headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797

11. సైద్ధాంతిక విమర్శ: మౌలికాంశాలు

Cinque Terre
డా. వెంకట రామయ్య గంపా

తెలుగు సహాచార్యులు
ఆధునిక భారతీయభాషలు మరియు సాహిత్యాధ్యయనశాఖ,
ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ - 110007
సెల్: +91 9958607789. Email: gvramaiah@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం: భారతీయభాషాసాహిత్యాల్లో సిద్ధాంతం, విమర్శలకు ఒక ప్రత్యేకస్థానం ఉంది. ప్రాచ్య, పాశ్చాత్య విమర్శపద్ధతులను ఆలంబనంగా చేసుకుని విమర్శన రంగం కొత్తపుంతలు తొక్కింది. సృజనాత్మక ప్రక్రియలతో సమానంగా విమర్శలస్థాయి, స్థానంకూడా ద్విగుణీకృతమౌతూ వచ్చింది. సిద్ధాంత, విమర్శ, విమర్శకుల దృక్పథాలను సునిశితంగా, సప్రమాణంగా అధ్యయనం చేయడం, సిద్ధాంత అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనాలను చర్చించడం, దానివల్ల కలిగే ప్రతికూల లక్షణాలను పేర్కొనడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

Keywords: సిద్ధాంతం, విమర్శ, తెలుగు పరిశోధన, సిద్ధాంత అధ్యయనం, అకడమిక్ విమర్శ

ఉపోద్ఘాతం:

తెలుగు సాహిత్యంలో సృజనాత్మక రచనల సంఖ్య వాసిలో ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. కానీ అందులో కాలానికి నిలబడే రచనలు ఎన్ని అనేది సందేహం! అందుకు కారణం రచనలు చేస్తున్నవారు కావలసిన అధ్యయనం చేయటం లేదనేది విమర్శకుల భావన. విమర్శకులు రచనలను సరైన పద్ధతిలో చర్చించడం లేదు, కావున రచయితలకు వారి రచనల్లోని తప్పును తెలుసుకునే అవకాశం లభించడం లేదని రచయితల అభిప్రాయం. ఈ రెండు వాదనలు ఏది సరైనవే. అయితే విమర్శ పరంగా చూసినప్పుడు తెలుగులో రావాల్సినంత స్థాయిలో విమర్శనాత్మక రచనలు రావటం లేదనేది సాహితీ అభిమానుల ఏకాభిప్రాయం. ఈ విషయం కేవలం తెలుగు సంబంధించిన విషయమే కాకుండా తక్కిన (భారతీయ) భాషలకు వర్తిస్తుంది.

ప్రధానవిషయం:

ఇటీవల కాలంలో ఒక ప్రముఖ విమర్శకుడితో తెలుగులో నేటి సాహిత్య విమర్శ గురించి ప్రస్తావిస్తే వారి అభిప్రాయం చాలా ఆసక్తిగా అనిపించింది. వారి అభిప్రాయం ప్రకారం ‘తెలుగులో ఉన్న విమర్శకులకు అకడమిక్ విమర్శనా పద్ధతులు అంతగా నచ్చవు. అలాగే అకడమిక్ లో ఉండి విమర్శ చేసే వారికి సాధారణ పద్ధతిలో ఉండే విమర్శనా పద్ధతులు రుచించవు’ అని పేర్కొన్నారు. విమర్శకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉండటం ఆసక్తికరమైన విషయం.

తెలుగులో వస్తున్న విమర్శనా గ్రంధాలు తక్కువ. అందులోనూ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని వచ్చే గ్రంథాలు మరీ తక్కువ. విమర్శక రచనలలో సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితి నేడు అకడమిక్స్ లోనూ కనిపిస్తూ ఉంది. ‘అకడమిక్స్ లోనూ ఇటీవల కాలంలో సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని పరిశోధన చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. కేవలం విషయ వివరణ లేదా విశ్లేషణ మాత్రమే కనిపిస్తుంది’ అని ప్రముఖ విశ్వవిద్యాలయంలో పని చేసి పదవీ విరమణ పొందిన ఆచార్యుల వారు పేర్కొన్నారు.

గతంలో ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య విమర్శకులు సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని రచనలు చేశారు. కానీ నేడు సాహిత్య విమర్శ అంటే ఒక రచనను సమీక్ష చేయడం లేదా విశ్లేషణ పేరుతోటి కొన్ని అభిప్రాయాలు చెప్పడంగా మారిపోయింది. సాహిత్య విమర్శలో సిద్ధాంత ఆవశ్యకతను విమర్శకులు వదిలిపెట్టినట్టు కనిపిస్తుంది. చాలా కొద్దిమంది విమర్శకులు మాత్రమే తమ విమర్శలో సిద్ధాంతాన్ని అన్వయం చేస్తున్నారు. భారతీయ సాహిత్యంలో ముఖ్యమైన విమర్శక అంశాలన్నీ సిద్ధాంతం పేరుతోనే కనిపిస్తాయి. ఉదాహరణకు ధ్వని సిద్ధాంతం, రస సిద్ధాంతం, వక్రోక్తి సిద్ధాంతం మొదలైనవి. పాశ్చాత్య దేశాలలో విమర్శలో సిద్ధాంత అన్వయం అత్యంత ముఖ్యమైన అంశంగా భావిస్తారు.

