారతానికి ఖిల భాగముగా, పరిశిష్టముగా పరిగణింపబడుతోంది. అంటే మహాభారతానికి అనుబంధ గ్రంథం, శేషించిన గ్రంథం అని అర్థం. భారతంలో చెప్పకుండా విడచిన సూర్య, చంద్ర, భరత రాజ వంశాల చరిత్రలు, భారతంలో చెప్పని, భారతంలో లేని కృష్ణుని కథలు కొన్ని హరివంశంలో పొందుపరచబడ్డాయి. అందువలన హరివంశ పురాణ కర్త కూడా వ్యాసుడనియే భావింపబడుతోంది. హరివంశంలో పారిజాత వృక్షం కోసం ఇంద్రోపేంద్రులు ఘోరమైన యుద్ధం చేయగా, అదితి మొదలైనవారు వచ్చి యుద్ధం నివారిస్తారు. ఇంద్రుడు కృష్ణునకు పారిజాత వృక్షాన్ని ఇస్తాడు. సత్యభామ పుణ్యక వ్రతం చేసి పారిజాత వృక్షంతో కృష్ణుడిని నారదునకు దానం చేస్తుంది. నారదుడు దూడతో కపిల ధేనువును దానంగా తీసుకొని కృష్ణుడిని విడిపిస్తాడు. ఒక సంవత్సరం తర్వాత కృష్ణుడు పారిజాత వృక్షాన్ని తిరిగి దేవలోకానికి తీసుకొని వెళ్ళి ఇంద్రునికి అప్పగిస్తాడు. ఇది హరివంశంలోని పారిజాతాపహరణ వృత్తాంతం.  

4.2. ఉమాపతి మహోపాథ్యాయ రచించిన పారిజాతాపహరణం :

సంస్కృతంలో ఉమాపతి మహోపాథ్యాయ రచించిన పారిజాతాపహరణం సంగీత నాటకంలో కృష్ణార్జునులు దేవలోకానికి వెళ్ళినట్లు ఉంది. సత్యభామా సుభద్రలు పతిప్రణయసిద్ధి వ్రతం చేస్తారు. కృష్ణార్జునులను దానంగా పొందిన నారదుడు రత్నాభారణాలకు బదులుగా వారిని తిరిగి ఇవ్వటానికి తిరస్కరించి వారిని విపణి వీధిలో వేలానికి పెట్టి, తర్వాత సత్యభామా సుభద్రల నుండి ఒక్కొక్క గోవును దానంగా తీసుకుని కృష్ణార్జునులను అప్పగిస్తాడు.

4.3. శంకర దేవుడు రచించిన పారిజాతాపహరణం :

శంకర దేవుడు రచించిన పారిజాతాపహరణంలో రుక్మిణి స్వయంగా కృష్ణుని పారిజాత పుష్పాన్ని తనకు ఇమ్మని అడగటం, తర్వాత నారదుడు ఈ విషయాన్ని సత్యభామకు చెప్పటం, సత్యాకృష్ణులు అర్జునునితో కలసి పారిజాత వృక్షం కోసం దేవలోకానికి వెళ్ళటం, సత్యా సుభద్రలు వ్రతం చేయటం, కృష్ణార్జునులను దానంగా పొందిన నారదుడు వారిద్దరి నుండి ఒక్కొక్క గోవును దానంగా తీసుకొని వారిని విడిపించటం అనే అంశాలు ఉన్నాయి.

4.4. తెలుగులో పారిజాతాపహరణం :

తెలుగు వారికి పారిజాతాపహరణ వృత్తాంతం చిత్రితమైన కావ్యాలు ఉన్నాయి. కృష్ణాధ్వరి నైషధ పారిజాతం వంటి కావ్యాలున్నా, వాటన్నింటిలోనూ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి అయిన నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణ ప్రబంధం ప్రముఖమైనది, బహుళ ప్రజాదరణ పొందినది. క్రీ.శ.16వ శతాబ్దం తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం అనే పేరుతో ప్రసిద్ధమయింది. ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదులు పొందిన శ్రీకృష్ణ దేవరాయలు విజయ నగరసామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణ యుగంగా భాసించింది. రాయల సాహిత్య సభాభవనమైన భువనవిజయంలోని అష్టదిగ్గజ కవులలో ముఖ్యుడు నంది తిమ్మన. కృష్ణరాయల పట్టపురాణి తిరుమలదేవి అరణపు కవి అయిన నంది తిమ్మన వేదవ్యాసుని హరివంశంలోని కథ ఆధారంగా పారిజాతాపహరణం అనే పేరుతో ప్రబంధంగా రచించి శ్రీకృష్ణదేవరాయలకే అంకితమిచ్చాడు.

