headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-4 | April 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

13. శ్రీమన్మహాభారతవిరాట-ఉద్యోగపర్వాలు: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం

డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ

సంస్కృత సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం.
శ్రీసత్యసాయి జిల్లా – 515134, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9966108560, Email: mullapudibssnarayana@sssihl.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

ధర్మజుని కోపదృష్టి సోకి కౌరవాశ్రితులు దగ్ధమైపోతారని ముఖమునకు వస్త్రమును అడ్డుపెట్టుకుని వనాలకు వచ్చిన అజాతశత్రువు ధర్మరాజు. తన నెత్తురు కళ్ళచూసిన విరాటుడిని కూడా దయాదృష్టితో చూసి, ఆశ్రయమిచ్చినవారిమీద కృతజ్ఞతను చాటుకున్న పుణ్యమూర్తి. ధర్మజుడు ఉన్న ప్రాంతములో పంచభూతములు గానీ, ప్రకృతి గానీ, పశుపక్ష్యాదులు గానీ ఎటువంటి వృద్ధిని, సామరస్యాన్ని కలిగిఉంటాయో భీష్ముడే స్వయంగా విరాటపర్వంలో ప్రశంసించటం జరిగింది. శల్యుని విషయంలో ధర్మరాజు చూపిన రాజనీతిగానీ, దూరదృష్టిగానీ పండితలోకాన్ని విస్మయపరుస్తుంది. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే యలిగిన నాడు...ఏవిధంగా లోకములుండునో పరమాత్ముడే స్వయంగా కౌరవసభలో వివరించాడు. రాయబారము విఫలమై కౌరవులు యుద్ధానికే సిద్దమయ్యారని తెలిసి ధర్మరాజు సర్వసైన్యాధ్యక్షుడిగా శ్రీకృష్ణపరమాత్మ పైనే భారం వేశాడు.

Keywords: కంకుభట్టు – ధౌమ్యోపదేశం – దుర్గాస్తుతి – విరాటుడు – భీష్మకృత ధర్మజప్రశంస - ధర్మజుడి పై సాత్యకి స్వామిభక్తి, మాయాద్యూతం గురించి చెప్పిన సత్యాలు - శల్యుడి విషయంలో ధర్మజుడి అంతరంగం – రాయబారాలు.

1. ఉపోద్ఘాతం:

పాండవులు చేసిన పన్నెండు సంవత్సరముల అరణ్యవాసం ఒక ఎత్తు, అజ్ఞాతవాసం ఒక్కసంవత్సరం మరొక ఎత్తు. వనవాసంలో వారు ఎలా జీవించినా అడిగేవారు లేరు. కానీ ఈ అజ్ఞాతవాసంలో పాండవులను గుర్తుపడితే మరలా పన్నెండు సంవత్సరాలు వనవాసము చేయవలసి వస్తుంది. దాచినా దాగని ధర్మజుని తేజస్సు, ఆబాలగోపాలం గుర్తుపట్టే భీమసేనుడి భారీకాయం వంటి లక్షణాలతో పాండవులు అజ్ఞాతంగా గడపాలంటే దైవానుగ్రహం కావాలి. అపారమైన దైవశక్తి సహాయంగా హస్తినాపురానికి దగ్గరలోనే ఉన్న విరాటుని రాజ్యంలో కౌరవులు తెలుసుకోలేనివిధంగా దీక్షసాగించారు. ధర్మాత్ముడి అడుగుజాడలలో అరణ్య,అజ్ఞాతవాసాల కష్టకాలాన్ని అధిగమించి ఉత్తరాభిమన్యుల వివాహముతో శుభప్రదంగా ముగించిన పుణ్యమూర్తులు పాండవులు. 

2. కంకుభట్టుగా ధర్మజుడు

వనపర్వంలో యక్షప్రశ్నలసందర్భంలో యమధర్మరాజే పాండవులకి ఎక్కడకి వెళ్లాలో చేప్పి, కావలిసిన రూపాలు ధరిస్తారని, విజయం సాధిస్తారని వరాలు కూడా ఇచ్చాడు. యముడు ఇంకొక వరం కోరుకోమని ధర్మజుని అడిగినప్పుడు “ఎల్లప్పుడూ ధర్మము మీదే నా బుద్ది ప్రవర్తించునట్లు చేయమని” వరం కోరుకున్నాడు ధర్మదీక్షితుడు. (ఈ వరంతో ఇక మనము ధర్మజుడు చేసింది ధర్మమా, అధర్మమా అనే ఆలోచనకు కూడా వెళ్ళక్కర్లేదు.) ఇక అర్జునుడు ధర్మరాజుని అడిగాడు. “రాజా! నీవు విరాటుణ్ణి ఏవిధంగా సేవించదలిచావు” అని అడిగాడు.

కంకోనామ ద్విజో భూత్వా మతాక్షః ప్రియదేవనః । 1.24

ధర్మరాజు 'కంకుభట్టు' అనే పేరుతో విరాటుని కొలువులో పాచికలాటతో విరాటుణ్ణి సంతోష పెడతానని నిశ్చయించుకున్నాడు. (“అవిప్రో విప్రరూపేణ కంక ఇత్యభిధీయతే” – విప్రుడు కానివాడు విప్రునిలాగా వేషం ధరించేవారిని కంకు అని సంబోధించవచ్చు. మరొక అర్థంలో కంక అనగా యముడు అనే అర్థం తీసుకోవచ్చు).         

3. ధౌమ్యోపదేశం:

అందరి చేత సేవలందించుకునే పాండవులు అన్ని సుఖాలను అనుభవింపదగిన పాండవులు, రాకుమారులు, సమస్త భూమండలాన్నీ శాసించగలవారు, అటువంటి పాండవులు మరియు ద్రౌపది, మరొక రాజు కింద సేవకులు గా పనిచేయవలసివస్తుంది. కాబట్టి ఎటువంటి జాగర్తలు తీసుకోవాలి? మహారాజు దగ్గర ఎలా ప్రవర్తించాలి? ఆయనకి కోపం రాకుండా రాజు అనుగ్రహం పొందటం కోసం ఎలా ఉండాలి? ఎటువంటి సేవకుడు కార్యసాధకుడు అనిపించుకుంటాడు? ఎటువంటి సేవకుడు సుఖంగా ఉంటాడు? అనే విషయాలన్నీ పురోహితుడు ధౌమ్యులవారు ధర్మరాజుకి (పాండవులకి) ఉపదేశించారు. పాండవులకు అన్నీ తెలిసినవే అయనా వారిమీదన్న అభిమానంతో చెప్పాడు.

