headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-04 | April 2023 | ISSN: 2583-4797

1. వృషాధిపశతకానుశీలనము

Cinque Terre
ఆచార్య డా. ధూళిపాళ రామకృష్ణ

సంస్కృత విభాగాధ్యక్షులు
మారిస్‌ స్టెల్లా కళాశాల
విజయవాడ - 520008, ఆంధ్రప్రదేశ్‌
సెల్: +91 9963668214. Email: dr.rkdhoolipala@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ప్రాఙ్నన్నయయుగం, నన్నయయుగాలలో పురుడుపోసుకుని, బాలారిష్టాలను తరించిన తెలుగు వాఙ్మయం, శివకవియుగంలో వికాసదశ మార్గంలో ప్రయాణించింది. పండితత్రయం మొదలు ఎందరో విశిష్టకవి పుంగవులు తమ రచనాప్రౌఢిమతో ఈ యుగసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఆ వరుసలో వీరశైవమతాయాయిగా వివిధ కవితా, సాహిత్యప్రక్రియల్లో ప్రయోగాత్మక ఆవిష్కరణలు చేసిన పాల్కురికి సోమనాథుడు అగ్రశ్రేణిని అలంకరిస్తాడు. సోమనాథుడి జీవితవిశేషాలను స్పృశించి, వృషాధిపశతకంలో ఈ కవివృషభుడు పోషించిన భాషాసాహిత్యరహస్యకళానిధిత్వాన్ని, గురు-శివభక్తిపారమ్యాలను, కవితా- వైశిష్ట్యాన్ని, సోపపత్తికంగా చర్చించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. పాల్కురికి జీవనరేఖలు స్పృశించి, అతడి శివభక్తిని, భాషావైదగ్ధ్యాల వైభవాలను పేర్కొంటూ, బసవని పరమశివాతారంగా భావించి వ్రాసిన వృషాధిపశతకౌన్నత్యాన్ని వివిధ కోణాలలో ఆవిష్కరించడం ఈ వ్యాసముఖ్యప్రణాళిక.

Keywords: పాల్కురికి, సోమనాథుడు, వృషాధిపశతకము, బసవడు, వీరశైవము, అలంకారములు, రామకృష్ణ

ఉపోద్ఘాతం:

అనయము పాలకురికి సో
మనాథు డన బరగువాడ మానవసంస
ర్గనివర్తకుడను గురుభ
క్తినిరూపితమానసుండ గృతకృత్యుండన్‌  (అనుభవసారము)

అని తన మొట్టమొదటి రచనలోనే తాను కృతకృత్యుడనని చాటుకొన్నాడు సోమనాథుడు. అతడు గురుభక్తిలోనేకాక ఉరుతరభాషాసేవాలోనూ నిజంగా కృతకృత్యుడే! ఈ కవిని శతకప్రక్రియకు ఆద్యుడని లోకం కీర్తిస్తుంది.

పాల్కురికి జీవనరేఖలు:

కాకతీయసామ్రాజ్యాన్ని గణపతిదేవచక్రవర్తి, ఓరుగల్లు రాజధానిగా, పాలిస్తూవుండే రోజుల్లో, రాజధానికి పండ్రెండుక్రోసుల దూరంలో ఉన్న పాల్కురికి గ్రామంలో, రమారమి క్రీ.శ.1240 ప్రాంతాలలో సోమనాథుడు జన్మించాడు. ఇతని తండ్రిపేరు విష్ణురామి దేవుడు; తల్లిపేరు శ్రియా దేవమ్మ. వీళ్ళది సంప్రదాయ యుక్తమైన బ్రాహ్మణ కుటుంబం. అందుకే సోమనాథుడు వేదవేదాంగాలు అధ్యయనం చేశాడు. అతనికి వేదం చెప్పుకొన్నాక, యుక్త వయస్సు వచ్చే రోజుల్లో కరస్థలం విశ్వనాథయ్య అనే గురువు కవిత్వంలో అభిరుచి కలిగించాడు. కవితా రహస్యాలు చెప్పి కావ్యశక్తి కలిగింపజేశాడు.

