headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797

3. రాజసూయ యాగానంతర నన్నయ్య పద్యాలంకారాలు

Cinque Terre
చక్రహరి రమణ

తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి),
సిద్దిపేట, తెలంగాణ.
సెల్: +91 9247226292. Email: ramana.chakrahari@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

కవిత్రయభారతం ఇతిహాసమైనా కావ్యలక్షణాలకు చక్కని నిధి. అలంకారశాస్త్రోక్త ధర్మాలన్నీ కూడా తెలుగు భారతంలో ద్యోతకమౌతాయి. నన్నయ రచించిన ఆంధ్రభారతాంతర్గత సభాపర్వంలో రాజసూయ యాగం ఘట్టం ఉన్న పద్యాలలో సందర్భవశాత్తు రమణీయమైన పద్యరాజాలు, అలంకారాలు విరాజిల్లుతున్నాయి. వీనులవిందు చేసే శబ్దాలంకారాలు కూడా మెండు. ఈ ఘట్టంలోని అర్థ, శబ్దాలంకార ప్రస్తావనలు, వాటి ప్రత్యేకతలను ఉదాహరణలను చూపిస్తూ పరిశీలించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

Keywords: నన్నయ, భారతం, పద్యం, అలంకారం, రాజసూయయాగం, రమణ

ఉపోద్ఘాతం:

క. ధరణీ ధర సర్వ గుణా
    కర కరుణానిరత సర్వ కార్యైకధురం
    ధర నిను బడసిన మాకును
    హరివిక్రమ పడయరానియవియుం గలవే

ఆదికవి, వాగను శాసనుడు నన్నయ్య గురించి వసు చరిత్రలో రామరాజభూషణుడు నన్నయ్య ఆంధ్ర వాఙ్మయాన్ని సృష్టించాడనే  భావం  నన్నయ్య గురించి రాసిన పద్యంలో కనబడుతుంది.  మారన నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అన్నాడు. కొలని గణపతి దేవుడు అనే కవి నన్నయను ఆంధ్ర కావ్య పథము తీర్చినాడని అన్నాడు. ఈ విధంగా చాలామంది కవులు నన్నయ  తెలుగు కవితకు భిక్ష పెట్టాడని అన్నారు.

ప్రధానవిషయం:

గానం చేయదగిన గేయం పద్యం కన్నా ముందే పుట్టిందని అనడానికి నిదర్శనంగా నన్నయ్య త్రి, పంచ, సప్త మాత్రాగణములతో కూర్పుగా రగడలను రాసిన నిదర్శనాలు ఉదాహరణలు ఉన్నాయి. సాహిత్య మార్గానికి శైలి సంప్రదాయానికి శ్రీకారం చుట్టడంలో సామర్థ్యం ఉన్న నన్నయ్య, తర్వాత వచ్చిన కవులకు మార్గదర్శకులు అయ్యారు. నన్నయ్య రాసిన సభాపర్వం ద్వితీయ అశ్వాసం లో రాజసూయ యాగం ముగిసిన తర్వాత వివిధ దేశాల నుంచి వచ్చిన రాజులు ధర్మరాజు యొక్క వైభవాన్ని వివరించారు. వైభవాన్ని ఆ గొప్పదనాన్ని పూర్తిగా అనుభవించి తిరిగి ప్రయాణమవుతున్న సందర్భంలో రాజు యొక్క గుణగణాలను వర్ణిసస్తున్న క్రమం రాజులందరికి మార్గదర్శక మవుతుంది.   ఈ సందర్భంగా నన్నయ రాసిన పద్యాలను చూసినట్లయితే వివిధ రకాల వృత్తపద్యాలు,వివిధ రకాల అలంకారాలతో కూడుకొన్న పద్యాలు,వచనాలు కనబడతాయి. అందులో కొన్ని పద్యాలు వాటిలో నన్నయ వాడిన అలంకారాలను ఉదాహరణలుగా తీసుకొంటే..