4.5. నంది తిమ్మన పారిజాతాపహరణంలోని ఇతివృత్తం :

శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతారం ధరించి ద్వారకా నగరంలో ఉన్న సమయంలో ఒకనాడు దేవర్షి అయిన నారదుడు దేవలోకము నుండి నేరుగా శ్రీకృష్ణ దర్శనార్థం ద్వారకా నగరానికి వచ్చి నందనోద్యానము నుండి తాను తీసుకువచ్చిన పారిజాత పుష్పమును శ్రీకృష్ణునకు ఇచ్చి దానిని తనకు ఇష్టమైన వారికి బహుకరించమని చెబుతాడు. ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణీ మందిరంలో ఉన్నాడు కాబట్టి ఆ పుష్పాన్ని కృష్ణుడు రుక్మిణీ దేవి సిగలో అలంకరిస్తాడు. ఈ విషయాన్ని చెలికత్తె ద్వారా తెలుసుకొన్న సత్యభామ సపత్నీ మాత్సర్యంతో తనకు కూడా పారిజాత పుష్పాన్ని తెచ్చి ఇవ్వమని అడుగగా, శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్నే తెచ్చి నీ పెరటిలో నాటిస్తానని మాట ఇస్తాడు. ఇదివరలో నరకాసురుడు అపహరించిన అదితి మాత కర్ణ కుండలాలను ఇవ్వటానికి వెళ్ళే నెపంతో గరుడ వాహనారూఢుడై  సత్యభామా సమేతంగా దేవలోకానికి వెళ్ళి, దేవమాత అయిన అదితికి కుండలాలను ఆమెకు సమర్పిస్తాడు. అనంతరం నందనవనంలో విడిది చేసిన సత్యభామా కృష్ణులు అక్కడ ఉన్న పారిజాత వృక్షాన్ని పెకలించటానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవేంద్రుడు ఆగ్రహంతో భటులను కృష్ణుని పైకి పంపగా, కృష్ణుడు ఇంద్రుడు సహా వారందరినీ ఓడించి అతని అనుమతితో పారిజాతాన్ని గరుడుని వీపుపై ఉంచి భూలోకానికి తెచ్చి సత్యాదేవి పెరటిలో నాటిస్తాడు. తర్వాత సత్యభామ పుణ్యక వ్రతాన్ని చేసి పారిజాత సమేతంగా పతి అయిన కృష్ణుని నారదునికి దానం చేసి, తర్వాత కొంత ధనాన్ని ఆయనకు ఇచ్చి తిరిగి వారిని స్వీకరిస్తుంది. ఇది నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణ కావ్యం ఇతివృత్తం. ఇందులో అర్జునుడు కూడా దేవలోకానికి వెళ్ళటం, సుభద్ర కూడా సత్యభామతో కలసి వ్రతం చేయటం,  శ్రీకృష్ణ తులాభారం అనేవి లేవు.

5. పారిజాతావతరణ కావ్యమునకు మూలము:

ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు పారిజాతావతరణ కావ్యాన్ని తేటయైన 106 తేటగీతులలో క్లిష్టాన్వయము లేని సరళమైన రీతిలో కూర్చారు. ఈ కావ్యానికి ఆధారంగా దేనిని తీసుకున్నారు అనే అంశాన్ని పరిశీలిస్తే, వివిధ భాషలలోని కావ్యాలలో కథ వివిధ రకములుగా ఉంది. అయినా, అన్నింటిలోనూ ఒక సామాన్యాంశం ఉంది. అది ఏమిటంటే, శ్రీకృష్ణుడు సత్యభామా సహితంగా దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుని జయించి పారిజాత వృక్షాన్ని అపహరించి సత్యభామ పెరటిలో నాటించటం. భూమయ్య గారు తన కావ్యంలో ఈ ఒక్క విషయాన్ని మాత్రమే గ్రహించి, కావ్యమును విభిన్నమైన మనస్తత్వ చిత్రణ, తనదైన రచనా శైలితో విశిష్టమైన, విభిన్నమైన కావ్యముగా తీర్చిదిద్దారు.

