AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797
2. లక్ష్మీపతి కథలు: వినూత్నలక్షణాలు
ఆచార్య కరిమిండ్ల లావణ్య
అధ్యక్షులు, తెలుగు అధ్యయనశాఖ,
ప్రిన్సిపాల్, తెలంగాణ విశ్వవిద్యాలయం (సౌత్ క్యాంపస్)
నిజామాబాద్–503 322, తెలంగాణ.
సెల్: +91 98484 10244. Email: lavanyakarimindla@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
ఆధునిక తెలుగు కథకు కరీంనగర్ జన్మభూమి. 1970ల్లో కరీంనగర్ కథకులు వెలువరించిన ‘‘శ్వేతరాత్రులు’’ అనే కథా సంకలనం ఆధునిక తెలుగు కథా వాఙ్మయంలో కొత్త మార్గాలు చూపించింది. ఇట్లా 1970ల ఆరంభంలో అంకురించిన కథలు నేటి కాలానికి పెరిగి చిగురించి వృక్షాలయ్యాయి. అటువంటి ఆనాటి కథాంకుర ప్రజ్ఞామూర్తుల్లో ఆడెపు లక్ష్మీపతి ఒకరు. లక్ష్మీపతికథల్లోని వినూత్నలక్షణాలు గురించి చర్చించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం.
Keywords: ప్రజ్ఞామూర్తులు, ఆణిముత్యాలు, ఆర్థికపరిస్థితులు, మూర్తసమస్యలు, ఆత్మహత్యలు, ప్రశ్నార్ధకం, ప్రేమ, వాత్సల్యం, ఆలోచనా ధోరణి, వ్యతిరేకభావాలు.
ఉపోద్ఘాతం:
మూస
పద్ధతిలో
కొనసాగుతున్న తెలుగు కథానికా రంగంలోకి ఆశాకిరణంలా వచ్చిన కథకుడు ఆడెపు లక్ష్మీపతి. ఆయన కథలన్నీ
సహజంగా
ఉంటాయి. వాస్తవచిత్రీకరణతో కథలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. సొంత అనుభవంతో సామాజికపరిస్థితుల్ని
ప్రతిబింబించగలిగినవాడు ఆడెపు లక్ష్మీపతి. ఆయన రాసిన కథలు తక్కువే అయినా అన్నీ ఆణిముత్యాలే. ఏ కథకు
ఆ
కథనే మంచి కథగా చెప్పుకోవచ్చు. మూర్తమైన సమస్యల్ని సాంకేతిక విన్యాసంతో చెప్పడం లక్ష్మీపతి
ప్రత్యేకత.
మూర్తమైన సమస్యలంటే నిర్దిష్టంగా కనిపించే సమస్యలు. ఉదాహరణకు చేనేత కార్మికుల సమస్యలు. ఆ సమస్యల
కారణంగా
అర్థికస్థితులు సరిగా లేక బొంబాయి వంటి ప్రదేశాలకు వలసలు వెళ్లడం తీరా అక్కడికి వెళ్ళిన తరువాత
చాలీచాలని జీతాలతో పని చేయాల్సిరావడం సమాజంలో సహజంగా చూస్తాం. ఖాయిలా పడ్డ పరిశ్రమల్లో నెలనెలా
జీతాలు
సరిగా అందక ఆ పరిశ్రమల్లో పనిచేసే వారి ఆర్థికస్థితి సరిగా లేకపోవడం. తద్వారా నిత్యావసర వస్తువులు
కొనలేక, పిల్లలకు ఫీజులు చెల్లించలేక బాధపడడం మన ప్రాంతాల్లో సహజంగా చూస్తున్నాం. ఇవన్నీ మూర్త
సమస్యలే
కదా! ఈ మూర్త సమస్యల్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆడెపు లక్ష్మీపతి.
ఈ మూర్తమైన సమస్యల్ని
లక్ష్మీపతి కథలైన విధ్వంసదృశ్యం, జీవన్మృతుడు, త్రిభుజపు నాలుగో కోణం వంటి కథల్లో చూస్తాం.
‘‘త్రిభుజపు నాలుగో కోణం’’ కథలో త్రిభుజానికి మూడు కోణాలే ఉంటాయి. కాని, ఈ
నాలుగో కోణం ఎక్కడిది? అనే ప్రశ్నకు జవాబు - అది కనిపించని కోణం అదే ఆర్థిక స్థితి. ఈ ఆర్థిక స్థితి
సరిగా లేక ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంత ప్రజలు బొంబాయి, భీవండి, సోలాపూర్ తదితర
ప్రాంతాలకు వలసలు ఎలా వెళ్తున్నారో చెప్పే కథ ‘త్రిభుజపు నాలుగో కోణం. ఆర్థిక శక్తులు, కొట్టే
దెబ్బతో సమాజంలోని ప్రజల్లో కుటుంబబంధాలు, ఆత్మీయానురాగాలు లేకుండా పోతున్నాయి. మమతానురాగాల్ని
మొద్డుబరిచే పేదరికం ఈ కథల్లో చూస్తాం. కుటుంబ పెద్దలు ఆత్మహత్యలు చేసుకోవడంతో చుక్కాని కోల్పోయిన
బతుకు
నావలు చాలా కనిపిస్తున్నాయి సమాజంలో. డబ్బు సంపాదించడానికి దూర ప్రాంతాలకు వెళ్లడం చూస్తాం. తద్వారా
కమ్యూనికేషన్ గ్యాప్ ఆ కుటుంబంలో, వారుండే సమాజంలో, వారి వర్గంలో వస్తుంది. ఇలా
మారుతున్న
ప్రాధాన్యత నాలుగు చట్రాల్లో బిగించబడి త్రిభుజపు నాలుగో కోణం కథ సాగుతుంది. ఈ కథలోని చిన్న మాట
ద్వారా
పరిశీలిద్దాం.
