AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797
9. రాయబారాలు: సమకాలీనత
కె. సుజన
పరిశోధకురాలు, తెలుగుశాఖ
హైదరాబాద్ విశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9381689235. Email: kamisettysujana@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం: ఇఅనాదికాలంనుండి దౌత్యవ్యవహారలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యముంది. సామాజికమైన ఈ దూతకార్యనిర్వహణను కవులు తమ కావ్యాలలో లక్షణబద్ధం చేశారు. ఆదికావ్యమైన రామయణంలోనూ, భారతేతిహాసంలోను దూతక్రియాచాతురీమహిమను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ధారు. సంస్కృత కావ్య, నాటకాలలో కూడా ఈ దౌత్యప్రక్రియ విశిష్టస్థానాన్ని ఆక్రమించింది. మహాభారతాంతర్గత దూత్యసన్నివేశాలు ఆలంబనగా రాయబారుల ఆవశ్యకాన్ని, కవిత్రయం ఆయా ఘట్టాలను సమున్నతంగా నిర్వహించిన విధానాన్ని విపులీకరించడం, అంతర్జాతీయ న్యాయవ్యవస్థ రూపొందించిన రాయబారి మార్గదర్శకాలు - ప్రాచీనసాహిత్యంలోని దౌత్యసంబంధాల మధ్య భేద సారూప్యాలను చర్చిస్తూ, రాయబారాల సమకాలీనతను దర్శించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం.
Keywords: ప్రాచీనసాహిత్యం, రాయబారాలు, అంతర్జాతీయన్యాయస్థానం, లక్షణాలు, సుజన.
ఉపోద్ఘాతం:
రాయబారం అంటేనే ఒకరి అభిప్రాయాలు మరొకరికి చేరవేయడానికి అవతలి వారి అభిప్రాయాలను తెలుసుకుని ఎవరైతే రాయబారానికి పంపారో వారికి సమాచారం అందించడానికి ఉపయోగపడేది. అతిపురాతనకాలంలో ఆధునిక సాంకేతికత లేకపోవడం వలన వ్యక్తులునే ప్రధానంగా రాయబారానికి వినియోగించేవారు ,రాయబారానికి వెళ్ళే వ్యక్తి ధైర్యంతో ఉండాలని, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని ఇలా రాయబారికి కొన్ని లక్షణాలను ఆపాదించారు. ఈ రాయబారం లక్షణాలను గురించి, ఆంధ్రమహాభారతంలోని రాయబారాల గురించి చర్చిస్తూ నేటి కాలంలో రాయబారం ఎటువంటి రూపురేఖలను మార్చుకుందో తెలియజేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
ప్రధానవిషయం:
“ఇద్దరు వ్యక్తుల మధ్యకానీ, రెండు పక్షాల మధ్య కానీ స్పర్థలు, అపోహలు, జగడాలు ఉన్నప్పుడు వారిద్దరి మధ్య సయోధ్య ఏర్పరచడానికి మధ్యవర్తులు అవసరం ఉంటుంది. మనస్పర్థలు పోగొట్టడానికీ లేదా రాజులకూ, రాజ్యాలకూ మధ్య యుద్ధం నివారించడానికో సహాయ సహకారాలు అందించుకోవడానికీ ఈ మధ్యవర్తిత్వం అవసరం. దీనినే రాయబారం అంటారు.” (కృపాకరరెడ్డి, ప్రాచీనకావ్యాల్లో సందేశాలు- రాయబారాలు, (సి.వ్యా), పుట:62).
