AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797
5. అనంతపురం జీవనానికి ప్రతిబింబం : “మీ రాజ్యం మీరేలండి” నవలాంశం
పి. మనోహర్
పరిశోధక విద్యార్థి, నెట్ (జె.ఆర్.ఎఫ్)
తెలుగుశాఖ, యోగి వేమన విశ్వవిద్యాలయం
కడప, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7569419545. Email: manoharp0099@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం: నవలల్లో చాలా వరకూ కల్పనలకే ప్రాధాన్యముండవచ్చును కానీ, సామాజిక ఇతివృత్తం నేపథ్యంలో వచ్చిన నవలలు వాస్తవికచిత్రణలకే ఎక్కువ ప్రాతినిథ్యాన్ని కల్పించేయి. సంఘటనాత్మక కథాకథనాలతో ప్రాత్రచిత్రణలతో నవలలు వెలుగుచూస్తూంటాయి. ఈ వ్యాసం సుప్రసిద్ధ- నవలారచయిత, వివిధ విశిష్టపురస్కారాల స్వీకర్త బండి నారాయణస్వామి - “మీరాజ్యం మీరేలండి” నవలలో అనంతపురం జీవనానికి ప్రతింబింబంగా భాసిల్లే తావులను ఆవిష్కరిస్తుంది. నవల ప్రత్యేకతలు, నవలలో చిత్రితమైన సాంఘికజీవనవిధానాలు, అంటరానితనం, రాజకీయాధిపత్యం మొదలైన అంశాలను వివిధ కోణాలలో ఈ వ్యాసం చర్చిస్తుంది.
Keywords: నవల, సాంఘికజీవనం, అంటరానితనం, రాజకీయాధిపత్యం, ముఠాకక్షలు
ఉపోద్ఘాతం:
సమాజం ప్రస్తుతం ఎలా ఉంది, అందులోని లోపాలు ఏమిటి? వాటిని ఎలా సరిదిద్దాలో తెలుసుకోవాలంటే బండినారాయణ స్వామి రాసిన 'మీ రాజ్యం మీరేలండి' అనే నవలను చదవాల్సిందేనని చెప్పవచ్చు.
“ప్రజాకంటకుల గుండెల్లో తుపాకి చప్పుడు మోగింది. చీకటి నెత్తుటి మడుగులో తేలకుండా తూర్పున ఉదయం రానంది. ముఠానాయకులై తొంభైమంది భుజాలెక్కిన పదిమంది రెడ్లూ, చౌదరీలు హఠాత్తుగా మానవతా వాదులై ప్రజాస్వామికులై హాహాకారాలు చేస్తుంటే మల్లయ్య అడుగుతీస్తున్నాడు. తన గ్రామ విముక్తి వైపు. అగ్రశూద్ర కులాల రాజకీయ ఆధిపత్యం నుంచీ జాతి ముఖం వైపు. అగ్రశూద్ర కులాల రాజకీయ ఆధిపత్యం నుంచీ జాతి ముఖంపై రుద్దిన బ్రాహ్మణ కుల సంస్కృతి నుంచీ రాజకీయ పాలెగాళ్ళకు నిచ్చెనగా మారిన దళిత రౌడీల విషాదచరిత్రల నుంచీ తన కాళ్ళను పెల్లగించుకొని తీస్తున్నాడు మల్లయ్య. ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకుతినే దొరల్ని గాడిదల మీద ఊరేగించే ప్రజాకోర్టుల వైపు. దళితుడు మరో దళిత కులం పట్ల అనుకంపన చెందే ఔన్నత్యం వైపు. సనాతన సంస్కృతిని చెమట పరం చేసే శూద్రకులాల మూలం వైపు. వ్యక్తిగతపు 'నేను' ను విచ్ఛేదమ్ చేసుకునే అద్వైత చింతన వైపూ, కమ్యూనిస్ట్ సమాజం వైపు” (నారాయణస్వామి, బండి., మీ రాజ్యం మీరేలండి, పుట.191) అంటూ ఒక సామాన్యవ్యక్తి ఎలా చైతన్యవంతుడయ్యాడో తెలిపాడు సుప్రసిద్ధ నవలాకారుడు బండి నారాయణ స్వామి.