ఈ కథలో పాండు బొంబాయికి బతుకుదెరువు కోసం వెళుతున్న సందర్భంలో పాండు తనలాంటి స్థితిలో ఉన్న వారి గురించి ఆలోచిస్తాడు. ‘‘కళావిహీనమైన ముఖాలతో బరువెక్కిన గుండెలతో ఆశ్రునయనాలతో వీడ్కోలు చెబుతూ బొంబాయి, భీవండి, సోలాపూర్, నాందేడ్ పట్టణాలకు బతుకుదెరువు కోసం వలసపోతున్న తమ తమ వాళ్ళని సాగనంపుతున్నారు. ఓ ఇరవైయేళ్ళ అమ్మాయి తన వాళ్లకేసి చేయి ఊపుతూ వెక్కివెక్కి ఏడుస్తుంది. చంకలో పిల్లవాడు ఏడుస్తున్నాడు.’’ అంటే వలస వెళ్ళే ప్రజలు ఇష్టంతో వెళ్ళడం లేదు. కేవలం బతుకుదెరువు కోసం వెళుతున్నారు. తమవారందరినీ వదిలి దూరంగా ప్రదేశాలు తెలియని ప్రాంతాలకు వలస పోతున్నారు. బతుకు ప్రశ్నార్థకంగా మారి వెళుతున్నారు. ఎప్పుడొస్తారో తెలియకుండా పోతున్నారు. నేటి సమాజంలో జరుగుతున్న దృశ్యాలివన్నీ. ఈ కథా ధోరణి పోస్టు మాడ్రనిజానికి దగ్గరగా ఉంది. అందరికీ కనిపించే ప్రపంచంలో కాకుండా మనో ప్రపంచంలో కథను నిర్మించడం లక్ష్మీపతి ప్రత్యేకత. ఈయన కథల్లోని మానవ సంబంధాలు పరిశీలిస్తే అర్థమవుతుంది.
మానవ సంబంధాలు:
మానవ సంబంధాలను రకరకాలుగా చిత్రీకరించాడు ఆడెపు లక్ష్మీపతి. మధ్య తరగతి
వారి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే ఉంటుంది. వారిస్థితిగతులకు అనుగుణంగా జీవనాన్ని గడిపే విధానం ఎలా
ఉంటుందనేది లక్ష్మీపతి కొన్ని కథల్లో చూస్తాం. ఉన్నత తరగతి కుటుంబాల్లోని యువతీ యువకుల మనస్తత్వాలు,
పేదవారి ప్రేమలు, వాత్సల్యాలు లక్ష్మీపతి కథల్లో వినూత్న ప్రయోగాలు. ప్రతీ కథ సందేశాత్మకంగా
ఉంటుంది.
ఉన్నతతరగతి కుటుంబాలు:
‘‘నిశ్చలన చిత్రం’’ కథలో ఫ్రీలానర్స్‌గా
తిరిగే రవివర్మ అనే ఫొటోగ్రాఫర్ తీసిన సెమిన్యూడ్ ఫొటోలు మెచ్చి
‘‘నర్తకి’’ పత్రిక అతనికి ఉద్యోగమిన్తుంది. లాభార్జన, వ్యాపార ధోరణితో
నర్తకి
పత్రిక బూతు పత్రికగా మారి కొత్త న్యూడ్ ఫొటోల కోసం రవివర్మ మీద వత్తిడి తెస్తుంది. విలాస
జీవితానికి అలవాటు వడిన రవివర్మ, అతని కొడుకు ఇంజనీరింగ్ చదువు ఖర్చుకోసం ఆ పనికి సిద్ధమై
మోడల్ కోసం వెతుకుతాడు. పనిపూర్తయిన తరువాత ఆ మోడల్ డ్రగ్ ఎడిక్ట్ అని
తెలుసుకుంటాడు. ఆమె ఉన్నత తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుసుకొని బాధపడుతాడు. విచ్చలవిడిగా
డబ్బు ఖర్చు చేస్తూ డ్రగ్ ఎడిక్ట్ ఎలా అయిందో తెలుసుకోవడంతో ఫొటోగ్రాఫర్
ఆశాసౌధాలన్నీ
కూలిపోతాయి.
ఉన్నత తరగతి కుటుంబాల్లో తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు కోల్పోయిన యువతీ యువకులు
డ్రగ్ ఎడిక్ట్‌లుగా ఎలా మారుతున్నారో ఈ కథ ద్వారా తెలుస్తుంది. డబ్బు, పేరు కోసం
తిరుగుతూ
తాము ఏమి కోల్పోతున్నామో యువతీ యువకులు గుర్తించేలా ఈ కథ సాగుతుంది. ఆధునిక కాలంలో యువతీ యువకుల్లో
వచ్చిన జీవనశైలి మార్పు ఈ కథలో కనిపిస్తుంది. అవసరాల కోసం చేయకూడని పనులు చేయొద్దని చెబుతుంది
‘‘నిశ్చల చిత్రం’’ కథ.