వీరశైవం - సోమనాథుడు:

అతనికి మల్లికార్జునపండితుని రచనలేకాక మతంకూడ బాగా నచ్చింది. ఆ వీరశైవమతాన్ని అతడు స్వీకరించాడు. వీరశైవంలో భక్తులకు జాతిభేదాలు లేవు. స్త్రీపురుష విభేదాలూ లేవు. అంతా సమానులే. కులగోత్రాల ప్రమేయం లేదు. కలిమి లేముల పట్టింపులేదు. చదువు సంధ్యల అవసరం లేదు. శివభక్తుడైతే చాలు, అతడు ఆరాధించదగిన వాడు; అర్చించదగినవాడు; కీర్తించదగినవాడు, శివభక్తుడు వాస్తవానికి శివునికన్నా గొప్పవాడు. సంఘంలో ఉన్న తారతమ్యాలను నిర్మూలించి సమానత్వాన్ని ప్రతిపాదించే మతం ఉడుకునెత్తురు ఉబికే వయస్సులో ఉన్న సోమనాథుణ్ణి ఆకర్షించడంలో వింతలేదు. స్వేచ్ఛను కోరేవాడే నిజమైన కవి. సాంఘిక నియంతృత్వం నుంచి బయటపడటానికి సోమనాథుడు, ఈనాడు యువకవులు అభ్యుదయ రచయిత లైనట్లు, ఆనాటి అభ్యుదయవాదమైన వీరశైవాన్ని చేపట్టాడు. పండితయ్య రచనలను ప్రచారం చేశాడు.

పండితారాధ్యుని సమకాలికులలో బెలిదేవి వేమనారాధ్యుడనే పరమ ఆరాధ్య దేవుడు ఉండేవాడు. ఇతని వంశంలో గురులింగార్యుడనే మతగురువు ఉన్నాడు. అతని దగ్గర పాల్కురికి సోమనాథుడు శివదీక్ష పుచ్చుకొన్నాడు. దీక్ష నిచ్చే గురువు శివస్వరూపుడు. దీక్షాకాలంలో గురుహస్తం శిష్యుని మస్తకాన్ని సోకుతుంది. వెంటనే శిష్యుడు రెండవజన్మ ఎత్తినట్టు లెక్క. ఈజన్మలో గురుహస్తం నుంచి శిష్యుడు ఉద్భవిస్తాడు. అందుచేత అప్పటి నుంచి అతడు గురుహస్తసంజాతుడు. లౌకికమైన తల్లిదండ్రులతో పనిలేదు. గురుహస్తమే తల్లి; గురు హస్తమే తండ్రి. గురు పాదమే శిరోధార్యం. గురువు గోత్రమే తన గోత్రం.

గురులింగార్యునివద్ద దీక్షపుచ్చుకున్న సోమనాథునికి ఆగురువు వద్దనే దీక్షపుచ్చుకున్న గోడగి త్రిపురారి అనే భక్తుని పరిచయం కలిగింది. ఇద్దరూ పండితయ్యగారి శివతత్త్వ సారాన్ని పఠించారు. ఇద్దరూ ఆ మహిమకు ముగ్ధులైనారు. ఇద్దరూ ఆమతాన్ని ప్రచారం చేయదలచుకొన్నవారే. సోమనాథుడు కవిత్వం చెప్పగలవాడు కాబట్టి త్రిపురారి తన స్నేహితుని ‘‘శుద్ధభక్తి మార్గాన్ని’’ కవిత్వంలో విస్తరించమన్నాడు. సోమనాథుడు ‘అనుభవసారం’ అనే కృతిని గోడగి త్రిపురారికి అంకితమిస్తూ చెప్పాడు.

ఈ అనుభవసారం రచన పూర్తి అయినాక ఇతడు వీరశైవమతాన్ని కన్నడ దేశంలో ప్రబోధించిన బసవన్న గురించి విన్నాడు. అతని ప్రభావంలో పడ్డాడు. తలమునకలుగా ఆ భక్తిలో ఓలలాడాడు. ఇక్కణ్ణుంచి సోమనాథుని కవితాజీవితంలో ఇంకొక ఘట్టం మెదలైంది.

