headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-4 | April 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

12. 'దువ్వూరి' వారి కృషీవలుడు కావ్యం: పర్యావరణ స్పృహ

డా. రొట్ట గణపతిరావు

సహాయాచార్య, తెలుగు శాఖ,
ఆర్.జి.యు.కె.టి. (ఐఐఐటి) శ్రీకాకుళం,
ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9494586342, Email: dr.rgr@rguktsklm.ac.in
Download PDF


వ్యాససంగ్రహం:

కవికోకిల దువ్వూరి రామిరెడ్డి ఆధునిక కవి దిగ్గజాల్లో లెక్కించదగిన మహాకవి. ప్రకృతి వర్ణనలకు పెట్టిందిపేరుగా దువ్వూరి వారి ’కృషీవలుడు’ ప్రసిద్ధికెక్కింది. ఈ కావ్యంలో భావకవిత్వమార్గంలో సహజసుందరమైన వర్ణనలు ఎన్నో కొలువుతీరాయి. స్వాభావికమైన సన్నివేశ కల్పనలు, పాత్రచిత్రణలు, భాషాసారళ్యం, ప్రాంతీయపదజాలం మొదలైనవి రామిరెడ్డి రచనాశిల్పంలో మేలిమి మెరుగులు. వ్యయసాయదారుల జీవితాన్ని కళ్ళకుకట్టినట్టు ఆవిష్కరించే ఈ కావ్యంలో తారసపడే అనేకానేక పర్యావరణ సంబంధ అంశాల ప్రతీకలను మచ్చుకు కొన్ని ఉదాహరణల విశ్లేషించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. కృషీవలుడు కావ్యం ఈ పరిశోధనకు ప్రాథమిక ఆధారం. ద్వితీయ విషయసామగ్రిగా అకాడమీలు ముద్రించిన వివిధ పర్యావరణ సంబంధ గ్రంథావళిని స్వీకరించడమైనది.

Keywords: కృషీవలుడు, రైతు, పల్లెటూరు, పర్యావరణం, పద్యం, కావ్యం.

1. ఉపోద్ఘాతం:

భారతదేశం అనేక భాషలకు నిలయం. సంస్కృతం, హింది, తెలుగు, కన్నడం, తమిళం, ఒడియా, బెంగాలి మొదలగు అనేక భాషలు, వాటి సాహిత్యాలు,  సంస్కృతులు మన భారతీయ సాహిత్యావనిలో వెల్లివిరుస్తున్నాయి. భారతీయసాహిత్యావనిలో తనదైన శైలిలో స్థానాన్ని ఏర్పాటుచేసుకొని, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు సంపాదించుకొని మొదట ఆంధ్రదేశంలో ఆవతరించి, దేశవ్యాప్తంగా ప్రజల నాల్కలయందు నర్తిస్తున్న మన అమ్మభాష తెలుగు.

నన్నయ, తిక్కన, యర్రన మొదలైన అనేక గొప్ప కవుల కలముల నుండి జాలువారిన కావ్యాలను ఆకళింపుచేసుకుని వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గొప్ప కవి మన దువ్వూరి రామిరెడ్డి.  ఈయన తెలుగు  సాహిత్యమనే నందనవనాన్ని కలకూజితం చెసిన కవికోకిల, సామాన్య కర్షకుని జీవితాన్ని కావ్యవస్తువుగా మలచిన మహా శిల్పి. “పాస్టోరల్ ” కవిత్వానికి అంటే తెలుగులో ప్రకృతి కవిత్వానికి మార్గదర్శి. కవిత్వాన్ని విజ్ఞానాన్ని ఒకే నాగలికి పూన్చి ఆంధ్రకవిత అనే కేదారంలో సేద్యం చేసిన కృషీవలుడు.

దువ్వూరి- పరిచయం (అంతర్జాల శోధన ఆధారంగా):

“విఖ్యాత తెలుగు కవి, రచయిత, నాటక కర్త, అనువాదకుడు, బహుభాషా కోవిదుడు దువ్వూరు రామిరెడి అసాధారణమైన తెలుగు సాహితీవేత్త.  ‘కవి కోకిల’ మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది.