6. పారిజాతావతరణంలోని కథాంశం :  

నారదుడు తనకు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చి, దీనవత్సలుడైన కృష్ణుడు సత్యభామా భవనానికి సంభ్రమంగా వస్తాడు. సత్యభామ శ్రీకృష్ణునకు ఘనముగా స్వాగతమిస్తుంది. ప్రియసఖి ద్వారా తనకు ఈ విషయం తెలిసినదని చెబుతుంది. అప్పుడు సత్య కృష్ణుని ఒక కోరిక కోరుతుంది. ద్వారకా పురములో నడువలేనివారు, గ్రుడ్డివారు, చెవిటివారు, మూగవారు ఎందరో ఉన్నారని, నారదుడు పారిజాత పుష్ప మహిమను చెబుతుండగా విన్న తన చెలికత్తెతనకు చెప్పిందని, ఆ పారిజాత వృక్షమును తెచ్చి ద్వారకలో నిలిపితే వారి బాధలను తొలగించవచ్చు కదా అంటుంది. రుక్మిణికి పారిజాత పుష్పమును ఇవ్వటం వలన సత్యభామ ఎంతో ఈర్ష్యకు గురి అవుతుందని భావించిన కృష్ణునికి సత్యభామ మంచి మనసుకు ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీకృష్ణుడు పంపించగా దేవలోకానికి వెళ్ళిన నారదుడు సత్యభామ ఆలోచనను ఇంద్రునికి తెలుపగా, ‘నిజమే కదా’ అని ఇంద్రుడు కూడా సత్యభామ ఆలోచనకు సంతోషించాడు. నారద ముని ఇచ్చిన సూచన మేరకు పారిజాత వృక్షమును కృష్ణునకు ఇవ్వాలని అనుకుంటాడు. సత్యభామా కృష్ణులు ఇరువురూ గరుడ వాహనమెక్కి స్వర్గలోకమునకు వెళ్ళగా, దేవేంద్రుడు తన సతితో, ఇతర సురలు, దిక్పాలకులూ వెంట రాగా, సత్యాకృష్ణులకు ఘన స్వాగతమిచ్చాడు. కృష్ణుడు అదితికి నరకుడు అపహరించిన కుండలములను ఇస్తాడు. అదితి దీనుల కష్టముల నుండి ఉద్ధరించాలనే మంచి మనసు కలిగిన సత్యభామను తన కోడలని చెప్పుకోవటం గొప్ప అని మెచ్చుకొంది. పారిజాత వృక్షాన్ని అడిగితే, కాదనటానికి ఇంద్రుడు సాహసించడు అని అన్నది. ఇంద్రుడు తనకు బలి చక్రవర్తి నుండి స్వర్గాన్ని కృష్ణుడే ఇచ్చాడని అన్నాడు. ఒక పారిజాతమేమిటి, ఉన్న విశ్వమంతా ఆయనదే కాబట్టి, ఆయన భూమి మీద ఉన్నంత కాలం పారిజాత వృక్షం అక్కడే ఉంటుంది అని చెప్పాడు. ఇంద్రుడు  నందనోద్యానమునకు వెళ్ళి, దీనజనుల బాధలు తొలగించటానికి సత్యాకృష్ణులతో భూలోకమునకు వెళ్ళి వారున్నంత కాలం అక్కడే ఉండుమని పారిజాత వృక్షాన్ని ప్రార్థిస్తాడు. సత్యభామ కూడా దీనజనుల కోసం భూలోకమునకు తరలిరమ్మని పారిజాత వృక్షాన్ని ప్రార్థిస్తుంది. భూలోకానికి వెళ్ళి వచ్చుటకు పారిజాత వృక్షం శచీదేవి అనుమతి పొందుతుంది. దేవేంద్రుని కనుసైగతో భటులు పారిజాత వృక్షాన్ని వైనతేయుని వీపు మీద ఉంచగా, వారివెంట భూలోకానికి అవతరిస్తుంది పారిజాత వృక్షం. సత్యాదేవి కృష్ణుని సతులందరికి సాదరంగా ఆహ్వానాలు పంపిస్తుంది. కృష్ణునితో కలసి సత్యభామ తన ఉద్యానవనం మధ్యలో పారిజాత వృక్షాన్ని ప్రతిష్ఠిస్తుంది. ఆ పారిజాత వృక్ష ప్రభావం వలన కనులు లేని వారికి కనులు, చెవులు లేని వారికి చెవులు, నడవలేనివారికి నడక, మాట లేనివారికి మాట వచ్చాయి. అందరి వైకల్యాలు తొలగిపోయాయి. వృద్ధులు యువకులయ్యారు. అడిగిన వారికి అడిగినవన్నీ ప్రసాదించింది. తత్వజ్ఞానము కోరిన వారికి జ్ఞానమును, తెలిసీ తెలియక పద్యరచన చేయాలనుకొనే వానికి బీజాక్షరములను ఇచ్చింది పారిజాతం. ఆ పారిజాత వృక్ష ప్రభావం వలన కనులు వచ్చిన అంధుడు శ్రీకృష్ణుని ప్రస్తుతించాడు. సత్యభామ స్వయంగా పుష్పములను కోసి రుక్మిణి మొదలైన సతులందరికీ పంచిపెట్టింది. వారికే గాక జనులందరికీ పారిజాత పుష్పములను పంచిపెట్టింది. వారు మహా ప్రసాదముగా స్వీకరించారు. శచీంద్రులు సంతోషించి పూలవాన కురిపించారు. ప్రజలందరూ సుఖంగా ఉండటంతో కావ్యం ముగుస్తుంది. 