ఈ అభిప్రాయాలను గమనిస్తే రెండు రాజ్యాల మధ్యగాని లేక వ్యక్తుల మధ్యకాని ఒక ఒప్పందం జరగడానికి సమస్య పరిష్కారానికి లేదా అభిప్రాయ భేదాలు రాకుండా చూడడానికి ఈ రాయబారం ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ఈ అభిప్రాయాలను జోడిస్తూ రాయబారికి ఉండవలసిన మరొక ప్రధాన లక్షణం జ్ఞాపకశక్తి ఆ రోజుల్లో వ్యక్తులే రాయబారానికి ప్రధాన అనుసంధాన కర్త కాబట్టి వ్యక్తుల మధ్య జరిగే చర్చలను వారు చెప్పింది చెప్పినట్లుగా ఉంటేనే అవతలి వారి అభిప్రాయాలు తెలుస్తాయి. స్వంతనిర్ణయాలు తీసుకుని రాయబారం జరిపినప్పటికి విషయాన్ని వివరించడంలోనూ, సమాచారాన్ని అందుకోవడంలోనూ లోపం రాకూడదు అంటే జ్ఞాపకశక్తి అవసరమని నా అభిప్రాయం నేటి కాలంలో అయితే ఆధునిక సాంకేతికతతో అనేక మాధ్యమాలు పుట్టుకు వచ్చాయి రికార్డింగ్ ద్వారా అందరి అభిప్రాయాలను బంధించి సమాచారాన్ని సేకరించవచ్చు లేద మరొకరికి అందించవచ్చు. కాని ఆనాటి కాలంలో రాయబారం చాలా ప్రధానమైనదిగా భావించవచ్చు.
అర్థశాస్త్రం-
రాయబారలక్షణాలు:
కౌటిల్యుని అర్థశాస్త్రంలో రాయబారలక్షణాలు ఈ విధంగా
తెలియజేయబడ్డాయి.
శ్లో|| ప్రేషణం సంధిపాలత్వం ప్రతాపో మిత్ర
సంగ్రహః
ఉపజాపః సుహృద్భేదో దణ్డ
గూఢాతిసారణమ్,
బన్ధురత్నాపహరణం చారజ్ఞానం
పరాక్రమః
సమాధిమోక్షో దూతస్య కర్మయోగస్యచాశ్రయః
పై శ్లోకంలోని అర్థాన్ని పరిశీలిస్తే వార్తలు పంపడం, ఇతర రాజులలో తన స్వామి చేసుకున్న సంధులను గట్టిచేయడం, తన స్వామి గొప్పతనాన్ని చాటడం, మిత్రుల్ని సంపాదించడం, కృత్యాదుల్ని రెచ్చగొట్టడం, శత్రువుల స్నేహితులలో భేదం కలిగించడం (వాళ్ళని విడదీయడం), సైన్యాన్ని, గూఢ పురుషుల్ని, శత్రు రాజ్యంలోకి ప్రవేశ పెట్టడం, శత్రువుల బంధువులను రత్నాలను(ధనాన్ని) అపహరించడం, రహస్య సమాచారాలు తెలుసుకోవడం, పరాక్రమం చూపడం, సమాధిని విడిపించడం, రహస్యమైన ఉపాయాలు పన్నడం, ఇవి దూతలు చేయవలసిన పనులు. (పుల్లెల శ్రీ రామచంద్రుడు (వ్యాఖ్యాత), కౌటిలీయమ్ అర్థశాస్త్రమ్, పుట:68).
పై విషయాలను పరిశీలిస్తే రాయబారిగా నియమితుడైన వాడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ శత్రురాజుల యందు సమయానుకూలంగా సంభాషిస్తూ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ రాయబార కార్యాన్ని దిగ్విజయంగా వూర్తి చేసుకురాగల సమర్థుడై ఉండాలని తెలుస్తుంది. అలాగే రాయబారానికి పంపే వ్యక్తి కూడా సమర్థవంతంగా కార్యాన్ని పూర్తి చేసుకురాగల వారినే ఎన్నుకోవాలని అర్థమవుతుంది.
సంస్కృతభారతంలో ఉత్తర, అభిమన్యుల వివాహం తర్వాత తర్వాతి కార్యాచరణను గురించి సభ తీర్చిన సమయంలో శ్రీ కృష్ణుడు పాండవుల పరాక్రమాన్ని గురించి తెలుపుతూ ప్రస్తుతం రాయబారిని పంపాలి దుర్యోధనుని ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్తూ రాయబారి అనేవాడు ఎలా ఉండాలో కూడా చెప్తాడు.
