headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797

4. సామాజిక అసమానతలు: వేమన ప్రశ్న

Cinque Terre
డా. ఎం. లక్ష్మయ్య

తెలుగు అధ్యాపకులు,
సి.ఎస్.ఎస్.ఆర్.&ఎస్.ఆర్.ఆర్.ఎం.డిగ్రీ & పి.జి. కళాశాల
కమలాపురం, కడప, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9492495437. Email: manjurilakshmaiah@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ప్రజాకవిగా శతకవాఙ్మయంలో చిరంజీవిగా నిలిచిపోయే ప్రజాకవి వేమన. నీతి కవిత్వం, వైరాగ్యకవిత్వం పాళ్ళు ఎక్కువగా కనిపించే ఈయన కవిత్వం ఘటైన విమర్శాధోరణి, పదునైన ప్రశ్నించే గుణం కనిపిస్తాయి. సామాజిక అసమానతలపట్ల సమకాలీన సమజాన్ని వేమన తన పద్యకవిత్వంతో ప్రశ్నించిన విధానాన్ని అనుశీలించడమే ఈ వ్యాసం ప్రధానోద్దేశం. సంస్కర్తగా, కులమతాల నిరసించిన వ్యక్తిగా, సామాజికనీతికుశలుడిగా వేమనను తన సాహిత్యం ద్వారా దర్శించడమే ఈ వ్యాసం లక్ష్యం.

Keywords: వేమన, వర్ణవ్యవస్థ , మానవత, కులవైషమ్యాలు, మూఢాచారాలు

ఉపోద్ఘాతం:

మనం మహాకవి అని పిలుస్తున్న వేమనను, మన పూర్వికులు ఆయన్ను కవి అని కూడా గుర్తించలేకపోయారు. నాగయ్య గారి సినిమా వచ్చినప్పటినుంచి వేమన యోగివేమనగా అయ్యాడు. సి.పి.బ్రౌన్‌ దొర వేమన పద్యాలను సేకవించిన తర్వాత ప్రజల నాలుకల్లో ఆ పేరు మారుమోగుతోందని చెప్పవచ్చు.ఈ మధ్యకాలంలోనే వేమన గురించి విశ్వవిద్యాలయాలు పరిశోధనలు నిర్వహించే దశకు వచ్చాయి. ఈనాటి సాహిత్యకారులు, మేధావులు వేమన కవిత్వాన్ని పరిశోధించి తెలుసుకోవలసిన, తెలియజేయవలసిన విషయాలు  ఇంకా  ఏవో ఉన్నాయనే భావన వారిలో కలుగజేస్తోంది.

వేమన నల్లచెరువులో మనుగడ సాగించినట్లు స్థలపురాణం వల్ల తెలుస్తుంది. వేమన ఆ గ్రామంలోనే సమాధి అయ్యాడని నల్లచెరువు గ్రామ ప్రజలు చెబుతున్నారు. వేమన జన్మస్థలం ఏదన్నది ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వంద సంవత్సరాల క్రితం కటారుపల్లెలోని వేమన సమాధి చుట్టూ గర్భగుడిని రాయవెల్లూరు నివాసి సత్యాచారి నిర్మించాడు. తర్వాత కొంత కాలానికి ఆ గుడి ముందర భాగాన్ని గ్రామస్థులే కట్టించినట్లు తెలుస్తుంది.‘‘వేమన పద్యాలు నాటికీ నేటికీ ఆంధ్రుల జిహ్వాగ్రాల మీద నాట్యం చేస్తున్నాయని’’ 1 శ్రీమతి రమాదేవి అన్నారు.