వస్తువు:
నారాయణస్వామి రాయలసీమ రచయితల్లో
అగ్రగణ్యుడు. ఈయన కలం నుంచి కథలు, నవలలు, వ్యాసాలు వెలువడ్డాయి. వీరి ప్రతి రచన పాఠకులను ఆలోచింపజేస్తుంది,
తర్కింపజేస్తుంది, ప్రశ్నింపజేస్తుంది, చైతన్యవంతం చేస్తుంది, ముందుకు నడిపిస్తోంది. అందువలన ఈయన రచనలను
సజీవ శిల్పాలుగా పేర్కొనవచ్చు. అందులో గణనీయమైన నవల 'మీ రాజ్యం మీరేలండి' రాయలసీమ ఆత్మ అనదగిన అనంతపురం జిల్లా సాంఘిక జీవనాన్ని అతి విస్తృతమైన
కేన్వాసుపై ఏకాగ్రతతో చూపు మరల్చకుండా, బాహ్యప్రపంచంతో మమేకమై కేవలం సాక్షిగా చిత్రించిన బృహత్ రచన ఇది. ఈ
నవల గురించి దాని నిర్మాణం గురించి, శిల్ప చాతురి గురించి అందులోని పాత్రల గురించి ఎంత రాసినా, చెప్పవలసింది
ఇంకా మిగిలే ఉంటుందనవచ్చు. దీనిలోని వస్తువు ఎంత విస్తృతమో, కథనం అంత నిశితమై ఉంది. అది రచయిత
పాఠకులకు ప్రసాదించిన వరం.
ఈ వరం ఒక చైతన్య దీపికగా వెలుగుతున్నది. ఈ నవల చదువుతుంటే రంగుల రాట్నం అని పిలిచే జెయింట్వేల్ను జాతరలలో భయపడుతూ భయపడుతూ ఎక్కేవాడిలో కలిగే భావోద్వేగం, ఉద్విగ్నత, భీతావహం, హర్షాతిరేకం, చిత్త చాంచల్యం, వ్యాకులత, ధ్యాన నిమగ్నత, నిర్వాణం వంటి అసహజ ఇంద్రియాను భూతులు పాఠకుల అనుభవంలోకి వస్తాయి. కురుమ తిప్పన్న, మాదిగ దేవన్న, మాదిగ పండయ్య, బోయ భూమయ్య, బోయ మల్లయ్య వడ్డెలోకప్ప, వడ్డె విరూపాక్షి అనే ఏడుగురు శూద్రుల కథ ఇది. ఈ ఏడుగురి కథలు 'గాథలుగా మారి నేటి జనజీవనానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇవి యధార్థజీవిత గాథలు.
నవల్లోని పాత్రలు:
అనంతపురం జిల్లా సమాజ దర్పణంగా రూపుదిద్దుకున్న ఈ
నవలకు మాదిగ వడ్డెర, కురుమ, దూదేకుల, చాకలి వంటి శూద్రకులాల సజీవ సమాజ జీవనచిత్రణ ఆయువుపట్టుగా ఉంది.
రెడ్డి, కమ్మ బ్రాహ్మణ వంటి ఆధిపత్యకులాల వ్యవహార సరళిని కూడా రచయిత ఇందులో లోతుగా చర్చించారు. మాదిగ
దేవన్న, బోయ భూమయ్య, వడ్డె లోకప్ప, గొర్ల తిరుపాలు వంటి తొలితరం మనుషులు, పండయ్య(మాదిగ), మల్లయ్య(బోయ),
విరూపాక్షి (వడ్డెర), వెంకట లక్ష్మి (మాదిగ) వంటి రెండో తరం వారు, గోవిందు (చాకలి), భాస్కర నాయుడు (లింకుల
చౌదరి) వంటి రౌడీలు, దళారీలూ, రాజారెడ్డి, కొండారెడ్డి, గంగుల రెడ్డి, వీరప్ప నాయుడు, గరుడ శేఖర నాయుడు వంటి
ఆధిపత్య పాలక కులాలకు చెందినవారు ఈ వాస్తవిక నవలలో మనకు తారసపడతారు. సుమారు (1970-2000) మూడు దశాబ్దాల
రాజకీయ సాంఘిక జీవనం ఈ నవలలో చిత్రితమైంది. ఈ జీవనం రాయలసీమ అందులోనూ ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజల
జీవనంగా ఉంది.