కన్నడ దేశంలో క్రీ.శ 1162 ప్రాంతాలలో కళ్యాణపురాన్ని బిజ్జలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని దగ్గర బలదేవుడు అనే మంత్రి ఉండేవాడు. ఇతనికి బసవన్న అనే మేనల్లుడన్నాడు. ఇతడు శైవుడు. నందీశ్వరుని అవతారమని జనులు చెప్పుకొంటారు. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే  భక్తుడయినాడు. తల్లిదండ్రులు ఉపనయనం చేయబోతే వద్దనీ, తనకు కులము అక్కరలేదనీ, కులభేదాలను రూపుమాపడానికే తాను పుట్టాననీ చెప్పాడట, ఈ బసవన్న మేనమామద్వారా రాజోద్యోగం సంపాదించాడు. భాండారానికి అధిపతి అయినాడు. శివభక్తులంతా ఒక్కటే కులమని, వాళ్ళు శివునికన్నా గొప్పవారని, భక్తికన్నా వేరే ముక్తిమార్గం లేదని తన మతాన్ని  ప్రచారం చేశాడు. మత ప్రచారానికి ఉన్నతోద్యోగం పనికి వస్తుందని, మేనమామ తరువాత మంత్రిపదవిని చేపట్టి అధికారాన్ని మతం కోసం వినియోగించుకొన్నాడు. బొక్కసంలోని డబ్బు జంగాలకు వెదజల్లాడు. ఖడ్గాన్ని పట్టుకొని తన భావాలను బోధించాడు. ఇతడు అనేక మహిమలు చేశాడని జనం చెప్పుకొన్నారు. వంగకాయలకు లింగకాయలను చేశాడట. జొన్నలను ముత్యాలు చేశాడట. ఇతని వీరభక్తి మహిమలు జనసామాన్యంలో వ్యాపించి మతంకూడ వర్ధిల్లింది.

మహిమలు గల బసవన్నకు -
బసవనిధానమా! బసవభవ్యనిధీ! బసవామృతాంబుధీ!
బసవ మహానిధీ! బసవ భర్మగిరీ! బసవామరద్రుమా!
బసవ మహాబలీ! బసవబండరువా! బసవోల్లసన్మణీ!
వసిగని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 103)    అనికీర్తిస్తూ
సోమనాథుడు మనోవాక్కాయకర్మలతో భక్తుడైనాడు. బసవని ధ్యానం తప్ప మరొకటి లేదు. వ్రాసేవన్నీ బసవనికోసమే; బసవని మీదనే. శరణు బసవగద్యం, బసవాష్టకం, బసవోదాహరణం, బసవాబసవా! అనే వృషాధిపశతకం - సర్వం అతనికి బసవమయమే. బసవన్న చరిత్రను ప్రజలకు చెప్పడం అతని కవిత్వానికి ప్రయోజనం అనుకున్నాడు. అది అచివరికాలంలోనే నెరవేరింది.

‘‘బసవా బసవా బసవా వృషాధిపా’’ అను ఒకే మకుటముతో 108 చంపకోత్పలములతో రచింపబడినది వృషాధిపశతకం. మకుటనియమము, సంఖ్యానియమము కలిగిన శతకములలో ఇదియే మొట్టమొదటిది. దీనిని సోమనాథుడు బసవపురాణ రచనానంతరమున రచించినట్లు క్రింది పద్యమును బట్టి తెలియుచున్నది.

బసవఁడు ప్రీతిమైఁ గొనియె భక్తిమెయి వివరించినాఁడు మున్‌
బసవపురాణమంచు నను బ్రస్తుతి సేయదు రట్లుగాన నీ
యసమదయాధురీణతకు నంకిలి పాటు ఘటిల్లకుండ న
న్వసి గొని బ్రోవుమయ్య బసవా, బసవా, బసవా, వృషాధిపా’ (వృ.శ . 106)

సోమనాథునికి బసవేశ్వరుడే శివుడు. అతని హృదయాంతరాళమునుండి త్రిరావృతమై వెడలిన బసవ సంబోధనము అతని భక్తిపారవశ్యమును తెల్పును.