తెలుగుసాహిత్యంలో వేమన స్థానం:

తొలి తెలుగు కవులందరు అనువాదకులే గాని వారు స్వతంత్రంగా రాసిన కావ్యాలు తక్కువ. వారు సమాజాన్ని గురించి అధ్యయనం చేసినట్లు ఎక్కడా కన్పించదు. ఆంధ్రవాఙ్మయ మంతటిలోను సామాజిక చైతన్యాన్ని రేకెత్తించి, సామాజిక జీవితాన్ని అధ్యయనం చేసి సమాజ గర్భంలోకి చొచ్చుకుపోయి సామాజిక స్వరూపాన్ని బొమ్మకట్టించిన తొలితెలుగు కవి వేమన. అతడు ఒక తాత్వికుడుగా కూడా ఇతరులచే గొప్ప మన్ననలు పొందినట్లు విమర్శకుల యొక్క అభిప్రాయం. వేమన సమకాలిన సమాజాన్ని అధ్యయనం చేసి నిండైన తెలుగు నానుడులతో కవితను ఆవిష్కరించిన మహాకవి. అంతకు ముందు ఎవరిలో లేని ప్రతిభా, చమత్కారం ఆయనసొత్తు. ‘‘విదేశీయులు విశేషంగా మెచ్చుకున్న తెలుగు కవుల్లో వేమనే మొదటి వాడు’2 అని డా.ఎన్‌.గోపి అన్నారు.

వేమన - ప్రశ్నాత్మకధోరణి:

సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో ఉన్న అసమానతలను గూర్చి దోపిడీని గూర్చి ప్రశ్నించిన హేతువాది వేమన. సమకాలీన సమాజంలో ఉన్న మత, కుల వైషమ్యాలు, మూడాచారాలు, ధనిక పేద భేదాలలో ఆయన తడవని అంశం లేదనడంలో సందేహంలేదు. వేమన భావాలు మతం కుదుట్లో పుట్టి సామాజంలోనికి విస్తరించాయి. గంభీరమైన తాత్విక చర్చల కన్న సంఘజీవనంపైన వాటి ప్రభావమే వేమనకు ముఖ్యం. వేదాంతాన్ని అతడెప్పుడూ సంఘం నుండి వేరు చేసి చూడలేదు. తాత్వికం, సాంఘికం, ఆర్థికం అనేవి మన సౌకర్యం కోసం చేసుకున్న విభజనలు. వేమన జీవితాన్ని సంపూర్ణంగా దర్శించిన వాడేకాని అరలుగా ప్రత్యేక దృక్కోణాలలో చూసినవాడు కాదు. అయితే వ్యక్తి  జీవితాన్ని శాసించేవి పై సంఘశక్తులే కాక ఆ సంఘంలో రూపుదిద్దుకున్న  అతని మన:ప్రవృత్తి కూడా అతని దృక్పథాన్ని నిర్దేశిస్తుంది. జనన,మరణాలు,యౌవ్వన ప్రాదుర్భావం, వివాహం మొదలైనవి జీవితంలోని కీలక సంఘటనలు. 

వీటన్నింటితో మానవుడు సమాజంలోసతమతమవుతున్నాడని వేమన పేర్కొన్నట్లు పరిశోధకుల పరిశోధనల వలన తెలుస్తోంది. వేమనది సహజంగా ఉద్రేక ప్రకృతి. ఈ ప్రకృతి జవం, జీవం కలిగాయి. అది కోపరూపమైన బలహీనతకాదు.  ఆశాభంగం, స్వార్థం నుండి పుట్టిన కసికాదు. వేమనకు కోపం లేదని కాదు వేమన ప్రదర్శించింది ధర్మానుగ్రహమే. అయితే ఉద్రేకజ్వాలలు సుమకోమలమూ, హిమసన్నిభమూ అతని మనస్తత్వం నుంబి వెలువడ్డాయని మరచిపోరాదు. అంతేకాదు వేమన ప్రభోదాలు చైతన్య ప్రభోదాలై జ్వలించడానికి ఆయన వ్యక్తిత్వంలో మరో రెండు అంత:శక్తులున్నాయని చెప్పవచ్చు. దండలో దారంలాగా వేమన ప్రతిపద్యంలోను చిత్తశుద్ది, సాహసం అనేవి అంతర్లీనమై కొనసాగిన సద్గుణాలు. వేమన చిత్తశుద్దికి తార్కాణంగా ఆయన పద్యాల్లో ఏ పద్యంలోనైనా చూడవచ్చు.