భారతీయ మరియు పాశ్చాత్య దేశాలలో సిద్ధాంతంతో పాటు సిద్ధాంత కర్తలకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదాహరణకు సమకాలీన పాశ్చాత్య సాహిత్యంలో అత్యంత ప్రముఖమైన విమర్శకుడు ఎవరు అనే విషయంపై చర్చ జరిగినప్పుడు కొంతమంది ప్రముఖ విమర్శకుల సమాచారం కింది విధంగా ఉంది.

నేటి సాహిత్య విమర్శలో పేర్కొనదగిన విమర్శకుడు ఎవరు? పరిశోధకులు, విమర్శకులు, పండితులు తమ స్థాయిని కొలిచే మార్గాలలో ఒకటి, వారి రచనలను వారి సహచరులు ఎంత తరచుగా ఉటంకించారో తెలుసుకోవడం.. అధిక సంఖ్య గల కళలు, మానవీయ ఉల్లేఖన సూచి లెక్కలో ఖచ్చితంగా గణాంకాలు నమోదు చేయబడతాయి. ఇది ఒక ఆకర్షణీయమైన సమాచార నిధి. ఉదాహరణకు, 1980ల ప్రారంభంలో ఫ్రెంచ్ సిద్ధాంతకర్తల రచనల ఉల్లేఖనాలను ఖచ్చితంగా నమోదు చేయబడింది మిచెల్ ఫౌకాల్ట్ , రోలాండ్ బార్తేస్ ల రచనలు కళలు మరియు మానవీయ శాస్త్ర రంగాలలో అగ్రగామిగా ఉల్లేఖించబడ్డారు. వారి సిద్ధాంతాల ఉల్లేఖనాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 

తాజా గణాంకాల వివరాలు కింద పేర్కొనబడ్డాయి: AHCI: టెర్రీ ఈగల్టన్: 415, ఫ్రాంక్ కెర్మోడ్: 208, ఎలైన్ షోల్టర్: 154, జాక్వెస్ డెరిడా: 164, మిచెల్ ఫౌకాల్ట్: 72, రోలాండ్ బార్తేస్: 64, జెర్మైన్ గ్రీర్: 24”. (సదర్లాండ్, జాన్. హౌ లిటరేచర్ వర్క్స్ 50 కీ కాన్సెప్ట్స్, పుట.82.)

పైన పేర్కొన్న వారందరూ పాశ్చాత్య సాహిత్యంలో ప్రముఖ సిద్ధాంత కర్తలు, విమర్శకులు. వారి గురించి AHCI (The Arts and Humanities Citation Index) లో లభించిన సమాచారం. ఇదే పద్ధతిని తెలుగు సాహిత్య విమర్శకులకు అన్వయం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మనం ఊహించవచ్చు. ఇలాంటి అంశాలను పరిశీలించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శలో సిద్ధాంతానికి క్రమంగా ప్రాముఖ్యత తగ్గిపోతూ ఉంది.

సిద్ధాంతం:

సిద్ధాంతం అంటే ఏమిటి? అనే దానికి నిఘంటువుల్లోనూ, పుస్తకాలలో చాలా నిర్వచనాలు ఉన్నాయి. వ్యాస పరిమితి దృష్ట్యా కింద ఒక నిర్వచనాన్ని ఉటంకించడం జరిగింది.

ఒక సిద్ధాంతం ప్రపంచాన్ని చూడటానికి లేదా ఊహించడానికి మార్గాలను ప్రతిపాదిస్తుంది, అది మన జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది. భౌతిక శాస్త్రాలలో, ఒక సిద్ధాంతం అనేది ప్రపంచం యొక్క ప్రతిపాదిత వివరణ, దీనిని పరిశోధన మరియు అన్వేషణ ద్వారా ధృవీకరించాలి. సాహిత్యం, సంస్కృతి గురించిన సిద్ధాంతాలు అంతకు భిన్నమైనమైనవి ఏమీ కావు.” (ర్యాన్, మైఖేల్. (ఎడి.) ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ లిటరరీ అండ్ కల్చరల్ థియరీ, పుట.13.)

సైన్స్ లో ఉపయోగించే సిద్ధాంతానికి, సాహిత్యంలో ఉపయోగించే సిద్ధాంతానికి కొంత భేదం ఉంది. సాహిత్య అధ్యయనంలో సిద్ధాంతం సాహిత్య స్వభావాన్ని వివరించే వివరణ కాదు, ఇది ఒక సమూహ రచనా పద్ధతి లేదా ఆలోచనా విధానం. దీని పరిమితులను నిర్వచించడం చాలా కష్టం. ఆధునిక కాలంలో సాహిత్య సిద్ధాంతంతో పాటు సాహిత్యేతర విభాగాలలోని సిద్ధాంతాలను ఉపయోగించి సాహిత్యాన్ని విశ్లేషించడం మరొక పద్ధతి. ఈ విధానం వలన ఫలితాలలో చాలా మార్పు కనిపిస్తుంది. మానవశాస్త్రం (ఆంత్రోపాలజీ), చరిత్ర, జెండర్ స్టడీస్, భాషాశాస్త్రం, తత్వశాస్త్రం, రాజనీతి సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతం మొదలయిన విభాగాలలోని సిద్ధాంతాలను ఉపయోగించి సాహిత్య విమర్శ చేస్తున్నారు.