                               విదితే చాపి వక్తవ్యం సుహృద్భిరనురాగతః।

                               ఏష ధర్మశ్చ కామశ్చ అర్థశ్చైవ సనాతనః।।  4.9

 వీటినే 'ధౌమ్యోపదేశం' అంటారు. ముందుగా ఎక్కడ కూర్చోరాదో చెప్తున్నాడు. “రాజుగారియొక్క వాహనాలను ఆసనాలను మీరు అధిరోహంచకండి. మీరు మహారాజుకి ఎంత ఇష్టమైనవాళ్లయినా ఎంత చనువు వున్నా కూడా వారి ఆసనాలలో కూర్చోకండి. అలా కూర్చుంటే మీమీద దుష్టుల కళ్లు పడతాయి. మీ గురించి వారికి అనేక అనుమానాలు బయలుదేరతాయి. కాబట్టి మీకిచ్చిన ఆసనాలనే మీరు ఉపయోగించండి.

                          యో న యానం న పర్యంకం న పీఠం న గజం రథమ్।

                          ఆరోహేత్ సమ్మతోsస్మీతి  స రాజవసతి వసేత్।।   4.14

అలాగే మహారాజు అడగకుండా మీరు సలహాలు ఇవ్వమాకండి. అదికూడా రాజుకు హితమైనది ప్రియమైనది మాత్రమే చెప్పాలి.  వీలైనంత మౌనంగా ఉంటూనే రాజును సేవించండి. రాజుతో పాటు నవ్వవలసిన సందర్భంలో ఆ నవ్వటం కూడా మరీ బిగ్గరగా కాకుండా, మరీ మెల్లగానూ కాకుండా, మృదుస్శితంగా నవ్వాలి”. అంటే పెద్దల దగ్గల నవ్వే విధానం కూడా ఎలా ఉండాలో చెప్తున్నాడంటే అది ఎంత ముఖ్యమైనదో గమనించండి. అలాగే “లాభం కలిగితే పొంగిపోకుండా అవమానం జరిగితే కుంగిపోకుండా, మనోనిగ్రహం కలవాడే రాజసభలలో చిరకాలం ఉండగలడు. ఒక రాజుని ఆశ్రయించి ఉన్నవారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజుగారి గుణాలనే పొగడాలి కానీ దోషాలను చెప్పకుడదు. రాచకార్యం మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇతరుల ధనాన్ని గానీ వస్తువులను గానీ ముట్టకోకూడదు. ఆ సమయాల్లో ఇంటిని కూడా మరచి రాచకార్యాన్ని సాధించాలి. అలాగే రాజు ఇచ్చిన వస్త్రాదులు ఆభరణాలు తప్పకుండా ధరించాలి. రాజుకు ఇష్టంలేని వారితో ఎన్నడూ మాట్లాడకండి. రాజు ముందు వేరేవారిచ్చిన ఎటువంటి పురస్కారాలనూ స్వీకరించకండి. మీరు ఎంత పరాక్రమం కలిగిన వారైనా శూరులమని బుద్దిమంతులమని గర్వాన్ని ప్రదర్శించకండి”. పాండు కుమారులారా. మీకు అన్ని విషయాలు తెలిసినవే అయినా మీ మీద ఉన్న వాత్సల్యంతో ఈ విధమైన జాగ్రత్తలు చెప్పాలనిపించింది. అని ధౌమ్యుడు ఆశీర్వదించి, పాండవులను బయలుదేరమన్నాడు.  అజ్ఞాతవాసంలో ఎవరికీ తెలియకుండా ఉండటానికి, వీరిలో వీరు మాట్లాడుకోటానికి నామధేయాలు మార్చుకున్నారు. ధర్మరాజు పేరు 'జయుడు', భీముడి పేరు 'జయంతుడు', అర్జునుని పేరు 'విజయుడు' , నకులుని పేరు 'జయత్సేనుడు', సహదేవుని పేరు 'జయద్బలుడు'. వీరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఈ పేర్లతోనే సంభోధించుకోవాలి. అన్ని పేర్లూ జయ శబ్దంతో మొదలవుతాయి. భారతం పేరు కూడా జయమే.

                         జయో జయన్తో విజయో జయత్సేనో జయద్బలః।

                         ఇతి గుహ్యాని నామాని చక్రే తేషాం యుధిష్ఠిరః।।                     5.35

4. దుర్గానుగ్రహం:

ఆ తరువాత నగరంలో ప్రవేశిస్తూ  ధర్మరాజు త్రిభువనాలకూ జగన్మాత అయిన దుర్గాదేవిని మనసారా స్తుతించాడు. “మాతా- నీకు నమస్కరించేవారికి పుత్రవిషయంలో గానీ ధనవిషయంలో గానీ దుర్లభమైనది ఏదీలేదు. భరింపరాని దుర్లభమైన కష్టలనుండీ మమ్ము తరింపచేస్తావు కాబట్టి 'దుర్గ' అంటారు” అంటూ దుర్గమ్మను స్మరించాడు.  యశోదాగర్భ సంభూతాం నారాయణ వరప్రియామ్। ...”. ధర్మాత్ముడి భక్తికి దుర్గాదేవి సాక్షాత్కరించింది. ధర్మరాజుతో ప్రసన్నంగా పలికింది. “త్వరలోనే నీకు యుద్ధంలో విజయం చేకూరుతుంది. నా అనుగ్రహంతో కౌరవసేనను జయించి రాజ్యమంతా శత్రురహితంగా చేసుకుని పరిపాలిస్తావు. నీకు సుఖము, ఆరోగ్యము, కీర్తి కలుగుతాయి. అంతేకాదు,  ఈ స్త్రోత్రాన్ని భక్తితో పఠించినవారికి, విన్నవారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి. మిమ్మల్ని విరాటనగరంలో కౌరవులు ఎవరూ గుర్తుపట్టలేరు” అనికూడా వరమిచ్చి దేవి అంతర్థానమయ్యింది.