‘‘చిత్తశుద్ది గలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత’’ 3

నిజాయితీ గల జీవితం నుండే సత్యం ఉద్భవిస్తుంది. సత్యం, మానవత  ఈ రెండిటి అద్వైతమే వేమన పద్యాలలోని సారం. సాహసం లేనివాడు సత్యం పలుకలేడు. వేమన పలుకులలోని సాహసమే అతని వ్యక్తిత్వంలోని సౌందర్యం. అయితే వేమన సాహసానికి కారణం అతని నిస్వార్థత. వేమన కోరి విరాగి అయినాడు. తన ధర్మం,మతం వదిలివేశాడు. చివరికి గోచిగుడ్డను కూడా తీసిపారేసిన విముక్తుడు వేమన. అటువంటివాని సత్యవాక్శూరత వలన తనకు పోయేదేమిలేదు. దోచుకోవడానికి సంపద లేదు హాని కలుగజేయడానికి దేహం మాత్రం ఉంది. కాని దాని పట్ల కూడా వేమనకు శ్రద్ధ, మమకారాలు కానరావు ఇంతటి మొండివానిని సాహసలక్ష్మి వరించక తప్పలేదనడంలో సందేహం లేదు.

సంస్కర్తగా వేమన:

సంఘ సంస్కర్తకు కావలసిన జీవ సామాగ్రి వేమనలో పుష్కలంగా లభిస్తుంది. ఆనాటి సంఘం కూడా సంస్కరించబడవలసినంత దుస్థితిలోనే ఉంది. సమాజవ్యవస్థ రోగగ్రస్థమై హస్తవాసి గలిగిన ధన్వంతరి కోసం నిరీక్షిస్తుంది. వేమన నాటి సంఘలోపాల ‘ఎరుక’ను కలిగి, వాటిని సరిదిద్ద గలిగినంత ఎత్తు వరకు ఎదిగివున్నాడు. సంఘంలోని ప్రజలను నిష్కామంగా ప్రేమించగలిగిన వాడే దానిని సన్మార్గంలో పెట్టాలనుకుంటాడు. మానవతా మూర్తి అయిన వేమన కరుణాంత రంగంతో గట్టిచికిత్సకే పూనుకున్నాడని చెప్పవచ్చు.

కుల - వర్ణవ్యవస్థల నిరసన:
మానవత్వ సాధనలో వేమనకు మొట్టమొదట అడ్డుతగిలింది వర్ణ వ్యవస్థ. కులాల పుట్టుకను గూర్చి మన ప్రాచీన గ్రంధాలలో అనేక రకాల కథలు ఉన్నాయి. పూర్వ కాలం నుండి కుల వ్యవస్థ ఇండియాలో కొనసాగుతున్నదని గ్రీకు, లాటిన్‌ రచయితలు పేర్కొన్నారు. మానవజాతి సంఘటితం కావాలని వేమన ఉద్భోదించాడు. సహజంగా తర్కశీలి అయిన వేమన ప్రాపంచిక సుఖాల కొరకు కులపుగోడలను కూలదోసి మళ్ళీ ఆ శిథిలాలకే కాపలా కాసే ద్వంద్వాన్ని పరిహసించాడు.

కులము లేనివాడు కలిమిచే వెలయును
కలిమిలేని వాని కులము దిగును
కులము కన్న మిగుల కలిమి ప్రధానంబు” 4

వేమన సమానతను ప్రభోదించే ఉద్యమానికి సమకాలీన పరిస్థితల దోహదమే కాకుండా ఆ వర్ణవ్యవస్థలోని అమానుషత్వం అతనికి బాధను కలిగించింది. మనుష్యుల మద్య హెచ్చు తగ్గులను నిర్ణయించి మానవ గౌరవాన్ని కించపరచినవి కులాలే అని వేమన అభిప్రాయం. మానవున్ని ఒక కుల చట్రంలో బిగించి ఉంచడం వేమనకు నచ్చలేదు. మానవుడు తన సాంఘిక వర్ణం ఏదో దానిలోనే సభ్యుడౖి ఉంటున్నాడు. కాని తన జాతి మొత్తంలో ఒక స్వతంత్ర సభ్యునిగా ఉండలేకపోతున్నాడని వేమన గుర్తించాడు. ప్రాథమికంగా మానవుడనే గుర్తింపును కోల్పోయాడని వేమన వాపోయాడు. నైతిక ప్రమాణాల దృష్ట్యా వర్ణ వ్యవస్థ సమర్థనీయం కాదని తేల్చి చెప్పాడు. జాతి ఐక్యతను అది భంగపరుస్తుందని హెచ్చరించాడు.