మధ్యతరగతి వారి మనస్తత్వ
విశ్లేషణ:
లక్ష్మీపతి కథల్లో సహజంగా సాగిన మరో కథ
‘‘అనులోమం’’. మధ్య తరగతి వారి మనసులను దగ్గరగా అధ్యయనం చేసి రాసిన కథ.
సూక్ష్మమైన విషయాలు కూడా గుర్తించి మనిషి మనస్తత్వాన్ని విశ్లేషించి చెప్పే కథ అనులోమం. పెద్ద
దుకాణాల్లోకి పోయినపుడు అక్కడ ధరలు ఎక్కువని తెలిసినా వాడు అడిగిన ధరకు నోరెత్తకుండా డబ్బులు
చెల్లిస్తాం. కాని, రిక్షావాళ్ల దగ్గర, చెప్పులు కుట్టేవాడి దగ్గర గీచి గీచి బేరమాడడం వెనుక వాళ్ల
మనస్తత్వాన్ని విశ్లేషించే ప్రయత్నమే ‘‘అనులోమం’’ కథ. అంటే మధ్యతరగతి
మనిషి ప్రతీ రూపాయిని దాచిదాచి ఎలా వాడుతుంటాడో తత్ఫలిత పరిణామాలు ఏమిటో చెప్పే ప్రయత్నం చేశాడు
ఆడెపు
లక్ష్మీపతి. ఈ కథ మధ్య తరగతి మనస్తత్వాలను, వాళ్ల ఆలోచనా ధోరణులను తెలియజేస్తుంది.
ఈ కథకు
వ్యతిరేకభావాలు గల మనస్తత్వం గల కథ ‘‘పుట్టినరోజు’’. రిక్షా రంగయ్య
షావుకారి
మాటలు విని తన తాహతుకు మించి తన కొడుకును పెద్ద కాన్వెంటులో ఉంచి చదివిస్తాడు. డబ్బు కోసం షావుకారి
దగ్గర అప్పు తీసుకుంటాడు. అప్పు తీర్చడానికి అదే షావుకారు దగ్గర పనికి పెడ్తాడు కొడుకును.
స్తోమత
లేని వనులు చేయడం వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో ‘‘పుట్టినరోజు’’ కథలో
చూస్తాం.
పేదవారి ప్రేమ, వాత్సల్యం:
‘‘ముసల్దాని ముల్లె’’ కథ లక్ష్మీపతి
కథలన్నింటిలో
పెద్దకథ. ఒక దృశ్య మాలికలా సాగుతుంది. ముసురు పట్టిన సాయంత్రం బస్సు కరీంనగర్ నుండి సిరిసిల్ల
వెళ్ళడానికి సిద్ధమవుతుంది. సిరిసిల్ల పోవడానికి ఒక ముసల్ది బస్సు ఎక్కుతుంది. రకరకాల ప్రయాణికులు
బస్సులో ఉన్నారు. బస్సు గమ్యం చేరేముందు ముసల్ది తన ముల్లె లేదని మొత్తుకుంటుంది. బస్సంతా వెదికితే
బస్సులో ముల్లె లేదని తేలుతుంది. అంతకుముందు ముసల్ది ప్రయాణించిన బస్సులో ముల్లె ఉండి ఉంటుందని,
మర్చిపోయిందేమోనని డ్రైవర్ భావిస్తాడు. తిరుగు ప్రయాణంలో ఉన్న బస్సు వారిని అడగగా ఆ ముల్లె
దొరుకుతుంది. ఎంతో ఆప్యాయంగా గుండెలకద్దుకొన్న ఆ మూటలో ఏముందో చూడాలని ప్రయాణికుల ఉత్కంఠ. తీరా
చూస్తే
మాగిపోయిన అరటిపండ్లు, బెల్లం కలిపిన పేలాల ముద్దలు, మురుకులు. ఇంత మాత్రం దానికి అంత హంగామా చేయాలా
అని
బస్సులో వాళ్ళు తిట్టకుంటుంటారు. ముసల్ది వాళ్ళకు ‘‘మనవలు మనవరాండ్రను
చూస్తానని
పోతున్నపుడు వాళ్ళు ఏం తెచ్చిందని అడుగుతారు. లేకుంటే వాళ్ళకు నా మొహం ఎలా
చూపిస్తాను.’’1 అని సమాధానం చెబుతుంది. ఈ విధంగా చెప్పిన
ముసల్దాని మాటల వెనుక ఉన్న ప్రేమ, వాత్సల్యాలు వాళ్లకు అర్ధం కావు.
తిరిగి
ప్రయోగించిన చైతన్య స్రవంతి టెక్నిక్:
ఆడెపు లక్ష్మీపతి కథల్లోని శిల్పం పరిశీలిస్తే ప్రధానంగా
‘‘చైతన్యస్రవంతి’’ రచనా విధానం కనిపిస్తుంది. ఈ రచనా విధానం అన్ని కథల్లో
కనిపించదు. ఆయా కథలను బట్టి చైతన్య స్రవంతి సాగుతుంది. తెలుగు సాహిత్యరంగానికి ఈ విధానం పరిచయం
చేసిన
వ్యక్తులను పరిశీలిద్దాం. శ్రీశ్రీ, బైరాగి, బుచ్చిబాబులు పరిచయం చేసినా ఆమూలాగ్రం అదే శిల్పంలో
కథనం
నడిపిన ఘనత ‘‘అంపశయ్య’’ నవల ద్వారా నవీన్ గారికే దక్కుతుంది. చాలా
తక్కువ
మంది రచయితలు మాత్రమే ఈ పద్ధతిని కథలో వాడుతున్నారు. నిర్హేతుకంగా మరో ప్రపంచంలో విహరించే భావాలకు
రూపకల్పనే చైతన్య స్రవంతిగా చెప్పవచ్చు. ‘‘క్షణికమైన ఒక అనుభవాన్ని, మొత్తం
జీవితానుభవంతో
ముడిపెట్టి ఈ రెండిరటి తారతమ్యాలు విభజన లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రదర్శించే ప్రయత్నమే
చైతన్య
స్రవంతి’’ అని కీ॥శే॥ బుచ్చిబాబు చైతన్యస్రవంతిని నిర్వచించారు.