సిద్ధాంత అన్వయంలో ఫలితాలు ఒకే రకంగా ఉండవు. ఆ ఫలితాలు విమర్శకుడి ఇంగిత జ్ఞానం (కామన్ సెన్స్)పై ఆధారపడి ఉంటుంది. సిద్ధాంతం యొక్క ప్రధాన బలం ‘కామన్ సెన్స్’. శబ్దం యొక్క అర్థం, రచన అనేవి సాహిత్యానుభవం మరియు కామన్ సెన్స్ కు సంబంధించిన అంశాలు. సిద్ధాంత అన్వయంలో ఇంగిత జ్ఞానం(కామన్ సెన్స్) చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ‘కామన్ సెన్స్’ అనేది తేలిగ్గా తీసుకునేది కాదు. వాస్తవానికి అది ఒక చారిత్రక నిర్మాణ సత్యం. ఉదాహరణకు ఒక రచనకు సంబంధించిన శబ్దానికి ఉన్న అర్థం నిఘంటువులోని అర్థంతో పాటు వక్త మనస్సులో ఏర్పరుచుకున్న భావన కూడా. అదే విధంగా రచన ఒక అనుభవంలో లేదా అది వ్యక్తీకరించే పరిస్థితిలో సత్యం ఎక్కడో ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సత్యం ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉందా? లేదా? అని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇలా సత్యాన్ని నిర్దిష్ట పద్ధతిలో తెలుసుకునే దారిని చూపేదే సిద్ధాంతం.

సిద్ధాంత అధ్యయనం వలన కలిగే ప్రయోజనాలు:

1. విమర్శకుడు రచనకు సంబంధించిన అన్నీ అంశాలు తనకు తెలుసని అనుకుంటాడు. సిద్ధాంతం తత్వశాస్త్రం, భాషాశాస్త్రం, చరిత్ర, రాజకీయ సిద్ధాంతం, మానసిక విశ్లేషణ నుండి ఆలోచనలను మిళితం చేస్తుంది కాబట్టి, విమర్శకులు వారు చదువుతున్న గ్రంథాలు సాహిత్యేతర రచనలతో అన్వయం చేసి చర్చించవచ్చు. ఇలా అన్వయం చేయడం వలన కొన్ని రచనలు సంపన్నమైనవిగా, శక్తివంతమైనవిగా, ఆదర్శవంతమైనవిగా నిరూపించవచ్చు
2. నూతన సిద్ధాంతాన్ని నేర్చుకోవడం/ అర్థం చేసుకోవడం విలువైన రచనను పాఠకుడు కొత్త మార్గాల్లో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

3. సిద్ధాంత అధ్యయనం చేయడం వలన ఒక సాధారణ పాఠకుడు విమర్శకుడిగాను, ఒక విమర్శకుడు సద్విమర్శకుడిగాను రూపొందగలడు.

4. సొంత ఉద్దేశాలు, భయాలు, కోరికలు, మానవ ఉత్పాదనలైన సినిమా, సంగీతం, కళ, సైన్స్, టెక్నాలజీ, మానవానుభవం మొదలైన వాటిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి సిద్ధాంతం ఉపయోగపడుతుంది. ఈ అంశాలను రచనలకు అన్వయం చేసినప్పుడు రచయిత ఉద్దేశం, రచనా ప్రయోజనాన్ని హేతుబద్ధంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఒక జాతికి చెందిన రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు రచనలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి సిద్ధాంతం ఒక ఉపకరణంగా ఉపయోగపడుతుంది. ఈ ఉపకరణం ద్వారా ఏది ఉత్తమ రచనో, ఏది సాధారణ రచనో తెలుసుకోవచ్చు.

5. విమర్శకులు ప్రతి సిద్ధాంతాన్ని ఒక కొత్త జత కళ్లజోడుగా భావించమనీ, దీనివలన కళ్ళజోడు మసకబారిన ప్రతిసారీ కొత్త జత కళ్లజోడుతో ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రపంచంలోని కొన్ని అంశాలు కొత్తగా కనిపిస్తాయని చెబుతారు. సిద్ధాంత ఫలితం కొత్తగా చూడటం, నేర్చుకోవడంపై ఆధారపడి ఉంటుందని విమర్శకులు చెబుతారు. అనేక సిద్ధాంతాలను అధ్యయనం చేయడం వలన బహుళ దృక్పథాలు ముఖ్యమని మనకు మనం అర్థం చేసుకుంటాం. ప్రతి సిద్ధాంతం తనను అర్థం చేసుకోవడానికి ఖచ్చితమైన సాధనాన్ని తప్పకుండా అందిస్తుంది. ఫలితంగా భిన్న అనుభవాలు ఆలోచనలు వెలుగులోకి వస్తాయి. రచనల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఉత్తమ రచనలు వెలుగులోకి వస్తాయి. ఉత్తమ విమర్శకులు తయారవుతారు.