 ఆయన కళాశాలలో చదువుకోలేదు. ప్రాచీన గ్రంధానాలను అవలోకనం చేసుకోలేదు. అయినా స్వతంత్రంకు ముందే ఎన్నో ప్రఖ్యాత గ్రంధాలను రచించారు. సాహిత్యంలో అన్ని ప్రక్రియలలో ఆరితేరిన వారుగా పేరొందారు.  కలకండ వంటి కమ్మని కావ్యాలు, పలకరిస్తే అశుధారాపాతంగా జాలువారే పద్యపూరిత ప్రబంధాలే కాకుండా సంస్కృత, అరబిక్ భాషల నుంచి ఎన్నో పుస్తకాలను ఆంధ్రీకరించిన నవ్యరీతి దువ్వూరి ప్రత్యేకం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో నవంబర్ 9, 1895న  జన్మించారు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశారు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడయ్యారు. నవంబర్ 11, 1947న కీర్తి శేషులయ్యారు.  1917లో, అంటే తన  22వ ఏటనే  సి.ఆర్. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో ఆయనకు స్వర్ణపతకం బహూకరించారు.

1918లో ఇతని కావ్యం “వనకుమారి”, విజయనగరం మహారాజు ఆస్థానంలోని కావ్యస్పర్ధలో ప్రధమ స్థానం పొందింది.1929లో విజయవాడ ఆంధ్ర మహాసభ ద్వారా ‘కవికోకిల’ బిరుదును పొందారు. కేవలం కవిగానే కాకుండా గొప్ప విమర్శకులుగా కూడా సమానమైన ఖ్యాతి గడించారాయన. దువ్వూరి కలం నుంచి జాలువారిన సాహితీ సౌందర్యం గురించి వర్ణించి చెప్పడం కష్టం. మచ్చుకు ఒక్క రచన చదివితే తప్పించి ఆయన లోతైన అంతరంగం ఆవిష్కరించడం అంత సులభం కాదు.

మృదు మధురమైన మాటలు, గంభీరమైన శైలి, అన్నిటికీ మించి ఆ రచనా చాతుర్యం చదువరులను ముగ్ధులను చేస్తాయి. కళ్ళను అక్షరాల వెంట పరుగులెత్తిస్తాయి. చెప్పవలసిన విషయాన్ని సూటిగా, నాటుకునేటట్టు చెప్పడం వల్ల దువ్వూరి విమర్శలు ఆనాటి యువతలో ఆలోచనాత్మకథోరణిని రేకెత్తించాయి.

తెలుగు సాహిత్యంలో “కర్షక కవి” గా, “సింహపురి సిరి” గా పేరుపొందిన ఆయన రైతుల జీవనశైలి నేపథ్యంతో “కృషీవలుడు” అనే ప్రఖ్యాత ఖండ కావ్యాన్ని రచించారు. ఆయన రాసిన యాత్రా రచన “హైదరాబాద్ పర్యటన,” భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో రచించిన “మాతృశతకం” చాలా ప్రసిద్ధిగాంచాయి.

ఇంకా ఆయన చేసిన ప్రముఖ రచనలు “నలజారమ్మ” అనే కావ్యం, “రసిక జనానందం,” “కృష్ణరాయబారం,” అనే ప్రబంధాలు, “పానశాల,” “గులాబీతోట,” “పండ్లతోట” అనే అనువాదాలు, “మాధవ విజయం,” “కుంభరాణా,” “కర్షక విలాసం” అనే నాటకాలు. ఆయన తెలుగు సినీవినీలాకాశంలో సంభాషణ రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేశారు.

స్వయంకృషితో అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన దువ్వూరి రామిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో రచించిన ‘మాతృశతకం’లోని ప్రతి పద్యం అగ్నిశిఖను తలపించింది. బ్రిటీష్ వారు ఆ పుస్తక ముద్రణను అడ్డుకునేంతగా ప్రజలను ప్రభావితం చేసింది.

1936లో సతీతులసి చిత్రానికి రచయితగా సినిమారంగ ప్రవేశం చేశారు. చిత్రనళీయం సినిమాకు రచనతోపాటు దర్శకత్వం కూడా చేపట్టి సినీదర్శకుడైన మొదటి తెలుగుకవి అనే ఘనతను సాధించారు. తరువాత తిరుపతి వేంకటేశ్వర మాహాత్మ్యం, పార్వతీ పరిణయము చిత్రాలకు కొన్ని పాటలను, పద్యాలను వ్రాశారు. చివరగా సీతారామ జననం సినిమాకు మాటలను సమకూర్చారు.” (నిజం టుడే, బి. సురేంద్రనాథ్ రెడ్డి, 76వ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యదర్శి, “కవికోకిల” దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి, నెల్లూరు - https://nijamtoday.com/2023/09/11/extrordinary-writer-duvvuri-ramireddy/)

కృషీవలుడు – ఔన్నత్యం:

"ఆంధ్రవాఙ్మయమున ప్రకృతము ప్రసిద్ధికి వచ్చుచుండెడు గణ్యములగు నూతనసృష్టులలో నీ కావ్య మొకటి. విషయమందును భావములందును ఇయ్యది మనదేశముయొక్క నవజీవితమునకుం జేరినది. అచ్చటచ్చట శైలియందును దూరోపమలు మొదలగు నలంకారముల యందును ప్రాచీనవాసన యింకను కొంత వదల వలసియున్నటుల తోచెడిని. కవి కాపుయువకుడు; విషయము కాపులజీవితము; దృష్టి యభిమాన ప్రేరితము. కృషీవలుల జీవితమును ప్రథానాంశముగ గ్రహించిన తెలుగు గ్రంథములలో నిదియె మొదటిది." అని ఈ కావ్యానికి మున్నిడి రాసిన కట్టమంచి అభిప్రాయపడ్డారు.

కర్షకుణ్ణి కావ్యనాయకునిగా గ్రహించి నిర్మించిన కావ్యం కృషీవలుడు. ఒక సామాన్య రైతు నిత్యజీవితాన్ని సంపూర్ణంగా, హృదయంగమంగా చిత్రించిన కావ్యమిది. పల్లె వాతావరణాన్ని, గ్రామీణ జీవనవిధానాన్ని మహోన్నతంగా వర్ణించి రైతు బిడ్డగా దువ్వూరి రామిరెడ్డి తన ఆత్మీయతను ప్రదర్శించుకున్నాడు. కర్షక వృత్తి పరమపూజ్యమైనదని, పవిత్రమైనదని ప్రబోధించిన కావ్యం కృషీవలుడు.  సుందర పదజాలంతో, సుకుమార భావ విలాసంతో ఈ కావ్యం పాఠకుల మనోమందిరంలో శాశ్వతమైన చోటు సంపాదించుకున్నది.

మనము, మన చుట్టూ ఉన్న పరిసరాలు అనగా ప్రజలు, పక్షులు, జంతువులు, పాడిపంటలు, క్రిమికీటకాలు, సరీసృపాలు, భూమి, నీరు, నిప్పు, నింగి, గాలి, దిక్కులు,   వేళలు(కాలం)   వీటన్నింటిని కలిపి పర్యావరణం అంటారు. ఇవి దేవుడు మనకిచ్చిన వరాలు. వీటిని కలుషితం చేయకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది.   ఈ కావ్యంలో ముఖ్యంగా పర్యావరణానికి ఆటపట్టైన గ్రామంలో వ్యవసాయకోదయమును గూర్చి కవిగారు గొప్పగా వర్ణించారు.

2. అదునులో పదును:

ప్రపంచానికి అన్నము పెట్టే ప్రతి ఒక్క రైతు వేకువనే నిద్రనుండి మేల్కొని వ్యవసాయపనుల్లో లీనమవ్వాలి.  ఒకవేళ ఎవరైనా నిద్రనుండి మేల్కొనకపోతె వారికి సమయముయొక్క ప్రాధాన్యతను తెలుపుతూ, గతించిపోయిన ఒక్క నిమిషం కూడా వెనక్కి తీసుకురాలేమనే విషయాన్ని ప్రజలకు తెలుపుతున్నారు మన కవిగారు. అనంతమైన కాలంలో మనజీవితకాలం రెప్పపాటుల వరస వంటిది. కాబట్టి దానిని గ్రహించి ఓ రైతులారా మీరంతా మిద్ర అనే మబ్బును విడిచి మీ పనులయందు నిమగ్నమవ్వండని ఒక కోడి ఇంటి పై కప్పుపైకెక్కి అందరిని మేలుకొలుపుతుందిని కవిగారు వర్ణించారు.

వ్యవసాయానికి తగిన సమయంలో తగువిధంగా స్పందించాలి. అలా స్పందించకపోతే దాని పర్యవసానం ప్రజలపైన పడుతుందని తెలిసిన దువ్వూరి రామిరెడ్డి గారు మనకు మేల్కొలుపుతున్నారు.

సమయమమూల్య, మొక్క నిమిషంబువృథాచన గ్రమ్మరింపనే

రము మనయాయువా త్రుటిపరంపరయౌట నెరింగి నిద్రమా

ద్యమునుదొలంగి మీ పనులనారయుడో జనులారయంచు డం

బముగ మెడన్నిగిడ్చి కృకవాకువు గూసెడి నింటికొప్పునన్.