అనంతపురం పట్టణానికి సమీపంలో పండమేరు గ్రామం
వుంది. పండమేటిస్వామి సమాధి దగ్గరే గుడి వెలుస్తుంది. అంటరానితనం
కారణంగా మాదిగలకు ఈ గుడిలో ప్రవేశం లేదు. మిగతా అన్నికులాల వాళ్ళకు
గుడిలో స్వామి దర్శనం ఉంటుంది. తర్వాత పండమేటి గ్రామానికి తూర్పుదిక్కున
వందమైళ్ల అవతల ఒక కుగ్రామంలో తాళప్రతాలు దొరికినాయి, “ఆ తాళపత్రాల్లో పండమేటిస్వామి గురించిన
శతక పద్యాలున్నాయి. ఆ పద్యాల్లో పండమేటి స్వామి పుట్టిన ఊరు చిత్రచేడు
అని, అతని పూర్వనామం కేశన్న అని, కులం మాదిగ, గోత్రం మందల అని తెలిసి
పండమేటి ప్రజల్ని ఆశ్చర్యపరిచింది.”
(అదే. పుట.165) దీనితో మధ్యలో పండమేటి స్వామి
స్వయానా మాదిగ కులస్తుడనే నిజం వెలుగు చూస్తుంది. రెడ్లు, కమ్మలు ఏకమై వ్యతిరేకించినా, లెక్కచేయక మాదిగలు
మొదటిసారి గుడిలోకి ప్రవేశించి తమ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఘటనతో మాదిగలకు, బోయ, కురుమ, ఈడిగ, వడ్డెర
వంటి ఇతర కులాలకు చెందినవారికీ మధ్య ఉన్న అంటరానితనం మూలంగా ఏర్పడిన అగాధం క్రమంగా తొలగిపోతుంది. ఇందులోని
వస్తువు ఇదే అయినా దీనికి అనుబంధంగా అనేక సామాజింకాంశాలు ముడిపడి ఉన్నాయి.
పేద దంపతుల బంధం:
ఈ నవలలో పేదదంపతుల బంధం అద్భుతంగా చెప్పబడింది. “ఒకసారి ఇరుగు పొరుగు వాళ్ళు తీర్థయాత్రలకు పోతుంటే పెద్దక్క కూడా పోయింది. మహానంది, అహెూబిలం, శ్రీశైలం, యాగంటి, బ్రహ్మంగారి మఠం, అన్నీ దర్శించుకొని వచ్చింది. తీర్థయాత్రలకు మున్నూరు రూపాయల ఖర్చు పెట్టుకొని వచ్చింది. ఆమే తీర్థయాత్రలకు పోయిన ఆ మూడు రోజులూ ఉత్తపేయి తిప్పన్న - నా భార్య తీర్థయాత్రలకు పోయిందీ, నా భార్య తీర్థయాత్రలకు పోయిందీ! అని ఊర్లో అందరికి చెప్పి సంతోషపడినాడు. పెద్దక్క మహానంది నుంచి తెచ్చిన విబూది పండునీ, శ్రీశైలం నుంచీ తెచ్చిన ప్రసాదాన్నీ అహెూబిలం నుంచి తెచ్చిన నరసింహస్వామి పటాన్ని పిల్లోడు చూసినట్టు అబ్బురంగా చూసినాడు తిప్పన్న. తన తీర్థయాత్రల విషయాన్ని తన మొగుడు ఊరందరికి చెప్పుకుని సంతోషపడిన వైనాన్ని విని పెద్దక్క భోరుమని ఏడ్చిందంట. అయ్యో! పాపిష్టి దాన్ని! నా మొగుడు ఎంత తిక్కొడు అయితే మాత్రం, ఆయన్ని విడిచిపెట్టి తగుదునమ్మా! అని నేను ఒక్క దాన్నే తీర్థయాత్రలకు పోవల్లా? అయ్యో! నా తిక్క మొగున్ని పిల్చుకొని పోతే, ఇంకో మూడు నూర్లు ఖర్చు అయిపోతాయి కదా అనుకున్న లోభిముండని! భగవంతుడు నన్ను చెమిస్తాడా?" (అదే. పుట. 5) అని పశ్చాత్తాప పడుతుంది.