6. ఏ విమర్శనాత్మక సిద్ధాంతంలోనైనా విభేదాలు ఉంటాయి. ఒకే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న విమర్శకులు ఆ సిద్ధాంతం ఆధారంగా ఒకే రచనను భిన్న పద్ధతులలో పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి. ఒకరినొకరు విమర్శించుకున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకే సిద్ధాంతంలో విమర్శ ప్రతి విమర్శ వాడివేడిగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒకే రకమైన భావజాలం, సిద్ధాంతం ఉన్నవారు భిన్నమైన అభిప్రాయాల ద్వారా సాహిత్య ప్రత్యర్థులుగా మారారు. ఈ రకమైన చర్చ సాహిత్యానికి ఒక కొత్త దారిని చూపించింది.

7. ఒక కొత్త సిద్ధాంతం వెలుగులోకి రావడం ద్వారా నూతన పారిభాషిక పదాలు వెలుగులోకి వస్తాయి. పారిభాషిక పదాల ఆధారంగా సిద్ధాంతం మాట్లాడుతుంది. ఫలితంగా భాషలో కొత్త పదాల రూపకల్పన అవసరమవుతుంది. సిద్ధాంతం ఏ కీలక భావనలు, పదబంధాలపై ఆధారపడి ఉంటుందో వాటి ఆధారంగా చర్చలను అర్థం చేసుకోవడానికి విమర్శకుడు ప్రయత్నం చేస్తాడు. సిద్ధాంతం విమర్శకుడిని ‘సైద్ధాంతికంగా ఆలోచించడానికి’ అలవాటు చేస్తుంది,

8. విమర్శకుడు సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం పెరిగేకొద్దీ, మరింత ఆలోచనా శక్తి పెరుగుతుంది. స్థూలంగా, సూక్ష్మంగా మానవ అనుభవం గురించి ఆలోచన చేయగలడు. కొత్త సిద్ధాంతాలను అధ్యయనం వలన పాత రచన కొత్తగా కనిపిస్తుంది. విమర్శకుడు ఒకే రచనను భిన్న దృక్పథాలతో చూడగల సామర్థ్యం పెరుగుతుంది. అందువల్ల రచనను ఎక్కువగా ఆస్వాదించగల నైపుణ్యం ఏర్పడుతుంది.

9. పాఠకులు రచనకు ఉన్న పరిమితులను, ఆ రచనను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధాంతం ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాలలో కొన్ని రకాల విమర్శలు అన్ని రచనలకు అన్వయం కావు. అటువంటి సందర్భంలో పాఠకులు ఏ సిద్ధాంత దృక్పథంతో చూస్తే ఆ రచన ఉత్తమ రచన అవుతుందో సిద్ధాంతం తెలియజేస్తుంది. దృక్పథానికి ఉన్న బలాలు, పరిమితులను సిద్ధాంతాలను అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

10. సాహిత్య విమర్శ సాహిత్య రచనను వివరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో సాహిత్యవిమర్శ రచన లోతుల్లోకి వెళ్లకుండానే వ్యాఖ్యానం లేదా సమీక్ష వరకే ఆగిపోయే అవకాశం ఉంది. ఆ లోటును సిద్ధాంతం భర్తీ చేస్తుంది. సిద్ధాంతం ద్వారా రచనలోని నిగూఢ అర్థం, రచన రూపకల్పన, సౌందర్యం, లోపాలను విమర్శకులు తెలుసుకుంటారు.

11. కొన్ని సందర్భాలలో విమర్శ కేవలం రచనలో పైపైన కనిపించే మెరుగులను వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఒక సాహిత్య రచనను అర్థం చేసుకున్నప్పుడు విమర్శకుడు ‘సాహిత్య విమర్శ చేస్తున్నాను’ అని అనుకుంటాడు. అందుకు ప్రమాణాలను తెలియచేయడు. సిద్ధాంత నేపథ్యంగా చేసే సాహిత్య విమర్శ సైద్ధాంతిక విమర్శ. సిద్ధాంత ఆధారంగా చేసే విమర్శలో విమర్శకుడు చెప్పే ప్రతి అంశానికి హేతుబద్ధమైన అన్వయించడం/నిరూపణ కనిపిస్తుంది. సాహిత్యానికి సాధారణ విమర్శ కంటే సైద్ధాంతిక విమర్శ అన్ని విధాలుగా మేలు చేస్తుంది.