వృషాధిపశతకమున శివపరమగు స్తోత్రములు, బసవేశ్వరుని చరిత్రము, ఒక్కొక్క పద్యమున ఇరవై మూడు మంది భక్తుల చరిత్ర సంగ్రహముగా కలదు. విశిష్టాద్వైతులు జీవేశ్వరులకు కల్పించిన శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధురావస్థలను, నాయికానాయికభావమును సోమనాథుడు భక్తి భావమున ప్రతిపాదించి యున్నాడు.

‘నా యొడయుండ, నావిభుఁడ, నా హృదయేశ్వర, నామనోరమా,
నా యిలవేల్ప, నా వరద నా గురులింగము, నాదు జంగమా,
నా యధినాథ, నా వరుఁడ, నన్నుఁగృపామతి బ్రోవుమయ్య దే
వా యమిబృందవంద్య, బసవా, బసవా, బసవా వృషాధిపా’ (వృ.శ. 104)

భాషయందును, భావమునందును, భక్తిరసోదయమందును వృషాధిప శతకము తరువాతి పెక్కు తెనుగు కావ్యములకు మార్గదర్శకమయినది. ఇందు సోమనాథుడు యమకానుప్రాసాది శబ్దాలంకార వైచిత్రిని, బహుభాషా ప్రావీణ్యమును ప్రదర్శించినాడు.

ముక్తపదగ్రస్తమునకుదాహరణము :

శబ్దాలంకారములలో సుప్రసిద్ధమైన ముక్తపదగ్రస్తాలంకారం పాల్కురికి రచనల్లో తొణికిసలాడుతూ ఉంటుంది. విడిచిన పదమునే తిరిగి గ్రహించి పద్యమును నడిపించుట ఈ అలంకారము ప్రత్యేకత. ఆ శబ్దచమత్కారము సోమనాథరచనలో ఏ విధముగా ప్రతిభాసమన్వితమైనదో చూడగలరు:

సురవరపూజ్య, పూజ్యగుణశోభిత, శోభితరూప, రూపవి
స్ఫురతరశీల, శీలగుణపుంగవసత్త్వ, సత్త్వసం
వర, వరవాద, వాదభయవర్జిత పాపవిచార, చారయీ
శ్వరసమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా’ (వృ.శ. 108)

అంత్య ప్రాసగల పద్యమిది :

ఇక అంత్యప్రాసలకు ఇతడి కవిత్వంలో కొదవేలేదు. సంస్కృతశబ్దవిన్యాసంతో రమణీయమైన అలంకారశోభను కలిగి ఉన్న రచనాసామర్థ్యమునకు ఈ క్రింది పద్యమొక మచ్చుతునక.

ఉద్ధత భక్తవృద్ధవినుతోత్తమ సిద్ధపరీత జంగమ
శ్రద్ద సతాత్మ శుద్ధ గణరాజి సమృద్ధ విముక్త పాశ స
న్నద్ధ మహాప్రసిద్ధ, యగుణత్రయబద్ధ శరణ్యమయ్య భా
స్వద్ధత చిత్ప్రబద్ధ బసవా! బసవా! బసవా! వృషాధిపా’ (వృ.శ. 31)

దేశీయచ్ఛందస్సులు, అందునా ద్విపదకు పట్టంగట్టిన పాల్కురికి రచనలలో బసవపురాణము, పండితారాథ్యచరిత్రము మిక్కిలి గణనీయమైనవి. అసలయిన “జానుతెలుగు” అన నర్థమేమో వివరించెడి ద్విపదప్రవాహమునకు ప్రతీకలుగా ఈ క్రింది కుక్కుట, ప్రభాతవర్ణనములు నిలుచును ననుటలో సందేహము లేదు.