7. కావ్య రచనా హేతువు :

దీనులు, వికలాంగులు లేని సమాజాన్ని చూడాలనే  భూమయ్య గారి ఆశయం ఆయనను ఈ కావ్య రచనకు పురికొల్పినదనవచ్చు. శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకొని వచ్చేటప్పుడు ఆ వృక్ష మహత్వమును నంది తిమ్మన వర్ణించాడు. ఆ పారిజాత వృక్షాన్ని చూసిన వెంటనే ద్వారకా వాసుల ఇండ్లు ధన ధాన్య రాశులతో,  ఏనుగులు, గుర్రములతో కూడిన మణిమయమైన సౌధ పంక్తులతో, మణిభూషణావళులు తామరతంపరగా  నిండాయని వర్ణించాడు.

“విననేర్చిరి బధిరులు గను, గొన నేర్చిరి యంధకులు, లఘుత్వము మీఱన్
జననేర్చిరి వికలాంగులు, నమినిష తరు కుసుమ సౌరభావేశమునన్”2

ఆలా ఆ పారిజాత వృక్ష ప్రభావం వలన అంగవైకల్యములు, బాధలు తొలగిన ప్రజల ఆనందమే కావ్య రచనకు ప్రేరకమైనదని చెప్పవచ్చు. సత్యభామ కృష్ణునికి దీనజనుల బాధలను వివరించేటపుడు పడిన వేదన, నిస్స్వార్థంగా సత్యభామ కృష్ణుని కోరిన కోరిక, పారిజాత వృక్షం భువికి రానున్నదనే సమయంలో ఆమె ప్రకటించిన ఆనందం, కృష్ణునితో కలసి పారిజాత వృక్షాన్ని తీసుకొని రావటానికి స్వర్గానికి వెళ్తున్నప్పుడు ఆనందం పట్టలేక సత్యభామ చేసే చిన్నపిల్లల వంటి చేష్టలు మొదలైన సందర్భాలలో కవి చేసిన వర్ణనలు కవి హృదయాన్ని తెలుపుతాయి. 

8. కావ్య నామసార్థక్యం :

సంస్కృత పురాణాలలోనూ, తెలుగు కావ్యాలలోనూ పారిజాతవృక్షాన్ని కృష్ణుడు అపహరించటానికి ప్రయత్నించినట్లు, దేవేంద్రుడు ప్రతిఘటించగా, దేవ భటులతో, దేవేంద్రునితో యుద్ధం చేసి కృష్ణుడు వారిని జయించి పారిజాతాన్ని భూలోకానికి తెచ్చినట్లు ఉన్నది. కానీ ఇందులో అపహరణం లేదు. ముందుగా ఇంద్రుడు, తర్వాత సత్యభామ పారిజాతాన్ని ప్రార్థించగా, శచీదేవి అనుమతి పొంది దీనజనుల రక్షణార్థం స్వర్గం నుండి భూలోకంలో అవతరించింది. అందువలన ‘పారిజాతావతరణం’ అనే పేరు సార్థకం అయ్యింది.