‘‘తస్మాదితో గచ్ఛతు ధర్మశీలః
శుచిః కులీనః పురుషో2ప్రమత్తః’’
ధర్మశీలుడు, పవిత్రాత్ముడు, కులీనుడు, సావధానుడు, అయిన ఒక వ్యక్తి దూతగా అక్కడకు వెళ్ళాలి. అని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ఈ రాయబారాలను గమనిస్తే కౌరవుల దగ్గరకు వెళ్ళే దూత ధర్మశీలుడై ఉండాలి.
1. ధర్మశీలుడు:
సాధారణంగా బ్రాహ్మణుడు ధర్మాన్ని నిష్ఠతో అనుసరిస్తాడు అటువంటి వాడై ఉండాలి మరలా బ్రాహ్మణుడు అంటే వేదాలలోని లోతులను తెలిసినటువంటి వాడు. అనే అర్థంలో తీసుకోవాలి అటువంటి వాడు ధర్మాన్ని వ్రతంగా ఆచరించేవారు రాయబారిగా వెళ్లాలి అని అర్థం అవుతుంది. పాండవుల తరపున రాయబారి వెళ్లాలి కాబట్టి పాండవుల ధర్మాత్ములు అనే భావన దృష్టిలో పెట్టుకుని చెప్పగలగాలి అనే భావన ఇందులో కనబడుతుంది.
2. పవిత్రాత్ముడు:
అంటే మనసు కల్మషం లేకుండా తనను ఎవరైతే రాయబారానికి పంపించారో వారి పై భక్తితో , నమ్మకంతో వారి మాటలను శ్రద్ధతో చెప్పగలగాలి. అనే విషయం వ్యక్తమవుతుంది.
3. కులీనత:
మంచి వంశమున లేదా కులమున పుట్టుట. మంచివంశము అంటే వంశపారం పర్యంతో వచ్చే రాజనీతిని తెలిసినవాడైతే రాయబారాన్ని సమర్థంగా ఎదుర్కోగలడు అనే విషయం తెలుస్తుంది.
4. సావధానం:
అంటే ఏకాగ్రత కలిగి ఉండాలి. చంచలమైన మనసుతో కాకుండా తాను చెప్పవలసిన విషయాలను జాగ్రత్తగా విని, ఆ విషయాలలోని అర్థం చెడకుండా ఏకాగ్రత బుద్ధిని కలిగి రాయబారి మాట్లాడాలి. మనసు ఏకాగ్రతతో విషయాన్ని ఆకళింపు చేసుకోగలిగితేనే రాయబారం విజయవంతమవుతుంది.
రాయబారి కౌరవుల ఆవేశాన్ని, అహంకారాన్ని శాంతింపచేసి ధర్మరాజుకు అర్థరాజ్యం ఇచ్చేటట్లు చేయగలవాడై ఉండాలి అని చెప్తాడు.
కౌరవుల విషయం పక్కన పెడితే సాధారణంగా ఇందులోని
అర్థం గ్రహిస్తే తన రాజు యొక్క గొప్పతనాన్ని, పరాక్రమతను దూత వర్ణించేటప్పుడు అవతలి వైపు రాజుకు అహంకారము,
రావచ్చు లేదా కోపము రావచ్చు అలా వచ్చినప్పుడు వాటిని తన మాటలతో కార్యాన్ని సాధించుకురాగలిగిన సామర్థ్యం
కలిగిన వాడు దూతగా వెళ్లాలి అనే భావం పై మాటల్లో వ్యక్తమవుతుంది.