ఒక్క వ్యవసాయస్థులే వేకువనే లేవాలి అనుకుంటే పొరపాటే.  ప్రతిపని సఫలీకృతం కావాలెంటే వేకువనే లేచి ఆ పనియందు నిమగ్నమవ్వాలి.  వేకువనే ఆమ్లజని నిల్వలు భూమికి దగ్గరగా చేరి  చక్కనైన వాతావరణం మనకు లభిస్తుంది. కాలుష్యరహితవాతావరణం మనం పొందవచ్చు.  ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది.  అందువలన ఏ పనిని తలపెట్టినా అది సఫలీకృతం చేసుకోవడానికి రోజులో తగినంత సమయం మన చేతిలో ఉంటుంది.

3. ఉదయపు శోభ :

పల్లెటూరిలోని ఉదయముననే సూర్యుడు తన లేతకిరణాలతో చెట్లకొమ్మల సందుల్లోంచి దూరుతూ ఇంటి గోపురాలవైపు ప్రాకుతూ ఉన్నవేళ  అనగా బాగా పొద్దుపొడిచి చీకట్లు తొలగిన వేళ  ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆ ఉషోదయపు వాతావరణాన్ని అందరు ఆశ్వాదించవలసిందే. ఆ సమయంలో తూర్పుదిక్కంతా కాషాయపు రంగులో ఉండి అందరికి కనువిందు చెస్తుంది. ఆ కిరణాలు తాకిన ప్రతి వస్తువు కాషాయపు రంగులో కనిపిస్తుంది.  ఈ విషయాన్ని కవిగారు చక్కగా ఈ క్రింది పద్యంలో వర్ణించారు.

         అరుణమయూకముల్ తరులతాంతరమార్గము దూరి గేహగో

        పురముల బ్రాకు ప్రొద్దువొడుపుం దరుణంబున నీటికోసమై

        సరసులకేగు కాపునెరజాణల నూపుర మంజలార్భటుల్

        నెరసె ప్రభాతమన్ శిశువు నేర్చెడి ముద్దుమాటలో యనన్.

ఉదయభాస్కరుని లేలేత కిరణాల సోయగం అంచలంచలుగా మొదటగా గృహగోపురంపైన, తరువాత ఇంటిచూరులపైన, ఆ తరువాత శయ్యపైన ప్రసరించి శయ్యను బంగారుమయం చేస్తుంది.  ఈ పద్యమును చదవగానే సూర్యోదయ వాతావరణం కల్లకు కట్టినట్లుగా తెలుస్తుంది.

అంతేకాకుండా ఉదయాన్నే మంచు పడిన పచ్చికలు ఎంతో సువాసన భరితంగా ఉంటాయి.  ఆ సువాసనతో కూడిన పచ్చిక అంటే పశువులు చాలా ఇష్టంగా తింటాయి. మనతోపాటు పశువులు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం పర్యావరణంలో ఒక భాగమే.

ఇరువుల చూరులందు చరియించి తమోహరణైక దక్ష భా

స్కర కిరణాళి నీ మృదుల శెయ్య సువర్ణమయంబు చేసె ని

నిద్దురనికనైన మాని వెలిదోలుము బీళ్లకు నాలమంద, ని

త్తర తమిదీరమేయు పులపుదంటులు కమ్మని మంచు పచ్చికల్.

ఓయీ హాలికా నీ నిద్రమత్తు వలన మనకు ఎంతో సహకరిస్తున్న పశువులకు ఇష్టమైన పచ్చికలు తినడానికి ఆటంకం కలుగుతుంది, కావున నీవు నిద్ర విడిచి పశువులను పచ్చికబైళ్లవైపునకు తోలుకెల్లు అని కవిగారు ఈ పద్యంలో పర్యావరణం ప్రతి జీవికి అవసరమేనని తెలియపరిచారు.

4. దువ్వూరి- పర్యావరణరచనాశిల్పం:

దువ్వూరి రామిరెడ్డిగారి పర్యావరణ రచనాశిల్పానికి నిదర్శనం ఈ క్రింది సీసపద్యం ద్వారా తెలియుచున్నది.

 అప్పుడప్పుడే విచ్చి యరుల చేమంతుల కమ్మని నెత్తావి గడలుకొనగ,

రత్న కంబళమట్లు రాణించు బీళుల పలువన్నె పూవులు బలిసి విరియ,

వ్రాలబండిన రాజనాల కేదారంబు పంటలక్ష్మికి నాటపట్టు గాగ,

ప్రొద్దు నిగ్గులు సోకి పొగమంచు మబ్బులు బంగారు వలిపంబు పగిది వ్రేల,

ఈ నిమేషమందు నిల యెల్ల నందమై స్వర్గశిల్పి యింద్రజాలశక్తి

వ్రాసినట్టి చిత్రపటమన విలసిల్లె తొంగిచూడుమిపుడు తూర్పుదిక్కు.