9. కావ్య ప్రణాళిక :

పారిజాతావతరణం కావ్యం రెండు భాగాలుగా ఉంటుంది. పూర్వభాగం ‘శ్రీకృష్ణ సత్య’. నారదుడు దేవలోకం నుండి తీసుకువచ్చిన పారిజాత పుష్పాన్ని కృష్ణుడు రుక్మిణీ దేవికి ఇచ్చి సంభ్రమంగా సత్యభామా భవనానికి రావటం నుండి పారిజాతవృక్షాన్ని భూలోకానికి తీసుకురావటానికి కృష్ణుడు నిర్ణయించుకోవటం వరకు ఉంటుంది. ఉత్తర భాగం ‘పారిజాతము’. సత్యభామా సమేతుడై కృష్ణుడు ఇంద్రలోకానికి వెళ్ళటం, వృక్షాన్ని తీసుకురావటం, పారిజాతం వల్ల ప్రయోజనాలు పొందిన ద్వారకా నగర ప్రజలు పారిజాత వృక్షాన్ని, శ్రీకృష్ణుని స్తుతించటంతో కావ్యం పూర్తవుతుంది.

10. సత్యభామ పాత్ర చిత్రణ :

ఈ కావ్యంలో విశిష్టమైనది, ప్రముఖంగా చెప్పుకోవలసిందీ సత్యభామ పాత్ర చిత్రణ. సత్యభామ ఉదాత్తమైన వ్యక్తిత్వం కలదానిగా, సౌమ్యురాలిగా ఇందులో కనిపిస్తుంది.  నారదుడు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని కృష్ణుడు రుక్మిణికి ఇచ్చి సంభ్రమంగా సత్యభామ మందిరానికి వచ్చాడు. ఈ సంగతిని తన ప్రియసఖి ద్వారా విన్న తర్వాతనే సత్యభామ కృష్ణునికి స్వాగతమివ్వటానికి ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఆ స్వాగతం కూడా ఇదివరకు ఎప్పుడూ చేయనంత ఘనంగా చేసినదని కృష్ణుడు అనుకొంటాడు. మూలంలో ఈ విషయం తెలిశాక సత్యభామ అలిగి అలక గృహంలో ప్రవేశిస్తుంది. పారిజాత పుష్పమును గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కృష్ణుడు కొంత చిన్నబుచ్చుకొన్నట్లుగా నారదుడు రెండు పూవులను తీసుకువస్తే బాగుండేదని, సత్యభామకు కూడా ఒక పూవును ఇచ్చేవాడినని కృష్ణుడు అంటాడు. అప్పుడు సత్యభామ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరుస్తుంది. “మా ఎనమండ్రలోన పెద్ద ఆమె, నిల్పితి రామె పెద్దతనము”3 అంటుంది. అంతేగాక, ఎనిమిది పూవులు తెచ్చినట్లయితే, కొంత న్యాయమవుతుంది. కాని, పదహారు వేలమంది సంగతి ఏమిటి, వారు లెక్కలలోకి రారా? అని కూడా అంటుంది. ఇక్కడ సత్యభామలో సపత్నీ మాత్సర్యం మాట వరసకైనా కనిపించదు. మమ్మందరినీ మీరు పెండ్లి చేసుకొన్నారు, మీ ప్రేమ జలధిలో మునిగి తేలినాము, దూరముగా ఉంటూ ఎందరో మిమ్ములను తలచి తరిస్తూ ఉండగా, మీ ప్రియాంగనలమైన మేము మీ పదాబ్జములను సేవిస్తూ తరించలేమా? అని అన్నది. ఇంత సౌహార్ద్రం సత్యాదేవిలో మునుపెన్నడూ ఎవరూ చూడనిది. ఈ విధంగా కొత్త సత్యభామను పరిచయం చేశారు శ్రీ భూమయ్య గారు.