‘కావ్య కన్యకు  ఆభరణములలాంటివి అలంకారాలు’. అని భట్టు మూర్తి అన్నాడు.
'నిర్దోషం గుణవత్ కావ్యం, అలం
కారైరలంకృతమ్ , రసాత్మకం కవిః
కుర్వన్ కీర్తిం ప్రీతించ విందతి'  (కావ్యాలంకార సర్వస్వం. పుట 12)
అని  సరస్వతీ కంఠాభరణంలో భోజుడు కావ్యం గురించి నిర్వచించాడు.
ఋగ్వేదంలో.  ఇతిహాసాలల్లో, పాణినీయంలో అలంకారాల ప్రసక్తి,అలంకార పేర్లు,అలంకార వర్ణనలు ఉన్నాయి.

ఉపమా అలంకారం : 
ఉపమాలంకారం సర్వాలంకారాలకు మూలం అని వామనుడు అన్నాడు. శబ్దార్ధ భేదములచే అలంకారాలు రెండు విధాలు. అనుప్రాసాదులు శబ్దాలంకారాలు, ఉపమాదులు అర్థాలంకారాలు. అలంకారములలో ప్రతీయమాన ఔపమన్యులు పదహారు, ప్రతీయమాన వస్తుకములు పది, ఉపమాదులు నలబై, రసవత్, ప్రేయస్, ఊర్జస్వితో సమాహితాలు నాలుగు,  మొత్తం డెబ్బై అలంకారాలు(కావ్యాలంకార సంగ్రహము). శ్రీకృష్ణుడు రాజసూయ యాగానంతరం ద్వారకా నగరానికి వెళుతూ
                  తే. సకల భూత సంఘంబు పర్జన్యు పక్షి
                       సమితి బహు ఫల వృక్షంబు నమరులింద్రు
                      న నిశమును నుపజీవించునట్లు బంధు
                       జనులు నిన్నుపజీవింప మనుము పేర్మి
అని తేటగీతి పద్యంలో నన్నయ్య మూడు ఉపమానాలను సూచిస్తూ అలంకారాలకే వన్నెతెచ్చాడు. బంధుజనులు రాజును ఆశ్రయించిన విధానాలను రాజు వాళ్ళను రక్షించే పద్ధతులను ఉపమలతో వివరించాడు. ప్రాణులకు నీరు కావాలి. నీరే ప్రాణాధారం అందుకే మేఘున్ని ఆశ్రయిస్తారు. పక్షులు ఆహారం కోసం పండ్లున్న వృక్షాలను ఆశ్రయిస్తాయి. దేవతలు ఇంద్రుని ఆశ్రయించి సురక్షితులుగా ఉండాలని కోరుకుంటారు. అలాగే రాజు ప్రజలను రక్షించడంలో నీరు లాగా ప్రాణాధారం కావాలి. రాజును ఆశ్రయం కోరి వచ్చిన ప్రజలకు ఆహార నివాస ద్రవ్యాలనిచ్చి ఆశ్రయం కల్పించే వృక్షం వలె ఉండాలని, ఆపదలో ఉన్న ప్రజలకు ఇంద్రుని వలె రక్షక కవచంలా నిలవాలని, తేటగీతి పద్యంలో ఒక్క ఉపమేయానికి నాలుగు  ఉపమానాలను జోడించి చెప్పారు.           
అలంకారములలో సాధర్మ్యములు, సాదృశ్యములు అని మూడు మూడు విధాలు. అర్థాలంకార యుక్తములుగా  అవి భేద ప్రధానము, అభేద ప్రధానము, భేదాభేద ప్రధానములు. ఉపమాలంకారం పూర్ణ, లుప్త అని రెండు విధాలు. ముఖ్యంగా తెలుగులో వాడుతున్న  ఉపమావాచకాలు అటులన్, కరణిన్, లీలన్, గతిన్.. మొదలైన వాటిని ఉపమా వాచకాలుగా వాడుతారు.
        తే.  ఒనరు నది పూర్ణయును లుప్తయును ననంగ;
              నందు నుపమాన ముపమేయ మలరు సమత
              సామ్యవాచకమును గూర్పిఁ జాలుఁ బూర్జ;
              కొన్ని కడ మైన లుప్తయై కొమురు మిగులు. (కావ్యాలంకార సంగ్రహము)          
          చంపూ కావ్యంగా భారతాన్ని వ్రాసిన నన్నయ్య వచనాన్ని కూడా అలంకారయుతంగానే రాశాడు. అందుకు మచ్చుకు ఉపమాలంకారంతో చెప్పిన వచనం మయసభలో దుర్యోధనునికి అవమానం జరిగినందుకు సిగ్గుపడతాడు. అందరి కళ్ళకు ఆనందాన్ని కూర్చిన మయసభ వైభవం దుర్యోధనుని మనసుకు, కళ్ళకు నిప్పుమంటయింది. "తత్సభా లక్ష్మి దన తన మనోనయనంబుల కగ్ని జ్వాలయై మహాదాహంబు సేయుటయు  సంతుప్తుండై నిదాఘదాహంబున నింకి  తరుగునల్ప జలాశయంబునంబోలె దద్దయుం" వేసవి వేడికి నీల్లింకి తరిగిపోయిన నీటిమడుగులా కృశించి పోయాడు. అని పోల్చి చెప్పాడు.