మహాభారతం -
దూతకార్యాలు:
పై లక్షణాలను ఆధారంగా చేసుకుని మహాభారతంలో అనేక
రాయబారాలను మనం గమనించవచ్చు మహాభారతంలో పాండవుల అరణ్యవాసాలు పూర్తి అయిన తరువాత ఉపప్లావ్యంలో భవిష్యత్తు
కార్యాచరణ చేయడానికి పాండవులు, శ్రీకృష్ణుడు, బలరాముడు మున్నగు ప్రముఖ రాజులంతా సమావేశమవుతారు. అక్కడ
రాజ్యభాగం కోసం రాయబారానికి ఎవరిని పంపాలి , ఎటువంటి సందేశాన్ని కౌరవులకు పంపాలి ఎటువంటి వాక్చాతుర్యం
కలిగిన వాడిని పంపాలి అనే దాని మీద చర్చలు కొనసాగే సమయంలో బలరాముడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ
ఆ.వె. “మాట
పొందెఱింగి, యోటమై నల్లన
చేరి కౌరవేంద్రు చిత్తవృత్తి
కనుగుణంబుగాఁగ నానతుం డగుచుఁ బ్రా
ర్థించి యడుగకున్నఁదెరగుపడదు”
(కవిత్రయ మ.భా., ఉద్యోగ, ప్ర.ఆ., పుట. 09).
ఈ పద్యం యొక్క అర్థాన్ని చూస్తే మాటతీరు తెలిసి వినయంతో మొల్లగా చేరి దుర్యోధనుడి మనఃస్థితి కనుకూలంగా వినమ్రుడై వేడుకుని అడుగకపోతే వ్యవహారం చక్కబడదు. బలరాముడు చెప్పిన ఈ మాటల్లో రాయబారి లక్షణం కనబడుతుంది. మొత్తంగా బలరాముని అభిప్రాయం దుర్యోధనుని దగ్గరకు వెళ్ళేటటువంటి దూత వినయపరుడై రాయబార కార్యాన్ని సాధించుకురవాలని చెప్తాడు.
బలరాముని మాటను ఖండిస్తూ సాత్యకి ధర్మరాజాదుల ధర్మ గుణాన్ని, దుర్యోధనాదులు చేసిన దుశ్యర్యలను గుర్తుచేస్తూ యుద్ధం చేయడమే కర్తవ్యంగా చెపుతాడు ఒక వేళ దుర్యోధనుడి దగ్గరకు రాయబారిని పంపితే అతను ఎలా ఉండాలో సాత్యకి ఈ విధంగా చెప్తాడు.
ఉ. “దైన్యము దక్కి దూత
యుచితంబుగఁ బాండు నృపాలుపాలు రా
జన్య వరుండు ధర్మజుఁడు సమ్మతి వేఁడెడు నన్న, లోక సా
మాన్య విధిం దగంగ గరిమంబున నిచ్చెనఁ బుచ్చికొండ
మ
న్యోన్యవిరుద్ధభాషణము లాడినఁదత్ఫల మాతఁడందెడున్”
(కవిత్రయ
మ.భా., ఉద్యోగ, ప్ర.ఆ., పుట.14.)
ఈ పద్య భావాన్ని గమనించినట్లైతే ఏ మాత్రము దీనత్వం లేకుండా దూత సముచితంగా పాండు రాజ్యభాగం రాజోత్తముడైన ధర్మరాజు ఇష్టంతో వేడుకుంటున్నాడు అన్నప్పుడు లోక సాధారణమైన న్యాయం చొప్పున తగినట్లుగా సగౌరవంగా ఆ దుర్యోధనుడు ఇస్తే తీసుకుందాం. అట్లాకాక పరస్పర విరుద్ధంగా మాటలాడితే దాని ఫలం అతడు అనుభవిస్తాడు.అని ఒక హెచ్చరిక రూపంలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ రాయబారి అనే వ్యక్తి మొదట సౌమ్యంగా మాట్లాడి దానికి తగిన సమాధానం అవతలి వారి దగ్గర నుండి రాకపోతే యుద్ధానికైనా సిద్ధపడేటట్లు రాయబార కార్యాన్ని జరుపుకుని రావాలి అనే భావం వ్యక్తమవుతుంది.
సాత్యకి అభిప్రాయాన్ని అంగీకరిస్తూ ద్రుపదుడు తన పురోహితునిని రాయబారిగా పంపడానికి నిశ్చయించి ద్రుపద పురోహితునికి కొన్ని మాటలను చెప్పి పంపే సందర్భంలోనూ రాయబారికి ఉండవలసిన లక్షణాలు కనబడుతాయి.