“తొలికోడి కనువిచ్చి నిలిచి మైవెంచి
జలజల రెక్కలు సడలించి నీల్గి
గ్రక్కున గాలార్చి కంఠంబువిచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడువు
నిక్కించి, మెడసాచి, నిక్కి మున్సూచి
కొక్కొరో కుర్రని కూయకమున్న”  (పండితారాథ్యచరిత్ర )

తెలుగుతోటలో మొదటి కోకిల కంఠమెత్తి, తెలుగు వాళ్ళకోసం, తెలుగు ఛందస్సులో పాటలు పాడిరది. ఆ కోకిలపేరు పాల్కురికి సోమనాథుడు. అతడు పాడిన తెలుగు ఛందస్సు పేరు ద్విపద. తెలుగుజాతి అతనికి ఇచ్చిన దివ్యాయుధం ద్విపద. తెలుగుజాతికి అతడిచ్చిన గొప్పకానుక కూడ ద్విపదే. పాల్కురికి సోమనాథుడు పుట్టకపోతే పాడుకొందుకు తెలుగువాళ్ళకే ఛందస్సూ ఇంత రాణించేది కాదేమో! ప్రజలకోసం అతడు పుట్టాడు. ప్రజలే అతణ్ణి అమరకవిని చేశారు.” (సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి, పుట. 411) అని ఆరుద్ర సోమనాథుణ్ణి ప్రదర్శించాడు.

వైదికమార్గానువర్తి సోమనాథుడు:

సోమనాథుని రచనలయందు శ్రుతి, స్మృతి, పురాణేతిహాసముల ఆధారముగ శివపారమ్యమును దర్శించు లక్షణము స్పష్టమగుచున్నది. 

"వారక వేదపురాణ
ప్రారంభార్థముల నెల్ల ద్రచ్చగ 'హంస
క్షీర మివాంభసి' యనుగతి
సారమె కొని తెల్పువాడ సద్గురు కరుణన్" (అనుభవసారము. 31)

స్వతహాగా వేదవేదాంగములను, సమస్తశాస్త్రములను అభ్యసించిన సోమనాథుడు, కేవలము మతావేశపరవశుడయి వీరశైవమున ప్రవేశించి దీక్ష ధరించినాడు. కావున ఎంత తోవ మార్చుకున్ననూ, ముందు సంపాదించుకొనియున్న వ్యుత్పత్తి ఎచ్చటకు పోవును? అందుచే శివపారమ్యమును, వీరశైవతత్తమును వివరించుటకు వేదమును ప్రమాణముగా తీసుకొనినాడు. హంస పాలను, నీళ్ళను వేరుచెయ్యగలదని ప్రతీతి ఉనట్లు .. తానుకూడ వేద సారమును మాత్రము సంగ్రహముగా చెప్పెదనినాడు పాల్కురికి.

అదే విధంగా వృషాధిపశతకంలోనూ -

స్వీకృతభక్తలోక యవశీకృత కర్కశవావధూక యూ
రీకృతసద్వివేక యురరీకృతజంగమభ క్తిశూక దూ
రీకృతదుష్టపాక యధరీకృతవేదవిరుద్ధబౌద్ధచా
ర్వాక, శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 24)

అనుచూ తన వేదమార్గరతిని ప్రదర్శించినకవి, నమకముగా ప్రసిద్ధమైన శతరుద్రీయము ననుసరించుచూ..

ఖ్యాతయశ: ప్రపూరితజగత్రితయాయ నమోనమో మహా
పాతకసూతకఘ్న పదపద్మయుగాయ నమోనమో సము
ద్ద్యోతవృషాయతే” యనుచు నుత్సుకతన్‌ బ్రణుతింతు సంయమి
వ్రాత శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 28)

“ఆప్తగణప్రవిష్టసకలార్తిహరాయ నమో నమో సుఖా
వాప్తికరస్మితాంచితకటాక్షదయాయ నమోనమో సము
ద్దీప్తగుణాయతే” యనుచు దీనగతిన్‌ బ్రణుతింతు నిన్ను ని
ర్వ్యాప్తజగత్ప్రపంచ బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 51)

“కల్పితలింగజంగమసుఖస్ఫురణాయ నమో నమో యసం
కల్పవికల్పమార్గకథితప్రథితాయ నమో నమో గుణా
కల్పవరాయతే” యనుచు గౌరవలీల నుతింతు నిన్ను న
స్వల్పతరప్రభావ  బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 52)

తర్జితదుష్కృతాయ భవతాపనికృంతనకల్మషాయ భ
క్త్యూర్జితమానసాయ సుగుణో త్తమరత్న కరండకాయ తే
యార్జితసత్క్రిమాయ సదయాయ నమో” యని సన్నుతించు నా
వర్జితభ క్తలోక బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 53)