ఉపమానము, ఉపమేయము, సామాన్య ధర్మం, సామ్య వాచకము అనే నాలుగు అంశాలతో కూడినది పూర్ణోపమ. అందులో ఏ ఒక్కటి లోపించిన అది లుప్తోపమ.  అర్థి, శ్రౌతి అనే భేదాలచే పూర్ణోపమ రెండు విధాలు.  సమాసగతము, వాక్యగతము, తద్దితగతము అని అర్థి మూడు విధాలు. వాక్యగతము, సమాసగతము అని శ్రౌతి రెండు విధాలు. అదేవిధంగా పూర్ణోపమ మాదిరిగానే  అనుపాత్త ధర్మ లుప్తోపమలు ఐదు విధాలు.
గాంధారిని వర్ణిస్తూ వచనములో చెప్పిన ఉపమా అలంకారం. హస్తినాపురంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మొదలైన నూరుగురు కొడుకులతో, భీష్మ, శల్య, శకుని, సైంధవ, కర్ణ, కృప, ద్రోణ, అశ్వద్ధామ, సోమదత్తులతో కూడి ఉన్న ధృతరాష్ట్రునికి, భానుమతి మొదలైన కోడల్లతో కూడి, నక్షత్రాల మధ్య రోహిణి లా ఉన్న గాంధారి దేవికి (తారకా పరివృత యయియున్న రోహిణీయుంబోలె నున్న గాంధారీదేవికి )2-2-159  గురుకులంలోని పెద్దలకు ధర్మరాజు తమ్ముళ్లతో కూడి ఎంతో వినయంగా నమస్కరించాడు. అందంగా ఉన్న రోహిణీ నక్షత్రంలా గాంధారి ఉన్నదని, ఆమెకు సైతం ధర్మరాజు నమస్కరించాడని ఉంటుంది. 
                      క.  కందుగల పసిడిగాచిన
                           కంది వివర్ణమయినట్లు కౌరవుకాయం
                           పొందగ వివర్ణమయి కడు
                           వందె మనస్తాపహవ్యవహదాహమునన్ (భా.2-2-89)
ఈర్ష్య చాలా చిత్రమైన దుర్గుణం. ఒకరితో చెప్పలేనిది, ఓర్చుకోవడానికి సాధ్యం కానిది. కర్రకు అంటుకున్న నిప్పులాంటిది. అభివృద్ధిని చూసి సంతోషించడం సజ్జన లక్షణం. ఈర్ష పడటం దుర్జన స్వభావం. కందుకలిగిన అంటే మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారినట్లు మనస్తాపహవ్యవహదాహమునన్ మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుని శరీరం కళావిహీనమైంది కృశించింది. అంటూ చక్కని ఉపమను చూపెట్టాడు. ఇందులో నన్నయ ఒక మంచి నీతిని ఉపమ అలంకారంలో చెప్పాడు.
                ఆ. అల్పుడయ్యు  మనుజుడతి పరాక్రమమున
                     పేర్మి దరతరంబ పెరుగుచున్న
                     వాడు మ్రాని మొదలి వల్మీక మామ్రాని
                     జెరచునట్లు గడగి చెరచుబగర  (భా.2-2-144)
    మానవుడు తక్కువవాడే అయిన ఎక్కువ పరాక్రమముతో అంతకంతకు గొప్పగా అభివృద్ధి చెందుతుంటే చెట్టు మొదలు పుట్ట క్రమంగా ఆ చెట్టునే చెరిచినట్లు, అతడు ప్రయత్నం చేసి తన శత్రువులను నాశనం చేయగలడు. అని మానవుడికి వాల్మీకానికి పోలుస్తూ  ఉపమాలంకారంలో చెప్పాడు. అంతేకాకుండా మరొక పద్యంలో
                      అహితవృద్ది యుపేక్షితంబగుడు నల్ప
                      మగు మహావ్యాధియును బోలె నది యసాధ్య
                      మయి యుపేక్షకు నిర్మూలితాత్ము జేయు
                      గాన పాండవశ్రీ యుపేక్షంబు గాదు  (భా.2-2-145)
            శత్రువుల అభివృద్ధిని లెక్కలోకి తీసుకోకుండా వదిలేస్తే మొదట తక్కువగా ఉన్నా పెరిగి పెరిగి పెద్దదై అదుపు చేయడానికి సాధ్యం కాని  మహావ్యాధిలా, అశ్రద్ధ చేసిన వాన్నే అది నాశనం చేస్తుంది. అందుకే పాండవుల ఐశ్వర్యం ఏమాత్రం వదిలివేయ తగినది కాదని పాండవుల అభివృద్ధిని ఉన్నతంగా వర్ణించాడు. 