సిద్ధాంత అధ్యయనంలో కనిపించే నెగెటివ్ లక్షణాలు:

1. సిద్ధాంతం విశ్లేషణాత్మకమైనది, ఊహాజనితమైనది. రచనలో ఏమి ఇమిడి ఉందో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే సిద్ధాంత అన్వయం . కొన్ని సిద్ధాంతాలు ఇంటర్ డిసిప్లినరీకీ (బహుళ మిశ్రిత) చెందినవి. సిద్ధాంతం ద్వారా రచనా వస్తువును అర్థం చేసుకోవడంతో పాటు ఇతర సాహిత్యేతర అంశాలను విచారించాలి. సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే విమర్శకుడు పైన పేర్కొన అంశాలన్నీ అర్థం చేసుకోవాలి. లేనిపక్షంలో సిద్ధాంతం పాఠకుడిని గందరగోళానికి గురిచేస్తుంది.

2. సిద్ధాంతంలో ఎల్లప్పుడూ నూతన అంశాలు చేరుతూ ఉంటాయి. తెలుసుకోవాల్సిన అంశాలు ఎక్కువ. ఆ కారణం వలన విమర్శకుడు సిద్ధాంతంపై పూర్తిస్థాయిలో ప్రావీణ్యం సంపాదించడం కష్టంతో కూడిన అంశం. సిద్ధాంతాన్ని తెలుసుకోవడమూ, అన్వయం చేయడమూ సాధనగా సాగాలి. సిద్ధాంతం విమర్శకుడి ప్రావీణ్యతను కోరుకుంటుంది. 

సిద్ధాంత అధ్యయన విముఖతకు కారణాలు: 

1. సహజంగా సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడానికి విస్తృతమైన సమయం కేటాయించాలి. సాహిత్యంలో కొత్తకొత్త సిద్ధాంతాలు వెలువడుతూనే ఉంటాయి. వాటన్నిటిని అర్థం చేసుకోవడం కోసం అనునిత్యం పుస్తకాలను అధ్యయనం చేస్తూ ఉండాలి. ఒకే సిద్ధాంతంపైన భిన్న అభిప్రాయాలు వెలువడుతూ ఉంటాయి. వాటిని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇందుకోసం చాలా శ్రమ పడాల్సి వుంటుంది.

2. సిద్ధాంతాన్ని అధ్యయనం చేసినప్పటికీ, దానిని సాహిత్య రచనకు అన్వయం చేయడం క్లిష్టమైన విషయం. విమర్శకుడికి తాను అన్వయం చేసినటువంటి సిద్ధాంతంలో తప్పు దొర్లుతుందేమోననే భయం మరో కారణం.

3. సిద్ధాంతకర్తలు ప్రముఖమైన వ్యక్తులుగా ఉండడం, వారు అప్పటికే ఆయా రంగాల్లో పేరుపొందినవారు కావడం. సిద్ధాంతాన్ని రచనకు అన్వయం చేసే సందర్భంలో సాధారణ విమర్శకుడు ప్రముఖ విమర్శకుల తోటి పోటీ పడలేకపోవడం ఒక కారణం .

4. సాధారణ విమర్శకులకు కొన్ని సిద్ధాంతాలు అంత సులభంగా అర్థం కావు. సిద్ధాంతకర్తలు సిద్ధాంతాన్ని రూపొందించే సమయంలో క్లిష్టమైన విషయాలను జోడించి, అర్థం కాని పదబంధాలను సృష్టించడం చేస్తూ ఉంటారు. వాటిని సామాన్య పాఠకులు అర్థం చేసుకోవడానికి, అన్వయం చేయడానికి చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో విమర్శకుడికి సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం కంటే కేవలం రచనను విశ్లేషించడమే సౌకర్యంగా కనిపిస్తుంది.

5. సిద్ధాంత అధ్యయనం అనేటువంటిది సాహిత్యం మీద ప్రేమను పెంచే విధంగా, మనం నివసిస్తున్న దైనందిన ప్రపంచంలోని విషయాలను ప్రత్యేకంగా చూసేలా ఆసక్తి పెంపొందించాలి. ఆ సిద్ధాంత ఉద్దేశం మనల్ని ఏదో ఒక నూతన మేధో ప్రపంచంలోకి తీసుకెళ్ళేలా ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని సిద్ధాంతాలు విమర్శకుడికి సాహిత్యంపై అటువంటి నూతన అనుభవాన్ని కలిగించడం లేదు.

6. రచయిత ఎంతో కష్టపడి సృజనాత్మక రచన చేస్తాడు. విమర్శకుడు అంతే శ్రమతో సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తాడు. రచయిత రచన చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలను దృష్టిలో ఉంచుకొని రచన చేస్తాడు. విమర్శకుడు తన సిద్ధాంత అధ్యయనం ద్వారా రచనలను పరిశీలించినప్పుడు రచయిత చెప్పినదానికంటే భిన్నమైన ఫలితాలను విమర్శకుడు తెలియజేసినప్పుడు రచయితతో ఉన్న సన్నిహిత, ఉత్తేజకరమైన సంబంధాన్ని కోల్పోతామనే భయం ఏర్పడుతుంది. సమకాలీన రచయితల రచనలను విమర్శకుడు పరిశీలించినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. తెలియకుండానే విమర్శకుడు రచయితకు శత్రువు అవుతాడనే భావన కలిగిస్తుంది.