5. సభాప్రవేశం

“నన్ను తలుచుకుని మీకు కాలసిన రూపాలు పొందవచ్చు” అని యమధర్మరాజు యక్షప్రశ్నల సమయంలో చెప్పాడు. అందుకని  పాండవులు యముణ్ణి స్మరించి వారనుకున్న వస్త్రభూషణాదులను పొందారు.  ధర్మరాజు యువకుడై, చేతిలో త్రిదండం, కమండలం, దర్భలు, తలపాగా, కాషాయవస్త్రం, శిఖ,  ధరించిన బ్రాహ్మణరూపాన్ని పొందాడు. కంకుడనే పేర తన పరిచయం చేసుకున్నాడు.  సర్వస్వం కోల్పోయి జీవనం కోసం వచ్చినట్టు తెలిపి విరాట రాజాస్థానంలో స్థానం సంపాదించాడు ధర్మజుడు.  విరాటుని వద్దకు వచ్చి, “అహం యుధిష్ఠిరస్య సఖా” అని విరాటునితో పలికాడు. అందులో కూడా అసత్యము లేదనే చెప్పాలి. “యుద్ధమునందు స్థిరంగా ఉండే విరాటుని మిత్రుడను” అనే అర్థం వస్తుంది.

6. విరాటుని విషయంలో ధర్మరాజు చూపిన స్వామిభక్తి:

ధర్మరాజు తేజస్సు చూసే విరాటరాజు “నా రాజ్యంలో నీవు నేను అనుభవిస్తున్న సుఖాలన్నీ అనుభవించవచ్చు, స్వేచ్ఛగా ఉండమని” తన ప్రాణ స్నేహితునిగా అందరికీ పరిచయం చేశాడు. అజ్ఞాతవాసం పది నెలలు గడిచింది. రహస్య జీవితాన్ని గడుపుతున్న వారికి పదకొండో నెలలో కీచకుడు రూపంలో ఆపద సంభవించింది. నిండు సభలో మరోసాకి (సభాపర్వంలో మొదటిసారి) ద్రౌపదిని అవమానించాడు కీచకుడు. కాలితో తన్నాడు. వెంటపడ్డాడు. భీముడు కీచకుని ప్రవర్తనకి పళ్లు కొరుకుతూ, కనురెప్పలు ముడిచి, శరీరం ఎర్రగా కనిపిస్తూ, భయం కలిగిస్తూ, కీచకాధముడిని సంహరించటానిక లేస్తుంటే, శాంతనుడు ధర్మరాజు రహస్యంగా వారి వేషాలు ఎక్కడ బయటపడతాయో అని తన బ్రొటనవేలితో భీముని అంగుష్ఠాన్ని నొక్కుతూ, చూపుతో సైగచేసి భీముణ్ణి కోపాన్ని ఆపుకోమని నిగ్రహించాడు. “వలలా వంటకట్టెలకోసం పచ్చనిచెట్టు వైపు చూస్తున్నావా. ఎండు కట్టెలు కావాలంటే బయటకు వెళ్లి తెచ్చుకో.

                           ఆలోకయసి కిం వృక్షం సూద దారుకృతేన వై।

                           యిది తే దారుభిః కృత్యం బహిర్ వృక్షాన్నిగృహ్యతామ్”।।       16.19

అని అంటూ “వీడి విషయం సభలో కాదు బయట చూడు” అని రహస్య సంకేతం ఇచ్చాడు. అంటే ఇక్కడ పచ్చని చెట్టు అంటే ఇన్నాళ్ళూ మనకు నీడనిచ్చిన విరాటరాజు అని అర్థం. కీచకుడి సంగతి ఇక్కడ కాదు, బయట వీడిని ఎండుకట్టెను విరిచినట్టు విరచెయ్ అని సంకేతార్థం. మనం  ఏ చెట్టును(విరాటుని) ఆశ్రయించి వున్నామో ఆ చెట్టుకి అపకారం చేయకూడదు అని ధర్మరాజు తన కృతజ్ఞతను చాటుకున్నాడు. అంతే కాకుండా ఆదరించి అన్నంపెట్టి, పాండవుల ఆకారాలు బహిర్గతం కాకుండా రక్షణకు అవకాశం ఇచ్చిన విరాటుని గౌరవాన్ని, రాజ్యాన్ని(గోగ్రహణ సమయంలో) కూడా కాపాడిన ధర్మమూర్తి యుధిష్ఠిరుడు .

                              యస్య చార్ద్రస్య వృక్షస్య శీతచ్ఛాయాం సమాశ్రయేత్।

                               న తస్య పర్ణం ద్రుహ్యేత పూర్వవృత్తమనుస్మరన్.।।

రాజుని, సభలోని ధర్మాత్ములను, ధర్మరాజు భీముడిని శాంతింపచేయటమూ చూసిన ద్రౌపది అందరినీ నిందించింది. ధర్మజుడు (కంకుభట్టు) అంటున్నాడు, “సైరంధ్రీ! నీవు మహారాజు మాట విన్నావు కదా. నీ గంధర్వ భర్తలు నిన్ను రక్షిస్తారులే వెళ్లు. భర్తలను అనుసరించే వీరపత్నులు అన్ని కష్టాలను మౌనంగానే భరిస్తారు. నీ భర్తలు వారి ప్రతాపాలను చూపటానికి ఇది సరైన సమయం కాదనుకుంటున్నారెమో. కాబట్టి నీవు ఇక ఇక్కడనుండీ మహారాణి మందిరానికి వెళ్లు” అని ఆదేశించాడు. ధర్మజుని సంకేతం అందుకున్న భీముడు కీచక, ఉపకీచకులను పధకంప్రకారం అంతమొందించాడు.   క్క పదిహేను రోజుల్లో అజ్ఞాతవాసం సమయం అయిపోతుంది.