అర్ధాంతరన్యాసాలంకారం :
సామాన్యంను విశేషం చేత గాని విశేషంను సామాన్యం చేత గాని సమర్థించడం అర్ధాంతర న్యాసాలంకారం. సామాన్యమంటే సర్వ సాధారణమైన లోక వ్యవహారం. విశేషమంటే ఒక ప్రత్యేక సన్నివేశం. సమర్థించడం అంటే నమ్మకం కలిగించడం. 
               చ. అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మిజేసి యు
                    న్నతమగుచున్న పాండునరనాథ తనూజుల లక్ష్మి నా కస
                    మ్మతమయి సూ వెలింగె విను మాతుల! మానదనాడ్యుడైన భూ
                    పతి సహియింపనోపునె సపత్నుల వృద్ధియు నాత్మహానియున్  (భా.2-2-98)
సాటిలేని పరాక్రమంతో సంపాదించిన గొప్ప సంపదలతో అంతకంతకు అధికమవుతున్న పాండవుల ఐశ్వర్యం సహించరానిదై ప్రకాశించింది.  ఓ మామ అభిమాన ధనుడైన రాజు దాయాదుల అభివృద్ధిని, తన తగ్గుదలను సహించగలడా? అంటూ  అర్ధాంతరన్యాసాలంకారంలో పాండవుల ఐశ్వర్యం సహించరానిదనే విశేషమైన వాక్యాన్నిరాజు దాయాదుల అభివృద్ధిని, తన తగ్గుదలను సహించలేడు అనే సామాన్య వాక్యము చేత సమర్ధించాడు.  భర్తృహరి సుభాషితాలల్లో కూడా అర్ధాంతరన్యాసాలంకారాలు కోకొల్లలుగా వాడాడు. శతక సాహిత్యంలో ఎక్కువగానే ఉంటాయి.
    ఆ.వె. పునుగు పిల్లికేల పుట్టించె వాసన
            కనకము తనకేమి కల్గజేసె
            బ్రహ్మచేత లెల్ల పాడైన చేతలు ..(వేమన శతకము) 
      దృష్టాంతాలంకారంలో సామాన్యం సామాన్యం చేత, విశేషం విశేషం చేత సమర్థించడంబడుతుంది. దుర్యోధనుని ఈర్ష్యకు మరొక పద్యం నన్నయ అర్ధాంతరన్యాస అలంకారంలో చెప్పాడు.
                    క. పెద్దలు హీనత పొందిరి
                         తద్దయు హీనులు సమృద్ధి తనరిరి నియమం
                         పెద్ది విధి యోగమున కసు
                          హృద్దర్పోన్నతుల్  సూచి ఎట్లు సహింతున్.  (భా.2-2-141)
గొప్పవాళ్లు తగ్గిపోయారు అల్పులు అన్ని సంపదలతో అధికులయ్యారు బ్రహ్మ దేవుని చేష్టకు క్రమం ఏముంది మిత్రులు కాని వాళ్ళు గర్వాన్ని, ఔన్నత్యాన్ని చూచి నేనెలా సహిస్తాను . బ్రహ్మ దేవుడు చేసిన క్రమం ఏముంది అనే వాక్యంతో రెండు వాక్యాలను సమర్థించాడు.
                       క. నముచి యను తనుజుడుగ్రత
                        పము సేయుచు నున్నవాని బలమథను డధ
                        ర్మమున వధియించె రిపు ప
                        క్షము నెమ్మెయి నైన జెరుపగా వలయు నిలన్ (భా.2-2-143)
నముచి కశ్యపునికి తనువుకు జన్మించిన కుమారుడు. నముచి భార్య ప్రభ దేవదానవ యుద్ధములో ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినా ఇతడు చావలేదు. ఇతనికి ఉండే వరాలు అలాంటివి తడిసిన దానితో కానీ ఎండిన దానితో కానీ ఇతనికి చావు లేదు. అయినప్పటికీ నముచి దేవేంద్రునికి భయపడి దాగి భయంకరమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు నిన్ను  తడిసిన దానితో మరియు ఎండిన దానితో కొట్టనని నమ్మించి నురుగుతో కొట్టి రాక్షసుడిని హతమార్చాడని పురాణ గాధ ఉంది . నముచితపస్సు చేస్తుండగా దేవేంద్రుడు అన్యాయంగా అతనిని వధించాడు. భూమి మీద శత్రుపక్షాన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలి అనుకున్నాడు, కాబట్టి  అతన్ని వధించాడు.ఈ విధంగా  పద్యంలో అర్ధాంతరన్యాసాలంకారాన్ని చూపెట్టాడు.
                    తే. క్షత్రనీతి క్రమంబులు గావు సూవె
                        నికృతియును జూదమును ధర్మనిత్యులైన
                        వారికీ రెండు వర్జింపవలయు నెందు
                        బాపవృత్తంబు జూదంబు పార్థివులకు  (భా.2-2-166)
ధర్మరాజు ఆవులిస్తే ప్రేవులు లెక్కపెట్టగలవాడు. ధర్మరాజు జూదంలో ఆసక్తి కలవాడని, అందులో సమర్ధుడని, అక్షజ్ఞుల వలన విన్నాడు. దుర్యోధనుడు ఆ నెపముతో ధర్మరాజును జూదానికి ఆహ్వానించాడు. కానీ ధర్మరాజు దుర్యోధనుడితో మోసం, జూదం క్షత్రియ ధర్మానికి తగినవి కావు సుమా! ధర్మాన్ని ఆచరించే వాళ్ళు రెంటిని వదిలివేయాలి, రాజులు జూదమాడటం పాపపు పని అన్నాడు.