అప్పుడే విచ్చుకున్న చేమంతి పువ్వుల సువాసనలు వ్యాపించగా, పరిచిన రత్నకంబళంలా మెరుస్తున్న పచ్చిక బైళ్లలో అనేక రంగుల పూలు పూయగా వరికంకుల బరువుతో క్రిందకి వేలాడుతున్న వరిమళ్లు ఆటస్థలము కాగా, పొగమంచువల్ల ఏర్పడిన మబ్బులు సూర్యకిరణ ప్రభావంతో పీతాంబరం వలె వేలాడుతున్నట్టి క్షణాన భూమి అంతా స్వర్గసిల్పి తన ఇంద్రజాల మహిమతో చీత్రపటమేమో అన్నట్లు విలసిల్లుతుంది. ఓయీ హాలికా ఈ అందమైన తొలిపొద్దును చూడడానికైనా నీవు నిద్రను నాని లేవాలి. ఇంత చక్కని పర్యావరణాన్ని చూసి ఆనందించాలి అని రైతుకు జాగృతం చేస్తున్నారు.

పై పద్యాన్ని చదివిన వెంటనే పాఠకుల మనోమందిరాలలో పర్యావరణం చిత్రం కళ్లకు కట్టినట్లుగా దువ్వురి రామిరెడ్డి గారు ఆవిష్కరించారు. ప్రకృతి సోయగాలను సాహితీరూపంలో మనముందు ఉంచి, స్వర్గశిల్పిని మరిపించిన అపరస్వర్గశిల్పి, పర్యావరణ ప్రవక్త మన దువ్వురి రామిరెడ్డి.

5. ముగింపు:

దువ్వూరి వారు ఈ రచన ద్వారా సమయం విలువను తెలుపుతూ, సమయాన్ని వృధా చెయ్యకూడదని, పనుల విషయంలో ఎప్పుడు చెయ్యవలసిన పనులు అప్పుడే చెయ్యాలని, ఏమాత్రం జాప్యం చెయ్యకూడదని కోడి ద్వారా ప్రజలకు తెలియజేసారు. పర్యావరణానికి పట్టుకొమ్మలైన పల్లెటూళ్లలో గల పచ్చికబైల్లను, పంటచేలను, ఉషాకిరణాల శోభను, ఇలాంటి రమణీయమైన సొభగును చూడవోయి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో పర్యావరణనుగురించి తెలియజేసే ప్రవక్త అయ్యారు దువ్వూరి వారు.

దేవుడు మనకు ప్రసాదించిన పర్యావరణాన్ని ప్రజలు తమ స్వలాభాలకోసం నాశనం చేస్తున్నారు. ఫ్యాక్టరీల ద్వారా, వాహనాల ద్వారా, శబ్దాలద్వారా - భూమిని, నీటిని, సూర్యరశ్మిని, గాలిని, ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తన అంచనాల ప్రకారం 2070 నాటికి నీటి కొరత చాలా ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు.

ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు కాలుష్యం గురించి ఎన్నో రకాలుగా వివరించారు. ఈ కాలుష్యం బారి నుంచి బయటపడాలంటే ప్రతివ్యక్తి పర్యావరణ యెక్క గొప్పతనం గూర్చి తెలుసుకొనేటట్లు చెయ్యాలి.

పర్యావరణం గురించి చిన్నప్పటినుంచి (పాఠశాల విద్య నుడి డిగ్రీ విద్యవరకు) అవగాహన కలిగేలా పాఠ్యాంశాల్ని నామమాత్రంగా కాకుండా ఆచరణయోగ్యంగా అమలుచెయ్యాలి.

6. ఉపయుక్త గ్రంథసూచి :

  1. --. పర్యావరణ అధ్యయనం. తెలుగు అకాడమి, హైదరాబాదు.
  2. --. పర్యావరణ విద్య- సమస్యలు- ప్రభావాలు. తెలుగు అకాడమి, హైదరాబాదు,
  3. --. పర్యావరణ విద్య. తెలంగాణా ప్రభుత్వ ప్రచురణ, హైదరాబాదు,
  4. నాగేశ్వరరావు, కదం. ఆర్థికాభివృద్ధి - పర్యావరణం. తెలుగు అకాడమి, హైదరాబాదు,
  5. రామిరెడ్డి, దువ్వూరి. కృషీవలుడు (ద్వితీయ సంస్కరణ). సరస్వతీ భాండారము, --, 1924.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]