7. భీష్ముడు చేసిన ధర్మజప్రశంస:

విరాటుని రాజ్యంలో ఒకస్తీ కారణంగా ఆమె భర్తలైన గంధర్వుల చేత మహాబలవంతుడైన కీచకుడు తన సోదరులతో సహా ఒక్క రాత్రిలోనే చంపబడ్డారు అనే వార్త తెలియగానే దుర్యోధనుడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. పాండవుల అజ్ఞాతవాసం గడువు కూడా ముగుస్తుంది. ఇంతవరకూ మన వేగులు పాండవుల జాడకూడా పట్టలేకపోయారు.  వారిని ఎలా గుర్తించాలి అని అడిగాడు సభలో. ఈ సందర్బంలో భీష్ములవారు ఒకపక్క ధర్మరాజుని పొగుడుతూనే దుర్యోధనునికి పాండవుల నివాసాన్ని చెప్పనట్టుగా చెప్పేశారు. “నాయనా దుర్యోధనా – ధర్మరాజు ఆచరించే ధర్మం సత్పురుషులకు ఇష్టమైనది. సమస్తశుభలక్షణాలతో సత్యధర్మాలతో ఉపవాస నియమాదులతో శుద్ధవ్రతాన్ని ఆచరించేవాడు. అటువంటి ఉత్తమ నీతి కలవాని నీతిని ఇతరుల అన్వేషించలేరు. పాండవుల విషయంలో నా బుద్దినిశ్చయం చెబుతాను విను. వారికి ద్రోహం చేయడం కోసం గాదు. నీ మంచి కోరి చెబుతున్నాను. అంటూ వారికి అపకారంచేయకు, కానీ నీ మేలుకోరిచెప్పేస్తున్నా” అన్నట్టు చెప్పాడు. నాయనా! "యుధిష్ఠిరుడు నివసిస్తున్న నగరంలోగానీ గ్రామంలో గానీ రాజులకు అశుభం కలగదు. ధర్మరాజు ఉన్న జనపదంలో నివసించే జనానికి దానశీలం, ప్రియవాదిత్వం, జితేంద్రియత్వం, ఔదార్యం, వినయం, లజ్జా, శీలం ఉంటాయి. ధర్మరాజున్న  చోట జనులు సత్యపరాయణులుగా సంతోషమూ పుష్టికలవారుగా, పవిత్రులు, కార్యకుశలురుగా అవుతారు.

                                    దానశీలో వదాన్యశ్చ నిభృతా హ్రీనిషేవకః।

                               జనో జనపదే భావ్యో యత్ర రాజా యుధిష్ఠిరః ।।  28.15

అక్కడ ఇతరుల దోషాలను చూసేవారు కనబడరు. జనులంతా క్రమంగా స్వయంగా ధర్మనిరతులు అవుతారు. ధర్మజుడు వున్న ప్రదేశంలో ఎక్కువగా వేదధ్వని వినిపిస్తుంది. యజ్ఞసంవృద్ది జరుగుతుంది. సకాలంలో వర్షాలు పడతాయి. భూమి సస్యస్యామలంగా ఉంటుంది. ధాన్యాలు పళ్లు సుగంధద్రవ్యాలు మొదలైనవి గుణవత్తరంగా వృద్ది చెందుతాయి. గాలి సుఖస్పర్శనిస్తుంది. అంటే పంచభూతాలు కూడా ధర్మజునికి అనుకూలంగా ఉంటాయని అర్థం. ఇంకా ముఖ్యమైన సంకేతం ధర్మరాజున్న చోట గోసంపద అపారంగా వృద్ధి చెందుతుంది. పాలపదార్థాలకు లోటుండదు.

                               గావశ్చ బహులాస్తత్ర న కృశా న చ దుర్బలాః।

                               పయాంసి దధిసర్పీంషి రసవన్తి హితాని చ. ।।  28. 22

చాతుర్వర్ణ్యాలవారూ వారి వారి ధర్మాలను పాటిస్తూండటం మనం ఆ ప్రదేశంలో చూడవచ్చు. సకల సద్గుణసంపన్నుడైన ఆ ధర్మరాజుని ద్విజులు సైతం గుర్తించలేరు, ఇక సామాన్య చారులవలన ఏం సాధ్యమవుతుంది. దుర్యోధనా! నా మాట మీద నీకు నమ్మకముంటే గనకా, ఈ విషయాన్ని ఆలోచించి ఏం చేస్తే నీకు మేలు కలుగుతుందో అది చేయి. ఇంతకంటే నేను విరుద్దంగా చెప్పలేను” అంటూ చెప్పనంటూనే చెప్పవలసినదంతా చెప్పేశాడు భీష్మపితామహుడు.

ఉత్తరగోగ్రహణ సమయంలో బృహన్నలసాయంతో ఉత్తరకుమారుడు యుద్దానికి వచ్చాడు. బృహన్నలను చూడగానే గుర్తుపట్టినవాడు గురువైన ద్రోణాచార్యుడు. తరువాత భీష్మాచార్యులవారు. వచ్చినవాడు ఫల్గునుడనే విషయం దుర్యోధనుడికి తెలియచేశారు. అసలు అజ్ఞాతవాసం పూర్తయిందా లేదా అనే విషయాన్ని వెంటనే భీష్మ పితామహుణ్ణి అడిగాడు. భీష్ముడు లెక్కచెప్పాడు. నాయనా నక్షత్రాల నడకలలో హెచ్చుతగ్గల వలన, పక్షమాసాదుల కాల ప్రమాణం పెరగటం వలన ప్రతి ఐదు సంవత్సరాలకు రెండు నెలలు అధికంగా వస్తాయి. అధికమాసాలు అంటారు వాటిని. వాటిని మనం లెక్కలోకి తీసుకోకూడదు. “నీకు లెక్క తెలీక ఇలా ఉన్నావు. కానీ అర్జునుడు ఆ లెక్కలన్నీ చూసుకునే నీముందుకు వచ్చాడు. కాబట్టి లెక్కలు తరువాత చూసుకుందాము. ముందు వచ్చినవాడి నుండీ ఎలా రక్షించుకోవాలో ఆలోచించుకో” అన్నారు తాతగారు.