కం.
‘‘హితుఁడవు, మతిమంతుండవు,
చతురవచనకోవిదుఁడవు, సమయజ్ఞుడ, వు
న్నతవంశవర్ధనుఁడ, విం
గితవేదివి, నెచ్చెలివి,
సుకృతి వ ట్లగుటన్.”
(కవిత్రయ మ.భా., ఉద్యోగ, ప్ర.ఆ.,
పుట. 21)
నీవు మాకు దగ్గరి వాడవు బుద్ధిమంతుడవు , నేర్పుగా ఎలా మాట్లాడాలో తెలిసిన పండితుడవు, సమయం తెలిసిన వాడవు ఉన్నత వంశాన్ని అభివృద్ధిపరిచేవాడవు, ఎదుటి వారి మనసులో ని అభిప్రాయాన్ని తెలుసుకునేవాడవు ప్రియమిత్రుడవు, పుణ్యాత్ముడవు. ఇలా ద్రుపదుడు తన పురోహితునితో అన్న మాటలలో రాయబారిగా వెళ్శవలసిన వ్యక్తి వాక్చాతుర్యంతో మాట్లాడాలని సమయానికి తగిన విధంగా మాట్లాడి కార్యం నెరవేర్చాలనే భావం వ్యక్తమవుతుంది.
అత్యంతప్రాచుర్యంలో ఉన్న రాయబారాలుగా మహాభారతంలో
గమనిస్తే ద్రుపదపురోహితుని రాయబారం, సంజయరాయబారం, శ్రీకృష్ణరాయబారం, ఉలూకునిరాయబారం, ఇవే కాకుండా దేవదూత,
కచునిరాయబారం, గౌరవముఖుని రాయబారం, నలరాయబారం... ఇలా అనేక రాయబారాలు భారతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే
గోచరిస్తాయి. నేటి కాలంలో రాయబారవ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మనం గమనించదగిన ప్రధానఅంశం ఆ విషయాలను
క్రింద చర్చిస్తున్నాను.
రాయబారం - సమకాలీనత:
‘‘ప్రాచీన సాహిత్యంలో రాయబారితో వ్యవహరించాల్సిన తీరుతో పాటు రాయబారికుండాల్సిన లక్షణాలు కూడా ప్రధానంగా కన్పిస్తున్నాయి. రాయబారి వ్యక్తిగత లక్షణాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఆధునిక కాలంలో రాయబారి వ్యక్తిగత లక్షణాలకు ప్రత్యేక అస్తిత్వం లేదు. కేవలం వారి ప్రవర్తనా నియమావళి మాత్రమే ఉంది. 1815 లో దీనికి సంబంధించి ఒక సామూహిక వ్యవస్థను ప్రపంచం రూపొందించుకుంది. కానీ 1945 లో అన్ని దేశాలు, అన్నీ దేశాల్లో రాయబారుల్ని నియమించే ప్రయత్నం చేశారు. 1961 లో వియన్నా కన్వెన్షన్ ఇన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ (Vienna Convention Diplomatic Relations) పేరుతో ఒక ప్రత్యేక నియమావళి ఏర్పడింది. అంతర్జాతీయ న్యాయవ్యవస్థ (International Law Commission) 18-4-1961) లో దీనికి ఒక నియమావళిని రూపొందించింది. ఇందులో 53 ఆర్టికల్స్ ను పొందుపరిచింది. Optional Protocal Concerning the compulsory settlement of disputes పేరుతో 10 ఆర్టికల్స్ రూపొందించింది. ఇవికాక Vienna Convention on Consular relations అనే పేరుతో 24/4/1963 న మరో 79 ఆర్టికల్స్ ను రూపొందించారు. (ఎస్. ఎల్. వి. ఉమా మహేశ్వర రావు, తిక్కన రాయబారాలు రాజనీతి – దౌత్య రీతి, పుట:03).
ఈ విషయాలన్ని రాయబారం వల్ల కలిగే ప్రయోజనాలను
ప్రపంచం గుర్తించి అన్ని దేశాలలోనూ రాయబారుల్ని నియమించే ప్రయత్నం చేశారని తెలుస్తుంది.