ఈ సన్నివేశంలో నిరక్షరాస్యులైన దంపతులకు ఒకరిపై మరొకరికి ఎలాంటి ప్రేమానురాగాలున్నాయో నవలాకారుడు అద్భుతంగా చెప్పాడు. అదే ధనవంతులకు ఈ అక్షరాస్యులకు, ఉద్యోగులకు ఇలాంటి బంధమున్నట్లు చెప్పడం సాహసమే అవుతుంది.
అంటరానితనం:
అంటరానితనం ఎంత దారుణంగా ఉందో బండి నారాయణ స్వామి స్పష్టంగా పేర్కొన్నాడు. భూమయ్య అనే వ్యక్తి తన తమ్మున్ని ఇలా మందలిస్తాడు.
"ఒలే! మాదిగొల్లతో సావాసాలేందిరా? బోయోల్లతో తిరుగు, వడ్డేవాల్లతో తిరుగు, గొల్లొల్లతో తిరుగు, పోయి పోయి మాదిగోల్లతో, మాలోల్లతో తిరుగుతానంటవేందిరా! ఈ కులాలన్నీ దేవుడు ఎందుకు పెట్టినాడు? నువ్వు బోయెల్లలో పుట్టుపో! నువ్వు రెడ్లలో పుట్టుపో! నీవు బాపనోల్లలో పుట్టుపో అని ఏ కులంలో పుట్టాల్సిన వాన్ని ఆ కులంలో ఎందుకు పుట్టిస్తాండాడు? ఒరే మల్లిగా, మనం మనుషులం. దేవుడు పుట్టీకపోతే మనం యాడుండే వాల్లం. ఈ పొద్దు నాలుగచ్చరాలు సదువుకున్నావో, లేదో కులం లేదు, గిలం లేదు అని వితండవాదం చేస్తావా? అసలు కులాలు పెట్టిందెవడ్రా దేవుడు! దేవుని కంటే నీకెక్కువ తెల్సా అని ఖయ్యి ఖయ్యిమని లేచేవాడు తమ్ముని మీదికి పూజారి భూమయ్య” (అదే. పుట. 21) అంటాడు. నవలాకారుడు బండి నారాయణ స్వామి. అనంతపురం జిల్లాలో అంటరానితనం ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క ఘటన చాలు చెప్పడానికి ఒక్క అనంతపురంలోనే కాదు రాయలసీమంతా ఇదే పరిస్థితి ఉంది.
ఒక దళిత బాలునికి అగ్రవర్ణాల వారు బాత్‌రూంలో భోజనం పెడతారు. ఆ ఘటనతో ఆ బాలుడు ఎంతగానో ఆవేదన చెందుతాడు. ఈ విషయాన్ని రచయిత బండి నారాయణస్వామి ఇలా తెలిపాడు. “ఏం పాండూ! బాగున్నావా? అంది. ఈ మధ్య మన ఇంటికి రావడం లేదు? అని అడిగింది.... ``ఒరే పాండూ, రారా! ఈ బాత్‌రూమ్‌లోకి రా`` అని గునగునగా అరిచి బాత్ రూమ్‌లోకి దారి తీసింది. తను బాత్ రూమ్‌లోకి పోతూనే ఆ ఇస్తరాకును తన రెండు చేతుల్లో పెట్టి, ఆప్యాయంగా తినరా, పాండూ! తిను నీళ్ళు తెస్తాను! అని వెళ్ళిపోయింది. అంత వరకూ తను గుప్తపక్కన కూర్చుని భోజనం చేయబోతున్నాడనే అనుకున్నాడు. బాత్ రూంలో అన్నం తినేదాన్ని ఊహించుకోలేక పోయినాడు. తనను వీళ్ళు భోజనానికి ఎందుకు పిల్చల్ల? ఇంత అవమానం ఎందుకు చేయల్ల అనుకున్నాడు...వెంటనే ఛఛ అవమానమా? గుప్త ఎట్లాంటివాడు? గుప్త తల్లి ఎట్లాంటిది? ఎంత మంచి వాళ్ళు తనని ఎందుకు అవమానం చేస్తారు అనుకొని తింటాడు.