దక్షిణ గోగ్రహణం నుండీ పాండవుల సహాయంతో విజయుడై తిరిగి వచ్చిన విరాటరాజు, ఉత్తరుడు బృహన్నలను సారథిగా చేసుకుని కౌరవులతో యుద్దానికి వెళ్లాడనే విషయం తెలిసి ఖంగారు పడ్డాడు. తన సైన్యాన్నంతా ఉత్తరుడికి సహాయంగా వెళ్లాలని ఆదేసించాడు. కానీ పక్కనే ఉన్న యుధిష్ఠిరుడు, “మహారాజా! బృహన్నల సారథిగా ఉంటే యువరాజుకి ఏ భయంలేదు. ఖంగారు పడకండి అన్నాడు”. ఇంతలోనే ఉత్తరవిజయవార్త వార్తాహరులవలన విని విరాటరాజు పరమానంద పడ్డాడు. ఉత్తరుడు సకల కౌరవ సైన్యాన్ని జయించి వస్తున్నాడు. కాబట్టి రాజధానినంతా అలంకరిచండి. సంబరాలు చేయండి. అంటూ ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేయించి సగర్వంగా, “కంకుభట్టూ! రా, ఈ ఆనందంలో పాచికలు ఆడదాం. చూశావా! నా కుమారుడు కౌరవులను జయించి మరీ విజయలక్ష్మిని సాధించి వస్తున్నాడు. వీరుడైన నా కుమారుడు ఒక్కడే ఇంతటి ఘనకార్యాన్ని సాధించాడు” అని అంటుంటే, మరలా ధర్మరాజు “అవును మహారాజా! చాలా గొప్పవిషయమే, బృహన్నల పక్కన ఉంటే ఈ విజయం తప్పక వచ్చివుంటుంది” - అంటూ పదే పదే బృహన్నలను ప్రశంసించటంతో విరాటరాజుకు కోపం వచ్చింది. “నాకుమారుడిని ఒక నపుంసకునితో సమానంగా పోలుస్తావా. నీకు  ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా ఆ మాత్రం”. అంటూ చేతిలో ఆడటానికి పట్టుకున్న పాచికలను ధర్మరాజు మీదకు విసిరాడు.

తతః ప్రకుపితో రాజా తమక్షేణాహనద్ భృశమ్।/ ముఖే యుధిష్ఠిరం కోపాన్నైవమిత్యేవ భర్త్సయన్।।   68.46

విరాటుడు విసిరిన పాచికలు కాస్త గట్టిగా తగిలి ముక్కునుండీ రక్తం స్రవించసాగింది ధర్మనందనుడికి. ఆపుకుని పక్కన కనిపించిన సైరంధ్రి వైపు చూశాడు. ఆ పతివ్రత భర్త చూపులోని ఆంతర్యం గమనించి బంగారు పాత్రలో నీరు పోసి తెచ్చింది. నెత్తురు కారుతూఉంది. ఇంతలో భటులు వచ్చి, ఉత్తరకుమారుడు-బృహన్నలలు  ప్రవేశిస్తున్నారని చెప్పారు. త్వరగా ప్రవేశపెట్టమని విరాటుడు ఆజ్ఞాపించాడు. కానీ కంకుభట్టు భటుణ్ణి పక్కకు పిలిచి ముందు ఉత్తరుడిని మాత్రమే ప్రవేశపెట్టు అన్నాడు. ఎందుకంటే ధర్మరాజు యొక్క ఈ స్థితి అర్జునుడు చూస్తే, ఈ పనికి కారకుడైన విరాటుణ్ణి అర్జునుడు ఇక బ్రతకనివ్వడు. అర్జునుడికి ఒక ప్రతిజ్ఞ ఉంది, అదేమిటంటే - యుధిష్ఠిరుడిని యుద్ధంలో కాక ఎవరన్నా గాయపరిస్తే వారు ఎవరైనా  ప్రాణాలతో వుండరు అని. అందుకని ఆ అర్జునుడు ఈ నెత్తురు చూసి జరిగింది తెలుసుకుని విరాటుణ్ణి సంహరిస్తాడని, విరాటుడు చేసిన తప్పుని  క్షమించిన కారుణ్యమూర్తి ధర్మరాజు. పైగా సంవత్సరం పాటు విరాటుని కొలువులోనే సురక్షితంగా గడిపారు, అటువంటి వారికి హాని కలగనిస్తాడా ధర్మరాజు? ఉత్తరుడి వలన అసలు విషయంతెలుసుకున్న విరాటుడు మన్నించమని అనగానే ధర్మరాజు ప్రసన్నుడయి “మహారాజా! నేను క్షమాగుణాన్ని యజ్ఞంలాగా అలవరచుకుంటున్నాను. నా నెత్తుటి బొట్టునేలమీద పడితే నీవు నీ రాజ్యము అంతరించిపోయేవి. నీవు నా స్నేహితుడివి, నీ మీద నాకు కొంచెంకూడా కోపంలేదు అన్నాడు. తనకు ఆశ్రయం ఇచ్చి న స్నేహితుడు ఆవేశంలో  చేయి చేసుకున్నా కూడా రాజ్యరక్షణ, ప్రజారక్షణ దృష్ట్యా శాంతి వహించిన సహనశీలి యుధిష్ఠిరుడు. యది హ్యేతత్ పతేత్ భూమౌ రుధిరం మమ నస్తతః। / సరాష్ట్ర స్త్వం మహారాజ వినశ్యేథా న సంశయః।।    68.64 అజ్ఞాతవాసంతో మొదలై ఉత్తరాభిమన్యుల వివాహమహోత్సవంతో ముగిసింది విరాటపర్వం.

8. ఉద్యోగపర్వం:

8.1 ధర్మజుడి పై సాత్యకి స్వామిభక్తి – మాయాద్యూతం గురించి చెప్పిన సత్యాలు.

ఉత్తరాభిమన్యుల వివాహము పూర్తవగానే మాయాద్యూతంలో పాండవులు ఓడిపోయన రాజ్యం తిరిగి ఎలా పొందాలి అనే చర్చ జరిగింది. బలరాముడు దుర్యోధన-శకునిలను వెనకేసుకొచ్చాడు. "ద్యూతక్రీడలో దుర్యోధనుడు, శకునిల తప్పేముంది? ధర్మరాజుని జూదానికి పిలిచినప్పుడు శకునిని తప్ప మిగిలినవారితో ఎవరితోనైనా ఆడతానని కోరుకునుంటే సరిపోయేది కదా! పైగా పందెం ఓడిపోతున్నప్పుడు తప్పుకుంటే సరిపోయేది కదా కాబట్టి దుర్యోధనుణ్ణి, ధృతరాష్రుడిని మనం ఎంతో వినమ్రతతో నమస్కరించి దూతకార్యంద్వారా  మనం రాజ్యాన్ని పొందే ఉపాయాన్ని ఆలోచించాలి" అన్నాడు.