7. ఇటీవల కాలంలో కొన్ని సిద్ధాంతాలు కొద్దిమందికి అనధికార ఆస్తులుగా మారాయి. ఆ సిద్ధాంతాలపైన వారికి మాత్రమే హక్కు ఉంది అనేలా ఒక ప్రచారం జరుగుతోంది. అటువంటి సందర్భాలలో ఆ సిద్ధాంతాన్ని అన్వయం చేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా వాద ప్రతివాదాలకు అవకాశం ఎక్కువ. దీనివలన పలువురు సాహిత్య విమర్శకులు వివాద రహితంగా ఉండడం కోసం సిద్ధాంత అధ్యయనాలకు దూరంగా ఉంటున్నారు.

8. ప్రతి కొత్త సిద్ధాంతం నూతన ప్రతిపాదనలు చేస్తూ ఉంటుంది. ఒక సిద్ధాంతంలో పేర్కొన్న అంశం మరొక సిద్ధాంతంలో భిన్నంగా ఉంటుంది. సిద్ధాంతాల మధ్య వైరుధ్యం విపరీతంగా కనిపిస్తుంది. ఈ వైరుధ్యం విమర్శకుడిని, పాఠకుడిని గందరగోళానికి గురిచేస్తుంది. ఉదాహరణకు ‘మార్క్సిస్ట్ విమర్శ’, రచయిత మరణం అనే సిద్ధాంతం (Death of Author theory). ఈ రెండు సిద్ధాంతాలను సాహిత్యానికి అన్వయం చేసినప్పుడు రెండు భిన్నమైన అభిప్రాయాలు, ఫలితాలు కనిపిస్తాయి.

కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని, ఆలోచనలను మార్క్సిజం అని అంటారు. మార్క్స్ సిద్ధాంతాలు మార్క్సిస్టు విమర్శకు మూలాధారాలు. “మార్క్సిస్ట్ విమర్శను ‘గతితార్కిక చారిత్రక భౌతిక వాద విమర్శ’ అని కూడా పేర్కొంటారు. మార్క్స్ సిద్ధాంతాలకు భౌతిక వాదం మూలం. మార్క్స్ భౌతికవాద దృక్పథాన్ని మానవ సమాజ చరిత్రకు, సమాజ పురోగమనానికి అన్వయించి రెండు సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. అవి 1. గతి తార్కిక భౌతిక వాదం 2. చారిత్రక భౌతిక వాదం.

1. గతి తార్కిక భౌతిక వాదం: ‘గతితార్కిక భౌతికవాదం మార్క్సిస్టు, లెనినిస్టు ప్రాపంచిక దృక్పథం. ప్రకృతి యొక్క దృగ్గోచర విషయాలను పరిశీలించే పద్ధతి, వాటిని అధ్యయనం చేసి అర్థమొనర్చుకునే పద్ధతీ గతితార్కికం. ప్రకృతి దృగ్గోచర విషయాలను భాష్యీకరించు పద్ధతీ, ఆ దృగ్గోచర విషయాలను గురించి భావించుటా, దాని సిద్ధాంతమూ భౌతికం. అందుచే దీనిని గతితార్కిక భౌతిక వాదం అని అంటారు.

2. చారిత్రక భౌతికవాదం: ‘చారిత్రక భౌతికవాదమనగా గతి తార్కిక భౌతిక వాద సూత్రాలను సామాజిక జీవిత అధ్యయనానికి విస్తరింపచేయుట. సామాజిక జీవిత దృగ్గ్విషయాలకూ, సమాజాన్నీ, సమాజ చరిత్రనూ అధ్యయనం చేయడానికి గతి తార్కిక భౌతికవాద సూత్రాలను అనువర్తింపచేయుటయే చారిత్రక భౌతికవాదం అని స్టాలిన్ బోల్షివిక్ పార్టీ చరిత్రలో పేర్కొన్నాడు’ ” (మార్క్సిస్టు తత్వశాస్త్రం ఒక పరిచయం: పుట.48.)

మార్క్సిస్టు విమర్శనా సిద్దాంతం చారిత్రక నేపథ్యం ఆధారంగా రచనలోని వస్తు రూపాలను పరిశీలిస్తుంది. ఇందులో రచనకు సంబంధించిన అంశాలతో పాటు రచయితకు సంబంధించిన విషయాలనూ చర్చిస్తారు. రచయిత ఆ రచనను రచించడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. రచన ఆధారంగా రచయిత వ్యక్తిగత జీవితం, మానసిక స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అనంతర కాలంలో Death of Author (రచయిత మరణం) సిద్ధాంతం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ సిద్ధాంతంలో రచయితకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టరు. కేవలం రచనల్లోని సౌందర్య నిర్మాణం, అలంకారిక వర్ణనలు, రచనల్లో కనిపించే ప్రత్యేక అంశాలు.. మొదలైన వాటిపైనే పాఠకుడు దృష్టి పెడతాడు. రచయిత ఇక్కడ అప్రధానం. రచన పూర్తి అయిన తరువాత అసలు రచయిత ఉండడు. తరువాత అతడు కూడా ఒక పాఠకుడే. రచన మాత్రమే అవసరమైన వస్తువు.