``ఇంకెప్పుడూ నాతో మాట్లాడొద్దు!
ఏమీ?``
మీరంతా చాలా ఛీప్ మనుషులు అన్నాడు మా అన్న.
నువ్వు అట్లాంటివానివి కాదని వాదించినాను. రుజువు చేస్తే పాండుగానితో స్నేహం విడిచి పెడతావా
అన్నాడు మా అన్న. నేను నీ మీద నమ్మకంతో ఒప్పుకున్నాను. మా అన్నే కరెక్ట్!
నీవు చాలా ఛీప్ నా కొడుకువి! ఎంత చీప్ నా కొడుకువి కాకపోతే అన్నానికి మొగం వాచినట్లు అట్ల
బాత్‌రూములో తింటావు? థూ! థూ! ఇంకెప్పుడూ నాతో మాట్లాడొద్దు...” (అదే. పుట. 39) అంటూ
దళితుడైన పాండుకు బాత్ రూంలో భోజనం పెడతారు. ఇలాంటి అమానవీయ
మనస్తత్వంగల మనుషులు కూడా ఉన్నారు.
బొడ్డురాయికి ఒక దళిత బాలిక నీళ్ళు పోసిందని తెలుసుకున్న అగ్రవర్ణ స్త్రీ ఆ విద్యార్థిని తీవ్రంగా మందలిస్తుంది. దాంతో ఆ బాలిక భయపడి దూరంగా వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని రచయిత బండి నారాయణ స్వామి ఇలా తెలిపాడు.
“ఊర్లో ఇంతమంది ఉండారు. ఒక్కరంటే ఒక్కరన్నా ఆ పాప మాదిగోల్ల పాప అని కనిపెట్టలేక పోయినారా? అని తన పక్కన నోర్లు తెరుచుకొని నిలబడిన ఆడవాళ్ల మీద రంకెలేసింది.
రెడ్డెమ్మ బొడ్డురాయికి నీళ్ళు పోసే బడిపిల్లోల్లవైపు తిరిగి, పొండి పొండి యానీళ్ళు పోయద్దు పొండి. ఒక మాదిగదానితో మైలపడిపోయినంక, ఇంక ఎన్ని నీళ్ళ బిందెలు గుమ్మరిస్తే ఏం ఫలితమొచ్చే. పొండి, పొండి అని ఉక్రోషం పట్టలేక ఏడుస్తున్న జీతగాళ్ళ వెంకటలక్ష్మి నెత్తి పునక మీద ఇంకో ఏటు వేసింది. ఆ తరువాత ఆ పిల్లని కట్టడి చెయ్యకుండా పెంచుతున్నారని జీతగాళ్ళ వెంటకలక్ష్మి అబ్బనూ, అమ్మనూ, వంశాన్నీ, కులాన్నీ తిట్టి తిట్టి మెటికలు విరిచి శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయింది. ఆ విధంగా జీతగాళ్ళ వెంకటలశ స్వస్వరూపజ్ఞానం పొందేదానికి అంకురార్పణ చేసిన ఆదిగురువు రెడ్డెమ్మ!” (అదే. పుట. 87) అంటూ రచయిత తెలిపాడు.