ఉత్ప్రేక్ష:
ఉపమానము యొక్క గుణ క్రియాది సంబంధముచే ఉపమేయము ఉపమానముగా ఊహించబడితే అది ఉత్ప్రేక్ష అలంకారమవుతుంది. ఉత్ప్రేక్ష వాచ్యము,గమ్యము అని రెండు విధాలు. మానము,ద్రువము, ప్రాయము, అనన్, శకించు, కాబోలు, ఊహించు, భావించు, అనుమానించు మొదలైన వితర్క పదాలుంటే  వాచ్ ఉత్ప్రేక్ష, అలాంటి పదాలు లేకుంటే  గమ్యోత్ప్రేక్ష.
                       తే. అఖిల లావణ్య పుంజంబు నజ్జభవుడు
                            మెలతగా దీనియందు నిర్మించె నొక్కొ
                            కానినాడిట్టి కాంతి యే కాంతలందు
                            నేల లే?దని సామర్ష హృదయలయిరి (భా.2-2-160)
      ఇందులో సాటి స్త్రీలు అసూయపడేటంత సౌందర్య కాంతి లావణ్యవతి ద్రౌపది. బ్రహ్మదేవుడు సమస్త సౌందర్యకాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీకాంతగా నిర్మించినట్లున్నాడు. అందుకే ఇంతటి కాంతి ఏకాంతలో కానరాదు అని సౌందర్య కాంతి వలె ద్రౌపది అందాన్ని ఊహిస్తూ ఉత్ప్రేక్షలో తెలియజేశాడు.
          తే. ముల బదాఱ బదాఱు నౌ; నలస్వరూప
              గతనిమిత్తంబులకు వాచ్య, గమ్యగతులు.
              గానఁ బదియాఱు నగు వాచ్యగస్వరూప
              మరయ గమ్యస్వరూప మషాఖ్య మయ్యె. (కావ్యాలంకార సంగ్రహము)
        వాచ్య, గమ్య భేదములు జాతి, గుణ క్రియా భేదములచే నాలుగు రకాలు. ఈ నాలుగు భావము,అభావములని మరో రెండు భేదాలు . ఈ ఎనిమిది భేదాలు హేతు, ఫల, వస్తుభేదములచే మొత్తం ఇరవై నాలుగు భేదములు.