‘‘మనిషి మనః ప్రపంచంలో చెలరేగే విభిన్నమైన, విరుద్ధమైన భావాలను కల్తీ లేకుండా,
యథాతథంగా ప్రదర్శించే ప్రయత్నమే చైతన్యస్రవంతి రచనా
విధానం’’.2
ఈ ధోరణిలోనే ఆడెపు లక్ష్మీపతి
‘‘జీవన్మృతుడు’’ కథ చెప్పబడింది. పనిమనిషి కొడుకు
నుండి
తారాస్థాయికి ఎదిగిన వ్యక్తి జీవితంలోని అన్ని కోణాలు ఈ కథలో కనిపిస్తాయి. ఈ కోణాల్లో
పరాయీకరణకు
ఎలా లోనవుతాడో ఈ చైతన్య స్రవంతి కథలో లక్ష్మీపతి అద్భుతంగా చిత్రీకరించారు. ఖాయిలాపడ్డ
పరిశ్రమలో
ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన ఇంజనీర్ ఉద్యోగానికి రిజైన్ చేసి రియాద్‌లో
కంపెనీకి
సెలక్ట్ అయిన ప్రయాణసన్నాహాలు చేసుకోవడమే కథ. పొద్దున ఐదుగంటల అలారం మోతకు లేచి కాలకృత్యాలు
తీర్చుకొని వాకింగ్‌కు వెళ్ళే చైతన్యస్రవంతి తనలో తాను మాట్లాడుకోవడం కథలో కథానాయకుడు తన
బాల్యస్మృతులు గుర్తుచేసుకుంటాడు. బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలూ, అవమానాలు, కుటుంబం ఎంత
ప్రేమగా
పెంచిందో, పెళ్ళయిన తరువాత కుటుంబానికి అంతగా దూరం కావడంతో కథానాయకుడు బాధపడతాడు. ఆపరేటర్
స్థాయినుంచి ఇంజనీర్ స్థాయికి ఎదిగిన స్వయంకృషి. కుటుంబ సభ్యుల ఆడంబర జీవనం, పరిశ్రమలో
తప్పుడు విధానాన్ని, అసమర్ధ యాజమాన్యాన్ని ఎదుర్కోలేడు. ఇటు ఇంట్లో ఎవరినీ కంట్రోల్ చేయలేడు.
అంతా
డబ్బు... డబ్బు.. డబ్బు..., అ డబ్బు సంపాదనకే చివరకు రియాద్ వెళ్ళడం, మరణశయ్యపై ఉన్న తల్లిని
చూడడానికి టైం లేకపోడం, తాను అనుకున్నవి ఏవీ చేయలేకపోవడం, తనకి ఇష్టం లేనివి తాను చేయాల్సి రావడం
‘‘జీవన్మృతుడు’’ కథా సంగ్రహం. ఇటీవల వచ్చిన చైతన్య స్రవంతి కథల్లో
వెరైటీగా,
మానసిక సంఘర్షణతో ఉందీ కథ.
ఇంజనీరింగ్ - ఫ్యాక్టరీ విషయాలు, మేనేజ్‌మెంట్
విధానాలు, భార్య కుటుంబ అజమాయిషీ, కుటుంబ సంబంధాల్లో డబ్బు పాత్ర... ఇలా అన్నీ కలుపుకొని చైతన్య
స్రవంతి కొనసాగుతుంది. అలాగే ఆడెపు లక్ష్మీపతి మిగతా కథలైన
‘‘తిర్యగ్రేఖ’’లో రేఖ, విధ్వంస దృశ్యంలో కవుల పాత్రలు ఉత్తమ పురుషలో
సాగుతాయి. లక్ష్మీపతి వాక్యనిర్మాణం ‘‘హిమజ్వల’’లో వడ్డెర
చండీదాస్
వాక్య నిర్మాణానికి దగ్గరగా ఉంది.