 అన్నగారు అన్న ఆ మాటకు భగ్గున మండిపోయాడు సాత్యకి. "బలరామా! నీ మనసునకు తగిన మాటలే చెప్పావులే. అయినా మాయాద్యూతం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెబుతున్నాను. "ధర్మరాజులో చిన్న తప్పు కూడా పట్టటానికిలేదు. జూదమాడదామని ధర్మరాజేమన్నా దుర్యోధనుణ్ణి పిలిచి, ఆడి ఓడిపోయాడా? జూదం మీద ఆసక్తి లేనివాడిని, జూదం ఆడటం సరిగ్గా రాని వాడిని, ఓడినాకూడా మరలా రెండవసారి పిలిచి మరీ ఆడించి వారిని మోసం చేసి కష్టాలపాలు చేసిన ఆ మాయాజ్యూదం ధర్మజ్యూదం ఎలా అవుతుంది? అంతేకాక శకునితోనే ఎందుకు ఆడాలి? అన్నావు. ఆ సమయంలో దుర్యోధనుడు ఐదువందల మంది మహా జూదరులను అనేక రాజ్యాల నుండీ తెప్పించి వారినందరినీ చూపించి వీరిలో ఎవరితోనైనా ఆడవచ్చు అన్నాడు. వారందరూ శకుని కంటే పదిరెట్లు అధిక నైపుణ్యంకలవారే కానీ తక్కువవారేమీ కాదు.  పైగా ధర్మరాజు ఆడిన మాటకు కట్టుబడి పదమూడు సంవత్సరాలు వనవాస కష్టాలనుండీ వచ్చిన ధర్మరాజు, కౌరవులను వినమ్రతగా నమస్కరించి చేయిచాయి రాజ్యాన్ని యాచించాలా? ఎప్పుడయితే వనవాసం అయిపోయిందో అప్పుడే పిత్రార్జితంగా వచ్చిన సమస్త రాజ్యమూ ఈ ధర్మరాజుకి చెందుతుంది. అతడేమన్నా అన్యాయంగా రాజ్యం అడుగుతున్నాడా? నీవు నీ మనసును బట్టి అటువంటి మాట అన్నావు కానీ నేనైతే ఇప్పుడే కౌరవులందరినీ యుద్దంలో నా వాడి బాణాలకు అంకితం చేసి మహాత్ముడైన ధర్మజుని రాజ్యాన్ని ఆయన పాదాలపై పెడతాను. యుద్దంలో నన్నాపేవాడెవడున్నాడో చూస్తాను. ధర్మరాజుకి వారు  ఆ రాజ్యాన్నంతా ఇచ్చితీరాలి లేదా కౌరవులంతా యుద్ధభూమిలో శాస్వతంగా నిద్రించాలి.

                               అద్య పాండుసుతో రాజ్యం లభతాం వా యుధిష్ఠిరః।

                               నిహతా వా రణే సర్వే స్వప్స్యన్తి వసుధాతలే।।           3.23

-అని సాత్యకి చిన్నవాడైనాకూడా దుర్యోధనుడి గురువైన బలరాముడికి, సభలోని వారికి తనకు ధర్మరాజు మీదున్న భక్తిని  చాటుకున్నాడు. ద్రుపదమహారాజు అంతా విని సాత్యకినే సమర్థించాడు.

9. శల్యుడి విషయంలో ధర్మజుడి అంతరంగం – ధర్మరాజు రాజనీతికి నిదర్శనం:

ఆ తర్వాత పాండవుల దూతలద్వారా యుద్ధవార్తలు విన్నాడు శల్యుడు, పాండవులకు మేనమామ, మాద్రిసోదరుడు అయిన శల్యుడు పెద్ద సైన్యంతో, మహారథులైన పుత్రులతో కలిసి పాండవులకు సహాయం చేయటానికి తన అక్షౌహిణి సైన్యాన్ని తీసుకుని బయలు దేరాడు.  శల్యుడు సైన్యంతో ధర్మరాజు దగ్గరకు బయలుదేరాడనే వార్త తెలుసుకుని దుర్యోధనుడు వస్తున్న  సైన్యమంతటికీ చక్కటి వసతులు, విశ్రాంతి మందిరాలు, సేవకులను ఏర్పాటు చేసి శల్యుణ్ణి ఆకట్టుకున్నాడు. సకలవసతులు, విందులు విలాసాలతో వారి హోదాకి తగ్గట్టు శల్యుణ్ణి పూజించి రాజభోగాలతో స్వాగతించాడు. అటువంటి వైభవోపేతమైన సదుపాయాలు చూసి సంబరపడిపోయి ఈ సదుపాయాలన్నీ ధర్మరాజే చేయించి వుంటాడనే ఉద్దేశంలో, "ఇంత చక్కని సభలు నిర్మించిన యుధిష్ఠిరుని ఉద్యోగులు ఎవరో వారిని నేను తప్పక అనుగ్రహించాలి వారు కోరింది ఇచ్చి సత్కరించాలి" అనుకున్నాడు. ఆ మాటకోసమే ఎదురుచూస్తూన్న దుర్యోధనుడు, సేవకుల ద్వారా శల్యుని ఆనందాన్ని తెలుసుకుని  సమయం చూసి ఎదురుపడ్డాడు. “మామయ్యా! నేను చేసిన ఈ ఏర్పాట్లన్నీ మీకు తృప్తిని కలిగించాయనుకుంటా”? అన్నాడు. మద్యం మత్తులో ఉన్న శల్యుడు ముందు వెనుకలు ఆలోచించకుండా 'నీకు ఏం వరంకావాలో కోరుకో, ఇస్తాను'. నీ మర్యాదలతో అంత ఆనందపరిచావు నన్ను అన్నాడు. దుర్యోధనుడన్నాడు, 'నీవు నీ సైన్యం అంతా నాకు సహాయం చేయాలి, నీవు సర్వ సైన్యాధ్యక్షుడివి కావలసినవాడివి' అని కాస్త పొగిడేటప్పటికి శల్యుడు  అలాగే అని మాట ఇచ్చేశాడు.