రూపకం:
        మ. కురు వ్వృద్దుల్ గురువృద్దబాంధవులనేకుల్ సూచుచుండన్ మదో
              ద్ధరుడై ద్రౌపదినిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
              కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తౌఘ ని
              ర్ఘర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్ (భా.2-2-233)     
భీముడు భయంకర ముఖంతో దుశ్శాసనుణ్ణి అందరూ చూస్తుండగానే భయంకరమైన రీతిలో చంపి,విశాల వక్షస్థలమనే పర్వతంలోని రక్త ప్రవాహమనే సెలయేటిని త్రాగుతాను అని అంటాడు. ఇందులో విశాల వక్షస్థలమనే పర్వతం, రక్త ప్రవాహమనే సెలయేరు అనే పదాలల్లో భేదాన్ని చూపెట్టలేదు ఇక్కడ రెండు పదాలు వేరైనప్పటికి అభేదము తెల్పుతూ ఒకే పదంగా సూచించబడింది.ఒక వస్తువుయందు వేరొక వస్తువు యొక్క ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది రూపకాలంకారం అవుతుంది. ఈ రూపకాలంకారం సావయవము, నిరవయవము,పరంపరితము అని మూడు విధాలని భట్టుమూర్తి అంటే,వాక్యగత రూపకం,సమాసగత రూపకం అని విద్వాన్ తెన్నేటి రెండు భేదాలు చెప్పాడు. 

వృత్యనుప్రాస :
                       క. ఇంద్ర ప్రస్థ పురంబున
                            కింద్ర గురు ప్రతిభుడరిగి యింద్ర సమానుం
                            చంద్రయశు ననుజ సహితు నృ
                            పేంద్రుని ధర్మసుతు గాంచె నెంతయు బ్రీతిన్. (భా.2-2-155)
ఈ పద్యంలో విదురుడు  ధర్మరాజును దర్శించిన విధానాన్ని వృత్త్యను ప్రాసలంకారములో ‘ద్ర’  అనే అక్షరం పలుమార్లు ఆవృత్తం అవుతూ చెవులకు ఇంపుగా అనిపించే శబ్దాలంకారాన్ని ప్రయోగిస్తూ చెప్పాడు. అనుప్రాసల పట్ల అనురక్తి అనేక మంది కవులల్లోను ఎక్కువగా కనిపిస్తుంది.వాగ్గేయకారులు కూడా తమ తమ గేయ రచనల్లో అనుప్రాసలను వాడారు. ఈ విధంగా ఎన్నో రకాల అలంకారాలను నన్నయ తన ఆది,సభా,అరణ్య పర్వంలో వాడి తరువాత వచ్చిన కవులకు ఆదర్శంగా మారారు.