దైవం దగ్గర కూడా ఇంత వర్ణ
వివక్ష చూపడం అత్యంత హేయం. బుద్ధి తెలిసి, తెలియని పిల్ల పట్ల అంత కోపం
చూపడం దారుణం. దీనిని అమానుషంగా పేర్కొనవచ్చు.
పసిబిడ్డల
మనస్సును గాయపరచడమే కాకుండా భౌతికంగా దాడి చేయడం
హీనమైన చర్యగా భావించాల్సి ఉంది. ఒక పక్క దళితులపై ఆధారపడి
జీవిస్తూ ఆ దళితుల పైన్నే అగ్రవర్ణాల వారు దాడులకు పాల్పడుతున్నారు. అది
మానసికంగా, శారీరకంగా కూడా కావచ్చు. దళితుల శ్రమ లేకపోతే
అగ్రవర్ణాలకు తిండి ఉందు. దాంతో ఆకలితో అలమటించి చావాల్సిందే. ఈ
సత్యం దళితులకూ, అగ్రవర్ణాలకు కూడా తెలుసు. అయినా దళితులు
ఎప్పుడూ సహాయ నిరాకరణ పాటించలేదు.
మనిషి మలాన్ని ఎత్తుట:
గతంలో అంటే ఐదు దశాబ్దాలప్పుడు మనిషి మలాన్ని దళితులు ఎత్తి గంపలో వేసుకొని మోసుకొని పోయేవాళ్ళు. ఈ విషయాన్ని బండి నారాయణ స్వామి ఇలా అంటాడు.
“ఒక చేతికి ఇనుప గంప తీసుకొనేవాడు. ఇంకో చేతికి ఇనుపరేకు తీసుకునేవాడు. వీధిలోని జనాలు ఊపిరి బిగపట్టుకొని, ఆడవాళ్ళు ముఖం వికారంగా పెట్టి పైట చెంగుతో ముక్కు మూసుకొని గబగబ అడుగులేస్తూ పారిపోతుండగా, పండయ్య పెద్ద నాయన రోడ్డు వైపు నింపాదిగా నడిచి, చేతిలోని రేకుతో దొడ్డిలోని అమేధ్యాన్నంతా గంపలోని నూక్కోనొచ్చి నిర్వికారంగా ట్రాక్టరులోని డ్రమ్ములు నింపుతుండేవాడు. అదంతా తలచుకునేదానికి ఒకప్పుడు పండయ్యకు ఇష్టముండేది కాదు. ప్రస్తుతం అతనికి ఏమనిపిస్తుందంటే కడుపులోని పెద్ద పేగుల్లోనే అది తయారై ఉన్నప్పుడు లేని అసహ్యం, అది కాస్తా బైట పడినప్పుడు మాత్రం ఎందుకు కలగాలో? ఒక వేళ కలిగిందో అనుకో, శుభ్రం చేసేవాన్ని చూసి ఎందుకు అసహ్యించుకోవాలో? పుండును ముట్టుకొని పరీక్షించి శుభ్రం చేసే డాక్టర్ని గౌరవించారు గానీ, ఆమేద్యాన్ని ఊడ్చేసి, శుభ్రం చేసే వాన్ని గౌరవించరు. వాన్ని దూరంగా నెట్టి, వానికి ఊర్లో మంగలిని లేకుండా చేసి, చాకలిని లేకుండా చేసి వెలివేస్తారు. వంటింట్లో మసిగుడ్డ నల్లగా ఉందనీ, అందరూ కాళ్ళు తుడుచుకునే తివాచీ మైలపడిందనీ ఆరోపించడం ఒక్క మనిషి జాతికీ చెల్లింది” (అదే. పుట. 40) అంటాడు బండి నారాయణ స్వామి. ఈ అమానవీయ అంశాన్ని హృదయ విదారకంగా చెప్పాడు రచయిత. ఈ పాకీ పనిని ఒకనాడు మాల మాదిగలు చేసేవారు. ఆ తర్వాత యానాది వారు చేసేవారు. కానీ నేడు చాలా వరకు యంత్రాలు వచ్చాయి. నేటి తరానికి తెలియని ఈ అంశాన్ని రచయిత కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు.