తర్వాత ‘స్వామీ, ఒక చిన్న కోరిక’ అని ఒక అభ్యర్థనను వినయ పూర్వకముగా అడిగింది. అప్పుడు కృష్ణుడు నరకాసుర వధ సందర్భంలో సత్యభామ ధనుర్విద్యా కౌశలాన్ని గుర్తు చేసి అప్పుడు అంత నేర్పుతో యుద్ధం చేసిన నిన్ను వరమేదీ కోరుకోమనలేదు, ఇప్పుడు ఏదైనా వరము కోరుకోమనగా సత్యభామ-

‘నేను కోరని వరముగా నీవు నన్ను, పెండ్లి యాడితి రిది నాకు పెద్ద వరము!
వరము నీవైన వేరొక్క వర మదేల?”4

అని అంటుంది. తన మనసులోని కోరికను ఇలా తెలిపింది:

“నడువగా లేక ఇబ్బంది పడెడు వారు, కలరు మీరు వసించు నగరము నందె
వారి బాధల తొలగించు వారెవరొకొ? మీరు పూను కొన్ననె కదా వారి సుఖము
కలరు గ్రుడ్డివారీ పురి కలరు చెవిటి, వారు, మూగవారెందరో వారి నుద్ధ
రింప లేరో? బాధల నివారింపలేరొ? సర్వజనులు సుఖమ్మున్న శాంతి, క్రాంతి”5

అని సత్యభామ ద్వారకా పురము లోని వికలాంగుల, బాధితుల కష్టాలను వరుసగా కృష్ణునితో చెప్పింది. అప్పుడు వారి బాధలను ఎలా పోగొట్టాలి అని కృష్ణుడు అడుగగా, సత్యభామ తన చెలికత్తె పారిజాత మహిమను నారదుడు చెప్పుచుండగా విని తనకు చెప్పిందని, “పారిజాత వృక్షము గొని వచ్చి ఇచట, నిలిపిన ఎడ ప్రజల బాధ తొలగు ననుచు”6“ “.....పారిజాత వృక్ష మిచట నున్న కలుగు హితము ప్రజలకు”7 అని తన ఆలోచన చెప్పింది. మూలంలో ఉన్నట్లుగా పారిజాత వృక్షాన్ని తన వైభవాన్ని పెంపొందించుకోవటం కోసమో, లేదా తన సవతులపై తన ఆధిక్యాన్ని ప్రదర్శించుకోటానికో సత్యభామ అడగలేదు. కేవలం ద్వారకా ప్రజల బాధలను చూడలేక వారిని కష్టాల నుండి ఉద్ధరించటం కోసం ఆ విధంగా పారిజాత వృక్షం తీసుకొని రావటానికి కృష్ణుడిని ప్రేరేపించింది.

10.1. భూదేవి అవతారముగా :

పారిజాతావతరణ కావ్యంలో కవి సత్యభామను భూదేవి అవతారమని నారదుని చేత చెప్పించారు. సత్యభామ భూదేవి అవతారమైనందువల్లనే ప్రజల కష్టాలు చూసి భరించలేక వారిని రక్షించాలని తపన పడిందని మధురమైన ఊహా కల్పన చేశారు. ద్వారకా ప్రజల బాధలను కృష్ణునికి తెలిపే సమయంలో సత్యభామ ఒక మాట చెబుతుంది. ఆదేమిటంటే,

“ఎందుకో తెలియదు కాని, కృష్ణ దేవ!, మానవాళి వాసస్థానమైన భూమి
ఏ యొకించుకైన తపించెనేని, తాప, మీ తనువునకె కల్గినటులౌ..”8

మానవుల నివాసమైన భూమికి ఏ మాత్రం బాధ కలిగినా, అది నా శరీరమునకే కలిగినట్లు అవుతుందని అంటుంది. ఇక్కడ సత్యభామకు, భూమాతకు అభేదాన్ని పరోక్షంగా సూచించారు. తర్వాత నారదుడు ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు.