ముగింపు:

భారతంలో లేనిది జీవితంలో లేదు. జీవితంలో జరిగే ప్రతి సంఘటన భారతంలో ఉంటుంది. అనే నానుడి తెలిసిన విషయమే. నన్నయ్య తన భారతంలో ఎన్నో రకాల వృత్తాలను, జాతులను, ఉపజాతులను, రగడలను, ఉద్దురమాలలను వాడారు. వాటితో పాటు అనేక రకాల ఉపమలను, ఉత్ప్రేక్షలను, అతిశయోక్తులను, సమాసోక్తులను, సందేహాలను, బ్రాంతిమంతాలనే వివిధ రకాల అలంకారాలను ఉపయోగించారు. సమాహార రూపంగా నిలిచిన ఈ భారతం ఎందరికో ఆదర్శప్రాయంగా మారింది. ఇలాంటి కావ్య సంపదను మన భారతీయులే కాకుండా ఇతర దేశస్థులు అనుభవిస్తున్నారు. అలాంటి కావ్య సౌందర్యానికి మూలం భాష. ఈ భాషా పదాలు భావన సృష్టికి ఆధారం. ఆ భావన మరింత పటిష్టంగా ఉండి ఆసక్తి కలిగించేలా ఉండాలంటే, మంచి అలంకారాలు ఉండవలసిందే. శబ్దార్థాలు సౌందర్యంగా ఉండాలన్నా అలంకారాల ప్రాముఖ్యత ఎంతో అవసరం. భాష పట్ల స్వతంత్రత ప్రతి మనిషికి ఉంటుంది అందుకే ఆ స్వతంత్రత తోనే ప్రస్తుతం కావ్యాలలోని అలంకారాలు చాలావరకు పరిమితమయ్యాయి అలంకారాలను వాడే నియమాలు కచ్చితంగా ఇలా వాడాలని ఎవరు చెప్పలేదు ప్రాచీన భారతీయ అలంకారికులు భరతుడు, భామహుడు, ఉద్బటుడు, రుద్రటుడు, మమ్మటుడు, విశ్వనాథుడు, అప్పయ దీక్షితులు  తెలియజేసిన అలంకార ప్రయోజనాలను విస్మరించి సరళ భావజాలంతో పరిమితమైన అలంకారాలను వాడి పూర్తి చేస్తున్నారు. ప్రాచీన భారతీయ అలంకారికులు చెప్పిన అలంకార నియమాలు, శైలి, ప్రయోజనాలు   భవిష్యత్ తరాల వారికి  అందించే బాధ్యత ఎంతైనా ఉన్నది. కాబట్టి వాటిని విస్మరించకుండా అలంకార ప్రయోజనాలను అందించే ప్రయత్నం చేస్తే మంచిది.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. సుబ్రహ్మణ్యం, జి.వి. (సం), కవిత్రయభారతం, ఆది, సభా పర్వాలు, తిరుపతి తిరుమల దేవస్థానం, తిరుపతి: 2014 
  2. జయరామ రెడ్డి. డి. ఆంధ్రమహాభారతంలో వరాలు, శాపాలు, www.freegurukul.org/g/Bharatham-14
  3. కీ.శే. లక్ష్మణ శాస్త్రి కప్పగంతుల  ఆది, సభా పర్వము, www.freegurukul.org/g/Bharatham-19
  4. వెంకట మురళీ కృష్ణ, పోచిన. భట్టు మూర్తి ప్రణీత కావ్యాలంకార సంగ్రహం. రోహిణి పబ్లికేషన్స్, 2002. 
  5. విద్వాన్, తెన్నేటి. కావ్యాలంకార సర్వస్వం, నీల్ కమల్ పబ్లికేషన్స్. 2013,

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]