సామాజికనీతి కుశలత:
వేమనను అనేకులు ‘‘నీతికవి’’గా గుర్తించారు. కాని వేమన చేసిన నీతిప్రబోధం ఆయన స్పర్శించిన అనేకానేక విషయాలలో ఒకటేగాని అది ఆయనను నీతిబోధకుని చేసేంత ప్రబలంగాలేదు. పిల్లల వాచకాలలో,శతకాలుగా ప్రచురించిన పుస్తకాలలో వివాదరహితమైన సామాన్య నీతులనే చేర్చారు. కాబట్టి వాటికే అధిక ప్రచారం కలిగింది. పల్లెటూరి ప్రజానీకంలో వేమనపద్యాలు ప్రాచుర్యాన్ని పరిశీలిస్తే సాదారణ నీతిపద్యాలతో పాటు బహుముఖాలుగా విస్తరించిన పలు రకాల పద్యాలను వారు వినిపిస్తారు. నీతి సంఘానికి సంబందించింది. సంఘంలోని వివిధ జీవన రీతులు నీతిమార్గాలకు కట్టుబడి ఉంటాయి. సంఘం ఏర్పరచిన ఈ కట్టుబాట్లు వ్యక్తిలోని విశృంఖలత్వాన్ని అదుపులో పెడుతూ అతని సంఘ మాధ్యతను గుర్తు చేస్తుంటాయి.

అధికారుల కుటుంబంలో పుట్టి, యవ్వన ప్రాదుర్భావ దశలో వేమన కూడా వేశ్యాలంపటత్వానికి గురి అయినాడని చెప్పడానికి ఆయన పద్యాలలో సాక్ష్యాలున్నాయి. జీవనపరిణామంలోని అనుభవం వలన పెరిగిన సంఘబాధ్యత వలన, అవినీతి జనితమైన దుష్పలితాలను ప్రత్యక్షంగా చూడటం వలన,విశృంఖల జీవితానికి స్వస్తి చెప్పాడు. విటజీవితం సంసారులకు తగదనీ సంఘానికది హానికరమని అనుభవంతో గుర్తించినవాడు వేమన.

పేదవారు వేశ్యల వలలో చిక్కి మంటలలో శలభాలల మాడిపోతున్నారని వేమన అభిప్రాయం. వారకాంతల వలపు నిజమైనదికాదు. వారి ప్రేమ ధనం మీద ఆధారపడి ఉంటుంది. ఇది  తెలియక వారి మాయలో పడ్డవారి కళ్లు బలవంతంగా విప్పుతున్నాడు వేమన. ఒకడు కూడి విడిచిన స్త్రీని మరొకడు కలియడం అసహ్యకరమైన పని. అది ఒకడు నమిలి ఉమ్మివేసిన తాంబూలాన్ని మరొకడు తినడం వంటిది. వ్యభిచారం నుండి దృష్టి మరల్చడానికి వేమన విరక్తిని గురించి బోధించాడు. ధనం,దేహాదులు అశాశ్వతమనీ, చేసిన ధర్మమే చివరకు మిగిలేదని చెప్పాడు. వేశ్యాలోలత్వం నుండి జనులను నిరుత్సాహపరిచే ప్రయత్నంలో వేమన స్త్రీల పట్ల మోహం,  అసలు ఆడదానిపట్ల ఆసక్తే పాపమన్నంతగా ఖండిరచాడు. ఆ వ్యభిచారనిందలో భాగంగానే స్త్రీల పట్ల నిరసన కూడా కొంత వ్యక్తమైంది. అయితే ఆనాటి సంఘజీవనానికి చీడపురుగువలె దాపురించిన అవినీతిని ఖండిరచిన వేమన తృతీయమైన కామ పురుషార్థాన్ని నిర్లక్ష్యం చేశాడని భావించనక్కరలేదు. ‘కామిగానివాడు కవిగాడు రవిగాడు’ అనే సామెత ద్వారా వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేశాడు.