పైన పేర్కొన్నట్లు రెండు భిన్న సిద్ధాంతాలలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. రెండు సిద్ధాంతాలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటిని రచనకు అన్వయం చేయాలనుకున్నప్పుడు కొంత అయోమయం ఏర్పడవచ్చు. అందులో నుంచి బయటికి రావడానికి విమర్శకుడు మరింత కృషి చేయాల్సి ఉంటుంది.

విమర్శ – సిద్ధాంత ఆధారిత విమర్శ:

విమర్శలో సిద్ధాంతం అనేది పాలలో నీళ్లు లాగా కలిసిపోయి ఉంటుంది. వేరు చేసి చూడడం కష్టమైన విషయం. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చర్చించే ముందు వ్యాసం అవసరం రీత్యా విమర్శ అంటే ఏమిటో అత్యంత క్లుప్తంగా ఇక్కడ పేర్కొనడం సముచితం. విమర్శ అనే పదానికి సామాన్య అర్థంలో రచనలను విమర్శించడం అని, విమర్శకుడంటే రచనలను విమర్శించేవాడనే భావన సామాన్య పాఠకుల్లో ఉంది. రచనలను విమర్శించడం అంటే రచనల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపడం అనే అభిప్రాయం చాలామంది పాఠకులకు ఉంది. కానీ వాస్తవంలో విమర్శ అనే పదానికి భిన్నమైన అర్థాలు ఉన్నాయి. వ్యాస అవసరం దృష్ట్యా కేవలం నిర్వచనాన్ని పేర్కొనడం జరిగింది.

“ఒక రచన చదివి చాలా బాగుంది అని అన్నా, ఆ రచనలోని కొన్ని భాగాలను చదివి చాలా బాగుంది అని అన్నా, ఆ రచన మనకు తెలిసినట్లు కాదు. రచన మనకు బాగుంది అని అనిపించినప్పుడు అందులోని ‘బాగు’ ఏమిటి? అది అందులో ఎక్కడ వుంది? దాన్ని విడదీసి చూపడనికి వీలుగా వుందా? లేదా పాలలో వెన్నలాగ అది ఆ రచన మొత్తంగా వ్యాపించి దాని జీవంగా వుందా? దాన్ని మాటల్లో చెప్పడానికి వీలుందా? ఆ చెప్పడం మామూలు మాటల్లోనా? విశిష్టమాటల్లోనా? విశిష్టమాటల్లో చెప్పడం వల్ల కలిగే అధిక ప్రయోజనం ఏమిటి? మొదలైనవి మనకు తెలియాలి. స్థూలంగా చెప్పాలంటే విమర్శ అంటే ఈ ప్రశ్నలకు సమాధానమే” (వీరభద్రయ్య, ముదిగొండ: విమర్శ మౌలిక లక్షణాలు, పుట.1.)

పై నిర్వచనం విమర్శకు సంబంధించిన అన్ని విషయాలను పేర్కొంటుంది. విమర్శ అంటే ఏమిటో నిర్వచిస్తూనే విమర్శ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలుపుతుంది. విమర్శకు సంబంధించిన సమగ్ర నిర్వచనంగా పై నిర్వచనాన్ని పేర్కొనవచ్చు.
నిర్వచనాలు చెప్పే విధానం వేరుగా ఉన్నప్పటికీ చివరికి అన్ని విమర్శల సారాంశం మాత్రం సాహిత్యాన్ని పలు కోణాల నుంచి విశ్లేషించి, విడమర్చి, అందులోని లోతుపాతులను, మంచి చెడ్డలను చెప్పేదే విమర్శ అనే భావం వ్యక్తమవుతుంది. స్థూలంగా చెప్పాలంటే ‘ఒక సాహిత్య రచనలోని సాహిత్యాంశాలతో పాటు సాహిత్యేతర అంశాలను కూడా వివరించి, విశ్లేషించి విలువ కట్టడాన్ని సాహిత్య విమర్శ’గా పేర్కొనవచ్చు.

రచనను వ్యాఖ్యానిస్తూ వెళితే అది విమర్శగా అనిపించుకోవచ్చు కానీ సంపూర్ణ విమర్శగా పేర్కొనలేము. సాహిత్యంలో సాహిత్య అంశాలతోపాటు సాహిత్యేతర అంశాలను తెలుసుకోవడం కోసం సిద్ధాంతం ఆధారంగా చేసుకొని విమర్శ చేయాలి. దీని వలన ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. రచనను సంపూర్ణంగా అనుశీలించడానికి అవకాశం ఉంటుంది. సాధారణ విమర్శకు పై మెట్టు సిద్ధాంతం ఆధారంగా చేసుకునే విమర్శ. ఇంకా వివరంగా చెప్పాలంటే సాధారణ విమర్శకుడు కొన్ని సందర్భాలలో రచనను వెలకట్టే ప్రయత్నం చేస్తాడు. సిద్ధాంతం ఆధారంగా విమర్శకుడు రచనను కూలంకషంగా ప్రతి అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాడు. రచనలోని సామాన్య విషయాలను తెలియజేయడం సాధారణ విమర్శలో కనిపిస్తుంది. సైద్ధాంతిక విమర్శలో విమర్శకుడు సాధారణ విషయాలకంటే విశేష అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు.