జీవన నిర్లిప్తత లోంచి పుట్టిన కథ
ఎద్దుపుండు:
లక్ష్మీపతి రాసిన కథల్లో ‘‘ఎద్దుపుండు’’ కథ చిన్నదే అయినా పూర్తి మాండలిక యాసతో సాగుతుంది. ఒకరైతు జీవన విధానంలో మార్పు కోసం ప్రయత్నించే కథ. కాని, రైతు తన బతుకుకు వ్యతిరేకంగా ఉన్న నాగరికులైన ప్రజల మనస్తత్వాలు జీర్ణించుకోలేకపోతాడు. సీజనల్ వృత్తిగా మామిడిపండ్ల వ్యాపారం చేద్దామని రైతు మామిడి పండ్ల లోడును ఎడ్లబండిలో తీసుకొచ్చి బస్తీ మార్కెట్‌లో దించుతాడు. చెట్టుమీదనే పండిన రసాలు. ధర అక్కడి మార్కెట్ ధరకు ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ జీవనానికి అలవాటు పడిన నాగరికులు అ మామిడి పండ్లను కొనరు. రైతు హతశుడౌతాడు. రైతుకు దూర ప్రయాణం వల్ల అలసట, నిప్పులు చెరిగే ఎండ, పుండుతో బాధవడే ఎద్దు, పొద్దున నుండీ ఏమీ తినక కదుపులో ఆకలితో రైతు చిరాకుగా ఉంటాడు. కృత్రిమ పద్ధతుల ద్వారా పక్వానికి వచ్చిన మామిడి పండ్లను తన పక్కనే సాయబు అమ్ముతుంటే జనమంతా కొంటుంటారు. కాని, రైతు అమ్మే సహజమైన పండ్లను ఎవరూ కొనరు. ఒకవేళ కొన్నా కొసరి కొసరి అడిగి గిట్టుబాటు కాని ధర అడుగుతారు.
ఆ సందర్భంలో రైతుపడే మానసిక వేదన, నాగరికుల జీవన విధానం మీద ఏర్పడిన
ఈసడిరపు, భావనను లక్ష్మీపతి కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారు. చివరికి రైతు విసిగిపోయి ఈ
నాగరికులకు
మామిడి పండ్లు అమ్మద్దు, పండ్ల విలువ తెలియని మూర్ఖులకు అమ్మే బదులు వాగు ఒడ్డున పందులకు, పశువులకు
పారబోయాలని నిశ్చయించుకుంటాడు. నాగరికుల కన్నా, నోరులేని జంతువులకే రైతు దృష్టిలో ప్రాధాన్యం
ఉంటుంది.
నాగరికులకు ఉన్న కృత్రిమ మనస్తత్వ చిత్రీకరణ ద్వారా రచయిత సమాజాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేశాడో
అర్థమవుతుంది.
తెలంగాణా జీవనపరిణామం:
1970 ప్రాంతంలో భూస్వామ్య పోరాటాలు ఎక్కువగా జరిగాయి. ఈ దశలో అల్లం రాజయ్య వంటి ప్రముఖ కథకులు ఈ పోరాటాల మీద దృష్టితో కథలు రాశారు. అవి రైతాంగ పోరాట కథలుగా ప్రసిద్ధమయ్యాయి. ఈ కథల ప్రభావం ఆడెపు లక్ష్మీపతి మీద ఉంది. ఉదాహరణగా బొగ్గుగని కార్మికుల సమస్యలు, ఖాయిలా పడ్డ పరిశ్రమల్లో పనిచేసే వారి దుస్థితి, వలసలు వెళ్ళే వారి జీవనం, స్త్రీల హక్కుల గురించి పోరాడే విధానాల వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఇలా అల్లం రాజయ్య వంటి కథకుల ప్రభావం ఆడెపు లక్ష్మీపతి మీద ఉంది. ఫలితంగా అనేక కథలు వీరి కలం నుండి వెలువడ్డాయి. 1980 దాడుల, ప్రతిదాడుల హింసాత్మక దశలో వెలువడిన కథలు పోరాట దృక్పథంతో వచ్చాయి. అవి ఆక్రోశం, బంద్ తదితర కథలు. అస్తవ్యస్తమైన తెలంగాణా జనజీవితాన్ని ప్రతిబింబించే కథలు. వీటిలో రాజ్యహింసను చక్కగా చిత్రీకరించారు.
‘‘ఆక్రోశం’’ కథలో సత్తయ్య ఊర్లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా’ సంఘం కట్టి పోరాడుతాడు. ఒకరోజు పోలీసులు వచ్చి ఎస్.ఐ రమ్మన్నాడని సత్తయ్యను తీసుకెళ్తారు. తండ్రి వెంకటి విడిపించుకోవడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తాడు. మరుసటి రోజే వదిలేశాం అని మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేస్తారు. పది రోజుల తర్వాత సత్తయ్య శవం కాకతీయ కాలువలో తేలుతుంది. ఎదిగిన ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న వెంకటి ఆత్మఘోషనే ఈ కథ. కల్లోలిత తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు మామూలైపోయాయి. ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయకులను వేధించడం, మనుషులను హత్యచేసి మిస్సింగ్ కేసులు చూపించడం వెనుక ఏం జరుగుతుందో ఈ కథ ద్వారా తెలుస్తుంది.
ఏదో ఒక కారణం వల్ల బంద్‌కు పిలువు పిలుపునివ్వడం రాజకీయ
పార్టీలకు,
దాదాలకు, నక్సలైట్లకు మామూలైపోయింది. ఈ బంద్‌ల వల్ల నష్టపోయేది రోజు కూలీలే. చిన్న
వ్యాపారస్థులే. ‘‘బంద్’’ కథ ద్వారా నక్సలైట్ వారు పోలీసులను
చంపారన్న కారణంగా పోలీసులే బంద్ చేయించడం ఈ కథ ద్వారా తెలుస్తుంది. బంద్ వల్ల చిన్న
వ్యాపారులు ఎలా నష్టపోతారో అనే అంశం చిత్రీకరించాడు రచయిత. దీనివల్ల చిన్న వ్యాపారస్థుల రోజు వారీ
నష్టం
పాఠకులకు తెలుస్తుంది. తత్ఫలితంగా వారి జీవన విధాన మార్పులు తెలుస్తాయి.