“చూర్ణిత మన్మధాయ పరిశోభితభస్మవిలేపనాయ సం
పూర్ణమనోరథాయ గతపూర్వభవాశ్రితవర్తనాయ తే
వర్ణనిరాసకాయ సశివాయ నమో” యని సంతతంబు ని
న్వర్ణన సేయువాఁడ బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 54)

అని స్తుతించినాడు. “వరవీరభక్తి స వైదికముగను / విరచించితి చతుర్వేదసారమున” (పండి.చ. దీక్షాప్రకరణము పుట. 11) అని పండితారాథ్యచరిత్ర లోనూ, అలాగే “వైదికు లిది శుద్ధవైదికంబని యెన్న… ...చతుర్వేద సారమన్ పద్యములురచింతు బసవలింగ!!” అని చతుర్వేదసారములోనూ తన వైదికమతానుయాయిత్వాన్ని పాల్కురికి చాటుకొన్నాడు.

పాల్కురికి - మణిప్రవాళశైలి:

భాషారూపుడైన పరమేశ్వరుని సంస్కృత, కన్నడ, ద్రావిడ, మరాఠీ, తెలుగు భాషలలో, మణిప్రవాళంలో విడివిడిగా కీర్తించడమేకాక అనేక భాషలను ఒకే పద్యంలో కూర్చియూ స్తుతించాడు.

హృన్నలినే స్మరామి భవదీయపదద్వితయం భవాటన
స్విన్న తనుశ్రమాపహ మశేషజగత్ప్రణుతం మదీశ ని
ష్పన్న దయానిధే యనుచు సంస్కృతభాష నుతింతు నిన్ను వి
ద్వన్ను తనామధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 55)

పరమవె యన్నె యాండవనె పన్నగతావె యనాథనాధనే
పెరియవనే పుళిందవనె పేరుడయానె పిరానె యప్పనే
తరిమురియయ్యనే యనుచు ద్రావిడ భాష నుతింతు మన్మనో
వర కరుణావిధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 56)

హసుళెయరెన్న రక్షి సువు దారయలెన్న వనీతనెందుమ
న్ని సువుదు నిమ్మడిరగెరగ నిమ్మప్రసాదియె నిమ్మదాత్మవే
కసిగతి యంచు భక్తి నినుఁ గన్నడభాష నుతింతు షడ్గుణ
శ్వసన పురాతనాత్మ బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 57)

దేవవరా తుమ్హీచ గురుదేవ మ్హణూనుతరీ తుమ్హీచ గో
సావతురా తుమ్హీచ తుమసాచ ప్రసాద అమీకృపాకరా
యీవగదా యటంచు నుతియించెద నిన్నును నారెభాష దే
వా వినుతార్యలీల బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 58)

అనయముఁ జేతులందు భవదంఘ్రిసరోజయుగం నమామి నె
మ్మనమున సంస్మరామి యనుమాటల ని వరివస్క రోమ్యహ
మ్మనుచు మణిప్రవాళమున నంకన సేయుదు భక్తలోక హృ
ద్వనజవిహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 59)

అరుళ గిరి ప్రసాద ముడయానె భవద్గుణవర్ణసల్పి నా
కొరువనినే స్మరామి సురయేశ్వరు రేగణవర్యయంచు ని
ట్లరుదుమణి ప్రవాళమున నంకనసేయుదు నిన్ను మన్మనో 
వరకరుణావిధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 60)

పాయదె ఒందు చేటిగతి  వొందు పాప అమాపరమన్నమామి భో (?)
న్యాయవిధేయమీశతరి యన్యనజాణు కృతార్థయంచు వా
గ్దేయమణిప్రవాళమునఁ దెల్లము నిన్ను నలంకరింతు దే
వా యమిబృందవంద్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 61)

బలుపొడతోలు చీఱెయును పాపపెనల్‌ గిలుపారుకన్ను వె
న్నె లతలఁజేఁదుకుత్తుకయు నిండిన వేలుపుటేఱు పల్గుపూ
సలు గల ఱేనిలెంక వని జానుఁదెనుంగున విన్నవించెద 
వలపు మదిన్‌ దలిర్ప బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 62)