అంతర్జాతీయన్యాయవ్యవస్థ రూపొందించిన రాయబారలక్షణాలు:
- రాయబారి తన దేశానికి, ఆతిథ్య దేశానికి మధ్య స్నేహ వారిధిగా ఉండి ఇరుదేశాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సంబంధాల్ని పెంపొందింపజేయాలి.(ఆర్టికల్ 3).
- రాయబారిని దేశ అతిథిగా పరిగణించాలి.
- రాయబారిని నిర్భంధించకూడదు(అరెస్ట్ చేయకూడదు). ఆర్టికల్ 27 & ఆర్టికల్ 29).
- రాయబారిని గానీ, అతని వస్తువుల్ని గానీ సోదా చెయ్యకూడదు(ఆర్టికల్ 27).
- రాయబారి అనుమతి లేకుండా ఆతిథ్యదేశానికి సంబంధించిన అధికారులు వారి నివాస పరిసరాల్లోకి వెళ్ళకూడదు(ఆర్టికల్ 22).
- రాయబారుల ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఆతిథ్యదేశానిదే(ఆర్టికల్ 22).
- రాయబారులు తమ దేశ పతాకాన్ని వారి కార్యాలయం వద్ద, నివాసం వద్ద వాహనంపైన పెట్టుకోవచ్చు (ఆర్టికల్ 20).
- రాయబారికి పన్నులో మినహాయింపు ఉంటుంది.( ఆర్టికల్ 23,28, 34,36).
- రాయబారి వ్యక్తిగత లాభాన్ని పొందే వృత్తి వాణిజ్య కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదు. (ఆర్టికల్ 42).
- రాయబారులకు సమాచార వ్యవస్థను ఉచితంగా కల్పించాలి.(ఆర్టికల్ 27).
- రాయబారులు తమ దేశంతో మాట్లాడే
విషయాల్ని కాన్ఫిడెన్షియల్ గా పరిగణించాలి.
రాయబారులు తమ ఇంట్లో ఉంచుకునే వ్యక్తిగత సేవకుల్ని (ప్రైవేట్ సర్వెంట్స్) రాయబార ఉద్యోగిగా పరిగణించరు (ఎ 1). - రాయబారి ప్రవర్తన అభ్యంతరకరంగా, అనుమానాస్పదంగా ఉందని ఆతిథ్య దేశం భావిస్తే Persona Non – grata నియమం క్రింద, ఆదేశానికి సమాచారమిచ్చి రాయబారిని వెనక్కు పంపించవచ్చు. (ఆర్టికల్ – 9). (ఎస్. ఎల్. వి. ఉమా మహేశ్వర రావు, తిక్కన రాయాబారాలు రాజనీతి- దౌత్య రీతి, పుట:04)
ఈ లక్షణాలలో ఒకటి రెండింటిని మహాభారతం లో కి అన్వయించి పరిశీలన చేద్దాం. ఉదాహరణకు -
రాయబారిని దేశ అతిథిగా పరిగణించాలి:
నేటి అంతర్జాతీయ న్యాయవ్యవస్థ రూపొందించిన లక్షణాలలో ఒకటి. ఈ లక్షణాన్ని మహాభారతంలో పరిశీలిన చేస్తే రాయబారికి శ్రీ కృష్ణుడు వస్తున్న విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు శ్రీ కృష్ణుని మెప్పించడానికి అతిథి సత్కారాలు ఘనంగా చేయడానికి సిద్ధపడతాడు ఆ సమయంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో శ్రీ కృష్ణుడు సనాతన ధర్మ స్వరూపుడు, నరశ్రేష్ఠుడైన ఆయన పూజింపదగిన వాడు ఆయనను సత్కరించినచో మనకు సుఖం కలుగుతుంది, పూజింపకపోయినచో కష్టం కలుగుతుంది.