“ఇంతటి కరుణ నీ కీ మహీజనమ్ము, పైన నుండుట సముచితమ్మైన విషయ
మే యగును, నీవు భూదేవివే భువి నవ, తార మెత్తినా విట్లు సత్య మిది సత్య”9

అని నారదుడు అంటాడు. నరకాసురుని వధ సందర్భంలో సత్యభామయే భూదేవి అని చెప్పబడిన విషయం లోకవిదితమే. అయితే, ఆ విషయాన్ని పారిజాతావతరణ వృత్తాంతంలో చేర్చి భూమాత తన బిడ్డలైన ప్రజలను ఏ కష్టమూ రాకుండా కాపాడుకొనేందుకు ఒక అవకాశముగా ఉపయోగించుకొన్నదనే భావంలో అందమైన కల్పన చేశారు.

11. ఆధునిక పునర్మూల్యాంకనం :

వేదపురాణేతిహాసములు ప్రజల నైతిక ప్రవర్తనను నిర్దేశించి, ధర్మ ప్రబోధకములై సమాజమునకు మార్గ నిర్దేశం చేసేందుకు ఉద్దేశించినవి. పరంపరాగతముగా వస్తూ ఉన్న పౌరాణికాంశములకు నూతనమైన విలువలను జోడించి పురాణ కథలకు నూతన అర్థములను ప్రతిపాదిస్తూ ‘పురా అపి నవం’ అన్న నిర్వచనానికి అచ్చమైన ఉదాహరణ లాగా సమకాలము వారు కూడా తమకు అన్వయించుకొనేలా పునర్మూల్యాంకనం చేయటం నేటి కాలానికి ఆవశ్యకం అని చెప్పవచ్చు. అదే విధంగా ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు పురాణ ప్రసిద్ధమైన పారిజాతపహరణ కథను వినూత్నంగా పునస్సృష్టి చేశారు. ఈ విధంగా చేయటం వలన ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తే, శ్రీ భూమయ్య గారు చేసిన మార్పు వలన పారిజాత వృక్ష ప్రయోజనం వ్యక్తిగతమైనది కాకుండా విస్తృతమైన ప్రయోజనం కలిగినదయింది.        

11.1. పురాణ కథను సమకాలమునకు అన్వయించటం :

పారిజాతావరణంలో ప్రభువులు, ఉద్యోగుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ప్రజల బాగోగులను పట్టించుకోవటంలో రాజుల కర్తవ్యం, మంచి పరిపాలనను ప్రజల కందించటంలో రాజులకు సహాయకారులుగా రాణుల పాత్ర ఎలా ఉండవచ్చో పరోక్షంగా సూచింపబడింది. వికలాంగుల సంక్షేమం కోసం పరిపాలకులు తగిన చర్యలు తీసుకోవాలన్న సూచన ఉంది.

సత్యభామ శ్రీకృష్ణునకు దీనజనుల బాధలను వివరిస్తున్నప్పుడు ఎప్పుడూ అంతఃపురం దాటి వెళ్లని సత్యభామకి పురములోని ప్రజల బాధలు ఎలా తెలిశాయి? అని కృష్ణునికి ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు సత్యభామ చెప్పిన సమాధానం పరిపాలకులైనవారందరూ పాటించదగినది. 

“నా కుబుసు పోని వేళల నాథ! ఇష్ట, సఖు లపుడపుడు కన్నీరు జాలువార 
తెలుపుచుండగా నా కిన్ని తెలిసి వచ్చె”10

అని చెబుతుంది. సాధారణంగా మహారాణులు, రాచకన్యలు విరామ సమయాలలో చేసే పనులుగా వనవిహారం, పుష్పాపచయం, జలక్రీడలు మొదలైనవి వర్ణింపబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ సత్యభామ కేవలం రాణివాసమునకే పరిమితం కాకుండా, తన ప్రియ సఖులతో ముచ్చటించి వారి కష్ట సుఖములను తెలుసుకొంటూ ఉంటుందని తెలుస్తుంది.  అంతేకాక, ఆ విషయాలను కృష్ణునితో చెప్పి వాటిని పరిష్కరించటానికి  తాను చేయదగినవన్నీ చేసింది. కృష్ణునకు నయముగా చెప్పి ఒప్పించటం, స్వయంగా కృష్ణునితో స్వర్గానికి వెళ్ళి పారిజాత వృక్షాన్ని తీసుకొని రావటం, పుష్పాలను అందరికీ పంచిపెట్టటం, పారిజాత దర్శనం కల్గించటం ద్వారా వారి బాధలను పోగొట్టటం, తద్ద్వారా వారి సుఖ సంతోషాలను చూసి ఆనందించటం ఇవన్నీ రాణిగా తాను చేయవలసిన కర్తవ్యములను నిర్వహించింది. అలాగే, పరిపాలకులందరూ తమ కర్తవ్యములను విస్మరించకుండా పరిపాలిస్తే రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్న సందేశం ఈ కావ్యంలో ఉంది. 