లక్ష్మీపతి రాసిన
‘‘రాబందులు’’ కథను పరిశీలించినపుడు మోతుబరి రైతు
‘‘దళితుడు’’ అనేది కారణంగా చూపించి ‘జగ్గని ఏవిధంగా బాధపెడ్తాడో
తెలుస్తుంది. ఈ కథలో కరువు కోరల్లో చిక్కిన జగ్గనికి చెప్పులు కుట్టడానికి తోలు కావాల్సి వస్తుంది.
రైతురామయ్య దగ్గర గింజలు అడగడానికి వెళ్ళి, అవసాన దశలో ఉండి, వైద్యం చేస్తున్న ఎద్దును చూస్తాడు.
ఎద్దు
ఎలాగూ చనిపోతుందని తెలిసి, ఎద్దు తోలు కావాలని జగ్గడు అడుగుతాడు. రైతు నా ప్రాణపథమైన ఎద్దు కావాలా
అని
జగ్గడిని తిట్టిపంపిస్తాడు. చివరికి ఎద్దు చనిపోతుంది. చనిపోయిన ఎద్దును మైదానంలో పారేస్తాడు రైతు.
అది
తెలిసి జగ్గడు ఎద్దు దగ్గరకు పోయి తోలు వలుస్తుంటాడు. అది తెలిసి రామయ్య వాడిని చితకబాదుతాడు. వాడు
అపస్మారక స్థితికి వెళ్తాడు. కుటుంబమంతా ఆకలి చావులతో ఉంటుంది. చనిపోయిన ఎద్దును రాబందులు తిన్నా
ఫరవాలేదు కాని, దాని తోలును తీసుకునే జగ్గణ్ణి ఆసామి సహించడు. దళితుడి వృత్తిపరమైన కార్యాన్ని
అడ్డుకొని, అకలి చావులకు గురి చేసిన వైనం హృదయ విదారకంగా ‘‘రాబందులు’’ కథలో
చిత్రీకరించారు. సహజంగా. సమాజంలో మార్పులను ఆశిస్తూ రాసిన కథలు ఆడెపు లక్ష్మీపతి కథలు. ఒక్కో కథ
చదువుతుంటే ఒక్కోరకమైన సమాజపు సమస్యలు తెలుస్తాయి.
1990ల్లో యంత్రీకరణ గ్లోబలైజేషన్ వల్ల తెలంగాణ గ్రామాల మౌలిక స్వరూపమే మారిన దశ. ఈ దశలో ఖాయిలాపడ్డ పరిశ్రమల్లో పనిచేసే వారి జీవన సరళి లక్ష్మీపతి కథల్లో కనిపిస్తుంది. ‘‘జీవన్మృతుడు’’ కథలో ఇంజనీర్‌గా పనిచేసి రియాద్ వెళ్ళాలని అనుకుంటాడు కథానాయకుడు. కారణం ఇక్కడి సామాజిక జీవన సరళిలో వచ్చిన మార్పులు. కరీంనగర్, అదిలాబాద్ ప్రాంతాల్లో ఇలా వలసలు వెళ్ళిన కుటుంబాలు చాలా కనిపిస్తాయి. రచయిత స్థానిక ప్రజల పరిశీలన అధ్యయనంతో కథలు రాశాడు. ఉత్తమ పురుషలో సాగిన ‘‘జీవన్మృతుడు’’ కథలోని కథానాయకుని అంతర్మథనం పరిశీలిద్దాం.
‘‘సౌదీ అరేబియాలో అన్నీ తట్టుకోవాలట. అక్కడ చలి... వేడి... ఎక్కువ. అక్కడ అమలులో ఉన్నవి ఇస్లామిక్ సూత్రాలట. బుర్ఖాలేకుండా స్త్రీ అవతలికిరాదు. వినోద కాలక్షేపానికీ, మనోరంజనానికి అవకాశాలు లేవు. లేకపోతే మానె బ్రహ్మచర్యం, గార్హస్థ్యం... ఇప్పుడు ఏ వానప్రస్థ ఆశ్రమానికో... ఎల్లుండి బొంబాయి నుండి ఫోను కొట్టాలి డెహ్రాయిన్‌లో రిసీవ్ చేసుకొమ్మని, బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత అక్కడ హిందువుల పట్ల వివక్ష పెరిగిందట. జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదన లక్ష్యంగా వెళుతున్నపుడు మతాల గురించి చర్చలెందుకు మూఢుడా... ఇంటిమీద బెంగ మూడు రెట్లు పీడిస్తుందట. ఇక్కడే బ్రతుకుపై విపరీతమైన బెంగ బాధిస్తోంది. అక్కడ ప్రశాంతత లభిస్తుంది’’.3
ఈ వాక్యాలను పరిశీలించినపుడు రియాద్ వెళ్లే మనిషికి ఆత్మరక్షణ లేదు. అక్కడికి వెళ్ళి జీవనం సాగించడం కష్టమయిన పరిస్థితే కాని, వెళ్ళకుండా ఉండలేడు. విధి విధానాలను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు కధానాయకుడు; ఆర్థిక సంక్షోభంతో వ్యక్తి ఆత్మఘోషను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు ఆడెపు లక్ష్మీపతి. అందుకే విలక్షణ కథా శిల్పిగా వీరిని చెప్పవచ్చు.