సత్యవాగ్ భవ కల్యాణ వరో మై మమ దీయతామ్। / సర్వసేనాప్రణేతా  వై భవాన్ భవితుమర్హతి।।      8.18

 శల్యుడు వచ్చింది ధర్మరాజుకి సహాయం చేయటానికి. ఇప్పుడు ధర్మరాజుకి విరుద్ధంగా దుర్యోధనుడి పక్షానచేరవలసి వచ్చింది. మాట ఇచ్చేశాడు కాబట్టి చేసేది లేక  "సరే దుర్యోధనా!  నీవు వెళ్లిరా నేను ఒకసారి ధర్మరాజుని కలిసి వస్తాను" అన్నాడు శల్యుడు. దర్మరాజుని చూసి త్వరగా రావాలి మామయ్యా, నాకు నీవు మాటిచ్చావు అంటూ దుర్యోధనుడు వెళ్లిపోయాడు. వస్తున్నవాడు ఎవడు, ఎంతసైన్యం అతని చేతిలో ఉంది, అతనిని తన వశం చేసుకోవాలంటే ఏంచేయాలి, అతని బలహీనత ఏంటో అన్నీ తెలుసుకుని పథకం ప్రకారం కార్యాన్ని నిర్వహించి ధర్మరాజు మేనమామను కూడా తనవైపు తిప్పుకున్నాడు దుర్యోధనుడు. కుటిల రాజకీయం ఇది.

10. సంజయ రాయబారం:

సంజయుడు పాండవులు నివసించిన ఉపప్లావ్యంలోకి ప్రవేశించాడు. ధృతరాష్ట్రుడు శాంతిని కోరుతూ మీ దగ్గరకు నన్ను పంపించాడు. అంటూ రాజసందేశాన్ని పాండవులకు వినిపించాడు.  "కుంతీ పుత్రులారా! మీరు మీ స్వభావంతో ఋజువర్తనంతో ధర్మంతో అందరి ప్రశంశలు పొందేవారు. ఉన్నత వంశంలో పుట్టినవారు. అటువంటి మీరు ఇటువంటి యుద్దమనే నీచ కార్యానికి తలపెట్టటం యుక్తం కాదు. యుద్దం అందరికీ నాశనాన్ని కలిగిస్తుంది. కురువంశీయులు తమలోతాము కలహించుకోవటం విడిచిపెట్టాలి. పాండవులారా!  మీరు  యుద్దమే నిశ్చయించుకుని కౌరవులను బంధించినా, లేక వధించినా ఆ తరువాత మీ జీవితం మరణంతో సమానమే అవుతుంది. జ్ఞాతుల వధ చేసిన తరువాత జీవించవచ్చేమో కానీ సుఖంగా జీవించలేము. శ్రీకృష్ణుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, పాంచాలరాజు, విరాటరాజు, సహాయకులుగా ఉండగా ఇంద్రుడు కూడా మీముందు నిలవలేడు. అదే విధంగా యుద్ధంలో ద్రోణభీష్మాదులతో కూడిన కౌరవసేనను కూడా ఎవరూ జయించలేరు. దుర్యోధనుడి వద్ద చాలా పెద్ద సైన్యం వుంది. ఎంతకీ తరగని సైన్యం అది. కాబట్టి జయమైనా అపజయమైనా నాకేమీ మంచి కనబటట్లేదు". అన్నాడు ధృతరాష్ట్రుని మాటగా సంజయుడు. ధర్మరాజు సంజయుడికి సమాధానంగా- "యుద్ధం యుద్ధం అంటావేమయ్యా, అసలు యుద్ధం కావాలని మేమన్నామా ఏమన్నా? మా రాజ్యం మాకిస్తే మేమెందుకు యుద్ధం చేస్తాం?  సంధే శ్రేష్టమైనది. యుద్ధం లేకుండా లభించినది చిన్నదైనా నేను దాన్ని గొప్పదిగా భావిస్తాను.            కాం ను వాచం సంజయ మే శృణోషి యుద్ధైషిణీం యేన యుద్ధాత్ బిభేషి।/ అయుద్ధం  వై తాత యుద్ధాత్ గరీయః కస్తల్లబ్ద్వా జాతు యుద్ధ్యేత సూత।।      26-1 (అందుకే కేవలం ఐదు ఊళ్లు ఇచ్చినా చాలు అని సద్దుకు పోయిన సాధుస్వభావం కలవాడు ధర్మరాజు.) వారు యుద్ధానికి కాలుదువ్వుతూ మమ్మల్ని సమస్థితిలో ఉండమనటమేమిటి? వారు వంకరగా ఆలోచిస్తూ మమ్మల్ని సవ్యంగా ఆలోచించాలనడం యుక్తం కాదుకదా? ధృతరాష్ట్రమహారాజుకు సమస్తరాజ్యాధిపత్యం ఉన్నా కూడా దుర్బుద్ధి, మూర్ఖుడైన తన కొడుకుని అనుసరిస్తున్నాడు. సంజయా! జూదం ఆడుతున్నప్పుడు హితకారియైన విదురుని మాటలను కూడా దూషించారు. అప్పుడే కౌరవులకు వివనాశకాలం దాపురించింది. అప్పటి నుండే వారికి ఆపదలు వచ్చాయి. యుద్ధరంగంలో అర్జునుడి గాండీవ ధనుష్టంకారం విననంతవరకే కౌరవులు జీవించివుండేది.

11. శ్రీకృష్ణ రాయబారం:

ఆ తరువాత ధర్మరాజు శ్రీకృష్ణుడిని రాజబారిగా వెళ్లి సంధికి ప్రయత్నించమని ప్రార్థిస్తున్నాడు. "కృష్ణా, ఐదు గ్రామాలే నేను కోరాను, అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం అనే నాలుగు గ్రామాలు, మరొకటి నీకిష్టమైది ఒకటి కలిపి ఐదు గ్రామాలు మాకిమ్మను. మా కారణంగా కురువంశం నశించకూడదు" అంటూ శాంతి వచనాలు పలికాడు.