12. ముగింపు :

1. ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు పారిజాతావతరణ కావ్యంలో పారిజాతాపహరణ కథను కొత్తగా నిర్వచించారు. పురాణ ప్రసిద్ధమైన కథకు నూతన అన్వయాన్ని కల్పించారు. పారిజాత వృక్షం అపహరించబడటం కాకుండా దీనజనుల కోసం స్వయంగా పారిజాత వృక్షమే అవతరించిందని కల్పించారు.   

2. పురాణాలలో, ప్రాచీన కావ్యాలలో సౌందర్యరాశిగా, సపత్నీ మాత్సర్యం గల మహిళగా, ఆత్మాభిమానం,  స్వాతిశయం గల వీరవనితగా, అహంభావిగా కన్పించే సత్యభామను ఈర్ష్య, అసూయలు మచ్చునకైనా కనిపించని ఉదాత్తమైన వ్యక్తిత్వం గల మానవతామూర్తిగా చిత్రించారు. ఇదివరకు ఎవరూ చూపని కొత్త కోణంలో సత్యభామను దర్శింపచేశారు.

3. సత్యభామ పారిజాత వృక్షమును తన కోసం కాక, దీనజనోద్ధరణ కోసం మాత్రమే తీసుకొని రమ్మని కృష్ణుడిని కోరిందని నూత్నమైన పరికల్పన చేశారు. పారిజాత వృక్షం అందించే ప్రయోజనాలు వ్యక్తిగతమైనవిగా కాకుండా సమాజ హితం కోసం ఉద్దేశిస్తే భూమి మీద శాంతి, క్రాంతి వెల్లివిరుస్తాయని, భూమి స్వర్గమవుతుందని కవి ఆకాంక్ష.

4. ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు ప్రాచీన వృత్తాంతానికి వర్తమాన కాలపు విలువలను జోడిస్తూ, మంచి పరిపాలన, సమకాలీన ప్రజా సంక్షేమ విషయాలకు అన్వయిస్తూ ఆధునిక దృష్టితో పునర్మూల్యాంకనం చేశారు.  

13. పాదసూచికలు:

  1. అమరకోశము, పుట.48.
  2. పారిజాతాపహరణం. పంచమాశ్వాసం. 47.
  3. పారిజాతావతరణము. పూ.భా.21.
  4. పైదే. 42
  5. పైదే. 45, 46. 
  6. పైదే. 60. 
  7. పైదే. 61.
  8. పైదే. 68.  
  9. పైదే. 88.
  10. పైదే. 50. 

14. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కామేశ్వర రావు, భైరవభట్ల, భాషా భారతి, ఫేస్ బుక్ నుండి, 2016.
  2. తిమ్మన, నంది, పారిజాతాపహరణము, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2006.
  3. నాగయ్య, జి, తెలుగు సాహిత్య సమీక్ష, ద్వితీయ సంపుటము, నవ్య పరిశోధక ప్రచురణలు, హైదరాబాదు, 2019.  
  4. మురళీధరరావు, ఏల్చూరి, భూమానందం, (పారిజావతరణ కావ్య పీఠిక), మనస్వినీ దేవి, 2022.
  5. లక్ష్మీకాంతం, పింగళి, ఆంధ్ర సాహిత్య చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1991.
  6. వేంకట రామ నరసింహం, కాకర్ల, ఆంధ్ర ప్రబంధములు అవతరణ వికాసములు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రెస్, వాల్తేరు, 1965.  
  7. వేంకటావధాని, దివాకర్ల, ఆంధ్ర సారస్వత పరిషత్తు,  హైదరాబాద్, 2009.
  8. సుబ్బారావు, ముత్తరాజు, శ్రీకృష్ణ తులాభారము, విక్టరీ ప్రెస్, విజయవాడ, 1958.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]