బరువు లెత్తే
పోటీలు:
రాయలసీమలో ఉగాది రోజు బరువులెత్తే పోటీలు నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలోనూ ఈ పోటీలు గతంలో జరిగేవి. నేడు పల్లెల నుంచి పట్టణాలకు ప్రజలు వలస వెళ్ళడంతో, అక్కడక్కడా జరుగుతున్నాయి. వాటి స్వరూపాలను ఇలా తెలిపాడు నారాయణ స్వామి.
“ఉగాది సాయంత్రం అన్ని కులాల యువకులూ ఇరుసు ఎత్తుతారు. అది బండి ఇరుసు! చాలా తూకం. దాన్ని ఒంటి చేత్తో ఎత్తి ఎంతసేపు నిలబెడతారో అని పందెం. దాన్ని ఒంటి చేత్తో గద మాదిరి ఎత్తి నిలబెట్టేవాడు మొనగాడు. వాడు ఆ గ్రామ చరిత్రలో నిలిచిపోతాడు. అదే సాయంత్రం ఇసుక మూట ఎత్తుతారు. ఉలవ మూట ఎత్తుతారు. ఒక్కరే ఆ ఉలవమూటను గానీ, ఇసుక మూటను గానీ మోకాల మీదికి ఎత్తుకొని మోకాళ్ళ మీది నుంచి భుజానికెత్తు కొనేవాడు మొనగాడు! వాడు ఆ గ్రామచరిత్రలో నిలిచిపోతాడు. అదే ఉగాది సాయంత్రం ఒక పెద్ద గుండు దగ్గరికి పోతారు. గుండ్రంగా ఉండే ఆ నల్లరాతి గుండు డెభ్భై ఏండ్ల నుంచి గ్రామంలో పడి ఉంది. ఈ డెభ్భై ఏండ్లలోనూ దాన్ని భుజం మీదికి ఎత్తుకొని వెనక్కు పడేసిన మొనగాళ్ళు ఏ ఇద్దరో ఉన్నారు. ఆ మొనగాళ్ళు గ్రామచరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళ బలాల గురించీ, మహా కాయుల గురించీ, వాళ్ళు పోటీలు పడి తినే అన్నం గుట్టల గురించి, యాట మాంసం గురించి కథలు కథలుగా చేప్పుకుంటారు. వాళ్ళ వారసులు తమ పూర్వీకుల్ని తలుచుకొని మీసాలు దువ్వుకుంటారు” (అదే. పుట.162) అంటాడు నవలాకారుడు బండి నారాయణ స్వామి గారు. రాయలసీమలో గత నాలుగైదు దశాబ్దాలకు ముందు ఉగాది రోజు కుల మతాల కతీతంగా వివిధ పోటీల్లో పాల్గొంటారు. అవి అసమాన్యమైన పోటీలు. వాటిల్లో విజయం సాధించిన వారికి ఎంతో గుర్తింపు ఉంటుంది.
లొంగిన నక్సలైట్లకి
తాయిలాలు:
లొంగిన నక్సలైట్లకు ప్రభుత్వం తాయిలాలిస్తుంది. వాటిని లొంగిన వారు అపురూపంగా తీసికుంటారు. అలా తీసికోవడాన్ని నవలా కారుడుగా బండి నారాయణ స్వామి వ్యంగ్యంగా విమర్శించాడు. ఆయన మాటలు ఇలా ఉన్నాయి.
“లొంగిపోయే నక్సటైట్లకు ప్రభుత్వం ట్రాక్టర్లు మంజూరు చేస్తుంది.
అంతో ఇంతో భూమి ఇస్తుంది. అప్పటికి దేశంలోని ప్రజలందరికీ ట్రాక్టర్లూ, భూములూ ఉన్నట్లూ, తమకు మాత్రమే
లేనట్లు ఈ నక్సలైట్లు ఆ సదుపాయాలు తీసికుంటారు. వాళ్ళు ఒకప్పుడు భూమి లేని, ట్రాక్టర్లు లేని బీదసాదల కోసం
పోరాటం జరిపిన వాళ్ళంట.