2000–09 సంవత్సరాల మధ్య కాలాన్ని రాజకీయ అస్తిత్వ ఉద్యమకాలంగా
చెప్పవచ్చు. ప్రధానంగా తెలంగాణా ప్రాంతంలో ఈ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న దశ ఇది. ఈ కాల ప్రభావం
కూడా
కథల్లో కనిపిస్తుంది. ఆయా కాలాల్లో జరుగుతున్న ఉద్యమాలు, సమస్యలు, రచయిత దృష్టిలో ప్రధానంగా
ఉన్నాయి.
అవి రకరకాలైన కథలుగా చూస్తాం. అలాగే సమాజంలో స్త్రీ జీవన విధాన సరళిని ఆవిష్కరించిన కథలూ
ఉన్నాయి.
స్త్రీవాద కథలు:
లక్ష్మీపతి రాసిన కథల్లో ‘‘వ్యభిచారం’’,
మలుపు,
‘స్టాండర్డ్’, తిర్యగ్రేఖ స్త్రీవాద కథలుగా చెప్పవచ్చు.
“వ్యభిచారం” కథలో పెళ్ళిచూపుల పేరిట జరిగే మానసిక వ్యభిచారాన్ని
వ్యతిరేకించే కల్పన, స్త్రీ తన కిష్టమైన జీవితాన్ని తానే ఎంచుకొని హాయిగా ఉండవచ్చని నిరూపించిన
సావిత్రి
కనిపిస్తారు. సమాజంలోని స్త్రీ ధైర్యసాహసాలతో బతకాలని, తన నిర్ణయాలు ఇతరుల మీద రుద్దకుండా తానే
తీసుకోవాలని రచయిత కోరుకుంటాడు. సావిత్రి పాత్ర ద్వారా కొద్దిమంది స్త్రీలలోనైనా మార్పు వస్తుందని
ఆశిస్తాడు రచయిత. అలాగే ‘‘మలుపు’’ కథలో వితంతువు అయిన
సునీత
రెండవసారి పెళ్ళి చేసుకున్నా, తన స్వంత కూతురి కోసం వైవాహిక జీవితాన్ని వదులుకోవడానికి
సిద్ధపడుతుంది.
తన కూతురి మీద ప్రేమలేని రెండో భర్తలో మార్పు తెచ్చి, తన భార్య కూతురు కూడా తన కూతురుగా ఒప్పుకునేలా
చేస్తుంది సునీత. సునీత పాత్ర ద్వారా సమాజంలో రెండో పెళ్ళి చేసుకునే భర్తల్లో మార్పులను ఆశిస్తాడు
రచయిత. పెళ్ళి విషయంలో ఆడపిల్లలకు స్వాతంత్య్రం లేదు. వాళ్ళు ఎవర్ని పెండ్లి చేసుకోవాలో, వద్దో
పెద్దలే
నిర్ణయిస్తారు. కథా నాయిక సునీత విషయంలో అదే జరిగింది. కుటుంబ వ్యవస్థలో స్త్రీల పట్ల పురుషాధిక్యత
ఎన్ని రూపాల్లో ఉంటుందో నిరూపించే ప్రయత్నం చేసిన కథ ‘‘మలుపు’’. స్త్రీ
వైవాహిక
సుఖంకన్నా తల్లీబిడ్డల అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందని ఈ కథ తెలియజేస్తుంది.
‘‘తిర్యగ్రేఖ’’ కథలో కాలేజీలో చదువుకుంటున్న
‘‘రేఖ’’ ఒక దుండగునిచే అత్యాచారానికి గురవుతుంది. వంశగౌరవం, పరువు
ప్రతిష్టలు
అనుకునే తల్లిదండ్రులు, వాడికే నచ్చజెప్పి పెండ్లి చేయాలని అనుకుంటారు. పెండ్లి చేద్దామనే మామయ్య
వాడికి
దేహశుద్ది చేయాలనే అన్నదమ్ములు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలనే రేఖ, ఉద్యమించు, నీ వెనుక నారీ
జగత్తుంటుందని ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ కథలో కనిపిస్తారు. చివరికి
‘‘రేఖ’’ ఉద్యమిస్తుంది. జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని, ఆ నేరస్థులను
శిక్షించాలని నిర్ణయించుకోవడమే ఈ కథలో కొత్త మలుపు. ఈ కథంతా
‘‘చైతన్యస్రవంతి’’
విధానంలో ఉత్తమ పురుషలో కొనసాగుతుంది. చైతన్య స్రవంతి విధానంలో పురుష కథానాయకులుంటారు. కాని,
వారందరికీ
భిన్నంగా రచయిత ఒక స్త్రీ పాత్ర అంతరంగ చిత్రణకు పూనుకోవడం సాహసం. ఒక స్త్రీ అంతరంగాన్ని ఇంత
అద్భుతంగా
చిత్రీకరించడం గొప్ప విషయం.
తన చుట్టూ తిరిగే అన్యాయాల పట్ల స్పందించే భార్య, ఎవరికి ఏమైతే మనకేమి అనుకునే భర్త ‘‘స్టాండర్డ్’’ కథలో చూస్తాం. గృహిణి కేవలం ఇంటికే పరిమితం అనే దృక్పథానికి వ్యతిరేకంగా కథ సాగుతుంది. భర్త భార్య సేవలను ఇంటికే పరిమితం చేయాలని అనుకోవడం, ఆమె అందుకు అంగీకరించక తనే అన్ని విషయాల్లో ముందుండడం ‘‘స్టాండర్డ్’’ కథలో చూస్తాం. ఈ కథలో కథానాయిక తన చుట్టూ ఉన్న వారిని కూడా చైతన్యపరుస్తుంది. భార్య చర్యలకు భర్త కళ్ళు తెరుచుకునేలా అవుతుంది. ఇలా స్త్రీ వాద కథలు కూడా లక్ష్మీపతి కథల్లో చూడొచ్చు.