(?)తిరువడినెమ్మనంబునను నేహృదయేశ్వర కింపరీయతా
బరికరితంబురాణి నినుబాహిరిబోలుటశాసితాహతా
వరదనెగిన్లెయంచునిను బ్రస్తుతిసేయుదుఁ బెక్కుభాషలన్‌
వరద వివేకశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 63)

(?) హాడువెదామహారపదినంఘ్రియుగ భ్రమగొండుసద్గుణా
మాడువదిర్చనంబిడె సమగ్రనుతి త్వయిసత్క్రియ  దగ 
గూడ మణిప్రవాళమునం దోరి నుతింతును సంచితార్థముల్‌
పాడిగ నివ్వటిల్ల బసవా! బసవా! బసవా! వృషాధిపా! (వృ.శ. 64)
అని బసవను కొనియాడుచూ తాను భాషాసమపక్షపాతినని నిరూపించుకొనినాడు.

ముగింపు:

ద్వంద్వప్రాస, త్రిప్రాసకందములు, సర్వతఃప్రాససీసము, ద్విపద వలెనే 'త్రిపద, చౌపద, షట్పదలు', యింకా అన్నింటినీ మించి అమితంగా ఆకట్టుకొనెడి చిత్రకవిత్వము, 'చతుర్విధ కందము' మొదలు ఎన్నో విశిష్టరచనాప్రయోగాలకు సోమనాథుడు చక్కటి చిరునామా. “అల్పాక్షరముల ననల్పార్థరచన” గావించుట యందు, అట్టి విశేషశైలిని ప్రచలితము చేయటయందు పాల్కురికి సఫలీకృతుడైనాడూ. సామెతలు కూడ సోమనాథుడు పిలిస్తే పలుకును. "మమ మాతా వంధ్యా" అని సంస్కృతంలో "రెండింటికి చెడ్డ రేవడి" "చేతి వాడిని విడిచి కాలవాడి కాసపడినట్లు” “ఒడలెల్లం చెవులై" అని తెలుగున కూడా సామెతలను ఔచితీమంతంగా ఉపయోగించన దిట్ట, మహాకవి ఇతడు. శివభక్తాగ్రేసరుడైన సోమనాథుని శతకరచన శతాబ్దాలుగ ఆదర్శమై ఒక విశేషప్రక్రియయై వేళ్ళూనుకున్నది. ఇట్లు తెలుగు శతకములలో ఆదిశతకమనదగిన తన వృషాధిపశతకములో సంస్కృతమును వేరుగా గణించక, తెలుగుగా, తెలుగు స్థానమున ప్రతిష్ఠించిన సోమనాథుడు సంస్కృతానురాగులందరికీ ఆరాధ్యుడైనాడు.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి, తెలుగు అకాడమీ, హైదరాబాదు: 2012
  2. తమ్మయ, బండారు. (వ్యాఖ్యా.) వృషాధిపశతకము. నిర్మలశైవసాహితీగ్రంథమాల, కాకినాడ: 1969.
  3. నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష. ప్రథమసంపుటము, నవ్యపరిశోధక ప్రచురణలు. హైదరాబాద్: 2019
  4. మాధవకుమార్, టి. (వ్యాఖ్య). శతరుద్రీయము. చిన్మయారణ్యం పబ్లికేషన్స్ ట్రస్ట్. భీమవరం: 2018.
  5. సీతారామాచార్యులు, బహుజనపల్లి. శతకరత్నాకరము. దేశభాషాగ్రంథకరణసభ. చెన్నపట్టణము: 1922.
  6. సోమనాథుడు, పాల్కురికి, అనుభవసారము.
  7. సోమనాథుడు, పాల్కురికి, బసవపురాణము. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. హైదరాబాదు: 1969
  8. సోమనాథుడు, పాల్కురికి, వృషాధిపశతకము. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి దేవస్థానము. శ్రీశైలము: 1992.
  9. సోమనాథుడు, పాల్కురికి.  పండితారాథ్యచరిత్ర. ఆంధ్రగ్రంథమాల, చెన్నపురి: 1939.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]