ప్రగతిభావజాలం - వేమన వ్యక్తిత్వం:

నిర్జీవమైన పాతవిలువలకు వీడ్కోలు చెప్తూ నూతనంగా వచ్చిన పరిణామాలకు స్వాగతం పలికాడు వేమన. సమాజంలో వస్తున్న మార్పులను విప్పి చెప్పడంలో గత విశ్వాసాల మీద సమరం ప్రకటించాడు. ఆయన దాడికి గురికాని సంఘవ్యవస్థలే లేవు. కాని వాటిపై విరుచుక పడడంలో మానవత్వమే ఆయన లక్ష్యం. ప్రగతి దాని లక్షణం. అయితే ఇంతటి ప్రగతిశీల దృక్పథం ప్రదర్శించిన వేమనలో కొన్ని ప్రగతి నిరోధక,మానవత్వ వ్యతిరేక భావాలు కూడా మిగిలి ఉన్నాయి. అప్పటి సంఘ వ్యవస్తకు సంబదించిన కొన్ని దుర్గుణాలు ఆయనను విడిచిపెట్టలేదు. తర్వాత అప్పటి గ్రామ వ్యవస్థ విచ్చిత్తిలో అతివేగంగా మారుతున్న కుటుంబ విలువలను సంస్కర్త హృదయంతో స్వీకరించలేక పోయాడు. కండ్ల ఎదుట కనిపించే పేదరికం ఎంతటి భయంకరమైనదో వేమనకు తెలుసు. పేదరికాన్ని గురించి తెలుసుకోవడం అంటే మానవ జాతిలోని అధిక సంఖ్యాకుల దుస్థితిని గూర్చి తెలుసుకోవడమే. పేదరికం వల్ల సంక్రమించే అధిక దుర్గుణాలను వేమన ఖండించాడు. నరకప్రాయమైన లేమి ఇహలోక సౌఖ్యాలన్నింటిని కాల్చేస్తుందని,మనిషి ఆత్మగౌరపు ఆకాశాల నుండి బానిసత్వపు పాతాథంలోనికి కూలిపోతాడని వేమన తెలిపాడు.

ముగింపు:

వేమన ధనవంతులకు ప్రత్యేకమైన ప్రభోదం చేశాడు. ఆధ్యాత్మిక దృష్టిలో ధనానికి విలువలేదు. ధనాంధకారంలో మానవత్వపు విలువలు మాటుపడి పోవడంతో, ధనికుల దృక్పథాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు వేమన. ధనవంతులను భ్రావితం చేసే శక్తి ఆధ్యాత్మికములైన విలువలకు ఉన్నదని నమ్మి ఆ మార్గంలో కొంత ప్రయత్నం చేశాడు. మొదట ఆయన బతుకు యొక్క క్షణికత్వాన్ని, సంపదల అస్థిరత్వాన్ని తెలిపి తద్వారా వారికి విరక్తిని భోదించాడు. ఆకలన్న వాడికి అన్నం పెట్టనివాడు ధన్యుడు కాలేడన్నాడు. అన్ని దానములలో అన్నదానమే గొప్పదని వేమన ఎలిగెత్తిచాటాడు.

పాదసూచికలు:

 1. వేమన - సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం, పుట 152.
 2. సముద్దరణ -  డా॥ ఎన్‌.గోపి - పుట 13.
 3. వినుర వేమ, ఏడిద కామేశ్వరరావు  - పుట 2
 4. వేమన పద్యాలు - ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి - పుట 38

ఉపయుక్తగ్రంథసూచి:

 1. వేమన -  సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం. కడప: 2013.
 2. కామేశ్వరరావు, ఏడిద. వినుర వేమ,  ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి, హైదరాబాదు: 1976.
 3. చంద్రశేఖర రెడ్డి, రాచపాలెం. వేమనపద్యాలు, సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం, కడప: 2020.
 4. గోపి, ఎన్‌. ప్రజాకవి వేమన, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ హైదరాబాదు: 2000.
 5. వేమన - 2 , సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం, కడప: 2013.
 6. వేమన (వేమనపై విమర్శా వ్యాసాలు), సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం, కడప: 2020.
 7. కట్టా నరసింహులు, వేమన పద్యాలు, సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం, కడప, 2020.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]