లక్ష్మీపతి కథలు - స్థానికభాష:
లక్ష్మీపతి కథలో స్థానికభాష కొన్నింటికే పరిమితమైంది. జీవన్మృతుడు, త్రిభుజపు నాలుగో కోణం తదితర కథల్లో భాష సరళంగా ప్రామాణిక భాష రూపంలో ఉంటుంది. కాని, ముసల్దాని ముల్లె, ఎద్దుపుండు, విధ్వంసదృశ్యం, బంద్ తదితర కథల్లో తెలంగాణా మాండలికం కనిపిస్తుంది. కాని, మాండలిక భాషలో రాయాలని ఆడెపు లక్ష్మీపతి అంతరంగం కాదు. మాండలిక భాషలో రాయడం వల్ల రచయిత సృజాత్మకత వికసించదు అనేది రచయిత అభిప్రాయం. తన అభిప్రాయాన్ని ‘‘ముసల్దాని ముల్లె’’ కథలోని రచయిత సాయికుమార్ అంతరంగం ద్వారా రచయిత పరోక్షంగా చెప్పిస్తాడు.
‘‘ఎప్పుడూ మాండలికంలో రాయడం, ఒకే తరహా రచనలు చేయడం వల్ల రచయిత సృజనాత్మకత వికసించదు’’4 అని మాటలను బట్టి ప్రస్తుత సాహితీ లోకంలో ప్రబలంగా ఉన్న ధోరణికి మడి కట్టుకొని కూర్చోలేను అనే మాటలు ఈ రచయితకే వర్తిస్తాయి. కథలోని సంభాషణలు పాత్రోచిత మాండలికంలో సహజంగా ఉండడం వల్ల ఆసక్తిగా ఉండడం ఒక విశేషం కాగా కథలోని పాత్రలు మాండలిక ప్రయోజనాన్ని గురించి చర్చించడం మరో విశేషం. అయినా త్రిభుజపు నాలుగో కోణం. ముసల్దాని ముల్లె, తిర్యగ్రేఖ, నాలుగు దృశ్యాలు, బంద్, రాబందులు, ఆక్రోశం తదితర కథల్లో ఆయా పాత్రలను బట్టి స్థానిక భాష రచయిత వాడినాడు. అన్యభాషా పదాలు లక్ష్మీపతి కథల్లో ఉన్నాయి. అన్యభాషా పదాలను జీర్ణించుకోవడం, ఆదాన ప్రదానాలను మన తెలుగు భాషలో ఉపయోగించడం సర్వ సాధారణం. కాబట్టి కథలు అర్థం కావనేది లేదు.
ముగింపు:
ఇతర తెలంగాణా రచయితలకు లక్ష్మీపతి కథలకున్న తారతమ్యాలను పరిశీలించినపుడు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కథలు పెద్ద కథలు. ఆడెపు లక్ష్మీపతి కథలు చిన్నవి. ఐతా చంద్రయ్య కథల్లో మెదక్ జిల్లా వాతావరణం ఉంటుంది. లక్ష్మీపతి కథల్లో కరీంనగర్, ఆదిలాబాద్ వాతావరణం కన్పిస్తుంది. అల్లం రాజయ్య కథల్లో రైతాంగపోరాటం, బొగ్గు గనుల్లో పని చేసేవారి జీవితాలు కన్పిస్తాయి. ఆడెపు లక్ష్మీపతి కథల్లో వలసల దృష్టి, స్త్రీవాదం, దళితవాదం, అన్నింటికీ మించి మానవతా వాదం కన్పిస్తుంది. తాడిగిరి పోతరాజు కథల్లో సమూహంలోని వ్యక్తి ఉంటాడు. ఆడెపు లక్ష్మీపతి కథల్లో వ్యక్తిలో సమూహం ఉంటుంది.
పాదసూచికలు:
- కథావలోకనం, పుట – 34
- అదే., పుట. 15
- నాలుగు దృశ్యాలు, పుట. 92
- అదే., పుట. 54
ఉపయుక్తగ్రంథసూచి:
- కథావార్షిక, హైదరాబాద్: 2008
- రామచంద్రారెడ్డి, రాచపాళెం, కథాంశం – తెలుగు కథానిక సాహిత్య విమర్శ, అనంతపురం: 2006 ఏప్రిల్.
- దక్షిణామూర్తి, పోరంకి కథానిక స్వరూప స్వభావాలు. సికింద్రాబాదు: 1988
- కథావలోకనం – ఆడెపు లక్ష్మీపతి కథలు, హైదరాబాదు: 1997.
- కాత్యాయనీ విద్మహే, జండర్ స్పృహ, ఆధునిక తెలుగుసాహిత్యంలో ప్రతిఫలాలు, వరంగల్: 2005 మార్చి.
- మల్లయ్య, కాలువ. (సం) తెలంగాణ కథ. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్: 2005 జూలై.
- ప్రభాకర్, ఎ.కె., తెలుగులో మాండలిక కథాసాహిత్యం సాహితీ సర్కిల్, హైదరాబాద్: 2002.
- లక్ష్మీపతి, ఆడెలు, నాలుగు దృశ్యాలు. కథా సంపుటి, హైదరాబాదు: 1997
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.