‘‘సచేత్తుష్యతి దాశార్హః
ఉపచారైరరిందమః
కృష్ణాత్ సర్వానభిప్రాయాన్ ప్రాప్స్యామః
సర్వరాజసు”
(శ్రీ మహాభారతం, (సంస్కృతం), తిప్పాభట్ల రామకృష్ణ మూర్తి, సూత్రం శ్రీనివాసులు, (సంపాదకులు), ఉద్యోగ పర్వం, ఎనభైఐదవ అధ్యాయం, పుట:539).
శత్రుసంహర్త అయిన శ్రీ కృష్ణుడు మన సత్కారాలతో సంతోష పడితే ఆయిన ద్వారా సమస్త రాజుల విషయంలో మన కోరికలను సఫలం చేసుకోవచ్చు అని అనడంలో శ్రీ కృష్ణునికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తమ కోరికలను నేరవేర్చుకునే రీతిలో ఆలిచించినట్లు తెలుస్తుంది దాని ప్రకారంగా దుర్యోధనుడు అందమైన సభామంటపాలను నిర్మింపచేసాడు. శిల్పులు సమస్త రత్న సంపన్నులయిన సభలను ఎన్నింటినో నిర్మించారు. ప్రత్యేకించి వృకస్థలంలో నివాసార్థం దుర్యోధనుడు అనేక రత్నాలతో కూడి మనోహరమైన విశ్రాంతి మంటపాన్ని నిర్మించాడు.
మానవులకు దుర్లభమై దేవతావాసయోగ్యంగా కనపడే ఈ వ్యవస్థను పూర్తిచేయించి దుర్యోధనుడు ధృతరాష్ట్రునకు తెలియజేసాడు అయితే శ్రీ కృష్ణుడు ఆ సభలను కాని అక్కడ కల్పించిన వివిధ రత్నాలను కాని కనీసం చూడనైనా చూడకుండా నివాసస్థానమైన హస్తిన వైపు ప్రయాణమయ్యాడు ఈ లోపల ధృతరాష్ట్రుడు విదురునితో శ్రీకృష్ణుడు వృకస్థలంలో ఉన్నాడు రేపు ఉదయం ఇక్కడకు వస్తాడు అతనికి అనేక కానుకలు ఇస్తానని శ్రీ కృష్ణ పరిచారకులందరికి కూడా ఎప్పటికప్పుడు అవసరమైన భోజనం కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ నేను సమకూర్చిపెడతాను అని చెప్పి దుర్యోధనుడు తప్ప మిగిలిన నా అందరి కుమారులు మనుమలు వస్త్రభూషణాదులను అలంకరించుకుని అందమైన రథాలతో శ్రీ కృష్ణుని స్వాగతించండని చెప్తాడు. (శ్రీ మహాభారతం, (సంస్కృతం) తిప్పాభట్ల రామకృష్ణ మూర్తి, సూత్రం శ్రీనివాసులు, (సంపాదకులు), ఉద్యోగ పర్వం, ఎనభైఐదవ అధ్యాయం, పుట:540.)
రాయబారిగా వచ్చిన వ్యక్తికి ఈ రకమైన ఆతిథ్యంను మహాభారతంలో గమనించదగినది.
రాయబారిని నిర్భంధించకూడదు (అరెస్ట్ చేయకూడదు):
శ్రీ కృష్ణుడికి ఆతిథ్యం ఇచ్చినప్పటికి రాజ్యాల మధ్య సఖ్యత ఏర్పరచడానికి రాయబారిగా వచ్చిన శ్రీ కృష్ణున్ని దుర్యోధనుడు నిర్బంధించడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు ఈ విషయం సాత్యకి సభలో వ్యక్తపరుస్తాడు. విదురుడు దుర్యోధనుని కి కృష్ణుని పరాక్రమాలను వివరిస్తాడు. శ్రీ కృష్ణుడు కూడా దుర్యోధనునితో నీ అహంకారంతో నన్ను ఒంటరివాడిని అనుకుని బంధించాలనుకుంటున్నావు అంటూ విశ్వరూప ప్రదర్శన చేస్తాడు.(శ్రీ మహాభారతం, (సంస్కృతం,) , తిప్పాభట్ల రామకృష్ణ మూర్తి, సూరం శ్రీనివాసులు, (సంపాదకులు), ఉద్యోగ పర్వం, పుట:649.)