విప్లవాన్ని సన్యసించిన ఏ మార్క్సిస్టూ
మామూలు ప్రజల మాదిరి ఏదో ఇంత పనిచేసుకొని ప్రజల్లో బతికేదానికి ఇష్టపడడు. ఏ రెడ్డి మాదిరో, కమ్మాయన మాదిరో
వర్తకుని మాదిరో బతికేదానికి చూస్తాడు. కానీ పూర్వజీవితంలో వీళ్ళందరినీ తూర్పార బట్టి ఉంటాడు. తానేదో
నీతి స్వభావం కలవాడైనట్లు!
జీవితంలోకి వచ్చేటప్పటికి తాను నమ్ముకున్న శ్రమ శక్తీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రొలిటేరియన్ కల్చర్సు ఇవన్నీ ఏమయి పోతాయో! తాము జీవితంలో అనుసరించలేని సిద్ధాంతాల్నీ, సూత్రాల్నీ దశాబ్దాలు దర్గాలుగా ప్రజలకు చెప్పుకుంటూ బతికి ఉంటారు. మనుషులు తాము తిట్టిన పనుల్నీ ఎక్కువగా చేస్తుంటారు. పాపం! చెడిపోయిన కమ్యూనిస్టులు మాత్రం మనుషులు కారా!” (అదే. పుట.171) అంటాడు బండి నారాయణ స్వామి. ఈ అంశంలో రచయిత చెప్పినవన్నీ వ్యంగ్యాస్త్రా లేననక తప్పదు. ఎంతో సునిశిత దృష్టితో సమాజాన్ని పరిశీలించి పాఠకుల కళ్ళకు కట్టినటు తెలిపాడు.
ఈ నవలను విశ్లేషిస్తూ ప్రముఖ విమర్శకుడు అంబటి
సురేంద్రరాజు ఇలా అంటాడు. - "మాదిగ పండయ్య నవల చివరిలో భాస్కర చౌదరి పై ఎన్నికల్లో
పోటీకి దిగుతాడు. ఎవరు వద్దన్నా వినడు. బేఖాతరు చేస్తారు. వద్దన్న వాళ్ళతో పండక్క ఒక్కటే మాట అంటాడు.
కర్ణుడికి కిరీటా వచ్చినంక తప్ప అతని శక్తి సామాణ్యుల ప్రపంచానికి తెలిసి రాలేరు. ఈ సమయంలో మన మాదిగోళ్ళ
భవిష్యత్తు కూడా అంతే! నవలకు ఇది భరత వాక్యం. బహుజన హితాయి! బహుజన సుఖాయ! ఈ రాజ్యం మీదెనండీ! మీ రాజ్యం
మీరేలండీ! శూద్రుల కథ ‘గాథగా’ రూపాంతరం చెందిన అపురూపమైన సందర్భం స్వామి నవల”
(అదే. పుట. 200) అంటూ ఈ
నవలాతత్వాన్ని తెలియజేశాడు.
ముగింపు:
ఈ నవల మాదిగల చైతన్యానికి సంకేతంగా నిలుస్తుందనీ, అనంతపురం జిల్లా ప్రజా జీవనానికి ప్రతిబింబంగా నిలుస్తుందనీ, ఈ నవలలోని వస్తువు భావికాలంలో చరిత్రకారులకు ఆధారంగా నిలబడుతుందని చెప్పవచ్చు. దీనికి హేతువుగా నారాయణ స్వామికి సమాజం పట్ల ఉన్న అవగాహన, సామాజిక స్పృహయేనని చెప్పవచ్చు.
ఉపయుక్తగ్రంథసూచి:
- నారాయణస్వామి, బండి. మీ రాజ్యం మీరేలండి. ప్రచురణ: భగవాన్ ప్రచురణలు-2, అనంతపురం: జూన్ 2005.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. నవలాశిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజ్ఞానభవన్, హైదరాబాద్: 1989.
- చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం. మన నవలలు - మన కథానికలు. విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, విజయవాడ: ఏప్రిల్ 2015.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.