“సాహిత్యం లేకుంటే సాహిత్య విమర్శ రాదు. మంచి సాహిత్య విమర్శ లేకుంటే మంచి సాహిత్యమూ రాదు.” (వెంకట సుబ్బయ్య, వల్లంపాటి: వల్లంపాటి సాహిత్య వ్యాసాలు, పుట.2). మంచి సాహిత్య విమర్శ రావాలంటే సాధారణ విమర్శ స్థానంలో ఏదైనా సిద్ధాంతాన్ని అన్వయం చేసి విమర్శ చేసే సామర్థ్యం విమర్శకుడికి రావాలి.

ముగింపు:

విమర్శ ఒక ప్రత్యేక ప్రక్రియగా ఏర్పడే సందర్భంలో తెలుగులో ప్రముఖ విమర్శకులు అందరూ భారతీయ లేదా పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను అన్వయం చేస్తూ రచనలోని పలు విశేష అంశాలను పాఠకులకు అందించారు. ప్రముఖ విమర్శకులు అనుసరించిన పద్ధతిని కొనసాగిస్తూ విశ్వవిద్యాలయాలలోనూ ప్రారంభంలో మంచి పరిశోధన జరిగింది. విశ్వవిద్యాలయాలలో కావ్యశాస్త్రం, సిద్ధాంతాలను ఒక ప్రత్యేకమైన అంశంగా పాఠ్యాంశాల్లో చేర్చారు. బోధనలో ఈ అంశాలు ఉన్నప్పటికీ వ్యాసరచనల్లోనూ, పరిశోధనల్లోనూ సిద్ధాంతాన్ని అన్వయం చేయడానికి ప్రస్తుత తెలుగు పరిశోధకులు ఆసక్తి చూపించడం లేదు. సమకాలీనంలో పాశ్చాత్య సాహిత్యంలో అనేక అత్యాధునిక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమాచారం అంతా తెలుగులో లభించడం లేదు. 

తెలుగు పాఠకుల్లోనూ పరిశోధకుల్లోనూ విమర్శకుల్లోనూ అత్యాధునిక సిద్ధాంతాలను అధ్యయనం చేసేవారు తక్కువ. కొంతమంది విమర్శకులు అత్యాధునిక సిద్ధాంతాలను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాటిని అర్థం చేసుకోవడంలో ఎక్కడో వైఫల్యం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఒక ప్రముఖ సాహితీ సమూహం వారు విమర్శ, విమర్శనా సిద్ధాంతాలపైన అంతర్జాల సదస్సును నిర్వహించి విజయవంతం చేశారు. కానీ అందులోని అంశాలను ఎంతమంది పాఠకులు అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకొన్నవారు ఎంతమంది వాటిని రచనకు అన్వయం చేయగలరన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం కథా, కవిత్వ కార్యశాలలు నిర్వహించినట్లు విమర్శకు సంబంధించి ప్రత్యేక కార్యశాలలు క్రమంగా నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తుంది.

పాదసూచికలు:

  1. “Who is Mr. Big in literary criticism today? One of the ways scholars, critics, and pundits measure their stature is by how often their work is cited by their peers. Scores are precisely recorded in the massive Arts and Humanities Citation Index. It’s a fascinating data bank. The rise of French theorists in the early 1980s, for example, is precisely registered, with Michel Foucault and Roland Barthes being among the top cited authorities in all the arts and humanities fields, with many hundreds of hits each. The following are scores from the latest. AHCI: Terry Eagleton: 415, Frank Kermode: 208, Elaine Showalter: 154, Jacques Derrida: 164, Michel Foucault: 72, Roland Barthes: 64, Germaine Greer: 24”. (Sutherland, John. How Literature Works 50 Key Concepts, p.82.)
  2. “A theory proposes ways of seeing or envisioning the world that adds to our knowledge of it. In the physical sciences, a theory is a proposed explanation of the world that has to be confirmed through research and investigation. Theories about literature and culture are not that different.” (Ryan, Michael. (Ed.) The Encyclopaedia of Literary and Cultural Theory, p.xiii.)

ఉపయుక్తగ్రంథసూచి:

తెలుగు పుస్తకాలు:

  1. ______. మార్క్సిస్టు తత్వశాస్త్రం ఒక పరిచయం. న్యూఢిల్లీ: న్యూవిస్టా పబ్లికేషన్స్, 2002. 
  2. వీరభద్రయ్య, ముదిగొండ. విమర్శ -మౌలిక లక్షణాలు. హైదరాబాద్: తెలుగు అకాడమి, 1990. 
  3. వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. వల్లంపాటి సాహిత్య వ్యాసాలు. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1997. 

ఆంగ్ల పుస్తకాలు:

  1. Ryan, Michael. (Ed.) The Encyclopaedia of Literary and Cultural Theory. West Sussex: Blackwell Publishing Ltd, 2011. 
  2. Sutherland, John. How Literature Works 50 Key Concepts. New York: Oxford University Press, 2011.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]