నేటి కాలంలో అనేక విధాలుగా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది కనుక రాయబారిని నిర్భంధించడం, చంపడం లాంటివి జరగేఅవకాశాలు తక్కువని అర్థమవుతుంది.
ఆనాటి కాలంలో రాయబారికి భద్రత లేదు అవతలి వ్యక్తి రాయబారి తెలిపిన అభిప్రాయాలు రాయబారివి కాకపోయినా ఆవేశానికి లోనయ్యి రాయబారిని బంధించేప్రయత్నం చేయడమో చంపడమో జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తుంది.
ఈ విషయాలను గమనిస్తే రాయబారి జాతీయ అంతర్జాతీయాల
దేశాల మధ్య వారధిగా ఉండి దేశ ఉన్నతికి తోడ్పడుతున్నట్టు అర్థమవుతుంది. అంతే కాకుండా రాయబారికి ఉండవలసిన
లక్షణాలను, వారి భద్రతకు, గౌరవానికి భంగం వాటిల్లకుండా కొన్ని నియమ నిబంధనలను ఏర్పరచి వారికి సంపూర్ణ రక్షక
వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈనాడు గమనించవలసిన ప్రధానమైన విషయం.
ముగింపు:
ఈ వ్యాసంలో ప్రధానంగా రాయబార లక్షణాలు ను తెలియజేస్తూ నేటి కాలంలో రాయబార వ్యవస్థ నూతన పరిణామలతో క్రొత్త నిబంధనలతో ఎటువంటి పురోగతిని సాధించిందో తెలియజేయబడింది. అంతేకాకుండా మహాభారతంలో ప్రధానంగా కౌరవుల దగ్గరకు రాయబారిగా వెళ్ళే వ్యక్తి ఎటువంటి గుణాలను కలిగిఉండాలో బలరాముని ద్వారా కొన్ని లక్షణాలు తెలియజేయబడుతాయి బలరాముని అభిప్రాయాలను ఖండిస్తూ సాత్యకి రాయబారిగా వెళ్ళే వ్యక్తి పాండవులకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని సమయానుకూలంగా వ్యవహరించాలని చెప్తాడు. తరువాత ద్రుపదుడు తన పురోహితుని రాయబారికి పంపించేటప్పుడు అతనిని ప్రశించే సమయంలో రాయబార లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. ఈ లక్షణాలన్నింటిని క్షుప్తంగా ఈ వ్యాసంలో వివరించడం జరిగింది. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో పొందుపరిచిన రాయబార లక్షణాలను మహాభారతంలో ఏ సన్నివేశాలకు అన్వయించవచ్చో ఒకటి రెండు ఉదాహరణలను ఈ వ్యాసంలో వివరించాను.
ఉపయుక్తగ్రంథసూచి:
- కృపాకర రెడ్డి, ప్రాచీన కావ్యాల్లో సందేశాలు- రాయబారాలు, (సి.వ్యా), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటి,1992.
- శ్రీ రామచంద్రుడు, పుల్లెల.(వ్యాఖ్యాత), కౌటిలీయమ్ అర్థశాస్త్రామ్ ,శ్రీ గోపాల్ పబ్లికేషన్స్, హైదరాబాద్,2004(ద్వి.ము).
- http://telugunighantuvu.com/
- రామకృష్ణ మూర్తి, తిప్పాభట్ల, సూరం శ్రీనివాసులు, సంస్కృత భారతం, (రెండవ ముద్రణ) గీతాప్రెస్, గోరఖ్ పూర్, 2019.
- ఉమా మహేశ్వర రావు, ఎస్. ఎల్. వి, తిక్కన రాయబారాలు రాజనీతి- దౌత్యరీతి, చందన గ్రాఫిక్స్, నెల్లూరు, జూన్, 2014.
- కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతం, తి.తి.దే ప్రచురణలు. (ద్వి.ము.) తిరుపతి, 2008.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.