అవిస్థలం వృకస్థలం మాకన్దీ వారణావతమ్।/ అవసానం చ గోవిన్ధ కశ్చిదేవాత్ర పంచమమ్ ।।   72.15

 కృష్ణా! చాలా సందిగ్థ స్థితిలో ఉన్నానయ్యా, ఈ స్థితిలో మేము మా ధర్మాలను నిలుపుకోగల మార్గమేదో నీవే చెప్పు? నీవు కౌరవుల దగ్గరికి వెళ్లాలన్నది నా అభిమతం కాదు. నీవెంత మంచిమాటలు చెప్పినా సుయోధనుడు వినేరకంకాదు. ఆ దుర్యోధనుడి కారణంగా నీకేమైనా ద్రోహం జరిగుతుందంటే నీవు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఆ తరువాత మాకు దేవతల ఐశ్వర్యమైనా అవసరం లేదు. అటువంటి పక్షంలో నీవు వారిదగ్గరికి వెళ్లకపోవటమే మాకు శ్రేయోదాయకం. ఇటువంటి సమయాలలో నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఆశ్రయించగలను? నీకు ఏది ఇష్టమైతే అది చేయి కృష్ణా, అంటూ పరమాత్ముడిపైనే భారం వేశాడు ధర్మరాజు. సమాధానంగా కృష్ణపరమాత్ముడన్నాడు, "మహారాజా!  ఆ దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడో నాకుతెలుసు. కానీ అటువంటి వానితో కూడా సంధికి ప్రయత్నిస్తే లోకంలో ఏ రాజూకూడా మనలను నిందించే అవకాశం ఉండదు. ఒకవేళ కౌరవుల ఆగడాలు సభలో మితిమీరితే వారంతా నా చేతిలో అక్కడే సంహరించబడతారు. అంటూ ధర్మరాజుని యుద్దానికే సిద్ధం కమ్మని మానసికంగా ధైర్యం చెప్పాడు.

బయలు దేరుతున్న ఉత్తర క్షణంలో ధర్మరాజు కృష్ణుడితో, "అయ్యా! అక్కడ మా తల్లి వీరమాత కుంతీదేవిని ముందుగా కలుసుకో, మా నమస్కారాలు తెలిపి కుశలమడిగామని తెలుపు. పుత్రులకు దూరంగా జీవనం గడుపుతున్న మా తల్లికి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అది మేము చేయటానికి సిద్ధంగా వున్నామని తెలుపు కృష్ణా, ఆవిడ నిర్ణయమే మా తుది నిర్ణయం, అని తన మాతృభక్తిని చాటుకున్నాడు ధర్మరాజు. రాయబారఘట్టంలో తెలుగులో మహానుభావులైన  తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగంలో ధర్మాత్ముడైన ధర్ముజుడే అలిగితే పరిస్థితి ఎలా ఉంటుందో పరమాత్ముడి మాటల్లో చెప్పిన  విశేషమైన పద్యాలు తెలుగు వారికి సుపరిచితమైనవి చెప్పుకుని తీరాలి. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే/ యలిగిన నాడు సాగరములన్నియు నేకము గాకపోవు క- /ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజరాజ, నా/ పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావు మెల్లరన్. రాయబారకార్యానన్ని ముగించుకుని వెళుతున్న శ్రీకృష్ణుడు కర్ణుడుని కలుసుకుని తన రథం మీదకి ఎక్కించుకుని మరీ, కాస్త దూరం మాట్లాడుతూ వెళ్లాడు. "రాధేయా! ఇన్నాళ్లు నీవు సూత పుత్రుడవనుకుంటున్నావు. కానీ ధర్మబద్ధంగా నీవు కుంతీ తనయుడవు. శాస్త్ర ప్రకారం పాండురాజుకి వారసుడివి, అందరం కలిసి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాం. ధర్మరాజు యువరాజు అవుతాడు. భీముడు నీకు గొడుగు పడతాడు. నీ రథాన్ని తోలటానికి అర్జునుడు సిద్ధం గా ఉంటాడు" అని కర్ణుని జన్మ వృత్తాంతాన్ని విశదపరిచాడు.

12. ముగింపు:

ధర్మో వివర్ధతి యుధిష్టిర కీర్తనేన, పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన।/ శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః ।।. ధర్మనందనుడు ఉన్న ప్రదేశంలో ధర్మం వృద్ధి చెందటమే కాక, ధర్మరాజుని కీర్తించినంత మాత్రమునే ధర్మము వృద్ధి చెందుతుంది అనుట నిస్సంశయము. శల్యుడిని ససైన్యముగా తన వశముగావించుకున్న దుర్యోధనుడి రాజకీయనైపుణ్యాన్ని, కేవలం “మాటసాయం” అనే మహాస్త్రముతో చిత్తుచేసిన రాజకీయమేధావి యుధిష్ఠిరుడు. వనవాసము చేసుకుని తాపసులవలెనో, భిక్షాటన చేసుకునో మీరు జీవించండి అని సందేశమిచ్చిన ధృతరాష్ట్రునికి, క్షత్రియోచితమైన వృత్తినే మేము ఆశ్రయించామని చెప్పి యుద్ధానికే సిద్ధమైన మెత్తటి పులి యుధిష్ఠిరుడు.  మహాభారతమందలి ధర్మరాజు పాత్రలో విశేషమేమనగా  కౌరవులు సైతం ధర్మజుని ధర్మదీక్షను ప్రశంసించిన ఘట్టములు చాలా కనిపిస్తాయి. కర్ణుడి మాటల్లో  స ఏవరాజా ధర్మాత్మా శాశ్వతోsస్తు యుధిష్ఠిరః।  అని కృష్ణపరమాత్మతో పలికిన వచననాలు దుర్యోధనుడి అధర్మవర్తనమును, ధర్మజుని మహిమను తెలియజేస్తున్నాయి. ఇటువంటి పుణ్యశీలుని స్మరణమాత్రముననే ధర్మాచరణమునందు మనసు మరలుననుటలో సందేహములేదు.

13. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కృష్ణాచార్య, టి.ఆర్., & వ్యాసాచార్య, టి.ఆర్. (సంపా.). శీమన్మమహాభారతమ్. నిర్ణయసాగర్ ప్రెస్, కుంభకోణం, బోంబే.
  2. పట్నాయక్, కె.ఎన్.ఎస్. “ది మహాభారతమ్ క్రోనోలజీ”. (వ్యాసము). నవంబరు 2023.
  3. ప్రతాప్ చంద్ర, రాయ్ (అను.). ది మహాభారత. ఓరియంటల్ పబ్లిషింగ్ కో., కలకత్తా.
  4. మోహన్ గంగూలి, కిసరి. (అను.). ది మహాభారత.
  5. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. & శ్రీనివాసులు, సూరం. వ్యాసమహాభారతము. విజయవాడ. 2010
  6. రామనారాయణదత్త శాస్తీ ,పాండ్యే. (హిందీ అను.) మహాభారతము. గీతాప్రెస్.
  7. శాస్త్రి, పి.పి.ఎస్. (సంపా.). ది మహాభారత. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]